‘మో’ కవిత్వం: రేణువులో విశ్వ అనంత చైతన్యపు inscape

‘మో’ కవిత్వమైతే అద్దంలో అక్షరాల్లాంటిది. చదవడం వరకు చేయగలిగితే సరిపోదు, మరికొంత ధ్యాస పెట్టాలి.

(ఆగస్టు ౩ : ప్రసిద్ధ కవి, అనువాదకులు వేగుంట మోహన ప్రసాద్ కన్ను మూసిన రోజు. బెజవాడలో సాహితీ మిత్రులు మో ని తలచుకుంటున్న సందర్భంగా )

“... నేను రాసే తెలుగు అందరు రాసే తెలుగులాంటిది కాదు. అది కవిత్వమైనా వచనమైనా. నాకసలు ఈ రెండుభాషల్లో ఏదీ పూర్తిగా రాదు. భావానికి శబ్దాన్ని అల్లుతాను ఊరికినే. కవిత్వభాష నాకొక మాయలాంతరులాంటిది. ఆ మాయలాంతరు తన వెల్తురు నరాల్ని తెరమీద అల్లుతుంది. ఈ మాట నాది కాదు నిజానికి. ఎక్కడ్నుంచి కొట్టేశానో చెప్పుకోండి!

“సాధారణ కవులు మహాకవుల్ని అనుకరిస్తారు. అసాధారణ కవులు మహాకవుల్నుంచి తస్కరిస్తారు. నేను సాధారణ కవినీ కాను, మహాకవినీ కాను, అసాధారణ కవిని.”

– ‘మో’ (వేగుంట మోహనప్రసాద్ గారు) 14 జూలై, 2011న తనికెళ్ల భరణి సాహితీ పురస్కారాన్ని అందుకున్న సందర్భంగా చేసిన ప్రసంగ పాఠంలో కొన్ని వాక్యాలవి. మా సండే ఇండియన్ (ఎడిటర్ గా పనిచేసేవాడ్ని అప్పుడు) ఆఫీసులో ఆ ప్రసంగపాఠాన్ని నేనే కంపోజ్ చేశాను. ‘అసాధారణ కవిని…’ అని ఆయన తనని తక్కువచేసుకోవడం నచ్చలేదు నాకు. ఆ మాట అంటే, నవ్వేస్తూ, ‘మాయలాంతరు తన వెల్తురు నరాల్ని తెరమీద అల్లుతుంది…’ ఇది ఎవరి భావమో చెప్పమన్నారు.

‘… as if a magic lantern threw the nerves in patterns on a screen- ఎలియట్ కవిత The Love Song of J. Alfred Prufrock అని చెబితే, ‘చూశావా మరి ఎలా దొంగిలించానో’ అన్నారు.

ఏ కవితా పంక్తులు తనని ఉద్దీపించాయో, ఏ దృశ్యం తనని దొంగిలించిందో, ఏ రచన తనని వెలిగించిందో… 50 ఏళ్ల తన సాహిత్య ప్రస్థానంలో మో ఎక్కడా దాచలేదు. కీర్తి కోసం సృజనని కొంకర్లు తిప్పకపోవడంలో మాత్రమే ‘మో’ విశిష్టత లేదు, plagiarism అనే నిందకు జడిసి దాపరికాన్ని అలవర్చుకోని ఆయన ఎనలేని నిజాయితీలో ఉంది. ‘సాధారణ కవులు మహాకవుల్ని అనుకరిస్తారు, అసాధారణ కవులు దొంగిలిస్తారు..’  అన్న చమత్కారం కూడా ఎలియట్ కవితలోదే. “Immature poets imitate; mature poets steal.” అని ఎలియట్ The Sacred Wood లో అన్న వాక్యాన్ని ఒక allusionలా వాడారు ‘మో’.

తనికెళ్ల భరణి సాహితీ పురస్కార సందర్భంగా చేసిన ప్రసంగాన్నే మో చిట్టచివరి రచనగా (మరో 20 రోజుల్లో ఆగష్టు 3, 2011న మో కన్నుమూశారు) పేర్కొంటూ, ‘అసాధారణ కవిని…’ అన్న శీర్షికతో మో గారికి నివాళిగా తెచ్చిన తొలి సంపుటి – న’మో’ లో ప్రచురించారు దాని సంపాదకులు ఖాదర్, విశ్వేశ్వరరావు గార్లు. ఆధునిక లక్షణాలలో ఒకటైనconfessional element తెలుగు కవిత్వం, సాహిత్యంలోకి బలంగా తెచ్చిన సాహితీవేత్త ‘మో’. నేరాంగీకారంలో భాగంగా స్వీయనింద కూడా చేసుకున్నారాయన చాలా సార్లు. తన మీద వచ్చిన అధిక్షేపణల చిట్టాని తానే enlist చేయడానికి కూడా వెరవలేదు (రహస్తంత్రి ముందుమాట). నాకసలు ఈ రెండుభాషల్లో ఏదీ పూర్తిగా రాదని, తానొక తిరోగమనవాదినని, నిరాశావహుడ్నని తనని తాను కుదించుకున్నంత మాత్రాన అందులో మనం గొంతుకలుపుతామా? ఆ మాటలే ఖాయం చేసేస్తామా? మహాకవులుగా చలామణి అవుతున్న వారంతా మహాకవులేమీ కారు. అలానే, తాను అసాధారణ కవిని అని స్వీయనింద చేసుకున్నంత  మాత్రాన ‘మో’ plagiarist అయిపోడు. ఆమరణాంతమే కాదు, ఆ తర్వాతకూడా అపార్థానికి గురికావడమే ఆ అఘోరుడి ప్రారబ్ధమేమో అనిపిస్తుంది, ఆయన చివరి రచనకి ‘అసాధారణ కవిని ‘ అని శీర్షిక నిర్ణయించి అవమానించడం చూశాక.

**           **           **

నిన్నలలో నిలిచిపోని కవీ…

బదుల్లేని బేతాళ ప్రశ్నల్లో పొంచిన దుర్మరణాన్ని కూడా ప్రేమించిన సాహసీ…

పేదరాసి పెద్దమ్మ ‘అనగనగా…’ కథల్లాంటి ప్రాచ్య జీవితాల్లో పడమటి ప్రతీకలు పొదిగిన అసంబద్ధుడా…

కోరి అభ్యుదయ అంధత్వాన్ని వలచిన ఓ తెలుగు Tirasius!

పుప్పొడి రేణువుల్లో అనేకానేక పూలవనాల సారం, జల ప్రళయంలో ఒకానొక వానచినుకు మూలం … ఇంకా… ఇంకా విశ్వానంత చైతన్యపు inscape ని ఇసుక రేణువులోనో దర్శించడమే నీ కవిసమయాలు. రాత్రి-పగలు, ఇంట-బయట, నిద్ర-మెలకువ వంటి తేడాల్లేవు; కవిత్వం-జీవితం నీకు ద్వంద్వాలు కావు.
**           **           **

‘మో’ కవిత్వ విషయంలో ఒక ధర్మసూక్ష్మం ఉంది. ‘క్షీణదశాబ్దపు యుగకవులు చెప్పారు’, ‘రొమాంటిస్టులు బోధించారు అన్నారే’ గాని, నేను చెవొగ్గాను, తలకెక్కించుకున్నాను అనలేదు ‘మో’. ఆ పెడచెవే ఇక్కడ మెలిక. కొత్త కొత్త విశ్లేషకులు ఆధునికోత్తర బాకాలతో కూడా ఏదేదో అరిచేశారు; కానీ ఆయన శ్రద్ధగా విన్నది మాత్రం అమ్మజోలలాంటి పురంధరదాసు సంకీర్తనం, ‘కంటిలోన నలుపు కానబోయేరా…’ అన్న అన్నమయ్య పదం, ‘తెరతీయగ రాదా’ అన్న త్యాగయ్య విన్నపం. తనమీద, తన కవిత్వం మీద ఉన్న నిందలు, నిష్ఠూరాల లిస్టు తానే ఇచ్చుకున్నారాయన ఎన్నో కన్‌ఫెషనల్‌ ‌సందర్భాల్లో. కన్‌ఫెషన్‌ అం‌టే గోడకు ఏదో ఒకవైపే కాసే ఎండ;  దానికి శీతలోష్ణాల భేదం, తెలుపు నలుపుల తారతమ్యం, ప్రాక్పశ్చిమాల వ్యత్యాసం ఉన్నాయి.

పడమటి  కవుల  ఒప్పుకోళ్లు- తలపోతలు- పశ్చాత్తాపాల కాక్‌టెయిళ్లు, నిజాయితీ నిషా తెచ్చే ఎక్కిళ్లు, నిన్నామొన్నటి ఆధునికతతో అంటకాగిన లిటరల్‌ ‌మొత్తుకోళ్లు.

కానీ, ‘మో’ వెళ్లబోసుకున్నదంతా అలా తీసివేత కాదు, కూడిక! ‘క్రూరకర్మముల నేరక చేసితి…’ తరహా నేరాంగీకారం! పైకి వైయక్తికంలా కనిపిస్తూనే, సొంత సొదలా అనిపిస్తూనే అభిశప్తులందరినీ కలిపి సారూప్యాల ముడివేయడం, బాధాతప్తాంతరంగాల్ని ఏకం చేయడం, విశ్వాత్మకి వినయంగా స్వాధీనపడటమే ‘మో’ నివేదనం!

ఆ వేదన నాది… నీది… భారతీయతలా అనాది. పైకి చూడ్డానికి అక్కడ పడమరన, ఇక్కడ తూర్పున కూడా దిసమొలలే-

అయితే, అది అనాచ్ఛాదితం…

ఇది దిగంబరత్వం! ఈ తేడా గ్రహించలేని తెలుగు సాహితీలోకం ‘మో’ని అపార్థాలు, అసత్యాల కింద కప్పేసింది.

కవిత్వమే బోర్లేసిన భాష అంటారు. ‘మో’ కవిత్వమైతే అద్దంలో అక్షరాల్లాంటిది. చదవడం వరకు చేయగలిగితే సరిపోదు, మరికొంత ధ్యాస పెట్టాలి. ఆయన తప్పుకున్నా, అద్దం మిగుల్చుకున్న మరికొన్ని అక్షరాల్ని కూడబలుక్కొని చదువుకోవాలి. అందుకే లోపలి ఉద్రేకాల్ని ఉసిగొలిపే నినాద కవిత్వాలకు ఉండే పఠనాల మెహర్బానీ- ‘మో’ కవిత్వానికి లేదు. నోటితో ‘అవునం’టూ సైగతో ‘కాదనే’ అసంబద్ధ దృశ్యశ్రవణ మిశ్రమాన్ని నలుపు తెలుపుల అధివాస్తవిక చిత్రంలా అక్షరాలతో గీశారు ‘మో’. ఆయన ‘మృత్యుప్రేమ’- ‘మరణేచ్ఛ’కి పర్యాయం కాదు; ఆయన ‘విషాదం’- ‘సచ్చిదానందా’నికి అన్వయార్థం. జీవననిరాకరణలా కనిపించే వాక్యం విరామ చిహ్నాల్లేని కావ్యంలా దీర్ఘమై వినిపిస్తుంది. తిప్పేదిశే మార్పుగానీ, వేయడానికి, తీయడానికీ ఒకే తాళంచెవి- అదీ పోగొట్టుకున్నాం… వెతకాలి… వెల్తురున్న చోట కాదు, మసిలాంతర్లతోనైనా అది పోయిన చోటే వెతుక్కోవాలి.

*

 

Naresh Nunna

5 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మనది కాక పోయినా గత రాజుల కోటకు వెళ్లి ఎదో వెతుక్కున్నట్టు మో గారి రచనల్లో వెతుక్కునే నాలాంటి వారికి వెన్ను తట్టినట్టు ఉందండి ఈ వ్యాసం . ధన్యవాదములు

  • ఇంతకీ మన మో క్లాసికల్ ఆధునికుడేనా?

    -వాసు-

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు