సాధారణ రైతు వాటం గౌరునాయుడు మాస్టారుది- దుక్కి దున్ని విత్తు వేసినట్టే కవిత్వం, కథ రాసారు. పాటలపూల పరిమళాన్నీ ప్రపంచంలోకి ప్రసరించారు. ‘స్నేహకళా సాహితి సంస్థ’ ద్వారా ముప్పై ముప్పైఐదేళ్లుగా చేయాల్సిన గొప్ప పనులేన్నో చేసారు. కొత్త నీరుకి దారి చూపించారు.
1992-93 ప్రాంతంలో మా వూరిలో నా ఎలిమెంటరీ పాఠశాలలో మొదటిసారిగా నేను గౌరునాయుడు మాస్టారుని విన్నాను. మా పద్యాల మాస్టారు నన్ను ఒడిలో కూర్చోబెట్టుకుని ‘పాడుదామా స్వేచ్ఛాగీతం’ పాట పాడుతూ కంజీర వాయిస్తున్న దృశ్యం ఇప్పటికీ నా కళ్ల ముందే వుంది. మాస్టారు రాసిన కళింగాంధ్ర బతుకు కవితలు, కథలూ ఎప్పటికీ నా ప్రేరణలే. అప్పట్లో మాస్టారు రాసిన ‘జీవన్మృతులకు’ కథలోని తడి నాక్కాస్తా అంటుకుని నాలో కవిత్వమై పారింది. ఈ ఏడాది ఆగష్టు ఏడుకి మాస్టారుకి డెబ్భై నిండి డెబ్భై ఒకటిలోకి అడుగుపెడుతున్నారు.
ఒక మానవుడిగా ఏడు దశాబ్దాల మీ జీవితాన్ని, ఐదు దశాబ్దాల సాహిత్య జీవితాన్ని తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుంది ?
ఏడుదశాబ్దాల జీవనయానం ఎన్నెన్నో ఎత్తు పల్లాల ప్రయాణం. ఒక సామాన్య మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో ఎన్ని ఇబ్బందులుంటాయో అన్నీ చూసేను. భూములుండేవన్న మాటేగానీ హైస్కూల్లో చదివినపుడు పుస్తకాలు కొనడానికి కూడా మా బావు(నాన్న) అప్పుచేయక తప్పేది కాదు. నా చదువు ఇంటర్తో ఆగిపోయింది. అక్కడ్నించి వ్యవసాయంల. తరువాత ప్రైవేటుగా పరీక్షలు రాసి ఉద్యోగంలో. నేను ఉద్యోగంలో ఉన్నా మాబావుకి అప్పులు చెయ్యడం తప్పేది కాదు. నాకు తెలిసి మావూళ్ళో అప్పులేని రైతు లేడు. ఎక్కడో రాసుకున్నాను హరిశ్చంద్రుడికి ఒకడే నక్షత్రకుడు, మా బావుకి మా బావులాటి రైతులకి నక్షత్రకులెందరో. ఉద్యోగం చేస్తున్నా ఆర్థికంగా బాగా లేదెప్పుడూను.
కాని నా సాహిత్య జీవితానికి ఆర్థిక ఇబ్బందులు అడ్డంకి కాలేదు. వ్యవసాయ జీవితం నాకు చాలా పాఠాలు నేర్పింది. ముఖ్యంగా బ్రతుకును ప్రేమించడాన్ని నేర్పింది. సాహిత్యం నాలోకి నేను చూసుకుని నన్ను నేను ప్రశ్నించుకునే శక్తినిచ్చింది. సంస్కారాన్ని నేర్పింది. నిజానికి నన్ను మనిషిగా నిలబెట్టింది. వెనక్కి తిరిగి చూసుకుంటే సాధించిన దాని సంగతేమో గానీ నాదైన చిన్న ప్రపంచంలో జీవితం సంతృప్తిగానే గడిచింది.
మీ కవిత్వం, మీ కథ నడిచిన క్రమంలో గొప్ప ఆనందం వేసిన సందర్భం, విషాదం పుట్టిన సందర్భం- ఈరెండింటి నేపథ్యాలు చెప్పండి ?
సాహిత్య జీవితంలో గొప్ప ఆనందం కలిగిన సందర్భమేదైనా ఉందంటే అది గురువుగారు కథాదీపధారి కాళీపట్నం రామారావు మాష్టారి పరిచయం. ఆయన ప్రేమను పొందడం. ఆతరువాత నాకు చా.సో స్ఫూర్తి సాహిత్య పురస్కారం ప్రకటించడం. ముందు భయపడ్డాను, గురువుగారు కా.రా మాష్టారితో ఈ విషయం చెబితే “తప్పకుండా వెళ్ళి తీసుకో, ఆరోజు సభకి నేను వచ్చి ముందువరసలో కూర్చుంటాను” అని ధైర్యం చెప్పేరు. నా సాహిత్యజీవితంలో గొప్ప ఆనంద క్షణాలవి. అలాగే నా ఉద్యోగవిరమణ సందర్భాన్ని సాహిత్య సందర్భంగా మలుచుకుని ‘ఆగష్టు 7 ఒక సాహిత్యసందర్భం’ అంటూ గొప్ప ఉత్సవంలా జరిపింది స్నేహకళాసాహితి. ఆ సభలోనే కా.రా మాష్టారి చేతులమీదుగా ‘రావిశాస్త్రి రచనా పురస్కారం’ స్వీకరించడం గొప్ప సంతోషాన్నిచ్చింది.
ఇక విషాద సందర్భాలంటే ఏమీ లేవు గానీ చా.సో, రా.వి.శాస్త్రి గార్లతో కనీస పరిచయం లేకపోవడం నా వరకు నాకు గొప్ప లోటు. అది విషాదమే. కరోనా కారణంగా గురువుగార్ని కడసారి చూపుకి నోచుకోకపోవడం ఎప్పటికీ తీరని విషాదమే.
మీ సృజన ప్రధానంగా రైతు కేంద్రంగా నడిచింది. ఇప్పటి కళింగాంధ్ర రైతుని ఎలా నిర్వచిస్తారు. ఇంకా రైతు కేంద్రంగా ఎలాంటి వస్తువును తడమాల్సి వుంది ?
ఔను.. నా సాహిత్యానికి కేంద్రబిందువు రైతే. నా కథల్లోని రైతు కేవలం ఒకట్రెండు ఎకరాల సొంత దారుడుమాత్రమే. అప్పుల ఊబిలో ఊపిరాడని అత్యంత దయనీయమైన జీవితాన్ని గడుపుతూనే ఆత్మాభిమానం వొదులుకోలేనివాడు. చివరికి పరప్రాంత సంపన్న వర్గాలవారి రాకతో తన నేలకు దూరమైనవాడు. వలసపక్షయి పట్నం దారి పట్టిన అభాగ్యడు. వలసపోయినవారు పోగా ఇప్పుడు మా ఊళ్ళో కొద్దోగొప్పో భూములున్న రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేస్తూ బాగా ఉన్నట్టు అనిపిస్తున్నా వారి మాటల వెనక లీలగా వినిపించే నిరాశ, కళ్ళలో నీలినీడలు వ్యవసాయం గిట్టుబాటు కావట్లేదనే చెప్తాయి. అయినా తప్పనిసరి తంతుగా మారిపోయింది వ్యవసాయం.
ప్రస్తుత రైతు జీవితాన్ని చిత్రించలేకపోవడానికి అక్కడ నేను లేకపోవడం . ఇప్పుడు రైతు జీవితం చిత్రించాలంటే ఆధునిక వ్యవసాయ పద్ధతులతో పరిచయం ఉండాల్సిందే. దూరాన్నించి చూసి రాద్దామంటే కుదిరే పని కాదు.
ఒక రైతుగా, ఒక ఉపాధ్యాయుడిగా, ఒక సాహిత్య జీవిగా బతికారు- ఈ మూడింటి మిశ్రమంలో మిమ్మల్ని మీరు ఎలా నిర్వచించుకుంటారు ?
నా యవ్వనారంభపు వ్యవసాయ దినాలు ఉత్సాహంగానూ, ఉల్లాసంగానూ గడిచేయంటే పని చేయడమే తప్ప ఇంటి బాధ్యత లేకపోవడమే. నేను ఎక్కువ సంతోషంగా గడిపిన కాలమేదైనా ఉందంటే అది అప్పటి వ్యసాయసాయంలో ఉన్న కాలమే. మా బావు అప్పులోళ్ళతో బాధపడటం భరించలేక పోయేవాడిని. చాలా దుఃఖంగా ఉండీది. కానీ ఏమీచేయలేని అశక్తత. అది అందరి రైతులకి సాధారణమే అప్పుడు. బాధే సౌఖ్యమని భావించు కోవలసిన స్థితి అది.
ఇక ఉపాధ్యాయుడుగా గిరిజన పిల్లలతో ఆడుతూ పాడుతూ హాయిగా సాగిపోయింది. ఆ పిల్లల మధ్య కాలం తెలిసేది కాదు. నా తరగతిగది ఒక కళావేదిక. ఉంటే పిల్లలతో పాఠాలతో, పాటలతో, లేదా బడితోట పనిలో. కొన్ని నేను సహించలేని, నాకిష్టంలేని, దుర్భరమైన సన్ని వేశాలున్నా గానీ ఉద్యోగజీవితం గిరిజనపిల్లల మధ్య చాలా అద్భుతంగా సాగిందనే చెప్తాను. .
సాహిత్యజీవితమూ చాలా సంతృప్తికరంగానే ఉంది. నా రాతలకు నా పాఠకులెవరో, ఎలా స్వీకరించే వారో నాకు తెలుసు. ప్రయోగం కంటే ప్రయోజనం ముఖ్యమని నమ్మినవాడిని. నా పరిమితీ, నా పరిథీ నాకు తెలుసు గనక ఎప్పుడూ బాధపడే పరిస్థితి ఎదురవ్వలేదు సరికదా చాలా గౌరవాన్నే పొందేను.
వ్యవసాయమూ, ఉపాధ్యాయవృత్తీ ఈ రెండూ రచయితగా నన్ను మంచి స్థానంలోనే నిలబెట్టేయి. నేను ఎప్పుడూ రైతు, నాగలి, పొలము వీటిగురించే రాస్తుండడం వల్ల నువ్వు ’అప్ టు డేట్’ కావాలని నా మిత్రుడంటాడు, కానీ కాలేను, కావాలనీ లేదు. నన్ను నేను నిర్వచించుకోమంటే ‘ఎప్పటికీ పల్లెతనం వొదులుకోలేని అత్యంత సాధారణ అక్షర ప్రేమికుడ్ని.’
రాబోతున్న మీ కొత్త పుస్తకం ‘నాగావళి నడకలు’ వంద ఎపిసోడ్ లు రాసే క్రమంలో పనిచేసిన బలమైన చోదకశక్తి ఏది ?
నాగావళి నడకలు రాయడానికి మొదటి కారణం ప్రఖ్యాత తెలంగాణ కథకుడు, మిత్రుడు తుమ్మేటి రఘోత్తమ్ రెడ్డి. “ఫేస్ బుక్’’ లో నా వాల్ మీద ఏదైనా సీరియల్ గా రాయగూడదూ, నీ ఇష్టం ఏది రాసినా ” అనన్నాడు. ‘నిజమే ఎందుకు రాయకూడదూ’ అని వారానికొక రోజు ప్రతి ఆదివారము ఉదయమే నాకేది అప్పటికి స్ఫురిస్తే అది రాసేవాడిని. అలా వంద ఎపిసోడ్లు సాగేయి. ప్రత్యేకంగా చోదకశక్తి అనడానికేమీ లేదు. ‘నాగావళినడకలు’ అని శీర్షిక పెట్టింది కూడా ఆయనే. మిత్రుడు రఘోత్తమ్ కి కృతజ్ఞతలు చెప్పుకోవాలి.
మీరు వ్యవస్థాపక అధ్యక్షుడిగా 1992 లో ‘కురుపాం’లో ఏర్పడిన ‘స్నేహకళాసాహితి’ తదుపరి ప్రయాణం, పరిణామం ఎలా వుండాలనుకుంటున్నారు ?
నేను కురుపాం లో ఉన్నపుడు మిత్రులం రోజూ సాయంత్రాలు కలిసేవాళ్ళం. ఆ కలయికలే సంస్థ ఏర్పాటు చేసుకోడానికి ప్రేరణ. సంస్థ అద్భుతంగా నడిచింది.. నడుస్తోంది ఇప్పటికీ. ఇప్పుడు మంచి రచయితలుగా కవులుగా చిత్రకారులుగా గుర్తింపు గౌరవం పొందుతున్న మిత్రులు చింతా అప్పల నాయుడు, సిరికి స్వామినాయుడు, మల్లిపురం జగదీశ్, పక్కిరవీంద్రనాధ్, చందనపల్లి గోపాలరావు, పల్లరోహిణీకుమార్ స్నేహకళాసాహితి నుండి వచ్చిన వారే. పాలకొల్లు రామలింగస్వామి, జాగాన సింహాచలం వంటి మిత్రులు అప్పటికే సాహిత్య రంగంలో ఉన్నవారు.. స్నే.క.సా తితో కలిసి నడిచేరు. ముఖ్యంగా స్నే.క.సా ఇన్నేళ్ళూ ఎన్నెన్నో సాహితీ కార్యక్రమాల్ని నిర్వహించడంలో, ముప్పైకి పైగా పుస్తకాలు ప్రచురించడంలో నిశ్శబ్దచోదకశక్తి సోదరుడు గడగమ్మ రామకృష్ణ (శాంతి). ఇక ముందుకూడా ఈ మిత్రులు సంస్థను అదే దారిలో ముందుకు తీసుకెళ్తారని నా నమ్మకం.
*
Add comment