రహీమొద్దీన్ కవితలు మూడు

1

డిజిటల్ ‘చిల్లింపు’లు! 

కాస్ట్లీ కోరికల డ్రాగన్ కవ్విస్తూ
అమాంతం నోరు తెరిచి
రేపటి అవసరాన్ని మింగేసింది
ఫోన్ పే, గూగుల్ పే నొక్కులకు
బ్యాంకు అకౌంట్ కు‌ బొక్కపడి
నా రూపాయి పాప
ఏ షాపింగ్ మాల్లోనో తప్పిపోయింది
షోరూమూల్లోంచి
ఖరీదైన వస్తువులు వెక్కిరిస్తుంటే
తల తాబేలయి
లోపలికి ముడుచుకున్నది
ఇవ్వాల్టి ఇటుకా సిమెంటుకు
కార్పోరేట్ చదువులకూ
సోకాల్డ్ స్టేటస్ భంగిమలకూ
రేపటి బతుకును
నెల నెలా  సమాన కోతలుగా
వర్తమానమంతా వాతలు పెట్టుకుంటున్న
మధ్య తరగతి ఉద్యోగిని
సాలరీ తీగ మీద సర్కస్ చేస్తూ
టెక్నికల్ గా నేనిప్పుడు
టెక్నాలజీ చేతుల్లో  హ్యూమనాయిడ్ రోబోను!
2
పూరేడు పిట్ట 
ఎర్రటి ఎండల్ల నల్లమబ్బు నీడ తలనిమిరినట్టు
ఏదో…
యాది పూరీడు పిట్ట యెద మీదికొచ్చి వాల్తది
చిన్నప్పటి
అంగీ మీది అచ్చు బొమ్మలా
మనసును అంటిపెట్టుకువన్నీ
ఒక్కొక్కటే  చూపుకందని  దృశ్యమవుతుంటె
ఎంత  మనాదిగుంటదో
ఇప్పుడిపుడే సమ్జయితాంది
ఎంత పాతవయినా
ఎండలకు వానలకు కాపు గాశిన
పెంకుల విలువేందో
ఇల్లు కూలగొట్టినంకనే ఎర్కయితాంది
ఉన్న నల్గురు నాల్గు దిక్కులైనంక
వొచ్చే వాన
చెంపల మీదికి జారేదు కాదు!
దిగులు మబ్బు
ఎక్కడా కురిసిపోయేది గాదు!
పుట్టి పెరిగిన ఊరి పొలిమేరా!
ఎన్నెలంత సలువదనం నీ గుణం
మనసు నుంచి చెరిపెయ్య
అదేమన్నా పెన్సిల్ గీతనా?!
ఉద్యోగమంటే రెక్కలనుకుంటి
ఎక్కడికో ఎగిరి ఒక్కన్నైతి
ఏమ్మూట గట్టుకుంటి?
కాలం గొర్ర గొర్ర గుంజుకపోతున్నది…
పేగుల్లో ప్రేమ
మెలికలు మెలికలుగా తండ్లాడుతున్నది…
ఇగ  ఏంజేయగలుగుత?!
తడి తడి జ్ఞాపకాలను
రెప్ప సాటునే దాసుకుంట!
మనుసునే  మ్యూజియంగా చేసి
పురావస్తువులను దాసుకుంట
ఒట్టు!
ఊపిరొదిలేదాకా  మల్ల మల్ల సూసుకుంట!
3
 ఏడొకట్లు
          1.
ఆశల సంచీ నిండాలని…
ఎన్నో తీగలకు చేయి చాపుతం
ఏ చేతికీ అందని ద్రాక్ష తత్వం పాడుతది !
చేరాలనుకున్న చోటు
ఏ చౌరస్తాలోనో తప్పిపోతది
చూడాలి అనుకున్నది చూసేలోపే
చీకటి తలుపేసుకుంటది
            2
అసలయితే ఆత్మవిశ్వాసమే
తొలికరి మొలకయి చిగురువెడతది
మభ్యపెట్టే  మబ్బుల మోసాలు చూసినంకనే
అనుమానం
కాండం తొలిచే పురుగై తిరుగుతుంటది
              3
ఇన్ని పదాలల్లో
తియ్యనిది ఒక్కటైనా దొరక్కపోతుందా అని
ఎదురుపడ్డా వాక్యాన్నల్లా ఆశగా రుచి చూస్తాం
చేదు మంచంపై ఎంతకీ నిద్ర రాక
ఆకాశంలో చెరుకు స్వప్నాలను వెతుక్కుంటం
              4
అయినా…
మురిసే మన్నునడిగి చినుకు వానవుతుందా !
కాసేపు ఉండమంటే
క్షణాల మెరుపుతీగ నిమిషమైనా నిలబడ్తదా!
కురుస్తున్న వాన కురుస్తనే ఉంటది
మెరుస్తున్న మబ్బు మెరుస్తనే ఉంటది
చూస్తున్న  మనసు కనుపాప
కళాత్మకంగా తడుస్తా ఉంటది.
      5
ఋతువులకు పూసిన పూలు
కాలాలకు కాసిన పండ్లు
గాలి ఊయ్యాలలో నేలకు చేరి
మనుషికి విల్లంబులిచ్చిన అడవులయ్యాయి
గమనించంగానీ
ఏ గుర్తింపు దక్కని
పాదముద్రలూ వేలిముద్రలే
అడుగులకు నడక నేర్పిన నాగరికతలయ్యాయి
              6
ఇంతకీ  చెప్పాలనుకున్నది
హృదయానికి అర్థం అయిపోయాక
ఇక పదాల పెదాలు నిశ్శబ్దంగా నవ్వుకుంటాయి
             7
కాలం నడక గురించి
కవి తన కవిత్వంతో ముచ్చటించి వెళ్లి పోతడు!
అతని కలం గురించి
కవిత్వం కాలంతో ముచ్చటిస్తునే ఉంటది!
*

రహీమొద్దీన్

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు