1
ఐక్య గీతం
నీ మతం నీ అభిప్రాయం
నీ భావజాలం …..
కేవలం నీవి మాత్రమే ;
నావి కాదు.
అట్లాగే,
నా మతం నా అభిప్రాయం
నా భావజాలం …..
కేవలం నావి మాత్రమే ;
నీవి కాదు.
ఐనా,
నువ్వు నన్ను ప్రేమిస్తావు ;
నేను నిన్ను ప్రేమిస్తాను !
నిన్నూ నన్నూ కలిపి ఉంచుతున్నది …..
ఏవో కొరుకుడు పడని
సిద్ధాంతాలో సూత్రాలో కాదు ;
యే నిబంధనలకీ నిబద్ధతలకీ
అందని ;
హృదయంలో స్వచ్ఛందంగా యెగసిపడుతోన్న
ఆత్మీయ వాక్యాల దొంతరలైన
అలల డోలికల ప్రేమ కడలులే
కానీ!
2
ఈ యిద్దరూ!
గోచిపాత తొడుక్కొని
వొంటి పైన యింకే వస్త్రం లేకుండా
తిరుగాడిన దిగంబరులే
యీ యిద్దరూ!
తరచి చూస్తే యే భేదమూ లేదు
ఆ యోగికీ యీ ఫకీరుకీ!
పదునెక్కిన అక్షరమై అస్త్రమై
దురంతాలను దునుమాడుతూ
పామరుడి నాలికపై సైతం
నర్తించిన పద్యం వొకతను!
కావడి మోస్తూ
‘ఖసీదా ‘లు పాడుకొంటూ
వీధులంటా బిక్షమెత్తుతూ
ప్రతిగా ప్రేమని పంచిన ‘వలి ‘
యింకొకతను!
నాస్తికుడైన కవి వేమన ఐనా,
ఆస్తికుడైన వలి కాలే మస్తానైనా
కాలాలు వేరైనా
నడయాడిన నేలలేవైనా
అన్ని గోడల్ని త్రోసిరాజని
ప్రతి వొక్కర్నీ హృదయంతో
హత్తుకు పోయిన వాళ్ళే వీళ్ళు!
అంబరం దాకా పరివ్యాప్తమైన మానవీయతకి
పర్యాయ పదాలైన దిగంబరులే
యీ యిరువురున్నూ !
3
అతడు
అతడు ……
శుక్రవారం నాడు మస్జీద్ మెట్ల పైన
తలపై టోపీ దాల్చి
సలాం చేస్తూ,
వొకింత సాయం చేయమని
మస్జీద్ కొచ్చిన ప్రతి వొకర్నీ
అర్థిస్తాడు!
మస్జీద్ మీనార్ గూట్లో
తలదాచుకున్న పావురమతడు!
శనివారం అతడే
గుడి ముందర ప్రత్యక్షమౌతాడు.
నుదిటిపై నామాలు ధరించి
చేతులు రెండూ జోడించి
నమస్కరిస్తూ,
వొకింత సాయం చేయమని
గుడి కొచ్చిన ప్రతి వొకర్నీ
ప్రార్థిస్తాడు!
గుడి ముంగిట ధ్వజస్థంభంపై
రెపరెపలాడుతున్న పతాక
అతడు!
ఆదివారం నాడు మళ్ళీ అతడే
చర్చ్ ప్రాంగణంలో
తన మెళ్ళోని శిలువని
కళ్ళ కద్దుకొంటూ,
సాయం చేయమని చర్చ్ కొచ్చిన
ప్రతి వొకర్నీ వేడుకుంటాడు.
చర్చ్ గోపురం పైని
గణ గణ మోగుతున్న గంట
అతడు!
అతడిని
జీవిక కోసం బిక్షమెత్తే
బిచ్చగాడు మాత్రమే అని
మనం అనుకుంటాం కానీ,
సర్వ మతాల సార మెరిగి
యెలుగెత్తి జీవితాన్ని ఆలపిస్తోన్న
తాత్త్వికుడతడు!
*
మూడు కవితలు బాగున్నాయి
సర్వ మతాల తాత్వికుడతడు-పోలిక బాగుంది