(‘రహస్తంత్రి’ కవితా సంకలనంనుంచి)
ఇక్కడంతా చీకటి
చీకటి తడితడిగా చిత్తడిగా ఉంది
చీకటి గొంతు నులిమినట్లుగా
అంచులు నుసిమినట్లుగా ఉంది.
ఉండుండి ఓ మెరుపు-
కాని నిలవదు.
నల్లని రాళ్లేవో చిట్లి
పగులిచ్చిన వెల్తురులోంచి
గర్జన.
మేఘాల రాళ్ళల్లోంచి
నీళ్లు మోగుతున్నయ్.
నా మొహం మండ!
ఎపుడన్నా చెప్పానా
తుఫానొస్తుందేమోనని
అన్ని వైపుల్నించీ వస్తున్నా రెవరెవరో
కాగడాలు పుచ్చుకొని
భవిష్యతుకి పరిచిన దారంతా
ఆ వెల్తుర్తో రగులుకొంటుంది
ఎంత గొప్ప తేజస్సు!
“ఈచ్ ఏంజెల్ యీజ్ టెరిబిల్”
సంకెళ్ళలోకి ఇరుక్కుపోయిన ప్రతి హస్తం
ఒక్కొక్క భయోత్పాద దేవత.
వర్షం ఇక విడవకుండా కురుస్తుంది.
ఆకాశం పెళ్లలుపెళ్లలుగ విరిగి పడ్తుంది.
దుఃఖ జ్వలితలై మేఘాలు వొరుసుకుని
పంజాలతో చీల్చుకొని
నిప్పుల పిడుగుల్ని రాల్చుతయ్.
పాపం నిద్రగన్నేరు చెట్లు ఇంక
ఎక్కడని తలదాచుకొంటయ్?
తుఫాను వస్తే ఏం చేయాలి?
చేతులడ్డం పెట్టీ
కనురెప్పలు వాల్చీ
బొటనవేళ్లు నేలకు గుచ్చీ
గొడుగుల కుచ్చీలు విప్పీ
చాటలతో చెరుగులతో మొహాలు దాచుకొనీ
బెంబేలు పడి ఒకళ్లనొకళ్లు కావలించుకునీ
కుష్ఠు చేతులెత్తి దణ్ణాలు పెట్టీ
ఏం చేసీ లాభం లేదు.
చీపురు పుల్లల్తో కాలవలు తీసి
ఎంతని
ఈ క్రీస్తు రక్త సిక్త ప్రవాహాన్ని
విముఖ సముద్రాలలోకి మళ్లిస్తారు?
అంత మంట తర్వాత అంత ఎరుపు తర్వాత
ఈ విద్యుత్ సౌధాల మీద అన్ని పిడుగులు పడినాక
ఎంత తెలుపో ఎన్ని తెల్ల కల్వపూలో ఎంత వెన్నెలో.
తుఫాను తర్వాత
ఒక చిర్నగవు నీ
పై పెదవిలా వణుకుతుంది.
కొయ్య తలలో చిత్రించిన
నియంత జలవర్ణాల నయనాలు కూడ
చెమ్మగిలతయ్
దయగా–
ఎన్నాళ్ళకిట్లా అందరికీ ప్రేమ- అని
అపూర్వంగా మెరుస్తయ్
రక్తరేఖల తైల వర్ణంలో.
దూరాన పర్వతాల్లో మన కలలు ప్రతిధ్వనిస్తోన్నయ్.
అర్జునా ఫల్గుణా అన్నా ఫలం లేదు.
ఆ స్వరం నినదిస్తోన్నది.
క్షణాలు యుగాలు ప్రకంపించి
భూమిలోకి కూరుకుపోతున్నయ్
పుట్టుగుడ్డి కళ్లమీద దయతో ఉమ్మి
దృష్టి ప్రసాదించేందుకు వందలాది జీసస్‌లు
వస్తోన్నారు
తుఫానులో సర్వం పరిత్యజించి రక్తమలిన వస్త్రాల్లో
వేలాది కృధ్ధ బుద్ధులు వస్తోన్నారు.
భీభత్స భయానక రౌద్ర పీడిత రాత్రి చివర
వేకువ జామున శాంత కారుణ్యాలు
సన్నజాజి మొగ్గల మీద చివరి చినుకులు.
ఈ బొమ్మ కిటికీ రెక్కలు
ఎన్ని మూసినా ఆగదీ ప్రచండ వీచిక
చెట్లకు ఉరిదీసిన హృదయాలు
అద్దాల కిటికీలపై హత్యల వేలి ముద్రలు
పింగాణీ ప్రార్థనల గుణ గొణలు
తుఫాను తర్వాత ప్రశాంతిలో ఉండవ్.
తల వొంచితే నువ్వు
గుర్తుగా మత్రం
ఆకసాన తీగలు సాగిన విద్యుల్లత ఒక్కటి
శాశ్వతంగా నిల్చిపోతుంది
గుర్తుగా.
*
Add comment