మౌమితా ఆలమ్ కవితలు మూడు

1
అమ్మ పొయ్యి 

పొయ్యి మీదనే

మా అమ్మ
తన వారసత్వాన్ని వొండి వార్చి
నాకూ ,నా పిల్లలకూ
వారసత్వంగా అందించింది.
 చిన్నప్పుడు
మా అమ్మ శరీరమంతా
వంటిల్లు వాసనేసేది.
ఇప్పుడు కూడా
నేను ఆమె పొయ్యి దగ్గర కూర్చుని
వంట వాసనల్ని గుండెల్లో పొదుపుకొని
నా బాల్యపు అనుభూతుల్ని
 పిల్లలకు అందిస్తుంటాను.
పొయ్యి కింద పొట్టును ఎగ దోస్తూ
మంటపెట్టే కళ
నాకు ఇప్పటికీ అలవాటే .
పొయ్యిలో మంట రాజు కుంటే చాలు
మా అమ్మ కళ్ళు మెరిసిపోతాయి
గిన్నెలో మాంసపు ముక్కలు
ఆనంద తాండవ మాడుతాయి
కమ్మగా ఉడికిన పులుసు వాసన
పొయ్యి అంచుల మీద చిట్లుతుంటే

 ఓ ఫ్..

చిన్ననాటి ఆ కమ్మటి వాసన
నా జ్ఞాపకాలని దాటి
నా రుచి గ్రంథుల్ని ఉత్తేజితం చేస్తుంది .
నా బిడ్డ
నన్ను కౌగిలించుకొని
“అమ్మా ..
నువ్వు అమ్మమ్మ లాగే వాసనేస్తావు “అంటది
మాతృ దినోత్సవాన్ని కీర్తించే వేళ
మా అమ్మా,నేనూ, నా బిడ్డల
జీతం లేని మా ఇంటి చాకిరి
కవిత్వంలో అందంగా గుబాళిస్తుంది.

గందర గోళంలోనే రాస్తాను 

రాజ్యం కోరలు
ఎల్లడలా విస్తరించే చోట
నాకంటూ ఒక చోటు లేకుండా పోయింది
నేను తినే ఆపిల్ పండు
బిర్యానీలో వేసే కుంకుమపువ్వు
అన్నీ కాశ్మీర్ నుండి దొంగిలించినవే ..
రాసుకోవడానికి టేబుల్ ఉండదు
పుస్తకాలకొక సెల్ఫ్ ఉండదు
నాకిష్టమైన “జీత్ తాయిల్ “కవిత్వం
తనివి తీరా చదువుకునే వీలుండదు
నురగలు కక్కే కాఫీ తాగడం
పూలను పలకరించి మాట్లాడడం
ఎప్పటికీ ఒక తీరని కల
కళ్ళులేని మా నాయన
నష్టాలు గూర్చి ఎప్పుడు లొల్లి పెడుతుంటాడు ఊదురు గొట్టంతో ఊది ఊది
మా అమ్మ ఊపిరితిత్తులు
ఖాళీ అయిపోయాయి
సిలిండర్ కొనలేని బతుకు మాది
 మరోవైపు
 జైలుఊచల నుండి
మా మిత్రులు గగ్గోలు పెడుతుంటారు
వాళ్ళు విడిచి వెళ్లిన కలల్ని
నేను నెమరేస్తుంటాను
అన్నానికి ఆకలి దోస్తు అని తెలుసు
నాకు “ఫంటాభట్ “తప్ప
మరే రుచి తెలవదు.
నా అక్షరాలు
ఎప్పుడు సుఖ జీవితాల నుండి వికసించవు
అవి చల్లనివి
ఆమరుల శరీరమంత చల్లనివి .
       **
ఫంటాభట్… ఇది బెంగాలీల ఆహారం.  సద్ది అన్నాన్ని రాత్రంతా నానబెట్టి పొద్దున పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డతో కలిపి తింటారు.

పెట్టుబడికి ప్రేమనిచ్చా

నా ప్రేమను
పెట్టుబడికిచ్చేశాను
ప్రియతమా.
నా జీవితం సీదా సాదా గాదు
నీ ప్రేమకు నాహామీలేదు
ప్రేమించడం
నువ్వు శ్వాసించినంత సులువేంగాదు
అందులోంచి నువ్వు బైట పడలేవు
నీకూ నాకూ మధ్య
లెక్కలుంటాయి సుమా
అసలే
ద్రవ్యోల్బణం పెరిగిపోతోంది
బహిరంగ మార్కెట్లో
నిన్ను ముద్దెట్టుకోవడంకన్న
అంగట్లో
దోసకాయలు గురించి ఆలోచించడం హాయి
*

ఉదయమిత్ర

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మూడు కవితలు బాగున్నాయి

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు