రక్తమోడిన పాదాలు

రక్తమోడిన పాదాలు

రాజయ్య మనసు చిత్తడి చిత్తడిగా ఉంది. ఆలోచనలు పరిపరి విధాల పోతున్నాయి. మనసు స్థిరంగా ఓ చోట నిలవడం లేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం ప్రారంభమై చాలా రోజులే అవుతున్నది. తెలంగాణ వస్తుందా, చస్తుందా అనేవాళ్లు కనిపిస్తూనే వున్నారు. కానీ అన్ని వర్గాల ప్రజలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమిస్తున్నారు. సబ్బండ వర్ణాలు ఉద్యమంలో ఉన్నట్లే లెక్క. తాను కూడా ఉద్యమంలో కాలు పెట్టాడు. ఉద్యమ నేతగా ముందుకు వచ్చాడు. దీంతో మిత్రులు, కార్యకర్తలు ఇంటికి రావడం ప్రారంభమైంది. ఓ వైపు ఉద్యోగం చేసుకుంటూ, మరో వైపు సభలకూ సమావేశాలకూ చర్చలకూ వెళ్లడం… క్షణం తీరిక ఉండడం లేదు.

రోజూ భార్య పోరు. ఇంటికి వచ్చేవాళ్లకు చాయ్‌లు పోయడం, అప్పుడప్పుడు చిరు తిండ్లు పెట్టడం… ఖర్చు పెరిగిపోతూ ఉంది. వచ్చే జీతంలో దమ్మిడీ మిగలడం లేదు. పైగా అప్పుడప్పుడు ప్రయాణం ఖర్చులు పెట్టడం కూడా తప్పడం లేదు. ఇప్పుడు తనకు నడి వయస్సు వచ్చింది. పిల్లలిద్దరూ ఉన్నత చదువుల్లో ఉన్నారు. వారి ఖర్చులు కూడా పెరిగాయి. తన యవ్వనదశలోని రోజులు గుర్తుకు వచ్చాయి.

ఉద్యమంలో మమేకమై ఊళ్లు తిరుగుతూ, వేదికలెక్కి ప్రసంగాలు చేస్తూ, పాటలు పాడుతూ, కవిత్వం రాస్తూ ప్రజల కోసం పోరాటం చేయడం. అది నరాల్లో రక్తం ఉరకలు వేస్తున్న కాలం. శ్రీశ్రీ, గద్దర్‌, వంగపండు, పాణిగ్రాహి… ఒక్కరేమిటి… చైతన్య ప్రవాహం.. అన్నింటికన్నా ముఖ్యంగా ఒక్క ఆశ. మరో ప్రపంచం రేపో మాపో ఏర్పడుతుందనే నమ్మకం… ఆ విశ్వాసం చాలా దూరం తీసుకుని వెళ్లింది. అప్పుడే పరిచయమైంది వసంత. ఎంత బాగుండేది. ఆమె కదిలితే ఒక్క విద్యుత్తరంగం.. పాడితే గోదావరి ఉత్తుంగ తరంగ ఘోష. చామనఛాయ, హస్తినాస్తి విచికిత్సా శాతోదరి. కళ్లలో చేపపిల్లల్లా కనుగుడ్లు కదలాడేవి. అంత సౌందర్యరాశి ఏమీ కాదు కానీ అనంతమైన ఆకర్షణ ఆమెలో. తన కోసమే పుట్టిందని అనిపించేది. ఉద్యమంలో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. సాహిత్యం తనది, గానం అమెది. అప్పుడప్పుడు ఇద్దరు కలిసి పాడడం… ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఆదర్శ వివాహం… స్టేజీ మ్యారేజీ.. ఒక కొత్త లోకంలోకి అడుగుపెట్టినట్లు అనిపించింది. ఆమె సాహచర్యంలో అంతులేని రుచి.

ఆమెతో పాటు తాను ఉద్యమంలో పీకల దాకా మునిగాడు. పదం పాడుతూ కదం తొక్కుతుంటే మాటలకందని అనుభూతి. ఉద్యమ సహచరుల్లో తమది అపూర్వమైన జంట. బతిలాడి తమతో పాటలు పాడిరచుకునే కార్యకర్తలు. యుద్ధ వీరులను కలుసుకున్నప్పుడు వారు తమతో తప్పకుండా పాట పాడిరచుకునేవారు. సభలు, ఊరేగింపులు… దుస్తుల మీద యావ ఉండేది కాదు, కాళ్లకు స్లిప్పర్లు. గూడలు తెగితే పిన్నీసులతో వాడుకోవడానికి వీలుగా చేసుకోవడం… అదీ వీలు కాకపోతే చెప్పులు లేకుండానే కదం తొక్కడం.. అద్భుతమైన జలపాత దృశ్యాలు… తెగిన చెప్పులను పక్కన పడేసి నడిస్తే అరిపాదాలు పచ్చెలు పారి రక్తం ఉబికి వచ్చి నేలను తడిపిన గుర్తులు. తన నడక ఆగలేదు.

కాలకృత్యాలు తీర్చుకుని వచ్చాడు. దానికి చాలా సమయం పడుతున్నది. సోఫాపై కూర్చుని పత్రిక తిరగేయడం ప్రారంభించాడు. మొదట్లో తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన వార్తలు వచ్చేవి కావు. కానీ, అనివార్యంగా ఆ వార్తలను ప్రచురించాల్సిన పరిస్థితి పత్రికా యజమానులకు ఏర్పడిరది. తాము తెలంగాణకు వ్యతిరేకం కాదని చెప్పుకోవడానికి ఓ వైపు తంటాలు పడుతూనే, తెలంగాణ ఉద్యమం వల్ల రాజకీయాల్లో వచ్చిన, వస్తున్న పెనుమార్పుల గురించి రాయకతప్పడం లేదు. అది తలుచుకుని హాయిగా ఊపిరి తీసుకుని వదిలాడు రాజయ్య. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే సమాజంలో సమూలమైన మార్పులు వస్తాయని తానేమీ నమ్మడం లేదు. కానీ అంతర్గత వలసాధిపత్యం పోతుంది. అప్పుడు తెలంగాణను ఒక నిర్దిష్టమైన యూనిట్‌గా తీసుకుని అభివృద్ధి చేసుకోవచ్చు. కొంతలో కొంత ప్రజల జీవితాలు మెరుపడుతాయి. తెలంగాణ సమాజంలో ఆధునికతలో ముందడుగు వేస్తుంది.

భార్య వసంత చాయ్‌ తీసుకుని వచ్చి టీపాయ్‌ మీద పెట్టింది. ఆమెను ఓసారి తేరిపార చూశాడు. మనిషి లావు అయింది. ముఖం మీద ముడుతలు కనిపిస్తున్నాయి. నడుము బాగా పెరిగింది. అప్పటి వసంతకూ ఇప్పటి వసంతకూ ఏ మాత్రం పోలిక లేదని అనుకున్నాడు. తాను కూడా అప్పటిలా లేను కదా అని అనుకున్నాడు. వసంతతో పాటు తాను అడవుల్లోకి పోవాలని అనుకున్నాడు. తుపాకులు పట్టుకుని వర్గ శత్రువులను నిర్మూలించాలని కోరికగా ఉండేది. ఎందుకో గానీ అది జరగలేదు. దానికి స్పష్టమైన కారణం తనకు ఇప్పటికీ తెలియదు. తనకు విజయవాడలో మిత్రుడి ద్వారా ఉద్యోగం లభించింది. తాను చదివిన చదువుకు, తనకున్న తెలివికి అది సరిపోయే వేతనమేమి కాదు. కానీ చేరకతప్పలేదు.

ఆ తర్వాత హైదరాబాద్‌ బదిలీ అయింది. అప్పుడు తాను హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు. తన కన్నతల్లి ఒడిలో పడినట్లయింది. ఈ కాలంలో అతన్ని గుండెకోతకు గురిచేసిన సంఘటలెన్నో తెలంగాణలో జరిగాయి. మూగగా రోదించడం, తనకు అవకాశం ఉన్న చోట తన శోకాన్ని సగం కవిత్వం రూపంలోనూ సగం వచనం రూపంలోనూ వ్యాసాలు రాయడం సాగించాడు.

ఓసారి తనకు ఉద్యోగం ఇచ్చిన యజమాని అన్నాడు ` ‘నీకు ఇంకా అబ్సెషన్‌ పోనట్లుంది’ అని. తన భావాలను కప్పిపుచ్చుకోవగానికి తల కిందికి దించుకున్నాడు. ఇదెంత అవమానకరం కదా అనిపించింది. తెలంగాణ ఉద్యమ కాలంలో తమ నాయకుడు కూడా అదే అన్నాడు కానీ మరో రూపంలో అన్నాడు. ‘దాన్ని వదిలించుకో, రాజన్నా!’ అని సలహా ఇచ్చాడు. తాను బయటకు మారాడు, లోపల మారలేదు. తన అంతరంగ ఘోషను అర్థం చేసుకునేవాళ్లే లేరనిపించింది. వసంత కూడా ఇదే యాతన పడుతుందా అనిపించింది.

ఉండబట్టలేక ఓసారి అడిగాడు ` ‘దాన్ని తలుచుకునే తీరిక కూడా నాకు లేదు’ అంది. ఆమె సాధారణ గృహిణి లేదా సాధారణ మహిళ అవతారం ఎత్తిందని తనకు అనిపించింది. ఇంటి పనులు చేయడంలోనూ పిల్లల పెంపకంలోనూ ఆమె తీరిక లేకుండానే ఉంటున్నది. తెలంగాణ ఉద్యమంలో ఒక సెక్షన్‌కు నాయకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్న తనను వ్యతిరేకిస్తున్నది. ‘ఉద్యమం వల్ల మనకు ఒరిగేదేమిటి. ఇంటికి వస్తున్నవాళ్లకు టీలు అందించి ఒళ్లు హూనం అవుతున్నది. నా పని అంతా చెడిపోతున్నది’ అని అంటున్నదంటే ఇంతకు ముందు ఉద్యమంలో పాల్గొన్నందుకు ఆమె పశ్చాత్తాపపడుతున్నదా అనే అనుమానం కూడా కలుగుతున్నది.

తాము మధ్యతరగతికి ఎదిగాం. ఆర్థికంగా దిగువ స్థాయి నుంచి పైకి ఎదిగాం. ఇంకా ఎదగాలనే తాపత్రయం వసంతకు ఉన్నట్లు తనకు అర్థమవుతున్నది. టీ చప్పరిస్తూ ఆలోచిస్తున్నాడు. ఈ ఆలోచనా ధార తెగడం లేదు. కుటుంబ అవసరాలు తీరుతూ కొంత సమయం చిక్కడం వల్ల, వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఒత్తిళ్లు లేకపోవడం వల్ల తాను ప్రశాంతంగా ఉండగలుతున్నాడా, లేదు. అందుకేనేమో తెలంగాణ ఉద్యమంలోకి వచ్చాడు. గతంలో వదిలేసినదాన్ని తిరిగి మొదలు పెట్టడమేనా ఇది? ఒక రకంగా అవును, మరో రకంగా కాదు. కానీ, తెలంగాణ కోణం నుంచి ప్రసంగాలు చేయడానికి అధ్యయనం చేయాల్సిన పరిస్థితిలో పడడం వల్ల తన ఆలోచనాధారకు కొంత తెరపడిరది. రాష్ట్రం సాధిస్తామా, లేదా అనేది తర్వాతి విషయం. కానీ తనకు ఓ విధమైన ఊరట కలుగుతున్నది. దీన్ని వసంత గమనించడం లేదు.

తెలంగాణ ఉద్యమ నాయకుల నుంచే కాదు, తెలంగాణ మంత్రుల నుంచీ ఎమ్మెల్యేల నుంచి ఫోన్లు వస్తున్నాయి. తరుచుగా వాళ్లు తనను కలవడమో, తాను వాళ్లు కలవడమో జరుగుతున్నది. కొన్ని విషయాల మీద స్పష్టత కోసం ఉద్యమ నేత తనను పిలుచుకుంటున్నాడు. ఇదంతా జీవితంలోని లోటును భర్తీ చేస్తున్న అనుభూతినీ అనుభవాన్నీ ఇస్తున్నది. జీవితం మలుపు తిరుగుతున్నట్లు కూడా ఉంది. నిజాం క్లబ్‌లోనో, మరో సంపన్న వర్గాలకు చెందిన హోటళ్లలోనూ సాయంత్రాలు సిట్టింగులు జరుగుతున్నాయి. మద్యాన్ని చుక్క చుక్కగా జుర్రుకుంటూ తెలంగాణ చర్చలు జరపడం కూడా ఒక ఉత్సాహాన్ని ఇస్తున్నది.

తాను దారి తప్పానా అని కూడా ప్రశ్నించుకున్నాడు. ఇప్పటికీ ప్రశ్నించుకుంటున్నాడు. అయితే, కొత్త గుర్తింపు, కొత్త గౌరవం ఆ ప్రశ్నను వెనక్కి నెట్టేస్తూ వచ్చింది, ‘చెన్నారెడ్డి ఏం చేశాడో నీకు తెలియదా, ఇప్పుడు ఈ తెలంగాణ ఉద్యమ నేత కూడా అదే చేస్తాడు. ఈ మాత్రం శ్రీనివాస్‌ రెడ్డికి తెలియదా?’ అని ఓ భారీ వ్యాసం రాసి, అది ఒక పత్రికలో వచ్చేట్లు చూసుకున్నాడు. ఆ తర్వాత రాజన్న ఉద్యమ నేత పక్కన చేరాడు. శ్రీనివాస్‌ రెడ్డి బయటే ఉండిపోయి ఉద్యమంలో పాల్గొంటున్నాడు. తనది అవకాశవాదం అవుతుందా అని ప్రశ్నించుకున్నాడు. ఎవరి శక్తిసామర్థ్యాలను బట్టి వారు ఎదుగుతారని ఆత్మను జోకొట్టాడు.

ఉద్యమ నేత నుంచి పిలుపు వచ్చింది. త్వరత్వరగా తయారై బయలుదేరాడు. ఉద్యమ నేతతో కలిసి బ్రేక్‌ఫాస్ట్‌ చేస్తాడు. దానివల్ల ఇంట్లో తినాల్సిన అవసరం లేదాయనకు. అక్కడ బ్రేక్‌ఫాస్ట్‌ లేకపోతే, తన అనుచరుల్లో ఎవరో ఒకరికి ఫోన్‌ చేసి తనకు బ్రేక్‌ఫాస్ట్‌ ఏర్పాటు చేయాలని పురమాయిస్తాడు. తాను సాధారణంగా అదే చేస్తున్నాడు. కరీంనగర్‌కో, మహబూబ్‌నగర్‌కో వెళ్లినప్పుడు అలా పురమాయించి బిర్యానీలు తెప్పించుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఉద్యమంలో తానేమీ ఖర్చు పెట్టడం లేదు. తన వ్యక్తిగత సంపాదన మొత్తం కుటుంబానికే పెడుతున్నాడు. తనకు ఏర్పడిన పరిచయాల వల్ల అదనంగా కొన్ని సౌకర్యాలు కూడా కలుగుతున్నాయి.

….     ……  …….     ……..          ……   ……..

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిరది. తాను అనుకున్నట్లే తనకు పదవి దక్కింది. ఉద్యమ కాలంలో తనను ఎత్తిపొడుస్తూ వచ్చిన వసంత ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది. హోదా, వేతనం రెండు కూడా లగ్జరీ లైఫ్‌ను లీడ్‌ చేయడానికి అవకాశం కల్పించాయి. మరో వైపు, పిల్లలు మంచి కోర్సులు అభ్యసించి ఉద్యోగాలు కూడా దక్కించుకున్నారు. జీవితం కొంత గొప్పగానే స్థిరపడిరది. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవడం, తన సారథ్యం వహిస్తున్న రంగానికి సంబంధించి తెలంగాణ ప్రయోజనాలను స్థిరపరచడానికి అవసరమైన విషయాల గురించి ప్రసంగాలు చేస్తూ వస్తున్నాడు. తెలంగాణ నలుమూలల నుంచీ తనకు ఆహ్వానాలు అందుతున్నాయి. ఒక రకంగా ఈ విషయంలో తనకు ఇది చాలా ఆనందాన్ని ఇస్తున్నది.

ఓసారి ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా కరీంనగర్‌ వెళ్లాల్సి వచ్చింది. చాలా సార్లు వెళ్లాడు గానీ ఇప్పటిలా ఆలోచనలు కల్లోలపరచలేదు. తన ఆలోచనలు మళ్లీ ఎందుకు గతంలోకి వెళ్తున్నట్లు అని ప్రశ్నించుకున్నాడు. సమాధానం దొరికినట్లూ దొరకనట్లూ అనిపించింది. అది జగిత్యాల సమీపంలోకి రావడం వల్లనే కావచ్చు. జగిత్యాల, గోదావరి లోయ పోరాటాలు ఉధృతంగా సాగాయి. ఇక్కడే కదా, తాను పాదాలు నెర్రెలు పారి, రక్తమోడాడు. తమ పోరాటాల వల్లనే భూస్వాములు ఊళ్లు వదిలి వెళ్లిపోయారు. వాళ్ల భూములను నిరుపేద ప్రజలకు పంచిపెట్టారు. అప్పుడు పేదల కళ్లలో కనిపించిన మెరుపు మళ్లీ తాను చూడగలనా అని అనుకున్నాడు. రోడ్డుకిరువైపులా ఉన్న భూముల వైపు చూశాడు. అన్నీ పడావు పడ్డాయి. తనకు తెలియనిదేమీ కాదు. కల్లోలిత ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించింది. పోరాటాన్ని అణచివేసే చర్యలకు దిగింది. పోలీసులు ఊళ్ల మీద పడ్డారు. చాలా మందిని అరెస్టు చేశారు. ప్రజలను చితకబాదారు. ఆ అణచివేతను తలుచుకుంటే ఇప్పటికీ కంటనీరు ఉబికి వస్తుంది. యుద్ధవీరులు ఒక్కడుగు వెనక్కి, రెండడుగులు ముందుకు అని చెప్పి రాష్ట్ర సరిహద్దులు దాటిపోయారు. అయినప్పటికీ భూస్వాములు తిరిగి రాలేదు. పేదలకు పంచిన భూములు పడావు పడ్డాయి. యుద్ధవీరులు మళ్లీ ప్రవేశించే ప్రయత్నాలు చేశారు గానీ ఫలించలేదు. ఇప్పటికీ వారు లోనికి ప్రవేశించలేకపోతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మళ్లీ ప్రయత్నించారు. కానీ సరిహద్దు నెత్తురోడిరది. అదే చివరిసారి. ఇక ఆ ప్రయత్నాలు జరగడం లేదు. మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లోనూ, ఛత్తీస్‌గఢ్‌లోనూ యుద్ధవీరులు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. తాము ఏమనుకున్నారు, ఏమవుతున్నది అని ప్రశ్నించుకున్నాడు.

తనకు మంచి పదవి లభించింది. ‘రాజన్న ప్రభుత్వ పదవి తీసుకోవడం తప్పు’ అని ఎవరో అంటే తన ప్రియమిత్రుడు సతీష్‌ ఏమన్నాడు ` ‘ఉద్యమంలో రక్తం ధారపోశాడు. ఎంతో త్యాగం చేశాడు ఆ మాత్రం ఫలితం పొందకూడదా?’ అని అన్నాడు. అతను ఆ మాట అన్నప్పుడు తనకు ఎంత ఊరట కలిగింది. చాలా సంతోషం కూడా వేసింది. కానీ పరిస్థితిలో మార్పు వచ్చిందా? తాను స్పష్టంగా చెప్పలేడు. ఉద్యమ నేత ప్రజలకు చాలా హామీలు ఇచ్చారు. యుద్ధవీరుల ఎజెండాను అమలు చేస్తానని హామీ ఇచ్చాడు. దళితులకు మూడెకరాల భూమి ఇవ్వడంతో పంటలు పండిరచుకోవడానికి అవసరమైన వసతులు కల్పిస్తానని చెప్పాడు. ఇంకా చాలా హామీలు ఇచ్చాడు.

ఉద్యమనేతనే ముఖ్యమంత్రి అయితే అనుకున్న గుణాత్మక పరిణామాలు తెలంగాణలో చోటు చేసుకుంటాయని అనుకున్నాడు. దాంతో రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమ నేత సతీష్‌ ఇంటికి వచ్చాడు. ముగ్గురి మధ్య చర్చలు జరిగాయి. ఉద్యమ నేతనే ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టాలని వారు చెప్పారు. అది ఉద్యమ నేతకు కొండంత బలాన్ని ఇచ్చిందనే విషయాన్ని తాను పసిగట్డాడు. ఎన్నికలు జరిగి ఉద్యమ పార్టీ విజయం సాధించి, ఉద్యమ నేత ముఖ్యమంత్రి అయ్యాడు. ఓ రోజు ఎప్పటిలా సరాసరి ఆయన నివాసంలోకి వెళ్లాడు రాజన్న. ఆయన ప్రవర్తన వల్ల తనకు దిమ్మతిరిగింది. ‘ఏం రాజన్నా… అపాయింట్‌మెంట్‌ తీసుకుని రావాలని తెలియదా?’ అని మృదువుగానే చెప్పినప్పటికీ గతంలో లేని హద్దులు నిర్దేశించినట్లు అర్థం చేసుకున్నాడు.

తెలంగాణ వచ్చిన తర్వాత సంభవించే పరిణామాలకు అదో సూచికగా కనిపించింది. కరీంనగర్‌లో ఓ ఖరీదైన భవనం ముందు కారు ఆగింది. తాను దిగాడో లేదో రామారావు ఎదురు వచ్చి స్వాగతం పలికాడు. మల్లెపువ్వులాంటి లాల్చీ, కుర్తా ధరించి ఉన్నాడు. నెరిసిన జట్టుకు రంగు వేసుకున్నాడు. మీసం, గడ్డం నున్నగా కొరుక్కున్నాడు. చేతికి ఓ బంగారు గొలుసు ఉంది. ఎడమచేతి ఐదు వేళ్లకు బంగారం రింగులున్నాయి. భవనంలోకి ప్రవేశించారు. భవనం అడుగడుగునా కరెన్సీ కట్టలు, బంగారం పోత పోసినట్లుగా ఉంది. తనను ఓ విశాలమైన గదిలోకి తీసుకుని వెళ్లాడు. గదిని కలియజూశాడు రాజన్న. సోఫాలు గదిలో గుండ్రంగా వేసి ఉన్నాయి. వాటి మధ్య ఖరీదైన టీపాయ్‌.. ఇంటిలోనే ఓ బార్‌. ‘ఫ్రెష్‌ అయి రా!’ అని వాష్‌రూమ్‌ డోర్‌ తెరిచాడు రామారావు. అక్కడ ఓ వాష్‌ రూమ్‌ ఉందని కూడా తెలియదు, అలా ఉంది.

రామారావు మాత్రమే కాదు, అటువంటివాళ్లు చాలా మంది రాజన్నకు ఉద్యమంలోనే పరిచయమయ్యారు. వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, పుట్టుకతోనే ధనవంతులై ఉండి యుద్ధవీరులకు అండగా నిలిచినవారు… ఒక్కరేమిటి తాను ఊహించనివారంతా రాజన్నను తమలో ఒక్కడిగా చూశారు. రామారావుకు చెందిన వందలాది ఎకరాలను కూడా అప్పట్లో యుద్ధవీరులు ఆక్రమించుకుని, జెండాలు పాతి పేదలకు పంచిపెట్టారు. తాను చూసిన పడావు పడిన భూములు అవేనని అనిపించింది రాజన్నకు.

ఫ్రెష్‌ అయి గదిలోకి వచ్చాడు. తాను వచ్చేసరికి గ్లాసులు, ఐస్‌ క్యూబ్స్‌, సోడాలు, విదేశీ లిక్కర్‌ బాటిల్‌ టేబుల్‌ మీద పెట్టి ఉన్నాయి. నంజుకోవడానికి వెజ్‌, నాన్‌ వెజ్‌ ఉన్నాయి. సోఫాలో దర్జాగా కూర్చుని ఉన్నాడు రామారావు. ‘రా… రాజన్నా! అలా కూర్చో’ అని సోఫా చూపించాడు ఆయన. తాను వచ్చి కూర్చున్నాడు. ఏమీ మాట్లాలేదు. రామారావే అన్నాడు… ‘మీటింగ్‌ సాయంత్రం కదా.. అన్ని ఏర్పాట్లు మనవాళ్లకు అప్పగించాను. కాస్తా పుచ్చుకుని, లంచ్‌ చేసి, ఓ కునుకు తీద్దాం’ అని చెప్పాడు. ఏమీ మాట్లాడకుండా రామారావుకు ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నాడు. రామారావే గ్లాసులు నింపాడు. ఇద్దరూ లిక్కర్‌ చప్పరిస్తూ మధ్య మధ్యలో తినుబండారాలు నంజుకోసాగారు. ఏయే పదార్థాలు బాగుంటాయో చెప్పుతూ వాటిని రామారావు రాజన్నకు అందిస్తూ వచ్చాడు. ఇద్దరి మధ్య పెద్దగా మాటలేమీ సాగడం లేదు. రామారావుతో కలిసి హైదరాబాద్‌లో చాలాసార్లు మద్యం సేవించాడు, బ్రేక్‌ ఫాస్ట్‌లూ లంచులూ డిన్నర్లూ చేశాడు. అప్పుడు ఇలాంటి అసహనమేదీ లేదు. మిత్రుల మాదిరిగానే కలిసిపోయారు. ఆ కారణంగానే రాజన్న ముందుగానే చెప్పి రామారావు ఇంటికి వచ్చాడు.

రాజన్న కాస్తా అసహనంగా కదిలాడు. దాన్ని గమనించి, ‘సిగరెట్టు ఇక్కడ తాగొచ్చు’ అని చెప్పాడు రామారావు. రాజన్న జేబులోంచి గోల్డ్‌ ఫ్లాక్‌ కింగ్స్‌ ప్యాకెట్‌ తీసి, ఓ సిగరెట్టు తీసుకుని, ప్యాకెట్‌ను టీపాయ్‌ మీద పెట్టాడు. లైటర్‌ తీసుకుని వెలిగించుకున్నాడు. సిగరెట్టు పొగ రింగులు రింగులుగా చుట్టుకుంటున్నది. రామారావే వెళ్లి కిటికీల తలుపులు తీశాడు. ఏసీ నడుస్తూనే ఉన్నది. మెల్లగా పొగ కిటికీల గుండా బయటకు వెళ్లడం ప్రారంభించింది.

రెండో పెగ్గుకు దిగారు. రామారావు చాలా చురుగ్గా కనిపిస్తున్నాడు. రాజన్నకు పడావు పడ్డ భూములే కనిపిస్తున్నాయి. దానివెనక సన్నటి తీగలాగా తాము చేసిన పోరాటాల సవ్వడి వినిపిస్తున్నది. ‘గ్లాసును పైకెత్తి నోటి దగ్గరకు తెచ్చుకుంటూ ` ‘ఏం మాట్లాడవేందన్నా?’ అని ప్రశ్నించాడు రామారావు.

ఏదో మాట్లాడాలి కదా అన్నట్టు ‘హైదరాబాద్‌ నుంచి ఎప్పుడొచ్చారు?’ అని అడిగాడు రాజన్న

కొంచెం మద్యం గుటక వేసి ` ‘నిన్ననే. రైతుబంధు పడిరదంటే తీసుకుందామని వచ్చిన’ అని చెప్పాడు రామారావు.

‘ఎంత ల్యాండ్‌ ఉంది?’ అని అడిగాడు రాజన్న.

బిగ్గరగా నవ్వాడు రామారావు. గులకరాళ్లు వేసి కదిలించిన డబ్బా చప్పుడులా ఉంది ఆ నవ్వు. రామారావు గతంలో ఎప్పుడూ ఇలా నవ్వలేదు. రాజన్న రaడుసుకున్నాడు. నవ్వు ఆపి ‘వంద ఎకరాలు’ అని చెప్పాడు రామారావు.

రాజన్నకు గుండె మెలిపెట్టి తిప్పినట్లయింది. ఏమీ మాట్లాడలేదు. రెండో పెగ్గు ముగిసిన తర్వాత ‘ఇక చాలు. అన్నం తిందాం’ అని అన్నాడు రాజన్న.

మరో పెగ్గు తీసుకోవాలని బతిమాలాడినట్లు అడిగినా రాజన్న ఒప్పుకోలేదు. ఇద్దరూ వెళ్లి భోజనానికి కూర్చున్నారు. పది రకాల వెజ్‌, నాన్‌ వెజ్‌ కూరలున్నాయి. బగారా రైస్‌లో నాన్‌ వెజ్‌ కలుపుకుని తిని లేచాడు రాజన్న. ఇద్దరి భోజనాలు ముగిసిన తర్వాత ‘కాసేపు కునుకు తీయి, రాజన్నా! సాయంత్రం నేను మీటింగ్‌ వద్ద డ్రాప్‌ చేస్తా’ అని చెప్పాడు.

‘నాకు డ్రైవర్‌ ఉన్నాడు. నేనే పోతా’ అని చెప్పి గదిలోకి వెళ్లి మంచంపై వాలాడు. లోపల మద్యం పనిచేస్తున్నది గానీ నిద్ర పట్టడం లేదు. ఏవేవో ఆలోచనలు… బుర్రలో పొంతన లేకుండా దృశ్యాలు… ఉద్యమ కాలంలో చాలాసార్లు వచ్చాడు గానీ ఇటువంటి కలవరం ఎప్పుడూ లేదు. ఇప్పుడే ఎందుకు ఇలా జరుగుతున్నదని ప్రశ్నించుకున్నాడు. సమాధానం లేదు. అయితే, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చిన మార్పు తనకు కొంత స్పష్టంగా, మరికొంత అస్పష్టంగా అర్థమవుతున్నది. యుద్ధవీరులు పంచిన భూములు మళ్లీ భూస్వాముల చేతికి వచ్చాయనే విషయం తనకు అర్థమైంది. వాటికి వాళ్లు రైతుబంధు తీసుకుంటున్నట్లు రామారావు మాటలను బట్టి తెలుస్తున్నది.

హైదరాబాద్‌లో ఓ మిత్రుడు కలిసినప్పుడు దాని మీదనే ఇరువురి మధ్య చర్చ జరిగింది. ఆ మిత్రుడు నరేష్‌ రెడ్డి నల్లగొండ జిల్లాకు చెందినవాడు. అతనికి ఊళ్లో కొంత భూమి ఉంది. దాన్ని కౌలుకు ఇచ్చాడు. హైదరాబాద్‌లో ఉంటూ డబ్బులు వడ్డీలకు తిప్పుతుంటాడు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కూడా చేస్తుంటాడు. ఎప్పుడూ హడావిడిగా ఉంటాడు. అతను వడ్డీలకు డబ్బులు ఇవ్వడం మానేసి ఊళ్లో భూములు కొంటున్నాడు.

ఓ రోజు బారులో కూర్చున్నప్పుడు రాజన్న అడిగాడు ` భూములు ఎందుకు కొంటున్నావని. ‘వడ్డీలకు డబ్బులు ఇస్తే పూర్తిగా తిరిగి వస్తాయనే నమ్మకం ఉండదు. కొందరు ఎగ్గొడ్తారు. కొందరు తాము చేసే వ్యాపారంలో నష్టాలు వచ్చి తిరిగి ఇవ్వలేరు. భూములకు రైతుబంధు పడుతున్నది. వడ్డీలాగే వస్తున్నది, రైతుబంధు ఒకవేళ అగిపోయినా నష్టం లేదు. భూములు మిగిలిపోతాయి. భూమి కౌలుకు ఇచ్చినా రైతుబంధు నాకే వస్తుంది. ప్రభుత్వం చాలా గొప్ప పని చేసింది’ ఆనందంగా చెప్పుకుంటూ వెళ్లాడు.

అప్పుడు రాజన్న దాని గురించి పెద్దగా ఆలోచించలేదు గానీ ఇప్పుడు కిటుకు అర్థమవుతున్నది. రామారావులాంటి చాలా మంది భూములు పడావు పడ్డాయి. యుద్ధవీరులు పేదలకు పంచిన భూములు అవి. ఇప్పుడు వాటికి భూస్వాములు రైతుబంధు తీసుకుంటున్నారు. అటువంటి భూమికే రైతు బంధు తీసుకోవడానికి రామారావు కరీంనగర్‌ వచ్చాడని అర్థమైంది. అంతేకాదు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం పెరగడం వెనక, భూముల ధరలకు రెక్కలు రావడం వెనక అదే పనిచేసిందని ఇప్పుడు అనిపిస్తున్నది.

ఎవరో అన్న మాట గుర్తుకు వచ్చింది ` ‘ధరణి ద్వారా భూములను క్రమబద్దీకరిస్తున్నామని ప్రభుత్వం చెప్పుతున్నది. కానీ ధరణి ద్వారా అక్రమాలు జరుగుతున్నాయి. భూస్వాముల భూములకు క్రమబద్దీకరణ జరుగుతున్నది’ అని. ప్రభుత్వ భూములను కొంత మంది పెద్దలు తమ పేరు మీద ధరణిలో ఎక్కించుకుంటున్నారని కూడా అన్నాడు. తనకు నమ్మకం కుదరలేదు.

అంటే, పదలు చేసుకుంటున్న భూములను కూడా భూస్వాముల పేరు మీద ఎక్కించి పకడ్బందీ చేశారన్న మాట ఇప్పుడు అనిపిస్తున్నది రాజన్నకు. కౌలు రైతులను గుర్తించకపోవడంలో ఆ మతలబు ఉందని ఇప్పుడు తెలిసి వచ్చింది. భూములు కోల్పోయిన బడా భూస్వాములు తిరిగి తమ భూములను సొంతం చేసుకున్నారు. భూములను పడావు పెట్టినా వాళ్లకు నష్టం లేదు. ప్రభుత్వం తమకు ఆదాయం అందిస్తూనే ఉంది.

ఆలోచిస్తూ ఆలోచిస్తూ కునుకు తీశాడు. టైమ్‌ చూసుకున్నాడు. మీటింగ్‌ టైమ్‌ అయింది. ఎందుకో మీటింగ్‌కు వెళ్లాలని అనిపించలేదు. కానీ తప్పదు. తాను వెళ్లకపోతే వాళ్లు బాధపడుతారు. తనను తప్పు పట్టే అవకాశం కూడా ఉంది. ముఖం కడుక్కుని డ్రెస్‌ మార్చుకున్నాడు. మీటింగ్‌ కోసమని బ్యాగులో ఓ జత దుస్తులు తెచ్చుకున్నాడు. బయటకు వచ్చేసి డ్రైవర్‌కు ఫోన్‌ చేసి కారు తీయమని చెప్పాడు. ప్రభుత్వం ఇచ్చిన కారు. ఆయనది క్యాబినెట్‌ పోస్టు. మీటింగ్‌ జరిగే హాల్‌కు చేరుకున్నాడు. తనను చూడగానే అందరిలోనూ ఒక ఉత్సాహం. ప్రదేశమంతా అలజడితో నిండిపోయింది. తనతో కరచాలనం చేయడానికి ఒకరినొకరు తోసుకుంటూ ముందుకు వచ్చారు. ఇంతకు ముందైతే ఇటువంటి వాతావరణానికి తెగ సంతోషించేవాడు. ఇప్పుడు ఆ సంతోషం కలగడం లేదు. యాంత్రికంగా అందరితోనూ చేతులు కలిపాడు.

తనకు చాలా అత్యవసరమైన పని ఉందని, మొదటే ప్రసంగించి వెళ్లిపోతానని, వెంటనే సమావేశం ప్రారంభించాలని నిర్వాహకులకు చెప్పాడు. నిర్వాహకులు కొంత నిరుత్సాహపడ్డారు. కానీ అతని మాటకు ఎదురు చెప్పలేరు. స్వాగతవచనాలు ఇతరత్రా అయిపోయిన తర్వాత రాజన్న మాట్లాడాడు. ప్రసంగంలో పస లేదు. ఇంతకు ముందైతే సాధికారికంగా సోదాహరణంగా మాట్లాడేవాడు. పది నిమిషాల్లో ప్రసంగం ముగించి సభా వేదిక నుంచి దిగిపోయాడు. తనను సాగనంపేందుకు నిర్వాహకులు సిద్ధమయ్యారు. అయితే వారిని వారించాడు.

నేరుగా కారు వద్దకు వెళ్లి బాసరకు పోదామని డ్రైవర్‌కు చెప్పాడు. కారు బాసర వైపు దూసుకుపోతున్నది. తాను ఎందుకు నిర్ణయం తీసుకున్నాడనేది తనకు అర్థం కావడం లేదు. తనకు దైవం మీద నమ్మకం లేదు. కానీ ఉద్యమ కాలంలో గుడులకు తిరగడం సర్వసాధారణమైంది. తనతో పాటు సాగుతున్న ఉద్యమ నాయకులకు ఎదురు చెప్పడం బాగుండేదనే కారణంతోనే అలా చేశాడు తప్ప తనకు దేవుడి మీద భక్తి ఏర్పడి కాదు.

బాసర సమీపానికి చేరుకున్న తర్వాత కారును గోదావరి నది ఒడ్డుకు తిప్పుమని చెప్పాడు. గోదావరి ఒడ్డు సమీపానికి చేరుకోగానే నువ్వు ఇక్కడే ఉండు అని డ్రైవర్‌కు చెప్పి ఒక్కడే గోదావరి దగ్గరకు వెళ్లాడు. డ్రైవర్‌కు రాజన్న తీరు ఈ రోజు వింతగా అనిపిస్తున్నది. దానికి కారణమేమిటో అంచనా వేయలేకపోతున్నాడు.

గోదావరి నదిలోకి చూశాడు. ఇసుక మేటల మధ్య చిన్న కాలువ మాదిరిగా నది పారుతున్నది. చాలా సేపు అలాగే చూస్తూ ఉండిపోయాడు. పెద్ద శబ్దం వినిపించింది. ఒక్కసారిగా ఉలికిపడ్డాడు. ఆ శబ్దంతో పాటే రక్త ప్రవాహం నదిని ముంచేసింది. ఒడ్డును ఒరుసుకుంటూ నెత్తురు పోటెత్తుతున్నది. నిశ్చేష్డుడై దాన్ని చూస్తూ ఉండిపోయాడు. కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. ఒళ్లు అదుపు తప్పుతున్నది.

*

కాసుల ప్రతాప్ రెడ్డి

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు