రమాదేవి కవితలు రెండు

నా దృష్టిలో కవిత్వం అంటే మనసు తపన, వేదన, ఆనందం ఏదైనా కానీ ఆ సమయాన మనసు చెప్పిన మాటలు. ఆ మాటలు అప్పటి సమయాన్ని బంధింస్తుంది అనుకుంటాను. అందుకే కొన్నిసార్లు రాసినవారు అందుకున్న వారు ఒకే భావా సంచలనానికి లోనవుతారని నా నమ్మిక.  ప్రేమ, నమ్మకం మనిషి నిండుగా ఉండాలని నాకు తనివి తీరనంత కోరిక. అందుకని నా కవితల్లో ప్రేమ కాసింత ఎక్కువ.

 

1

అందుకోవడం వచ్చాక

నీ మౌనానికి నగిషీలు వేస్తుంటే
మొదలుపెట్టిన చోటనే నిలిచినట్టుంది
చిత్రానికి మరో రంగు కొదవైనట్టుంది
ఎంత పిలిచినా ఇంకా మిగిలినట్టుంది

నీ పదసవ్వడి పలచబడుతుంటే
వెనుతిరిగిచూడ దారి లేనట్టుంది
కలలలోన నీ పేరు చెరిగినట్టుంది
వెతుకులాటలో దారి తప్పినట్టుంది

నీ నీడను ఆక్రమించిన నాకు
తెలియని దారిన నడవాలనుంది
కనబడని చూపులతో కట్టేయాలనుంది
మరింత ప్రేమించ దారి వెతకాలనుంది
నీపై మక్కువ ఏదో తెలుసుకోవాలనుంది

ఓయ్
అన్నీ తెలుసుకున్నాక
నిన్ను వదులుకోలేనన్న భయముంది
వదిలేసి వెళ్తానేమోనన్న ఆరాటముంది

అయినా
అందుకోవడం వచ్చాక
అనుమానాలు ఎందుకో…ఏమంటావ్

 

రహస్యం

కొన్నివేల సంవత్సరాల
పాత వాసనల గాలి తెమ్మెర
నా చెంత చేరింది…

ఎప్పుడో
కరిగి రాలిపోయిన
సమయాన్ని వెతికి తెచ్చింది…

అక్కడ
కలవరపడుతూ … తడబడుతూ
చుట్టూ చిక్కని నిశ్శబ్దపు దారులు
ఆకాశాన్ని కప్పుకుంటూ ఓ సముద్రం

అందులో
కవ్విస్తూ … ఓ కల
వలయాలు వలయాలుగా తిరుగుతోంది

ఓయ్…
నాడు నా దోసిట
చిక్కింది నీవే కదూ…

*

చిత్రం: రాజశేఖర్ చంద్రం

ఆర్. రమాదేవి

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • దోసిట చిక్కుబడింది నీ ప్రేమే…అందుకోవడం వచ్చాక, ఎదురుచూపులు అక్కరలేదంటావ్, గా మొత్తానికి… బావుంది బావుంది రమా ❤️

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు