మ్యూజింగ్స్ ఆఫ్ చెన‌క్కాయ‌లు

హైద‌రాబాద్‌లో ఉండి ప‌న్నెండేళ్ల‌కు పైన అయినా చ‌న‌క్కాయ‌లంటే రోంత మ‌మ‌కారం కూడా త‌గ్గ‌లేదు.

రాయ‌ల‌సీమోళ్ల‌కు.. రాళ్ల‌తోనూ చెన‌క్కాయల‌తోనూ సావాస‌ముంటాది. నాకైతే ప‌చ్చి చెన‌క్కాయ‌లంటే పాణం. చెన‌క్కాయ‌లు ఉడ‌క‌బెట్టినా, ఏంచినా రుచి. దేనిరుచి దానిదేలే. చెన‌క్కాయ‌లు అంటే అవి.. ఇత్త‌నాలంటే పొర‌పాటుప‌డిన‌ట్లే.  చానామంది గుండెకాయ‌ల‌తో బిగిచ్చిన ఎమోష‌న్‌. ప‌చ్చిచెన‌క్కాయ‌ల్ని క‌ట్టెకు పీకి తింటాంటే ఆ రుచి అలివికాదు. నాటు ఇత్త‌నాలు కాబ‌ట్టి న‌ముల్తాంటే నోట్లో పాలుకార్న‌ట్టు ఉంటాండె. మాయ‌మ్మ కలాల‌కాడికి తీస‌క‌పోయిన‌పుడు ప‌చ్చిచెన‌క్కాయ‌ల్ని మ‌ట్టితో స‌హాదుస్సి జేబులో వేసుకుంటాంటి. రెండుపిరికిల్ల‌తో చెన‌క్కాయ‌ల్ని తీసుకోని క‌ల‌మోల్ల‌కు క‌న‌ప‌రాకుండా ఇంటికి ప‌రిగిత్తాంటిమి. లేక‌పోతే బ‌డికాడికి తీస‌క‌పోతాంటిమి. చెన‌క్కాయ‌ల్ని ఇట్ల దొంగ‌గా తీసికెళ్తాంటే.. అవి వాటికి రుచి ఎక్కువ‌య్యేది. మా చెల్లెలు ర‌జియా ద‌గ్గ‌ర ఉండే చెన‌క్కాయ‌ల్నీ గుంజుకోని ప‌రిగిత్తాంటి.
చెన‌క్కాయ‌లు మా చేన్లో కాసిన‌పుడు నా ఆనందానికి అడ్డు అదుపూ ఉండేదికాదు. అమ్మానాన్న‌తో క‌లిసి చేన్లోకి చెన‌క్కాయ‌చెట్లు పీక‌టానికి పోయేవాణ్ణి ఎక్క‌డ‌లేని సంతోషంతో. ఎందుకంటే మైటాల‌కి మాయ‌మ్మ చెన‌క్కాయ‌లు ఉడ‌క‌బెడ‌తాది క‌దా.. అని. అంత పిచ్చి ఉండేది. మాయ‌మ్మ చెన‌క్కాయ‌చేన్లోకి పోయినా, గ‌డ్డికిపోయినా ట‌వాల్లో ప‌చ్చెన‌క్కాయ‌లు క‌ట్ట‌క‌చ్చాండె. పెద్ద‌త‌పేలాలో నీళ్లుపోసి ఉప్పేసి ఉడ‌క‌బెట్టి బ‌క్క‌ల‌గిన్నెలో బేచ్చాండె. నీళ్లు వొడ‌చ్చానాయో లేదో.. ఉడికేసినో చెన‌క్కాయ‌ల్ని టోపీగిన్నెలో పోసుకోని.. వెంట‌నే రెండు నిక్క‌ర జోబీల్లోకీ, చ‌క్కా జోబీలోకి వేసుకుని బ‌డిదావ‌కో, కుంట‌దావ‌కో.. ఎల్ల‌బార్తాంటి.  ఉడ‌క‌బెట్టిన చెన‌క్కాయ‌లుంటే.. వ‌జ్రాలు పోసుకున్నేవాడు కూడా నాముందు త‌రంగాడు. అట్ల ఫీల‌యితాంటి.  ఎవ‌ర‌న్నా అడిగితే ఎంచుకోని ప‌ది చెన‌క్కాయ‌ల‌కంటే ఎక్కువ ఇచ్చేవాణ్ణికాదు. అట్ల‌నో గానాట‌, గోళుగుండ్లు.. అటాడుకుని ఇంటికొచ్చాంటి. *బువ్వ తిన‌కుండా తింటే ప‌ద్ద‌న ప‌ర‌తోట్లోకి ప‌రిగిత్తావు* అని మానాయిన ఎంత చెప్పినా.. క‌డుపు నొప్పిచ్చాది అని మాయ‌మ్మ చెప్పినా.. తింటాంటి.  ఒక‌మైన తింటే.. సైరుపొద్ద‌ప్ప‌టికే క‌డుపున‌చ్చి.. ప్లాస్టిక్ డ‌బ్బీతో పంత‌లో నీళ్లు ముంచుకోని.. *నాయినా క‌డుపు న‌ప్పించాంది* అంటాంటి. *అడ్డుఅదుపు లేకుండా ఏందంటే అయ్యి తిని.. ప్పా..* అని గొణుక్కుంటా.. బ్యాట‌రీ తీసుకుంటాండె మా నాయిన‌.
మాయ‌మ్మ‌తో క‌లిసి చెన‌క్కాయ‌క‌ట్టె కువ్వ‌పెట్ట‌డానికి పోతాంటి. ఈ ప‌నికి పోతే చెన‌క్కాయ‌లు తెచ్చుకోవ‌చ్చు, లెక్క‌తోపాటు అనుకుంటాంటి. చెన‌క్కాయ‌చెట్ల కుప్ప ఎత్తుతానే రోక‌ల‌బండ‌లు అలివిగాకుండా క‌న‌పడ్తాండె. *ఓమా పెద్ద‌రోక‌ల బండెలు ఉన్నాయి మా.. ఇంటికిపోతా* అని ఏడుపు మ‌గం పెట్తాంటి. *తిక్కోడా.. రోంచేపుంటే బువ్వతింటాం… అట్టో ఇట్టో ప‌నిసేచ్చే ట‌య‌మ‌యితాది. లెక్కొచ్చాది.. ఏంటిక‌న్నా ఖ‌ర్చ‌ల‌కుంటాది* అని మాయ‌మ్మ న‌న్ను బుజ్జ‌గిచ్చాండె. చెన‌క్కాయ చెట్ల కువ్వ‌లు వేసేప్పుడు రోక‌ల‌బండ‌ల‌తో పాటు ఎర్ర‌చీమ‌లు, రెక్క‌ల కీట‌కాలు, తేళ్లూ.. క‌న‌బ‌డ్తాండె. భ‌యంతో గ‌జ‌గ‌జ‌వ‌ణుకుతాంటి. నా మునం ప‌ని కూడా మాయమ్మ‌నే చేసేది.  *మాబ్బీ కొడుకు ప‌నికూడా సేచ్చాది* అనేవాళ్లు మాయ‌మ్మ ఫెండ్సు.   నాకేమో  ప‌ని త‌గ్గేది. ఎప్పుడెప్పుడు ఇంటికిపోయినా ఆటాడుకుందామా. టీవీ సూచ్చామా అనుకుంటాంటి. పదిరూపాయ‌ల‌కోసం మైటాల రెండుగంట‌ల వ‌ర‌కూ చెన్లో ఉంటాంటే.. కోపం వ‌చ్చేది. ఏడుపొచ్చేది. ట‌య‌మ‌యిందిప్పా అని రెడ్డిని కూలోల్లు అడుగుతానే.. నిక్కుతా నీలుగుతా.. పోండి అంటాండిరి.  పిల్లోల్ల కోస‌రం చెన‌క్కాయ‌లు కొండ‌పోండి.. అనే మంచి మ‌న‌సున్న రోజుల‌వి. మాయ‌మ్మ ట‌వాలు ప‌ర్చి బెర‌బెరా చెన‌క్కాయ‌లు దుస్సుతాండె. ఇద్ద‌రి పాలి చెన‌క్కాయ‌ల‌ను ట‌వాల్లో క‌ట్టి నాకిచ్చేది. ఈ చెన‌క్కాయ‌లు రోంత ప‌చ్చి త‌గ్గింటాది . మాయ‌మ్మ ఇంటికిపోయినాక నాలుగ్గంట‌ల‌ప్పుడు రొట్టె పెనంమీద చెన‌క్కాయ‌ల్ని ఏంచుతాండె. ప‌చ్చిచెన‌క్కాయ‌లు, ఉడ‌క‌బెట్టిన చెన‌క్కాయ‌ల‌కంటే ఇంగా టేస్టుగా ఉంటాండె.  జాంజాం అంని జేబులో పోసుకోని తింటాంటి.
ప‌చ్చిచెన‌క్కాయ‌ల్ని పెనంమీద ఏంచ‌టం ఓ ప‌ద్ధ‌తి. చెన‌క్కాయ‌చెట్ల‌తో కాల్చి తిన‌టం మ‌రో ప‌ద్ధతి. చెన‌క్కాయ‌చెట్ల‌ను కాల్చి తింటే రుచి ప‌దింత‌ల‌య్యేది. ఎన్ని తిన్నామ‌నేది గుర్తుండ‌దు.  చెన‌క్కాయ‌ల కాలం ఊరు భ‌లెగుంటాండె.  నాలుగు దిక్క‌ల‌నుండి ఎద్దుల బండ్లు, టాక్టెర్లుతో చెన‌క్కాయ‌క‌ట్టెను క‌లాల్లోకి తోలుకుండేవాళ్లు. మా నాయిన టాక్ట‌రు డైవ‌రు కాబ‌ట్టి.. బ‌డికిపోయి వ‌చ్చినాక చూపెట్టుకోని ఉండేవాణ్ణి.  బండ్లకు పిల్ల‌గాళ్లు జ‌ర‌బ‌డ‌తార‌ని కాయిలా ఎన‌క‌ల  వ‌చ్చేవాళ్లు. టాకిటేర్ల‌కు జ‌నాలు ఎన‌క‌ల నిల‌బ‌డేవారుకాదు.  పిల్ల‌గాళ్ల‌మంతా… మ్యాడ్‌మాక్స్‌లో టిప్ప‌రుకు జ‌ర‌బ‌డి క‌ర్చుకున్న‌ట్లు దొరికింది దొరికిన‌ట్లు టాక్ట‌రులోని చెన‌క్కాయ‌క‌ట్టెను పీకుతాంటిమి. టాక్ట‌రులో తోపు బాగా క‌ట్టింటారు కాబ‌ట్టి  చేత‌ల‌కు వ‌చ్చేది కాదు. చేతులు బొబ్బ‌లు పోయేవి. గ‌ట్టిగా చాలాసార్లు క‌ట్టెను పీకేవాళ్లం. మా నాయిన డైవ‌ర్ కాబ‌ట్టి .. టాక్ట‌రు రోంత స్లో చేసి చెన‌క్కాయ‌క‌ట్టెను మా ఇంటి అరుగుమీద ఇసిరేయ‌మ‌ని జీత‌గాళ్ల‌కు చెప్పేవాడు. దాన్ని ఇంట్లోకి తీస‌క‌పోయి.. చెన‌క్కాయ‌లు పెరికి.. కట్టెను దూడ‌ల‌కు వేచ్చాంటి. చెన‌క్కాయ‌లంటే ప్రేమ‌వ‌ల్ల నాలో కాంచాలం ఎక్కువుంటాండె. మా ఇంట్లో చెన‌క్కాయ‌లు కాల్చ‌కుండా.. బ‌య‌ట పెద్దోళ్లెవ‌రైనా మా జెండామానుకాడో, సిద్ధంరెడ్డిప‌ల్లోల్ల కొట్టంకాడో , ప‌క్కిడ్డి ఇంటికాడో, బ‌డికాడికో పోయేవాణ్ణి. పెద్దోళ్లు చెన‌క్కాయ‌లు కాలుచ్చామంటే సాలు.. ఉరికిత్త‌పోయి రోంత కంప, ఊపుచెత్త‌, పేప‌ర్లు తెచ్చాంటిమి. బీడీ తాగేవాళ్ల‌తో అగ్గిపెట్ట ఇప్పించుకుని పెద్దోళ్లు చెన‌క్కాయ‌ల్ని కాలుచ్చాండ్రి. చెన‌క్కాయ‌బొప్పి మాడినా.. లోప‌ల ఇత్త‌నం బాగా కాల్తాండె. రుచిగా మాట్లాడుకుంటా.. క‌థ‌లు ఇంటా.. అట్ల‌నే గంట‌పాటు తిన్న‌జ్ఞాప‌కాలు వంద‌లుంటాయి. కాల్చిన చెన‌క్కాయ‌ల్ని ఇప్పుడు కాల్చినా అంత‌రుచి రాదు.  పెద్దోళ్ల సావాసం లేకుండా.. మా ఈటోళ్ల‌మంతా చెన‌క్కాయ‌ల్ని కాల్చుకోని తినేవాళ్లం. నిక్క‌ర్లు క‌ట్టుకున్నేప్ప‌టినుంచి ఇంట‌ర్‌కాలేజీకి సిమాప‌ల్లెకు పోయిన రెండేళ్ల వ‌ర‌కూ చెన‌క్కాయ‌ల‌కు బాగా రుచి ఉండేది. కాలేజీకి పోయేప్పుడు చేన్ల‌న్లోని చెన‌క్కాయ‌క‌ట్టెను తీస‌క‌చ్చి ముగ్గ‌రు రామాంజ‌నేయుళ్ల‌తో క‌లిసి కాల్చి తింటాంటిమి. మేం తినేప్పుడు ఆడిపిల్లోళ్లు వ‌చ్చే.. వాళ్ల‌కు తిన‌మని ఇచ్చేవాళ్లం. వాళ్లు రోన్ని తీసుకుండేవాళ్లు.  ఉడ‌క‌బెట్టిన చెన‌క్కాయ‌ల్ని తింటూ వంద‌ల టీవీ సీరియ‌ళ్లు, సినిమాలు సూచ్చాంటిమి.
చెన‌క్కాయ‌లంటే.. రాయ‌ల‌సీమోళ్ల జీవిత‌మే కాదు.. అస్తిత్వం. న‌ల్ల‌రేగ‌ట్లోకంటే గ‌రుగ‌ల్లో, బెళుకునేల‌ల్లో, ఎర్ర‌మ‌ట్టిలో చెన‌క్కాయ‌లు ఇర‌గ్గాసేవి. మాకు చెన‌క్కాయ‌లు కాచ్చే చాట‌ల్తో మాయ‌మ్మ ప‌క్కింటోళ్ల‌కు, బ‌జారోళ్ల‌కు పెడ్తాండె. బంధువుల‌కు పంపించాంటిమి.  చెన‌క్కాయ‌ల్ని క‌ల్లంలో పోసిన‌పుడు చీమ‌లు, కాకులు, పిల్లులు, కుక్క‌లు కాన్నుంచి మ‌నుషుల వ‌ర‌కూ తింటాండిరి. చెన‌క్కాయ‌లంటే మాకు లెక్కే ఉండేది కాదు. అంత‌గా చెన‌క్కాయ‌ల్ని పండించేవాళ్లు. ప‌దోత‌ర‌గ‌తి దాట్నాక అనుకుంటా.. ఎర్రఇత్త‌నాలుండే మూడు ఇత్త‌నాలు చెన‌క్కాయ‌లు వ‌చ్చాండె. అవి హైబ్రేడ్ ఇత్త‌నాల‌ని మాకు తెలీదు. *ఐ బాగుండాయే* అని తింటాంటిమి.  ఒక్కోసారి చెన‌క్కాయ‌లు బాంగుడాయిమా అంటాంటి. *ఇయ్యేం చెన‌క్కాయ‌లు. మా పిల్ల‌ప్పుడు తీగ చెన‌క్కాయ‌లుంటాండె. ఎంత రుచిగా ఉంటాండెనో. ఆ చెన‌క్కాయ‌ల్ని పాచ్చాండ్రి. పీక‌క‌పోయేవాళ్లు కాదు. అంత గ‌ట్టిగా ఉంటాండె చేలో.. ఆ చెన‌క్కాయ‌ల రుచి మింద ఇయ్యెంత* అని అంటాండె మాయ‌మ్మ‌.
ప‌చ్చివి, ఉడికేసిన చెన‌క్కాయ‌ల్ని చెప్పి.. వ‌ట్టిచెన‌క్కాయ‌ల గురించి చెప్ప‌కుంటే అవి బాధ‌ప‌డ్తాయి. వ‌ట్టి చెన‌క్కాయ ఇత్త‌నాలు నాకు నోట్లోకి పొయ్యేవి కావు. బాధ‌గా ఉండేది. కోప‌మొచ్చేది. అయితే వ‌ట్టిచెన‌క్కాయ ఇత్త‌నాల్లోకి రోంత బెల్లం వేసుకోని తిన‌టం మెల్ల‌గా అల‌వాటైంది. బ‌డికిపోయి వ‌చ్చినాక బువ్వ‌కు చీమ‌లు ప‌ట్టిన‌పుడు, ఇంట్లో ఏమీ తిన‌టానికి లేక‌పోయిన‌ప్పుడు అయ్యి తింటాంటి. వట్టిచెన‌క్కాయ‌లూ రుచిగా ఉండేవి. వ‌ట్టి చెన‌క్కాయ‌ల్ని ఏంచి ఉప్పు, తెల‌వాయిలు, కాల్చిన వ‌ట్టి మెర‌ప‌కాయ‌లు రోట్లో వేసి తెల‌వాయికారం నూరితే .. ఆ పొడిని రాగిసంగ‌టి గురిగ‌లో వేసుకుని .. అందులోకి వెన్న‌పూస వేచ్చే నా సామిరంగ టేస్టు అదిరిపోతాండె. అదే ఏంచిన చెన‌క్కాయ‌ల‌కు ఉడ‌క‌బెట్టిన ప‌చ్చిమెర‌ప‌కాయ‌లు, ఉప్పు, ప‌సుపు, గోగాకు.. వేసి మాయ‌మ్మ ఊరిమిండి నూర్తాండె. ఆ రుచి ఎట్లుంటాది అంటే.. చికెను బిర్యానీ, క‌బాబ్‌లు లేకున్నా ఫ‌ర్లేదు. అంత రుచిగా ఉండేది. తెల‌వాయికారం, ఊరిమిండి నూరేప్పుడు మా య‌మ్మ నాకోసం చాట్లో చెన‌క్కాయ‌ల‌ను తీసి పెడ్తాండె. మాపాప నేను కొట్లాడ్తాంటిమి.. నాకు ఎక్కువ కావాల్లంటే.. నాకు ఎక్కువ కావాల్ల‌ని.
సూచ్చాండ‌గానే రెండువేల సంవ‌త్స‌రం త‌ర్వాత  చెన‌క్కాయ పంట పండ‌టం ఊర్లో త‌గ్గిపోయినాది.  మ‌న చెన‌క్కాయ‌లు పోయి హైబ్రేడు వ‌చ్చినాయి. మా చేన్లో చెన‌క్కాయ‌లు ఇత్తేముందు పేడ‌నో్, గొర్రెపెంట‌క‌లో టాక్ట‌రును వేసుకోని పోయి చేన్లో పోసేవాడు. పంట బాగా పండేది. ఊర్లో అప్పుడప్పుడే రోంత స్ట‌యిల్ నేర్చుకున్యారు. ఎనుములు, ఎద్దులు రోత‌.. అంటాండిరి. చేన్ల‌కు మ‌ట్టితోలుకోవ‌టం అల‌వాటైంది. మందుల వాడ‌కం ఎక్కువైంది. ఇంట‌రు వ‌ర‌కూ అంటే 2002 వ‌ర‌కూ రోంత చెన‌క్కాయ‌ల్లో రుచి ఉండేది. తిన్నా.. పాలుకారిన‌ట్లు నోరు తియ్య‌గుండేది. నాసుల్ని అమ్మో, జున్నుకాడికి తీస‌క‌పోయో చెన‌క్కాయ‌నూనె తెచ్చుకుండేవారు. కండ్ల‌ముంద‌ర‌నే… పెద్దోళ్లు మారిపోయినారు. వాళ్ల మాట‌లు మారిపోయినాయి. *ఏంటికి.. చెన‌క్కాయ‌లు తింటే వాయి వ‌చ్చాది. చెన‌క్కాయనూనె తింటే వాంతికిక్కా .. పామాయిలు నూనె, కుస‌పు నూనె బాగుంటాదంట అన్ని రెడ్డోళ్ల ఆడోళ్ల చెప్ప‌బ‌ట్టిరి.  మెల్ల‌మెల్ల‌గా చెన‌క్కాయ‌లు సూచ్చామ‌న్నా.. డిగ్రీలో క‌న‌ప‌డ‌క‌పోయేవి. ఊర్లో ఎవురో ప‌ది ప‌ర్సెంటు ఇత్తేవారు.వాళ్లు కూడా క‌లంకాడికి కాకుండా చోన్లోనే క‌ట్టెపెరికిచ్చి అమ్ముతాండ్రి. చాలామంది ఇండ్ల‌కాడి మాదిరి.. మా ఇండ్లూ ఎప్పుడో స్ట‌యిల్‌గా మారింది. ఎనుములు ఎప్పుడో అమ్ముకున్యాము. *చెన‌క్కాయ‌లు ఇత్త‌వేమి నాయినా* అంటే… *యాడ‌ప్పా.. స‌త‌వ ఎక్కువ‌యితాది. ఏమి మిగుల్తాది. ఇంత‌కుముందు మాదిరి వాన‌లు ప‌డ‌లే. పెట్టుబ‌డి న‌ట్టం..* అంటూ మా నాయిన టాక్ట‌రు డైవ‌ర్ ప‌నికి పోయేవాడు. ఒక‌ప్ప్పుడు ఊరంతా చెన‌క్కాయ‌బండ్లు తిరిగేవి. క‌లాల్లో చెన‌క్కాయ‌ల్ని డ‌బ్బాల‌తో, మూట‌ల్తో కొలిచే కాలం పోయింది. అస‌లు చెన‌క్కాయ‌లు పీక‌టానికి వ‌చ్చేజ‌నాలు త‌గ్గిపోయినారు.  నేను హైద‌రాబాద్‌కి వ‌చ్చినా.  పిరికెడు చెన‌క్కాయ ఇత్త‌నాల్ని కూడా ముప్ఫ‌యి రూపాయిలు పెట్టి కొనేవాలళ్ల‌ను చూసి బాధ‌ప‌డేవాణ్ణి.  మా ఊర్ల‌ర్లో ఓర‌క‌నే పెడ‌తారు అన్నా కిరాణా కొట్టు ఆసామితో. బాగా గుర్తుంది.. హైద‌రాబాద్‌లో వార‌ప‌త్రిక‌లో ప‌నిచేసే నేను ఓ సారి సెల‌వు తీసుకోని ఇంటికి పోయినా. ఆ రోజు బూపొద్ద‌ప్పుడు.. మా సిమాప‌ల్లె మండ‌లంలోని గౌసు మ‌లిగ‌లో చెన‌క్కాయ‌ల్ని కేజీ కొన‌క్క‌చ్చినాడు.  ఏం కాల‌మురా అనుకుంటి.
హైద‌రాబాద్‌లో ఉండి ప‌న్నెండేళ్ల‌కు పైన అయినా చ‌న‌క్కాయ‌లంటే రోంత మ‌మ‌కారం కూడా త‌గ్గ‌లేదు.  వారం వారం ఎర్ర‌గ‌డ్డ సంత‌కు పోతా. కేజీ యాభై రూపాయ‌ల‌తో చెన‌క్కాయ‌లు తెచ్చుకుంటా. తూకం త‌క్కువ వ‌చ్చాయి.. రుచి త‌క్కువ‌.. అయినా చెన‌క్కాయ‌ల్ని తెచ్చుకుంటా. కుక్క‌రులో పోసి చెన‌క్కాయ‌ల్ని ఉడికిచ్చాది మా ఆవిడ‌. ఈ చెన‌క్కాయ‌ల్ని తింటాంటె.. బ‌క్క‌ల‌గిన్నెలో వ‌డ‌పోసిన చెన‌క్కాయ‌లు గుర్తుకొచ్చాయి నాకు. ఇట్లా చెన‌క్కాయ‌ల‌కు, నాకూ అనుబంధం ఇప్ప‌టికీ నిల‌బ‌డింది. అప్పుడప్పుడూ.. ఇష్టం కొద్దీ గోళంలో చెన‌క్కాయ‌ల్ని ఏంచుతా. ఏంచిన చెన‌క్కాయ‌లు మాత్రం రోంత రుచిగా ఉంటాండాయి. ప‌ర్వాలేదు. ఆ ఏంచిన చెన‌క్కాయ‌లు తింటాంటే.. మా ఊర్లో బ‌డికాడ చెన‌క్కాయ‌క‌ట్టెను కాల్చిన‌పుడు వ‌చ్చే వాస‌న నా ముక్కుపుటాల‌కు కొడ్తాది. ఆ జ్ఞాప‌కంతో ఏంచిన ఇత్త‌నం కొరికితే నాలిక్కు రుచి ఇంగా త‌గుల్తాది.  చెన‌క్కాయ‌లంటే… అదో క‌రువు తిండే కాదు. నా పాణం.
( నాకే కాదు.. రాయ‌ల‌సీమలోని ప్ర‌తి బిడ్డ‌కీ చెన‌క్కాయ‌ల‌తో అనుబంధం ఉంటాది. ఎవురి అనుభ‌వాలు వాళ్ల‌వి. నా అనుభ‌వం ఇదీ.. )
*

రాళ్ల‌ప‌ల్లి రాజావ‌లి

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • అబ్బుడే ఎసురు దించిండే ఉడుకుడుకు అన్నమూ, కరగబెట్టిండే నెయ్యి, రోంత ఘాటుగానే దంచిండే చెనిగిత్తనాల పొడీ ఉంటే ఇంగేందీ వొద్దప్పా!

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు