రాళ్ళు – మనుషులు

ఎంతకీ అతను రావడం లేదు.

వస్తాడనుకుని ఎదురుచూస్తోంది.

నాలుగింటికల్లా వచ్చి బైటికి తీసుకెడతానన్నాడు. మాటిమాటికి గదిలోంచి బైటికి చూస్తోంది మేరి.

ముందుగదిలో అత్తగారు , తోటికోడళ్ళ గొంతులు వినిపిస్తున్నాయి. ఆడపడుచులిద్దరూ పొద్దున్నే దిగారు. అందరూ కలిసి వరలక్ష్మీ వ్రతం చేసుకున్నారు. సాయంత్రానికల్లా పేటలో అందర్నీ పేరంటానికి పిలిచారు. మేరీకి  పగలంతా వంటగది దగ్గర  సరిపోయింది. సాయంత్రం నుంచీ గదిలో కూచుండిపోయింది. బైటికి రమ్మని ఎవరూ పిలవడం లేదు. బైటికొచ్చి  ఏంచేయాలో కూడా తనకు తెలీదు. చాపల మీద కూచున్న ముత్తయిదువలందరికీ   కుంకుమ  పెట్టాలి. పెట్టచ్చు కానీ,  బొట్టు లేని తన ముఖం  వింతగా చూస్తారు. పసుపు అందించాలి. అభ్యంతరం  లేదు. కానీ సూత్రం లేని తన మెడవంక వింతగా చూస్తారు.

“నువ్వు దూరంగా కూచుంటే కాదు, మా వాళ్ళతో కలిసిపోవాలి-”  అంటాడు కిరణ్. కలిసిపోవాలనే చూస్తోంది. కానీ అందరూ తనని దూరంగానే చూస్తున్నారు. అంట్లు తోమచ్చు కానీ స్టవ్వు ముట్టుకోకూడదుట. గదులు తుడవచ్చు. కానీ తోరణాలు కట్టకూడదుట.. పూలు మాల కట్టచ్చు కానీ దేవుడి గదిలోకి రాకూడదుట.. ఆ పనులు కూడా వెంటపడి వెంటపడి అందిపుచ్చుకుంటే కానీ చెయ్యనివ్వలేదు..

తొమ్మిది పిండి వంటలట….ఆడవాళ్ళంతా వొళ్ళు హూనా హూనం చేసుకున్నారు. మగవాళ్ళు పేకలు వాల్చి కూచున్నారు. పిల్లలు ఇల్లు పీకి పందిరి వేస్తున్నారు. మేరీకి కూచోవడానికి ఇబ్బందిగా అనిపించి, నుంచోవడానికి అడ్డంగా అనిపించి, గదిలోకి పోయి తలుపులేసుకుంటే అది మరీ ఎబ్బెట్టుగా అనిపించి సతమవుతుంటే , పెద్ద ఆడపడుచు కొన్ని పనులు కరుణించింది. మేరీ ఆ మాత్రం దానికే పొంగిపోయింది. పిల్లలందరికీ స్నానాలు చేయించి జడలు వేసింది. మీరంతా నావాళ్ళు అనుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేసింది. పిల్లల కోడిలా తిరుగుతున్న మేరీ ని చూసి కిరణ్ పొద్దున్న “గుడ్..గుడ్” అని కళ్ళెగరేశాడు.

మేరీ ఎదో చెప్పాలనుకునేలోగా జారుకున్నాడు.

అత్తయ్య, మామయ్య, వదిన, అక్క, బావ..- ఒక్కతే కూతురు అయిన మేరీ కి ఈ పిలుపులంటే చాలా ఇష్టం. కానీ తేలిగ్గానే   గమనించింది. తనని బంధుత్వంతో ఎవరూ పిలవడం లేదు. పేరుతో కూడా పిలవడం లేదు.

“ఇదిగో ఇటు చూడు …” అంటున్నారు.

ఎంత పట్టించుకోకుండా వుందామనుకున్నా అది ముల్లులా గుచ్చుకుంటూనే వుంది.

పోనీ ప్రయత్నించి తనే పూసుకుని రాసుకుని అలా పిలుద్దామన్నా నోరు పెగలడం లేదు. ఏమి ఎదుర్కోవాలో అని భయం.

“భయమెందుకు….అంటే  ఒకమాట అంటారు. నువ్వే కలిసిపోవాలి ఇదే మంచి చాన్సు” అంటాడు కిరణ్ – అదేదో బంపర్ డ్రా లాట్రీ టిక్కెట్టులా…పోనీ ధైర్యం  చెప్పడానికి అయినా  పక్కన వుండచ్చు కదా..వుండడు. చిన్నప్పటి ఫ్రెండ్సుని  కలవాలంటూ   రోడ్లు పట్టుకుని తిరుగుతున్నాడు.

కొడుకు కోడల్ని అంటిపెట్టుకుని వుండకుండా బైటికెళ్ళిపోవడం అందరికీ కాస్త వింతగా, లోకువగా వున్నటుంది.

“సాయంత్రం  తొందరగా వచ్చెయ్యి, ఆ పేరంటాలూ అవీ…ఏమిటో.. ఇక్కడ నేను ఇమడలేను. ఒక్క గంట బైటికి వెడదాం. ” ప్రార్ధిస్తున్నట్టుగా అడిగింది.

సరే సరే అంటూ తలూపి వెళ్ళిపోయాడు. ఏడవుతోంది. ఇంకా రాలేదు.

మేరీ జైల్లో వున్నట్టుగా రోజులు లెక్కపెట్టుకుంటోంది. ఇంకొక్క మూడు రోజులు. పదో సారి లెక్క పెట్టి౦ది.

ముందు గదిలో గట్టిగా నవ్వులు వినిపించాయి. బాగా అయిన వాళ్ళెవరో వచ్చినట్టున్నారు.

“మీ  కొత్త కోడలు గది వదిలి రాదా ఏం…” చనువుగా అడిగారు ఎవరో..

“ఆవిడకివన్నీ తెలీదు , క్రిస్టియన్ కదా..” ఆడపడుచు…

“ఏమోనండీ.. మేం ఎవరి ఇష్టాన్నీ కాదనలేం…వాడికి నచ్చింది చేసుకున్నాడు.” అత్తగారు ఎంతో ఆదర్శంగా అందామనుకుంది . తొక్కి పెట్టిన అశాంతి లాంటిది కనిపించింది.

“అవున్లెండీ… వాళ్ళకు నచ్చితే మనం ఏం చేస్తాం…పెళ్ళి ఎక్కడ చేశారు..గుళ్ళోనా.. చర్చిలోనా…” ఇంకొక ఆవిడ కాబోలు అడిగింది..

“ఎమో వొదినా, గుమ్మంలోకి వచ్చేదాకా ఆ పిల్ల మా వాడ్ని చేసుకుందని మాకే   తెలీదు.”

“సరే పోన్లెండి..ఇంకా ముగ్గురు కోడళ్ళు వున్నారు కదా…మీ వంశం నిలబెట్టడానికి …”

“అదే నా ఓదార్పు..”

మేరీకి ముళ్ళమీద కూచున్నట్టుగా వుంది. కిరణ్ రావడం లేదు.

అమ్మ మాటలు గుర్తొచ్చాయి. “వద్దమ్మా నీకు తెలీదు..మతం కలవదు..కులం కలవదు…ఇబ్బంది పడతావు. నాన్నగారి స్నేహితుడి కొడుకు జాన్ వున్నాడు..నిన్ను ఇష్టపడుతున్నాడు. తెలిసిన కుటుంబం.  నా మాట విను.”

“కిరణ్ ఎంత మంచివాడో నీకేం తెలుసమ్మా..నా కోసం వాళ్ల  అందర్నీ ఎదిరిస్తున్నాడు.”

అమ్మ మాట్లాడలేదు. నాన్న మాట్లాడలేదు. వాళ్ళిద్దరూ ప్రేమించే చేసుకున్నారు. అమ్మ చర్చికి వెడుతుంది. నాన్న నాస్తిక సమాజానికి వెడతాడు. కాబట్టి కాదనడానికి బలమైన కారణం కనిపించలేదు. ఔననడానికి కావలసినంత ధైర్యమూ  చిక్కలేదు.

వాళ్ళ ఆలోచనల్లో వాళ్ళు వుండగానే మేరీ బట్టలు సర్దుకుని కిరణ్ తెచ్చిన కారెక్కింది.

పోనీ చర్చిలో అయినా పెళ్ళి చేసుకు వెళ్ళండి.. అంటున్న అమ్మ మాటలు గాల్లో  కలిసిపోయి వినిపించాయి.

“మా వాళ్ళని కాదని వచ్చేస్తున్నాం కదా.. పోనీ వాళ్ళకు నచ్చినట్టు చర్చిలో పెళ్ళి చెసుకుంటే ఏం పోతుంది..కిరణ్…” దారిలో అడిగింది.

“గుళ్ళొ చేసుకుంటే ఏం పోతుంది..ఇది నువ్వు వొప్పుకుంటావా..” అడిగాడు.

అవును అదీ నిజమే అనుకుంది.

మధ్యే మార్గం గా ఇద్దరూ రిజిస్టరు మ్యారేజీ చేసుకున్నారు.

పోనీ రెండు పద్దతుల్లో నూ చేసుకోవచ్చు కదా.. భలె సరదాగా వుంటుంది. తన ఫ్రెండు సహాసిని  జోక్ చేసింది.

ఎందుకో గానీ కిరణ్ సీరియస్ గా మొహం పెట్టాడు. తనకి అర్ధం కాలేదు.

ఎంత తొందరగా ఇద్దరం ఒకటయిపోవాలా అనుకున్నట్టు కనిపించాడు.

అదంతా ప్రేమోద్వేగం కాదట, సెలవుల్లేక ట..|  .నవ్వూ అశ్చర్యం కలిగాయి.

కొత్త కాపురం మొదలుపెట్టిన నాలుగు నెల్ల లోపు అయిదుసార్లు  తన వూరు వెళ్ళొచ్చాడు.

తను కూడా అమ్మానాన్నా – అంటూ ప్రయాణం కట్టింది.

“ఇష్.. గొడవచెయ్యకు. ఇది సిటీ ఇద్దరం బైటికి వెడితే ఇల్లు దోచేస్తారు.. ” అని ఆపేశాడు.

” సరెలే .. వెడతావు వస్తావు.. మీ వాళ్ళేం అనుకుంటున్నారో చెప్పవేమిటీ..” అంటే నవ్వుతూ తేల్చేస్తాడు.

.” ఏముందీ అనుకున్నదేగా..డోంట్  వర్రీ… ” ట.

అంతమందికి ఇష్టం లేని ఈ  బంధం అంటే మేరీ కి లోపల్లోపల భయంగానే వుంది.

“నాకు నువ్వు..నీకు నేను ఇంకెవరూ వద్దు..అసలు పెద్దలు కుదిర్చిన పెళ్ళిలో కూడా కొత్త దంపతుల ఏకాంతం కోసం అందరూ దూరం గా వెళ్ళిపోతారు తెలుసా..” నవ్వించాలని చూసేవాడు.

మెరీ కి తన అమ్మ అనుభవం  అడిగి వినాలనిపించేది.

కిరణ్ తో వున్నంత సేపూ మంచి పనే చేశాను అనిపించేది. ఎందుకో మళ్ళీ  తప్పు చేసినట్టు గానూ  వుండేది. సందిగ్ధాలు పూర్తయ్యేలోపు మొన్న కిరణ్ ఉత్సాహంగా ఆఫీసునుంచొచ్చి,

“మేరీ ఇదే చాన్సు. మనం కూడా వెడదాం. ఈ పండక్కి అంతా కలుస్తున్నారట. అన్నయ్య చెప్పాడు. గుంపులో గోవిందాలా గా కలిసిపోవచ్చు.మన జోలికి ఎవరూ రారు. పండగ హడావిడిలొ అంతా అన్నీ మర్చిపోతారు…”

మేరీ కి నిజమే అనిపించింది.

“ఇప్పుడేం  పండగ “అడిగింది.

” శ్రావణమాసం కదా, ఓహో నీకు తెలీదు కదూ , బావుంటుంది బావుంటుంది, చూద్దువుగాని…” అన్నాడు.

పండగ ముందురోజే ఇద్దరూ దిగారు.

భయపడినట్టు ఎవరూ వ్యతిరేకించలేదు. అలాగని తనని ఆహ్వానించనూలేదు.

కొడుకుని  వాళ్ళ అమ్మ కావలించుకుని ఏడ్చింది. నాన్న దగ్గరికి తీసుకున్నాడు. అక్కలు ఒక్కొక్కరూ వచ్చి కావలించుకున్నారు.

కిరణ్ కి కూడా కళ్ళమ్మట నీళ్ళొచ్చాయి. ఏదో ఘోరం జరిగిపోయినట్టు అందరు ఏదో ఉద్వేగానికి గురయ్యారు.

మేరీ కి ఇబ్బందిగా అనిపించింది. తన అమ్మానాన్నా గుర్తొచ్చారు.

అందరూ ఒకర్నొకరు పట్టుకుని లోపలికి వెళ్ళారు.

మేరీ సూట్కేసులతో సహా నిలబడిపోయింది. పది గంటల ప్రయాణం తాలూకు అలసట కంటే ఎవరూ పలకరించి కూచోమనక పోవడం ఎక్కువ నొప్పిగా అనిపించింది.

పది నిమిషాలయ్యేసరికి కిరణే హడావిడిగా వచ్చి, “సారీ మేరీ మర్చిపోయాను. లోపలికి రా.. అలా నుంచుండిపోయావేమిటీ.. అదిగో అది మన గది …” అంటూ భుజం చుట్టు చెయ్యి వేసి తీసుకువెళ్ళాడు.

అందరి  చూపులూ తనమీదే వున్నట్టు తెలుస్తోంది.

కిరణ్ మనది అని చూపించిన గది లో పది మంది పిల్లలు  పరుపుల మీద దొర్లుతూ కనిపించారు.

“లేవండ్రా.. ఒరే.. ఇదిగో మీ కొత్త పిన్ని…” అని పరిచయం చేశాడు..

కొత్త పిన్నా.. మరి నీ పెళ్ళికి మమ్మల్ని పిలవలేదేం ..పిడుగులా ప్రశ్నించాడు అందరిలోకి కాస్త పెద్దవాడు…

కిరణ్ నవ్వేశాడు.

మేరీ బ్యాగులోంచి బిస్కెట్లు తీసి పిల్లలకి ఇవ్వబోయింది.

“మాకేం వద్దు , ఇప్పుడే తిన్నాం ,” అంటూ ఒకరి వెంట ఒకరు పరుగు తీశారు.

తెల్లమొహం పేట్టిన మేరీని చూసి నవ్వుతూ కిరణ్ ,

” అమ్మో వాళ్ళాచచ్చర పిడుగులు, చాల్లేదేమో నువు పెట్టె కోటా.. అయినా  , నువ్వేం అనుకోకు, సాయంత్రానికల్లా నీ వెంటపడతారు చూడు ” అంటూ  ఓదార్చాడు.

అనుకున్నట్టుగానే పిల్లలు కొన్ని గంటలు గడిచేసరికి మరీ వెంటపడకపోయినా కాస్త పలుకుతున్నారు.

“ఏయ్ మేరీ ట..”  పిన్నీ అనకూడదూ.. అలా అనడం లేదు. తను నచ్చలేదొ, పెద్ద వాళ్ళు ఒద్దన్నారో తెలీదు.

“ఎందుకలా చీకట్లో కూచున్నావు…” ఎప్పుడొచ్చాడొ కిరణ్ ప్రశ్నకు మేరీ ఉలిక్కిపడింది.

“ఏం లేదు.. పదండి.. తల్నొప్పి…ఆలోచిస్తూ వుంటే నిద్ర పట్టేసింది.ఇదిగో ఇప్పుడే లేచా..” అబద్ధం  ఆడింది.

ఇల్లతా ఇంత గందరగోళం గా వుంటే నీకు నిద్ర పట్టిందా…. ఫన్నీ…” అంటు బుగ్గ మీద చిటికె వెయ్యబోయి ఆగాడు.

“ఒరే , అమ్మ నాకిది చేయించింది చూడూ…” రెండో ఆడపడుచు చెయ్యి పట్టుకుని లాక్కెళ్ళింది.

ఇద్దరూ ముందు గదిలోకి వచ్చారు.

మొత్తం అందరూ తివాచీ మీద గుండ్రం గా కూచుని వున్నారు.

అత్తగారు ఒక్కక్క కోడలుకీ బంగారు గాజుల జత తొడుగుతోంది. కూతుళ్ళకి గొలుసులు ఇచ్చింది. చప్పట్లు కొట్టండ్రా ఒరే  పెద్దలు హుషారు చేసేసరికి ,  పిల్లలు చప్పట్లు కొడుతున్నారు.

మేరీ కిరణ్ వంక ప్రశ్నార్ధకంగా చూసింది.

శ్రావణ మాసం,  అంటే అత్తింటివాళ్ళు కోడళ్ళకి కానుకలు ఇస్తారన్నమాట, కిరణ్ మెల్లిగా మెరీ కి మాత్రమే వినిపించేట్టు అన్నాడు.

ఓహో, అనుకుని  ఆసక్తిగా చూసింది మేరీ.

“ఆషాడమాసం అల్లుడికి అత్తింటి వాళ్ళు కానుకలు ఇస్తారు, ” ఆ మాట పెద్ద ఆడపడుచు మొగుడు అన్నాడు.

కిరణ్ వంక చూసింది. ఎటో చూస్తునట్టు కూచున్నాడు.

“అసలు శ్రావణ మాసం నోములెందుకంటే , భర్త ఆయురారోగ్యాలు కోరి సుమంగళులు చేస్తారన్నమాట,”  పెద్ద తోటికోడలు మామూలుగానే చెప్పివుండచ్చు.

కానీ ఏమిటో తనని ఉద్దేశించినట్టుగా అనిపించింది.

“మీ ఆవిడకేం నగలు పెట్టాలో తెలీడం లేదురా కిరణ్.. తను బొట్టు కూడా పెట్టుకోదు కదా… ” అంది అత్తగారు.

నవ్వి వూరుకుంది మేరీ.

“అయినా ఇంటికొచ్చిన వాళ్ళని పసుపూకుంకాలివ్వకుండా  వొట్టి చేతుల్తో పంపడం నాకు అలవాటు లేదు అందుకని,..” -అంటూ ఒక వాయిలు చీర మేరీ వొళ్ళొ పెట్టింది. మిగిలిన వాళ్ళ చీరలకీ దీనికీ చాలా తేడా వుంది. అది కాదు మెరీని ఆశ్చర్య పరచిన విషయం.

“ఫర్లేదులే ” అన్నాడు కిరణ్  కూడా కుచించుకుపోయి, ఆ మాటలోకి అంత నీరసం ఎందుకొచ్చిందో తెలీలేదు.

అప్రయత్నంగా మేరీ కూడా తల వొంచుకుంది.

కబుర్లకి  అంతరాయం  వుండకూడదని టి.వి. సౌండ్ తగ్గించి పెట్టినట్టున్నారు.

ఏ చానల్లొ చూసినా చీరలు, నగలు అవి ఏ గ్రహరాసి వారు ఎలా  పెట్టుకోవాలో నోరు పెగుల్చుకుని అరుస్తున్నట్టుగా అనిపించింది.

మేరీకి హటాత్తుగా ఏదో  కొత్త గ్రహానికి  వలస వచ్చినట్టుగా వుంది.

ఆకలి గా వున్నాగానీ కడుపునిండా తినలేకపోయింది. అందరు నవ్వుతూ పేలుతూ మాట్లాడుకుంటున్నారు.

మేరీ కి చిరునవ్వుని పెదాలమీద చెక్కి వుంచడం కష్టమైపోతోంది.

మౌనంగా బట్టలు సర్దుకుని తిరుగు ప్రయాణం  అయ్యారు. మళ్లీ  కన్నీళ్ళూ, కావలింతలూ కాసేపు సాగాయి.

మేరీ నిలబడే వుంది.

“తప్పు చేశావేమో కిరణ్ ” అంది దారిలో

” ఏ విషయం లో” ఇద్దరూ చీకటిలోనే వున్నారు. ఒకరి మొహం ఒకరికి కనబడటం లేదు.

“నన్ను చేసుకోవడంలో…..అంత పెద్ద కుటుంబం వున్నప్పుడూ, వాళ్ళని ఒప్పించలెక పోయినప్పుడు… వాళ్ళకి నచ్చిన పిల్లనే చేసుకోవాల్సింది.”  అనలేక అనలేక అంది.

“ఇప్పుడెందుకింక జరిగిపోయింది కదా… ఆ విషయం  వదిలేయ్యి….”

“అందుకు బాధ పడుతున్నావా..”

“చచ లేదు…నువ్వూ  కలిసిపోతే బావుండేదనుకున్నా…”

“అంటే నేను  ప్రయత్నించలేదంటావా..?”

“ఏం ప్రయత్నించావు. కనీసం మొహాన్న బొట్టన్నా పెట్టుకోలేదు..పెళ్లయిన వాళ్ళు అలా కనిపించడం ఎంత తప్పొ నీకు తెలుసా, మన ఇంట్లో ఎలా వున్నాగానీ, మా ఇంట్లో ఒక స్టిక్కరు అతికించుకోవచ్చు కదా . అక్కలందరు పూజలు చేస్తుంటే నువు దిక్కులు చూస్తూ కూచున్నావట, వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకుంటాయి కదా..”

” అదేమిటి..అభిప్రాయాలే అయితే నాకూ  వున్నాయి. నేను పెరిగిన పరిసరాలు  నమ్మకాలు వేరు కదా…”

“కావచ్చు కానీ అత్తగారింటికి అంటూ వచ్చాక…వేరే గా వుంటుంది”

“అదేమిటి కిరణ్….నేను వచ్చిందే ఇది మొదటిసారి కదా….మతం విషయం  ఎలా వున్నా గాని నువు  చేసుకున్నాక కూడా వాళ్ళకి నేను కోడల్ని కాదా ? బొట్టు పెట్టుకుంటేనే మాట్లాడుతారా…? వ్రతాలు చేస్తేనే కలుపుకుంటారా..?”

“అవునబ్బా అది ఒక సంప్రదాయం..”

“అది నాక్కూడా వుంటుందని నీకు తెలీదా..?”

” ఏమిటి నీ సంప్రదాయం ..ఏ నమ్మకాలు లెకపోవడమేగా..”

“ఏమని నమ్మమంటావు, నోములు నోచకపోతే మొగుడిమీద ప్రేమ లేదని నమ్మమంటావా..?”

“నలుగురికి బొట్టు పెట్టినప్పడల్లా  , ఇంకో నలుగుర్ని అవమానించడం  సంప్రదాయం అని నమ్మమంటావా..?”

“అవమానించడమేమిటీ..”

“ఏం గమనిస్తావు నువ్వు, మీ  పెద్దక్క అత్తగారికి ఎందుకు  బొట్టు  ఇవ్వలేదు”.

“ఆవిడకి భర్త లేడు”

“భర్త వచ్చినప్పుడే కాదు కదా, ఆవిడకి వాళ్ళమ్మ చిన్నప్పుడే పెట్టీంది కదా బొట్టు, సూత్రాలు మటుకు భర్త కట్టి వుండచ్చు”

“వూ.. ఇంకా”

హేళన అవసరం లేదు”

“లేదులే చెప్పు, ”

“మీ చిన్న వదిన కొడుకుని ఉయ్యాల్లో వేస్తున్నప్పుడు ఆఖరి వదిన్ని ముట్టుకోనివ్వలేదట, ఎందుకని,..”

“ఏమో…|”

“నెను విన్నాను, ఆవిడకి పిల్లల్లేరుట, గొడ్రాలుట, ఇందాకా పేరంటం జరుగుతుండగా మీ పెద్దన్నయ్య కూతుర్ని లోపలికి రానివ్వలెదు..? ఎందుకంటారు..?”

“అదేమిటి.. నాకేం తెలుసు..?”

“ఆ పిల్ల ముట్టయిందిట.. అందుకే అందరూ కలిసి బహిష్కరించారు. పాపం సిగ్గుతో దూరం గా నుంచుండిపోయింది. వెనక వాటా ఆవిడ్ని మీ అమ్మ నూతిలో నీళ్ళు తోడనివ్వడం లేదు తెలుసా…ఎందుకంటే వాళ్ళకి మైల వచ్చిందిట, మనిషి పోవడం ఒక కష్టమైతె ఈ దూరాలు ఏమిటీ..? పక్కింటీ వాళ్ళు ఒకరికొకరు ఎంత సాయం గా వుండాలి. అదే మాలో ఎంత ఆదుకుంటారో తెలుసా..?”

“ఔనా..?”

“ఔను…”

“నువ్వు ఇవన్నీ ఎప్పుడు చూశావు, నీకు తెలీదు కదా ఇలాంటీవి…”

“అవమానం ఎవరిదైనా సరే నాకు అర్ధం అవుతుంది కిరణ్…అదే సంప్రదాయం  అయితే అది నాకు తెలీదు. మా ఇంట్లో ఎప్పుడు ఇలా జరగవు. ఎంతమంది మనుషులుంటే అంత సందడి అనుకున్నాను గానీ అన్ని చీలికలనుకోలేదు.”

“చ చ చీలికలేమిటీ..అది.. అలా అలవాటు , పెద్దవాళ్ళు ఎప్పుడొ ఎందుకో చెప్పి వుంటారు.”

“అదేమరి..ఎందుకు చెప్పి వుంటారో కూడా తెలీకుండా ఇప్పుడూ  ఇంకా పాటించడమేమిటి కిరణ్.. పైగా అవన్నీ మిస్సయినట్టు నువ్వు ఏడుపు, మీ వాళ్ళు ఏడుపు….”

” అమ్మ కన్నీళ్ళు నేను చూడలేను మేరీ ”

“నాక్కూడా అమ్మ వుంది కిరణ్..ఆవిడకీ కన్నీళ్లు వున్నాయి. అవి నిన్ను పెళ్ళి చేసుకున్నందుకు రావు. నా ప్రేమ మీద నమ్మకం వుంది. నేను దూరం అయితేనే వస్తాయి.”

“దూరం అవమని నేను చెప్పానా, కిందటి నెల్లో నే గా వాళ్ళు వచ్చారు.”

“అవును నువ్వు ఎంత విసుక్కున్నావో కూడా గుర్తు వుంది. అయినా నా కోసం బెంగపడి నే ను ఎందుకు రావడం లేదో అనుకుని రావడం వేరు..నా అంతట నెను నా పుట్టీంటికి వెళ్ళడం వెరు. అది ఇంతవరకూ జరగలేదు.””

“సారీ మేరీ”

“సారీకొసం కాదు. వూరికే చెబుతున్నా. నీ కోసం అందర్నీ వదులుకుని వచ్చాను. అందులో ప్రేమ కనబడలేదా కిరణ్, నోములు నోచి ఎవరికి నిరూపించాలి, అస్తమానూ దేవుడ్ని అలా కాకా పడతారేమిటీ..?”

“చీ వూరుకో కళ్ళు పోతాయి, అది పూజ అంటారు.”

“తెలుసులే మాకూ ప్రార్ధన వుంటుంది. మాకు అయితే అందరూ సమానమే. ఏ కారణం గానూ ఎవర్నీ దూరం పెట్టం….”

“ఔను తెలుసు.”

“దేవుళ్లకి కూడా ఈ నగల పిచ్చేమిటీ..?”

“ఎక్కడ”

“ఎక్కడేమిటీ? ఇదిగో నీ ఉంగరం మీద వున్న వెంకటేశ్వరస్వామికి…..”

“అయ్యో చెంపలు వేసుకో మళ్ళి కళ్ళు పోతాయి.”

మేరీ  పడీ పడీ నవ్వింది.

“నీకు మాత్రం నగల పిచ్చి లేదా..?”

“నాకా..”

“అవును ఇలా నవ్వగానే అలా ఎన్ని వజ్రాలు మెరిశాయో చూడూ…”

“చాల్లే వూరుకో…”

” ఎలా వూరుకోమంటావూ..అదిగో ఇప్పుడేమో కెంపులు మెరుస్తున్నాయి”

“బాబోయ్ నీకేదో అయింది.”

“అవును అయింది ఇంకా చాలా చాలా అవబోతుంది..” అంటూ మేరీ  అర చేతిని పెదవులకు ఆనించుకుని మీసాలతో కితకిత లు పెట్టాడు.

………..

“మేరీ”

“చెప్పు”

“మన పిల్లలకేం పేరు పెడదామ౦టావు..?”

“ఆలూలేదు, చూలూ లేదు గానీ..”

“అన్నీ వుంటాయిలే గానీ చెప్పు”

“చెప్పమంటావా..”

“నీ మతమూ వద్దు, నా మతమూ వద్దు”

“మరి..”

పెద్దవాడి పేరు భూమి గుండ్రంగా వుందని కనిపెట్టిన గెలీలియో పేరు పెడదా౦ , రెండో పిల్ల పేరు ఎవరెస్టు శిఖరం ఎక్కిన వీరుడి పేరు పెడదాం, మూడో పిల్లవాడి పేరు కాన్సరు వ్యాధి చికిత్స కనిపెట్టినవాడి పేరు పెడదాం…..నాలుగో పిల్ల పేరు..

“వాళ్ళకి కూడా మతం వుంది కదా”

“వుండచ్చు. కానీ దేశం కోసం వాళ్ళు సాధించిన విజయాలే గుర్తుంటాయి …..నాకు అలాంటి పిల్లలు కావాలి..

“ఇంకా”

“నాకు చాలా మంది పిల్లలు కావాలి కిరణ్…నా కడుపున పుట్టకపోయినా ఫర్వాలేదు. బైటినుంచి తెచ్చుకుని పెంచుకుందాం..”

“అలాగే…..”

చాలా సేపటివరకూ ఇద్దరికీ మాటలతో అవసరం రాలేదు.

అతి మామూలు ఆర్టీసీ రేకు డబ్బాలాంటి ఆ బస్సు పూల రధంలా పరిగెడుతోంది.

*

చిత్రం: రాజశేఖర్ చంద్రం 

కొండేపూడి నిర్మల

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • చాలా సీరియస్ గా చాలా విషయాలు చర్చించి చివర్లో హడావుడి గా శుభం కార్డు వేసేసారు

    • మారుతున్న కాలానికి అనుగుణంగా ఆచారాలు సంప్రదాయాలలో మార్పులు రావాలని గ్రహింపు వచ్చింది. ఇంకా ఎంత సేపు విమర్శలు చేస్తూ కథలు రాస్తున్నారు. బ్యాడ్ లక్….అందరికీ ఒక మతమే కన్పిస్తుంది తిట్టడానికి.

  • “మాకు అయితే అందరూ సమానమే. ఏ కారణం గానూ ఎవర్నీ దూరం పెట్టం”

    క్రూర హిందువులని, నిష్కల్మషమైన క్రిష్టియన్లని, కళ్ళకి కట్టినట్టు చూపించారు నిర్మల గారూ.

    మా అమ్మ పేరూ నిర్మలే అవ్వటంతో ఇంతకంటే పొగడటానికి మాటల్లేవ్.

  • ‘మేరీ’ ప్రస్తావించిన కొన్ని విషయాలు కొంతవరకూ నిజమే (క్రైస్తవుల్లో ఆచారం పేరిటం ఆడాళ్లకి బంధనాలు వేయకపోవటం). కానీ హిందూ కుటుంబాల్లో కూడా అలాంటి ఆచారాలు వదిలించుకున్నవారిని నేనెరుగుదును.

    ఇక పోతే – కథ మరీ ఏకపక్షంగా ఉంది. ఎదుటివారి సంప్రదాయాలని తిరస్కరిస్తూ తన సంప్రదాయాలు మాత్రం పట్టుకు వేలాడటం వల్ల మేరీ పాత్రలో చాలా hypocrisy కనపడింది. ఆ నోములేవో తానూ నోచి, నుదుట బొట్టు పెట్టుకుంటే పోయేదేంటో!

    నిజానికి క్రైస్త్రవంలో ఎక్కడా నుదుట బొట్టు పెట్టుకోవద్దని, స్థానిక సంప్రదాయాలు, కట్టు, బొట్టు పాటించొద్దని లేదు. తెలుగు కేతలిక్ మహిళలు శుభ్రంగా హిందువుల మాదిరి బొట్టు, గాజులు, తాళి, మెట్టెలు ధరిస్తారు. కేతలిక్కులు హిందువుల శైలిలో సంప్రదాయబద్ధంగా జీలకర్ర-బెల్లం సాక్ష్యంగా వివాహం చేసుకుంటారు. హిందూ దేవాలయాలకి వెళతారు. ప్రసాదం తీసుకుంటారు. దీపావళి లాంటి పండగలూ చేసుకుంటారు. కృష్ణుడు, వినాయకుడు వంటి దేవుళ్ల బొమ్మలని ఇళ్లలోనూ పెట్టుకుంటారు. మన కథల్లోనూ, సినిమాల్లోనూ అరకొర జ్ఞానంతో రాసే/చూపించే స్టీరియోటైప్ క్రిస్టియన్లని చూసి క్రైస్తవులందరూ అలాగే ఉంటారని మిగతా తెలుగు సమాజంలో ఓ అపోహ ఏర్పడిపోయింది. ఆ మూస బద్దలు కొట్టాల్సిన అవసరం ఉంది.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు