మేము భారత ప్రజలం
మాకు ఆలోచించే స్వాతంత్ర్యం కావాలి
మాకు సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం కావాలి
మా భావాల్ని వ్యక్తం చేసే స్వేచ్ఛ కావాలి
మా విశ్వాసం, ధర్మం, ఆరాధనలకు మమ్మల్ని వదిలేయాలి
మాకు అన్ని అవకాశాల్లోనూ సమానత్వం కావాలి
మా వ్యక్తిత్వానికి గౌరవం, అందరితో కలిసికట్టుగా జీవించగలిగే సౌభ్రాతృత్వం కల్పించాలి.
భారతీయ ఆత్మ ఘోషిస్తున్న ఈ వాక్యాలను మనం ఎప్పుడు రాసుకున్నాం? సహచరులు తాను తాగే కూజా నుంచి నీరు తాగడానికి నిరాకరించిన ఒక ‘దళితుడి’ చేతితో రాసినవి కావా ఈ వాక్యాలు? ఆఫీసులో ఉద్యోగులు ఫైళ్లను కూడా దూరం నుంచి విసిరివేస్తే చూడాల్సి వచ్చిన ఒక అస్పృశ్యుడి కళ్ల కన్నీరు నుంచి వెలువడినవి కావా ఈ అక్షరాలు? “దురదృష్టవశాత్తు నేను అస్పశ్యుడైన హిందువుగా జన్మించాను, కాని నేను హిందువుగా మాత్రం మరణించనని వెల్లడిస్తున్నాను” అని ప్రకటించిన అంబేద్కర్ గద్గద స్వర ప్రకంపనలు కావా ఈ భావాలు?
వలసవాద సంకెళ్లనుంచి విముక్తమై 74 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రముఖ రచయిత్రి శ్రీదేవి మురళీధర్ అద్భుతంగా రచించిన ‘సచిత్ర భారత సంవిధానం’ చదువుతుంటే మనం ఏ రాసుకున్నాం, ఏం అనుభవిస్తున్నాం అన్న ప్రశ్నలు తలెత్తాయి. ‘మనదీ ఒక బతుకేనా’? అని శ్రీశ్రీ వేసిన ప్రశ్న మరో సారి ప్రతిధ్వనించింది.
“నా సామాజిక తత్వశాస్త్రం మూడే పదాల్లో ఇమిడి ఉంది. అవి స్వేచ్చ, సమానత్వం, సౌభ్రాతృత్వం, ఇవేమీ ఫ్రెంచి విప్లవం నుంచి అరువు తీసుకున్నవి కావు, నా తత్వశాస్త్రం మతంలో ఉన్నది, రాజనీతి శాస్త్రంలో కాదు. నాగురువు బుద్దుడి తత్వశాస్త్రంలో నే స్వేచ్చ, సమానత్వ మూలాలున్నాయి. సౌభ్రాతృత్వమే స్వేచ్చ, సమానత్వానికి ఉల్లంఘించకుండా అడ్డుపడుతుంది.. సౌభ్రాతృత్వమే సోదరభావానికీ, మానవత్వానికి మరో పేరు. మానవత్వమే మతానికి మరో పేరు” అని ప్రకటించింది ఆయన కాదా ?
మనం ఇప్పుడు ఏ మత రాజ్యాన్ని ఆహ్వానిస్తున్నాం? రాజ్యాంగం అవతారికలో చేర్చిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ఇప్పుడు ఉన్నాయా? వీటి ఆధారంగా రూపొందించిన సమానత్వ హక్కు, వ్యక్తి స్వేచ్ఛా హక్కు, దోపిడీని వ్యతిరేకించే హక్కు, మతాన్ని స్వేచ్చగా అవలంబించే హక్కు, సాంస్కృతిక విద్యాహక్కు, ముఖ్యంగా జీవించే హక్కు ఎంతవరకు నెరవేరుతున్నాయి? ప్రశ్నించడానికి వీలు లేని, సమానత్వానికి ఆస్కారం లేని, సౌభ్రాతృత్వానికి చోటు లేని, భావాల్ని వ్యక్తం చేసే స్వేచ్ఛ లేని దేశంలో రాజ్యాంగ అమృతోత్సవాలు జరుపుకునే హక్కున్నదా మనకు?
గత 75 ఏళ్లూ విషం తాగుతూ, మత కల్లోలాల్లో ప్రాణాలు కోల్పోతూ, కుల హత్యలలో నిర్జీవంగా మారుతూ, విశ్వాసాలకు, ధర్మానికీ, ఆరాధనకు ఉన్న విలువలను కోల్పోతూ, పేదవాడి వ్యక్తిత్వం నిరంతరం హననమవుతూ, బానిస బతుకులు బతుకున్న మనం అమృతం తాగి బతికామా? రానున్న రోజులు అమృతం తాగి పునర్జీవితులము కాగలమనే ఆశ, ఆకాంక్ష ఇంకా ఉన్నాయా మనకు?
ప్రజల జీవితాలను కొల్లగొడుతూ, బ్యాంకులను దోపిడీలు చేస్తూ విలాసాల మధ్య జీవించే, సంపదను హస్తగతం చేసుకునే కొద్ది మంది చేతుల్లో, హత్యలు, ఊచకోతలు చేస్తూ, మతాల మధ్య చిచ్చును రేకెత్తిస్తూ అధికారం పైమెట్లు ఎక్కుతూ వెళ్లే నరహంతకుల చేతుల్లో రాజ్యాంగం ప్రహసనం కాలేదా? రాజ్యాంగం ప్రవేశపెట్టిన ఏ వ్యవస్థల్లో ఏ వ్యవస్థను మన నేతలు మనసా, వాచా, కర్మణా అమలు చేశారు?
1947 తర్వాత ఎన్ని కుల హత్యలు జరిగాయని? పొలం దున్నే కూలీలు జీతాలు పెంచమని అడిగినందుకు 1968లో తమిళనాడులోని కిల్వెన్ మణిలో భూస్వాములు ఊచకోత కోసిన దళితుల ప్రాణవాయువులు రాజ్యాంగ కాగితాలపై ప్రసరించాయా?1985లో కారం చేడులో, 91లో చుండూరులో అగ్రవర్ణాలు పరిగెత్తించి నిర్దాక్షిణ్యంగా చంపిన అభాగ్యుల ఆత్మలు ఏ రాజ్యాంగ అక్షరాల్లో ఘోషించాయి? 97లో తమిళనాడులోని మెలవలలో ఒక దళితుడు ఎన్నికల్లో పోటీ చేసి గెలిచినందుకు అతడితో పాటు ఆరుగురిని వధిస్తే రాజ్యాంగం వల్లించిన ప్రజాస్వామ్యం కాపాడిందా? 99లో పంజాబ్ లోని భుంగర్ ఖేరాలో గ్రామపంచాయతీ సభ్యులు ఒక దివ్యాంగురాలైన దళిత యువతిని నగ్నంగా గ్రామంలో ఊరేగిస్తే ఏ రాజ్యాంగ సమానత్వం రక్షించింది? 2000లో కర్ణాటకలోని కంబాలపల్లిలో గదిలో బంధించి సజీవ దహనానికి గురి చేస్తే ధగ్దమైన దళిత దేహాల బూడిద నుంచి ఏ స్వేచ్ఛా ఫీనిక్స్ లు ఉద్భవించాయి? 2006 లో పంజాబ్ లో తన కూతురుపై సామూహిక అత్యాచారం చేసి వధిస్తే సామాజిక న్యాయం కోరిన తండ్రి బంత్ సింగ్ కాళ్లూ చేతులు నరికితే ఏ రాజ్యాంగం ప్రశ్నించింది? ఒక ఖైర్లాంజి, ఒక మిర్చిపూర్ లో మరణించిన వారికి రాజ్యాంగం అన్వయించదా?
పోనీ అమృతోత్సవాలు ప్రకటించిన మహా నేత హయాంలో రాజ్యాంగం స్వేచ్చగా పరిఢవల్లిందా? ‘నన్ను జ్ఞాపకం చేసుకున్న ఒక రోజు, నా ఉనికిని గ్రహించిన ఒక రోజు. నీలోంచి చిరునవ్వు ఊపిరిగా వెలువడిన ఒక రోజు నేను పునరుత్థానం చెందుతాను’ అని ప్రకటించి 2016లో హైదరాబాద్ లో ఆత్మహత్య చేసుకున్న రోహిత్ వేములా, రాజ్యాంగం నీవెన్ని సార్లు చదువుకుని ఉంటావు? బలవంతంగా మూత్రం తాగించి చిత్రహింసలకు గురిచేస్తే 2019లో సంగ్రూర్ లో మరణించిన జగ్మెయిల్ సింగ్ మీరిప్పుడు స్వర్గంలో అంబేద్కర్ తో సంభాషిస్తున్నారా? 2020లో హథ్రాస్ లో సామూహిక అత్యాచారాని కి గురై, వెన్నుముకను విరగ్గొట్టి, నాలుకను తెగకోస్తే మరణించిన అభాగ్యురాలా, పోలీసులు అర్థరాత్రి నిన్ను ధగ్గం చేస్తున్నప్పుడు నీ ఆత్మ రాజ్యాంగం సృష్టించిన వ్యవస్థల్ని పరిహసించిందా? అగ్రవర్ణ విద్యార్థులు తాగే కుండలో నీరు తాగినందుకు అధ్యాపకుడు హింసిస్తే మరణించిన ఇంధ్రా మేఘావల్ అనే బాలుడా, ఏ మేఘాల్లో నీవు అమాయకంగా సంచరిస్తున్నావు?
రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామనే వాగ్దానంతో అధికారంలోకి వచ్చిన ఎంతమంది చేతులు రక్తంతో తడిసిపోయాయని?ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర తోపాటు దేశంలోని అనేక ప్రాంతాల్లో వీధుల్లో రక్తాలు ప్రవహించిన మైనారిటీ మతస్తుల ప్రాణాలను ఏ రాజ్యాంగం పరిరక్షించింది? భారత దేశ జైళ్లలో ఏళ్ల తరబడి బందీ అయిన. కేసులు విచారణకు రాని ఖైదీల్లో సగానికి పైగా దళితులు, ఆదివాసీలు, ముస్లింలు ఉన్నారన్న మాట వాస్తవం కాదా?
రాజ్యాంగం ఎంత మంచిదైనా దాన్ని అమలు చేసే వారు చెడ్డదయితే అది కూడా చెడ్డదవుతుంది. రాజ్యాంగం ఎంత మంచిదైనా దాన్ని అమలు చేసే వారు మంచివారైతే అది మంచిదిగా మారుతుంది అని రాజ్యాంగ అసెంబ్లీలో తన చివరి ప్రసంగంలో చెప్పిన అంబేద్కర్, మీ మాటల్లో సత్యంలోని స్వచ్ఛతను ఎవరైనా కాదనగలరా?
శ్రీదేవీ మురళీధర్ మరో సారి మన కళ్లముందుంచిన రాజ్యాంగం మన గొప్పతనాన్నీ మనకు తెలిపింది. మన నికృష్ట జీవితాల్నీ పరిచయం చేసింది, మన నేతల భావ దారిద్ర్యాన్నీ మరో సారి ప్రశ్నించింది.
శ్రీదేవి మురళీధర్ మన కాలపు అద్భుత రచయిత్రి. రాజ్యాంగంపై రాసినా, హాలివుడ్ క్లాసిక్ సినిమాలపై రాసినా, ఆధ్యాత్మికత, భక్తిపై రాసినా ఒక నిజాయితీతో కూడిన ఆర్ద్రత ప్రతి వాక్యంలోనూ ప్రవహిస్తోంది. అక్షరాన్నీ, భావాన్ని లోతుగా అనుభవించే కొద్ది మంది రచయిత్రుల్లో ఆమె ఒకరు.
నిజానికి ఆమె వ్యాఖ్యానించిన రాజ్యాంగం ఒక కవిత్వం.
రాజ్యాంగంతో పాటు దాన్ని తత్వాన్ని కూడా పాటించాలి అని ఆమె అన్నారు, విశృంఖల అధికారం అవినీతికి దారితీస్తుంది అని ఆమె చెప్పారు. ఏడుదశాబ్దాల చరిత్రలో రాజ్యాంగం ఎన్నో గాయాలను, కఠిన పరీక్షల్ని ఎదుర్కొంది అని తెలిపారు.
రాజ్యాంగ విలువలను కాలరాసేవారు, రాజ్యాంగాన్ని లెక్కచేయాని వారు అందర్నీ దాటుకుని నిలబడిందని కూడా ఆమె చెప్పారు.
అవును రాజ్యాంగం కాలం బలిపీఠంపై పరీక్షను ఎదుర్కొంటుంది. ఈ వధ్యశిలపై అది నిరంతరం బలి కాకుండా మనం కాపాడుకోవాలి. అంబేద్కర్ చెప్పినట్లు రాజ్యాంగంలోని మానవతాతత్వమే అసలైన మతంగా మనం పాటించాలి.
*
Many many thanks for the detailed review and kind words Sri KRISHNA RAO garu.
శ్రీదేవి రాసిన సచిత్ర భారత సంవిధానం పుస్తకాని మిత్రులు కృష్ణరావు గారు బాగా విశ్లేషిస్తూ, పాఠకుడు పుస్తకం చదవవలిసిన బాధ్యత అవసరము ఉన్నదాని కూడా తెలియచేసారు. శ్రీదేవి అభిమానంతో నాకుకూడా ఈ పుస్తకం పంపించింది చదివి చాలా విషయాలు తెలుసుకున్నాను . ఈ రోజుల్లో చాలా అవసరమున్న పుస్తకం రాసిన శ్రీదేవి కి మంచి విశ్లేషణ రాసిన కృష్ణరావు గారికి అభినంద