రత్నాలు రాసులుగా పోసి అమ్మిన నేల,రక్తపుటేరులతో తడిసిన నేల, రాజకీయ రాబంధులందరూ ఇప్పటికీ దోచుకుంటున్న నేల.. రాష్ట్రం ఏర్పడ్డనాటి నుండి ఎనిమిదిమంది ముఖ్యమంత్రులనందించిన నేల..సాంఘిక సంస్కర్తలైన పోతులూరి, వేమనలు పుట్టిన నేల. సాంస్కృతిక సాహిత్య వైభవం ఉన్న నేల. కానీ ఇప్పటికీ ఈ నేలనిండా కన్నీటి గాథలు. ఈ నేలనిండా ఇప్పటికీ వేటకొడవల్ల శబ్దాలు.
ఈ సీమలో ఫ్యాక్షన్ అంతమయ్యింది అన్నది ఎంత అబద్దమో ఈ సీమలో ఫ్యాక్షన్ హత్యలు, కరవు ఆత్మహత్యలు, ఆకలి చావులు తదితర వస్తువులతో కథలు కవిత్వం రాయని వాళ్ళెవ్వరూ లేరు. ఈ సీమలో కలం పట్టిన ప్రతి వొక్కరూ సీమ బతుకుల్ని, వెతల్ని కన్నీటిని సిరాక్షరాలుగా ప్రతీకవి మార్చారు. ఈ సీమ యాసకు భాషకు ఎందరో కవులు పట్టం కాట్టారు.
ఈ సీమలో మొదటి తరానికి చెందిన కథారచయిత జి.రామకృష్ణ అనంతపురం వాసి. రాయలసీమ మాండలికంలో మొదటిసారి రామకృష్ణ రాశారు. ‘చిరంజీవి’ అనే కలంపేరుతో ఈ కథను విజయవాణి పత్రికలో 16.03.1941లో ప్రచురించారు. చిత్తూరు జిల్లాకు చెందిన కె.సభా 1944 ఏప్రెల్‌లో చిత్రగుప్త అనే మాసపత్రికలో కడగండ్లు అనే కథను రాశారు. ఈ కథలో ఫ్యూడలిజాన్ని చిత్రించాడు. రాయలసీమ జనజీవనం గత నాలుగు వందల సంవత్సరాలుగా యీ ప్రత్యే‘కథ’తో కన్పిస్తుంది.
ఇక ఆధునిక సాహిత్యంలో రాయలసీమ చిత్రీకరణ తన భౌగోళిక ప్రత్యేకతతోనే మొదలైంది. మొదట తరం కథకులై సభ, గుత్తి రామకృష్ణ లాంటి వాళ్లు కరువు పరిస్థితి లో ఇక్కడి జీవితాన్ని చిత్రించారు. తర్వాత తరం వారిలో అగ్రగణ్యుడు కేతువిశ్వనాథరెడ్డి కరువూ, ఫ్యాక్షన్ రెండు అవ్యవస్థల కలగలిసిన జీవిత చిత్రాలను సృజించాడు. అందుకే ప్రముఖ జర్నలిస్ట్ పాలగుమ్మి సాయినాథ్ కరవు కొందరికి వరమైతే మరికొందరికి శాపమని కరువు కొద్దిమందికి సంపదను సృష్టిస్తే, చాలామందిని బికారులను చేస్తుందని, కరువు ఆర్థికంగా మాత్రమే ప్రభావితం చేయదని, సాంస్కృతిక విలువల్ని కూడా ధ్వంసం చేస్తుందని అంటారు. ఈ సీమ అదే ఈ రాయలసీమలో నిరంతరం కనబడే గ్రామాల పతనం, కరువు, దళితుల దయనీయమైన ధైన్యం గ్రామాల్లో ఆధిపత్యం, ఫ్యాక్షన్‌లాంటి వస్తువులు కథలుగా ఏళ్ళతరబడి రాస్తున్నారు. రాయలసీమలోని సౌందర్యం, రాయలసీమలోని భాష, యాస, మాండలికం, మధ్యతరగతి కుటుంబవ్యవస్థ, సున్నితమైన మానవ సంబంధాలు, చిద్రమవుతున్న విలువలు, లైంగిల వేధింపులు ఇలా చాలా అంశాలతోపాటు స్త్రీవేధనలు, స్త్రీల సమస్యలు, యువతుల సమస్యలు ఇలా కథాసాహిత్యంలో వస్తువులై ఆధునిక సాహిత్యాన్ని పరిపృష్టం చేస్తున్నాయి.
రాయలసీమ భౌగోళికంగా ప్రత్యేకమైనది. ఆ ప్రాంతంలో ప్రజలు ఆ భౌగోళికత వల్ల ప్రత్యేకంగా నిలబడ్డారు. జనజీవనం లోని ప్రత్యేకతే సాహిత్యంలోనూ ప్రతిఫలిస్తుంది. ఇక్కడి సాహిత్య సృజన ఇటీవలికాలంలో బలంగా ఈ ప్రాంతపు అస్తిత్వపు మూలాలన్నింటిని తెలియజేస్తున్నది. కథ, కవిత్వం నవల ఏది రాసినా ఈ ప్రాంతపు హృదయాన్ని స్పృశిస్తున్నాయి. ఈ ప్రాంతపు యాసను, మాండలికాన్ని తమతమ రచనల్లో తీసుకొచ్చి రాయలసీమ భాషకు గౌరవాన్ని తెస్తున్నారు. కర్ణాటకలోని బళ్ళారి, హొస్పేట, తుమ్‌కూర్ తదితర జిల్లాలన్నీ రాయలసీమలో ఒకప్పుడు భాగమే. ఇప్పటికీ రాయలసీమవాసులకు ఆ ప్రాంతంతో సాంస్కృతిక సంబంధాలు కొనసాగుతున్నాయి. పైగా కన్నడ భాష, ఆ భాష తాలూకు మాండలికాలు, యాస అన్నీ రాయలసీమ ప్రాంతకవులు ఉపయోగిస్తున్నారు.
కడప నుండి పాలగిరి విశ్వప్రసాద్ చుక్కపొడిచింది అనిరాసినా, అనంతపురం జిల్లా నుండి బండినారాయణ స్వామి గద్దలల్లాడతాండయి అని రాసినా, సడ్లపల్లి చిదంబర రెడ్డి బతుకువెతుకులాట తెచ్చినా, కర్నూలు నుండి జి.వెంకటకృష్ణ చిలుకలు వాలిన చెట్టు, మారుతీపౌరోహితం ఊరిమర్లు కథలు రాసినా చిత్తూరు నుండి యాలై పూడ్సింది అంటూ పల్లిపట్టు నాగరాజు కవిత్వం రాసినా రాయలసీమకున్న యాసను భాషను తమ రచనల్లో గొప్పగా ఇమడ్చగలిగారు. పేరుకు కొంతమందిని ఉదహరిస్తున్నానే తప్ప ఈ ప్రాంతంలో చాలా మంది కవులు తమ రచనల్లో ఈ ప్రాంతపు భాషను, యాసను మాండలికాన్ని గొప్పగా రాస్తున్నారు. సాహిత్యంలోని అస్తిత్వ ఉద్యమాల విషయానికొస్తే ఈ ప్రాంతం నుండే నాగప్పగారి సుందర్రాజు మాదిగోడు, చండాల చాటింపు వంటి రచనలు తెచ్చారు. నాగప్ప గారి సుందర్రాజును దళిత సాహిత్య చేగువేరాగా ఈ ప్రాంతం అతన్ని గౌరవిస్తున్నది.
సుందర్రాజు నిన్న మొన్నటి కవే కదా పితామహుడెలా అవుతాడని దళితులే అంటుంటారు. దానికి సహేతుక కారణాలు లేకపోలేదు. దళిత అస్తిత్వంతో కవితలు కథలు రాసి ఉండవచ్చు కాని, మాదిగ జీవన స్థితిగతులను కవిత్వీకరించి, కవిత్వ సంపుటీలు సుందర్రాజు కంటే ముందు తెచ్చిన దాఖలాలు లేవనే చెప్పవచ్చు. చెప్పులు కుట్టిన చేతులతో చరిత్ర తిరగరాస్తానన్న మాట ఇప్పటికీ మాదిగజాతి తమ సభల్లో చెప్పుకుంటున్నది. అంత ప్రభావం చేయగలిగాడు. పలమనేరు బాలాజి ఇటీవలకాలంలో ఏకలవ్య కాలనీ ఎరుకలజీవన గాథలు పేరుతో తీసుకొచ్చారు. ఇంతవరకు సాహిత్యంలో రాయలసీమ నుండి ఎరుకల కులానికి చెందిన జీవితాలు అడపాదడపా చెప్పి ఉండొచ్చేమోగాని సంపూర్ణంగా ఎరుకలి జీవనబతుకుల్ని సమాజానికి పరిచయం చేసిన పుస్తకమిది.
చారిత్రక ఉద్యమాలు ఏవి వచ్చినా ఈ ప్రాంతం నుండి ఆ ఉద్యమాలకు సంబంధించిన ఉద్యమస్ఫూర్తిని పొంది ఇక్కడి కవులు రచనలు చేస్తున్నారు. దక్షిణ భారతదేశంలో కర్నూలు కేంద్రంగా స్వాతంత్య్రపోరాటంలో పోరాడి చరిత్రకెక్కని వీరుడు వీరమరణం పొందిన గులాం రసూల్‌ఖాన్, తెర్నేకల్లులో వీరోచితంగా పోరాడిన ముత్తుకూరు గౌడప్పల గూర్చి చారిత్రక రచనలను యస్‌డివి అజీజ్ రాయగలిగాడు. పజ్జెనిమిదేళ్ళకే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాన్ని పాలెగాడు నవలను తీసుకురాగలిగిన నిఖార్సైన సీమవాసి అజీజ్. స్వరాజ్యమొచ్చి ఏడుపదులు దాటినా ఒకరిపై ఒకరు కర్రలతో కొట్టుకునే కర్రల సమరాన్ని, ఆ సాంఘిక దురాచాన్ని దేవరగట్టు రచనతో చరిత్రకెక్కించిన జి.వెంకటకృష్ణ రాయలసీమ కవుల్లో ప్రసిద్దులు. అయితే చరిత్రకు, సాహిత్యకు ఎక్కని అనేక పరిశోధనాత్మక విషయాలు పరిశోధకులు శోధించలేకపోయారు. ఈ శీర్షికలో ఆ ప్రయత్నమూ జరుగుతుంది.
అందుకే ప్రతివొక్కరూ రాయలసీమ సాహిత్యాన్ని చదవాలి. ఎందుకు చదవాలి అన్నప్పుడు ఒక ప్రాంతం ఎలా ప్రత్యేకంగా నిలబడ గలుగుతుందో, అక్కడ జీవితం ప్రత్యేకంగా ఎలా మన గలుగుతుందో తెలుసుకోవడానికి రాయలసీమలో వస్తున్న విస్తృతమైన సాహిత్యాన్ని చదవాలి. ఇక్కడ సిద్దాంతాలకు ఆవల జీవితం, దాని బండబారిన తనమే ఒక సిద్ధాంతంగా వుంది.
ఆ స్థితిని తెలుసుకోవడానికి ఇక్కడి సాహిత్యాన్ని చదవాలి. ఇక్కడి రచయితలు ఎలా జీవితాన్ని పట్టుకున్నారో తెలుసుకోవడానికి చదవాలి. ప్రాంతమూ, ప్రజలూ ఒకే స్థితిలో అగుపడే కథనంలో వైవిధ్యాన్ని తెలుసుకోవడానికి రాయలసీమ సాహిత్యం చదవాలి. ఇక్కడి రచయితలు అనివార్యంగా ఎదుర్కొంటున్న జీవన సంఘర్షణను తెలుసుకోవడానికి రాయలసీమ సాహిత్యం చదవాలి. ఈ నేపథ్యంలోనే రాయలసీమలోని విశేషమైన సాహిత్య సంపదను ఈ శీర్షికలో పరిచయం చేయాలని భావిస్తున్నాను.
*
Thank you sir
మంచి ప్రొరంభం
మోహన్!
రాయలసీమ సాహిత్యం అధ్యయనం ప్రాముఖ్యత గురించి బాగా వ్రాశావు. ఒకానొక ప్రముఖ ఆదివారం ప్రత్యేక అనుబంధంలో కథలు వేసే పత్రిక నేను “నీళ్లింకని నేల” కథను పంపితే రాయలసీమ మాండలికంలో ఉంది వేయము అన్నారు. కథ బావుంది కాబట్టి మామూలు భాషలో రాస్తే వేస్తాం అన్నారు. నేను మాండలికం వదులుకోడానికి ఇష్టపడలేదు. స్థానిక భాషలో వ్రాసినప్పుడే ఆ జీవన విధానాలు చక్కగా ప్రతిఫలిస్తాయి. మంచి వ్యాసం వ్రాసినందుకు అభినందనలు
మంచి పరిచయం