యేకలవ్యుడి వారసత్వం

ఆంధ్ర ప్రదేశ్ లోని ఆదిమ జాతులలో యెరుకల వారు ముఖ్యమైన వారు. వీరు ప్రధనంగా కోస్తా ఆంధ్ర ప్రాంతం లోని వుభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలలోనూ, అరుదుగా తెలంగాణా, రాయలసీమ ప్రాంతాలలోనూ విస్తరించారు. కర్ణాటక సరిహద్దు ప్రాంతాలలో వీరిని ‘కొరవలు’ అని పిలుస్తారు. ప్రాచీన సాహిత్యంలో యెరుక జాతి స్త్రీలను ‘కొరవంజి’ అని పిలవడం చూస్తాము. వీరికి ‘యెరుక అనే పేరు యీ స్త్రీల వృత్తియైన ‘యెరుక’ చెప్పడం లేదా ‘సోది’ చెప్పడం ఆధారంగా వొచ్చిందని పరిశోధకులు భావిస్తున్నరు. కానీ యెరుకలు మాత్రం తమను యితరులు ‘కొరవలు’ అని పిలవాలని ఆశిస్తారు. యెరుకలు తాము మహా భారతం లోని విశిష్టమైన వీరుడు, యేకలవ్యుని వారసులు గా భావిస్తారు.

వృత్తిపరంగా పరిశీలించినప్పుడు యెరుకల వారిలో అనేక వుప శాఖలు వున్నట్టు తెలుస్తుంది. వెదురు పుల్లల్తో బుట్టలల్లే వారిని ‘దబ్బ’ యెరుకలు అనీ, యీత పుల్లలతో బుట్టలల్లేవారిని ‘యీత పుల్లల’ యెరుకలు అనీ దువ్వెనలు తయారు చేసేవారిని ‘కుంచపురి’ యెరుకలని వుప్పు అమ్మేవారిని ‘ వుప్పెరుకలు’ అనీ సరుకుల రవాణా కొరకు యెద్దులను వుపయోహించే వారిని ‘యెద్దు’ యెరుకలు అనీ, తాళ్ళను తయారు చేసేవారిని ‘నార’ యెరుకలు అనీ పంటపొలాలకు కాపలా కాసేవారిని ‘కావలి’ యెరుకలు అనీ, బిక్షాటన చేస్తూ సోది చెప్పేవారిని ‘పరిక ముగ్గులు’ అనీ, గ్రామాలలో వుంటూ పందులను పెంచేవారిని ‘వూర’ యెరుకలని గతంలో నేరస్థ జాతిగా గుర్తించబడి దొంగతనం వృత్తిగా వున్న వారిని ‘కత్తెరోళ్ళు’ అని, భూత వైద్యం, పచ్చ పొడవడం వంటి పనులు చేసేవారిని ‘దయ్యాల’ వారని వివిధ వృత్తుల యెరుకలు ఆయా పేర్లతో పిలువబడుతున్నారు.

యెరుకల వారిని పాక్షిక సంచార జాతి(semi-nomadic tribe) గా పరిగణిస్తారు. వీరిలో కొంతమంది యింకా సంచార జీవితం గడుపుతుండగా మరి కొంత మంది గ్రామాలలోనూ, పట్టణాలలోనూ స్తిర నివాసమేర్పర్చుకుంటున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాలలో అతికొద్ది మంది యెరుకలు విద్యావంతులై యిపుడిపుడే విద్యావంతులై వుద్యోగాలలో ప్రవేశిస్తున్నారు. వీరిని ఆంధ్ర రాష్ట్రంలో షెడ్యూలు తెగల జాబితాలో చేర్చగా, కర్ణాటక లో వీరు షెడ్యూలు తెగల జాబితాలో చేర్చ బడ్డారు. యెరుకల వారికి తమదైన ప్రత్యేక భాష వుంది. అయితే ఆ భాషకు లిపి లేకపోవడం వలన తెలుగు లిపిని వుపయోగిస్తారు. ప్రధాన ద్రావిడ భాష ఐన తమిళానికి యెరుకల భాష దగ్గరగా వుంటుంది. తెలుగు, తమిళ భాషా పదజాలం వీరి భాషలో కల్సిపోయి వుంటుంది. వీరు యితరులతో తెలుగులో స్పష్టంగా మాట్లాడతారు. యెరుకల వారు ప్రధానంగా మాంసాహారులు. వేటాడిన రకరకాల జంతువులను, చేపలను వీరు భుజిస్తారు.కోస్తాంధ్ర ప్రాంతంలో వరి అన్నం వీరి ముఖ్య ఆహారం కాగా రాయలసీమ, తెలంగాణా జిల్లాలలో నివసించీవారు యెక్కువగా జొన్నలు, వినియోగిస్తారు. మద్యపానం వీరి దైనందిన జీవితంలో సర్వసాధారణంగా వుంటుంది.

యెరుకల వారు కుల వ్యవస్థలో తమను తాము సూద్రులుగా పరిగణిస్తారు. వీరు చాకలి, మంగలి కులాల వారి సేవలందుకుంటారు. మాల, మాదిగ కులాల నుండి తప్ప యితర కులాలందరి నుండి వీరు ఆహార పానీయాలను తీసుకుంటారు. వృత్తిపరంగా యెరుకల వారిలో వివిధ శాఖలున్నప్పటికీ కొద్ది తేడాలతో దాదాపు ఆయా శాఖలవారి ఆచార సంప్రదాయాలు వొకే విధంగా వుంటాయి. యెరుకల వారు తమ తెగలో అంతర్వివాహ పద్ధతిని పాటించినప్పటికీ తమ సమీపంలోని కింది కులాలవారితో ప్రేమ వివాహాలను అంగీకరిస్తారు. ముఖ్యంగా యితర కులాల స్త్రీలను వీరు సులభంగా తమలో కలుపుకుంటారు. వారు మేనరిక వివహాలకు ప్రాధాన్యతనిస్తారు. కొన్నిచోట్ల మేనరికం తప్పనిసరిగా పాటింపబడుతుంది. మేనరికాన్ని తప్పనిసరిగా పాటించే కుటుంబాలలో యెవరైనా యీ నియమాన్ని వుల్లంఘించినట్లైతే వరుని మేనమామ అతని వివాహానికి అయ్యే ఖర్చులో ‘వోలి’ ఖర్చును భరించాల్సి వుంటుంది. యెరుకలి వారి ఆచారాలలో మాతృస్వామిక సంస్కృతికి చిహ్నమైన ‘వోలి’ కి ప్రాధాన్యత వుంటుంది. వరుడు వివాహ సమయంలో వధువుకు యిచ్చే డబ్బే ‘వోలి’. యిది పూర్వం హైందవ సంప్రదాయంలో వుండే ‘కన్యాశుల్కం’ ను పోలి వుంటుంది. యెరుకల జాతి క్రమంగా యితరుల ఆచారాలను అనుకరిస్తూ వరకట్నం అనే దురాచారాన్ని పాటిస్తుంది. కానీ యిది విద్యావంతులకే పరిమితమైంది. అయినప్పటికీ వీరు ‘వోలి’ ఆచారాన్ని విడిచిపెట్టకుండా వరకట్నంతో పాటు ‘వోలి’ ఆచారాన్ని కూడా నామమాత్రంగా పాటిస్తున్నారు.

యెరుకల వారిలో వ్యక్తిగత కుటుంబాలు యెక్కువగా వుంటాయి. వీరిలో యేక దంపతీ విధానం అమలులో వున్నప్పటికీ బహు భార్యత్వం కూడా ఆమోదించబడుతుంది. భర్త చనిపోయినా, విడాకులు తీసుకున్నా స్త్రీ మారు మనువు చేసుకునే వీలుంది. వీరిలో పూర్వం బాల్య వివాహాలు వున్నప్పటికీ యిటీవల రజస్వలానంతర వివాహాలకు ప్రాధాన్యత పెరిగింది. పరస్పర సంప్రదింపులు, యిచ్చి పుచ్చుకోవడం ప్రాతిపదికగా వివాహాలు నిర్ణయింపబడతాయి. పూర్వం స్త్రీలు వివాహానికి చిహ్నంగా పూసల పేర్లను ఆభరణం గా ధరిస్తే యిటీవల వీరు కూడా యితర హిందూ స్త్రీల వలెనే మంగళ సూత్రాలను ధరిస్తున్నారు. సాధారణంగా భర్త చనిపోయిన స్త్రీ సంతానానికి మేనమామ సంరక్షకుడిగా వుంటాడు.

యెరుకల వారి పంచాయతీ విధానం కఠినంగా వుంటుంది. తమ కులంలోని అంతరంగిక వివాదాలను, సమస్యలను పంచాయతీ లోని కుల పెద్దలు సంప్రదింపుల ద్వారా పరిష్కరిస్తారు. పంచాయతీ జరిగే సమయంలో మద్యం సేవించడం తప్పనిసరి. కులపెద్దలకు యిరుపక్షాలవారు మద్యం యివ్వవల్సి వుంటుంది. ముఖ్యంగా విడాకులకు సంబంధించిన వివాదాలను పరిష్కరించడం లో వీరి పంచాయతీకి ప్రత్యేకత వుంది. సాధారణంగా వ్యభిచారారం, సంతానం లేకపోవడం, భార్యా భర్తల మధ్య సఖ్యత లేకపోవడం వంటి సమస్యలు విడాకులకు దారి తీస్తాయి. ముందుగా స్త్రీ విడాకులు కోరినట్లైతే వివాహం సమయంలో ఆమెకు వరుడు యిచ్చిన ‘వోలి’ డబ్బును తిరిగి అతనికి చెల్లించాల్సి వుంటుంది. అలా కాకుండా వరుడు విడాకులు కోరితే అతనికి రావల్సిన ‘వోలి’ ని వొదులుకోవల్సి వుంటుంది. వివాహం రద్దయిన తర్వాత స్త్రీ పురుషులిద్దరూ తిరిగి వివాహం చేసుకోవచ్చు. యెరుకల వారిలో పురుషుడు వోలి కోసం తన భార్యను యితరులకు అమ్ముకునే అలవాటు వుందని, భార్య పట్ల ఆశక్తి నశించిన పురుషుడు ఆమెను మరో పురుషునికి అమ్మి, వచ్చిన డబ్బుతో ‘వోలి’ యిచ్చి మరో స్త్రీని వివాహం చేసుకుంటాడనే అభిప్రాయం సమాజంలో వ్యాప్తి చెందింది. యీ విధంగా అమ్ముడుపోయే స్త్రీకి తన సంతానంపైన హక్కు వుండదు. ఆమె తన పిల్లలను భర్త దగ్గర విడిచి పెట్టాలి. అతడు పిల్లలను తీసుకెళ్ళడానికి అనుమతి యిస్తే తప్ప ఆనవాయితీ ప్రకారం పిల్లలపై స్త్రీకి హక్కు వుండదు. స్త్రీలు అమ్ముడుపోయి మరొకరిని వివాహం చేసుకున్నప్పుడు ఆ భర్తకు అప్పటికే సంతానం వున్నట్లైతే వారి పెంపకం బాధ్యతను ఆమె స్వీకరించాల్సి వుంటుంది. యీ అంశాలన్నీ వారిలోని పురుషాధిపత్యానికి చిహ్నాలుగా భావించవచ్చు.

యెరుకల వారి సామాజిక జీవనంలో స్త్రీ ప్రధాన పాత్ర వహిస్తుంది. వీరిలో పితృస్వామిక కుటుంబ విధానం అమలులో వున్నప్పటికీ పనిపాటలలో స్త్రీ పురుషునితో పాటు సమానంగా పాల్గొని జీవనోపాధిని సమకూరుస్తుంది. ఆహార సేకరణ, వేట, చేపలు పట్టడం వంటి పనులు సంచార జీవనం లో వున్నప్పుడు చెయ్యడమే కాక స్థిర జీవనం పొందిన వారిలో కూడా స్త్రీ ప్రవేశించని పనిలేదు. ముఖ్యంగా ‘యెరుక’ లేదా ‘సోది’ చెప్పడం యీ స్త్రీల ప్రత్యేకత. ప్రాచీన సాహిత్యంలో పేర్కొనబడిన ‘యెరుకల సానులు’, ‘కొరవంజి’లు వీరే! వీరు పెద్ద పెద్ద ప్రముఖులకు కూడా ముందు జరగబోయే విషయాలను యెరుక పరచినట్లు తెలుస్తుంది. యెరుక చెప్పే స్త్రీలకు రాజాస్థానాలోకి, అంత:పురాలలోకి ప్రవేశం సులభంగా లభించేది. యెండిన సొర, గుమ్మడికాయ బుర్రలకు కట్టిన తీగలు మీటగానే రాగాలు పలుకుతాయి. వీరు యీ వాద్య పరికరాన్ని చేతబట్టి పాటలు పాడుతూ వూరూర తిరిగి ప్రజలకు యెరుక చెప్పి వారిచ్చిన డబ్బు, ధాన్యం, యితర వస్తువులను తీసుకుంటారు. వీరు మంత్రసానులుగా యితర స్త్రీలకు ప్రసూతి సమయంలో కానుపు చెయ్యడమే కాక వన మూలికలతో తయారు చేసిన మందులు, పసర్లు యివ్వడం వంటి సేవ లు యెన్నో చెయ్యడం విశేషం.

గ్రామీణులకు పచ్చ పొడవడం, రోగాలు వచ్చిన వారికి తాయెత్తులు కట్టడం, భూతవైద్యం చెయ్యడం వలన యెరుకల స్త్రీలకు క్షుద్ర శక్తులు కూడా వుంటాయని గ్రామీణుల నమ్మకం. వీరిని మంత్ర గత్తెలుగా భావించే గ్రామీణులు వీరిని త్వరగా నమ్మరు. యెరుక చెప్పడం, మంత్ర తంత్రాల వంటి విద్యలతో పాటు యీ స్త్రీలు చిన్న చిన్న జంతువులను వేటాడడం, పండ్లను సేకరించడం, చేపలు పట్టడం, పందులను మేపడం, వెదురు, యీత పుల్లలతో బుట్టలు, చాపలు అల్లడం వంటి పనులు చేస్తారు. యెరుకల వారు యిటీవల చేపట్టిన వ్యవసాయ పనుల్లో కూడా స్త్రీలు పురుషులతో పాటు సమానంగా పని చేస్తారు. నేరస్థ జాతిగా చెప్పబడే ‘కత్తెర’ తెగ లో కూడా స్త్రీలు పురుషులతో పాటు దొంగతనాలు చెయ్యడమే కాక యిండ్లకు కన్నాలు వెయ్యడంలో పురుషులకు సహాయపడతారు. వీరు పురుషులతో పాటు మద్యపానం, పొగాకు సేవిస్తారు.

మొదట్లో నేరస్థ జాతుల చట్టంలో చేరిన జాతి యెరుకలే!. తర్వాత వారిని ఆ జాబితా నుంచి తొలగించినా కూడా ప్రజల మనసుల్లో వారు ‘దొంగలు’, ‘నేరస్థులు’ అనే అభిప్రాయం స్థిరపడిపోయిందని చెప్పొచ్చు. యెక్కడ దొంగతనం జరిగినా పోలీసులు ముందుగా యెరుకలి వారినే అనుమానించి అరెస్ట్ చెయ్యడం అనేది వారి పట్ల సమాజానికి , ప్రభుత్వాలకు వున్న చిన్న చూపుకు నిదర్శనం గా భావించవచ్చు. యితరులకు భవిష్యత్ గురించి ‘యెరుక’ చెప్పగలిగిన యెరుకల జాతి తమ పై అమలయ్యే వివక్షను ప్రశ్నించగలిగే స్థితిలో లేకపోవడం విచిత్రం. యెరుకల స్త్రీ, పురుషులలో అక్షరాస్యత శాతం చాలా తక్కువ. యెరుకల వారు యిప్పుడిప్పుడే నాగరికత వైపు పయనిస్తున్నారు. ఆదిమ జాతులకు సంబంధించిన మూఢాచారాలు యీ స్త్రీలను వొకవైపు అణచివేస్తుంటే యితరుల నుండి వీరు అలవరుచుకున్న వరకట్నం వంటి ఆచారాలు కూడా తిరిగి వీరిని బలిపశువులను చేస్తున్నాయి.

*

చల్లపల్లి స్వరూప రాణి

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • Veellu chaduvukunna …town cities Loki vacchi unna veella buddhulu maraledu…inka pittallu ,pakshulu vetadam(town cities lo)…editivariki maryada ivvakunda durbhashaladatam …boothulu tittadan…Ivi kuda mi essaylo add cheyandi…

  • చాలా బాగా రాసారు మేడం ఈ కులం యొక్క మూలాలు దేశవ్యాప్తంగా అనేక రకాల పేర్లతో పిలువబడుతూ నేటికి నాలుగే గోత్రాలు గా చేలా మణిలో ఉన్నాయి.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు