రత్నమాల స్వైన్, ప్రముఖ ఒరియా కవయిత్రి, ఆర్కిటెక్ట్, వ్యాపారవేత్త. ఆమె ఇటీవలి పుస్తకం ” Claiming The Sky” చాలా ప్రాచుర్యం పొందింది.
ఒరియా మూలం: రత్నమాల స్వైన్
ఇంగ్లీష్ అనువాదం: పూరబి దాస్, దుర్గా ప్రసాద్ పాండా
తెలుగు: ఇంద్రప్రసాద్
1.
సిసిఫస్
జీవితం మట్టిలో కలిసిపోతుంది
మనకి ఎప్పుడూ అదే ఆలోచన
ధూళి ధూసరితమైన నేల
భక్తితో తలవంచు
దేవతల శాపాలన్నీ భరించు
బొండ్రాయిని పైకి తొయ్యడానికి
అవే నీకు సాయం
అయినా రాళ్లు స్థిరంగా ఉండవు
జర్రున జారిపోతాయి
భూమ్యాకర్షణే గెలుస్తుంది
గాఢమైన దీర్ఘ నిశ్వాసాల గాథ
కాలాన్ని అధిగమించి నడుస్తూనే ఉంటుంది
ఒక జన్మనుంచి మరోజన్మకి
ఈ ప్రపంచంతో మనిషికి
అనుబంధమే ఒక శాపం
ఈ బంధం నుంచి తప్పుకొలేం
ఈ భూమి ఒక మార్గం
అదే నా శరీరమవ్వాలి
ఇదే నా కోరిక
మట్టి మట్టిలో కలుస్తుంది
అంతులేని ఈ జీవనయానంలో
2.
మా అమ్మాయి
మా అమ్మాయి ఎప్పుడూ
ఆన్లైన్లో ఉంటుంది
నేనే, ఆఫ్ లైన్!
ఆమె ఓ కొత్త సెలయేరు
గండ శిలల నుంచి
ఉబికి వస్తున్న జలపాతం
నేనా! అన్నీ ఉడిగి
అలిసి సొలసి
సముద్రంలో కలవడానికి
సిద్ధంగా ఉన్న ఉదాసీన నదిని
నాకూ, నా బిడ్డకూ
కలిసి ఉన్నప్పుడు
ఎడతెరిపి లేని అలజడి,
ఒకరంటే ఒకరికి
ఓర్చుకొలేనంత అసహనం
దూరంగా ఉన్నప్పుడు మాత్రం
ఎప్పుడు కలుస్తామా అని ఆత్రం
మా అమ్మాయి ఎప్పుడూ
ఆన్లైన్లో ఉంటుంది
నేనే, ఆఫ్ లైన్!
ఆమెను చూసినప్పుడు
అనిపిస్తుంది
ఆమె ఒక అద్దం
అందులో
నెమ్మదిగా కరిగిన
నా జీవితమే!
బహుశా నన్ను చూసినప్పుడు
ఆమె అనుకుంటూ ఉండచ్చు
“ప్రయాణాన్ని నిరోధించే
ఎర్రజెండా!
కొంతకాలం తన జీవితాన్ని
అతలాకుతలం చేస్తున్న
అడ్డుకట్ట!”
అప్పుడప్పుడు
చేతిలో చిన్న కాగడాతో
ప్రవేశిస్తుంది
దీపాలుడిగిన నా చీకటి నగరంలోకి
అప్పుడప్పుడు
నేనూ జారుకుంటాను
ఆమె ఆలోచనల నగరాలలోకి
పీడకలల నీడలో
ఒకోసారి అనిపిస్తుంది
మేమిద్దరం ఒకే నగరమని
ఎక్కడ దీపాలు
అరుతూ వెలుగుతూ ఉంటాయో
నిరంతరంగా –
*
Add comment