రాత్రి చితిని మండించిన ‘నల్ల పద్యం’

ల్ల ద్రాక్ష, నల్ల సూర్యుడు, నల్ల పిల్లి, నల్ల బంగారం, నల్ల మందు, నల్ల వజ్రం, నల్ల దొర….. సాంఘిక జీవనం, జాతి వివక్షత, లౌకికవాదం, నిరంకుశత్వం, జాతి సంపద, ఆర్థిక అంశాలను ప్రభావితం చేసిన పదాలు. లోకం పోకడను ఎరుకపరుస్తూ మన మధ్యకు వచ్చి చేరిందిప్పుడు ‘నల్ల పద్యం’. నలుపంటే చీకటి. నల్లటి మబ్బుల్ని చీల్చుకుని కురుస్తున్న వర్షపుధార. తడి నేలపై చల్లుతున్న ఆశల విత్తనాలు. వేదనతో పండిన గుండెను సంధిస్తున్న సమస్యల బాణాలు. వెలుగు కోసం తపన. కరుగుతున్న కాలంపై వెలుగుతున్న కొవ్వొత్తి. చాయ్ చప్పరింతలే కాదు, లోలోన మరుగుతున్న తలపోత. రాత్రి చితిని మండించిన కవితా సంపుటి పిన్నంశెట్టి కిషన్ ‘నల్ల పద్యం’. అక్కడక్కడ కొంత నిరాశవాదం కనిపించినా, తనలో అంతర్లీనంగా ఉన్న మంచితనాన్ని కవిత్వీకరించిన కవితలివి. మన జీవితాల్లోనూ, మన జీవన విధానంలోనూ తమ నిస్వార్థ, నిష్కామ చర్యల ద్వారా అసాధారణ మార్పులు తీసుకువచ్చిన తీరును విశ్లేషించిన పద్యాలు. జీవితం మరయంత్రంలా కొనసాగుతుందని తెలుసుకుని, చావును ప్రేమించిన కవి. రకరకాల సంఘటనలకు స్పందించిన కవి హృదయం. హృదయ విదారకమైన కవితలే కాదు, జీవించడం నేర్పిన కవితలు ఈ సంపుటిలో చోటు చేసుకున్నాయి.

కవిత్వం రాయడానికి ముందు జీవితాన్ని ప్రేమించినవాడు కిషన్. జీవితంలోంచి కవిత్వాన్ని వెతుక్కున్నాడు. రంగు రంగుల ప్రపంచాన్ని చూడాలన్న తపనతో కొంతకాలం కుంచె పట్టాడు. కుంచె కాస్తా కెమెరాగా మారి కంటికి గురిపెట్టిన లెన్సును సరిచూసుకుని దృశ్యంవైపు దృష్టి సారించాడు. ఎందుకో ఏమైందోగానీ అకస్మాత్తుగా కథకుడిగా అవతారమెత్తాడు. ‘లేంబాళవాటిక కథలు’ రాసి వేములవాడ ఊరి ప్రజల హృదయాలనే కాకుండా ఎంతోమంది కథకులను ఆశ్చర్యపరిచాడు. కథ రాసినా, కవిత్వం చెప్పినా, చిత్రం గీసినా, ఫోటో అందించినా ప్రకృతిని మనముందు నిలిపే ప్రయత్నం చేశాడు. ప్రకృతితో మమేకమైన జీవితాన్ని ఆవిష్కరించడానికి తపనపడ్డాడు. కథల్లో కవిత్వం కనిపిస్తుంది. కవిత్వంలో కథనం కదులుతుంది.  రెండింటిలోనూ ప్రకృతి దృశ్యాలు కోకొల్లలు. చావును ప్రకృతిగా మలిచాడు. ప్రకృతిప్పుడు హరించుకుపోతున్న హరిత స్వర్గం. ‘జ్ఞాపకగూడుల్లోనే పురుడు పోసుకోవడం/కన్నీటి అక్షర రెక్కలయ్యే విచ్చుకోవడం/ మరణమంటే మరింకేం కాదు/ ప్రకృతే’ అని ‘మరేంలేదులే’ కవితలో తలపోస్తాడు. తనను కలచివేసిన ఓ పదకొండు సంఘటనలకు సంబంధించి కవితలు ఇందులో ఉన్నాయి. దీన్ని బట్టి కవి క్రియాశీలక గమనంలో పయనిస్తున్నాడని తెలుసుకోవచ్చు. వర్తమాన అంశాలపై స్పందిస్తున్నాడని అనుకోవచ్చు. మనిషిలోని మానవత్వాన్ని ప్రేమిస్తూ, ఆ ప్రేమను కవిత్వానికి అప్పగించిన తీరు తన కవితల్లో కనిపిస్తాయి. జనశక్తి అమర్ జైలులో ఉన్నప్పుడు మిత్రత్వం కాస్త ‘రహస్యతంతి’గా మారింది.

‘మన ఊరి చెరువునీళ్ళను/దోసిళ్ళలోకి తీసుకొని వేరు చేయగల్గితే/ నీళ్ళతో పాటూ/ నీ కోసం కార్చిన కన్నీళ్ళు కనిపిస్తాయి/ అమ్మతోడు ఇదే సత్యం’ అంటూ ఫినిక్స్ పక్షిలా ఎగిరి జైలుగోడలపై వాలుతాడు. మరో కవిత ‘చెల్మ’లో మరో మిత్రుడి పెళ్లిని ప్రేమైక జీవనంతో సృశించాడు. ‘జులాయి తిరుగుళ్ళకి చిరిగిన జీవితపు అంగిని/సింగిడి దారాల్లో కుట్టి/రంగుల మయం చేసింది/నీవేనని/నాకింకా జ్ఞాపకమే’ అని స్నేహమాధుర్యానికి తలవంచాడు. చెలిమి చిత్తరువును తుదిశ్వాస వరకూ పదిలపరుచుకుంటానని మాటిచ్చాడు. స్నేహం, ప్రేమ, బంధుత్వానికి తాను ఇచ్చే విలువ కవిత్వాన్ని మించిపోయిందని ఎరుక పరుస్తాడు. ‘పట్టుమని పది పదాలు పట్టుకోలేకున్న/నీవు లేవన్న భావన వుంటేకదా/ ఎలిజీ రాయడానికి’ అని జన్మనిచ్చిన బాపుకు ఉత్తరం రాయడానికి ప్రయత్నిస్తూ, గుండె దిగూట్లో వెలిగించిన వెలుగుదీపంగా మలుచుకున్నాడు. తన తల్లిని కూడా అంతే ఆర్తితో కవిత్వంలో భద్రపరుచుకున్నాడు. ‘దేహమే నీ తోడు/గాటుపడకుండా కాపాడుకోమని అమ్మ వాక్కును తలుచుకుంటూ యాదికొస్తున్న అమ్మను ప్రతిష్టించుకుంటాడు. సాదుకున్న కుక్క మోగ్లీ, కేరళ విలయం, ఎసిబి దాడులు, కామ్రేడ్ జక్కని రాజయ్య, మామలేని అత్త, పులి ఎంక్లోజర్లో వ్యక్తి పడినప్పుడు, బాలమురళీకృష్ణ మరణం, ఆర్టీసీ సమ్మె, దళితుడ్ని కొట్టడం….. తదితర సంఘటనలపై స్పందించడం వెనుక జీవితంలో ఘర్షణ, భావోద్వేగాలు, మంచి జీవితం కోసం ఆరాటం ఉన్నప్పుడు కవిత్వం వస్తుందనడానికి ఉదాహారణాలు. సామాజిక స్థితిలోని వైరుధ్యాలు, మానవాంశ, గతానికి వర్తమానానికి సంఘర్షణనూ, సంక్లిష్టతనూ గుర్తించిన తీరును స్పష్ట పరుస్తోంది. వ్యక్తికీ, సమిష్టికీ మధ్య అంతస్సంఘర్షణను వైయుక్తిక ప్రతిభతో చిత్రించిన కవితలివి.

మన చుట్టూ ఉన్న జీవితంపై తాత్విక భావననూ లేదా చైతన్యాన్ని కవిత్వపరంగా, ఏకోన్ముఖంగా అభివ్యక్తం చేసిన కవితలు ‘నల్ల పద్యం’లో కనిపిస్తాయి. ‘యుద్ధానంతర దృశ్యం’ అందులో ఒకటి. ‘భరోసా లేని రేపును తలుచుకుంటూ ‘అప్పుడేనా’ అంటాడు వాడు’, ’రేపు బ్రతకడానికి ఒక కారణం కోసమో ఏదైనా అక్షరం కోసమో/ నిషాన్వేషణ చేస్తూ/ రాని నిద్రలోకి జారుతాను’. అంతర్మథనం, మోసం, కాపట్యం, నయవంచనలను ఎండగడుతున్న కవిత. సమాజంలోని వేడిమి, క్లిష్టత, సంఘర్షణ నేపథ్యంగా ఉన్న ‘రెండు ‘నేను’లు’ కవితలో ‘ఎవడన్నాడు ‘నేను’ ఒంటరినని/మహా సమూహాన్ని నేను/స్వైరవిహారాన్ని నేను/విరుద్ధభావాల/విభిన్న ఘర్షణల/సమాహారాన్ని నేను/పరివర్తనాసారాన్ని నేను’ అని ప్రకటించుకున్నాడు. మంచి శైలి, శిల్పంను కలిగివున్నకవిత. ‘విధ్వంసక దృశ్యం’లో రక్తమోడుతున్న విహంగాల విహ్వలిత దృశ్యం కనిపిస్తుంది. అమానవత్వానికి, భౌతిక, మానసిక హింసకీ, హక్కుల రాహిత్యానికి ఆదివాసులు గురవుతున్న తీరును విశ్లేషించాడు. దండకారణ్యంలో వసంతం మళ్లీ వస్తుందని, పచ్చదనాల వనాలు వికసిస్తాయని, మోదుగుపూలు పూస్తాయని కవి ఆశావహ దృక్పథంతో రాసినది. ‘రంగువెలిసిన గోడపై బల్లిలా/గడియారం/కాలాన్ని మింగేస్తూంటుంది’ (పూరింపబడని ఖాళీలు), ‘వ్యక్తిని వస్తువుగా మార్చి విలువకట్టే/ మార్కెట్ మాయాజాలమా/ కళ్ళెంలేని కోర్కెల గుర్రాల మీద ఊరేగా మనమేనా’(బోనులో వాడు), ‘ధరణి దేహంలో నిన్ను నీవు విత్తుకోవడం/‘మాను’ధర్మంతో మనుగడించడమే’(హరితమై ఇల హర్షించగా) వంటి పంక్తుల్లో కన్నీటి బిందువులు, చెమట చుక్కలు కనిపిస్తాయి. సంపద సృష్టికర్తలు, ఉత్పత్తి శక్తుల వెనుక ఉన్న కార్యకారణ సంబంధాలను విప్పి చెబుతాయి.

‘నల్ల పద్యం’ సంపుటి నిండా వస్తు వైవిధ్యం పరుచుకొని ఉంది. ఏ కవితను ముట్టుకున్నా న్యాయం, నైతిక ప్రశ్నలు కందిరీగ తుట్టెను కదుపుతున్నట్లుగా ఉంటుంది. ఆశావాహ చైతన్యాన్ని మన శ్వాసగా చేసి జీవితంపై ఉత్సాహం కలిగించిన కవితలు. తోటి మనిషిని అర్థం చేసుకోవడానికీ, నీలో నువ్వు చూసుకోవడానికీ తోడ్పడటమే కాకుండా, ఆలోచనా క్రమాన్నీ, ఓ క్రొత్త తొవ్వను చూపిస్తాయి. భిన్న మనస్తత్వాలు, మళ్ళీ మళ్ళీ చదివించే కవితలు….. ప్రతిమ-నేను, నథింగ్ నెస్, లెట్స్ ఎంజాయ్, చిరాయువులు, కాటగలిసిన వూరు తదితరమైనవి. ఆయా కవితల్లో అక్కడక్కడ సింబాలిజం, ఇంప్రెషనిజం వంటి శిల్పరీతులు అగుపిస్తాయి. తెలంగాణ మలి ఉద్యమంతో తిరిగి ఊపిరి పోసుకున్న కవిత్వంతో కవుల ప్రపంచంలోకి అడుగిడిన పిన్నంశెట్టి కిషన్, తనకంటూ పాఠకులు ఉన్నారన్న అచంచల విశ్వాసంతో  ఈ సంపుటిని తీసుకువచ్చాడు. మనస్సుకు పట్టిన మబ్బులను తుడిచేయడం, రక్తం స్రవిస్తున్న గుండె గాయాలకు మలాం పూయడం, సమసమాజమే లక్ష్యంగా సాగిన ఈ ‘నల్ల పద్యం’ను అక్కునజేర్చుకుందాం.

*

కోడం పవన్ కుమార్

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు