రాత్రిలోయల్లో అపర్ణ రహస్య సంచారం ‘జెన్నీ’

లోచనల్లో పచ్చిదనం, మనసులో వెచ్చదనం, ప్రేమ తాలూకు నగ్నరూపాల చిత్రసౌందర్యపు అన్వేషణ- ఇవన్నీ కలిస్తే ‘‘జెన్నీ’’.

ఇంతకీ ఈ జెన్నీ ఎవరు?

ఇంకెవరు, కవయిత్రే. అపర్ణ తోట.

కాదంటే, ఆమె లోపలి గొంతుక. ఆమె పెద్దక్క. బుజ్జి చెల్లి. లాలించే అమ్మ. బోధకురాలు. స్నేహితురాలు. ఆంతరంగికురాలు.

అపర్ణ తనలోని జెన్నీతో నిరంతరం మాట్లాడుతుంది. పోట్లాడుతుంది. నిరసిస్తుంది. హత్తుకుంటుంది. అక్కున చేర్చుకుంటుంది. జెన్నీతో ఇన్నేళ్ల జర్నీలోని అనుభవాలనే అక్షరాలుగా మార్చి ‘‘జెన్నీ’’ అనే కవితాసంపుటిని మన చేతుల్లో పెట్టింది. కాదు కాదు, ఆ అనుభవాల సాంద్రతర సాన్నిహిత్యాన్ని అపురూపమైన గిఫ్టుగా మనకందించింది.

ప్రతి కవితలోనూ ఒక రాత్రి రహస్యంగా దాగి ఉంటుంది. నిద్రలేని, నిద్రరాని రాత్రుళ్ల సామూహిక ఆలోచనాగ్ని బుసలు కొడుతూ ఉంటుంది. లేని, రాని తోడుకోసం ఊహల్లో యుద్ధక్షేత్రాల్ని నిర్మిస్తూ ఉంటుంది. వచ్చి, మెచ్చి అల్లుకుపోయే ఆత్మీయనేస్తం కోసం పెదాలపై వీడని నవ్వుల మొగ్గలు పూయిస్తూ ఉంటుంది. చీకటి కనుమల్లో దగ్ధమవుతున్న భావపరంపరను మెట్రో సాక్షిగా తూకం వేసే ప్రయత్నం చేస్తూంటుంది.

తన లోపలి అద్భుత మాయా ప్రపంచం గురించి తనే ఆశ్చర్యపోతుంది. ఆ లోకం అందరిలోనూ ఉంటుందని కవిత్వ కంఠంతో దండోరా వేస్తుంది.

అపర్ణ కవిత్వంలో సాంప్రదాయిక ఎత్తుగడలూ సాత్వికాభినయ నడకలూ ఉండవు. అసలు ఏ ఆనవాలూ లేని వాతావరణ పొరల్లోంచి ఆమె కవిత అదాటుగా దూసుకొస్తుంది. చెప్పాలనుకున్న విషయాన్ని మెరమెచ్చులు లేకుండా అత్యంత సహజంగా, నిసర్గ సుందరంగా ఒంపేసి నిష్క్రమిస్తంది…

‘‘అది నీ దేశం

వారు నిన్ను రాణిని చేశారు’’.

అదే సమయంలో నిగూఢంగానూ ఉంటుంది; సంకేతభరితమై సంక్లిష్ట సందర్భాలను నర్మగర్భంగా వల్లె వేస్తూ ఉంటుంది…

‘‘గులాబీ బుక్క చల్లే దారిలో పడ్డావు నువ్వు

అదే దారిలో కాగితం పూలు తయారు చేసి అమ్ముకుంటున్నాను నేను

ఒక్కసారి చూసిస్తానని నా పూలు లాక్కుని చించేసేవారు ఇక ఎవరున్నారు?’’ (కాగితంపూల కాలం).

అపర్ణ కవిత ముగిసినచోట… మనం మొదలవుతాం. మనలోని జెన్నీ నిద్ర లేస్తుంది. అపర్ణను మాయం చేసి, తను గొంతు సవరించుకుంటుంది. కవి వదిలివెళ్లిన వస్తుసామగ్రిని భుజాన ధరించి, దండోరా  మోగిస్తుంది. సరికొత్త ప్రకటనలతో లోకానికి మేలుకొలుపు గీతం పాడుతుంది. లోకులు ఏమేరకు ఆ సారాంశాన్ని తమ రెక్కల కింద పొదువుకుంటారనేది అప్రామాణికం. గుండెల్లో ప్రతిధ్వనిస్తున్న ఆ చప్పుళ్ల ప్రకంపనలు మాత్రం వీధుల వెంట మార్మోగటం ఖాయం.

‘‘ఈ అక్షరాల అల్లికెంత తేలికో

వాటి వెనక ఆలోచనలు అంత బరువని

గాల్లో కందిరీగలు గీసిన గీతల్లా

శబ్దం రాని గజిబిజి అరుపులు’’

*****

రాత్రి వేరు, నిద్ర వేరు. రాత్రయినంత మాత్రాన మనిషి నిద్రలో మునిగిపోతాడన్న గ్యారెంటీ లేదు. ‘కాలం చేసిన గాయాలకి/ కలత రాత్రులే చల్లని లేపనా’లైన సమయాన దేహం తాత్కాలిక మోక్షాన్ని కౌగిలించుకు పడుకుంటుంది.

‘‘ఈ శరీరం

నిద్రలోకి దూరిన నత్త

మరి ఆత్మ…

విప్పారిన రాత్రుళ్లలో వికసించిన కలువ’’ (నిద్ర వెర్సస్ రాత్రి).

మనశ్శరీరాలను ఆత్మసాక్షిగా రాత్రుళ్లలో మేలుకొలిపేందుకు కవి చేసిన సాధన అమూల్యం. ‘నిదురరాని రాత్రులు’ ఎంత నిస్సారంగా ఉంటాయో నిర్వచిస్తారు. స్పర్శ కోసం వెతుకులాట, పెనుగులాట, దేహంలో మండే కుంపటి, నిశ్శబ్దంగా బద్దలయ్యే ఆక్రందన, భరించక తప్పని బాధామయ జ్ఞాపకాల మధ్య ఆ రాత్రులు పేలవంగా చీకట్లో లీనమయ్యే శబ్దాన్ని ఆ అక్షరాల మధ్య వైనంగా కూరి, అందిస్తారు.

‘‘తెలిసీతెలియని స్తబ్ధపు నువ్వు

అజ్ఞానపు మొద్దు అంచుల్ని

సూటిగా అరగదీసి ప్రశ్నలతో నేనూ!’’ (నిజమే రాయాలిక)

‘‘ఆ ఇయర్ ఫోన్స్ తీసేయరాదూ

చివరగా ఈ రహస్యాన్ని చెప్పిపోతాను

నువ్వో ఎడారివి నేనో సముద్రాన్ని’’ (After all, You are a faded memory)

‘కట్టు తెంచుకున్న మదపుటేనుగు దారంతా ఎడాపెడా తొక్కుకుంటూ పోతున్న’ మాదిరి  ఒకరు; ‘వేయి తలలున్న కొండచిలువై నోరంతా తెరచి మింగెయ్యటానికి’ సిద్ధంగా ఉన్న ఇంకొకరు కలిసి… పరాయి రాత్రుల పరువాల ఒడిలో దగ్ధమవుతున్న అత్యాధునిక స్వేచ్ఛాక్షణాల్ని ఇంత లోతుగా కవిత్వీకరించటం తేలికైన విషయం కాదు. దారుణమైన ఈ పోరాటంలో విడుదలయ్యే నిశ్వాసాలు ఒంటరి మధ్యాహ్నాలలో తాళం వేసే చప్పుళ్ల స్మృతులూచే ఈ పాదాల్ని అధ్యయనం చేయాల్సిందే.

‘‘సంభాషణలన్నీ ఏ చెరువులోనో తర్పణమొదిలాక

నడుము బిగించి, పిడికిలి సంధించి

నినాదాలు పాడుతూ ఒంటరి కవాతు చేయాలి’’ (ఆప్ కీ కసమ్).

జీవితాన్ని బలహీన క్షణాలు కబళించిన వేళల్లో వ్యక్తిత్వ హననం పిల్లిలా పరిగెత్తుకొచ్చి, పక్కలో దూరి పరిహసిస్తుంది. ఆ పరిహాస ధ్వనులు మనసును తాకకపోతే తనను తాను కోల్పోక తప్పని ఘడియలు ఒళ్లు విరుచుకుంటాయి. ‘సిద్ధాంతాలూ అర్ధాంతరాలూ ఆపేసి నీతో నాలానే ఉంటా’నని ఆ రాత్రుల్లో స్వీయ ప్రమాణం స్వీకరించినప్పటికీ ఆ మత్తులో చిత్తవ్వక తప్పని తడబాటు క్షణం ఒకటి హేళన చేస్తుంది. ఆ హేళననే ఆమె ఇష్టంగా దాచుకుంటుంది. ఈ సంఘర్షణాత్మక సంధికాలంలో ‘లౌక్యాన్ని కిటికీలో నుండి పారేసి’ సుస్పష్టంగా ఒక ప్రకటన చేస్తుంది…

‘‘చెప్పానుగా ఈ రాత్రి నేను నాలానే ఉంటాను

కలలో ఇచ్చిన మాట గుర్తుంచుకుంటాను!’’ (నీతో… నాలానే ఉంటాను).

అపర్ణ కవిత్వం అత్యాధునిక రణగొణ వేషభాషల మెట్రోవ్యాకరణ ప్రకరణలకు మాత్రమే పరిమితం కాలేదు. ఆ కాంక్రీటు వనాల మధ్య స్వేదం చిందించే శ్రామిక జీవన సౌందర్య మూలాలనూ స్పృశిస్తుంది…

‘‘ఆ సందు చివర కట్టేసిన ఒంటరి టీ స్టాల్

జ్వరపడినా తల నిండా ముసుగేసుకుని అడ్డా వద్ద

ఎదురు చూస్తున్న కూలీలా మారిపోతుంది’’ (పేపర్ కప్పుల కబుర్లు).

ఆ సంక్షుభిత జీవనగమ్యాల్ని సజీవంగా నిలుపుకొనేందుకు జతగాళ్లందరూ కలిసి ‘ఆలస్యమైపోయిందంటూ పూర్తికాని మాటలను కప్పులలో నలిపి’ ఇటువైపు విసిరి వెళ్లిపోయే సందర్భాలను కవిత్వంతో ఆవిష్కరించారు. ‘పగలంతా ఎంగిలి చేసి వదిలేసిన/ కబుర్లను చెప్పుకుని/ రాత్రికి వీడ్కోలునిద్దా’మని తీసుకున్న నిర్ణయాన్ని ప్రకటిస్తారు.

రెండు వేల యేళ్లుగా పట్టి పీడిస్తున్న జోగిని, మాతంగి వంటి వ్యవస్థలపై పదునైన కవితాగ్రహం ప్రకటిస్తుంది. ఆ దుర్మార్గపు క్రీడలో ‘నగ్న శరీరాలూ ఊచకోతలూ/ శీలాల రథయాత్రలూ/ హార్మోన్ల ధిక్కరింపుల’ రోదనల్ని మనకు వినిపిస్తుంది…

‘‘పురిటిండ్లనీ పాలిండ్లనీ

తాళిబొట్టునీ కాలిమెట్టెలనీ

ఊరేగించుకుందాం’’ అంటూ నిరసన ప్రకటిస్తుంది.

కొన్ని సామాజిక స్థితిగతులు చిరకాలంగా స్త్రీని కించపరుస్తూ ఉన్నాయి. శారీరక సహజ వికాసాన్ని కూడా హేళన చేసే వ్యాఖ్యానాలు మాటబద్ధమై పాతుకుపోయాయి. మగపిల్లాడి ఎదుగుదలను ముచ్చటగా స్వీకరించే వ్యక్తులు… ఆడిపిల్లల్ని మాత్రం వక్రపుచూపుల్తో దర్శిస్తుంటారు. మలి వయసులోనూ మహిళల్ని తూలనాడుతుంటారు. చతుర్లాడుతున్న నెపంతో మానసిక వికారాన్ని సంతృప్తి పరుచుకుంటుంటారు. అలాంటి వేటగాళ్లను అపర్ణ ఉతికి ఆరేస్తుంది. అవన్నీ నిరర్థక చర్యలంటుంది…

‘‘దేహం ముందుకూ వెనక్కూ పొంగి పొడుగ్గా సాగింది

పెదాలు ఎర్రబారినై  కళ్లల్లో మెరుపులు వచ్చినై

ఆగి ఆగి వెళ్లేవారినుండి మా అమ్మ నన్ను బాగానే కాపాడుకుంది’’ (వయసొస్తుందని).

జీవితంలో తాత్కాలిక సందర్బాలు సజీవం కావు. గుట్టలుగా పేరుకుపోయే నిరుపయోగ ఘట్టాలను మట్టుబెట్టాలంటుంది. అరిగిపోయిన సంభాషణలతో, అర్థం పర్థం లేని సాగతీత అంకాలతో అభినయించే నాటకాలకు తెర దించాల్సిన అగత్యాన్ని గుర్తు చేస్తుంది. ‘టెంపరరీ ఫైల్స్’ను అనివార్యంగా డిలీట్ అయిపోవాల్సిన గాయాలుగా అభివర్ణిస్తారు.

‘‘స్టేజీ మీద అలవోకగా నటించినది కూడా మనమే

ప్రతీ అంకానికీ ముందే సంభాషణలు రాసుకుని

చాటుగా వీపు వెనుక దాచుకు తిరిగేదీ మనమే’’

ఏ మజిలీ శాశ్వతం కాదు. అన్నీ ఎత్తులకెదిగి, లోయల్లోకి దూకి ఆత్మహత్యల్ని హస్తగతం చేసుకునేవే.

‘‘చెంగున గంతులేసే మనసు

కొద్దిసేపు డిమెన్షియా నటించనీ’’.

అదొక వేట. నిరంతరం మాటు వేసి ఉండాల్సిందే. ఆయుధాలు ధరించి ఉండాల్సిందే. కెరీర్ మహాయజ్ఞ నిర్వహణలో ప్రాజెక్టు తర్వాత ప్రాజెక్టుల ఇటుకలు పేర్చుకుంటూ ఉండాల్సిందే. ‘గమ్యం చేరగానే చమ్కీ చుక్కలున్న రంగుల చున్నీ విసిరేయాలి/ మళ్లీ మరో పాత్రలోకి ఇమిడిపోవాలి’. పొగమేఘాల మధ్య, టార్గెట్ల కత్తుల బావిలో జీవిత విటమిన్లను వాంఛాభరితంగా కోల్పోతూ… ‘కొన్ని వేల సాగరాలని దాటాక అడిగిందామె’.

‘‘డెడ్ లైన్లు, హార్మోన్లు అన్నీ ఎగుడుదిగుడే

చిన్ని చిన్ని ఆశలు ఎక్కడో తప్పిపోయాయి

పెదాలపై పాలిపోయిన లిప్‌స్టిక్

వెలిసిపోతున్న పగటివేషం!’’ (ట్రాఫిక్ రొదలు-కాఫీ కప్పులు)

అయితే, జీవితం అట్లా మంటల మధ్యనే ఆహుతి అయిపోకూడదనీ, చల్లగాలి ఉనికిని కనిపెట్టి, సేదతీరే క్షణాల్ని సొంతం చేసుకోవాలంటారు. అవన్నీ దాటుకొని ఒకానొక ఆహ్లాదకర సమయాన్ని కప్పుల్లో వంచుకొని కాఫీలా తాగాలంటారు…

‘‘పక్క గదిలో మోగుతున్న రేడియోలో పాత పాట-

ఉదయాన్ని ఆస్వాదిస్తున్న మిత్రులిద్దరు!’’

*****

నిర్దేశిత ఫార్మాట్‌లో ఉండకపోవటమే అపర్ణ కవిత్వం తాలూకు శిల్పరహస్యం. సంపూర్ణ స్వేచ్ఛాభరిత స్పేస్‌లో హాయిగా సంచరిస్తూ లోపలి పలవరింతలకు చివురాకులు తొడగటమే ఆమె కవిత్వ శైలీసారాంశం.

బాల్కనీలో కూచొని ఓ పద్యం. నిద్రలోకి ఒరుగుతూ మరో పద్యం. రాత్రి లోతుల్లో మునకలేస్తూ ఇంకో పద్యం. తనూ, తన ఫీలింగ్స్, సిద్ధాంతాలు, రూపకల్పనలు, ఊహాత్మక కథనకౌశలాలూ మాత్రమే కాదు; వస్తువులు కూడా రాత్రిలో లీనమవుతాయి…

‘‘ఇక పదకొండవ మెట్రో కూడా ఆ గది అద్దాల వెనుక

చప్పుడు లేకుండా రాత్రిలోకి దూసుకుపోయింది’’.

ఆ ఒంటరి ద్వీపంలో అతడూ ఆమె ఎదురెదురుగా కూచొని, ఎన్నో యోజనాల దూరాన్ని భారంగా మోస్తుంటారు. ఆమె ఎనిమిదోసారి అడిగినా, అతడు ‘చెప్పాలి మేడమ్’ అంటాడే తప్ప చర్మపు పొరలు విప్పుకొనే ప్రయత్నం చేయడు. ఆమెకేమో ధైర్యం చిక్కదు. ఆ అసహన దృశ్యం ఎట్లా కవిత్వమై పలకరిస్తుందో చూడండి…

‘‘గదిలో ఫ్యాన్ గాలికి మౌనం చుట్టుకుపోతోంది

సూదిలోకి దారం ఎక్కించే కళ్లతో అతనిని చూస్తోంది

ఇద్దరి మధ్య దూరాన్ని వేలితో టేబుల్‌పై గీసింది’’ (చూపుల సంతకం).

శుద్ధ వచనాన్ని గమ్మత్తుగా శుద్ధి చేసి, వాక్యాల మధ్య వైనంగా ఇరికించేసి, దాన్ని కవిత్వంగా అందించే విద్యేదో ఈమె సాధన చేస్తోంది. నమ్మరు కదూ! ఇదిగో సాక్ష్యం…

‘‘కారుతో పోటీ పడుతున్న పాట

స్టీరింగ్ తిప్పుతూ ‘బావుంది కదూ’

కిటికీ తెరిస్తే గాలి జివ్వున పలకరించింది

సగం తెరిచిన కిటికీ సగం మూసిన కళ్లు’’.

పాటను అపరిమితంగా ప్రేమిస్తూ ఎంత దూరమైనా ఆ ప్రయాణం సాగిపోతూనే ఉంటుంది. ఆ బాటలో భాగంగా ఇద్దరి హృదయాల్లోనూ ఏవో ప్రకంపనలు. అవిశ్రాంత అలజడి అనంతరం ఓ నిశ్శబ్దం. పదాలూ పెదాలూ అల్లుకుపోయే నిశ్శబ్దం. ఇద్దరి మధ్యా దూరం పాటలా కరిగిపోయే నిశ్శబ్దం. ఎండావానా కలిసి ముద్దుపాటగా మైమరచిపోయే నిశ్శబ్దం.

‘‘ఆ నిశ్శబ్దంలో

ఇద్దరూ ముద్దు పెట్టుకున్నారు’’ (ముద్దుపాట).

చీకటి రహస్యాల్ని బహిరంగంగా బద్దలు కొట్టే విషయంలో కవయిత్రిలో వెరపు కనిపించదు. దేహంలో నిబిడీకృతమై ఉండే కాంక్షాసర్పాల గురించి బహిరంగంగా ప్రపంచానికి చాటే విషయంలో తడబాటు కనిపించదు.

‘‘ఇన్నాళ్లూ అపరిచితమైన నా శరీరం

ఇప్పుడు నా ఆత్మబంధువైంది’’ (చీకటి కోరిక).

సంభాషణల్ని కవితలో అంతర్భాగం చేయటం కష్టమైన ప్రక్రియ. అపర్ణకు ఆ కష్టమంటే చాలా ఇష్టంలా ఉంది. Outing with depression కవితలో ఆ ఇష్టం అందంగా అక్షరబద్ధమైంది…

‘‘నేనావలగట్టుకెళ్లనా?

వెళ్లవచ్చు కానీ కప్పం కట్టిపో

నా దగ్గర డబ్బులు లేవు

పర్లేదు కాస్త కష్టపడి సంపాదించు’’.

‘భావావేశపు వెలితిని/ మగతనపు ఉద్రేకాలతో ఈడ్చుకుపోయే’ భీరువుల్ని ఈమె ఏకిపారేస్తుంది. ‘పురుషత్వాన్ని ప్రకటించుకోడానికి నానా చావు చచ్చే’ పిరికి లౌక్యులను ‘‘బేల అంటే/ స్త్రీలింగం మాత్రమే కాదని చెప్పండిరా’’ అని ఇంత గడ్డి పెడుతుంది. ‘కబళించే కొండచిలువలా ప్రేమ/ మీదమీదకు వస్తోం’దంటూ ప్రేమబందీలకు హెచ్చరిక జారీ చేస్తుంది.

మానసిక ప్రపంచాన్ని కాంతిమంతం చేసే తేజోవలయాలు చిన్ని చిన్ని ఆనందాలే. ఆ ఆనందం కవికి స్నేహితుల రూపంలో దొరుకుతుంది. అపర్ణకు స్నేహితులంటే ఇష్టం. వాళ్లను ఇంద్రధనుస్సులంటుంది. నక్షత్రాలంటుంది. పాలపుంతలను తోడి ఒడిలో ఒంపేస్తారంటుంది. వాళ్లు…

‘‘విరబూస్తారు విరమిస్తారు

విసిగిస్తారు వరాలిస్తారు

వేడుకొంటారు వంద ముద్దులిస్తారు’’ (ఇంద్రధనుస్సులు).

‘‘జెన్నీ అనే ఆగంతకురాలు’’ శీర్షికతో స్వాతి కుమారి బండ్లమూడి రాసిన ముందుమాట అపర్ణ కవిత్వ సారాంశాన్ని అద్దంలో చూపింది. ఈ ఆత్మీయ స్పందనలో ఒక్కో వాక్యం ఒక్కో కవిత. ఇంత క్లుప్తంగా, అంత గాఢంగా రాయటం గొప్ప విషయం.

‘బోధి ఫౌండేషన్’ ప్రచురించిన ఈ పుస్తకాన్ని డిజైన్ చేయటంలో బంగారు బ్రహ్మం పనితనాన్ని ప్రత్యేక ప్రశంసతో సత్కరించాల్సిందే. ముఖచిత్రం సంగతి అలా ఉంచితే… శీర్షికలను వైవిధ్యభరిత అక్షర విన్యాసంతో అలంకరించటమూ; ప్రతి కవితకూ భావస్ఫోరకమైన, అర్థవంతమైన బొమ్మ వేయటమూ అదనపు ఆకర్షణ. పేజీలు తిప్పేకొద్దీ కవితతోపాటు దాని పక్కనే ఉన్న చిత్రంతోనూ ప్రేమలో పడటం ఖాయమంటే అతిశయోక్తి కాదు. కవిత్వమూ అలంకరణా ఒకదానికొకటి పోటీ పడ్డాయి. బ్రహ్మానికి బ్రహ్మాండంగా అభినందనలు చెప్పొచ్చు.

కాలక్షేపం కోసమో, కరుణరసం కోసమో కవిత్వం చదవాలనుకున్న వారు ఈ పుస్తకం జోలికి వెళ్లకపోవటం మంచిది. కవిత్వాన్ని నిజాయితీగా ప్రేమించేవారు ఈ పుస్తకం చదవకపోవటం మంచిది కాదు.

అపర్ణ తోటకు అభినందనలు.

(పుస్తకం కోసం లోగిలి బుక్స్ @ 9550146514)

*

 

 

ఎమ్వీ రామిరెడ్డి

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు