విలక్షణ రచయిత డా. వి. చంద్రశేఖరరావు పేరు మీద ఆయన కుటుంబ సభ్యులు, మిత్రులు ఏటా అందిస్తున్న స్మారక పురస్కారానికి ఈ ఏడాది రచయిత వి. మల్లికార్జున్ ఎంపికయ్యారు. ఏప్రిల్ 16న హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగిన సభలో మల్లికార్జున్ ఈ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయనతో సారంగ జరిపిన చిన్న ఇంటర్వ్యూ.
- నమస్తే మల్లికార్జున్ గారు! ముందుగా మీకు సారంగ తరపున శుభాభినందనలు. మీరు ఇప్పటివరకు నాలుగు పుస్తకాలు రాసారు కదా. ఇప్పుడు ఈ అవార్డ్ రావటం మీకెలా అనిపిస్తోంది?
థ్యాంక్యూ గౌస్ గారూ. డా. వి. చంద్రశేఖరరావు సాహిత్య పురస్కారాన్ని అందుకోవడం నిజంగా గర్వంగా ఉంది. నేను ఆయన కథల్ని ఎంతో ఇష్టపడ్డవాడ్ని. “చాలా మరణాలకు అవసరమైనంత దుఃఖపడ్డావు. ఇక చాలు” అన్న ఆయన వాక్యం నన్నెందుకో ఇంకా వెంటాడుతోంది. ఒక గొప్ప రచయిత పేరు మీదన ఇస్తున్న అవార్డు నాకు రావడం, అదీ నేనందుకున్న మొదటి అవార్డు ఇదే కావడం సంతోషంగా ఉంది.
- మీరు రాసిన నాలుగు పుస్తకాలు కూడా పాఠకులకు బాగా దగ్గరయ్యాయి. అది మీకెలా అనిపిస్తూ ఉంటుంది? దానికోసం మీరేం జాగ్రత్తలు తీసుకున్నారు?
పాఠకులకు ఎలా దగ్గరువుతుందీ అన్న ఆలోచనతో నేనైతే ఎప్పుడూ ఏదీ రాయలేదండీ. నేను ఇష్టంగా ప్రేమగా రాయాలనుకున్నది రాస్తూ వచ్చానంతే. కొందరికి ఇరానీ కేఫ్ ఇష్టం, కొందరికి కాగితం పడవలు ఇష్టం, ఇంకొందరు నల్లగొండ కథలు ఇష్టమంటారు. మనం రాసినదాంట్లో వాళ్ళకేది ఇష్టమో వాళ్ళే తేల్చుకొని చదువుకుంటారేమో. నాక్కూడా తెలియదు. జాగ్రత్తలు తీసుకొని ఇది రాస్తే ఏమనుకుంటారో, ఎలా తీసుకుంటారో అనిపిస్తే అక్కడే సగం ఫెయిలవుతానేమో!
- రచయితగా ఉండటం పట్ల మీకిష్టమైన విషయం ఏమిటి?
రచయితగా బతకడంలో నిజానికి కష్టమే ఎక్కువుంటుందేమో కదా? 😊
ఇష్టాలంటే ఒక్కటని చెప్పలేను గానీ – ఏ విషయాన్నైనా కొత్తగా చూడొచ్చనిపిస్తుంది. నిజాయితీ, సహానుభూతి లేకుంటే ఏమీ రాయలేం కాబట్టి అవి కచ్చితంగా వెంటొచ్చేస్తాయి. అలాగే నేను నమ్మేది ఒకటేంటంటే – నువ్వు మంచివాడివైతే తప్ప రచయితవి కాలేవు అని. అంతకంటే ఇంకేం కావాలి?
- తెలుగులో పుస్తకాలు రాస్తున్న వారిలో యువతరం ఎక్కువగా ఉంది కదా? వారికి కేవలం మూడు పదాలతో ఏమైనా చెప్పమంటే ఏం చెప్తారు?
బాగా చదవండి. రాస్తూండండి.
ఇంకో మూడు పదాలు చెప్పనా? మీకు నా ప్రేమ.
- మీ తరువాతి పుస్తకం ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఆ పుస్తకం గురించి కొన్ని మాటలు మాతో పంచుకోగలరా?
ప్రస్తుతం ఒక నవల రాస్తున్నా. ఈ కథని నేనెలా అర్థం చేస్కోవాలో తెలుసుకోవడానికే చాలా టైం పట్టింది. రాయడం అయిపోవచ్చిందనుకుంటున్నా. ఇంకొన్ని నెలల్లో రిలీజ్ అవుతుంది.
*
Add comment