మౌమితా ఆలం కవి, ఉపాధ్యాయిని,ప్రముఖ పత్రికలకు కాలమ్స్ రాస్తున్న రచయిత.ఆమె కవితలు, వ్యాసాలు ప్రముఖ పత్రికలలో ప్రచురించబడ్డాయి. ఆమె ఉత్తర బెంగాల్ లోని మారుమూల ప్రాంతమయిన ‘ సిలిగురి’ ప్రాంతానికి చెందిన ముస్లిం మహిళ.
ఆమె కవితలు 2019 నుండి నేటి వరకు దేశంలో జరిగిన ప్రతి సంఘటనలను పట్టుకోవడానికి ప్రయత్నించాయి. ఆమె కవితలు వేదనకి, మరణాలకి, అమానవీయానికి గురవుతున్న ప్రజల బాధలకు ప్రతిధ్వనులు.ఆమె కవితలు పీడితులకు స్వరంగా మారాయి.ఆమె భిన్న కోణాలలో రాసిన కవిత్వం నూతన ప్రతీకలతో,రూపకాలతో పాఠకుడ్ని తీవ్రంగా తాకుతుంది. ఇప్పటి వరకు రాసిన తన మూడు పుస్తకాల( The Musings of the Dark, Poems at Day Break, The Smell of Azadi )లో ఒక బాలికగా,ఒక స్త్రీగా, ఒక ముస్లిం స్త్రీగా, ఒక సామాజిక బాధ్యత గల పౌరురాలిగా, అంతర్జాతీయంగా జరుగుతున్న దురదృష్టకర పరిణామాల వల్ల సర్వం కోల్పోతున్న వారికి సహానుభూతిగా తన గొంతు ఎత్తారు.తన పదునైన, శక్తివంతంగా,సూటిగా రాసే శైలి వలన దేశంలోని పలు సాహితీ సమూహాల,ప్రజాస్వామ్య,అభ్యుదయ సంఘాల దృష్టిని ఆకర్షించారు.పలు భారతీయ భాషలలో ఆమె కవిత్వం అనువాదం జరుగుతోంది.
1
అల్ షిఫలో దేవుడు
గతరాత్రి దేవుడు అల్ షిఫ* ని దర్శించాడు.
మృత శిశువులందరూ లేచి
ఇంక్యుబేటర్ల** కోసం అడిగారు.
దేవుడు బయటకి పరిగెత్తాడు.
అతని చేతులు తెగిపోయాయి.
అతని ఆదేశాలు ఎవరూ పాటించడం లేదు.
గాజా భూమి మీద
అతనిప్పుడు తిరుగుతున్నాడు.
చనిపోతున్న ఒక స్త్రీ
అతని మీద రాయి విసిరింది.
చివరిది.
‘నేనేం నేరం చేసానని ?’
దేవుడు నిస్పృహగా అడిగాడు..
‘పీడించేవాడు మాత్రమే
బూట్ల శబ్దాలతో,మిలటరీ టోపీలతో
అమరవీరుల ముంగిలోకి వస్తాడు.’ అని
ఆ స్త్రీ జవాబిచ్చింది.
దేవుడు పారిపోయాడు.
తెగిన తన చేతులు తీసుకెళ్ళడం మర్చిపోయాడు.
( * అల్ షిఫ గాజాలోని అతిపెద్ద ఆసుపత్రి ,
** ఆసుపత్రిలో రోగస్థ శిశువులను వుంచే సమశీతోష్ణ పెట్టెలు )
2
యుద్ధ విమానాలు
‘బాంబ్ ! బాంబ్ !
పరిగెత్తు, పారిపో
అమ్మా..నన్ను దాపెట్టు..’
చెవుల్ని చేతుల్తో మూసుకుంటూ
పిచ్చెత్తినట్టు అరుస్తున్నాడు
ఒక ఐదేళ్ళ పిల్లాడు.
‘అవి యుద్ద విమానాలు కావు
పక్షుల గుంపులని’
తల్లి నచ్చచెప్పలేక పోతోంది.
యుద్దం ఒక సజీవ జ్ఞాపకం అయిన చోట
ప్రతి పక్షీ ఒక యుద్ద విమానమే..
ప్రతి శబ్దమూ ఒక తుపాకీ శబ్దమే..
*
Add comment