రాజ్ కుమార్ కవితలు రెండు

1
నిదురరాని రాతిరి
మూసిన రెప్పల్ని అంటించాలనే మగత
విఫల ప్రయత్నం
అవి పాడే నీలి జోలపాటకు
పాపలూ నిదురపోవు
వేడి.. చీకట్లను
పడుగూపేకలుగా కలిపి
తాను అల్లుతున్న సంగతి
చెబుతూనే ఉంటుంది.. దుప్పటి
లోనికి దూరి
బాత్రూమ్ ట్యాపు కార్చే నీటిబొట్లు
ఒక్కొక్కటీ
టప్పుటప్పుమని
చెవుల్లో గునపం పోట్లు
గడియారం లోని
టిక్కులాడి క్షణాల ముల్లు
శాబ్దిక దృశ్యమై
గుండెల్లో గుచ్చుతున్న
మంచు సూదులు
కత్తుల రెక్కల్ని మెదడుపై
సానపెడుతున్న కీచురాయి
ఏ మూలనో కాదు
తలలోనే దాక్కుంది
రాతిరి… ఏం తోచని చీకటి
రాసిపోయిన
నెత్తుటి జీరల కవిత
పొద్దున్నే ప్రత్యక్షం
రెప్పలు తెరచిన
అద్దంలో…!
2
సం’దేహం’
మోసేది నలుగురమైనా
మోస్తున్న కొద్దీ బరువు పెరుగుతుంది
ఆ ఒక్కరోజుకే
భుజాలు మార్చుకుంటుంది
మోత
ఇప్పటికీ
ఇంత బరువుని
ఎవరిది వాళ్లమే అయినా
ఎలా మోస్తున్నామని
ఎవరమూ అనుకోంగాని
ఎంత బక్కపలుచనిదైనా
శరీరం భారమే కదా..!
ఇదే ప్రశ్నను
నాకు నేనుగా అనుకుంటూ
ఒకానొక సూత్కపు దినాల్లోనే..
మా పెద్దన్న నడిగిన గుర్తు
ఉన్నన్నాళ్లు
ప్రాణం ఆయన్ను మోసింది
అప్పుడు ఆ ప్రాణాలే అయినారు
నలుగురు అన్నాడు
ఆ ప్రాణం కోసమే కదా
ఈ జంజాట మంతా అనుకుంటూ
మళ్లీ ఒకనాడు
ఒక సీనియర్ కవిని అడిగిన జ్ఞాపకం
శరీరం ప్రాణం వాగర్థాలని
కాళీదాసులా చెబుతూ..
‘ఖాళీ గూడు
అర్థం ఎగిరి పోయిన మాట’ అన్నాడు
బరువవుతున్న
నా సందేహాన్ని దించుతూ
ఒకసారి
ఒక యోగి మాత్రం
శరీరం చిమ్మటకు భారం
సీతాకోకకు కాదంటూ
నవ్వుతూ
మలుపులో మాయమయ్యాడు.
*
సొంతూరు నిర్మల్, తెలంగాణ రాష్ట్రం. గిరిజన సంక్షేమ గురుకులం డిగ్రీ కళాశాలలో అధ్యాపక వృత్తి. నానా బలహీనతలకు ఎదురొడ్డి నిలిపిన బలం, ఆజన్మంగా అబ్బిన లౌక్యపు లేమిని పూరించే పిసరంత గుర్తింపు కవిత్వం.

మడిపల్లి రాజ్‌కుమార్

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు