రాయలసీమలో ప్రతిధ్వనించిన ప్రపంచీకరణ

ప్రపంచీకరణను నేరుగా కథలో వివరాలతో పాటు రాస్తేనే గ్లోబలైజేషన్‌ కథ అవుతుంది అంటున్నారు. ఈ తరహా వాదన సరైనది కాదని అనిపిస్తుంది.

నజీవితాల్లోకి సునమీలా విరచుకుపడిన ఉప్పెనే ప్రపంచీకరణ. కొత్తగా దీనికి నిర్వచనం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక్కమాట చెప్పాలంటే ప్రపంచాన్ని కబళించి, సామాన్య మానవుని అస్తిత్వానికే ప్రమాదంగా మారిన విషసర్పం ప్రపంచీకరణ. నెత్తుటిదాహం తీరని రాకాసి ప్రపంంచీకరణ. దీని అత్యున్నత లక్ష్యమే సామ్రాజ్యవాదం. ఏ దేశాన్నైనా పొట్టనపెట్టుకునే విషసర్పం సామ్రాజ్యవాదం. నేడు జరుగుతున్న యుద్దాలన్నీ సామ్రాజ్యవాదానికి సాక్ష్యాలే. సామ్రాజ్యవాద కాంక్ష ఏ దేశంపైనైనా ఉక్కుపాదం మోపుతుంది. మన దేశం అతీతమేమీ కాదు.
ఆనాటి ప్రధాని పీవీ నరసింహారావు  ప్రభుత్వం 1991 ఆగస్టు నెలకంతా సరళీకృత  ఆర్థిక విధానాలు దేశవ్యాప్తంగా అమలు చేసి పూర్తిస్థాయి  సంస్కరణలకు తెరతీసింది. ఈ ఎల్‌పీజి పాలసీ ఎప్పుడైతే అమలుచేయడం ప్రారంభించిందో ఆరోజే దేశభవిష్యత్తు సామ్రాజ్యవాదుల చేతుల్లోకి వెళ్ళింది. దీంతో ప్రజల్లో ఆర్థికఅసమానతలు, అంతరాలు, అసహనం అధికమయ్యింది. ఈ క్రమంలో వచ్చిన మార్పుల్ని సాహిత్యకారులు వెంటనే పసిగట్టగలిగారు. ప్రమాదాన్ని గుర్తించగలిగారు.ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో సాహిత్యఉద్యమాలు ప్రారంభమయ్యాయి. తెలుగు సాహిత్యంలో విస్తృతంగా కవిత్వం కథలురావడం ప్రారంభమైంది. ఈ క్రమంలోనే రాయలసీమ ప్రాంతం కవులు, కథకులు సాహిత్యంలో ప్రపంచీకరణ దుష్ఫ్రలితాలను సమాజం ముందుంచే ప్రయత్నం చేశారు.
ప్రపంచీకరణ వ్యతిరేకంగా వచ్చిన కథాసాహిత్యాన్ని పరిశోధనాత్మకంగా పరిశీలించినట్లయితే కర్నూలుకు చెందిన  జి.ఉమామహేశ్వర్‌ 2001లో రాసిన నిశ్శబ్దవిప్లవం కథ రాయలసీమ ప్రాంతం నుండి వచ్చిన తొలికథగా చెప్పవచ్చు. మనిషితో సంబంధం,  ప్రమేయం లేకుండా మన జీవితాల్లోకి సాంకేతికత చొచ్చుకు వచ్చి మానవసంబంధాలను విచ్ఛిన్నం చేసే ఇతివృత్తంతో ఈకథ సాగుతుంది. ప్రపంచీకరణపై మొదటిచర్చ ఈ కథతోనే ప్రారంభమైంది. ఈ కథ ప్రజాతంత్ర ప్రత్యేక సంచికలో ప్రచురితమైంది. దీంతో ఆగక ప్రపంచీకరణ నేపథ్యంలోనే ‘వాటర్‌’ అనే కథను ఇదే ఏడాది, 2012లో ‘ఒక దళారిపరాభవం’ కథను, 2013లో భరోసా కథను ఈయన రాశారు.
 ప్రపంచీకరణ నేపథ్యంలోనే 2002లో తెలుగు కథాసాహిత్యంలో ప్రకంపనాలు కలిగించిన మరొకకథ సుంకోజి దేవేంద్రాచారి రాసిన ‘అన్నంగుడ్డ కథ’. అన్నంగుడ్డ కథలో వడ్రంగి బతుకు జీవనచిత్రం కనబడుతుంది. ప్రపంచీకరణలో భాగంగా కనుమరుగయ్యే వృత్తి,  తద్వారా  ప్రశ్నార్ధకమయ్యే బతుకు వైనాన్ని కథకుడు ఈ కథలో గొప్పగా రాశారు. గ్రామీణప్రాంత ప్రజల ఆత్మీయత, మమకారాన్ని అన్నంగుడ్డలో మూటకట్టుకు పోతారని మానవసంబంధాలకు ఎంతో విలువనిస్తారని చెప్పేకథగా ఆ ఏడాది ఈ కథ కథా సాహిత్యంలో సంచలనమైంది. ప్రపంచీకరణ ద్వారా అంతరించిపోయే మానవసంబంధాలకు ప్రతీక ఈ కథ.
ఇదే ఏడాది సింగమనేని నారాయణ ‘ఫిరంగిలో జ్వరం’ కథ 2002 ఇండియా టుడే వార్షికసంచికలో రాశారు. సృష్టిలోని సమస్త జీవులు, జాతులు, దేశాలు ఒకటేనన్న సమభావనే నిజమయిన ప్రపంచీకరణ అయితే, ప్రపంచమంతా ఒక కుగ్రామంగా మారిపోయినట్టయితే ఒకే నమూనాలో వస్తువుల్ని ఉత్పత్తి చేయడం తేలికవుతుంది కాబట్టి, ప్రపంచమంతా ఒకే సరుకువాడే గుత్తాధిపత్యాన్ని హస్తగతం చేసుకోవడం ఇప్పటి ప్రపంచీకరణగా మనం భావించాలి. మానవ జీవితానికి దిశానిర్దేశం చేస్తూ నిరాడంబరంగా జీవించే మనిషి ధోరణిని వెక్కిరిస్తూ, సమస్త చర్యల్ని, భావాల్ని సైతం వ్యాపారమయం చేస్తోన్న ఈ మార్కెట్‌  మనిషిని ఎలా ప్రభావితం చేయగలదో రానున్న ప్రమాదాన్ని హెచ్చరిస్తూ చాలా ఏళ్ళక్రితమే సింగమనేని నారాయణ ‘ప్రమాదవీణ’ అన్న కథ కూడా రాశారు.
ఈ దళారీల దోపిడీని ఎంతోమంది కథకులు తమ కథల్లో చర్చించారు. ఈ క్రమంలోనే ఆయన రాసిన ‘అడుసు’ కథ భూగర్భ జలాలకోసం బోర్లు వేయడమనే ఊబిలోకి కూరుకుపోయిన రైతు ఓటమినీ, దిగ్భ్రాంతినీ చెప్పిన కథ. 1991లో అంటే భారతదేశంలో ప్రపంచీకరణ విధానాలు అమలు అయిన ఏడాదిలోనే ఈ కథ వచ్చింది. మార్కెట్‌ వ్యవస్థలోని దోపిడీనీ చిత్రించి, ఆ బురదను అంటించుకోకుండా వుండలేక, కడుక్కోనూలేక ఉక్రోషంలో స్వంత చీనీ తోటను నరికేసుకున్న రైతుకథ ఇది. వర్షాధారిత సేద్యం జూదమనీ, నీళ్లకోసం బోర్లు అనే ప్రలోభం నిరాశే మిగులుస్తుందనీ, దీనికి తోడు మార్కెట్‌ మాయాజాలం రైతును దారుణంగా మోసం చేస్తున్నదనే వాస్తవాలను రికార్డు చేస్తూ, 1990 కంతా దేశవ్యాప్తంగా కమ్ముకుంటున్న రైతు ఆత్మహత్యలనే కారుమబ్బుకు కారణమనే గొప్ప దృష్టికోణంతో ఆయన రాశారు. చీనికాయల దోపిడీ ఎన్ని అంచెలుగా సాగుతుందో వివరిస్తూ చివరికి రైతు నిస్సహాయ పరిస్థితుల్లో కసితో తన పొలంలోకి వెళ్ళి చీనిచెట్లను నరికి వేయడంతో కథ ముగుస్తుంది.
2004లో  వీరగల్లు సంపుటిలో బండినారాయణస్వామి కథరాశారు. కొత్త శతాబ్దంలో రైతు పాతన్నను పరిచయం చేస్తూ మన పనిముట్లనీ చివరికి మన ఆహార పదార్థాలనీ కూడా ఏ దెయ్యం మాయం చేసిపోతోంది తెలుసుకోమంటూ ‘తెల్లదెయ్యం’ అన్న గ్రామ వివక్ష కథ రాశారు. సామ్రాజ్యవాద సంస్కృతి పల్లెల మీద, వ్యవసాయం మీద దాడిచేసి మార్కెట్లను పెంచుకోవడంకోసం లాభాలను ఎలా అర్జిస్తారో తెలిపే కథగా తెల్లదెయ్యం కథ నిలిచింది. వాణిజ్య అవసరాలకు అనుగుణంగా సీమ ప్రాంతంలో పంటల పద్ధతినే మార్చి పారేసింది. పంటల ఉత్పత్తి వినియోగం కోసం కాకుండా కేవలం లాభాలకోసమే అన్న పద్దతి క్రమంగా స్థిరపడిపోయింది. ఈ నేపథ్యంలోనే  2006 ఆదివారం ఆంధ్రజ్యోతిలో చిలుకూరి దేవపుత్ర ‘చివరిమనషులు’ కథ రాశారు.
ఇక కర్నూలు నుండి ప్రపంచీకరణపై డా.హరికిషన్‌ రాసిన చూపు కథ ఆంధ్రజ్యోతి ఆదివారం సంచికలో 2007లో, జి.వెంకటకృష్ణ దారికాచిన దృశ్యం కథ  వార్త 2008 ఆదివారం అనుబంధంలో ప్రచురితమయ్యాయి. ప్రపంచీకరణ దుష్ప్రభావాల్ని వివరిస్తూ శాంతినారాయణ ‘మోహినిమోహనం’ కథ 2006 దీపావళి ప్రత్యేకసంచికలో, ‘కొండచిలువ’ కథ నవ్య వీక్లీ 2013 జూలైలో ‘ఈ పాపం ఎవరిది?’ కథ,  2016 అక్టోబర్‌ విశాలాంధ్ర దీపావళి ప్రత్యేక సంచికలో, ‘అంగడిసరుకై’కథ విపుల డిసెంబర్‌2017 బతుకుబండి కథలసంపుటిలో మొత్తం నాల్గుకథలు ప్రచురితమయ్యాయి. ప్రపంచీకరణ నేపథ్యంలో డా.కె.సుభాషిణి ‘దీపం పురుగులు’ కథను 2006 ఆదివారం ఆంధ్రజ్యోతిలో రాశారు.
2013లో కర్నూలు నుండే పాణి ‘కార్పోరేటమ్మ రాజకుమారుడు’ కథ, ‘శవాలఖజానా’ కథ 2018లో రాశారు. ఈ రెండు కథలు అరుణతారలో ప్రచురితమయ్యాయి. 2016లో కర్నూలు నుండి జంధ్యాల రఘుబాబు నా కొండ కథ సాహిత్య ప్రస్థానం సంచికలోనూ, సెప్టెంబర్‌ 2019 సాక్షి ఆదివారం అనుబంధంలో అనంతపురం నుండి డా.ప్రగతి ‘బెనకలచవితి’ కథను రాశారు. కడపనుండి  అక్టోబర్‌ 2024 సాక్షి ఫన్‌డేలో పాలగిరి విశ్వప్రసాద్‌ ‘హైవే’ కథను రాశారు. రాయలసీమ నుండి ప్రపంచీకరణే వస్తువుగా మూడు కథాసంపుటాలొచ్చాయి. వేంపల్లి గంగాధర్‌ మొలకల పున్నమి 13 కథలతో తీసుకొచ్చారు.ఈ కథలు రాయలసీమ గ్రామీణ జీవితాలను, రైతుల ఆందోళనలను చిత్రీకరిస్తాయి.
ప్రపంచీకరణతో వచ్చిన వ్యవసాయ సంక్షోభం, భూస్వాముల అభిజాత్యత్వం, మహిళల లైంగిక దోపిడీ వంటి అంశాలు ఈ సంపుటిలో కనిపిస్తాయి. ఎండపల్లి భారతి నల్లడబ్బు కథాసంపుటి తీసుకొచ్చింది. ఇందులో ఆర్థిక విలువలు మానవీయ విలువలను మించిపోతున్న ప్రపంచీకరణ దృక్పథాన్ని చూపిస్తుంది. గ్లోబల్‌ క్యాపిటలిజం ప్రభావంతో వచ్చిన అవినీతి, ప్రేమ-ఆర్థిక ఘర్షణలు ఈ కథలో కనిపిస్తాయి. కదిరి మురళిమోహన్‌ రావు రాసిన సిలికాన్‌ వలస, ఇంటర్నెట్‌ మగాడు కథలు ఆధునిక కాలపు వలసజీవితం, సాఫ్ట్‌వేర్‌యుగం, కుటుంబ బంధాల విచ్ఛిన్నం వంటి అంశాలు ఆయన కథల్లో ప్రధానంగా వస్తాయి.
ఇటీవల ప్రపంచీకరణ పరిణామాలు గ్రామీణ ప్రాంతంలో ఉండే వృత్తులను ఎలా నాశనం చేస్తాయో తద్వారా మనిషి, మనిషితో పాటు అంతరించే మానవ సంబంధాలను విశ్లేషిస్తూ కర్నూలు నుండి మారుతీ పౌరోహితం టైలర్‌ శ్యామణ్ణ కథను రాశారు. ప్రపంచీకరణను నేరుగా కథలో వివరాలతో పాటు రాస్తేనే గ్లోబలైజేషన్‌ కథ అవుతుంది అంటున్నారు. ఈ తరహా వాదన సరైనది కాదని అనిపిస్తుంది. ప్రపంచీకరణ నేపథ్యంలో, ప్రభావంలో జరిగే పరిణామాలు చిత్రించిన కథలు కూడా వుంటాయి. ఈ క్రమంలో రాయలసీమ ప్రాంతం నుండి ఇంకా అనేక కథలు వచ్చి ఉండవచ్చు.
*

కెంగార మోహన్

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • చక్కని పరిచయం ప్రపంచీకరణ సమయంలో వచ్చిన కథల గురించి

  • గొప్ప విశ్లేషణ అభినందనలు తమ్ముడు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు