మనిషి తన చుట్టూ వున్న దేన్నీ మార్చలేకపోతున్నాడు. జరుగుతున్న విధ్వంసాల్ని ఆపలేకపోతున్నాడు. తానూ విధ్వంసంలో భాగమై పోతున్నాడు. విధ్వంసాన్ని ధ్వంసం చేసే శక్తి మనిషికి వుందా? విధ్వంసమే మనిషికి కావాల్సింది. తన విలాసాలకూ, భోగాలకూ విధ్వంసమే వనరు. అలాంటప్పుడు విధ్వంసాన్ని తిరస్కరించే సాహసం మనిషి ఎన్నటికైనా చేయగలడా?
కవి శివారెడ్డి ‘ధ్వంసం’ కవితలో ” దేన్నీ ధ్వంసం చేయకుండా దేన్ని నిర్మిస్తావు?/ధ్వంసం చేయతగిందేదీ లేకపోతే నీకీ లోకంలో/నువ్వు తప్పకుండా ధ్వంసం చేయతగిన వ్యక్తివి” (‘నేత్రధనుస్సు’ సంపుటి నుండి) అంటాడు.
నిజంగానే యిప్పుడు మనిషికి ధ్వంసం చేయతగిందేదీ కనిపించట్లేదు. కనిపించకుండా పొరలు కమ్ముకున్న చూపులైనాయి. ఇక తనను తాను ధ్వంసం చేసుకోవాల్సిందే! మరి ఎలా ధ్వంసం చేసుకోవాలి? ఇది ఏ రకమైన ధ్వంసం? సరిగ్గా ఇక్కడే కవి “నాగిళ్ళ రమేష్ ” కవితకు అంకురార్పణ జరిగి వుంటుంది.
పూతలగడ్డి
~
తనువొక కొయ్యకాలు మడి
నెర్రెలు దెర్సిన న్యాల
తరిజూసి తడిగట్టుకోవాలె
ఆంకారపు చిమ్మనజీకట్ల
బొండెగెలమంటి మునిగిన నేనును
బొందవెట్టుకొని
మొలాటుగ ఇగురువెట్టాలె
ఏ పొరకు, ఆ పొర రాలిపోయేటట్టుగ
పురుగుబూసి కంట్లె ఎల్గును దీసి
కంటిచూపును తేటగ కడుక్కోవాలె
మడికి నీళ్ళేసి
నాల్గుమూలల కలెవారిచ్చినట్టు
బతుకు మడికి
పూతల గడ్డి సుంగారంనద్దాలె
వాగుతడితోటి
ఉసికె మేరువల తలకాయవెట్టి
గుండెకోనేటి మెట్ల దూపదీర్సుకోవాలె
బీడుభూముల దూపనుపాడి
ఎన్నటికీ సావని ఒర్రెనై పరుగందుకోవాలె
అడివి అగ్గిముఖంతోటి
అన్యాలంకు మంటవెట్టి
నియ్యతి పసరును నిలువెల్ల రాసుకోవాలె
వడ్లపిట్ట ఇగురంతోటి
ఆత్మగూడును మల్సుకొని
సలువరాతి మేడను కుప్పగూల్సుకోవాలె
గుడ్లు పొదిగె శీతువపిట్ట
కడుపుకింద
పచ్చని పొత్తిళ్ళ కంచెను పరువాలె
పసుల గిట్టెల కింద
పాయిరపు మన్నును
ఎవడు దోసుకోకుంట
ముడుపు గట్టాలె
బుడ్డగాశి పండ్ల తీపిని
పుట్టి పెరుగనున్న లోకపు మూతికి రాయాలె
బాయిగడ్డపొన్న
బండారు పిట్ట గూడల్లుకుంటానికి
ఒక పచ్చని కొమ్మనియ్యాలె
మొలుకగానో, చెట్టుగానో
భూదేవర సాట్లవడి
సెమటచెట్లకు
మట్టిగంధంను రాయాలె
*
సాధారణంగా శీర్షిక చూస్తే కవితా వస్తువు ఏంటో అంచనావేసుకుంటాం. ‘ప్రకృతిలోకి తిరిగి పోదాం’ అన్న రూసో మాటల్ని పదేపదే తడుముకుంటాం.
ఎత్తుగడలో తనువొక కొయ్యకాలు మడి, నెర్రెలు దెర్సిన న్యాల అంటూ దాన్ని తరిజూసి తడిగట్టుకోవాలె అని జెప్తాండు. మనిషి గురించి మాట్లాడుతాండు. ఆగమైపోతున్న మనిషి ‘వినిర్మాణం’ గురించి సొద పెడుతాండు. వినిర్మాణం ఎట్లా సాధ్యమైతదో కొనసాగింపుగా ముందుకెళ్తాండు. అసలు మనిషెట్ల వున్నడు? అహంకారమనే చీకట్లో మగ్గిపోతున్నడు. వానికి వెలుతురును పరిచయం చేయాలి. ఎట్ల? అందుకే కవి ‘బొండిగెలమంటి మునిగిన నేనును బొందవెట్టుకుని మొలాటుగ ఇగురువెట్టాలె’ అంటాండు. అంటే లోపలి అహాన్ని ధ్వంసం చేస్తే మనిషి వినిర్మాణ ప్రక్రియ మొదలవుతుంది.
సిగ్మండ్ ఫ్రాయిడ్ తన మనోవిశ్లేషణా సిద్ధాంతం (Psycho analytic theory) లో అహం(ego) వాస్తవ సూత్రం(reality priciple)పై ఆధారపడుతుందని చెబుతాడు. అహం అనేది ఇద్ కి సూపర్ ఇగోకి వంతెనలాంటిది. అహం మనిషిని తన కోణంలోంచే ఆలోచించమని చెబుతుంది. ఇతరుల అభిప్రాయాలతో సంబంధం లేదు. తనకు సరియైందని అనిపిస్తే చాలు అహం దాన్ని అనుసరించరించమని చెబుతుంది. ఒకవేళ తాను నమ్మింది ప్రతికూలమైన ఫలితాలనిస్తే వ్యాకులత (anxiety) పెరిగి అచేతనం(unconscious)లోకి నెట్టబడతాయి. దీన్ని అచేతన ప్రేరణ సిద్ధాంతం(unconscious defence mechanism) గా ఫ్రాయిడ్ ప్రతిపాదించాడు. ఇక్కడ మనం అచేతనంలోకి నెట్టబడే ప్రతికూల అంశాల్ని ధ్వంసం చేయాల్సి వుంటుంది. మనిషి అహం (ego centric) అనేది పియాజే తన సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం (Piaget’s theory of cognitive development)లో చెప్పినట్టు పూర్వప్రచాలక దశ (Pre operational stage – 2 to 7 yrs) లో రూపుదిద్దుకుంటుంది.
అహంపై నియంత్రణ సాధించినపుడు ‘చూపును’ శుభ్రపరుచుకోవడం, బతుకును కళాత్మకంగా తీర్చిదిద్దుకోవడం, నిర్మలమైన మనసును నిలుపుకోవడం, స్వచ్ఛమైన, ప్రాణహితమైన ప్రవాహంగా మారడం, ప్రకృతి గుణగణాల్ని రక్తనిష్టం చేసుకోవడం, కృత్రిమత్వాన్ని వదిలించుకొని సహజత్వాన్ని పులుముకుని పునీతుడవడం జరుగుతుంది. ఇక్కడ అహం (ego) super ego వైపుకు పయనిస్తుంది. ఇది విలువలపై ఆధారపడి వుంటుంది. ఈ ప్రయాణాన్ని కవిత్వమయం చేసి చెప్పటానికి సహజమైన ప్రతీకల్ని ఆశ్రయించడం చూడొచ్చు. అయితే ముగింపుకు వచ్చినట్టే అనిపించినా కవి ముగింపు తర్వాతి దృశ్యాన్ని చిత్రికపట్టడం చూస్తే కవితలోని ‘మలుపు’ అర్ధమవుతుంది. మలుపు తీసుకునేటపుడు కవితలోని అంతర్గత సహసంబంధాన్ని పాఠకుడు అర్ధం చేసుకోలేకపోతే భావప్రసారానికి ఆటంకం కలుగుతుంది.
“ఒక్క వస్తువును గురించి మొదలెట్టిన తర్వాత, ఎక్కడో ఒకచోట కవిత మలుపు తిరిగి, అప్రయత్నంగానే మరో వస్తువు కవితలో ప్రధానమై పోవచ్చు. కవితారచన కొనసాగే దశలో మొదట తాననుకున్న వస్తువు పోలికగానో, ప్రతీకగానో మారి మరో అంశం ప్రాధాన్యం పొందవచ్చు” (వచనకవిత – ఆలంకారికత/పెన్నా శివరామకృష్ణ)
తనను తాను ధ్వంసం చేసుకున్న వ్యక్తి, తన లోపలి దుర్గుణాల్ని వదిలించుకున్న మనిషిప్పుడు ఏం చేయాలి? ఏ దిశగా కొనసాగాలి? మొ.న ప్రశ్నలు వేసుకుంటే తీసుకున్న మలుపేంటో తెలుస్తుంది. మలుపు తర్వాత మనిషి అసమతుల్య ప్రకృతిని కాపాడే బృహత్తర బాధ్యతను తలకెత్తుకుంటాడు. ప్రకృతి వినాశనానికి కారణమవుతున్న వాటిని కనిపెట్టి, మట్టుపెట్టే ప్రయత్నం చేస్తాడు. మనిషి కలగన్న పచ్చదనం నిజమవుతుంది. గుట్టల విధ్వంసం, ఓపెన్ కాస్ట్ మైనింగ్ వంటివి నిలిచిపోతాయి. అంతరించిపోయిన జాతులు పురుడుపోసుకుంటాయి. మనిషితో సమానంగా పిట్టబతుకును చూస్తాం. చివరికి తానే ఒక విత్తనమై రూపాంతరం చెంది ప్రకృతిలో కలిసిపోతాడు. మనిషి, ప్రకృతి వేర్వేరు కాదిప్పుడు. అంతా ప్రకృతిమయమే. ఇప్పుడు ‘పూతలగడ్డి’ సౌందర్యం జీవజాతుల బతుకు మడికి అదనపు అలంకారమై శోభిస్తుంది.
**
కవిత ఆసాంతం ఆత్మవిమర్శగానూ, సెకండ్ పర్సన్ ను ఊహించుకొని జీవన తాత్వికతాసారాన్ని బోధిస్తున్నట్టుగానూ అనిపిస్తుంది. ప్రకృతితో మనిషి సహజీవనాన్ని గుర్తుచేస్తూ, సమతుల్యాన్ని పాటిస్తున్నట్టు అనిపిస్తుంది.
నాగిళ్ల రమేష్ “ఉద్ధరాశి పూలచెట్టు” కవిత్వ సంపుటితో పల్లె పలుకుబడులను, నుడికారాన్ని అందిపుచ్చుకున్న దేశీయ కవి. సౌందర్యవంతం(ఈస్తటిక్ )గా చెప్పడం ఇతని కవిత్వానికి అదనపు ఆకర్షణ. తన సాహితీమాగాణంలో మరింత తడినింపుకుని సాధ్యమైనన్ని మైలురాళ్ళు దాటాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కవికి శుభాకాంక్షలు.
*
పూతలగడ్డి కవితను మనోవైఙ్ఞానిక శాస్త్రం ఆధారంగ విశ్లేషించడం కొత్తగా వుంది అన్నా.మీ విమర్శవ్యాసాలలో ఇది భిన్నమైనది.శివారెడ్డి సార్ సార్ వాక్యాలతో ప్రారంభించడం ఔచిత్యంగ వుంది.ఉద్దరాశిపూలకు శుభాకాంక్షలు…
వివరంగా విశ్లేషించారు బండారి రాజ్ కుమార్ గారు. కవికి శుభాకాంక్షలు.
పూతలగడ్డి కవితను తీసుకొని వాటి మూలలను లోతుగా విశ్లేషణ చెయ్యడం చాలా బాగుంది అన్నా..
పూతలగడ్డి కవిత రాసిన పల్లెవాక్యం నాగిళ్ళ రమేష్ అన్నకి విశ్లేషణ చేసిన బండారు రాజ్ కుమార్ అన్నకి శుభాకాంక్షలు💐💐