రజాకార్ల పేరిట ఈ వక్రీకరణలు ఎంతకాలం?!

ఖిడ్కీ కలెక్టివ్‌ అందిస్తున్న ప్రత్యామ్నాయ కథనాలు -1

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ హాజరైన తెలంగాణ బీజేపీ నేత గూడూరు నారాయణరెడ్డి నిర్మిస్తున్న ‘రజాకార్‌ ది సైలెంట్‌ జెనోసైడ్‌’ పోస్టర్‌ ఆవిష్కరణ కార్యక్రమం తీవ్ర చర్చనీయాంశమైంది. 1990ల నుండి హిందూ సంఘాలు సెప్టెంబర్ 17ని హిందువులపై ‘ముస్లిం రజాకార్లు’ ‘నిరంకుశ ముస్లిం నిజాం’ దురాగతాల నుండి విముక్తిగా చిత్రీకరిస్తున్నాయి.తాజాగా అమిత్ షా ఆల్ ఇండియా మజ్లిస్-ఈ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీని రజాకార్ అని, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రజాకార్లకు సహకరిస్తున్నారని అన్నారు. ఈ విధంగా రజాకార్ అన్న పదాన్ని ఇష్టమొచ్చినట్టు వాడడం ఏ ముస్లింనైనా రజాకార్‌గా పేర్కొనడానికి తోడ్పడుతుంది, ఇంకా వారిని హిందూ వ్యతిరేకులుగా, భారత దేశ వ్యతిరేకులుగా చిత్రీకరిస్తుంది. రజాకార్ లాంటి సినిమాలు నిజాన్ని వక్రీకరించడానికి, చరిత్రను తిరగరాయడానికి, అవాస్తవాలను ప్రచారం చేయడానికి ఉపయోగ పడతాయి.

రజాకార్ల పై వచ్చిన సినిమాలలో ఇదేం మొదటిది కాదు. 1948 పోలీస్ ఆక్షన్ పై ఇంతకు ముందు కూడా కొన్ని సినిమాలొచ్చాయి. 1979 లో వచ్చిన బి నర్సింగ్ రావు దర్శకత్వం వహించిన మా భూమి, 1946 నుంచి 1951 మధ్య  జరిగిన తెలంగాణ సాయుధ పోరాటం కథను చెప్పిన మొదటి సినిమాలలో ఒకటి. స్వయంగా కమ్యూనిస్ట్ ఉద్యమంతో సంబంధం ఉన్న నర్సింగ్ రావు, ఉద్యమ చరిత్రను చెప్పిన చిత్రం ఇది. ఈ చిత్రం రైతుల, కార్మికుల దృక్కోణం నుంచి 1948 చరిత్రను చూపిస్తుంది.తెలంగాణ పల్లెలలో దొరల దురాగతాలను, దొరలకు వ్యతిరేకం గా రైతులను రైతు కూలీలను సమీకరించడానికి సంఘం కృషిని చూపిస్తుంది. ఈ సినిమాలో ముస్లింలు కామ్రేడ్ లు గా సహచరులుగా కనిపిస్తారు, ముస్లింలందరిని రజాకార్లుగా ఈ చిత్రం వక్రీకరించదు.

హైదరాబాద్ భారత యూనియన్ లో విలీనం అయిన తర్వాత, దొరలందరు కాంగ్రెస్ టోపీలు ధరించడంతో రైతులు తమ పోరాటాన్ని కొనసాగించ వలసిన పరిస్థితులను ఈ చిత్రం చూపిస్తుంది. రైతులు రైతుకూలీలు భారత సైన్యం చేతిలో చనిపోవడం ఈ చిత్రం చూపిస్తుంది. అలా ఈ చిత్రం, భారత దేశం వచ్చిన తరవాత కూడా భూస్వామ్య దురాగతాల కొనసాగింపు చూపిస్తుంది.

మా భూమి వచ్చిన మూడు దశాబ్దాలకు వచ్చిన ఆర్.నారాయణ మూర్తి సినిమా వీర తెలంగాణ. 2000లలో తెలంగాణ పోరాట పునరుజ్జీవనం తరవాత  1940ల చరిత్రపై ఆసక్తి పెరిగింది. 2010లో తీసిన వీర తెలంగాణ దాదాపు ఇదే మా భూమి లాంటి కథతో చిత్రీకరించారు. ఈ చిత్రం షేక్ బందగీ, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య,  మఖ్దూం మొహియుద్దీన్, షోయబుల్లా ఖాన్ వంటి వారి చరిత్రలను చూపిస్తుంది. ఆ సమయం లో పనిచేసిన కమ్యూనిస్టులను, కాంగ్రెస్ వాదులను, ఆంధ్ర మహాసభను, అతివాదులను ఈ చిత్రం చూపిస్తుంది. కానీ ఈ చిత్రం రజాకార్లను కేవలం ముస్లింలుగా చిత్రీకరిస్తుంది. నిజాం హైదరాబాద్ బైట నుంచి ముస్లింలను ఇస్లాం మతం కోసం రప్పిస్తున్నాడని ఆరోపిస్తుంది. దీని వల్ల రజాకార్ల చర్యలన్నీ  ముస్లింల చర్యలుగా  చూపిస్తుంది.

ఒక సంవత్సరం తర్వాత తెలంగాణ రాష్ట్ర పోరాటం సమయం లో వచ్చిన సినిమా రాజన్న. దీని రచయితా, దర్శకుడు వి. విజయేంద్ర ప్రసాద్, దర్శకుడు రాజమౌళి తండ్రి, ఇప్పుడు రాజ్యసభ ఎం పీ, ఆర్ ఆర్ ఆర్ లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు రాసారు. ఇటీవలే ఆయన ఆర్ ఎస్ ఎస్, భాజప మాతృ సంస్థ ను కీర్తిస్తూ ఒక ఓ టి టి సిరీస్ రాస్తున్నారు. 2011 లో వచ్చిన రాజన్న సినిమా ఇంకో అడుగు ముందుకేసి హిందూ సంఘాలు వక్రీకరించిన కథను చరిత్రగా చూపిస్తుంది. ఇందులో హీరో రాజన్న ఒక ‘స్వాతంత్ర సమరయోధుడు’, స్వతంత్ర పోరాటం తర్వాత మహారాష్ట్ర నుంచి తెలంగాణకు వస్తాడు. తెలంగాణ లో ప్రత్యేకంగా ఆదిలాబాద్ లోని నేలకొండపల్లి లో రైతుల పై, రైతు కూలీల పై, ఆదివాసీ ల పై దొరల దురాగతాలకు చలించి, వారిని చైతన్య పరచడానికి పాటలు పాడతాడు. దొరల మరియు ‘మహమ్మదీయుల’ దురాగతాలను చూపించే ప్రయత్నంలో ఈ సినిమా చారిత్రిక అధరాలు లేని విషయాలను చూపిస్తుంది. ఆడవాళ్ళ పై ముస్లింలు రొమ్ము పన్ను విధించినట్టు  వక్రీకరిస్తుంది. రాజన్న ను దొర రజాకార్ల సహాయం తో చంపేస్తాడు.  కొన్ని సంవత్సరాల తర్వాత అతని కూతురు 8 ఏళ్ళ మల్లమ్మ తన పల్లెను దొరలనుంచి దొరసానుల నుంచి విముక్తి చేయడానికి ఢిల్లీ వెళ్లి ప్రధాని నెహ్రుని  కలుస్తుంది.

పూర్తిగా కల్పిత కథ అన్న మాట అటుంచితే, రాజన్న సినిమా సంఘం, కమ్యూనిస్టుల కృషి తో జరిగిన తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఒక కాషాయ బొట్టు పెట్టుకునే వ్యక్తి ప్రేరణ తో జరిగిన కథగా మార్చేస్తుంది. 1940 లలో మరాఠ్వాడా జిల్లాలో హిందూ సాంప్రదాయ వాదుల ఆగడాలు, అసఫ్ జాహి ప్రభుత్వ మరియు ప్రజల ఆస్తులు నాశనం చేయడం జరుగుతుండేవి. రాజన్న పాత్ర ఈ ‘స్వతంత్ర యోధుల’ నుంచి ప్రేరణ పొంది ఉండవచ్చు. నిజం చెప్పాలంటే హిందూ సాంప్రదాయిక శక్తులకు తెలంగాణ సాయుధ పోరాటంతో ఏ  సంబంధం లేదు, కానీ ఇటువంటి అస్పష్టమైన కల్పితమైన కథలను చరిత్ర గా చిత్రీకరించడం తో నిజాలను కప్పి పుచ్చే ప్రయత్నం చేస్తుంది.

ఒక నామమాత్రపు స్వతంత్ర యోధుడి గా ముస్లింను చూపించడం తప్ప రాజన్న సినిమా మొత్తం ముస్లింలను రైతులపై ఆదివాసీలపై ఆగడాలకు పాల్పడినట్లు గ చూపిస్తుంది. ముస్లింలలో ఎంతో మంది సామాన్యులు రజాకార్లతో సంబంధం లేని వాళ్ళు, బీద వాళ్లే ఎక్కువ ఉన్న సంగతి ఈ సినిమా పూర్తిగా కప్పి పుచ్చుతుంది. ఈ కథలో ఏళ్ళ మల్లమ్మ ప్రధాన మంత్రి నెహ్రుని కలిసి,  తెలంగాణను విముక్తి చేయవలసిందిగా కోరుతుంది, ఇది తెలంగాణలో ప్రతి ఒక్కరు భారత దేశ విలీనాన్ని కోరుకున్నారని చూపించే ప్రయత్నం. నిజం చెప్పాలంటే అప్పటి చరిత్ర చాలా క్లిష్టమైనది, నిజాం వ్యతిరేకులు, నిజాం పాలనలో ఉండాలనుకునే వాళ్ళు, భారత ప్రభుత్వం భూస్వాముల రాజ్యమని దాన్ని ఖండించిన వాళ్ళు ఇలా ఎన్నో విధాలైన అభిప్రాయాలున్నాయి.

ఇటీవలి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఏడు సంవత్సరాల తర్వాత అన్హర్డ్ పేరిట ఒక చారిత్రిక ఓ టి టి సిరీస్ డిస్నీ + హాట్ స్టార్ లో విడుదలైంది. 1920 లలో మొదలైన ఈ కథ మొదటి నుంచి అన్వర్  అనే ఒక పాత్ర కాంగ్రెస్ కార్యకర్తలను చంపుతునట్టు గా చూపిస్తుంది. రజాకార్లు 1930 లలో మాత్రమే ఏర్పాటయ్యారు, హైదరాబాద్ కాంగ్రెస్ కూడా 1938 లోనే ఏర్పాటైంది. ఈ సిరీస్ మాత్రం హైదరాబాద్ చరిత్రను అనాలోచితంగా వక్రీకరిస్తుంది.

అంతే కాకుండా ఈ సిరీస్ లో ఒక అతివాద భావాలూ కలిగిన పాత్ర హింసతో బ్రిటిష్ నుంచి విముక్తి పొందాలని నమ్ముతుంది, అతనికి  నిజాం ప్రభుత్వం ఉరి విదిస్తుంది. ఈ సిరీస్ ఈ పాత్రను మళ్ళి మళ్ళి భగత్ సింగ్ తో పోలుస్తుంది. అసలు సంగతేంటంటే ఆ సమయం లో హైదరాబాద్ కు పంజాబ్ కు పొంతన లేదు, ఆ రెండు చోట్ల పరిస్థితులు చాలా వేరు, ఇంకా హైదరాబాద్ లో మరణ శిక్షను నిజాం 19 వ శతాబ్దపు చివర్లోనే నిషేధించాడు. రాజన్న సినిమాలాగే ఈ సిరీస్ కూడా చరిత్రను ఇష్టమొచ్చినట్టు అబద్ధాలతో నింపుతుంది.

అన్హర్డ్ కథ జాతీయవాదం చుట్టూ తిరుగుతుంది, కనుక గాంధీ నెహ్రూల గురించి ఎంతో చర్చ చూపిస్తుంది కానీ నిజాం రాష్ట్రం లో జరిగిన తెలంగాణ సాయుధ పోరాటం  కేవలం ఒక చిన్న ప్రస్తావనకు వస్తుంది. దేశం జాతీయవాదం ముందు హైదరాబాద్ వివరాలు ఈ సిరీస్ కు ప్రాముఖ్యత లేని విషయాలు గా కనిపిస్తాయి. పోలీస్ ఆక్షన్ లో జరిగిన హింసకు నష్టానికి పూర్తి భాద్యత ఈ సిరీస్ కేవలం హైదెరాబాదీల మీద పెడ్తుంది. విలీనానికి ముందు తర్వాత జరిగిన హింస మొత్తనికి రజాకార్లు మాత్రమే కారణం గా చూపిస్తుంది. భారత సైన్యం వల్ల కానీ హిందువుల వల్ల కానీ ముస్లింల పై జరిగిన మత హింస ను దాని వల్ల మరణించిన వేలాది  మంది ముస్లింలను కనీసం ప్రస్తావించదు. ఈ సిరీస్ ప్రకారం నిజాం ఇండియన్ యూనియన్ లో విలీనం అయ్యి ఉంటె ఈ ఊచకోత ను తప్పించ గలిగే వాడు కనుక తప్పు నిజాందే.

ఈ పైన చర్చించిన అన్ని చిత్రీకరణలో కొన్ని సారూప్యాలున్నాయి, వీటి మీద సమకాలీన రాజకీయాల ప్రభావాలున్నాయి

ఈ సినిమాలన్నీ రజాకార్ ను రూమి టోపీ షేర్వాణీ లో ఉర్దూ మాట్లాడుతూ చూపిస్తాయి. ఉర్దూ అప్పట్లో దేశభాష కనుక అన్ని కుల మతాల వాళ్ళు వాడేవారు, నిజాం దేశ ఆఖరి రోజుల్లో దీనికి వ్యతిరేకత పెరిగింది. నిజాంకు వ్యతిరేకంగా ఉన్న దాశరధి రంగాచార్య వంటి తెలుగు రచయితలు కూడా తన గ్యాపకాల్లో ఉర్దూ మీద ప్రేమను వెలిబుచ్చారు, భాషను మతంతో ముడిపెట్టడం సరి కాదని రాసారు. కానీ ఈ సినిమాల్లో చిత్రీకరణలు ప్రతి ముస్లింను రజాకార్ తో కలుపుతాయి.

ఇంకో సారూప్యత ఏమిటంటే ఈ సినిమాలన్నీ ముస్లింలపై ఇండియన్ ఆర్మీ ఇంకా హిందూ సాంప్రదాయిక దళాలు జరిపిన అణచివేతను హింసను ఎక్కడా ప్రస్తావించవు. సుందర్ లాల్ కమిటీ ఇచ్చిన అంచనాల ప్రకారం కనీసం 27000 నుంచి 40000 దాకా ముస్లింలు ఈ హింస లో ప్రాణాలు కోల్పోయారు. అసలు సంఖ్యా ఇంకా చాల ఎక్కువ. ఈ ముస్లింల మరణాలకు, నష్టాలకు తెలుగు సినిమాలో ఎలాంటి ప్రస్తావనా కనిపించదు, తెలుగు సినిమా కేవలం హిందువులను మాత్రమే తమ ప్రేక్షకులుగా భావించడం వల్ల  కాబోలు!

తెలంగాణ రాష్ట్ర పోరాటం సందర్భంలో 1940ల చరిత్ర ప్రాముఖ్యత సంతరించుకుంది. రాజకీయ లాభాల కోసం తమ భావజాలం తో సంబంధం లేకుండా 1940 లలో ఉనికి లేని భాజ పా లాంటి పార్టీలు కూడా తమను తెలంగాణ సాయుధ పోరాట వారసులుగా చెప్పుకుంటున్నారు. రాజన్న లాంటి చరిత్రను వక్రీకరించి సినిమాలు ఈ వారసత్వాన్ని ఆపాదించుకునే ప్రక్రియను సులభతరం చేస్తాయి. ఒకసారి చారిత్రిక ఆధారాలు సంభంధం లేకుండా చరిత్రను ఒక కథగా మారిస్తే దాన్ని ఎవరైనా సొంత లాభం కోసం వాడుకునే వెసలుబాటు కలుగుతుంది.

ఈ పైన చర్చించిన సినిమాలేవీ కుల ప్రస్తావన తీసుకురావు. కేరళలో ట్రావన్ కోర్ రాజ్యంలో ఆధిపత్య కుల పాలకవర్గం విధించిన రొమ్ము సుంకం (బ్రెస్ట్ టాక్స్)ను తెలంగాణ లో ముస్లింలు విధించినట్టుగా చూపించి, రాజన్న సినిమా ముస్లింలను కామదృష్టి కలవారుగా, హిందువులందరు వారి భాదితులుగా చూపిస్తుంది.

కులం గురించి ప్రస్తావించకుండా ఈ సినిమాలన్నీ చరిత్రను ఒక హిందూ – ముస్లిం కథగా మారుస్తాయి. కులం గురించి మాట్లాడితే అణచివేత గురిచేసిన రజాకార్ల లో కూడా ఎంతో మంది అణచివేతకు గురైన వాళ్ళు కనిపించే అవకాశం ఉంది.  కులం గురించి మాట్లాడితే ఇపుడు తెలంగాణ వారసత్వం పై దావా చేసే వాళ్లలో ఎంతో మంది అధికార కులాల వారని, తెలంగాణ రైతులను ప్రజలను అణచివేసిన వారి వారసులని అర్ధమవుతుంది. పైగా హిందూ ముస్లిం హింస గా చిత్రీకరిస్తున్న హింసలో కుల హింస దానికి వ్యతిరేకంగా జరిగిన ప్రతీకార హింస కూడా బయటపడే అవకాశం ఉంది.

 

‘డేంజర్స్ ఆఫ్ సింగిల్ స్టోరీసిరీస్ 1948 నాటి పోలీస్ యాక్షన్‌పై ప్రత్యామ్నాయ దృక్కోణాలను అందిస్తుంది. హైదరాబాద్‌ విలీనాన్ని  హైదరాబాద్   ‘విముక్తిగా ప్రచారం చేస్తున్న ప్రధాన స్రవంతి కథనాలు ప్రస్తుతం నడుస్తున్న విభజన రాజకీయాలను మరింతగా పెంచడానికి ఉపయోగపడతాయ్ అన్న స్పృహ తో, దానికి విరుగుడు గా ప్రత్యామ్నాయ కథనాలను పాఠకులకు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం ఇది. చరిత్ర, రాజకీయాలు, సంస్కృతిపై బహిరంగ  చర్చను బలపరిచే ఉద్దేశంతో ఏర్పడి వాటిని రూపొందించడానికి కట్టుబడి ఉన్న మేధావుల నెట్‌వర్క్ ఖిడ్కీ కలెక్టివ్‌ తరఫున  స్వాతి శివానంద్, యామిని కృష్ణ, ప్రమోద్ మందాడే కథనాలకు సంపాదకత్వం వహించారు.

*

 

 

యామినీ కృష్ణ

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు