రగిలే నిప్పుకణికల మీద డప్పు పాట!

వాడిపోయిన పూలు
అశ్రుధారలని అవిరామంగా వర్షించే ఆకాశం
కొడిగట్టిన దీపాలు
పగిలిముక్కలైన అద్దం
మూగవోయిన సంగీతం
ముగిసిపోయిన నాట్యం
– ఫైజ్ అహ్మద్ ఫైజ్

రుణోదయ రామారావు వెళ్ళిపోయాడు. మే మాసపు మండుటెండలలో పాటల చెలిమలని ఒంటరిగా వదిలేసి, చేతివేళ్లు అలా ఆడిస్తూనే, కంజిర సంగీతాన్ని హడావుడిగా వదిలేసి, మళ్ళీ ఎప్పుడు వస్తాడో చెప్పకుండానే వెళ్ళిపోయాడు. వడగాడ్పులలో కాజీపేట, రామగుండం రైల్వే కార్మికులకి మేడే గీతాలని ఆలపించి, ఎగరేసిన ఎర్రటి జెండాని అందించి, హైదరాబాద్ చేరుకొని, అక్కడ ఎటో వెళ్ళిపోతున్న మృత్యువుని, విద్యానగర్ ఆంధ్ర మహిళాసభ ఆసుపత్రి దగ్గర ఈలవేసి మరీ పిలిచి కలవడానికి, ఆటో ఎక్కకుండానే ఎక్కడికో వెళ్ళిపోయాడు. అమరవీరుల పాటలలో లీనమై కన్నీళ్లు పెడుతూ, పెట్టించిన మనిషి ఇప్పుడు పాడకుండానే కన్నీళ్లు తెప్పిస్తూ వెళ్లిపోయాడు. అక్కడొక సభ ఉండునా? ‘ముదురు తమస్సులో మునిగిపోయిన సమాధి’ అంటూ జాషువా పద్యాన్ని ఆలపిస్తూ, దీపమై వెలుగుతున్నాడో? పీడిత ప్రజల ప్రియతమ నాయకుడు రామనర్సయ్య నెత్తుటి మడుగులో ఒరిగిన చిత్రాన్ని కళ్ళకు కడుతూ కన్నీరు పెట్టిస్తున్నాడో. అడవి ఏడ్చిందని చండ్ర పుల్లారెడ్డిని గుర్తుకు తెస్తున్నాడో. బహుశా వీరగాధలని వుర్రూతలూగించేలా పాడుతున్నాడో? రగిలే నిప్పుకణికల మీద డప్పును వేడిచేసి కణకణమండే పాటే పాడుతున్నాడో, మరొకరు పాడుతుంటే పక్కన నిలబడి దరువు వేస్తున్నాడో?

రామారావు గురించి ఏమని చెప్పుకోవాలి? కర్నూలు జిల్లా ములగవల్లిలో పుట్టిన మాల సత్యాన్ని, అరుణోదయ రామారావుగా మలిచిన వుద్యమమెంత సత్యమో, తన అసమాన ప్రతిభా పాటవాలని అమ్మకపు సరుకుగా మార్చుకోకుండా, ప్రలోభాలని తిరస్కరించి కడదాకా ప్రజాగాయకునిగా నిలిచిన తన వ్యక్తిగత నిబద్ధత కూడా అంతే సత్యం. పాటలపై తనదైన ముద్ర వేసినా, విస్తృత ప్రచారంలోకి వచ్చిన అనేక పాటలని తానే స్వరపరిచినా ఆ విషయాన్ని ప్రకటించుకోని నిరాడంబరతయే తనని ప్రత్యేకంగా నిలబెట్టిందన్నది అంతే సత్యం.

ఇంకా ఏమని చెప్పాలి రామారావు గురించి. బీడీ కార్మిక నాయకురాలు అరుణక్క తన జీవిత సహచరి. ఎక్కడో కర్నూలు జిల్లాలో పుట్టిపెరిగిన తననీ, ఖమ్మంజిల్లాలో పుట్టిన అరుణనీ కలిపింది గోదావరిలోయ ప్రతిఘటనా వుద్యమమైతే, వ్యక్తులుగా ఆ ఇద్దరినీ జంటగా చేసింది చండ్ర పుల్లారెడ్డి, ఆయన రాజకీయాలు. తెలుగు రాష్ట్రాలలో లేక్కలేనంత మందికి ఆయనొక ఆప్తుడు, బంధువు, కుటుంబ సభ్యుడూ. అది ప్రకాశం జిల్లా ఉప్పుగుండూరు కావచ్చు, అనంతారం కావచ్చు, నల్లగొండ జిల్లా వెలిదండ కావచ్చు, రంగాపురం కావచ్చు. కర్నూలు జిల్లా బొల్లవరం కావచ్చు. గోదావరిలోయ అడవి పల్లెలు కావచ్చు. తెలుగు రాష్ట్రాలలో అనేక జిల్లాల నుంచి సహచరులు, మిత్రులు, వివిధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, ఉద్యోగులు, వివిధ వృత్తుల ప్రజలు పెద్దఎత్తున తరలి వచ్చిన ఆయన అంతిమయాత్ర (మే 6, 2019), రైతుకూలీలు, జూట్ కార్మికులు, బీడీ కార్మికులు, మునిసిపల్ కార్మికులు, హమాలీలు, విద్యార్ధి యువజనులు రెండు రాష్ట్రాలలో పలు గ్రామాలు, పట్టణాలలో స్వచ్ఛందంగా నిర్వహించుకున్న సంతాపసభలు కావచ్చు.. ఆయన ఎందరెందరికి ఎంత సన్నిహితుడో తెలియజేస్తాయి.

రామారావుది విలక్షణమైన గొంతు. రామాంజనేయ యుద్ధం, శ్రీకృష్ణ రాయబారం, సత్య హరిశ్చంద్ర పౌరాణిక నాటకాలు, జాషువా పద్యాల నుంచి నాజర్ బుర్రకథ వారసత్వం, కానూరి, శివసాగర్, కాశీపతి విప్లవగీతాల దాకా సాగిన తన ప్రయాణంలో శాస్త్రీయ సంగీతపు ఒరవడీ, ప్రజాకళా రూపాల మేళవింపూ కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. విలువైన తరతరాల సాంస్కృతిక వారసత్వాన్ని, అందులోని మకిలిని తిరస్కరిస్తూ, ప్రజల కోణంనుండి సొంతంచేసుకొనే విషయంలో రామారావు కృషిని మనం ఇంకా గుర్తించాల్సే వుంది. డప్పు, కంజిర వాద్యాలపై తనకున్న పట్టు అసమానమైనది. అద్భుతమైన కంఠస్వరం తన సొంతమైనా, స్వరాలనీ, రాగాలనీ అలవోకగా ఆలపించగల ప్రతిభ, నైపుణ్యం తనకి సహజంగానో, సహజాతంగానో అబ్బినా వాటినేనాడూ తన గొప్పతనం చాటుకోవడానికన్నట్లు చూడలేదు, వాడుకోలేదు. పాట బాగా పాడావంటే నోరారా నవ్వేవాడు, ఎప్పుడైనా శృతి దెబ్బతిందనీ, పాటని చెడగొట్టావనీ విసుక్కుంటే భుజంమీద తట్టి నవ్వుతూ వెళ్ళిపోయేవాడు. ఇప్పుడిక ఇంకొక సభలో మునుపటి కంటే బాగా పాడతాడని ఎదురుచూడడం ఎలా?

నక్సల్బరీ, శ్రీకాకుళం పోరాటాలు దెబ్బతిని, ఎమర్జెన్సీ నిర్బంధంలో తీవ్రమైన నష్టానికి గురై దెబ్బతిన్న విప్లవోద్యమాన్ని పునరుద్ధరించిన అనంతర కాలంలో రామారావు పాట నిర్వహించిన పాత్రని ప్రత్యేకించి చూడాలేమో. ఉయ్యాలో జంపాల, అన్న అమరుడురా మన రామనర్సయ్య, వీరగాధల పాడరా వంటి పాటలు, బుర్రకథలు, వీధిబాగోతం ప్రదర్శనలు విస్తృతస్థాయిలో ప్రజలు, విద్యార్ధి యువజనులనీ విప్లవోద్యమం వైపు ఆకర్షించాయి. 1980లలో భారతదేశంలో పర్యటించిన స్వీడన్ రచయిత ఇయాన్ మిర్డాల్ తన ‘ఇండియా వెయిట్స్’ పుస్తకంలో అన్న అమరుడురా పాట గురించి ప్రత్యేకంగా పేర్కొన్నాడు. కదిలించే ఈ పాటతో పోల్చదగినదేదీ తన దృష్టికి రాలేదనీ, రష్యన్ విప్లవ నేపథ్యంలో వచ్చిన రష్యన్ పాట (రెవల్యూషనరీస్ ఫ్యునరల్ మార్చ్) కంటే, ఇది ఎంతో గొప్పగా అనిపిస్తుందనీ ఆయన రాశాడు. రామారావు గొంతులో మారుమోగిన ఆ పాట వేలాది మందిని కంటతడి పెట్టించింది. కసితో కర్తవ్యోన్ముఖుల్ని చేసింది.

రామారావు ఎంత గొప్ప గాయకుడో, అంత మంచి మనసున్న సున్నిత హృదయుడు. పాటలు పాడడం మాత్రమేకాదు ఎందరో నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరుల చికిత్స, వైద్యం అవసరాలని ఎంతో శ్రద్ధగా పట్టించుకుని దగ్గరుండి ఆసుపత్రులకి తీసుకెళ్ళేవాడు, అక్కడ డాక్టర్లతో తనకున్న పరిచయాలతో సహాయపడేవాడు. మిత్రులకి అకస్మాత్తుగా ఫోన్ చేసేవాడు, ఇదిగో మీ వూరికి వచ్చాననో, ఇదిగో ఇప్పుడే మీ వూళ్ళో, మీ ఇంటి ముందునుంచి వెళ్తున్నాననో చెప్పేవాడు. ఇష్టమైన ఒక పద్యాన్నో, కవితనో, పాటనో వినిపించేవాడు. కవిత్వం చదివినా, పాటలు పాడినా, పార్టీ డాక్యుమెంట్లపై చర్చలలో పాల్గొన్నా ఉద్వేగభరితంగా వాటిలో లీనమై పొయ్యేవాడు. దారిలో ఎక్కడైనా కనబడితే పెద్దగా ఈలవేసో, కేకలు వేసో పిలిచేవాడు. పెళ్లి, చావు, సభ ఏదైనా కావచ్చు, పిలిస్తే ఎంత దూరమైనా, కష్టమైనా వీలుచేసుకొని వెళ్ళేవాడు. వయసులో పెద్దవాళ్ళైనా, చిన్నవాళ్లు అయినా అందరితో కలిసిపోయి హాస్యమాడేవాడు. తానొక గొప్ప గాయకుడినననే భేషజాన్ని ఎన్నడూ ప్రదర్శించలేదు. ఇలా సహాయపడే లక్షణమూ, కలుపుగోలుతనమే రామారావుని ఎంతోమందికి అత్యంత ఆప్తునిగా తయారుచేసింది. తనని వాళ్ళ కుటుంబంలో ఒకడిగా భావించేలా చేసింది.
ఉద్యమంతో సన్నిహితం అల్లుకుపోయిన రామారావు సుదీర్ఘ రాజకీయ జీవితం తనకి ఎందరో మిత్రులని సంపాదించింది. ఉద్యమాలలో, సంస్థలలో అవాంఛనీయమైన చీలికలు ఎన్ని వచ్చినా, రామారావు తన స్నేహితులని దూరం చేసుకోలేదు. సిపిఐ(ఎం.ఎల్) ప్రధాన కార్యదర్శి రామచంద్రన్ ఒకసారి చీలికల విషాదాన్ని పరామర్శిస్తూ ఖమర్ జలాలాబాదీ గీతాన్ని ఒకసారి గుర్తుచేసాడు,

వెయ్యి ముక్కలైన ఒక్క హృదయం
శకలాలు కొన్ని ఇక్కడ, మరికొన్ని అక్కడ
ఆపుకోలేని అశ్రుధారా ప్రవాహం
కన్నీటి చుక్కలు కొన్ని ఇక్కడ, మరికొన్ని అక్కడ..’

రామారావుకి ప్రతి చీలికా క్లిష్టమైన పరిస్థితినే తెచ్చిపెట్టింది. రాజకీయంగా, నిర్మాణపరంగా తానూ వైఖరి తీసుకోక తప్పదు. చాలాసార్లు తనకి సన్నిహితులైన మిత్రులు అవతలి వైపు ఉండవచ్చు, వున్నారు కూడా. ఆ స్నేహం తనని ఒక ఖచ్చితమైన వైఖరి తీసుకోకుండా ఆపలేదు, అలాగని తన స్నేహాన్ని వదులుకోనూ లేదు. చీలికలు అనివార్యమని కొందరు భావిస్తే, చాలా సందర్భాలలో అవి అవాంఛనీయమైనవనే రామారావు భావించాడు. తాను ఒక వైఖరి తీసుకొన్నా, అవతలి శిబిరాన్ని శత్రువులుగా ఎన్నడూ చూడలేదు. అందుకే తనకి అన్ని సంస్థలలో సన్నిహితమైన స్నేహితులు వున్నారు. ఈ విశాలదృక్పథం తనకి ఒక ప్రత్యేకతని తెచ్చిపెట్టింది. తాను చండ్ర పుల్లారెడ్డి రాజకీయాలని విశ్వసించినా, అది కొండపల్లి సీతారామయ్య కృషిని గుర్తించి గౌరవించడానికి, శివసాగర్‌నీ, ఆయన ప్రశ్నలనీ పాటలనీ ఇష్టంగా స్వరపరిచి పాడడానికి ఏనాడూ అడ్డంకి కాలేదు. ఈ విషయంలో రామారావు ఆచరణ అనేక విప్లవ సంస్థల అవగాహనకంటే ఎంతో మెరుగైనది.

గత కొన్ని సంవత్సరాలుగా తాను అధ్యయనం మీద శ్రద్ధపెడుతూ వున్నాడు. రాత్రులు నిద్రపోకుండా డాక్యుమెంట్లు చదువుతూ వుండేవాడని అరుణక్కా, పిల్లలూ చెబుతున్నారు. విప్లవ ప్రజాస్వామిక వుద్యమాలలో సాంస్కృతిక సంఘాల పాత్ర, కులం సమస్య, వుత్పత్తి సంబంధాలలో మార్పులు, సామ్రాజ్యవాదం, ఫాసిస్టు ప్రమాదం – ఇలా వివిధ అంశాలపైన పార్టీ లోపలా, బయటా వున్న మిత్రులతో చర్చిస్తూనే వున్నాడు. తన అభిప్రాయాలని దాచుకోకుండా చర్చకి పెడుతున్నాడు. ఈ చర్చని ఎవరు ఎలా చూస్తారో గానీ, విప్లవానికీ, ఉద్యమానికీ అది సమస్యలని తెచ్చిపెట్టిందనుకోవడం పొరపాటు. దీర్ఘకాలంగా పరిష్కారంకోసం ఎదురుచూస్తున్న సమస్యలు అవి, సమాధానాలు వెదుకుతున్న వెంటాడే ప్రశ్నలవి.

చనిపోవడం అంటే ఇక ఎన్నటికీ స్నేహితులతో కలిసి వుండలేకపోవడమేనని రచయిత మార్క్వెజ్ అంటాడు. రామారావు ఇంక తన మిత్రులెవ్వరితో కలిసి చర్చించలేడు, ప్రశ్నలు వేయడు, నవ్వుతూ నవ్వించలేడు, పాటతో, పద్యాలతో ఏడ్పించలేడు, ఆత్మీయ కరచాలనంతో గాఢంగా హత్తుకోలేడు. మృత్యువు ఈ విషాదాన్ని మనముందు క్రూరమైన వాస్తవంగా నిలిపింది.

చాలా పనులున్నాయి రామారావుకు. ఎప్పుడూ పదిరోజులు ఇంటిపట్టున వుండి ఎరగని మనిషి, ఏదో ఒక చోట సభలనో, సమావేశాలనో పరుగు పెడుతున్నట్టే వున్న మనిషి వెళ్ళిపోయినా, ఎక్కడో ఏదో పనిమీద వెళ్ళినట్లే అనిపిస్తుందని రామారావు కొడుకు అన్నాడు. రష్యన్ కవి, యుద్ధరంగపు పత్రికా రచయితా సిమోనోవ్ 1941లో ‘వెయిట్ ఫర్ మీ’ అనే కవిత తన ప్రేయసికోసం రాశాడు. యుద్ధరంగంలో సైనికులకి ఆ కవిత ఎంతో వుత్తేజాన్ని, నమ్మకాన్ని ఇచ్చింది. ఆ కవితయే తమని యుద్ధంలో బతికించిందని నమ్మారు. శివసాగర్ తనదైన శైలిలో ‘నా కోసం ఎదురు చూడు’ అన్న కవితని రాశాడు. వెయిట్ ఫర్ మీ కవితని వేర్వేరు భాషలలో గీతంగా మలిచిన విషయాన్ని తెలుసుకున్న రామారావు దాన్ని చాలాసార్లు ఇష్టంగా విన్నాడు. లెల్లే సురేశ్, దేవల్ మెహతాలతో కలిసి శివసాగర్ గీతానికి వూపిరులూదాడు. ఇంకా తనకి ఇష్టమైన పాటలనీ, పద్యాలనీ అద్భుతమైన తన గొంతులో మళ్ళీ రికార్డు చేయాలనీ, తన జీవిత ప్రస్థానాన్నీ, తన అనుభవాలనీ వివరమైన ఇంటర్వ్యూలో రికార్డు చేయాలనీ తన మిత్రులు అనుకుంటూనే వున్నారు. రామారావు అందుకు సరేనన్నాడు కూడా. ఇదిగో ఇంకొక్క సభ, ఈ నెలలో మరొక్క సమావేశం అంటూ ఏడాదిగా అది ముడిపడనే లేదు. ఇలా ఏమీ చెప్పకుండానే, ఏదో అర్జెంటు పనివున్నట్లు అర్ధాంతరంగా వెళ్లిపోయాడు రామారావు.

షెల్లీ ఎప్పుడో రాశాడు,
సుమధుర స్వరం మూగవోయినప్పుడు
సంగీతం జ్నాపకాలలో ప్రతిధ్వనిస్తుంది-
తీయటి పూలు వడలిపోయినప్పుడు
వాటి పరిమళం మన మనసులలో గుబాళిస్తుంది.

గులాబీలు రాలిపోయినప్పుడు
ప్రియాతి ప్రియమైన పూల మృత్యు శయ్యపై గులాబీరేకలు పరుచుకుంటాయి
నువు వెళ్లిపోయాక
నీ తలపులలోనే వలపు దీర్ఘనిద్రలో విశ్రమిస్తుంది.

రామారావు అలా వెళ్లిపోతుంటే, ఆ ధీర గంభీర స్వరం అలా నీరవ నిశ్శబ్దంలో విశ్రాంతి తీసుకుంటుంటే, తనకి ఇష్టమైన శివరంజని రాగమే విషాదాన్ని ఆలాపిస్తున్నట్లు..
రామారావు ఎటో వెళ్లిపోయాడు కదా,

పొన్న పూలు రాలిపడిన చోట
డప్పుల దరువు రాగాలాపనతో కరచాలనం చేసే చోట
ఒక ఒంటరి దీపస్తంభం సముద్రం ముందు భోరున విలపించే వేళ
అలలతో మోకరిల్లిన సముద్రం ఏకాంతంగా దీపస్తంభం దుఖాన్ని పంచుకునేవేళ
నీలి ఆకాశం అరుణోదయాన్ని హత్తుకున్న వేళ
ఇక తన కోసం, తన పాట కోసం ఎదురు చూస్తాము.

*

సుధాకిరణ్

పుట్టి పెరిగింది ఖమ్మం జిల్లాలో. చదివిందీ, ప్రస్తుతం ఉద్యోగ రీత్యా వుండేదీ హైదరాబాద్ లో. అప్పుడప్పుడూ రాసే కవిత్వంతో పాటు, సాహిత్యం, రాజకీయాలు, ఆర్ధిక అంశాల పైన, టెక్నాలజీ ధోరణుల పైన విశ్లేషణ వ్యాసాలు, తెలుగు, ఇంగ్లీషు అనువాదాలు వివిధ పత్రికలలోనూ, పుస్తకాలలోనూ అచ్చయ్యాయి.

10 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఒళ్ళు గగుర్పొడిచి, మనసు ఉత్తేజింపబడే వ్యాసం, మహనీయమైన పోరాట స్ఫూర్తి… జోహార్లు

  • కిరణ్
    తడి ఆరని కన్నీటి జ్ఞాపకాలని మిగిల్చిన రామారావు
    తిరిగి రాడని తెలిసీ ,తెలిసీ దుఖం తో ఎదురు చూస్తూ…
    ఆర్ద్రం గా రాశావు..

    విమల

  • రామారావు అన్న ఎదురుగా నిలబడి చిరునవ్వుతో చూస్తున్నట్టే వుంది. కన్నీళ్ళని తెప్పించావు కిరణ్!

  • నాకు బహుశా నా 5 వ ఏటనుంది పరిచయం అప్పుడే దగ్గరనుండి మరీ డప్పు కంజర ను చాలా ఓపికతో నేర్పించాడు అప్పటినుండి ఇప్పటివరకు ఎప్పుడు విడిపోవాల్సిన అవసరం రాకపోవడం నా అదృష్టమనుకుంటాను .కనీసం 10 రోజులకు ఒక్కసారైనా ఫోన్ చేసి గురువుగారు నమస్తే అని మందలించి జాంబిరి జాంబిరి అని ఏదో ఒక విషయం చెప్పి దాదాపు సంతోషాన్ని మాత్రమే పంచేవాడు .నాకు ఇప్పటికీ ఎక్కడో ఉన్నాడనే అనిపిస్తుంది .లేదనే నిజాన్ని నామనసు ఇప్పటికీ అంగీకరించడంలేదు బాస్

  • అలలతో మోకరిల్లిన సముద్రం ఏకాంతంగా దీపస్తంభం దుఖాన్ని పంచుకునేవేళ
    నీలి ఆకాశం అరుణోదయాన్ని హత్తుకున్న వేళ
    ఇక తన కోసం, తన పాట కోసం ఎదురు చూస్తాము.
    అరుణోదయ రామారావు గారికి అరుణారుణ జోహార్లు.

  • గొప్ప ఆర్ద్రతతో కన్నీళ్లు పెట్టించావు కిరణ్ – రామన్న లేని దుఃఖం ఇప్పట్లో, బహుశా ఎప్పటికీ తీరేది కాదు – ఎప్పుడూ వెన్నంటి ఉండేది ఆయన పాట. రామన్నకు జోహార్లు

  • వ్యాసం చదువుతున్నంత సేపూ రామారావన్న కళ్ళముందు కదలాడుతున్నట్టు.. పాడుతున్నట్టు ఉంది. కన్నీళ్ళతో రాసినట్టుగా ఉంది.
    శక్తి

  • వ్యాసం చదువుతున్నంత సేపూ రామారావన్న కళ్ళముందు కదలాడుతున్నట్టు.. పాడుతున్నట్టు ఉంది. సుధా కిరణ్ తన కన్నీళ్ళతో రాసినట్టుగా ఉంది.
    శక్తి

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు