మౌమితా ఆలమ్ కవితలు మూడు

మౌమితా ఆలమ్ కవితలు మూడు

1

గందర గోళంలోనే రాస్తాను 

రాజ్యం కోరలు
ఎల్లడలా విస్తరించే చోట
నాకంటూ ఒక చోటు లేకుండా పోయింది
నేను తినే ఆపిల్ పండు
బిర్యానీలో వేసే కుంకుమపువ్వు
అన్నీ కాశ్మీర్ నుండి దొంగిలించినవే ..
రాసుకోవడానికి టేబుల్ ఉండదు
పుస్తకాలకొక సెల్ఫ్ ఉండదు
నాకిష్టమైన “జీత్ తాయిల్ “కవిత్వం
తనివి తీరా చదువుకునే వీలుండదు
నురగలు కక్కే కాఫీ తాగడం
పూలను పలకరించి మాట్లాడడం
ఎప్పటికీ ఒక తీరని కల
కళ్ళులేని మా నాయన
నష్టాలు గూర్చి ఎప్పుడు లొల్లి పెడుతుంటాడు
ఊదురు గొట్టంతో ఊది ఊది
మా అమ్మ ఊపిరితిత్తులు
ఖాళీ అయిపోయాయి
సిలిండర్ కొనలేని బతుకు మాది
 మరోవైపు
 జైలుఊచల నుండి
మా మిత్రులు గగ్గోలు పెడుతుంటారు
వాళ్ళు విడిచి వెళ్లిన కలల్ని
నేను నెమరేస్తుంటాను
అన్నానికి ఆకలి దోస్తు అని తెలుసు
నాకు “ఫంటాభట్ “తప్ప
మరే రుచి తెలవదు.
నా అక్షరాలు
ఎప్పుడు సుఖ జీవితాల నుండి వికసించవు
అవి చల్లనివి
ఆమరుల శరీరమంత చల్లనివి .
       **
ఫంటాభట్… ఇది బెంగాలీల ఆహారం.  సద్ది అన్నాన్ని రాత్రంతా నానబెట్టి పొద్దున పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డతో కలిపి తింటారు.
2

సుకునీరే కోసం 

నేనామె పేరడిగా
సుకునీ..(రాబందు )
అని చెప్పి గట్టిగా నవ్వేసింది
 నేను ప్రతిరోజు టీ దగ్గర
 కళలు, సాహిత్యం, సంస్కృతి గూర్చి
 తీవ్రంగా చర్చ చేస్తూనే ఉంటా గాని
మా అధునాతన చర్చల్లో
ఆమె అల్పజీవి అయిపోయింది
సుకునీ
నా చుట్టూ తిరిగాడుతున్నట్టే ఉంటది
కనీస వేతనాలకో, సమాన వేతనాలకో
పడ్డ ఆరాట పోరాటాలు
జయాపజయాలు
నా తెల్లటి పింగాణి కప్పు మీద
ముద్రించినట్టే ఉంటది.
అయినా
ఎవరు ఏది తాగితే ఏంది
నా “టీ “నేను తాగుతున్నా
కానీ
నా నాలుక కొసన
రాబందుల రక్తపువాసన వేస్తున్నదెందుకు?
            ***
3

ఒక స్వేచ్ఛ జీవిగా..

వాళ్లంటారూ
స్వాతంత్రానికి వెల కట్టాలని.
నావెల నేనే కడతాను
స్వేచ్ఛా స్వాతంత్రాల కోసం
అనేక నిందల్ని భరిస్తాను.
మా నాయన
నన్నొక తిరుగుబాటు మహిళ అంటాడు
మా అమ్మ
నన్ను మొండి పిల్ల అంటది
సమాజం
నన్ను చెడిపోయిన ఆడదిఅంటది
 నా మాజీ ప్రియుడు
నన్ను తిరుగుబోతు లం.. అంటాడు
నా భర్తను వలలో వేసుకోనందుకు
నా సోదరి
నా బతుకు దండగ అంటది.
 నా దేశం
 నన్ను దేశద్రోహి అంటుంది
నేను మాత్రం
నన్ను నేను
ఒక స్వేచ్ఛ జీవిగా  ప్రకటించుకుంటా
             **

ఉదయమిత్ర

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు