యేసయ్య తెల్లనా?

ఫ్రాన్సిస్ ఎం.నందగావ్ ఒక కన్నడ పాత్రికేయుడు, రచయిత, అనువాదకుడు. వీరు కన్నడ, ఇంగ్లీష్ భాషలలో అనేక రచనలు చేశారు. హెచ్.సి.ఆండర్సెన్, చార్లెస్ డికెన్స్ హెన్రీ, ఆస్కార్ వైల్డ్, లియో టాల్‌స్టాయ్ రచనలను కన్నడలోనికి అనువదించారు. ముఖ్యంగా క్రైస్తవ జానపద సాహిత్యాన్నికథలు, నాటకాలు, యక్షగానాల రూపంలో కన్నడిగులకు పరిచయం చేశారు. 2009 నుండి విరివిగా రచనలు చేస్తున్న నందగావ్ గారి  “ఘట ఉరిళితు”, “ఇన్నాసప్ప మత్తు బండెగళు”, “ఖ్యాత క్రిస్మస్ కథెగళు”, “ఇబ్బరు వృద్ధర తీర్థయాత్రె”, “బదుకలు ఏను బేకు?”, “Lead Kindly Light”, “The Little Flower of India”  మొదలైన పుస్తకాలకు పాఠకుల నుండి మంచి స్పందన లభించింది. 

కన్నడ మూలం: ఎఫ్.ఎం.నందగావ్

“అప్పా, అప్పా యేసుస్వామి, వాళ్ళప్ప జోసెఫ్, ఇంకా వాళ్ళమ్మ మేరీమాత తెల్లగా ఉండేవారా?” మూడో క్లాసు చదువుతున్న కొడుకు, ఇంటికి రాగానే వాళ్ళ తండ్రిని ఈ ప్రశ్న అడిగాడు. తండ్రి ఇన్నాసప్ప మాస్టారు, మున్సిపాలిటీ తొమ్మిదో వార్డు స్కూల్లో తొమ్మిదో క్లాసు చివరి పీరియడ్ లో అబ్రహం లింకన్ గురించి పాఠం చెప్పి వచ్చాడు.

దాదాపు మూడు శతాబ్దాల క్రితం బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్ర్యం పొందిన ఉత్తర అమెరికాలోని వివిధ రాష్ట్రాల (సంస్థానాల) దేశం ‘అమెరికన్ స్టేట్స్’ ఉనికిలోకి వచ్చింది. అమెరికా బ్రిటిష్ వలస పాలన నుండి స్వాతంత్ర్యం పొందిన తరువాత, అమెరికా అధ్యక్షుడు లింకన్ సంస్కరణలు చేపట్టాడు. భారతదేశంలో సుగంధ ద్రవ్యాల వ్యాపారంపై గుత్తాధిపత్యం కలిగి ఉన్న అరబ్బుల బారి నుండి తప్పించుకోవడానికి, కొన్ని తీరప్రాంత యూరోపియన్ దేశాల నుండి ఉత్సాహవంతులైన నావికులు సముద్రం దాటి వివిధ దిక్కుల్లో ప్రయాణించారు. వాటిలో కొన్ని మాత్రమే భారతదేశానికి చేరుకున్నాయి, మరికొన్ని ఆఫ్రికన్ తీరంలోని వివిధ దేశాలకు చేరుకున్నాయి.

మరికొన్ని ఉత్తర, దక్షిణ అమెరికాలు, ఆస్ట్రేలియా ఖండాలను కనుగొన్నాయి. నైసర్గికంగా సహజసంపదలతో ఉన్న ఈ కొత్త భూములలో, ఈ నావికులు తమ సైనిక దళాలను ఉపయోగించి, అమాయక స్థానికులను వేటాడి వలసరాజ్యాలను స్థాపించారు. విస్తారమైన అమెరికా ఖండాలలోని స్థానిక నివాసులను నిర్మూలించి, స్థానిక జంతు ప్రపంచానికి విపత్తు తెచ్చిన శ్వేతజాతీయులు, వందల ఎకరాల భూమిలో పట్టణాలను నిర్మించి, వ్యవసాయ భూములను సాగుచేశారు. గనులు తవ్వారు. ఆఫ్రికాలోని వివిధ దేశాల నుండి బలమైన యువకుల్ని, యువతుల్ని పట్టుకొని వచ్చిన ఐరోపా తెల్లవాళ్ళు, వారిని బానిసలుగా మార్చి, తమకు చేతకాని పొలంపనులు, వేరే కష్టమైన పనులు వాళ్ళతో చేయించుకునేవాళ్ళు.

మనుషులను బానిసలుగా చేసుకునే ఈ ఆచారం వేల సంవత్సరాల కిందట రోమన్ కాలం నుండి అమలులో ఉంది. పెంపుడు జంతువుల వ్యాపార సంతలు, జాతరల్లాగే బానిసల వ్యాపారానికి కూడా సంతలు ఉండేవి. ఐరోపాలో తుపాకీ కనిపెట్టినప్పుడు, వాటిని జంతువులను వేటాడేందుకు ఉపయోగించినట్లే, ఆఫ్రికా ఖండం  ప్రజల్ని పట్టుకొని వచ్చి బానిసలుగా మార్చడానికి ఉపయోగించేవారు. ఈ నల్లజాతి ఆఫ్రికా నీగ్రో ప్రజల పిల్లలు, మనవళ్లు, మునిమనవళ్లు ఎన్నడూ విముక్తి పొందకుండా బానిస జీవితాన్ని గడిపారు.అమెరికాలోని ఆఫ్రికా మూలానికి చెందిన అమెరికన్లకు పౌరుల హోదా ఇచ్చి గౌరవప్రదమైన జీవితం కల్పించడానికి చాలా కష్టపడ్డ అబ్రహం లింకన్ జీవితం పాఠం ముగించుకొని తండ్రి వచ్చాడు.

మన దేశపు ప్రాచీన ఇతిహాస గ్రంథమైన మహాభారతంలో నల్లగా ఉన్నాడు. రామాయణంలోని రాముడు నల్లగా ఉన్నాడు. లోకాన్ని పాలించే పరమేశ్వరుని రంగు కూడా నలుపే. శ్రీరాముడు నీలం, నల్ల కలువ కలిసిన రంగులో ఉంటాడు. విష్ణువు రంగు కూడా ఇదే.  శివుని రంగు కూడా ఇదే. ఆ నీలి రంగు అన్నింటినీ కలుపుకునే లక్షణం కలిగిన సముద్రం, ఆకాశం రంగు అని చెప్తారు. కానీ ఈ దేవతల రంగు నీలం కాదు నలుపు అని ఒక పుకారు ఉంది. తెల్లరంగును మంచితనానికి, చీకటి రంగు నలుపును చెడుకు పోల్చడం ఎంతవరకు న్యాయం? అనే ప్రశ్న ఇంటికి వచ్చినా తండ్రి ఇన్నాసప్పని వెంటాడుతూనే ఉంది. అదే ఆలోచనలో ఉన్న ఇన్నాసప్పకి, కొడుకు అడిగిన ఈ ప్రశ్న ఆశ్చర్యం కలిగించింది. మనుషుల రంగుల మూలం, పుట్టుక, కులం మొదలైన వాటి ఆధారంగా వివక్ష గురించి అమాయకుడైన తన బిడ్డకు చెప్పాల్సి వచ్చింది కదా అనే  ఆలోచన ఇన్నాసప్పని వేధిస్తోంది.

“ఇప్పుడెందుకు ఈ ప్రశ్న?”

“క్రిస్మస్ దగ్గరకొచ్చింది కదా, ఈసారి మా స్కూల్లో, మూడో క్లాసు ఎ సెక్షన్ పిల్లలు “క్రీస్తు జననం”  నాటకం వేయాలని ప్రిన్సిపల్ సిస్టర్ మార్తా మొన్న క్లాసుకు వచ్చినప్పుడు చెప్పింది. దాని ప్రకారం చిన్న  పిల్లలతో క్రిస్మస్ జననోత్సవ నాటకం ఆడించాలని నిర్ణయించారు.”

“మంచిదే. చదువులోనే కాకుండా, విద్యార్థులు వివిధ ఆటలు, పాటలు, మిమిక్రీ, నాటకం, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు వంటి పాఠ్యేతర కార్యకలాపాలలో కూడా పాల్గొనాలి.”

“అప్పా! నువ్వు చెప్పింది నిజమే. మా ప్రిన్సిపాల్ అదే మాట చెబుతూనే ఉన్నారు.”

ఇంతలో ఊరి నుంచి వచ్చిన తాత చిన్నప్ప ఇంట్లోకి వచ్చాడు. “ఏం కొడుకా బాగుండావా? మన పాపు మంచిగాచదువుతున్నాడా?” అని అడిగాడు, హాల్లోని ఒక మూలలో ఉన్న ఈజీఛెయిర్‌లో హాయిగా వెనకకువాలి. మనవడు బెంజి “తాతా స్తోత్రం ” అని కాళ్ళు తాకి తన గౌరవాన్ని చూపించాడు.

  • • •

క్రైస్తవ సమాజాలలో, ముఖ్యంగా పల్లెటూరి మూలాలున్న క్రైస్తవులలో, ఒకరినొకరు కలిసినప్పుడు చిన్నవారు పెద్దవారికి “ప్రభువుకు స్తోత్రం” అని చెప్పడం ఒక సంప్రదాయం. మామూలుగా, గుడిలో ప్రార్థన ముగిసిన తర్వాత, పిల్లలు, చిన్నవారంతా పెద్దవారిని కలిసి వారికి “ప్రభువుకు స్తోత్రం” అని చెబుతారు.వాడుకలో “ప్రభువుకు స్తోత్రం” అనేది కుదించబడి, ఇప్పుడు ‘స్తోత్రం’ అనడానికి మాత్రమే పరిమితమైంది.

ఈ ‘స్తోత్రం’ అనేది, సాంకేతిక పరిజ్ఞానం దూసుకుపోతున్న ఈ రోజుల్లో, తల్లిభాషను పక్కకు నెట్టి,  అన్నం పెట్టే భాషగా మారిన ఇంగ్లీషులో మునిగిపోయి, పాశ్చాత్య దేశాల సంస్కృతిలో మునిగి తేలుతున్న నేటి యువతలో వాడుకలో ఉన్న ‘ప్రెయిజ్ ద లార్డ్’ అనే మాటకి తెలుగు రూపం.

పురాతన కాథలిక్ క్రైస్తవ కుటుంబాలున్న ఊర్లలో ఈ ‘ దేవునికి  స్తోత్రం’ అని చెప్పే పద్ధతి అవశేషంగా ‘స్తోత్రం’గా మిగిలిపోతూ వస్తోంది. మత ప్రచారంలో పది అడుగులు ముందుండి, శుభవార్తను వ్యాప్తి చేయాలనే ఆశతో, వివిధ ప్రొటెస్టంట్ తెగలను అనుసరించే క్రైస్తవులలో, ఆంగ్ల ప్రభావం పెరిగింది. తదనుగుణంగా, ‘ప్రెయిజ్ ద లార్డ్’ అని ఒకరినొకరు పలకరించే ఆచారం పెరుగుతోంది. ఈ నమస్కారానికి కూడా హోదా, కుల, మతాల కళంకం మొదటి నుండి అంటుకొని ఉంది  అనిపిస్తుంది. యజమానులను, ధనవంతులను ‘అయ్యగారూ’, ‘సార్’ అని పనిచేసే శ్రామిక వర్గం తలవంచి సంబోధిస్తుంది. ముస్లింలు ఒకరినొకరు కలిసినప్పుడు, చేతులు జోడించి చెప్పే నమస్కారం, వందనాల మాదిరిగా, ‘దేవుడు మీతో ఉండుగాక, దేవుడు మీతోనూ ఉండుగాక’ అనే భావం వచ్చేలా ‘సలాం వాలేకుం’ దానికి ప్రతిగా ‘వాలేకుం సలాం’ అని చెప్పే ఆచారం ఉంది.

అయోధ్యలోని బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత, మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అందరూ తమను తాము శ్రీరాముని భక్తులుగా చూపించుకునే తొందరలో నమస్కారం బదులు ‘జై శ్రీరామ్’ అని చెప్పే కొత్త ఆచారం మొదలైంది. గతంలో దశాబ్దాల క్రితం, హిందీ సినిమాలలో చనిపోయిన వ్యక్తి ఊరేగింపు సమయంలో ‘రామ్ నామ్ సత్య హై’ మరియు ‘గోవిందా గోవిందా’ అనే నినాదాలు  చేయడం మనం చూసేవాళ్ళం. కొన్ని ప్రాంతాలలో ‘జై కృష్ణ’ అని వందనం చేసే సంప్రదాయం కూడా  ఉంది. బసవన్న ప్రభావంతో కన్నడనాడులోని కొన్ని జిల్లాలలో ప్రజలు ఒకరినొకరు కలిసినప్పుడు  ‘శరణు శరణు’ అని పరస్పరం వందనం చేసుకునే ఆచారం కూడా ఉంది. పవిత్ర గోవు శరీరంలో  పుట్టిన 33 కోట్ల దేవతలలో, ఈరోజు పైచేయి సాధించిన, మర్యాదా పురుషోత్తముడు శ్రీరాముని పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. టెలిఫోన్, మొబైల్లో మొదట చెప్పే ‘హలో’ అనే పదాన్ని ఇప్పుడు ‘జై శ్రీరామ్’ భర్తీ  చేస్తోంది.

  • • •

“అప్పా, ఇప్పుడే వచ్చావా? కాళ్ళు చేతులు కడుక్కోండి” అని మర్యాద చేస్తూ, కొడుకు ఇన్నాసప్ప, వంటగదిలో ఉన్న భార్యకు వినబడాలి అనుకొని, “ఏమేవ్ మా అప్ప, మీ మామ  వచ్చాడే” అని గట్టిగా అరిచి చెప్పాడు.

“ఇంట్లోకి వచ్చేటప్పుడే కాళ్ళు చేతులు కడుక్కొని, తువ్వాలుతో తుడుచుకొని లోపలికి వచ్చాను. బయట ఇంటి చుట్టూ తోటకు నీళ్ళు పోయడానికి నల్లా పెట్టారు కదా, దానికి తగిలించిన పైపు తీసి అక్కడున్న బండపై కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చాను.”

లోపలి నుండి వచ్చి, మామయ్యకు “స్తోత్రం” చెప్పింది మాస్టర్ ఇన్నాసప్ప భార్య అన్నమ్మ, “వెళ్ళండి, చీకటి పడుతోంది. గుడంగడి అహమ్మద్, మిగిలిపోయిన మాంసాన్ని అంటగడతాడు.  ఇవాళ కోసిన లేత గొర్రె మాంసం ఇయ్యమని చెప్పండి” అని ఇన్నాసప్ప చేతికి సంచి ఇచ్చింది.

తాత చిన్నప్ప ఊరి నుండి వస్తే, ఆ రోజు ఇన్నాసప్ప ఇంట్లో మటన్ భోజనం తప్పనిసరిగా ఉండాలి. ఊరిలో పొలం చూసుకుంటున్న చిన్నప్ప కొట్టంలో పదికి పైగా ఆవులు, గేదెలు ఉన్నాయి. ఒక గొర్రెల మందను కూడా పెట్టుకున్నాడు. ఇంటి పెరట్లో సన్నగా ఉండే రకరకాల జాతి కోళ్ళను కూడా పెంచుకుంటున్నాడు. మటన్, చికెన్ అతనికి అరుదైన వంటలేమీ కాదు. మా ఊరిలో అమ్మ వంట రుచికి దాసోహం కానివారే లేరు. భార్యకు తండ్రి వచ్చాడని గట్టిగా చెప్పడానికి కారణం కూడా లేకపోలేదు.

ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఇన్నాసప్ప  భార్య అన్నమ్మ చేసే మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, కబాబ్ ల రుచి వేరేలా ఉంటుంది. ఇంకా ఆమె తయారు చేసే పులుసు ముందు, ఏ ఫైవ్ స్టార్ హోటల్ సూప్ కూడా దిగదుడుపే. ఇన్నాసప్ప పెద్దలు బళ్లారి, అనంతపురం ప్రాంతానికి చెందినవారు. గతంలో బళ్లారిపై బ్రిటీష్ కంపెనీ ప్రభుత్వం పట్టు సాధించింది. అక్కడి నుండి భూమి వెతుక్కుంటూ దక్షిణానికి ఇన్నాసప్ప పూర్వీకులు మైసూరు ప్రాంతానికి వలస వచ్చారు. వారిని స్థానికులు ‘కంపెనీ సీమ ప్రజలు’ అని పిలుస్తారు. ‘ తండ్రి ఊరి నుండి వచ్చాడు. ఆరు నెలల తర్వాత వచ్చాడు. తొందరగా అహమ్మద్ మాంసం దుకాణానికి వెళ్లి బన్నూరు గొర్రె మాంసం తేవాలి, నాటు కోడి మాంసం కూడా తేవాలి’ అని అనుకున్న ఇన్నాసప్ప  అహమ్మద్ దుకాణానికి బయలుదేరాడు.

ఇన్నాసప్ప గబగబా రావడం దూరం నుండి గమనించిన అహమ్మద్, “ఇన్నాసప్ప గారు తొందరగా వస్తున్నారేంటి? తండ్రి గారు ఊరి నుండి వచ్చారా ఈరోజు?” అని అడిగాడు. మాస్టర్ ఇన్నాసప్ప వాళ్ళ తండ్రి ఊరి నుండి వచ్చిన విషయం ఇలా మాంసం కొనడానికి అతని దుకాణానికి వచ్చినవారి ముందు బహిర్గతం కావడం కొత్తేమీ కాదు.

  • • •

ఈరోజు మామ చిన్నప్ప చేతిలో ఏమీ లేదు. వట్టి చేతులతో ఇంటికి వచ్చాడు.

“ఏమి మామా, ఈ రోజు కూరగాయలు ఏమీ తెచ్చినట్లు లేరు?” ఇది కోడలు అన్నమ్మ ప్రశ్న.

“అంతా ఈవిడ చేసినది చూశావా?”

“అత్తగారు ఏం చేశారు?”

“చాలా రోజులయింది, కొడుకుని, మనవడిని ముఖం చూసి. అలాగే, మన పెద్ద దొర మేత్రాణులు ఉండే పెద్ద మఠం – పట్టణంలోని రీటమ్మ మఠానికి, మన ఊరి మన వీధి మూలింటి చక్రద మ్యానువేలప్ప కొడుకు సిమోనప్ప, మొదటిసారి ధర్మకేంద్ర గురువుగా వచ్చాడంట. రేపు పట్టణానికి వెళ్లి వారిని మాట్లాడుకొని వద్దామని అనుకున్నాను. నిన్న చెప్పాను.” “అలా అన్నప్పుడు, ‘సరే వెళ్లి రండి’ అని మీ అత్తగారు, ఎప్పటిలాగే కొడుకు ఇంటికి పంపేంత కూరగాయల సంచి సిద్ధం చేసింది. నేను, మొదటిసారి ధర్మకేంద్ర గురువైన మన సిమోనప్పకు కూడా కూరగాయల సంచి కట్టమని చెప్పడం మర్చిపోయాను. పొద్దున్నే లేచి వచ్చే తొందరలో నాకూ సరిగా గుర్తు రాలేదు. బస్సు దిగిన తర్వాత రాఘవేంద్ర హోటల్లో కాఫీ తాగి రీటమ్మ మఠానికి వెళ్లాను. అక్కడి స్వామి వారి గదిలో, ఉదయకాల పూజ ముగించి, టిఫిన్ తింటూ కూర్చున్న స్వామి వారైన, మన ఊరి అబ్బాయి సిమోనప్పను మాట్లాడించి, కూరగాయల సంచి ఇచ్చి వచ్చాను. ఈరోజు కూరగాయల కథ ఇలా జరిగింది చూడు.”

“సరేలే మామా, నేను అడిగినది మీరేమీ మనసులో పెట్టుకోకండి” అంటూ వంటగదిలోకి వెళ్లిపోయింది అన్నమ్మ.

  • • •

“ఏరా కులదీపకుడా, ఏమి చేస్తున్నావు? స్కూల్లో చదువు బాగా సాగుతోందా?” తాతయ్య ప్రేమగా మనవడి చదువు గురించి అడిగాడు.

“అవును తాతయ్యా.”

“ఏమిటో, ఏదో అడగాలని ముఖం అలా పెట్టావు. ఏమిటో అడుగు.”

“తాతయ్యా, స్వామి వారు, ఆళినవారు, పెద్ద మఠం, మేత్రాణి, అని మాట్లాడుతున్నారు కదా, వారందరూ ఎవరు?”

“వారందరూ ఒకరే నాయనా. పెద్ద దొర అంటే ఆళినవారు, మేత్రాణి అని.”

“అదే తాతయ్యా, ఆ మేత్రాణి ఎవరు?”

“అయ్యో పిల్లోడా, నీకు మేత్రాణి తెలియదా?”

“తాతయ్యా, నిజంగా తెలియదు.”

“ఇప్పుడేం చేయడమబ్బా?” తల గోక్కుంటూ తాతయ్య, “బిడ్డా ఇలా రా” అని పిలిచాడు. పచ్చి కొబ్బరిని రుబ్బడానికి, పచ్చి కొబ్బరి ముక్కలను మిక్సీలో వేసిన అన్నమ్మ, దానిని ఆపి బయటకు వచ్చింది.

“ఇక్కడ మీ మఠంలో ఉపదేశి లేడేమిటి? నేను ఆళినవారు, పెద్ద దొర, పెద్ద మఠం, మేత్రాణి, స్వామి వారు అంటే ఈ పిల్లాడికి ఏమీ అర్థం కావడం లేదు.”

“మావా, అవన్నీ ఇప్పుడు పాత పదాలు అయ్యాయి.”

“అవన్నీ పాత పదాలు ఎలా అవుతాయి? స్వామి వారికి సహాయం చేసే ఉపదేశి, పిల్లలకు జపతాపాలు నేర్పించడం లేదా? వారు ఈ పదాలు నేర్పించడం లేదా?”

“లేదు మావా, ముందున్న మా సెయింట్ జోసెఫ్ గుడి ఉపదేశికి వయసైపోయింది. అతని పిల్లలకు, ఊర్లోని కొత్త పిల్లలకు ఈ పని మీద ఆసక్తి లేదు.”

“అలా చెప్పు మరి…”

“… … …”

“చూడమ్మా, నా మనవడికి ఆళినవారు తెలియదు, పెద్ద దొరలు-మేత్రాణిలు తెలియదు. పెద్ద మఠం కూడా తెలియదు. మీ ధర్మ కేంద్రం సెయింట్ జోసెఫ్ మఠం, మఠం గురువులు తెలుసో లేదో? స్వామి వారు కూడా తెలియదు. ఏమి కాలం వచ్చిందో?”

“మావా, అన్నీ తెలుసు మీ మనవడికి. కానీ, మీరు ఉపయోగించే పదాల వల్ల ఇబ్బంది అవుతోంది.”

“అంటే ఏమిటమ్మా? నేను ఏమైనా కన్నడం వదిలి వేరే దేశపు భాషలో మాట్లాడుతున్నానంటున్నావా?”

“మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. మీరు చెప్పేది శుద్ధ కన్నడమే. కానీ, ఇప్పుడు మా పిల్లలను ఇంగ్లీష్ స్కూల్లో వేస్తున్నాము. వారికి, ఇప్పుడు సరళమైన కన్నడం కూడా కష్టం అవుతోంది.”

“అదేమి కష్టమో, సొంత తల్లి భాష నా మనవడికి తెలియడం లేదు.” తనలో తానే గొణుక్కొన్నాడు తాతయ్య చిన్నప్ప.

“స్కూల్లో సిస్టర్, బ్రదర్‌లు కేటకిజం క్లాస్ తీసుకుంటారు. మీరు పిలిచే ధర్మోపదేశం చెప్పే ఉపదేశి – కేటకిస్ట్ పనిని, ఇప్పుడు టీచర్‌లు, సెమినరీ-గురుమఠం పిల్లలు చేస్తున్నారు.”

“… … …”

“మావా, మీరు పాతవారు బిషప్ లను మేత్రాణి అని పిలుస్తారు. ఇప్పటికీ కేరళలో కూడా వారిని మేత్రాణి అనే పిలుస్తారు. ఎన్నో ఊర్లలోని చర్చిలను మీరు మఠం అంటారు. మా పిల్లలు ఇంగ్లీష్ లో చర్చి అనే పదాన్ని ఉపయోగిస్తారు. మీరు ‘ఆళినవారు’ అనేది, బిషప్ లను సంబోధించే గౌరవ సూచక పదం. అది ఇంగ్లీష్ లో ‘యువర్ లార్డ్, యువర్ హైనెస్’ అవుతుంది. చర్చిని మీరు గుడి, మఠం అంటారు. బిషప్ ఉండే పెద్ద గుడిని మీరు పెద్ద మఠం అంటారు. దానిని ఇంగ్లీష్ లో కేథడ్రల్ అంటారు. మీరు గురువులు ఉండే ఇంటిని ఆరే అంటారు అంతే.”

“మనవడితో మాట్లాడాలంటే నేను కూడా ఇంగ్లీష్ స్కూల్ కి వెళ్ళాలేమో?” తాతయ్య చిన్నప్ప నవ్వుతూ అన్నాడు. మనవడు బెంజామిన్ ముఖం వంద వాట్ల బల్బు వెలిగినంత వెడల్పు అయింది. తాతయ్య ఉపయోగిస్తున్న పల్లెటూరి సాంప్రదాయ క్రైస్తవులలో వాడుకలో ఉన్న కొన్ని క్రైస్తవ పరిభాష పదాలు అతనికి ఇప్పుడు కొద్దిగా అర్థం కావడం మొదలయ్యాయి.

“ఐతే, పిల్లోడు ఇంగ్లీష్ స్కూల్ కి వెళ్తున్నాడు. కన్నడ మాట్లాడడం లేదు. ఇప్పుడు ధర్మోపదేశాన్ని అమ్మలవారు, గురుమఠం పిల్లలు ఇంగ్లీష్ లో చెబుతున్నారు. అన్నీ ఇంగ్లీష్ ఇంగ్లీష్ అయ్యాయి, మన జేసునాథుడు కూడా ఇంగ్లీష్ లో మాట్లాడతాడా?”

“తాతయ్యా, ఈ జేసునాథుడు అంటే ఎవరు?” బెంజి మధ్యలో నోరు పెట్టి అడిగాడు.

“అయ్యో  జేసునాథా, ఇప్పటి పిల్లలకు మన దేవుడు జేసునాథ స్వామి కూడా తెలియదా?”

“మావా, జేసునాథుడి పేరు, ఇప్పుడు వాడుకలో యేసుస్వామి అయింది. మీరు తల పాడు చేసుకోవద్దు.”

“అయితే, ఎలాగమ్మా? ఉదయం లేచి జేసునాథుడిని తలుచుకొని అన్ని పనులూ చేసే కుటుంబం మనది. ఇప్పుడు చూస్తే మనవడికి జేసునాథుడి పేరు తెలియదు! అందుకే చెప్పేది, పిల్లలను అప్పుడప్పుడు ఊరికి పంపించాలి, అక్కడ  మనది పిల్లలు నేర్చుకుంటారు. మీరు అతని స్కూల్ లో స్పెషల్ క్లాసులు ఉన్నాయని, అవి చదవాలని పట్టుకొని కూర్చున్నారు ఇక్కడ.”

అప్పుడు, బెంజికి ఆనాటి స్పెషల్ క్లాస్ గుర్తుకు వచ్చింది. తొందరగా ఆనాటి క్లాస్ నోట్ బుక్ లను సర్దుకున్నాడు. “అమ్మా, నేను మ్యాథ్స్ టీచర్ మింగేల్ గారి దగ్గరకు వెళ్ళాలి. స్పెషల్ క్లాస్ పెట్టారు. వస్తాను” అంటూ నోట్ బుక్ పట్టుకొని బయలుదేరాడు.

“అయ్యో జేసునాథా, పిల్లలకు తమ తాతతో మాట్లాడడానికి కూడా తీరిక లేదా?” అని బాధపడుతూ నుదురు కొట్టుకున్నాడు తాత.

మటన్ కొనుక్కొని ఇంటికి వచ్చిన ఇన్నాసప్పకి, అతని తండ్రి మాటలు సగం సగం వినిపించాయి.

“ఏయ్! సంచి తీసుకో…” అని భార్య అన్నమ్మను పిలుస్తూ తండ్రి కూర్చున్న బట్టల కుర్చీ పక్కన ప్లాస్టిక్ కుర్చీ లాగి కూర్చున్నాడు.

ఇన్నాసప్ప చేతిలోంచి సంచి లాక్కుంటూ, “మటన్ షాప్ అహ్మద్ భార్య ఫాతిమాబీ ఆరోగ్యంగా ఉందా? గత వారం ఏదో జబ్బు చేసి ఆసుపత్రిలో చేర్చామని చెప్పాడు.”

“ఇంటికి వచ్చి అటూ ఇటూ ఇంటి పని చేసుకుంటోంది.” భార్యకు సమాధానం చెప్పి, తండ్రి చిన్నప్ప వైపు ముఖం తిప్పాడు. “ఏమప్పా, నుదురు కొట్టుకుంటున్నావు. ఊర్లో ఏదైనా జరగకూడనిది జరిగిందా?” నాన్న వైపు చూస్తూ ఇన్నాసప్ప అడిగాడు.

“ఊర్లో కాదప్పా, ఈ నీ ఇంట్లో జరిగింది.”

తండ్రి చిన్నప్ప మాటలకు దిగ్భ్రాంతికి గురైన ఇన్నాసప్ప. “ఏమప్పా అది?”

“అది అంటే, పిల్లోనికి కన్నడ నేర్పించడం లేదు. మేత్రాణి అంటే ఎవరు అని తెలియదంట. పెద్ద మఠం తెలియదు.”

“పెద్దయ్యాక అన్నీ అర్థమవుతాయి, నేర్చుకుంటారు లేప్పా.”

“అదేమి నేర్చుకుంటారో నాకు తెలియదు. పిల్లలను ఇంగ్లీష్ స్కూల్ లో వేశావు. స్వామి వారు, అమ్మలవారు టుస్పుస్ అని ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు. మన ఊరి గుడిలో ఇప్పుడు ఒక ఇంగ్లీష్ పూజ మొదలైంది. నాకొక అనుమానం. ముందు, జేసునాథుడు కూడా ఇంగ్లీష్ లోనే మాట్లాడేవాడా?”

“అప్పా, ఇప్పుడు ప్రపంచం చిన్నదవుతోంది. చాలా దేశాలలో, ముఖ్యంగా బ్రిటీష్ వారు పాలించిన దేశాలలో ఇంగ్లీష్ వాడుకలో ఉన్న అలాంటి దేశాలకు ఉద్యోగానికి వెళ్లేవారు, అక్కడక్కడ వ్యాపారం చేసేవారు అనివార్యంగా ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిందే. అందుకే, ఇప్పుడు ఇంగ్లీష్ ప్రపంచం మాట్లాడే భాష అయింది.”

“… … …”

“యేసుస్వామి, అదే జేసునాథుడు, ఇప్పటి ఇజ్రాయెల్ దేశంలో ఉండేవారు. యూదుల సమాజానికి చెందిన ఆయన, వారి కాలపు పరిసరాలలో వాడుకలో ఉన్న అర్మేనియా భాషలో బోధించేవారట. వారి అనుచరుల ద్వారా సరళ బోధన, ఆచరణతో క్రైస్తవ ధర్మం రూపుదిద్దుకుంది. అది ఎక్కువ ప్రచారం పొందినప్పుడు రోమన్ చక్రవర్తులు దానిని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. రోమన్ చక్రవర్తి కాన్స్టాంటినోపుల్, కళింగ యుద్ధం తర్వాత మన అశోకుడు బౌద్ధుడైనట్లు, క్రైస్తవ ధర్మానికి ఆకర్షితుడై క్రైస్తవ ధర్మాన్ని స్వీకరించాడు. యథా రాజా తథా ప్రజా అన్నట్లు, రాజ్యాశ్రయం లభించిందట, అప్పటి రోమన్ సామ్రాజ్యం పరిధిలో ఉన్న వివిధ భాషా దేశాలలో క్రైస్తవ ధర్మం సులభంగా వ్యాపించింది.”

“ముందు, భారతదేశం నుండి భూమార్గంలో దిగుమతి అవుతున్న సుగంధ ద్రవ్యాల వ్యాపారంలో ఏకస్వామ్యం పొందిన అరబ్బులను అణచివేయాలనే ఉద్దేశ్యంతో, యూరప్ సముద్ర తీర దేశాల నావికులు భారతదేశానికి నూతన మార్గం కనుగొనడానికి ప్రయత్నించారు. అప్పటి వారి రాజులు వారి మద్దతుగా నిలిచారు. ఈ పనికి పూనుకున్న యూరప్ లోని వివిధ దేశాలలో, గ్రేట్ బ్రిటన్ బ్రిటీష్ వారు పైచేయి సాధించారు. ప్రపంచంలోని అన్ని ఖండాలలో తమ వలసలను స్థాపించి తమ బ్రిటీష్ సామ్రాజ్యం సూర్యుడు అస్తమించని సామ్రాజ్యం అనుకున్నారు. గత శతాబ్దంలో అన్ని వలసల నుండి బ్రిటీష్ వారు వెనక్కి తగ్గారు. భారతదేశంతో సహా బ్రిటీష్ వారి అనేక వలసలు స్వతంత్ర దేశాలు అయ్యాయి.”

తాతకి అతని కొడుకు ఇన్నాసప్ప, నేటి ప్రపంచంలో ఇంగ్లీష్ భాష నేర్చుకోవాల్సిన అనివార్యతను వివరించి చెబుతున్నాడు.

అంతలో బెంజామిన్ లెక్కల ట్యూషన్ పూర్తి చేసుకొని ఇంటికి తిరిగి వచ్చాడు. కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని వచ్చి, తాతయ్య తండ్రుల ముందు కూర్చున్నాడు. మళ్లీ అతనికి నాన్నను సాయంత్రం అడిగిన ప్రశ్న గుర్తుకు వచ్చింది.

” అప్పా, అప్పా, జోసెఫ్, మేరీమాత, యేసుస్వామి తెల్లగా ఉన్నారా?”

“అయ్యో జేసునాథా, స్వామివారి రంగు గోధుమ రంగు. అంత కూడా తెలియదా నీకు?” తాతయ్య చిన్నప్ప మనవడిని ప్రశ్నించాడు.

” ఐతే, మా డ్రామా నేర్పించే మిస్, యేసుస్వామి, వారి తల్లిదండ్రులు మేరీమాత  జోసెఫ్‌లు తెల్లగా ఉండాలి అంటుంది. అందుకే ఆంగ్లో ఇండియన్ సమాజానికి చెందిన తెల్ల ముఖం కలిగిన ఫెడ్రిక్ బ్రూక్ అనే పిల్లోణ్ణి యేసుస్వామి తండ్రి జోసెఫ్ పాత్ర చేయడానికి ఎన్నుకున్నారు కదా మా స్కూల్లో.”

“అవునప్పా, నువ్వు చెప్పేది నిజమే. బ్రిటీష్ వారు మనల్ని పాలించారు కదా? కాబట్టి పాలించిన వారిని గౌరవించే తొందరలో మీ మిస్ అలాంటి వారినే వెతికి వారికి యేసుస్వామి తల్లిదండ్రుల పాత్ర ఇస్తారు. అందులో తప్పేముంది?”

“తాతయ్యా, ఇందులో తప్పు ఒప్పు ప్రశ్న లేదు. నేను అడుగుతున్నది, మన యేసుస్వామి తెల్ల రంగు వారై ఉండేవారా? అని.”

ఇన్నాసప్ప, తాతామనవళ్ల ప్రశ్న జవాబుల జుగల్ బందీ చూస్తూ కూర్చుండిపోయాడు.

తాతయ్య చిన్నప్ప ఊరి నుండి వస్తే, కొడుకు బెంజామిన్ కి సంతోషం. వచ్చినప్పుడల్లా కొత్త కొత్త కథలు చెప్పి అలరిస్తూ ఉండేవాడు. అడగూలజ్జి కథలు, ఈసప్ కథలు, పంచతంత్రం కరటక దమనక కథలు, కొన్నిసార్లు బైబిల్ ఆధారిత కథలు చెప్పేవాడు. పాఠశాలలో ధర్మోపదేశ తరగతిలో బైబిల్ కథలు వినడం విసుగు తెప్పిస్తుంటే, అదే తాత ఆ కథ చెప్పినప్పుడు రసగుల్లా తిన్నంత ఆనందంగా ఉండేది. ఇన్నాసప్ప ఊరికే  తాతామనవళ్ళ మాటలు వింటూ కూర్చున్నాడు. తండ్రి చిన్నప్పకి అది నచ్చలేదేమో. ఇన్నాసప్పను వారి మాటల్లో కలుపుకునే ఉద్దేశ్యంతో, “ఏమప్పా చదివిన పెద్ద మనిషి, స్కూల్లో నేర్పిస్తావు. యేసుస్వామి రంగు ఏముండేది? అనే ప్రశ్నకు నువ్వు సరిగ్గా సమాధానం చెప్పాలప్పా” తాత కొడుకు ఇన్నాసప్పను మాటల్లోకి లాగాడు.

మాస్టర్ ఇన్నాసప్పలోని మాస్టర్ గిరి మేల్కొంది. ఇన్నాసప్ప తన భూగోళశాస్త్ర పరిజ్ఞానాన్ని కూడగట్టుకొని, సంతకు సరిపడా మూడు మూరల వస్త్రం నేసేసాడు. ఇన్నాసప్ప మానవుల చర్మం రంగు గురించి మాట్లాడడం మొదలు పెట్టాడు.

“అప్పా, ఒక ప్రాంతపు వాతావరణం మరియు ఆ వాతావరణంలో నివసించే వారి చర్మం రంగు  మధ్య గాఢ సంబంధం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.” “ఉష్ణమండలం సూర్యునికి కొంచెం దగ్గరగా ఉంటుంది. ఎప్పుడూ ఎండలో ఉండే అక్కడి ఉష్ణ వాతావరణ ప్రాంత ప్రజలు నల్లగా ఉంటారు. వారి నల్లటి చర్మం సూర్యుని ఎక్స్ కిరణాలు, ఊదా కిరణాల మధ్య అతి నీలలోహిత కిరణాల నుండి రక్షణ అందిస్తుంది. ఎండ ప్రాంతం కాని సూర్యునికి అంత దగ్గరగా లేని సమశీతోష్ణ , శీతల మండలాలలో సూర్యుని అతినీలలోహిత కిరణాల నుండి రక్షణ అవసరం లేదు. కాబట్టి వారి చర్మ రంగు లేతగా ఉంటుంది. భూమధ్య రేఖ దగ్గర ఉన్నవారు నల్లగా ఉంటే, ఉత్తర లేదా దక్షిణ ధృవాల వైపు వెళ్ళేకొద్దీ ప్రజల చర్మ రంగు పల్చబడుతూ పోతుంది. శీతల మండలంలోని ప్రజలు తెల్లగా ఉంటారు. సమశీతోష్ణ మండలంలోని వారు గోధుమ లేదా ఆలివ్ రంగులో ఉంటారు. వారిది గోధుమ లేదా ముదురు గోధుమ రంగు చర్మం.”

“సరేనప్పా అయ్యిందా, నీ శాస్త్రీయ వివరణ. కానీ నేనూ నీకొడుకూ అడిగింది ఏమిటి? నువ్వు చెబుతున్నది ఏమిటి?”

వంటగది నుండి వారి మాటలు వింటున్న ఇన్నాసప్ప భార్య అన్నమ్మ, “అవునండీ, వారు యేసుస్వామి చర్మం రంగు ఏముండేది? అని అడిగితే రకరకాల రంగుల మనుషులు భూమిపై ఎక్కడెక్కడ వ్యాపించి ఉన్నారు, అనే సంగతి ఇప్పుడు ఎవరికి కావాలి?” అని అడిగింది.

“అది కాదే, బైబిల్లో ఎక్కడా యేసుస్వామి చర్మం రంగు గురించి ఏ వివరణా లేదు. కళ్ళ రంగు గురించి ఒక్క మాటా లేదు. ముఖం గుండ్రంగానో, చౌకాకారమో, పొడవాటి కోలముఖమో అనే దాని గురించి సమాచారమే లేదు. అక్షాంశాల నేపథ్యంలో వాతావరణ ప్రభావంలో మానవుల రంగు మారే అవకాశంపై యేసుస్వామి చర్మం రంగు గురించి నిర్ధారణకు రావచ్చు అనే ఆలోచన నాది అమ్మీ ” ఇన్నాసప్ప సమాధానమిచ్చాడు.

“ఓ అలాగా? మీ శాస్త్రీయ వివరణ కొనసాగించండి. నాకూ మన యేసుస్వామి రంగు ఏముండేదో తెలుసుకోవాలనుంది.” ఇన్నాసప్ప విజ్ఞానపు మాటలకు భార్య అన్నమ్మ తన ఆమోదముద్రను వేసింది.

“ధృవాల దగ్గరకు వెళ్ళేకొద్దీ అక్కడి మానవుల రంగు తెల్లగా ఉంటుంది. భూమధ్యరేఖ దగ్గర ఎక్కువ ఎండ, కాబట్టి అక్కడి ప్రజల చర్మ రంగు నల్లగా ఉంటుంది. అదే సమశీతోష్ణ మండలంలో ఉన్న మనుషుల చర్మ రంగు గోధుమ రంగులో ఉంటుంది. మనుషుల చర్మంలోని మెలనిన్ ఈ రంగుల వ్యత్యాసానికి కారణం. మెలనిన్ అనే వర్ణద్రవ్యం మానవుల చర్మంరంగును నిర్దేశించే ప్రాథమిక అంశం. భూమధ్యరేఖలోని ప్రజలు ఎక్కువ సమయం సూర్య కిరణాలకు తమ శరీరాన్ని గురిచేస్తారు. వారి చర్మం నల్లగా ఉంటుంది. సూర్య కిరణాల ఉష్ణోగ్రత తీవ్రత తక్కువగా ఉండే ప్రాంతాల్లో నల్ల చర్మపు రంగు పలచబడి గోధుమ రంగుకు మారుతుంది. ధృవాల దగ్గరకు వెళ్ళేకొద్దీ సూర్య కిరణాల వేడి అధికంగా తగ్గుతుంది. కాబట్టి అక్కడి ప్రజలు తెల్ల రంగులో ఉంటారు.”

ఇన్నాసప్ప శాస్త్రీయ వివరణ ముగుస్తుండగానే, “మీరు పట్టణంలోని వారు ఊరికే తల పాడు చేసుకుంటారు. మేము పల్లెటూరి అమాయకులం మీకంటే ఎంతో మేలు చూడు. మావారు, క్రైస్తవ జానపదులు, ఈ ప్రశ్నకు తమ అవగాహన స్థాయిలో, ఎంత సరళమైన సమాధానం కనుగొన్నారో తెలుసా మీకు? పోయినసారి వచ్చినప్పుడు ఆ కథ చెప్పింది మీకెవరికీ ఇప్పుడు గుర్తులేదు కదా?” అని తాతయ్య చిన్నప్ప చిరుకోపాన్ని ప్రదర్శించాడు.

  • • •

పోయినసారి వచ్చినప్పుడు, తాతయ్య చిన్నప్ప, మానవ సృష్టి కథ చెప్పాడు. కానీ అది, పవిత్ర గ్రంథం బైబిల్‌లోని మానవ సృష్టి కథ కంటే భిన్నంగా ఉంది.

ఆదిలో దేవుడు పరలోకాన్ని, భూలోకాన్ని సృష్టించాడు. మొత్తం ఆరు రోజుల పాటు దేవుడు సృష్టి కార్యంలో నిమగ్నమయ్యాడు. ఏడవ రోజు విశ్రాంతి తీసుకున్నాడు. ఆ ఏడవ రోజు పవిత్రంగా ఉండాలని ఆశీర్వదించాడు. ఆరవ రోజున మట్టితో భూమిపై జంతువులను, ఆకాశంలోని పక్షులను సృష్టించాడు. వాటిపై ఆధిపత్యం చేయడానికి తమ స్వరూపంలో మట్టితో మనుషులను తయారు చేద్దాం అనుకొన్నాడు. ‘వారు సముద్రంలో ఉండే చేపలపైన, అంతరిక్షంలో ఎగిరే పక్షిపక్షులపైన, పెద్ద చిన్న మృగాలపైన, నేలపై పాకే క్రిమికీటకాలపైన ఆధిపత్యం చేయాలని కోరుకున్నాడు.’ దేవుడైన సర్వేశ్వరుడు నేల మట్టితో మనిషిని రూపొందించి, అతనిపై జీవశ్వాసను ఊదాడు. అప్పుడు మనిషి జీవాత్మ అయ్యాడు. అతన్ని తమ ఏడెన్ ఉద్యానవనం కాపలాకు ఉంచాడు. అతనికి ఒక తోడు ఉండాలని, అతనికి గాఢ నిద్ర కలిగించి పడుకోబెట్టాడు. అతని ప్రక్క ఎముకలలో ఒకటి తీసి, దానిని మహిళగా చేశాడు.’ ఇది, పవిత్ర గ్రంథం బైబిల్‌లోని ఆదికాండం కథ.

కానీ, తాతయ్య చిన్నప్ప చెప్పిన కథలో, సర్వేశ్వరుడైన దేవుడు, పల్లెల్లో మట్టి కుండలు చేసే ఒక ఏకాకి కుమ్మరి అయిపోయాడు!

‘సర్వేశ్వరుడు కుమ్మరి, సకల చరాచరాలను సృష్టించాడు. చివరగా తన రూపంలోనే మట్టితో మనిషిని సిద్ధం చేశాడు. చేతులు, కాళ్ళు, ముఖం, కడుపు అన్నీ కలిసిన మట్టి బొమ్మను, ఎప్పటిలాగే కుండలను కాల్చినట్లు, కుమ్మరి కాల్చే గూడులో – ఆవిరిలో వేసి కాల్చడం మొదలుపెట్టాడు. తన చివరి సృష్టిని చూసే తొందరలో దేవుడు, కొంచెం తొందరగా గూడు నుండి ఆ మట్టి బొమ్మను బయటకు తీసేశాడు. అది పూర్తిగా కాలలేదు. ఇంకా పచ్చిపచ్చిగా తెల్లగానే ఉంది. దానికి జీవశ్వాస ఊది ఉత్తరానికి విసిరి కొట్టాడు. అది దూరంగా ఆర్కిటిక్ వృత్తం కింద పడింది. అది తెలుపు రంగు బొమ్మ అయింది.

దేవుడు కుమ్మరి ఇప్పుడు మరొక మనిషిని మట్టితో సిద్ధం చేశాడు. దానిని ఆవిరిలో వేసి కాల్చడం మొదలుపెట్టాడు. మొదటిసారి తొందరగా ఆవిరి నుండి తీసినందున పచ్చిపచ్చిగా తెల్లటి మనిషి అయ్యాడు. ఇప్పుడు ఎంతసేపు కాల్చడానికి వీలవుతుందో కాల్చి చూద్దాం అని కూర్చుండిపోయాడు దేవుడు. చాలా ఆలస్యమైందో ఏమో, అప్పుడు కనిపించే మనిషి కాలి కాలి నల్లగా మాడిపోయాడు, “భద్రావతి బంగారు” రంగు వాడు అయ్యాడు! విసుగు చెందిన దేవుడు కుమ్మరి, దానికి ఊపిరి ఇచ్చి, విసిరి దూరంగా విసిరాడు. ఆ నల్లటి మనిషి భూమధ్య రేఖ దగ్గర పడిపోయాడు.

దేవుడు కుమ్మరికి చాలా విసుగు కలిగింది. మొదటి రెండు బొమ్మలు అతను అనుకున్నట్లు లేకపోవడం అతనికి మింగుడు పడనిది అయింది. మూడవసారి ప్రయత్నిద్దాం. మూడవసారి పని చెడిపోకూడదు అని అనుకున్నాడు దేవుడు. కుమ్మరి దేవుడు మూడవ బొమ్మ – మరొక మనిషిని మట్టితో సిద్ధం చేశాడు. దానిని ఆవిరిలో పెట్టి కాల్చడం మొదలుపెట్టాడు. మొదటిసారి తొందరగా ఆవిరి నుండి తీసినందున పచ్చిపచ్చిగా తెల్లటి మనిషి అయ్యాడు, రెండవసారి తీయడం చాలా ఆలస్యం అయినందున అతను నల్లటి రంగు నల్లటి మనిషి అయ్యాడు.

మూడవసారి తయారు చేసిన మనిషిని ఆవిరిలో పెట్టి తగినంతగా కాల్చడం మొదలుపెట్టాడు. అంత తక్కువ మంట వేడి కాదు ఇటు చాలా ఎక్కువ మంట వేడి కాదు. అలాంటి మంట వేడిలో తగినంతగా కాల్చిన తర్వాత దానిని బయటకు తీశాడు. ఇప్పుడు అటు తెల్లగా లేని, ఇటు ముదురు నలుపు రంగు కాని గోధుమ రంగు మనిషి సిద్ధమయ్యాడు. దేవుడు సర్వేశ్వరునికి ఈ గోధుమ మనిషి నచ్చాడు. అతనికి జీవశ్వాస ఊదాడు. అతను జీవాత్మ అయిన తర్వాత నెమ్మదిగా విసిరాడు. అతను కర్కాటక వృత్తం కిందకు వెళ్ళి పడిపోయాడు.

దేవుడు సర్వేశ్వరుడు కుమ్మరి అయినప్పుడు జరిగిన ఈ చర్యల వల్లే, యూరోపియన్లు తెల్లగా ఉన్నారు, ఆఫ్రికా ఖండం మధ్యలో ఉన్నవారు నల్లగా ఉన్నారు మరియు కర్కాటక వృత్తం పరిసరప్రాంతంలోని వారు దక్షిణ ఆసియా ఖండం వారు, భారతీయులు గోధుమ రంగు కలిగి ఉన్నారు!’

  • • •

“యేసుస్వామి పుట్టింది ఎక్కడ?”  తాతయ్య చిన్నప్ప ప్రశ్నించాడు.

“అప్పా, బైబిల్ చెప్పే దాని ప్రకారం యేసుస్వామి బెత్లెహేంలో పుట్టారు” కొడుకు ఇన్నాసప్ప సమాధానమిచ్చాడు.

“తర్వాత ఏమైంది?”

“హేరోదు రాజు, ఇంకొక రాజు పుట్టాడు అనే జ్యోతిష్యుల మాటలు విని పసిపిల్లలను చంపించాడు. దేవదూతల ఆజ్ఞ ప్రకారం, కొంత కాలం అప్పటి హేరోదు రాజు కంటికి కనిపించకూడదని, జోసెఫ్ కుటుంబంతో సహా ఈజిప్ట్ దేశానికి వలస వెళ్లాడు. అక్కడి నుండి తిరిగి వచ్చిన తర్వాత తండ్రి జోసెఫ్, తల్లి మరియలతో యేసుస్వామి, జెరూసలేంలో స్థిరపడ్డారు.”

“అప్పుడు వారు స్థిరపడింది జెరూసలేంలో. అవునా కాదా?”

“అవును అవును” అన్నట్లు కొడుకు ఇన్నాసప్ప మరియు మనవడు బెంజామిన్ ఇద్దరూ తల ఊపారు.

“జెరూసలేం ఏ ఖండంలో ఉండవచ్చు? అది, ఆ ఖండంలో ఏ భాగంలో ఉంది?”

కొడుకు, మనవడు ఇద్దరూ తల గోక్కుకోవడం మొదలుపెట్టారు. కొంచెం సమయం తర్వాత కొడుకు ఇన్నాసప్ప సమాధానమిచ్చాడు. “జెరూసలేం ఆసియా ఖండంలో ఉంది, జెరూసలేం ఆసియా ఖండానికి నైరుతి దిక్కులో ఉంది.”

“ఆ ప్రాంతాన్ని ఏమని పిలుస్తారప్పా?”

“అది మధ్యప్రాచ్యం కదా?”

“అవును, నువ్వు చెప్పేది సరిగానే ఉంది” తాతయ్య చిన్నప్ప ఒప్పుకున్నాడు.

“అప్పా అప్పా, ఈ మధ్యప్రాచ్యాన్ని మిడిల్ ఈస్ట్ అని పిలుస్తారు. మిడిల్ ఈస్ట్ పదం యొక్క అక్షరాలా అనువాదం మధ్యప్రాచ్యం, మధ్యపూర్వం, మధ్యమ పూర్వం అయితే, నామవాచకంగా ఉపయోగించేటప్పుడు అది పూర్వమధ్యం అవుతుంది. పూర్వమధ్య దేశాలు అనేది, ఉత్తర ఆఫ్రికాలోని లెబనాన్ దేశం నుండి పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్ వరకు ఉన్న దేశాలు అనేది సాధారణ అవగాహన. అప్పుడు, అందులో నైరుతి ఆసియా, పశ్చిమ ఆసియా మరియు ఈశాన్య ఆఫ్రికా ప్రాంతాలను వ్యాపించిన ప్రాంతాన్ని మధ్యప్రాచ్యం అని పిలుస్తారప్పా. ఇంకా అది ఏకదైవ ఆరాధన యూదు, క్రైస్తవ, మహమ్మదీయ ధర్మాల పుట్టుక ప్రాంతం” కొడుకు ఇన్నాసప్ప తన జ్ఞానాన్ని తెరిచి చూపించాడు.

“ఇప్పుడు చెప్పండి, యేసుస్వామి ఏ ఖండానికి చెందినవారు?” తాతయ్య చిన్నప్ప అడిగాడు.

“యేసుస్వామి ఆసియా ఖండానికి చెందినవారు” వెంటనే మనవడు బెంజామిన్ సమాధానమిచ్చాడు.

“ఇక్కడ వినండి” అంటూ అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకున్నాడు తాతయ్య.

“భారతదేశంలో గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, త్రిపుర మరియు మిజోరాంల మీదుగా వెళ్ళే కర్కాటక వృత్తం, బ్రెజిల్, అల్జీరియా, లిబియా, ఈజిప్ట్, సౌదీ అరేబియాలను చీల్చుకుని వెళుతుంది. కర్కాటక వృత్తం ఆసుప్రాంతంలో ఉన్న జెరూసలేం, బెత్లెహేంలలో కూడా భారత ఉపఖండంలో ఉన్న వాతావరణ పరిస్థితులు ఉండాలి, కదా? అలాంటప్పుడు, యేసుస్వామి చర్మం రంగు కూడా దాదాపు భారతీయుల గోధుమ రంగును పోలి ఉండాలి. అంటే, యేసుస్వామి చర్మం రంగు గోధుమ రంగు” తాతయ్య చిన్నప్ప తన చివరి తీర్పు చెప్పేశాడు.

“కానీ తాతయ్యా, మన చర్చిలలోని యేసుస్వామి విగ్రహాల రంగు తెల్లగా ఉంటుంది కదా? దీనికి ఏమి చెప్పాలి?” మనవడు బెంజామిన్ ప్రశ్నించాడు.

“భారతదేశానికి క్రైస్తవ ధర్మం వచ్చింది యూరప్ మిషనరీల నుండి. యూరప్ మిషనరీలు తెల్లగా ఉన్నారు. వారు యేసుస్వామిని తమ చర్మ రంగులో చూసుకున్నారు. కాబట్టి యూరప్ మిషనరీలు భారతీయులకు పరిచయం చేసిన యేసుస్వామి చర్మ రంగు తెల్లగా ఉండటం సహజం. యూరప్ ప్రజల కంటే ముందే క్రైస్తవ ధర్మాన్ని స్వీకరించిన ఆఫ్రికా ఖండంతో సహా వివిధ దేశాలలో ఉన్న పురాతన సాంప్రదాయ చర్చిలలోని యేసుస్వామి విగ్రహాలు, చిత్రాలలో వారి చర్మ రంగు తెలుపు కాదు, బదులుగా గోధుమ రంగులలో ఉన్నాయి” కొడుకు ఇన్నాసప్ప సమాధానమిచ్చాడు.

“మన యేసుస్వామి చర్మ రంగు గోధుమ రంగు. మన యేసుస్వామి చర్మ రంగు గోధుమ రంగు. రేపు మిస్‌కు చెప్పి నేను జోసెఫ్ పాత్ర చేస్తాను” అని సంతోషంగా కేకలు వేస్తూ, మనవడు బెంజామిన్ ఇంటి ముందు వరండాలో గెంతుతూ తిరగడం మొదలుపెట్టాడు. తాతయ్య చిన్నప్ప, కొడుకు ఇన్నాసప్ప ముఖాలు వికసించాయి.

“నడవండి అందరూ, సమయమైంది. భోజనం చేద్దాం” అంటూ అన్నమ్మ అందరినీ భోజనానికి లేపింది. పున్నమి పూర్ణచంద్రుడు వరండా అంతా పాల వెలుగును చల్లాడు. అటు వంటగది నుండి బాస్మతి బియ్యం అన్నం సువాసన ముక్కుకు తాకింది. దానితో పాటు మటన్ పులుసు ఘుమఘుమలు కూడా కలిశాయి.

(ఒక కన్నడ క్రైస్తవ కుటుంబంలో జరిగిన ‘చర్చ’ల ఆధారంగా)

*

కోడీహళ్ళి మురళీమోహన్

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు