కంటికి కనిపించదు. చప్పుడు చేయదు. చుట్టూ కమ్మేసింది. మీద పడటం ఒకటే మిగిలింది. కటిక చీకటి దారి. ఇంతకు ముందు అనుభవంలో లేదు. ఇక ముందు చూసేదీ లేదు. వర్తమానంలో విరచుకు పడుతోంది. చంపుకు తింటోంది.
దయ లేదు. జాలి లేదు. ఆకలి లేదు. దాహం లేదు.
గొంతులో నొప్పి. ఉండుండి ముక్కు చీదుతోంది. దేహానికి కొద్దిగా వెచ్చని సెగ అంటుకుంది… ఇక ఏమీ లేదు….అంతే…అంతే….
ఇక్కడెంత చప్పుడులేనితనమో. ఇదెంత నిదానపు నడకల పరుగుల ప్రవాహమో. ఇదెంత చాప కింద నీరులా మీద పడుతుందో. ఇదెంత కనికరం లేని పురుగో…పురుగు అనాలా …పుట్ర అనాలా…
ఉరుకులు పరుగులు లేవు. తొందర లేదు. ఆలస్యమూ లేదు. సావకాశమూ లేదు. కదలికే లేదు.
ప్రకృతి సైతం పరవశంగా లేదు. ఉల్లాస దృశ్యాలు లేవు. ఆహ్లాదపు ఘడియలు లేవు. ఆనందపు సవ్వడులు లేవు. కేకలు అరుపులు లేవు. చిందులు లేవు. అసలేమీ లేదు….
ఇళ్ళంతా నిశ్శబ్దం పరచుకుంది. నిశ్శబ్దం నిలకడగా ఉండనీయడం లేదు. గుండెల్లో గుబులు. వెన్నులో ఏదో పాకుతోంది…జరజరా…సరసరా.. తెరచుకోని భయమేదో లోలోపలికి దూకుతోంది. కలవరం. ఆందోళన.
మందూ మాకూ లేని రోగాన్ని తెచ్చింది. పుటుక్కున తెగిపోయి రాలిపోతున్న ప్రాణాలు . మానవత్వం లేదు. మానవ సంబంధాలు లేవు…దూరం…దూరం…అన్నింటా అసింటా ఉండమనే సంకేతాలు … అయిదారు అడుగుల ఎడం…
కరచానాలు లేవు. కౌగిలింతలు లేవు. జబ్బ చరుపులు లేవు. అందరూ పరిచిత అపరిచితులే. ఇంట్లో ఉండు. ఇళ్ళంతా తిరుగు. బయటకు రాకు. బయటకు వస్తే ఉందిలే ముఫ్పు. ఎవరూ ఎవరికీ ఏమీ కారు. అంతా మిథ్య…అంతా శూన్యం.
హద్దుల్లో మొలుస్తున్న గోడలు . ముళ్ళ కంచెల ఆంక్షలు . ముఖం ఎదురుపడితే అనుమానాల పెనుభూతాలు. చేతులో పడిన వస్తువుల నిండా విషపు మరకల జాడలు. దేన్నీ ధ్వంసం చేయకుండా …దేన్ని నమ్ముతాం. లోపలున్న మనిషి ఎక్కడో మాయమైనట్టుగా… బయట కనిపించేవన్నీ నటనలే అన్నట్టుగా… ఉన్నపళంగా ఎక్కడికని పరుగెడతాం?
విశ్వాంతరాళంలో ఉబ్బిన పసుపుపచ్చని ఉమ్మెత్త కాయలు ఎగురుతున్నాయి. నక్షత్రాలని భ్రమపడమంటున్నాయి. కంటికి కనిపించకుండా ఆకాశంలో విహరిస్తున్నాయి. ఆకారం అసలే లేని ప్రాణమేదో జడిపిస్తోంది…నిజంగా ప్రాణముందా? … జవజవలాడే జీవముందా?
1
1985 జూలై 24…
పెళ్ళి చూపులు . పెళ్ళికి మొదటి మెట్టు. కొత్త జీవితానికి శుభారంభం.
ఫొటో బావుంది. నవ్వు ముఖం. ఒంటిని దిగేసిన నగలు లేవు. లిప్‌స్టిక్కు లేదు. పట్టుచీర లేదు. కిలకిలా నవ్వుతున్న ముఖం. బొద్దుగా ఉంది. బుగ్గ మీద చిన్న పుట్టుమచ్చ. మెరుస్తున్న కళ్ళు. అందంగా ఉంది. విద్యాకుసుమాల కాంతి మెదడులో కూరుకున్నట్టుంది. అదనపు అలంకరణలు లేవు. ప్రత్యేకంగా ఫొటో కోసం ఉన్నట్టు లేదు. కళ్ళజోడు ఉంది. దళసరి అద్దాలే. మొత్తమ్మీద పరిమళభరితంగా ఉంది. సమ్మోహనంగా ఉంది
ఇంకేం చూడాలి? పెళ్ళి చూపులకు వెళ్ళాలా అనుకున్నాడు. వెళ్ళి తీరాలన్నారు ఇంట్లో వాళ్ళు. జీవితాంతం ఉండే తోడు. తేడా వస్తే నెపం ఎవరూ మీద వేసుకోరు. స్వయంగా చూడాల్సిందే. ఇంకోటీ ఇంకోటీ కాదు ఇది పెళ్ళి అన్నారు. ఆమె కూడా చూడాలి కదా అన్నారు. ఆమెకు కూడా నచ్చాలి కదా అన్నారు.
పెళ్ళిచూపులకు వెళ్ళాడు. అమ్మ కూడా వచ్చింది. చూసాడు. వద్దనడానికి ఏమీ లేదు. మర్యాద తెలిసినవారు. ముందు అనుకున్నట్టు – నచ్చినట్టే.
అమ్మ ముఖం మతాబులా వెలిగిపోతోంది. రజనికి బాగా మార్కులు పడ్డాయి. ఎదురుగా స్వీట్లు. తినమన్నారు. తినాలనే ఉంది. కతికితే అతకదు. జ్ఞాపకం వచ్చింది. చేయి చాపబోయి ఆగిపోయాడు. సంశయిస్తున్నాడు. కొన్ని నమ్మకాలు శంకిస్తాయి. దహిస్తాయి. ఏమో…ఎవరు చెప్పారు?
‘‘ పర్వాలేదు. తీసుకోండి ’’ రజని నవ్వుతూ అంది. తొలి పలకరింపు. కాదనలేక పోయాడు. కోవాబిళ్ళ చిన్నదే. చటుక్కున తీసుకుని నోట్లో వేసుకున్నాడు. ఆమె మళ్ళీ నవ్వింది. నవ్వినపుడు పంటి మీద పన్ను తళుక్కుమంది. ఇక వదులుకునే సమస్యే లేదు.
రజని సిగ్గుపడుతూ తల వంచి కూర్చోలేదు. పెళ్ళిచూపులు తతంగంలో ఉన్నట్టు లేదు. సాధారణంగా ఎలా ఉంటుందో అలా ఉంది. ఒత్తిడిలో ఉన్నట్టు లేదు. స్నేహితుల మధ్య కూర్చున్నట్లే. నవ్వు ముఖం ఎంతకీ చెరగలేదు. ఆ ముఖంతో ఏమడిగినా ఇచ్చేస్తారు. ఏమీ అడక్కపోయినా ఇచ్చేస్తారు. ఒకానొక ఆకర్షణ శక్తి…
అమ్మ సంబరంగా చూస్తోంది. మాట్లాడుతోంది. సంబంధం కలిసినంత కలివిడిగా మాట్లాడేస్తోంది. అమ్మ సంతోషాల్ని దాచుకోలేదు. తనే బిగిసుకుపోయాడు. నోట్లో కోవాబిళ్ళ క్షణంలో అయిపోయింది.
‘‘ ఏవైనా మాట్లాడుకుంటారా ఇద్దరూ? ’’ ఎవరన్నారో తెలీదు. తల అడ్డంగా ఊపాడు. మాట్లాడుకోవడాలు..అటూ ఇటూ నడిపించడాలు … మంచి పద్ధతి కాదు. అదీ గాక వెన్నంటి ఉండే బిడియం…
రజని సమ్మతిగా లేచింది. రెండు అడుగులు వేసింది. ఇటు పక్క కదలిక లేదు. లేవలేదు. చూస్తుండిపోయాడు.
‘‘ రండి ’’ అంటూ ఆహ్వానించింది. ఇక లేవక తప్పలేదు. బాల్కనీ. రెండు కుర్చీలు . చక్కగా సర్ది ఉన్నాయి. మధ్యలో టీపాయి. దాని మీద చిన్న తొట్టిలో పూలు . ముందస్తు ఏర్పాటు. చిన్నప్పట్నుంచీ తనకు ఆడాళ్ళతో మాట్లాడటం సంకోచం, సిగ్గు…
చెరో పక్క నిలబడ్డారు. కుర్చీ చూపించింది. ఇది వాళ్ళిల్లు. అతిధి మర్యాదలు ఆమెవే. కూర్చున్నాడు. తనూ కూర్చుంది. మౌనం….
బయట రోడ్డు మీద పిల్లలు . క్రికెట్టు ఆడుతున్నారు. మధ్యలో మూడు ఇటుకలు ఒకదాని మీద మరొకటి. ఏం సరదాయో. విశాలమైన ప్రదేశంలో ఆడినంత రంజుగా ఉండదు. అయినా ఆడతారు. పిల్లల ఇష్టం. బైక్‌లు వెళుతున్నాయి. సైకిలు మీద కూరగాయలు అమ్ముకునే మనిషి వారగా తప్పుకుని వెళుతున్నాడు. అపుడపుడు కార్లు. ఆ పిల్లలకు అవేమీ అడ్డంకి కాదు. ఆటల్లో ఆనందం వెతుక్కుంటారు.
రాఘవ వాళ్ళనే చూస్తున్నాడు. కాసేపటికి రజని కేసి తిరిగాడు. ఆమె నవ్వింది. పలువరుస మెరిసింది. కళ్ళజోడు తీసింది. తుడుచుకుని మళ్ళీ పెట్టుకుంది.
‘‘ సైటుంది. కళ్ళజోడు లేకపోతే చదవలేను. అపుడపుడు తుమ్ములొస్తాయి. ఆగకుండా వస్తాయి. ఎందుకొస్తాయో తెలీదు. మందు వాడుతున్నాను. తగ్గలేదు. తగ్గుతుందో లేదో తెలీదు ’’ అంది రజని.
తన సమస్యలు చెప్పాలా? ఆమె ఎందుకు చెప్పింది? ఎవరు అడిగారు?
జుట్టు సవరించుకున్నాడు. చొక్కా కాలరు సర్దుకున్నాడు. సన్నగళ్ళ చొక్కా. ముఖ్యమైన సందర్భాల్లో ధరిస్తాడు. తను ఏదో ఒకటి సమాధానంగా చెప్పాలి.
‘‘ పర్వాలేదు. ఇబ్బంది లేదు. అందరికీ ఉండేవే. పెళ్ళయ్యాక కూడా ఇంకా చాలా రావొచ్చు ’’ బలవంతంగా నవ్వాడు. ఈసారి ఆమె నవ్వలేదు. గంభీరంగా చూస్తోంది. ఏదో చెప్పాలన్నట్టుగా గొంతు సవరించుకుంది.
‘‘ రాఘవ గారూ… నా గురించి మీకు తెలుసో లేదో …ఒక విషయం చెప్పాలి. మహిళా ఉద్యమాల్లో చురుగ్గా ఉంటాను. స్త్రీలకు ఎక్కడ అన్యాయం జరిగినా పోరాడే సంఘాన్ని నిర్వహిస్తున్నాను. పెళ్ళయ్యాక కూడా కొనసాగిస్తాను. అభ్యంతరం ఉండకూడదు. చిన్నప్పట్నుంచి అభ్యుదయ భావాలతో పెరిగాను. మందితో తిరుగుతుంటాను. పెళ్ళయినా మానుకోను. పూజలు , పునస్కారాలు చేసే అలవాటు లేదు. ఇష్టం ఉండదు. మీరివన్నీ నమ్ముతారా? ’’ ఏకబిగిన సూటిగా చెప్పింది. శషభిషలు లేవు. నమ్మిన విశ్వాసాల పట్ల నిబద్ధత…
తెల్లబోయాడు. డోలాయమానం. అడ్డంగా నిలువుగా తల ఊపాడు.
‘‘ మరీ ఎక్కువ కాదు గానీ నమ్ముతాను ’’ క్లుప్తంగా అని కింద రోడ్డు మీదకు దృష్టి సారించాడు. బంతి ఇటుకకు తగిలింది. ఆ కుర్రాడు వెంటనే బాట్ వదిలి వెళ్ళలేదు. తగలకుండా ఎలా తప్పుకుందోనని ఉత్తినే గాలిలో బ్యాటును ఊపి చూసుకుంటున్నాడు.
రాఘవ పైకి చూసాడు. ఆకాశం స్వచ్ఛంగా ఉంది. తర్వాత మరికొన్ని మామూలు మాటలు సాగాయి. ఒకరికొకరు తెలుసుకున్నారు. జీవితంలో ముఖ్యమైన ఘట్టం పూర్తయ్యింది. లేచారు. ముందు రజని నడిచింది. వెనుక దారి తీసాడు.
అమ్మకు ఆతురత. ఆమెకు చాలా నచ్చింది. ఆవిడ ఉద్దేశం ఒకటే. కారణం ఎలాంటిదైనా ఈ సంబంధం తప్పిపోకూడదు.
‘‘ నచ్చింది. ముహూర్తాలు పెట్టుకుందామని ఇక్కడే చెప్పేద్దామా? ’’ అని కొడుకు చెవిలో గొణిగింది. తల అడ్డంగా ఊపాడు. చేతితో సైగ చేసాడు, ఆగమని.
బంగారం లాంటి పిల్ల . మళ్ళీ దొరకదు. ఇక్కడే తేలిపోతే బావుండును. మళ్ళీ కొడుకు ముఖంలోకి చూసింది. గంభీరంగా ఉన్నాడు. నచ్చినట్టే ఉన్నాడు. ఎందుకు నచ్చదు? చురుకైనది. తెలివైనది. కలివిడిగా తిరిగేది. కుటుంబానికి పేరు తెస్తుంది.
కడకు ఏమీ చెప్పకుండానే ఇంటికెళ్ళిపోయారు. ఒకరోజు గడిచింది….రెండు రోజులు గడిచాయి…అమ్మ అడుగుతూనే ఉంది. పోరుతూనే ఉంది. నసపెడుతూనే ఉంది.
అందం తిన్నగా ఉండనీయదు. కలలో…కలత నిద్రలో రజనే కనిపిస్తోంది. వదులుకోకూడదు. ఎలా?
నెమ్మదిగా మార్చుకోవచ్చు. తప్పక మారుతుంది. మొండి ఘటాలు ఉంటారు. వాళ్ళు మారరు. చెప్పింది వినాల్సిందే. రజని అలాంటి కోవలోకి వస్తుందా? మెత్తగా మాట్లాడింది. యథాలాపంగా అన్నట్టుగా షరతులు వర్తించవని చెప్పింది. అయినా సరే మార్చుకోగననే నమ్మకం ఉంది.
అమ్మకు తన అంగీకారాన్ని చెప్పేద్దాం అనుకున్నాడు. అంతలోనే తటపటాయింపు. రేపు ఆదివారం. అపుడు చెబుదాం అనుకున్నాడు. సామాజిక సేవ తప్పేముంది? ఫలానా వాడి భార్య అంటూ తనకూ పేరొస్తుంది. అందరూ పొగుడుతారు. ఆమె సాధించే విజయంలో తనకూ భాగం ఉంటుంది.
ఆ రాత్రి. కలత నిద్ర. కుటుంబమా? సమాజమా? చర్చ సాగుతోంది.
పెద్ద మైకు. తిరగలి రాయిలా ఉంది. మోయలేనంత బరువు. రజని అవలీలగా పెదాల ముందు పెట్టుకుంది. ఒక చేయి గాలిలోకి లేచింది. పిడికిలి బిగించి ఉంది. కంఠనాళాలు ఉబ్బి ఉన్నాయి. నోటి తుంపర్లు వర్షపుజల్లుల్లా పడుతున్నాయి. జనం ఊగిపోతున్నారు. ఆవేశం కట్టలు తెంచుకుంది. మాటల ప్రవాహం. లెక్కలేనితనం. జేజేలు. వెర్రి కేకలు . ఆమె కళ్ళు ప్రశ్నలు సంధిస్తున్నాయి. ఉద్యమం. ఊరేగింపు. ఎక్కడ చూసినా రజనీ…రజనీ. తుళ్ళిపడ్డాడు. లేచాడు. ఒళ్ళు చెమటతో తడిసింది.
ఉహూ…భరించలేడు. జీర్ణించుకోలేడు. సొంతం కావాలి. కుటుంబం ముఖ్యం. ఇల్లు ముఖ్యం. అమ్మ ముఖ్యం. రేపొద్దుట పిల్లలు ముఖ్యం. అభ్యుదయవాదులు , ఆచరణకర్తలు ఇంకొక ఇంట్లో ఉండాలి. ఎదురింట్లో ఉండొచ్చు. పక్కింట్లో ఉండొచ్చు. మన ఇంట్లో ఉండకూడదు. అంతే…అంతే.
మంచినీళ్ళు తాగాడు. తేలిక పడ్డాడు. హాయిగా ఉంది. తెరిపిన పడింది మనసు. గుండె మీద చేయి తీసుకున్నాడు. నిద్ర పట్టింది. ఆలస్యంగా నిద్ర లేచాడు.
మర్నాడు` అమ్మకు చెప్పేసాడు. బతిమాలింది. ససేమిరా అన్నాడు. ఆదర్శాలు ఆశయాలతో కాపురం చేయలేనన్నాడు. అయ్య బాబోయ్…అమ్మ బాబోయ్ . ఇది సినీమా కాదు. కథా కాదు. ఇది జీవితం.
మెరిసే కాంతులు సరే. లోపలి అగ్ని జ్వాలల్ని తట్టుకోలేం అన్నాడు. జీవితాంతం భరించడం కష్టం. కరాఖండీగా చెప్పేసాడు. నిర్ణయం మారదన్నాడు.
అమ్మ ఒప్పించడానికి ప్రయత్నించింది. చిదిమి దీపం పెట్టుకోవచ్చు…ఇంటికి మహాలక్ష్మి… సుఖపడతావు…ఆలోచించు…
వినలేదు. చెవులు మూసుకున్నాడు. అమ్మ ఉస్సురని నిట్టూర్చింది.
మరో అమ్మాయి సీత. పల్లెటూరు పిల్ల. సరిపడా చదువు. చెప్పింది వింటుంది. అమాయకత్వం నిండిన చూపులు . తెల్లగా స్వచ్ఛంగా ఉంది. సిగ్గుల మొలక. తలెత్తి చూడలేదు. కంటి రెప్పలు టపటపలాడిస్తూ నేలనే చూస్తోంది. తగినట్టు మలచుకోవచ్చు. దిద్దుకోవచ్చు. సంసార పక్షం.
రాఘవ` సీత మంచి జోడీ …అనుకూలవతి అయిన భార్య అవుతుంది. దీవించారు.
పెళ్ళైంది. పిల్లలు పుట్టారు.
2
రజని జ్ఞాపకాల్లో భద్రంగా ఉంది. మనసులో తిష్ట వేసింది. వెంటాడుతూనే ఉంది. ఒకే పట్టణం. ఎదురుపడలేదు. చూస్తూనే ఉన్నాడు పేపర్లలో. పోరాటాలు. సామాజిక ఉద్యమాలు. ఫొటోలు. ఇంటర్వ్యూలు. విజయాలు. పొగడ్తలు. అన్నీ వార్తలు….
ఎంచుకున్న రంగంలో గుర్తింపు. నిబద్ధత గల కార్యకర్త. రాజీ పడని మనస్తత్వం. రజని ఇపుడు ప్రజలు మెచ్చే ధీర వనిత. దీనులకు అనాథలకు కొండంత అండ. ఏ కష్టమొచ్చినా భరోసా ఇవ్వగలిగే శక్తి సామర్ధ్యాలు. అన్నీ తెలుస్తున్నాయి. ప్రత్యేక శ్రద్ధతో గమనిస్తున్నాడు రాఘవ.
తరతరాల బానిసత్వ భావాలు . కులం మతం పేరుతో జరిగే అమానవీయ సంఘటనలు . గృహ హింస బాధలు . అత్యాచారాల ఆవేదనలు . మానసిక శారీరక దాస్యాలు . మోసం చేసిన ప్రియుడి ఇంట న్యాయం జరిగే వరకూ బైఠాయింపులు . సమస్యలన్నీ సమాజ స్థితికి అద్దం పట్టేవే. రజని చేతి నిండా పనే.
దినపత్రికల్లో వార్తలు ఉత్సుకతతో చదివేవాడు. దృశ్యాల్ని ఊహించుకునేవాడు. రజని గురించి ఏ వార్త వచ్చినా ఎంతో ఆతురత. సమస్త సమాచారం తెలిసేది. వార్త లేని రోజు లేదు. సంఘర్షణలు నిత్యకృత్యం. సామాజిక ఉద్యమాల్లో చైతన్యవంతమైన పాత్ర. ఆమె గురించి చదివినపుడు ఒకింత పులకింత. దగ్గరగా చూస్తున్న అనుభూతి.
ఒకరోజు పత్రికలో ఆమె ఇంటర్వ్యూ. చదివాడు. సీతను పిలిచాడు. వంటింట్లో ఉంది. చెంగుతో ముఖం తుడుచుకుంటూ వచ్చింది. దగ్గరకు వచ్చి నిలబడింది.
‘‘ ఏమిటి సంగతి? అవతల బోలెడు పని ఉంది ’’
‘‘ ఇది చదువు. ఈవిడ పేరు విన్నావా? ’’
‘‘ విన్నాను ’’ పేపరు తీసుకుంది. చదివింది.
‘‘ రజని అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోదు. అన్యాయం ఏ రూపంలో ఉన్నా సహించదు. గొప్ప స్త్రీ. ఆవిడంటే ఇష్టం. భయం ’’ అన్నాడు. ఇష్టం దేనికో భయం దేనికో చెప్పలేదు.
‘‘ మీకు తెలుసా …పరిచయం ఉందా?’’
‘‘ ఉందంటే…ఉంది. నాకు తొలి పెళ్ళిచూపులు ఆమెతోనే. అప్పట్లో ఆవిడ భావాలు భయం కలిగించాయి. ఏవీ దాచుకోకుండా చెప్పింది. అభ్యుదయ వాది. భరించడం కష్టం అనిపించింది. తర్వాతే నిన్ను చూసాను. మనం హాయిగానే ఉన్నాం కదా ’’ అంటూ నవ్వబోయాడు. సీత నవ్వలేదు. భర్త కేసి తేరిపారి చూసింది.
‘‘ ఇపుడు నాకెందుకు చూపించారు? ’’
రాఘవ సమాధానం చెప్పలేదు. సీత వెళ్ళిపోయింది.
ఆ రాత్రి నిద్ర పట్టలేదు. ఆలోచనలు గిరగిరా తిరుగుతున్నాయి.
మళ్ళీ కలత నిద్ర. అపుడపుడు వచ్చే కలే. దృశ్యాలు మారిపోతుంటాయి. ఒక దృశ్యం అవ్వగానే మరొకటి, సినీమాలో లాగ.
ఒక అమ్మాయి ఉరిపోసుకుంది. మధ్యాహ్నం ఇంట్లోనే. ఫ్యానుకు వేలాడుతోంది. భర్తే చంపి…
అక్కడొకడున్నాడు. కుర్రాడే. వాడే మొగుడు. ఎర్రబడ్డ కళ్ళు. చెమట తడిచిన ఒళ్ళు. సర్వం కోల్పోయినట్టు. ఏ పాపమూ ఎరగనట్టు. అమాయకంగా చూస్తున్నాడు.
జనం చేరుతున్నారు. అనుమానాలు. చూపు సూదుల్లా గుచ్చుతున్నారు. రజనికి కబురందింది.
ఆగమేఘాల మీద రజని వచ్చింది. అతని ముఖాన్ని లోతుగా చూసింది. తెలిసిపోయింది. గుర్తు పట్టింది
‘‘ జట్టు పట్టుకుని ఈడ్చి మరీ కొడుతున్నాడు. తాగొచ్చి నానా అల్లరి చేస్తున్నాడు. కొంచెం బెదిరించండి. బుద్ధి చెప్పండి చాలు అని వారం క్రితం వచ్చింది. వీడి కోసం చూస్తే దొరకలేదు. పోలీసు కంప్లైంటు ఇవ్వద్దొంది’’ ఇంకా రజని ఏదో చెబుతోంది. వాడ్ని తీక్షణంగా చూస్తోంది. ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.
మరో దృశ్యం. ఇంటి ముందు టెంటు. గుప్పెడు మంది ఆడాళ్ళు. రజని ఉంది. ఒక అమ్మాయి మెడలో పూలదండ. ఎదురుగా ఉన్న ఇంటి తలుపులు మూసి ఉన్నాయి.
నమ్మించి మోసం చేసి కడుపు చేసినవాడు ఇంట్లోనే ఉన్నాడు. తనకే పాపమూ తెలియదంటున్నాడు. ఎట్టకేలకు పోలీసు వచ్చారు. తలుపులు తెరిపించారు. దండోపాయం. వణుకుతూ నిజం కక్కేడు.
ఇంకో దృశ్యం. రోడ్డు మీద బ్యానర్లతో ఊరేగింపు. చేతిలో ప్లకార్డుతో ముందుంది రజని. కంఠనాళాలు ఉబ్బుతూ నినాదాలు . ఏదో జాతీయ సమస్య. పట్టుమని ఇరవై మంది లేరు. ప్రతిధ్వనులు ఆకాశ మార్గాన డిల్లీ పీఠానికి చేరాలి. రోడ్డు పక్క జనం నిలబడి చూస్తున్నారు. విషయం అర్థం కానివాళ్ళే ఎక్కువ. ఊరేగింపు సాగుతోంది. యుద్ధ నాదం వరసలు కట్టిన పాటలయ్యాయి.
ఉద్వేగపు అలలు . ‘ వుయ్ వాంట్ జస్టీస్ ’ ‘వెంటనే అమలు చేయాలి ’
కూడలిలో అంబేడ్కర్ విగ్రహం. రజని చేతిలో వినతి పత్రం రెపరెపలాడుతోంది. రాజ్యాంగ ప్రతి పట్టుకున్న చేతికి తగిలించింది. నినాదాలు మిన్ను ముట్టాయి.
రజని మామూలు మహిళ కాదు. కారణజన్మురాలు. ఈ సంఘటనలన్నీ వార్తల్లోనివే.
‘ నీ జీవితం ధన్యం. నీవు ఇంటికి బందీవి కావు. నీ మార్గం అనితర సాధ్యం ’ అనుకున్నాడు, కల లోనే.
3
18-5-2021
అరవై ఏళ్ళ వయసు. చిన్నగా దగ్గు. అనుమానం నిజం అయ్యింది. సకల జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.
ఆసుపత్రి. వెంటనే క్యాజువాలిటీకి చేర్చారు. బెడ్ కేటాయించారు. దూరం దూరంగా నాలుగు బెడ్లున్నాయి. వైద్యం మొదలైంది. పక్కన ఎవరో ఆడమనిషి. పరిచితురాలిలా ఉంది. సరిగ్గా పోలిక తెలియడం లేదు.
నెరసిన జుట్టు. కళ్ళజోడు. తెల్లని తెలుపు . మెరుస్తున్న కళ్ళు. ఆమె కోసం జనం వస్తున్నారు, ముసుగు కప్పుకుని. పళ్ళు తీసుకొస్తున్నారు. కాసేపు దూరంగా నిలబడి వెళ్ళిపోతున్నారు.
ఆమె లేచింది. కాళ్ళు కింద పెట్టి బెడ్ మీద కూచుంది. పోల్చుకున్నాడు. ఆమె రజనే.
పలకరించానుకున్నాడు. ఏమని పరిచయం చేసుకోవాలి? పలకరించలేదు. రాఘవ కేసి చూసింది. గుర్తించినట్టు లేదు. గుర్తించే సంకేతం ఇస్తే బావుంటుందేమో.
మర్నాడు` ఇటు పక్కకు చూసి ఆపిల్ పంపింది. మాటలు లేవు. ఆమెనే చూస్తున్నాడు. సర్దుకుని కూచుంది. ఇదే అదను చెప్పేయాలి. తనెవరో ఖచ్చితంగా తెలియదు. తనే చెప్పాలి. ఏమని చెప్పాలి? సందర్భం కల్పించుకోవాలి. రెండు రోజులు గడిచాయి.
కొద్దిగా ఊపిరి బిగపెడుతోంది. వైద్యులు చర్చించుకుంటున్నారు. ఒక వైద్యుడు చెప్పింది మరొకరు వింటున్నారు. ఇద్దరూ ఒక అంగీకారానికి వచ్చినట్టున్నారు. ఫలితంగా ఐసియూ కు తరలించారు. తన ప్రమేయం లేదు. చుట్టూ పరికించాడు. వ్యోమగాముల నౌకలా ఉంది. వాళ్ళిద్దరూ వ్యోమగాముల్లా ఉన్నారు. ఇదేదో వేరే గ్రహంలా ఉంది. ముక్కుకు ఏవో తగిలించారు. చేతుకు వైర్లు చుట్టారు. బెడ్ వార మిణుక్కుమంటూ ఏవో పరికరాలున్నాయి.
పక్కకు చూస్తే ఆమె కూడా వచ్చేసినట్టుంది. కలవడం కేవలం యాదృచ్చికం. ఆమెతో ఇక మాట్లాడటం కుదరదా? ఫలానా అని చెప్పుకోవడం ఎలా?
రాత్రి పగలు తెలియడం లేదు. చల్లగా ఉంది. ముక్కుపుటాలకు చిత్రమైన ఆసుపత్రి వాసన.
శరీరం తేలికగా ఉంది. రెండు అడుగుల ఎత్తులో ఎగురుతున్నట్టుంది. దబ్బున మంచం మీదకు ఒక్క కుదుపుతో పడినట్టుంది. ఎగరడం…మళ్ళీ పడటం…ఏమిటిది? ఈ లోకం విడిచి పెట్టే ఘడియలొచ్చాయా?
బెడ్ మీద పడుకుని కొద్ది రోజుల్లో మరణించడమనే ఊహ మనోహరంగా ఉంది. క్రిమి చురుకైనది.
ఉనికి లేదు. ఉన్నట్టూ ఉండదు. లేనట్టూ ఉండదు. ఎవర్నీ ఎక్కువ కాలం బాధించదు.
ప్రస్తుత అననుకూల పరిస్థితుల్లో చావు తర్వాత దృశ్యాలు కళ్ళ ముందు కనపడ్డాయి.
బంధువులు రారు. మిత్రులు కూడా రారు. రారు అనేది తప్పేమో. రాకూడని పరిస్థితులు . ఎవరి గుప్పెట్లో వారి ప్రాణాులు . తెగించే చొరవ పనికి రాదు. బాకీ పడ్డవాళ్ళు రారు. చితి దగ్గరకు అసలు రారు. పోనీ రానీయరు. ఒకవేళ వచ్చినా దూరంగా నిలబడతారు. నిశ్శబ్దం పాటిస్తారు. అంతా అయిపోయాక ముప్పై వేలకో నలభై వేలకో రశీదు ఇస్తారు. కట్టాల్సిందే. జీవన పోరాటం ఆఖరు. చితి నుంచి పేలే చప్పుడు అయినవాళ్ళకు కూడా వినిపించదు. మహాప్రస్థానం ముగుస్తుంది. శ్మశాన వైరాగ్యంతో తిరుగు ముఖం పడతారు. దబ్బున బెడ్ మీద పడ్డాడు.
పక్కకు చూసాడు. ఆమె ఉంది. ఆమె లేకుండా పోరాటాలు మాత్రం ఉంటాయా? పోవడం ఖాయమైతే ఇద్దరూ ఒకేసారి పోతే బావుండును. ఎందుకో…ఊహలు గమ్మత్తుగా ఉంటాయి. కుదురుగా ఉండనీయవు.
వాంతి వస్తున్నట్టుంది. వికారంగా ఉంది. గుండెల్లో ఏదో కెలుకుత్నుట్టుంది. మాట పెగడం లేదు. నిద్ర పట్టేసింది. దీర్ఘనిద్ర కాదు.
అయితే గియితే విషాద ముగింపును ఎలా అనువదించాలి? ఉహూ…కుదరదు. అక్షర జ్ఞానాన్ని పొదివి పట్టుకోవాలి. పదాలు అయిష్టంగా నైనా గుమిగూడి మంచి అర్థం ఇవ్వాలి. చెట్టు నుండి రాలే పండు కాదు చావు. జీవితాన్ని పండించిన అనుభవాల చితిలో కాలడం కాదు చావు. బూడిదయ్యే చింతన లోంచి పుట్టుకొచ్చే తాత్వికత కాదు.
ఒక్కసారిగా కుప్పకూలే శిఖరం శిథిమవ్వడం…
చుట్టూ తచ్చాడే గాలిలో మృత్యువు దాగి ఉంటుంది. ఏదీ శాశ్వతం కాదు. ప్రాణాలు పెద్ద పెట్టున చప్పుడుతో రాలిపోతున్నాయి. తను మాత్రం ‘ భయం లేదు’ సంకల్పం చెప్పుకుంటాడు. చేయదగిన పనులు మిగిలి ఉంటే అవే బతికిస్తాయి.
సమాజం లోని అన్ని వర్గాలూ బాధితులే. సందట్లో సడేమియాలా దోచేవారు వచ్చేస్తారు. వేల మైళ్ళ దూరం నడిచివెళ్ళే వలస కార్మికుల దైన్యం ఎపుడైనా ఎవరైనా చూసారా? మనిషితనం మాయమైన కాలం.
4
మెలకువ వచ్చింది.
చిత్రంగా ఉంది. సాధారణ రూముకు తీసుకొచ్చారు. అక్కడ రెండే మంచాలు . బతికేసాడు. స్పష్టంగా గాలి పీలుస్తున్నాడు. పైకి ఎగరడం లేదు. కిందకు పడటం లేదు. ఉబ్బిన ఉమ్మెత్తకాయలు కనబడటం లేదు. భయం లేదు. ధైర్యం మందు పోసినట్టున్నారు. పనిచేసింది. ఆకుపచ్చని లోకం చూడొచ్చు అన్నమాట.
ఇది ఇంకా విచిత్రం… ఆమె పక్కనే ఉంది. విడదీయరాని బంధమైంది. ఆమె ఇటు చూసి చిరునవ్వు నవ్వింది. వడలిన దేహపు నవ్వే. ముప్పై అయిదేళ్ళ క్రితం నాటి నవ్వులాగే ఉంది. కొంతమంది నవ్వుకు వయసు మీరదు కాబోలు . తాజాతనంతో వెన్నెల కురిపిస్తాయి.
రిపోర్టులు వచ్చాయి. ఇద్దరికీ నెగిటివ్‌లే. బెడ్‌లకు కొరత ఉంది. ఖాళీ అయితే చాలు వెంటనే భర్తీ అయిపోతాయి. క్షణం పట్టదు.
ఇపుడు ఇక మాట్లాడటం అనవసరం. తోడుగా బయట ప్రపంచం లోకి అడుగు పెట్టడం ఖాయం. సొమ్ము చెల్లించి ఇంటికెళ్ళినపుడు ఆసుపత్రి గేటు దగ్గర మాట్లాడాలి. స్నేహబంధంతో ముడివేయాలి.
గుర్తుండటం ఒక ప్రశ్న. అన్నీ సవ్యంగా ఉంటే ఆవిడ కార్యక్రమాల్లో సహకరించాలి. ఆమెకు అండగా నిలవాలి. ఆలోచనలు సాగుతున్నాయి.
గంట గడిచింది.
ఉన్నట్టుండి`–
పక్క బెడ్ దగ్గర హడావుడి. ఏదో జరిగింది. చూస్తున్నాడు. ఆమె ఊపిరి ఆగింది.
సూక్ష్మ క్రిమి కాదు. ఉధృతంగా వచ్చిన గుండె పోటు. లిప్తలో జరిగిపోయింది. లేచి దగ్గరగా నిబడ్డాడు. కంటి నుండి ధారగా కన్నీళ్ళొచ్చాయి. దుఃఖం ఆపుకున్నాడు.
తమ్ముడు కాబోలు వచ్చాడు. ఆమె పోలికే. ఊహించని ఘటన. అతని ముఖంలో విస్మయం. వణుకుతున్న గొంతు. అయ్యో…అయ్యయ్యో… జీవితం బుడగ… ఎపుడైనా పేలొచ్చు.
పేలిపోయింది. ఆశయాలు, ఆశలు గాలిలో కలిసిపోయాయి.
జరగవలసిన తతంగం. శ్మశానానికి ఏర్పాట్లు. మాట్లాడుకుంటున్నారు. ఇంతలో ఎంత వైపరీత్యం?
తమ్ముడు అంటున్నాడు ` ‘‘ ఇంటికి తీసుకెళ్ళి అక్కడ ఓ గంటా రెండు గంటలు ఉంచి అపుడు శ్మశానానికి …’’ అంత్యక్రియల గురించి చర్చలు .
నెమ్మదిగా తమ్ముడి దగ్గరకు వెళ్ళాడు.
‘‘ వద్దు బాబూ… ఆవిడ… ఉద్దేశం, ఆశయాలు వేరు ’’ తమ్ముడు తల ఇటు తిప్పాడు.
‘‘ మీరెవరు? ’’
‘‘ పక్క బెడ్ వాడిని. ఈ పదిరోజులు పక్క పక్కనే ఉన్నాం. మా ఇద్దరికీ నెగిటివ్ రిపోర్టు వచ్చాయి. పాజిటివ్ అయితే మన ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేదు. తదనంతర పనులు వాళ్ళే చేసేస్తారు. మనల్ని దగ్గరకు రానీయరు. ఆవిడ ఉన్నత ఆశయాలు కలది. ఆ ఆశయానికి తగ్గట్టుగా ఉండాలనే అనుకున్నాం ’’ అని ఆఖరి మాట నొక్కి చెప్పాడు.
వాదించాడు. సున్నితమైన మాటలతో.
పెనుగులాడాడు. పెదాల కంపనంతో.
ప్రాధేయపడ్డాడు. చెమర్చిన కళ్ళతో.
గింజుకున్నాడు. తనలో తాను.
ఇద్దరి మధ్య పరిచయం ఏమిటో చెప్పాడు. దుఃఖపు జీర కదిలించిందేమో. కడకు నెగ్గాడు. మాట ఫలించింది.
పూలతో అంకరించిన వ్యాను సిద్ధం అయింది. ఊరేగింపు మొదలైంది. రుద్రభూమికి కాదు.
ఆ ఊరేగింపు వైద్య కళాశాల దిశగా వెళుతోంది. రేపు కాబోయే ఫ్రంట్ లైన్ వారియర్స్ అక్కడుంటారు. తెలియందేదో నేర్చుకుంటారు. ఒక రహస్య మిత్రుడు సాధించిన విజయంగా తలచాడు రాఘవ .
దూరంగా నిలబడి ఆమెకు చేతులెత్తి నమస్కరించాడు.
‘ఈ మార్గం తనదే. రేపు అందరిదీ కావాలి ‘ ‘ అనుకున్నాడు.
*
చిత్రం: రాజశేఖర్ చంద్రం
A good story sir
thank u kantarao gaaroo
చాలా బాగుంది. అభ్యుదయ భావాలు ఉన్న స్త్రీని భార్యగా అంగీక రించలేని సగటు మగాడు చివరి రోజుల్లో ఆ స్త్రీ ఆశయాలకు ఒక సార్థకత కల్పించడం హర్షణీయం.
ధన్యవాదాలు,మోహన్ రావు గారూ
రాజుగారు… మీ మధుహాసం చదివాను. మీ సూక్ష్మపరిశీలన అర్థమయ్యింది. చిన్న చమత్కారాలతోనే కాదు పెద్ద కథనూ ఉత్కంఠగా నడిపించారు. మనిషి అంతరంగం బహుపార్శ్యాల సమ్మేళనం. పొగడ్త కావాలి, విమర్శ భరించ లేడు. పేరు కావాలి, బాధ్యత మాత్రం తీసుకోడు. ఎవరైనా ముందుంటే తాను వెనుక ఉండి చప్పట్లు కొట్టాలనుకుంటాడు. తాను మాత్రం ముందుండేందుకు ఇష్టపడడు. రజని పట్ల కథానాయకుడి సంఘర్షణకు అదే కారణం. అదీ స్వార్థమే. ఆమెకు పేరొచ్చింది కాబట్టి అప్పుడు తాను తప్పుచేశాననుకున్నాడు. అదే ఆవిడ సమాజంలో వ్యతిరేకత ఎదుర్కొని ఉంటే ‘చూశావా…నేనెంత మంచి పనిచేశానో’ అని సమర్థించుకునేవాడు. నీతి వాక్యాలకేం ఎవరైనా చెబుతారు, ఆచరణే అందరికీ సాధ్యంకాని పని. ‘అభ్యుదయ వాదులు, ఆచరణ కర్తలు ఇంకొక ఇంట్లో ఉండాలి. ఎదురింట్లో ఉండొచ్చు. పక్కింట్లో ఉండొచ్చు. మన ఇంట్లో ఉండకూడదు’ అన్న మాటతో ఇటువంటి గోముఖ వ్యాఘ్రాలకు జల్లకాయ కొట్టారు. మనిషిలోని భిన్నమైన మనస్తత్వాలను బాగా ఆవిష్కరించారు. అభినందనలు సార్. నా అంచనా ప్రకారం మీ కథకు పాఠకుడైన ప్రతి ఒక్కరినీ తమ ‘ఆనాటి అనుభవం’లోకి కచ్చితంగా తీసుకువెళ్లివుంటారు. కథను ఆపకుండా చదివేలా నడిపించారు. కాకపోతే కరోనా సోకిన పేషెంట్లు ఉన్న గదిలోని రజనీ వద్దకు ఎవరెవరో వస్తున్నారు, పండ్లు, పూలు ఇస్తున్నారు అని రాశారు. ఐసోలేషన్ వార్డులోకి వైద్య సిబ్బంది తప్ప ఎవరినీ రానివ్వరు కదా అని నా సందేహం.
రమణమూర్తి గారూ ధన్యవాదాలు
బాగా విశ్లేషించారు, రమణమూర్తి గారూ ధన్యవాదాలు
మీ అనుమతి లేకుండా మీ కథను యథాతథముగా కాపీ చేసి వాట్సాపు గ్రూపుల్లో పోస్టు చేస్తున్నాను మీ పేరుతో సహా అండి.. ధన్యవాదములు