యే సినిమాకి జెనం (అభిమాన సంఘపోళు కాదు) సప్పట్లు కొడతారో, ఈళలేస్తారో అదే పలాస..!
నిలబడి వున్నోడు కానకుండా ఆడి ముడ్డికింద సెడ్డీ (డ్రాయర్) లాగీడిమే యాపారం! ( పలాస సినీమాలోని డవిలాగు..)
యాపారమే కాదు రాజకీయం కూడా! రాజకీయం పుట్టినిల్లు వొదిలీసి మెట్టినింటికి వొచ్చీసింది. మెట్టినిల్లు యాపారం! యాపారమూ,రాజకీయమూ ఇపుడు కలిసి కాపరాలు సేస్తన్నాయి!
అదిగదిగా ముడ్డికింద సెడ్డీ లాగీసినోడి భాగోతాన్ని నడి ఈధిల జెనం మద్దెన ఇప్పీసి అతగాడి భరతం పట్టడానికి జనాన్ని ఉసిగొలపడమే… కవులూ, రచయితలూ, కళాకారుల విధాయకం! అదిగా విధాయకాన్ని వొందన్నర పాళ్ళు పాటించినాడు…పలాస సినీమా డవిరేక్టరు. ఓలమ్మోలమ్మ…అది సినిమా సంసారం కాదు…గుంటపాపడు అలగ తీసినాడు సిల్మాని! అగ్గిదీసీసినాడు ముండపాపడు! సిన్మా అంతే అలగుండాల. సూసినంతసేపు మన కళ్ళూ, సెవులూ కర్రగట్టీయాల! అదీ సినీమా!
గుండార కట్టిన కాంచి సిన్మాలు సూత్తన్నామా ..? ఒక గండడేనా అలాపింటి సినీమా తీసినాడా? యెంచేపూ…ఆడగుంటని అల్లరెట్టడం… రగుడీసు పన్లు సెయ్యిడిం, కడాకి మంచోడయిపోడం… ఈ లోపు ఫయిట్లు,డేన్సులూ…! ఆ సినిమాల్లోని ఆడగుంటలు యెంచేపూ మగ గండడి యెనకాల పడతారేటే? యెక్కడేనా ఉందా? సిత్తకార్తి బేపి అయినా యెనకాల మగ బేపిని యెన్ని ఈధులు తిప్పుతాది? సీ… ఆడది యేదీ మగపురుగు యెనకాల తిరగదు. సిన్మాల తప్పా! అసలకి అలాపింటి సినిమాల కతలకి ఒక ఊరు వుండదు. యే వూరు నుంచి యే వూరయినా యెళిపోతాది కత. ఒక కాలముండదు. మా మేస్ర్టుగోరు అంతార్లే…స్తల కాలాలు ఉండవు తెలుగు సినీమాకి అని. అది నిజిం! గాని ఇన్నాళ్ళకి అసలుసిసలు సినీమా వొచ్చిందమ్మీ…పలాస!! అందల ఊరుంతాది. మనుసులుంతారు. ఆళ మాటామంతీ…ఆటాపాటా ఉంతాది. ఊరున్నపుడు… బారికోడుంతాడు, బాగ్యమంతుడుంతాడు. ఊరుపెద్దుంతాడు. పేదారోదుంతారు. సావుకారుంతాడు, సంసారుంతాడు…ఆళందరి బతుకుల బాగోతం…సినిమా అవ్వాల! అది అలగయ్యింది…పలాస!
అసలకి సినిమా సూత్తన్నామా… ఆ ఊళ్ళంట, ఆ సేపల సెరువులంట, అ సేపల బజార్లంట మనమూ తిరగతన్నామా… సెప్పలేమప్పా! ఆకడికి అనకూడదు గానీ సెంబొట్టుకొని సెట్టుసాటున కూకున్నట్టగా అనిపిస్తాది. యే గండడో పలకరించినట్టగుంతాది. గండడికి నోటినిండా సాడు పోసినట్టగుంతాది!
సావుకారి నమ్డీకొడుకులు…బేపులుకీ తిండెడతారు, పేదారోదాల్ని బేపులు జేసీస్తారు. బేపి బేపే…పేద పేదే! పేదోడు సావుకారి కాళ్ళు కాడ పడుండాల… బేపి లాగ! అప్పిచ్చువాడు, వొయిద్యుడూ, యెప్పుడు యెడతెగక పారు యేరు వుండాలని పాపమ్ సుమతి శతకకర్త అన్నాడుగానీ…అవన్నీ ఇపుడు జెనానికి అపకారమే సేస్తాయి…! అన్నీ యాపారం అయిపోయిన రోజులివి. లాభం తప్పా మరో పదం పలకడం రాదు యాపారికి! ఆడికి తోడు రాజకీయం కలిసింది. బతుకులిపుడు బజారుపాలయినాయి. బజారోడి సేతిల ఉన్నాయి. ఆట్ని ఇడిపించడానికి ఇరకాటాలు పడాల, పోరాటాలు సెయ్యాల. తోబుట్టువుని, తోడు నడిసీదానిని బలిపీఠమ్మీద వొదిలీయాల. సముద్రకెరటం లాగ బతుకు యెపుడూ ఒడ్డుని బాదుకొని గోస బెట్టాల! ఇరిగి పడిన కెరటం మళ్ళామళ్ళా లెగిసి పోటెత్తినట్టగ…నువ్వు పోటెత్తాల! అదిగది బతుకుదోవ! అదిగదిగో అ తోవని అందరికీ బోదపడినట్టిగ సూపింది…పలాస సినీమా!
నిన్న తొలి ఆటకి యెల్నాను. హాల్ల జెనం … పలాసగ ఉన్నారు. ఇదేటోలమ్మ… కొంపదీసి సినిమా యెన్నాళ్ళో ఆడదా, యేటి? యెవుళూ సూడరా యేటి? ఇంత పలసగున్నారని మాసెడ్డ ఇదయిపోనాను. పక్కనున్నోడికి అడిగితే – పలాస కదా సినీమా పేరు…జెనమూ పలసగే ఉంతారని పంచ్ డవిలాగ్ యేసాడు. గండడికి మాసెడ్డ గోరోజినం! సినిమా కొసదాక సూడు…నీ గోరోజినం పలాసగ అయిపోతాదని లోపల తిట్టుకొని…సినిమా సూసేను. పడతన్నాయి సప్పట్లు…యేస్తన్నారు ఈళలు!
యే సినిమాకి జెనం (అభిమాన సంగపోళ్ళు కాదు)ఈళలేస్తారో…డవిలాగులుకి సప్పట్లు కొడతారో అదే పలాస!
పెళ్ళవనీ…కిందనేసి మట్టేస్తాది / యేమిరా,,,దాని ముడ్డిగాని కడగతావేటి/ ప్రెపంచం ల యుధాలన్నీ ముండకోసం..పదవికోసం జరిగేయి/
యెన్నెన్ని డవిలాగులుకి జెనం సప్పట్లూ,ఈళలూ యేసారో…!
ఆ మోనా…రంగారావులెనకాల యెనకాల తిరిగినామనుకో… సినిమా సూసినంతసేపూ! సెబాసో…డవిరేట్రూ! శికాకోళం పేరు నిలబెట్టినావు. పలాస సెరిత్రకి ఇలువ తెచ్చినావు. అపుడెపుడో…పలాసల రైతు మహాసభ నుంచి మొన్నటి నక్సలైట్ పోరాటమ్ దాకా శికాకుళం ఒక పోరుగడ్డ. ఓడిపోతామని తెలిసినా…వెనుకడుగు వేయని వీరుల నేల. అశోకుడి నుండి నేటి ఆల్ ఖైమా కార్పొరేట్ కంపెనీల దాకా యెదిరించి నెత్తురుపోసిన భూమిపుత్రుల పుడమి! ఇన్నాళ్ళకు ఆ పోరునేల బతుకుల్ని చిత్రప్రపంచానికి చూపెట్టిన కరుణాకర్ నీకు జేజేలు. కళింగ పలుకుబళ్ళ సొంపుని చిత్రపరిశ్రమకు పరిచయం చేసినందుకు వందనాలు.
బావుల్లారా…అందరూ సూడాల. ఇలాపింటి సినిమాల్ని సూసి, ఆదరించిన్నాడే…మరిన్ని ఇలాపింటి సినిమాలు,మన బతుకు కతలు, మన యాసబాసలు, ఆశలు నిండిన సినిమాలొస్తాయి. సూత్తారుకదా..! సూడనోళు…అనకూడదుగానీ…..ళ్ళు!
*
మాండలికం చదువుతుంటే మాట మడతపడుతుంది కానీ అర్థం చేసుకుంటే పలాస సినిమాలాగే మంచి సొగసుగా ఉంది మీ వచనం. అద్భుతంగా రాశారు. మరి మన గుంటలు చూస్తారో లేదో కానీ సినిమా మాత్రం మంచి నిఖార్సైన సినిమా.!
పలాస.. కళింగ నేల మట్టి బతుకుల దివిటి…
చిత్రసీమలో కరుణకుమార్ రగిల్చిన కాగడా…
మంచి సమీక్ష.
బాగా చెప్పారు అట్టాడ గారూ.. ,కరుణా.. నీ శ్రమ విజయపథాన్ని ముద్దాడుతోంది. యువర్ టైం స్టార్టెడ్ నౌ ..గో ఎహెడ్..
ఓరి నాయనో నా అప్పల నాయుడు, యేటి యేటి అలాగ సెప్పిసినావు అని పొద్దు గుంకినాక ఆటకి యెళ్ళానా , యెట్రా బావ్ ఆ జనాలు , మాఅమ్మి అదేదో పోన్ లో సేసింది లే టిక్కెట్టు, ఆ గుంట నలిగి పోయి నట్టిగా అవ్వకుండా ,
అవును గానీ నాయుడు , నువ్వు ఆళ్ళ ధైర్యం ఎక్కడా సెప్పనేదేటి గుంట పాపలు ఎంత ధ్వర్యం తోని ఎదించేరు కడాకి బాగుంది నాయనా ., N k Babu.8977732619.
చాలా చక్కగా వివరించారు గురువుగారూ…. ఒక యాస కమెడియన్స్ తో మాట్లాడిస్తే అది వెక్కిరింత…. కానీ పాత్రలతో పలికిస్తే వాస్తవికత… అందుకే ఈ సిన్మాలో ఒక పలాసోడి నొప్పి… తెలంగాణోడికి కూడా నొప్పిగానే గుచ్చుకుంది… ఈ సినిమా ఒక సాహసం అనేకంటే కూడా తెలుగు చిత్రపరిశ్రమకి గట్టి చెంపదెబ్బ అనడం ఉత్తమం.