‘మో’! క్షమించు!!

మో – పుట్టిన రోజు కోసం

“ఏకకాలంలో బౌద్ధికమైన ఆలోచనని హార్దికమైన అనుభూతిని కళ్లకి కట్టినట్లు చిత్రించగలిగితే ఆ పదాల కూర్పులో అర్థం సంగతి పట్టించుకోనక్కర్లేదు.”

“వాక్యంలో ఉండే పదాలకు అర్థాలుంటాయి కాని, వాక్యం మొత్తంలో ఒక ధ్వని ఉంటుంది. పదాల సమాహారంలో అర్థాన్ని కాక ధ్వనిని వినగలగాలి.”

“శిల్ప సంయమనం ఉంటే అధివాస్తవిక కవిత్వం కూడా అర్థమౌతుంది…”

– అంటూ 30 ఏళ్ల క్రితమే ఆధునిక కవిత్వాన్ని అర్థం చేసుకోవడానికి కొన్ని తాళం చెవులు ఇచ్చినా జీవితాంతం, అనంతరం కూడా అస్పష్ట కవిగానే పేరుమోసిన ‘మో’ (వేగుంట మోహన ప్రసాద్ గారి) 78వ జయంతి – జనవరి 5 – అంటే ఈ రోజు తెల్లవారుఝామున నిద్ర లేస్తూనే, కవి- కవిత్వం- అర్థం కావడం / కాకపోవడానికి సంబంధించిన ఓ మిత్రుడి పోస్టుకి ఈ విధంగా స్పందించాల్సివచ్చింది:

” ‘కవిత్వం దగ్గరకి వెళ్ళాలి’ అన్న వినయం కాకుండా, ‘కవిత్వం నా దగ్గరకి రావాలి’ అన్న అహంకారం ఉన్న వాళ్ళు, కవినే interpretation ఇవ్వమని దబాయిస్తున్న వారు కవిత్వం జోలికి పోకుండా ఉంటే బాగుంటుంది.
చలం గారు కె సి డే సంగీతం విషయంలో అన్నట్టు, నాకూ అనాలని అనిపిస్తుంటుంది- ‘కవిత్వం అందిరికీ కాదని, ముఖ్యంగా కవిత్వం గురించి తెలీకుండా దాని మీద జంధ్యాల మార్క్ జోకుల అల్పత్వం ప్రదర్శించే వారు చదవకూడద’ని ఎవరైనా శాసనం చేస్తే బాగుణ్ణు” (http://bit.ly/2MWskmg)

**           **           **

ఆధునిక కవిత్వ అర్థ తాత్పర్యాల గురించి ఒక రొడ్డకొట్టుడు, obsolete  ప్రస్తావన వచ్చిన రోజు ‘మో’  పుట్టిన రోజు కావడం కాకతాళీయమైనా, తెలుగు కవిత్వానికి గొప్ప గొంతుకని సంతరించి పెట్టి, ఆధునిక కవిత్వాన్ని ఉన్నతీకరించి, ఆధునికోత్తర కవిత్వానికి భూమికని ఇచ్చిన ‘మో’ ప్రాతఃస్మరణతో, కవిత్వ ఆస్వాదన మూలాల్ని వెదుక్కునే  నిజ నిబద్ధ పాఠకులకి అర్ధ శతాబ్ది క్రితం ఆయన ఇచ్చిన ఒక అభ్యాసాన్ని గుర్తు తెచ్చుకుంటున్నాను.

1960ల ప్రథమార్థం- ‘మో’ చదువుకునే రోజుల్లో కవిత్వ అర్థబోధ చేసే ప్రొఫెసర్ ఒకరు- కవి Tiller రాసిన ‘Substitutes’ కవితని ‘చదివి, అర్థమయితే చెప్పమ’ని అడిగారట క్లాసులోని విద్యార్థులని. ఇంగ్లాండ్ కవి Terence Rogers Tiller 1940ల్లో రాసిన  ‘Substitutes’ కవిత తాత్పర్యాన్ని గురువు గారు అడిగితే, ‘ఆత్మాశ్రయం’ అనే కవిత రాశారు శిష్యుడు ‘మో’ (1962- 63 మధ్య). మహాకవి శ్రీశ్రీ – ‘సదసత్సంశయం’, ‘దీర్ఘాలు’, దేవరకొండ బాలగంగాధర తిలక్ ‘నీడలు’ వంటి ప్రసిద్ధ కవితల్ని ప్రచురించిన ‘నవత’ (సెవెన్‌ స్టార్స్‌ సిండికేట్‌) 5వ సంచికలో ‘ఆత్మాశ్రయం’ ప్రచురించబడింది.

Substitutes
—————

Squeezing the private sadness until words

pearl round it, and all images become

the private sadness and the life; and a name

blood.  Or flowering like a bride towards

the object, amorous of image, a home:

giving oneself to symbols; feeding myths.

 

There is one house beyond opposing paths.

Pelican or vampire is the same.

 

Only by going in and not around;

pulsing with stone’s cold veins; duck’s world,

rock’s world;

sifting the air as trees; long as the wind;

sucking the earth as wheat; become a field.

No myth will ever come to any good:

but biting the wasp’s gentle apple; being blood.

**

అప్పటి విద్యార్థి, జీవితాంతం కవిత్వానికి నిత్య విద్యార్థి – ‘మో’ ‘ఆత్మాశ్రయం’ కవిత ఇది:

ఆత్మాశ్రయం
———-

మన మనఃక్లేశాల్ని కోసి, నిమ్మ, నారింజ, బత్తాయి

పళ్లుగ రసం తీస్తే పులుపురొడ్డు.

చెడుగుడాడేవాడికీ పాలిపోయేవాడికీ పండుముదుసలికీ

ఇస్తే కూతపట్టి రక్తం వచ్చి యౌవనం తొంగి చూస్తుంది;

పొగచూరిన కళ్లల్లో ఆయాసపుగుండెల్లో.

 

అంటుకుపోయిన పాండురంగడి నరాల్లో, మాసిన గడ్డంలో.

సి. వైటమిన్ పళ్లల్లోంచి ముత్యాలల్లోంచి పుల్లని రక్తం పిండుతోంటే

మాటలు ఒక్కొక్క బొట్టూ పడుతూ తడబడుతూ

పులుపురొడ్డు వాక్యాలవుతయ్, కావ్యాలవుతయ్.

రసం తీసే గాజుపళ్లెం దంతాలు గుండ్రంగ మెరుస్తయ్;

ఈ కాలం అమ్మాయిలు వేసుకునే ఒంటిపేట

అరక్త ముత్యాల ఖరీదయిన హారాల్లాగా.

 

అపుడు మన మనఃక్లేశాల్ని కోసి పిండితే

ముత్యాల్ని గుచ్చుతూ తెలుపులో ఎక్కడో జీవిత రక్తపు జీర

లోలోపల ప్రాకుతూ వక్షస్థలాల్లోకి వెళ్లే మెలికలపాముల్లా

పైరుపొలాల్లోకి వెళ్లే కట్లపాముల్లా తోకలముడులు విప్పుకుని

మునుగీతలు వేస్తయ్ మెల్లగా శాంతిగా ప్రశాంతిగా మైకంగా.

 

ఏ పిల్లగాలికో ఓ వృద్ధవృక్షం సమూలంగా లేచి మహా

పర్వతంలో ఓ చిన్నరాతిలోని నరాలతో పాటు వ్రేళ్లూనుతుంది.

గాలి వీచినంత ప్రదేశమూ కొమ్మలూపి రెమ్మలు చాపి

దిరిసెన పువ్వుల్ని రాల్చి, నిమ్మ, నారింజ, బత్తాయి తోటల్ని నిద్రపుచ్చుతుంది.

అపుడపుడు ఆకుల్ని రాల్చుతుంది, పండిపోయిన వాటిని.

 

అవి ఎండి, పొడి అయి, ఆ ధూళిలోంచి వైటమిన్లయి

పళ్లతోటల మొదళ్లలో చిరుమొక్కల కుదుళ్లలో

నల్లరేగడి మట్టి త్రాగే ఆవిరి కురిసిన నీళ్లురాలిన మంచులో కలుస్తాయి.

వాటినే పిండుతాము మళ్లీ ఒక్కొక్క బొట్టూ.

ఏ సంకేతానికీ అంతులేదు సాకేత రామా,

అశ్రువులూ రక్తం పులుపురొడ్డు, విషాద కావ్యం పులుపురొడ్డు.

మన దుఃఖం చింతచెట్టు గుబురు నుంచీ

ఒత్తుగా ఉన్న ఆమె కబరీ భరాన్నుంచీ

ఒక వెన్నెల కిరణమైనా మన వ్రణాలపైన రాలదు గదా!

**           **           **

 

ఆ  ‘Substitutes’నీ, తన ‘ఆత్మాశ్రయం’ కవితనీ తైపారు వేసి చూడమనడమే ‘చితి-చింత’ (1969)లో తెలుగు కవిత్వ పాఠక లోకానికి ‘మో’ ఇచ్చిన ‘exercise’! అలా ఇచ్చేసి ఊర్కోలేదాయన, ఆ అభ్యాసానికి చేదోడుగా అందించారు, అధోజ్ఞాపికల తాళం చెవి!

ఫుట్ నోట్ 1: నా (‘మో’)భావం: ఆనంద దుఃఖాలు రెండున్నూ శక్తి నుంచి, శక్తి వల్ల కలుగుతయ్. ఈ ప్రాణశక్తినిచ్చేది రక్తం. రక్తం పళ్లు, ఫలాల నుంచి వస్తుంది. కనుక నిమ్మ, నారింజ, బత్తాయి రక్తాన్ని వృద్ధిచేస్తూ, దుఃఖాన్ని భరించే శక్తినిస్తాయి. సగానికి కోసిన బత్తాయి ముక్క మనసు. వ్యథ నుంచి వాక్యం, వాక్యం కావ్యం.
2: ‘అపుడు మన మనఃక్లేశాల్ని కోసి పిండితే/ ముత్యాల్ని…’ అన్న stanzaకి ఫుట్ నోట్: శక్తి రెండు పద్ధతులు. ఒకటి మనసుకి, రెండు దేహానికి. అత్యధిక శక్తి వల్ల నరాల బాధ.
3. ‘ఏ పిల్లగాలికో ఓ వృద్ధవృక్షం సమూలంగా లేచి…’ అన్న stanzaకి ఫుట్ నోట్: ఒక దుఃఖాన్ని మరచి, మరొక దుఃఖాన్ని ఆహ్వానించడం. నేలలోంచి రాతిలోకి వేరూనిన దుఃఖం. అంటే యింకా పటుతరము, పుష్టివంతము అవుతుందన్న మాట.
4. ‘దిరిసెన పూవు’- కాంక్షా సుమం.
5. ‘అవి ఎండి, పొడి అయి, ఆ ధూళిలోంచి ‘ అన్న stanzaకి ఫుట్ నోట్: – ఒక కాంక్ష నుండి మరొక కాంక్షకి.

**

‘మో’! క్షమించు, 50 ఏళ్లు దాటిపోయినా ఆ సాధన మేమింకా మొదలెట్టలేదు, పోగొట్టుకున్న తాళం చెవి వెదకడం లేదు, పోగొట్టుకున్న చోటనే కాదు, కనీసం వెలుతురు ఉన్న చోట కూడా.

*

Naresh Nunna

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • పోగొట్టుకున్న చోటునే కాదు….కనీసం వెలుతురు ఉన్న చోటకుడా,….. కవిత్వం అందరిది కాదని..!ముఖ్యంగా, కవిత్వం గురించి, తెలియని వారు, దాని జోలికి పోరాదని.. మో,పుట్టినరోజు సందర్భంగా మీరు రాసిన, ఈవాక్యాలు.. మంచి ముత్యాలు.!నరేష్.!👍👌.

  • మో ఒక విభ్రమ

    విభ్రమ కూడా కవిత్వమే అని అలంకారికులు అన్నారు కనుక చేరా తిక్కగా ఉన్నా కవిత్వం ఉంటే భరిస్తామని అన్నమాట తిట్టేం కాదు.

    మో ని అనుభవించి పలవరించాలనటం ఎస్కేపిజం

    మో లా రాయలేనివాళ్ళని మిడియోక్ర్ అనటం నరేష్ నున్నా గారికే చెల్లింది.

    మో ఏ ఎమ్మెస్ నాయుడికో తప్ప ఎవరికీ గమ్యం కాలేకపోయాడు… కానీ అందరినీ- కాసేపు ప్రయాణం నిలిపేసి, దెబ్బను రుద్దుకొనేలా చేసే దారి గొప్పు.

    • బొల్లోజు బాబా గారూ,
      చాలా ఆలస్యంగా స్పందిస్తున్నందుకు సారీ.
      1. http://pustakam.net/?p=7717- నా యీ పాత వ్యాసాన్ని ఒకానొక డిఫెన్స్ గా తెచ్చుకుంటాను, మిమ్మల్ని చదవమని కోరుతూ.
      2.”so-called అధ్యయనం కవిత్వాన్ని అనుభవించే హృదయం మీద ఎండి పెచ్చులా అట్టకడుతున్న దురదృష్టకరమైన పరిస్థితికి నిలువెత్తు ఉదాహరణగా చేరా వంటి పండిత విమర్శకుడిని చెప్పుకోవచ్చు. ‘చితి- చింత కొరుకుడు పడని కారణంగా పక్కన పెట్టడమూ, మళ్లీ మరో 18 ఏళ్లకి ‘కవితానుభవం ఇవ్వగల కవితలున్నట్లూ ‘discover’ చేసి, ‘తొందర పడకుండా చదవాలనే గొప్ప నీతి నేర్చుకోవడం’ కూడా చెప్పుకోవచ్చు…” అని నేను పాతికేళ్ళ క్రితమే (1990’ల తొలి నాళ్లలో) ఉదయంలో రాసిన వ్యాసంలో రాశాను. కాబట్టి చేరాని మీ తరఫున వకాల్తాకి తెచ్చుకున్నా ప్రయోజనం ఉండదు.
      3. “మో’ ని అనుభవించి పలవరించాలనటం ఎస్కేపిజం”
      – అనుభవించి, పలవరించడమే కాదు, చదివి తరించవల్సిన కవి మో అని రోణంకి అప్పలస్వామి గారు అంతటి సాహితీవేత్తే అన్నారు. నేనెంత.
      4. మో లా రాయలేనివాళ్ళని మిడియోక్ర్ అనటం నరేష్ నున్నా గారికే చెల్లింది.
      – ఆ మాట నేనెక్కడా అన్లేదు. ప్రతి పదం అర్థం కావడమే కవిత్వానికి మౌలిక లక్షణం అన్నట్టు మాట్లాడుతూ, దానికి ఉదాహరణగా చూపించిన కవితని నేను mediocre కవిత అని మాత్రమే అన్నాను.
      ‘మో ఏ ఎమ్మెస్ నాయుడికో తప్ప ఎవరికీ గమ్యం కాలేకపోయాడు…’
      – ‘ఇక్కడ పేరడాక్స్‌ ఏమిటంటే, ‘మో’ నిర్లక్ష్యానికి గురయ్యారు గానీ, ఆయన కవిత్వాన్ని శైలీగతంగా తెలుగు సాహిత్యం సొంతం చేసుకుంది, దొంగచాటుగా.’- అని పైన మీకు ఇచ్చిన (లింకు)వ్యాసం లోనే అన్నాను (నాయుడికే కాదు మో గమ్యం). నా ఉద్దేశంలో 1980ల తర్వాత తెలుగు ఆధునిక కవుల్లో అధికశాతం ‘మో’ నుంచి సంగ్రహించి, ఆయనకి బాకీపడ్డవారే.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు