విచిత్రం
వాడెప్పుడూ
నలత పడ్డ నేలగానో
కలత కమ్ముకున్న జలధిగానో
ఒక ప్రళయానికి నడకలు నేర్పుకుంటూ రాడు
అలాగని
ఏ విచిత్రమోహాన్నో పట్టితెచ్చి
పురుటిదుఃఖాన్ని పూసుకున్న
పొద్దుకొమ్మల మీద
ఏ నక్షత్రంగానో పూతపూయడు
తల్లిరెక్కగా నిన్నంటి
కాచుకోవాల్సిన ప్రతిసారీ
దిగంబరుణ్ణి చేసేసి
ఏ రంగుల పరాగమూ అంటని
కుంచెను చేసిపోతుంటాడు
ఏ రెప్ప చాటుల్లోకి కూడుకోనీయక
ఎప్పటికప్పుడు నవ్వుల్ని తెగ్గోసే
సరికొత్త యుద్ధభాషలకు
నిన్నే ఒక రహస్యలిపిని చేసి
వరసపెట్టి కదం తొక్కిస్తుంటాడు
* * *
విచిత్రం
వాడెప్పుడూ
ఊబుల్లో దిగబడ్డ ఋతువులు గానో
పోస్టుమార్టం బల్లపై
ఆరజాపుకున్న పాలపుంతగానో
ఆఖరిగాలుల్ని
ఆవిరి పట్టుకుంటూ రాడు
అలాగని
నల్లమబ్బు పొదుగుల అంచున
పొగచూరిన మెరుపులనైనా
రాజసంగా ఒలకనీయడు
జడిరాత్రుల్ని పోగేసుకుంటున్న భయమేదో
బాహువులు చాచుకొస్తున్న ప్రతిసారీ
చిరిగిన చూపులో
ఒక్క అరచంద్రికనైనా తీగపాకించే
ఏదో ఒక సంభాషణగానైనా విప్పుకోడు
చుట్టపుచూపుగా కూడా
ఏ పడవపాటా పరిమళించని
రేవులాంటి నీలోకి
ఒక్క రసజ్వలనాన్నీ
ప్రవహించనీయడు, పటం కట్టుకోనీయడు
ఏ నెనరునూ
సడిచేయనీడు, చాచుకోనీయడు
* * *
మరిక –
కంచెలు పాతేసిన నీ ఆకాశంలో
భళ్లున వాంతి చేసుకునే సూర్యుడెప్పుడూ
గర్భం పగిలి జారిపడ్డ
ఎర్రటి నెత్తుటిగుడ్డు మాత్రమే
నువ్వేమో –
తీరం కోసుకుపోతూ
తరులన్నీ దూరం జరిగిపోతుంటే
లోలోపలి దుఃఖాలను
తుడిచేసుకోలేని నదిగానే…
అలాగని ఓటమి ఒప్పుకోవడానికి ఇష్టంలేక
నిద్రపుచ్చే ఏ తిన్నెల కౌగిలింత దొరక్క
మళ్లీ మళ్లీ పెనుగులాటను
కూడుకుంటున్న కెరటంగానే…
*
”నువ్వేమో –
తీరం కోసుకుపోతూ
తరులన్నీ దూరం జరిగిపోతుంటే
లోలోపలి దుఃఖాలను
తుడిచేసుకోలేని నదిగానే…
అలాగని ఓటమి ఒప్పుకోవడానికి ఇష్టంలేక
నిద్రపుచ్చే ఏ తిన్నెల కౌగిలింత దొరక్క
మళ్లీ మళ్లీ పెనుగులాటను
కూడుకుంటున్న కెరటంగానే…”
నిద్ర పుచ్చే ఏ తిన్నెల కౌగిలింత దొరక్క
థాంక్యూ
థాంక్యూ