కె.రాణి గారిది భలే విచిత్రమయిన గొంతు. కొన్ని పాటలు వింటుంటే జిక్కీ గుర్తొస్తుంది, కొన్ని పాటలు వింటుంటే పి.లీల పాడారేమో అనిపిస్తుంది. మరికొన్ని పాటలలో జమునా రాణి గుర్తొస్తుంది. అప్పుడప్పుడూ సుశీల లాగా కూడా అనిపిస్తుంది. అందుకే ఆమె గొంతు గుర్తు పట్టడం కొంచెం కష్టంగా వుంటుంది. చాలా మంది ఆమెనీ, జమునారాణినీ కన్ ఫ్యూజ్ అవుతారు.
కొంచెం జాగ్రత్తగా వింటే మాత్రం ఆ గొంతులోని విలక్షణత అర్థం అవుతుంది.
అందుకే ఆమె గొంతులో పలికే చక్కని శృతినీ, పెప్ నీ గమనించిన సంగీతదర్శకులు ఆమెకు చక్కటి అవకాశాలిచ్చారు. ఆమె సుమారు 500 పాటలు పాడారట అన్ని భాషలూ కలుపుకుని.
తెలుగు, తమిళ, మళయాళ, కన్నడ, హిందీ భాషలే కాకుండా, సింహళ, ఉజ్బెక్ భాషలలో కూడా పాడారు.
సింహళ భాషలో, సుసర్ల దక్షిణా మూర్తి దర్శకత్వంలో ఆవిడ పాడిన వారి జాతీయగీతం చాలా పాప్యులర్ అయింది. ఈనాటికీ వారికదే జాతీయగీతమట. పై భాషలతో పాటు “ఉజ్బెక్” భాషలో కూడా పాడటం విశేషం.
ఆమెను మొట్టమొదట గుర్తించి, సినిమాలలో అవకాశమిచ్చి ప్రోత్సహించింది సి.ఆర్ .సుబ్బరామన్.
నటి వైజయంతి మాల డాన్స్ ప్రోగ్రామ్ లో ఏదో హిందీ పాట పాడిన రాణిలోని ప్రతిభను గుర్తించిన ఆయన, ఆమె ఇంటికి వచ్చిఆమె చేత పాడించి వినీ, మర్నాడే ఒక తమిళ సినిమాలో పాడటానికి పిలిపించారు. ఆ సినిమా పేరు “పారిజాత.”
ఆ తర్వాత తెలుగులో కూడా ఆయనే అవకాశాలివ్వడం ఆరంభించారు. తన దర్శకత్వంలో “రూపవతి” లోనూ “ధర్మదేవత” లోనూ పాడింది.
“ధర్మదేవత” లో మూడు పాటలు పాడింది–అందులో ఒకటి పెండ్యాల గారి దగ్గర వయొలనిస్ట్ ప్రసాదరావుతో డ్యూయెట్. ఈ సినిమాలోనే “లంబాడా లంబ లంబ” అనే హుషారయిన పాట పాడేటపుడు ప్రముఖ నిర్మాత బి.నాగిరెడ్డి చూసి ముచ్చట పడి వారి “విజయా పిక్చర్స్” నిర్మించే “పెళ్లిచేసి చూడు” లో అవకాశ మిచ్చారు. అలా ఆవిడ ఘంటసాల దర్శకత్వంలో “అమ్మా నెప్పులే, అయ్యొయ్యో బ్రహ్మయ్యా” పాటలు పాడింది అవి సూపర్ హిట్టయ్యాయి.
అయితే ఆమె కు మంచి గుర్తింపు తీసుకొచ్చి సినిమా రంగంలో నిలబెట్టిన పాటలు, సి.ఆర్. సుబ్బరామన్ దర్శకత్వంలో “దేవదాసు”లో పాడిన “అంతాభ్రాంతియేనా,” “చెలిమిలేదు” పాటలు. ఈ పాటలు పాడే అవకాశం రావడం తన పూర్వజన్మ సుకృతం అంటుందామె. ఈ నాటికీ చాలామంది ఆమెను “దేవదాసు” లో పాడిన రాణిగానే గుర్తిస్తారు.
ఇంతా చేసి అప్పటికామె వయసు తొమ్మిదేళ్లే! నమ్మడానికి ఆశ్చర్యంగా లేదూ!
ఆవిడ అసలు పేరు ఉషారాణి. ఆమె 1942లో కర్ణాటక లోని తుముకూరు లో జన్మించారు. అలా అని ఆమె కన్నడ దేశస్థురాలు కాదు, ఉత్తర హిందూస్థాన్ కి చెందిన కుటుంబం, తండ్రి పేరు కిషన్, తల్లి పేరు లలిత.
తండ్రి ఇండియన్ రైల్వేస్ లో పని చేస్తూ, చివరకు కడపలో స్థిరపడ్డారు. వివిధ ప్రాంతాలు తిరగడం వలన ఆవిడకి చాలా భాషలతో పరిచయం అయింది అలా ఆమె తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ,తమిళ్ , మళయాళం, కన్నడం భాషలు మాట్లాడగలిగే వారు, దాని వలన ఆయా భాషలలో ఆమె పాడటం సులువయింది.
ఆమె మొట్టమొదటి పాట 1951లో పాడితే, 1953లో “దేవదాసు” లో పాడారు అంటే సుమారు పదీ, పదకొండేళ్ల వయసులో పాడారన్నమాట.
1966లో నిర్మాతా, స్టుడియో సొంతదారూ అయిన జి. సీతారామిరెడ్డి గారితో వివాహం జరిగింది. వారికి విజయ, కవిత, అని ఇద్దరు కూతుళ్ళు.
సీతారామిరెడ్డి గారికి “సదరన్ మూవీటోన్” అనే స్టుడియో హైద్రాబాద్ లో చార్మినార్ దగ్గర, “షమా”థియేటర్ కి దగ్గరలో వుండేదట. అక్కడే “రహస్యం” సినిమా షూటింగ్ జరిగింది. ఆయన నిర్మాతగా”సతీ అరుంధతి,” “నిజంచెబితే నమ్మరు” అనే సినిమాలు తీశారు.
1974లో ఆయన చనిపోయారు. అప్పటి నుండీ సినిమాలలో పాడటం మానుకున్నారట. ఆమె చివరగా పాడింది, ఘంటసాల గారి చివరి సినిమా “వస్తాడే మాబావ.”
ఆవిడ చలన చిత్ర జీవితం పరిశీలిస్తే “దేవదాస్” లో ఆమె పాడటానికి అభ్యంతరం చెప్పినవాళ్లు కూడా వున్నారట. దర్శకుడు వేదాంతం రాఘవయ్య తదితరులు చిన్నపిల్ల పాడగలదా? అని అనుమాన పడితే దర్శకుడు సుబ్బరామనూ, నిర్మాత డి.యల్. నారాయణా పట్టుపట్టి పాడించారు. ఘంటసాల గారితో పాడటానికి భయపడుతుంటే సుబ్బరామన్ ధైర్యం చెప్పే వారు.
ఆ తర్వాత ఘంటసాల, టి.వి. రాజు, టి.జి.లింగప్ప, ఎం.సుబ్రహ్మణ్యరాజు, అశ్వత్థామ, సుసర్ల దక్షిణామూర్తి, రాజేశ్వరరావు లాంటి మంచి, మంచి సంగీత దర్శకుల దగ్గర పాడినా, ఒక సుశీలకీ, జిక్కీకీ, జానకికీ, జమునారాణికీ, లీలకీ వచ్చినంత గుర్తింపు ఆవిడకి రాలేదనిపిస్తుంది.
అలా అని ఆవిడ కొన్ని రకాలయిన పాటలకే సూటవుతుందని అనుకోవడానికి వీలు లేదు. ఆవిడకూడా “నేనీ పాటలే పాడతాను”అని గిరిగీసుక్కూచున్నట్టూ కనపడదు.
ఆవిడ హీరోయిన్ కీ పాడింది, వాంప్ కీ పాడింది, క్లబ్ సాంగ్స్ పాడింది, ఏడుపు పాటలు పాడింది, చిన్నపిల్లల పాటలు పాడింది, చివరకు బృందగానాలలోనూ, కోరస్ లలోనూ కూడా పాడింది.
ఆవిడ ప్రయివేట్ రికార్డులు కూడా ఇచ్చింది. బి.గోపాలంతో కలిసి ఆమె పాడిన “చల్లగాలిలో” చాలా హిట్.
సినిమా అవకాశాలు తగ్గాక బయట ఫంక్షన్స్ కి పాడటం, కచేరీలు చేయడం చేసేవారు. అలా ఘంటసాల గారితో చాలా కచేరీలు చేశారు, హిందీ గాయకులయిన ముఖేష్, తలత్ మొహమూద్ లతో కలిసి చాలా కచేరీలలో పాల్గొన్నానని చెప్పారు.
ఎలాంటి పాట ఇచ్చినా ఆవిడ దానికి పూర్తి న్యాయం చేశారనడంలో ఎలాంటి సందేహమూ లేదు.
ఒకసారి ఆవిడ పాడిన పాటలు కొన్ని చూస్తే, ఎంత వైవిధ్యమయిన పాటలు పాడారో తెలుస్తుంది.
- రూపవతి–ఒయ్యారి రాజా, జిలిబిలి రాజా
- ధర్మ దేవత–పాటకు పల్లవి కావాలోయ్, లంబాడా లంబలంబ
- చండీరాణి–రావో వరాల ఏలిక
- మనోరమ–గతిలేని వాణ్ణి, గుడ్డివాణ్ణి బాబయా
- దేవదాసు–అంతా భ్రాంతి యేనా, చెలిమి పోయే, చెలువూ పోయె
- పెళ్లి చేసి చూడు–అమ్మా నెప్పులే, బ్రహ్మయ్యా ఓ బ్రహ్మయ్యా
- శభాష్ రాముడు–జాబిల్లి వెలుంగులో, ఓ చందమామ ఇటు చూడరా
- వినాయక చవితి–వేసేను నామది చిందులూ
https://youtu.be/GoREZyA8ko0
- చంద్రహారం–ఎవరే, ఎవరే చల్లని వెన్నెల జల్లులు
- లవకుశ–రామన్న రాముడు, అశ్వమేథయాగానికి జయము
- మాయా బజార్–ఒకటే మావయసు
- జయసింహ–కొండమీద కొక్కిరాయి
https://youtu.be/3BYlVZQoWm8
- స్వయం ప్రభ–ఒరే దున్నా
- అన్నా తమ్ముడు–చిన్నారి చిరు గాజు మ్రోతలా
- సతీ సులోచన–ఆలపించుమో సుకవీ
- కలిమిలేములు–కొమ్మలమీద కోతి కొమ్మచ్చులాడింది
- మదన మంజరి–తెలిసెను నీ రంగ రంగేళీ, రవ్వల నేత్రాల గాథా
ఈ పాటలన్నీ పరిశీలిస్తుంటే అర్థమయ్యేదేంటంటే సుబ్బురామన్ తర్వాత ఆమెకు మంచి అవకాశా లిచ్చి ప్రోత్సహించింది ఘంటసాల అని. ఘంటసాలగారు అనే వారట “రాణీ నీగొంతులో మిర్చిమసాలా ఘాటు వుందమ్మాయ్” అని. ఆయన దర్శకత్వంలో ఆవిడ చాలా మంచి పాటలు పాడారు కృతజ్ఞతగా తలుచుకుంటారు కూడా ఆవిడ.
శభాష్ రాముడు–“జాబిల్లి వెలుంగులో” అనే పాటలో ప్రతీ చరణం చివరా వచ్చే మెలిక సంగతి వింటుంటే, ఘంటసాలగారు ఆవిడ గాత్రానికుండే ప్రత్యేకతని గుర్తు పెట్టుకుని అలా పాడించారనిపిస్తుంది. “ఈపాటలో గోపిక విరహాన్ని బాగా చూపాలమ్మా నువ్వూ” అనే వారట భలే పాట.
అందులోనే “చందమామ ఇటు చూడరా”–చాలా ప్రత్యేకమయిన పాట. అవడానికి క్లబ్ సాంగే అయినా, చరణానికీ, చరణానికీ వేగంలో తేడా వుంటుంది. మధ్యలో ఘంటసాల ఆలాపన వుంటుంది, కథానాయకుడికి ఇటు వస్తే ప్రమాదం అనే హెచ్చరిక వుంటుంది. గాయకులకు పరీక్షపెట్టే పాట ఇది, అయినా అలవోకగా పాడేసిందావిడ.
ఆయన దర్శకత్వంలోనే “వినాయక చవితి” లోని “వేసేను నా మది చిందులూ” ఎంత మధురంగా వుంటుందో.
ఇంకా “పెళ్లిచేసి చూడూ, చంద్రహారం, మాయా బజార్” ఇలా వరసగా ఆయన చిత్రాలన్నిటిలో ఒకటో, అరో పాటలు పాడుతూనే వున్నారావిడ.
ఇకపోతే ఆవిడ పాడిన పాటలన్నిటిలో దేవదాసు పాటలు సరే, ఆవిడ పి.బి. శ్రీనివాస్ తో పాడిన రెండు డ్యూయట్లంటే ప్రాణం నాకు.
- చిన్నారి చేతులా చిరుగాజు మ్రోతలా–“అన్నా తమ్ముడు” సినిమాలోది, అశ్వత్థామ సంగీతం
https://youtu.be/hYpvLpq9XQY
పల్లవి మెల్లగా మొదలయి, చరణం దగ్గరకు వచ్చేసరికి నడక మారుతుంది, భలేపాట.
- తెలిసెను నీ రంగరంగేళీ–మదనమంజరి (డబ్బింగ్ చిత్రం)
ఇంకా చెప్పాలంటే టి.వీ.రాజు దర్శకత్వంలో “జయసింహ” లో పాడిన “కొండమీద కొక్కిరాయి” కూడా చాలా విభిన్నమయిన పాట.
వేలకి వేల పాటలు పాడకపోయినా తను పాడిన ప్రతి పాటకీ న్యాయం చేసిన గాయని కె.రాణికి తగిన గుర్తింపు రాలేదనే నిజం నిష్ఠూరంగా అనిపించినా ఒప్పుకోక తప్పదు.
ఈ నెల పదమూడవ తేదీ ఆవిడ హైద్రాబాద్ లో కుమార్తె దగ్గర వుంటూ పరమపదించారని తెలిసింది. ఎప్పుడో పాడటం మానేసిన ఆవిడ మరణం చిత్రరంగానికి తీరని లోటని చెప్పలేం గానీ, ఆవిడ పాడిన మంచి, మంచి పాటలు వింటూ ఆవిడని తలుచుకోవడం కంటే చక్కని నివాళి వుంటుందా!
అత్యంత అరుదైన మణిపూసను వెతికి తెచ్చి మాకందించిన భార్గవి గారు మీకు నమస్సులు ; మీ పరిశోధన లో కళాతృష్ణ కు జోహార్లు …
ధన్యవాదాలు మీ స్పందనకు శైలజ గారూ
Nijjam..varikinivallii..!
మంచి జ్ఞాపకాలు పంచుకున్నారు భార్గవి గారు . చిన్నారి చేతుల చిరి గాజుల మోత ఇంతకూ ముందు వినలేదు . చాలా బాగుంది . కొండామీద కొక్కిరాయి పాట బాగా విలక్షణం గా ఉండే పాట
దేవదాసులోని పాటలు తప్ప మిగిలిన ఏ పాటలు తెలియవు. మంచి నివాళికి కృతజ్ఞతలు. వ్యాసంలోని “అట”లు, “ట” లు మాత్రం పంటికింద రాళ్ళలా తగిలాయట.
రాగ, థాంక్స్ అండి..కొన్ని మార్పులతో ఇప్పుడు చదవండి మళ్ళీ!
Thank you.
రాగ గారూ నమస్కారం నా వ్యాసంలో “అట లూ,టలూ “మీకు ఇబ్బంది కలిగించినందుకు సారీ.నేను అలా రాయడానికి కారణం నాదంతా సెకండ్ హాండ్ ఇన్ఫర్మేషనే కదా అక్కడక్కడా చదివిందీ,వారినీ వీరినీ అడిగి తెలుసు కున్నదీ ,అందుకని అలా రాయడం సమంజసం అనుకున్నాను అదీ సంగతి
భార్గవి రచనలు అన్నిటికి ఉండే ISI మార్క్ ( మరొకరి మాట ఇది ) రీసెర్చ్ తో గాయని రాణి గారి పాటలు కూడా అదనపు ఆకర్షణ గా అందించిన విలువైన రచన ..ఇలా ఆవిడ పోయిన తరుణం లో చదవడం కొంచం బాధగా అనిపించింది..రాణి గారి గురించి ఎన్నో విషయాలు తెలిశాయి.నాకు దేవదాసు పాట లు ద్వారానే తెలుసు ఈ గాయని.చిరు జీరతో ఆవిడ పాడిన పాటలు అన్నీ ఇష్టమే.
దయచేసి ఇలాంటి కళాకారుల పరిచయాలు వారు ఉండగానే చేసి మాకూ వారికి కూడా సంతోషం కలిగించండి.ఎడిటర్జి మరియు భార్గవి కి ఈ విన్నపం.
వసంత లక్ష్మి ,పి.
థాంక్యూ వసంత లక్ష్మి ,మీ విలువైన స్పందనకు
భార్గవిగారు! అరుదైన కంఠం, అరుదైన పాటలు పాడిన రాణిగారి గురించి చాలా విషయాలు తెలిపారు. తెరమాటున ఉండిపోయిన రాణిగారి గురించి తెలపటమేకాదు, ఆమె పాడిన పాటలను అందించారు. ధన్యవాదాలు!
నిజం గా ఆమె పాడిన అన్ని పాటలు విలక్షణం గా మధురంగా వుంటాయి.మంచి పరిచయం … బాగా రాశారు.వ్యక్తి లేక పోయి నా కళ మిగిలి పోతుంది.
నేను ఇన్ని రోజులూ ‘అంతా భ్రాంతియేనా’ పాడింది లీల అనుకుంటున్నా. ఆమె మీది నా అభిమానానికి ఈ పాట ముఖ్య కారణం. మరి ఇప్పుడెట్లా?
వెరీ సింపుల్ . అభిమానాన్ని అటు నుండి ఇటు డైవర్ట్ చెయ్ రాజీ 🙂
అంతా భ్రాంతియేనా.. పాట విన్నాంగానీ.. ఈ పాటలన్నీ ఎప్పుడూ వినలేదు భార్గవి గారూ… ఆసాంతం సమాచారయోచితంగా బాగుంది… వీడియోలు పెట్టడం అదనపు సొబగును అద్దుకుని మాకందరికీ వీనుల విందు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు..
కృతజ్ఞతలు శాంతిగారూ
చాలా బాగా వివరించారు భార్గవి గారూ.
ఆవిడ గురించిన విషయాలు , విశేషాలు స్మరించుకోవడం ముదావహం.
కొత్త తరం వారికీ అర్ధమయ్యే రీతిలో వీడియోలతో సహా వివరించినందుకు అభినందనలు.
నాటి గాయనీమణి రాణిగారి గురించి ప్రచురించినందుకు సంపాదకులకు కృతజ్ఞతలు.
బావుంది !