యాభై ఏళ్ళుగా ఒక వేకువ పాడుతూనే వుంది. కువ కువ మంటూ అనేక తొలి పొద్దులు ప్రేమగా పాటకు కోరస్ పాడుతూనే వున్నాయి. యాభై ఏళ్ళుగా ఒక జ్వాల ఉజ్వలంగా దహనమవుతూనే వుంది. అది మనస్సులను రగిలించింది, బతుకులను ఉద్యమాలవైపు మళ్ళించింది. యాభై ఏళ్ళుగా ప్రతిఘటన, మరియు విముక్తి పోరాటాలను అల్లుకొని అరుణోదయ కళ పరిమళిస్తూనేవుంది. ఎంతోమంది వీరుల అమరత్వాన్ని ఊపిరిగా, ఎంతోమంది కార్యకర్తల త్యాగాన్నిస్పూర్తిగా, పోరాట అడుగుల్లో విముక్తి దారుల్ని గానం చేస్తూ, విముక్తి దారుల్లో పోరాట అడుగుల్ని వేసుకుంటూ అరుణోదయ యాభై ఏళ్లు ఘల్లు ఘల్లు మంటూ ప్రయాణించింది. అరుణోదయ సాంస్కృతిక సంస్థ యాభై ఏళ్ళుగా పీడితుల సమాజాన్ని పలకరించి, పాటల్ని పంచిపెట్టి, విముక్తి జ్వాలల్ని చూపించింది. అరుణోదయ కేవలం ఒక సంస్థగానే కాకుండా అనేక మంది కళాకారులకి అస్తిత్వ వేదికగా రూపొందింది. విద్యార్ధులకు, మేధావులకు, నాయకులకు, కార్మికులకు, కార్యకర్తలకు, రైతు కూలీలకు, మహిళలకు – ఇలా అనేక మందికి సాంస్కృతిక వేడుకగా మారింది. ఈ అనేక మందిలో నేను కూడా ఒకడిని. ఈ వేడుక సంబరాలకు నేను కూడా క్రియాశీల అభిమానిని.
అనేక మంది పుట్టు కళాకారుల కవాతు అరుణోదయ. మువ్వల మనుషులు, గవ్వల గొంతులు, సముద్రాల లోతులు, బొగ్గుల కాంతులు – మట్టి చెప్పులతో, వట్టి చేతులతో, పాటే ప్రేమగా , పాటే సోకుగా, పాటే సొగసుగా, పాటే పోరుగా మాదిగ, మాల గూడాల నుండి, వెనుక బడిన వీధులనుండి ఎక్కువ మంది కళాకారులుగా వొచ్చిన వాళ్ళే. అరుణోదయ బుర్రకథ, హరికథ, ఒగ్గు కథ, యక్షగానం, వీధి నాటకం లాంటి కళారూపాలని అనుసరించినా, పాటనే ప్రధాన రూపంగా కొనసాగించింది.
అరుణోదయ చరిత్ర తనకు తానుగా ఒక పాట పాడుకుంటే దాని ప్రారంభ సాకిలో కానూరి, చలపతిరావు, రాజేంద్ర ప్రసాద్, వినయ్ బాబు, సుంకులు, కనిపించి వినిపిస్తారు.
అరుణోదయ అనగానే అరుణోదయ రామారావు గుర్తుకొస్తాడు. సమకాలీన సాంస్కృతిక ఉద్యమ సారధుల్లో అరుణోదయను ఒక బలమైన గొంతుకగా నిలబెట్టినవాడు రామారావు. అరుణోదయ పాటలకి ఆయనే రాగం, ఆయనే తానం, ఆయనే పల్లవి. జలపాతాలకి పాటలోస్తే అవి రామారావులా పాడతాయి. రామారావు ఒక్కసారి పాడితే ఆ పాట రూపం మనసుల్లో శాస్వితంగా రికార్డ్ అవుతుంది. ఎవరిమైనా ఆ పాటను ఆయనలా పాడేందుకు ప్రయత్నించాల్సిందే తప్ప మరోలా మనసు అంగీకరించదు. ఎందుకంటే అప్పటికే అతని గొంతు మన హృదయాలను మృదువుగా తాకి మురిపించి, మైమరిపించి వుంటుంది,
పాట చిటికెన వేలు పట్టుకొని ఒక పాప తిరుగుతూ పెరిగింది. చిన్నచిన్నగా అడుగులేస్తూ, మెల్ల మెల్లగా పల్లవిస్తూ, చిన్నవిమలగా అరుణోదయలో వికసించింది. “విప్లవమా! నీకు లాల్ సలాం!” అని పాడుతూ, అరుణోదయమా! నీకే నా గానం, ఈ గానం నీకే అంకితం! అంటూ కానూరి, రామారావు వారసురాలిగా, యాభై ఏళ్ళ అరుణోదయ చరిత్రలో ఎదిగి, ఎగసి, విమలక్కై అరుణోదయ జెండాగా రెపరెప లాడుతుంది.
వేదిక వెలుపల నెమ్మదిగా, నిశ్సబ్దంగా ఒక నీడ కనిపిస్తుంది. ఆ నీడ అంబిక. “ఉట్ జాగ్ మేరీ బెహనా” – వేదిక ఎక్కి పాడటం మొదలు పెడితే పాట పండిన మంటలా వెలుగుతుంది. ఆమె గళంలో, చూపులో, నటనలో ఓ ధిక్కారం ఆవిర్భవిస్తుంది. నిశబ్ద నీడ కదిలించే శక్తిగా మారుతుంది.
“ఆహా గోదావరి లోయలో అగ్గిమండుతుందో భళిర భళి – ప్రతిఘటనా పోరుబాటలో ప్రజలు రవ్వలైరో నాయనా” – గోసి పెట్టి, గొంగడేసి, అరుణోదయ కృష్ణ ఎగిరి దుంకితే నల్లగొండ నింగి నుంచి దిగినట్టుంటుంది. నిప్పులు చిమ్మే అగ్గి చూపుల జ్వాలలు పాటలై కృష్ణ గొంతు నుండి లావాలా ప్రవహించేవి.
కవిత్వాన్ని తాత్వీకరించి రాసుకున్నా, తత్వాన్ని కవీత్వకరించి పాడుకున్నా కవి ఒక సూక్తి అవుతాడు. “గాలిని కాల్చితే గాయము కాదు – అన్నల చంపితే ఆగదు పోరు” – స్వీయ రచనతో, ఆర్ద్రంగా గానం చేసి కవిరూపం పఠాన్ చెరువు రాములయ్యి కళ కళ లాడింది.
“ముద్దుల రాజాలో కొడుకా ఉత్తరామేస్తున్నో బిడ్డా – సల్లంగుండు రాజాలు నువ్వు – సక్కంగుండు రాజాలు నువ్వు – ఎక్కాడున్న రాజాలు నువ్వు సుఖంగుండు రాజాలు” – పైలం సంతోష్ ఎక్కడున్నాడు? నవ్వుకుంటూ పోయిండా? నడుచుకుంటూ పోయిండా? సక్కంగుండే సంతోష్ దుఃఖంగా పోయిండా? అరుణోదయ ముద్దుల రాజాలు పైలం సంతోష్.
అరుణోదయ పాటలు కోరుకున్న ఆత్మీయ గొంతుక నాగన్న. ఆ గొంతు అరుణోదయ సాంప్రదాయాన్ని సమకాలీనతతో కలిపి పలకరిస్తుంది. ఆ పలకరింపు పాటల ప్రవాహంలా వుంటుంది. అందంగా వుంటుంది. అమరత్వంలా రమణీయంగా వుంటుంది.
అరుణోదయ పాటల గూడు గూడ అంజన్న. “అసలేటి వానల్లో ముసలెడ్లు కట్టుకొని – మోకాటి బురదలో మడికట్టు దున్నితే” – అదును చూసి, పదును చేసి అక్షరాల్ని నాటి పాటల పంటను అరుణోదయ గూటికి చేర్చినవాడు గూడ అంజన్న.
శక్తి అంటే గొంగళి ఎగరేసిన ఎర్రజెండా పదనిసలు, పీడిత ప్రజల బతుకుల సరిగమలు. “ఈ శిల్పులెవ్వరో ఈ కూలిలెవ్వరో” పాటల శిల్పిగా ఎన్నో పాటల్ని అద్భుతంగా చెక్కి అరుణోదయకు అందించి, నలుపు-ఎరుపు రంగుల్లో విప్లవ శక్తిని ప్రదర్శించిన వాడు అరుణోదయ శక్తి.
అరుణోదయలోకి అడుగుపెడుతూనే, అరుణోదయ పాటల బాటల్లో కొత్త బాణీలని, గ్రామీణ, ప్రక్రుతి, మానవ జీవిత సౌందర్యాలని చల్లినవాడు గోరటి వెంకన్న. గొంతులో ఒక జీర ఎప్పుడూ అమర వీరుడి ఊపిరిలా పెనుగులాడేది. ఆ పెనుగులాట వెంకన్న పాట “మల్లోస్తనని చెప్పి పాయె – ఏ గుడిసె గడపల నిదుర బట్టిండో – ఉట్టీకి కట్టీన రొట్టె – ఊసి నేల మీద పడితే మా కన్నదిరినాదో”
“రాజ్య హింసా పెరుగుతున్నదో – పేదోళ్ళ నెత్తురు ఏరులయ్యి పారుతున్నాదో తెలంగాణా గడ్డన” – గోరటి పాట ఆలేరు విజయ పాడుతుంటే సూర్యుడు సాయంకాలాన్ని మళ్ళించి మిట్ట మధ్యాహ్నంగా నిలబెట్టేవాడు. సూర్యుడి కొరడాల కొసలు కోరస్ లా మోగుతుంటే విజయ గొంతు చెళ్ళు చెళ్ళున మార్మ్రోగేది.
గర్జనతో కూడిన హస్కీ గొంతుక చైతన్య. కచ్చితమైన భావోద్వేగాలతో నిండి ఉండేది. ఆ స్వరంలో ఒక ఆత్మీయత, ఒక మౌనపు తాకిడి ఉండేది, ప్రతి పాటను వ్యక్తిగత అనుభూతి అనిపించేలా పాడేది.
అది సాయిచంద్ గొంతు. అనేక స్వర స్థాయుల్లో విస్తరించి అధిక శృతిలో సైతం శక్తిని కోల్పోకుండా, భావోద్వేగంతో ఆలపించే సామర్థ్యం సాయిచంద్ సొంతం. “రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా – రక్తబంధం విలువ నీకు తెలియదురా” లాంటి పాటలు పాడి ఈ తరం అత్యుత్తమ గాయకులలో ఒకడిగా నిలిచిన సాయిచంద్ ప్రాధమికంగా అరుణోదయ కళాకారుడే.
పాటకు సద్దులు మోసి పిల్లగాడు గాయకుడయ్యాడు. అనేక పాటల్ని వండి వడ్డించిన మన యష్పాలే ఆ పిల్లగాడు. “కొండా కొండల నడుమ కొండల్ల నడుమ – మానుకోట కొండల్లో మండిన సూరీడు”. అరుణోదయ తీర్చిదిద్దిన విశిష్ట కళాకారుడు యష్పాల్.
మిత్ర అంటే అరుణోదయ పాటల సంపుటి. “ఎంత సాహసమైనదీ తెలంగాణా – ఎర్ర జెండా ఎరుపు ఈ నేల మీద” – అనేక ఉద్యమ భావోద్వేగాల్ని, సందర్భాల్ని, సముద్రాల్ని, అమరత్వాన్ని అరుణోదయ గొంతుల్లో దశాబ్దాలుగా పలికిస్తున్న అరుణోదయ ఆప్త మిత్రుడు మిత్ర.
ఒక సాంస్కృతిక సంస్థ ఇంత మంది వైవిధ్యమైన కళాకారుల్ని, విశిష్టతను కలిగినవుండటం అరుదైన విషయం కదా!. వీళ్ళు గుర్తుకొచ్చి మనసు వీళ్ళ రోజుల్లోకి వెళ్లి కూర్చుంటే కన్నీళ్లు పాడకుండా ఉంటాయా? కండల గుండెల రక్తం కూర్చున్న మనసును స్థిమితంగా వుండనిస్తుందా?
కళను సామాజిక చైతన్యానికి ఆయుధంగా మలచే శక్తి వీళ్ళది. తమ గళాల్ని, దేహాల్ని, హావబావాల్ని కళాత్మకంగా విప్లవ దేహభాషగా మార్చారు. వీళ్ళంతా గ్రాంశీ చెప్పిన “organic intellectuals”. కుడి ఎడంగా వీళ్ళంతా ఒకేలా అనిపిస్తారు. ఒకే విధంగా కనిపించే వ్యక్తుల్లో ఒక అరుదైన అందం ఉంటుంది. ఆ అందం ముఖచాయల్లో, రూపంలో, హావభావాల్లో సహజంగా ప్రతిబింబిస్తుంది. సంగీతంలో ఒకే రాగం పునరావృతం కావడం ఒక అద్భుత సౌందర్య ప్రక్రియ. అరుణోదయలో కొద్ది మంది కళాకారులు ఒకేలా వినిపించటం కూడా ఇలాంటి ప్రక్రియగా అనిపిస్తుంది. ఇందులో ఏదో ఓ లోతైన కవిత్వమయమైన అందం ఉంటుంది. రామారావు, నాగన్న, జానయ్య, సాయిచంద్ – విమల, విజయ, చైతన్య – శక్తి, సంతోష్, కృష్ణ, రాములు ఇంకా అనేక మంది అరుణోదయ కళాకారుల పాటల్ని ప్రక్క ప్రక్కన విన్నప్పుడు ఆ గొంతుల అందం ఏదో ఒక రూపంలో అరుణోదయలో మళ్లీ మళ్ళీ పుడుతూనే ఉంటుందనిపిస్తుంది. వీళ్ళు గుంపుగా ఒక చోట చేరుకొని మాట్లాడుకుంటే, ఆ మాటల్లో అరుణోదయ అప్రకటిత ప్రణాళిక వినిపిస్తుంది.
అది 1970ల దశకం. ప్రపంచవ్యాప్తంగా సామాజిక, రాజకీయ, సాంస్కృతిక ఉద్యమాలకు ఒక మైలురాయిగా నిలిచిపోయిన దశకం. విప్లవాలను, అనేక తిరుగుబాట్లను, అణగారిన గొంతులను, కళా రూపాలతో మేల్కొల్పిన కాలం. ఇదే కాలంలో చిలీ, ఉరుగ్వే, అర్జెంటీనా వంటి దేశాలలో ప్రాచుర్యం పొందిన ప్రజాగీతాల ఉద్యమం (New Song Movement) కొనసాగింది. అమెరికాలో Black Arts Movement, Black Panther Party, మన దేశంలో Dalit Panther Movement వంటి ఉద్యమాలు నడిచిన కాలం. మహిళల హక్కులపై విస్తృతమైన చర్చకు దారితీసిన ఫెమినిస్ట్ ఉద్యమాలు, వియత్నాం యుద్ధం, పాలస్తీనియన్ ఉద్యమాలు, దక్షిణాఫ్రికాలో అఫ్రికన్ నేషనలిజం లాంటి ఉద్యమాల ఆకాంక్షలను ప్రజల సమస్యలను ప్రపంచ దృష్టికి తీసుకురావడంలో కళ, సాహిత్యం, నాటకాలు, సినిమాలు కీలక పాత్ర వహించాయి. ఈ కాలంలో కళ రాజకీయాన్నిపెనవేసుకుంది. సంగీతం, కవిత్వం, చిత్రకళ, నాటకం మొదలైన రూపాలు సాంస్కృతిక ప్రతిఘటనా ఆయుధాలుగా మారాయి.
ఈ కాలంలోనే భారతదేశంలో నక్సలైట్ ఉద్యమం ఉజ్వల దశలోకి ప్రవేశించింది. దీనికి అనుసంధానంగా కొన్ని సాంస్కృతిక వేదికలు ఏర్పడ్డాయి. ఈ నేపధ్యంలో అరుణోదయ ఊపిరి పోసుకుంది. సామాజిక అసమానతలపై, అన్యాయాలపై వెల్లువెత్తిన ప్రజాగ్రహానికి సాంస్కృతిక స్పందనగా అరుణోదయ తన అడుగులను ప్రారంభించింది. అరుణోదయ కళను ప్రేమించింది. కళను ఆయుధంగా మలిచే కళాకారుల కర్మాగారంగా విస్తరించింది. విద్యార్ధుల నుంచి ఉద్యోగస్తుల దాకా, గ్రామాలలో రైతుకూలీల నుంచి పట్టణంలో కార్మిక శిబిరాల దాకా, వీధి నాటకాల నుంచి తెర మీద పాటల దాకా, ప్రతి పదం విముక్తి కోసం కదం తొక్కిన గానంగా ఘనంగా సాగింది . “కళ కోసమే కళ కాదంటూ – కళ బ్రతుకును మార్చాలంటూ” అరుణోదయ కళాకారులు కళ నిజాయితీని, ఉద్యమం పట్ల నిబద్ధతను, ప్రజల జీవితం పట్ల జవాబు దారీతనాన్ని పెంపొందించుకున్నారు. విప్లవ రాజకీయ ఉద్యమాలకు సాంస్కృతికంగా అండగా వుండే అరుణోదయ తరచూ అణచివేతలు ఎదుర్కొంటూనే ఎన్నో విజయాలను సాధించింది. కళాపరంగా వర్గ, కుల, జెండర్, భూమి సమస్యలపై గ్రామాల నుంచి నగరాల దాకా చైతన్యాన్ని రగిలించింది.
విప్లవ సాంస్కృతిక, సాహిత్యపు క్షేత్రంలో అరుణోదయ అర్థశతాబ్దాన్ని పూర్తి చేసుకున్న ఈ క్షణం, గర్వించదగ్గది. ఇది ఎన్నో ప్రశ్నల్ని సహనంగా పరిశీలించాల్సిన సమయం. మౌనంగా మారిపోయిన ప్రశ్నలను మళ్లీ శబ్దాలుగా పలికించాల్సిన సందర్భం. కళాకారులు ఒక తరం పాటు ప్రజల భావాలను, భావోద్వేగాలను, ఆశలను, ఊహలను, సంబరాలను, పోరాటాలను, నిస్సహాయతల్ని, సృజనాత్మకంగా, కళారూపాలుగా మలిచిన అరుణోదయ, ఇప్పుడు మరో కొత్త యుగానికి అంచున నిలిచివుంది.
ఈ యాభై సంవత్సరాల ప్రయాణం సుదీర్ఘమే కాని ముగింపు కాదు. ఇది కొనసాగింపు మాత్రమే. మారిన కాలాల్ని అన్వేషిస్తూ, మారని ఆశయాలను నిలుపుకుంటూ, అమరుల త్యాగాన్ని ఊపిరిలో నింపుకుంటూ అరుణోదయ తన ప్రయాణ కొనసాగింపుకు సిద్ధమవ్వాలి. కళలో, కవిత్వంలో, నాటకంలో, నినాదంలో కొత్త ఆవిష్కరణలతో, సాగుతూనే ఉండాలి. కళ అంటే కేవలం అలంకారప్రాయం కాదు. అది జీవన చైతన్యం. విముక్తి చైతన్యం. పౌలో ఫ్రెయిర్ లాంటి తాత్వికుల మాటల్లో చెప్పాలంటే “విముక్తి అనేది మన ఆత్మ విశ్లేషణతో మొదలయ్యి, మార్పు కోసం సాగే చైతన్య ప్రయాణం.” అరుణోదయ యాభై ఏండ్ల పండుగ కేవలం ఒక జయహో సంబరం కాదు. ఇది అంతర్గత పరిశీలనకు, విమర్శనాత్మక ఆలోచనలకు, భవిష్యత్తు ప్రణాళికకు ఒక అవకాశంగా చూడాలి.
అరుణోదయ వంటి విప్లవాత్మక సాంస్కృతిక సంస్థలు కాలాన్నిఅనుసరించి తమ పనితీరును తిరిగి పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ రోజుల్లో డిజిటల్ టెక్నాలజీ, సోషల్ మీడియా, మల్టీమీడియా, ఇంప్రొవైజేషన్ థియేటర్ లాంటి కొత్త కళారూపాలు సామాజిక సందేశాలను తక్కువ సమయంలో ప్రజలకు చేర్చగల సామర్థ్యం కలిగివున్నాయి. అరుణోదయ ఈ కొత్త మార్గాలను అధ్యయనం చేసి, సరైన అవగాహనతో ప్రయోగాత్మకంగా వినియోగించుకోవాలి.
ఇన్ని దశాబ్దాల చరిత్ర కలిగిన అరుణోదయ సంస్థాపరంగా మరింత సమర్ధవంతంగా రూపు దిద్దుకోవాలి. అరుణోదయ అభివృద్దికి ఉపయోగపడే అంశాలను, సలహాలను పరిశీలించి స్వీకరించాలి. నష్టపరిచేవాటిని తిరస్కరించాలి. అరుణోదయ ఒక నాయకుడు లేదా కొద్ది మంది నాయకుల కేంద్రంగా కాకుండా సమిష్టి, సమగ్ర, సమర్ధ నాయకత్వన్ని కలిగి వుండాలి. Team spirit, Team perspective, Team practice లను విలువలుగా క్రమం తప్పకుండా ఆచరించాలి. ప్రదర్సనల్లో మూస పద్దతికి స్వస్తి చెప్పి సృజనాత్మకతపై దృష్టి సారించాలి. కళాకారులను నామమాత్ర సభ్యులుగా కాకుండా, చురుకైన భాగస్వాములుగా తీర్చిదిద్డాలి. దళిత, ఆదివాసీ, సమస్యలపై ప్రధానంగా పనిచేయాలి.
సంస్థాగత చీలికలతో కళాకారులు ప్రజల సమస్యల్ని గుర్తించటంలో, ప్రజల్ని ఆకర్షించటంలో విఫలం అవుతారు. ఇది అరుణోదయను విస్తృతి చెందకుండా, విభిన్న ప్రయోగాలకు దూరంగా ఉంచే ప్రమాదం కలిగిస్తుంది. ఈ చీలికలు నూతన కళాకారులను, భిన్న భావలను, అంతిమంగా సృజనాత్మకతను అడ్డుకుంటుంది. సమిష్టిగా ముందుకెళ్లే సంస్కృతిని అభివృద్ధి చేయడమే ప్రస్తుతం అరుణోదయానికి అవసరమైన మార్గం.
అరుణోదయ లాంటి విప్లవాత్మక సంస్థలకు స్వేచ్ఛ, సమానత్వం, సంస్థాగత స్ఫూర్తి అనేవి ప్రాణ సూత్రాలుగా ఉండాలి. ఇటీవల కాలంలో కొంతమంది కళాకారుల్లో కనిపిస్తున్న కొన్ని లక్షణాలు ఈ విలువలకు విఘాతం కలిగిస్తున్నాయి. ముఖ్యంగా వ్యక్తిగత ప్రాధాన్యత కోసం పోటీ పెరుగుతుంది. అవార్డులపై, పదవులపై ఆసక్తి, సమిష్టి సమన్వయాన్ని పక్కనపెట్టి వ్యక్తిగత ఎదుగుదలపై దృష్టిని కేంద్రీకరించటం వంటివి ఆరోగ్యకరమైన సాంస్కృతిక వాతావరణానికి ప్రమాదకరంగా మారుతున్నాయి. కొందరు కళాకారులు తామే ప్రధాన ఆకర్షణ, తామే నాయకుడు, తాము లేకపోతే కార్యక్రమం కుదరదు అనే దృక్పథంతో వ్యవహరించడం, సంఘాన్ని వ్యక్తి ఆధారంగా చూపించాలని, వ్యక్తి ఆరాధన పెంచాలనే తపన పెరగడం, “సెలబ్రిటీ సంస్కృతికి ” సంకేతాలుగా చెప్పాలి. ఈ రకమైన వైఖరులు సీరియస్ సభ్యులను కూడా వెనుకంజవేసేలా చేస్తాయి. శిక్షణ, సహకారం, సమాలోచన వంటి విలువలను అంతరింప జేస్తాయి. సెలబ్రిటీ కల్చర్‌కు భిన్నంగా అరుణోదయ ప్రజల గొంతు, ప్రజల కళ, ప్రజల స్పూర్తి అనే విలువలపైనే స్థిరపడే మార్గాన్ని నిర్దేశించుకోవాలి.
ఏ గాయకుడైనా, ఏ సాంస్కృతిక సంస్థ అయినా పాటల్నే కాకుండా పాఠాల్నికూడా నేర్చుకోవాలి. యవ్వన కలతో నవ్యమైన కళతో తొణికిసలాడాలి. వ్యక్తుల ప్రాధాన్యతో పాటు సంస్థాగత విలువలకు కట్టుబడి ఒక విప్లవ స్వరంగా, ఒక ఉద్యమ నాదంగా అరుణోదయ విస్తరించాలి. అరుణోదయ అర్ధ శతాబ్ది పండుగకు హృదయపూర్వక అభినందలు!
***
Add comment