రాళ్లపల్లి వారి అనుభూతి సామ్రాజ్యం

దీపేష్ చక్రబర్తి అన్న ఒక ప్రసిద్ధ చరిత్ర కారుడు కలకత్తాలో లభించిన కొన్ని పత్రాల సహాయంతో  ఛత్రపతి శివాజీ చరిత్రను రాసిన జదునాథ్ సర్కార్ అనే దిగ్గజుని జీవిత గాధ రాసి దాన్ని ‘Jadunath Sarkar and His Empire of Truth’ అని పిలిచారు – అంటే  ఆయన ‘సత్యసామ్రాజ్యం’.

ఈ పుస్తకం ఒక సాధారణమైన చరిత్ర కాదు, అసలు చరిత్రనే కాదు. అది జదునాథ్ సర్కార్  మనో వ్యవస్థ  కుశాగ్ర పరిశీలన, ఆయన తత్త్వం పై చింతన, చారిత్రక సత్యాల వెనుక ఆయన తీసిన పరుగును వెంబడిస్తూ చేసిన పయనం. ఇక్కడ సత్యసామ్రాజ్యం అంటే  సత్యం అన్న అంశం పై కలిగిన ఆలోచనల మధ్య ఉన్న సమన్వయము, ఘనమైన కూర్పు, సిద్ధాంతాల నిర్మాణ పధ్ధతి. ఈ సర్కార్ రాసిన ఉత్తరాల నుంచి, ఆయన పదిల పరుచుకున్న notes నుంచి మనం ‘సత్యం’ అనేదాన్ని కనుగొన గలమా అని ప్రశ్నిస్తూ రాసిన పుస్తకం ఇది.

అదే విధంగా నాకు బెంగళూరులో దొరికిన రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ దాచుకున్న పుస్తకాలూ, అందులో ఆయన విడిచిన జాడలు అలాంటి ఒక సామ్రాజ్యాన్ని సూచిస్తాయి, కాకపోతే ఒక అనుభూతి సామ్రాజ్యాన్ని, ఒక ఆస్వాదనా సామ్రాజ్యాన్ని. కళ, అలంకారం, ఒక నిండు జీవితం అంటే  ఏమిటి  అన్న ప్రశ్నకు విశాలమైన ఒక సమాధానాన్ని లేవనెత్తుతాయి.

అందరు మేధావులు, రచయితల వలె ఆయన గ్రంధాలయంలో కూడా ఇతర రచయితలు అయన పట్ల స్నేహంతోనో, గురుభావంతోనో ఇచ్చిన పుస్తకాలు తారసపడుతాయి. ఈ పుస్తకాలు ఆ నాటి సాంస్కృతిక వాతావరణానికి నిరూపణలు. ఉదాహరణకు European Romantic కవిత్వ శైలి స్ఫూర్తితో లక్ష్మి-వెంకటేశ్వర దంపతుల శృంగారాన్ని వర్ణించే ‘ఏకాంతసేవ’ అన్న పుస్తకాన్ని రాసిన వేంకటపార్వతీశ్వర కవులు అనంతకృష్ణశర్మ గారిని బ్రహ్మశ్రీ అని సంబోధిస్తూ పంపారు 1925లో. (English లో ఉన్న దాని ముందు మాటలో శర్మగారు కొన్ని spelling mistake లను ఒక స్కూల్ మాస్టారులా అప్పటి ఆనవాయితీ ప్రకారం ఎర్ర కలర్ పెన్సిల్ తో కొట్టేస్తారు కూడా!)

అదే విధంగా సాక్షాత్ టొరంటో విశ్వవిద్యాలయం నుంచి అక్కడి ఆచార్యుడు టి వేంకటాచార్య సంపాదకీయం వహించిన ‘నలకీర్తికౌముది’ని పంపారు (ఆయన సంతకం పెట్టిన విధానం నుంచి ఒక గరుకైన నేలపై కాగితం పెట్టి రాసినట్టు కూడా అంచనా వేయగలము!). కొన్ని సాహితీ అధ్యయన కృతులు కూడా కనిపిస్తాయి. ఉదాహరణకు :తిరుపతిలోని గోవిందరాజ ఆర్ట్స్ కాలేజీ ప్రధానోపాధ్యాయులు ఎస్. నాగయ్య  రాసిన కాళిదాసు సమీక్ష ఇంగ్లీష్ సంతకం తో ఆయనకు అందింది. రామారాధ్య వాగీశులు ఆంధ్ర-కన్నడ భాషల ఆదికవులైన నన్నయ, పంప రచనల సమీక్షను (1922) అనంతకృష్ణశర్మ గారిని పూజ్యులుగా సంబోధిస్తూ పంపారు అని కూడా చూస్తాము. ఇవి చాలవన్నట్టు 1969లో వీరరాఘవాచార్యులు ‘శిల్పదర్శనం’ అన్న పేరుతో శిల్పశాస్త్ర సమీక్షను కూడా పంపారు. ఈ చిన్న జాబితాలోనే ఆయన పాండిత్య వైశాల్యం, వైవిధ్యం ఉట్టిపడుతాయి.

అంతే కాక నాటి ఇటువంటి పుస్తక సేకరణలలో అప్పటి ఎన్నో అబ్బురు పరిచే విషయాలు, అప్పటి వ్యక్తులలో ప్రసరించే వింతైన అనుభూతి స్రవంతులు వెల్లడవుతాయి. ఉదాహరణకు అనంతకృష్ణశర్మ గారు త్యాగయ్య కృతుల ఆంగ్ల అనువాద సంకలనం ఒకదాన్ని పదిల పరుచుకున్నారు. “ఎంతని నే వర్ణింతును శబరి భాగ్యము” అన్న త్యాగరాజ కృతిని పక్క పేజి లోనే “O the luck of Sabari! How can I describe it?” అని చదువుతూ రాళ్ళపల్లి వారు మురిసిపోయారా అని అడుగవచ్చు. ఇక పోతే అప్పటి విద్యావ్యవస్థకు గీటు రాయిగా అనంతకృష్ణశర్మ గారు పుట్టక  ముందు ప్రచురించబడిన (బహుశా వారి గురువుల వద్ద నుంచి ఆయనకు ఆస్తిగా  వచ్చిన) ఒక చిన్న వైష్ణవ వ్రతవిధాన, తత్త్వనిర్దేశక పుస్తకం కనపడుతుంది. అందులో ఉన్న విషయం  అంతా తమిళంలో ఉండగా, ఆ పుస్తకం మైసూరు ప్రాంత వాస్తవ్యులకై బయటికి తీసుకొచ్చినది కనుక దాని ముందు మాట కన్నడం లో ఉంటుంది.

కానీ  ఇక్కడ గమ్మత్తు ఏంటంటే ఆ కన్నడ భాగం అంతా తెలుగు లిపిలో ఉంటుంది. కాస్త ఈ విడ్డూరాన్ని పరిశీలించగా తెలిసేది ఏమిటంటే, కన్నడ లిపి తెలుగు లిపికంటే పాతదైనప్పటికీ typewriter లో మట్టుకు తెలుగే మొదట ఒచ్చిందట. రెండు లిపులు దగ్గరగా ఉండటం చేత 19వ శతాబ్దంలో సునాయాసంగా రచయితలూ, పాఠకులు కన్నడాన్ని తెలుగు అక్షరాలలోనే ‘అనుభవించే’వారు, రాళ్ళపల్లి వారితో సహా. పైగా, ఒక తమిళ పుస్తకంలో కన్నడ భాష ప్రవేశిక తెలుగు లిపిలో చదవడంలో నిమిళితం అయిన అప్పటి పండిత సమాజం  బహుభాషాప్రావిణ్యం ఇక్కడ ఆసక్తికరమైన  మరో అంశం.

రాళ్ళపల్లి గారు సేకరించిన పుస్తకాల పెట్టెలను దీర్ఘంగా చూసే కొద్ది మన మధ్య అద్దాలు వేసుకొని ఒక easy chairలో హాయిగా కూర్చొని ఒక పెన్సిల్ ముక్కతో ఖాళీ కాగితం మీద  కానీ వేరే వారు రాసిన వాటిలో కానీ ఎదో కెలుకుతూ, ఒక రాగం ఈడుస్తూ కనిపిస్తారు. కానీ మరింత దీర్ఘంగా ఆ పుస్తకాలలోని పేజీలను తిరగ వేస్తే, ఆయన వద్ద ఉన్న శ్యామశాస్త్రి, స్వాతి తిరునాళ్ పాటల సంకలనాలను, సంగీతశాస్త్ర అధ్యయనాలను పక్కన పెట్టి దబదబ పంచె సరి చేసుకుంటూ నామం బాగుందో లేదో చూసుకుంటూ, పైన ఉత్తరీయం వేసుకొని బయటకు బయలుదేరుతారు.

కళాత్మకమైన అనుభూతి అనేది కేవలం చదివే పుస్తకాలలో ఉండదు. దానికి నిదర్శనం రాళ్ళపల్లి వారికి కచేరీలకై వాటి నిర్వాహకుల నుంచి అందిన ఆహ్వానాలే. ఉదాహరణకు December 1978 గొప్ప వాగ్గేయకారుడు వీణ శేషన్న గారి జ్ఞాపకార్థం బెంగళూరులోని శంకరపురంలో జరిగిన ఒక కచేరికు రమ్మంటూ ఒక జాబు అందింది అనంతకృష్ణశర్మ గారికి. ఆయన కన్ను మూసిన మూడు నెలల ముందు ఇది. దీనికి ఆయన వెళ్లి ఉంటారా? వెళితే ఆనందించి ఉంటారా? మనం ఊహించుకొన వలసిందే. అప్పుడప్పుడు ఈ పెట్టెలలోకి మరింత లోతుగా మునిగితే శర్మ గారు మన ముందే బస్సు ఎక్కి దూర ప్రాంతాల దాక వెళిపోతూ కూడా ఉంటారు.

1972లో  ‘తాళ్ళపాక అన్నమాచార్య కళాక్షేత్రం’ అధ్యక్షుడు కృష్ణంరాజు తనను తాను శర్మగారి భవదీయునిగా పిలుచుకుంటూ అన్నమయ్య కృతులకు శర్మ గారు చేసిన సేవ దృష్ట్యా, తాళ్ళపాకలో అన్నమయ్య మంటపం కట్టడం గురించి, విగ్రహ ఆవిష్కరణ గురించి తెలియ చేస్తారు. హైదరాబాద్ నుంచి అందిన ఈ లేఖకు బదులు మాత్రం తాళ్ళపాక చిరునామాకే  రాయమని చెప్తారు. రాళ్ళపల్లి గారు ఆనందంతో అప్పట్లో  కడప  జిల్లాలో ఉన్న రాజంపేట కు పోయి అక్కడ నుంచి తాళ్ళపాకను సందర్శించి ఉంటారా!?

స్నేహం కోసం చదవడం, ఆనందం కోసం సంగీత సాధన, అస్వాదన చేయడంతో తో పాటు, పండిత సమాజంలో ఒక సభ్యునిగా తోటి కళాకారులకు విమర్శ ద్వారా తోడుగా ఉండవలసి ఒస్తుంది. సాయం కూడా ఈ అనుభూతి సామ్రాజ్యంలో ఒక అంశమే మరి. ఆ విధంగా నన్నెచోడుని ‘కుమారసంభవం’ ఎడిషన్  పై తన అభిప్రాయాలు, కొత్తగా తీసుకొచ్చిన ఆంధ్రమహాభారతానికి తాత్పర్య విషయంలో సంస్కృత వ్యాకరణం నుంచి కొన్ని సలహాలు పొందుపరిచారు.  వీటిని  మినహాయించి, వీటిని అధిగమిస్తూ, విద్యార్థులకు తన ఉపన్యాసాల ద్వారా తోడుపడడం పండితుడు చేసే సాయంలో ఒక ముఖ్య భాగం.

అనంతకృష్ణశర్మ గారిని ఒక బెంగళూరు ఆర్ట్స్ కాలేజీ వారు సంగీతం,  దాని  తత్త్వాన్ని చర్చించమని ఆహ్వానించారు 1970 లలో. ఆయన ఆ ప్రసంగానికి గాను రాసుకున్న outline కూడా మనకు దొరుకుతుంది. ఆయన తన పాండిత్యం, కళ, సంగీతాల అనుభూతి నుంచి ఒక తత్త్వాన్ని రూపొందించడం మనం చూడగలుగుతాం. ఈ తత్త్వం సంగీతాన్ని కూడా ఒక భాషగా పరిగణిస్తుంది. ఆంగిక భంగిమలు, అభినయం అంగాలుగా కలిగిన భాష నృత్యం ఐతే, అక్షరాల ఆధారంగా ఉన్న భాష సాహిత్యం ఐతే, స్వరలయలచే రూపు పొందిన భాష సంగీతం అంటారు. ఏ భాష శుద్ధమైనది కాదు – నృత్యాన్ని, సంగీత-సాహిత్యాలతో అనుభూతి చెందినప్పుడు నాటకం అవుతుందని, పద్యాలను స్వరయుక్తంగా పాడాలని, వేదశాస్త్రాలు సహితం స్వరభరితమని చెప్పుకొస్తాడు. రాళ్ళపల్లి గారు తన అనుభూతి సామ్రాజ్యంలో తిరుగుబాటులను గమనించకుండా లేరు:

“పరతంత్రంగా ఉన్న సంగీత సాహిత్యాలు స్వతంత్రం కావడానికి ప్రయత్నం జరిగింద”నంటారు. ఎంతో ఉత్తేజంగా నడిచే ఈ భావప్రవాహం పుస్తకంలో  కూడా చదవ వచ్చు కానీ, print లో కనిపించేది “నిజ”మైన భావం కాదు కాబోలు. అనంతకృష్ణశర్మ గారి ఈ note ని తిప్పితే,  తాను ఇవ్వవలసిన speech “II”వ భాగం కనిపిస్తుంది. ఇది కన్నడం లో రాసుకున్నారు. కన్నడం లో ఇచ్చే ఉపన్యాసానికి కన్నడంలోనే prepare ఐతే తగును అని అనుకున్నారా? ఈ ప్రతిలో ఏముందో చుస్తే, కర్ణాటక సంగీత శాస్త్రానికి  సంబంధించి వివరణాత్మక సూచనలు కనిపిస్తాయి. అనగా యే భావానికి యే స్వరాలు, ఏ రాగాలు అనుగుణమో అన్నటు వంటి చర్చలు. బహుశ సామాన్య శాస్త్రానికి, ప్రత్యేక సిద్ధాంతానికి ఆయన రెండు వేరు వేరు భాషలు ఎంచుకున్నారా? లేక ఒక భాషలో ఆయన క్షమశిక్షణతో, మరో భాషలో ఒక వెల్లువైన ధారలా ఆలోచిస్తారా? ఏమో అయన అనుభూతి సామ్రాజ్య విధి విధానాలు పసిగట్టలేము. కానీ ఒక అనుభవ సామ్రాజ్యమైతే తెలుస్తుంది.

అలా తెలిసింది రెండు పెట్టెల నా అధ్యయనం నుంచి. అదే అతని సేకరణ మొత్తం పరిశీలిస్తే? ఇలా మరుగైపోయిన ఎందరి సేకరణలలో ఎన్ని స్మృతులో. అలా ఎన్ని తత్త్వాల, ఎన్ని కథల  ఎన్ని సామ్రాజ్యాలో!

*

రేవంత్ ఉక్కళం

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ‘కన్నడలిపి తెలుగులిపి కంటే పాతదయినప్పటికీ…’ ఎట్లాగో చెప్పగలరా, ఆనవాళ్లతో.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు