మొరసునాడు అడవిపల్లె అందం ‘యర్రావు దూడ’

నిలిచి కురిసిన వాన వెలిసిన తర్వాత, చిక్కటి అడవిలో కొమ్మల మధ్యనుంచి దూరిన కిరణాలు నేలను తాకిన తావులో, నాని, మట్టిలో కలిసిపోతూ రాలిన ఆకుల నుంచి వచ్చే గాఢ వగరు వాసన ఏదో హృదయాన్ని తేలిక పరచినట్లు.. సరిగ్గా అటుంటిదే ఏదో అనుభూతి కలిగింది కె.వి. మేఘనాథ్‌రెడ్డి రాసిన ‘యర్రావు దూడ’’ కథను చదివినపుడు. పట్టణం ఇంకా చొరబడని అచ్చమైన పల్లె వాసన ఈ కథ నుంచి అందుతుంది. పాలంటే ప్యాకెట్‌ మాత్రమే అనుకునే తరానికి అవసరమైన కథ ఇది.

పాటలు పాడుకుంటూ పనికి పాలుమారుతున్నాడని, చేటలో బియ్యం చెరుగుతూ, కొడుకు కేశవుడిని పద్మమ్మ పెట్టే శాపనార్థాలతో కథ మొదలవుతుంది. ఈ దృశ్యం బాల్య జ్ఞాపకాల్లోకి లాక్కుపోతుంది. వర్తమానంలో ఇవి అదృశ్యాలు కాదని ‘యర్రావు దూడ’ కథ నిరూపించడం ఒక ఊరట. నగరాలు, పట్టణాలను ముంచెత్తి,   మానవ జీవనచిత్రాన్ని మార్చేసిన అనేకానేకం అంటని పల్లెలు ఇప్పటికీ మిగిలే ఉన్నాయన్న వాస్తవాన్ని మేఘనాథ్‌రెడ్డి కథగట్టి చెప్పారు. చెట్టూ పుట్టా, కొండా గుట్టా, పురుగూ పశువూ తో మనిషి అనుబంధం మాసిపోలేదని అర్థం అవుతుంది కథ పూర్తయ్యేసరికి.

రచయితది పలమనేరు సమీపంలో ఏనుగులు తిరిగే అడవి అంచునుండే ఒక పల్లె. ఆ పల్లె జీవితాన్ని యధాతధంగా అతను కథకెక్కించే ప్రయత్నం చేయడంవల్ల బహుశా ‘యర్రావు దూడ’ నన్ను బాగా హత్తుకుంది.  అడివికి మేతకి వెళ్లిన పశువులు పది రోజులు అయినా తిరిగి ఇల్లు చేరలేదనే ఆందోళన పద్మమ్మది. పాటల మాలోకం అయిన కొడుకు పట్టించుకోవడం లేదన్న కోపం ఆమెది. ఎదిగే బిడ్డ మాట పడతాడా..‘అసుల్లో నన్ని కంటివా కక్కితివా? నీయమ్మ ముండనాయాలి ముండ’ అంటూ అమ్మ మీద విరుచుకుపడి, పాట ఆపి లేచి, టువ్వాల్ని విధిలించి పైనేసుకుని వీధిలోకి వెళ్లిపోయాడు కేశవుడు.

గొడ్లు తిరిగి రాలేదన్న బాధే గానీ, కొడుకు మీద తల్లికేం కోపం! ‘తెల్లార్తో గూడా సరిగ్గా బువ్వ తిన్నోడు గాదు. నా బిడ్డే యాడున్న బిన్నిగా ఇంటికొచ్చేయాల బగమంతుడా’ అని మధ్యాహ్నం గడపలో కూర్చుని కొడుకు కోసం వీధిలోకి చూస్తూ దేవుడికి మొరపెట్టుకుంటోంది. సరిగ్గా అప్పుడే, ‘చెవుల్ని విదిల్చుకంటూ, తోక ఊపుకుంటూ, అడుగులో అడుగేస్తూ ఇంటి ముందుకు వచ్చి అంబా అని కూతేసింది యర్రావు’. అచ్చంగా కొడుకు తనను ‘అమ్మా’ అని పిలిచినట్టే వినిపించింది ఆమెకి. ఇంక పద్మమ్మని పట్టనలవి అవుతుందా. ‘యర్రక్కా.. పద్దినాలు అయినాదే ఇంటిదోవ కనపల్లేదా?’ అని నిష్టూరమాడింది. ‘తెల్లోడు, బొల్లిగాడు, మిగతావి యాడుండాయే? వొగితే అవిటిని వొదిలి వచ్చేసినావు’ అని నిందించింది. ఇంటికి వచ్చిన కేశవుడు యర్రావుని పట్టుకుని మురిసిపోతుంటే, ‘నీకి చెప్పలేదు గాని గుండెల్లో జొరం కాసింది. రాతిర్లో నిద్దర గూడా పట్టేల్దు. శ్యానా దిగులు పడిపోయినాను కేశవా’ అని పంచుకుంది. వెనకే వస్తాయనుకున్న మిగతా గొడ్లు సందేళ అయినా రానేలేదు. ఇంటికి వచ్చిన ఆవును తీరుగా పరికించి చూసిన అమ్మా కొడుకులు, ‘యర్రక్క యాడ్నో యీనేసి వొచ్చిండాద’ని కనిపెట్టారు. మరి దూడ ఏమైనట్లు? అంత పెద్ద అడవిలో కుక్కలో, నక్కలలో పీక్కు తిన్నాయేమో అనే ఊహ వాళ్లని వణికించింది. దూడని వెతికే దానికి యర్రక్కతో కలిసి అడవికి బయలు దేరాడు కేశవుడు.  చీకటి వాలే వేళ, గొడ్లనీ, దూడని వెతికేందుకు అడవిలోకి  వెళ్తున్న కేశవుడిని చూసి బొడెన్న హెచ్చరించాడు, ‘మబ్బులో గబ్బు సేద్యంలా రాతిర్లో యీ యతకటం దేనికి?’ అని.

మబ్బులు విడిపోయి, వెన్నెల కాస్తున్న అడవిలో యర్రక్క దారి చూపుతుండగా వెనుక అనుసరిస్తున్నాడు కేశవుడు. స్యాలమాను వంక దగ్గరవుతుండగా చిక్కగా అల్లుకున్న పొదల్లోంచి వస్తున్న చప్పుళ్లు కలవరపెడుతున్నాయి. నలబల్చి కొమ్మలు ఒకదానికొకటి రాసుకుని చేస్తున్న విచిత్రమైన శబ్దాలే అని నిమ్మళపడ్డాడు.  ‘పడమట దిక్కున వీర గంభీరంగా దర్శనమిచ్చే కలుంకూరి గుట్ట ఆనవాళ్లను’ కూడా మబ్బులు తుడిచేసిన ఆ రాత్రి, అడవిలో నడక సాగుతోంది. ‘ఆకాశమంత విశాలమైన దామరాకుల బండ జాడ కనిపించడం లేదు’.  పొదలకుంట దగ్గరకు వెళ్లగానే యర్రావు దిక్కులు పిక్కటిల్లేలా అరిచింది.  బొల్లోడు బదులు కూతేసింది. కూత వినిపించిన దిక్కుకు యర్రావు నడక వేగం పెంచింది. ‘కేశవుడి కళ్లు దూడ కోసం వెతుకుతున్నాయి’. యర్రావు పొదలోకి దూరింది. పడుతూ లేస్తూ దూడ తల్లిని చేరింది. ఆవుల మంద పొద చుట్టూ పహారాగా నిలబడి ఉంది.  తూరుపు పొద్దు వెలుగులో పరిసరాలను చూసిన కేశవుడు నివ్వెరపోయాడు.

దూడ ఉన్న పొద చుట్టూ చెట్లకొమ్మలు విరిగి ఉన్నాయి. చిన్న చెట్లు వేర్లతో సహా ఊడి పడి ఉన్నాయి. తెల్లావు కొమ్ములకు రక్తం మరకలు అంటి ఉన్నాయి.

దూడ జాడ చెప్పడానికి యర్రావు ఇల్లు చేరిన సమయంలో నక్కో, తోడేలో దాడి చేసింది. ఆవులు గుంపుగా చేరి దాన్ని చీల్చి చెండాడాయి.

ఇదే కథ.

ఆవులన్నీ కలిసి లేగదూడను ఎలా కాపాడుకున్నాయో కథలో  రచయిత వివరించడు. చివరి వాక్యం చదవగానే పాఠకులే దానికి దృశ్యం కట్టుకుంటారు. నిజానికి ఇది ఒక చిన్న కథ. కానీ, పల్లె నుంచి అడవిలోకి మనల్ని నడిపిస్తుంది. అడవి వర్ణన, రచయితకు అడవితో ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తుంది. అక్కడి పరిసరాలన్నింటినీ రచయిత కథలో రికార్డు చేసిన తీరు నాకు చాలా నచ్చింది. విస్తృత సాహిత్య అధ్యయనం చేసే రచయిత నైపుణ్యం ఏదీ ఈ కథలో కనిపించదు. అది లోపంగానూ అనిపించదు.

తన అనుభవాన్ని యధాతధంగా అమాయకంగా రాసుకుంటూ వెళ్లిన తీరే కథకు, వానకు మగ్గిన మట్టి వాసనను తీసుకువచ్చింది. చిత్తూరు జిల్లా పడమటి ప్రాంతపు మాటలూ, యాసా కథకు అదనపు సౌందర్యాన్నిచ్చాయి. ఇవి యండపల్లి భారతి కథలను గుర్తుకు తెస్తాయి.  రాళ్లూ గుట్టలతో నిండిన మొరసునాడు ప్రాంతాన్ని కథా సాహిత్యంలోకి తీసుకువస్తున్న   రచయితల్లో కొత్తగా చేరిన పేరు కె.వి. మేఘనాథ్‌రెడ్డి.  తెలుగు కథకు మరిన్ని మంచి కథలు అందిస్తారనే నమ్మకాన్ని ‘యర్రావు దూడ’ కథ కలిగిస్తోంది. రెండు మూడేళ్లుగానే కథలు రాస్తున్న మేఘనాథ్‌రెడ్డి రాసిన 12 కథలతో ‘కలుంకూరి గుట్ట’ అనే సంపుటి ఇటీవలే వెలువడింది. ఇందులోని కథల్లో కొన్ని వెబ్‌ పత్రికల్లో వచ్చినా, ఎక్కువ కథలు నేరుగా సంపుటిలో అచ్చయినవే. ‘యర్రావు దూడ’ కూడా వాటిలో ఒకటి.

*

ఆర్‌.ఎం. ఉమామహేశ్వరరావు

19 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • చాలా బాగా సమీక్ష చేసారు మీరు ఉమామహేశ్వరరావు గారూ…
    మేఘనాథ్ రెడ్డి రాసిన కథ ఆత్మను సరిగ్గా పట్టుకొని విశ్లేషించారు. మీరు విశ్లేషించిన యర్రావు దూడ కథ చాలా బాగుంది. దానితో పాటుగా మిగతా పదకొండు కథలు కూడా చదవదగ్గవే.
    కలుంకూరి గుట్ట కథలు చదవగానే ఒక అద్భుతమైన అనుభూతిని మనకు మిగిలిస్తుంది.
    రచయితకూ, మీకూ ఇరువురికీ అభినందనలు…

  • కలుంకూరి గుట్ట కతలపై మంచి పరిచయం సర్…యర్రావు దూడ కథ అద్భుతమైన కథ.
    మిత్రుడు మేఘనాధ్ గారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు💐

  • కథ కథనం మీ పరిచయం విశ్లేషణ అన్నీ బావున్నాయి అన్నా..రచయితకు అభినందనలు.మీకు ధన్యవాదాలు.
    మంచి శీర్షిక.
    వీలైతే సంపాదకులు ఈ శీర్షిక కింద ప్రచురితం అయ్యే వ్యాసంతో పాటు సంబంధించిన రచయితలు లేదా పత్రికా సంపాదకుల అనుమతి పొంది ఆ కథలను కూడా ఈ వ్యాసాలతో పాటు ప్రచురించగలిగితే చాలామంది పాఠకులకు మంచి కథల్ని మళ్ళీ ఇక్కడ చదవగలిగే అవకాశం ఉంటుందేమో సంపాదకులు ఆలోచించాలి.
    లేదా ఆయా రచయితలు కనీసం లింక్ లేదా పిడిఎఫ్ రూపంలో అయినా ఆ కథలను అందించగలిగితే బాగుంటుంది.
    ఇది నా అభిప్రాయం, సూచన మాత్రమే.

  • స్వచ్ఛమైన జాతి జీవనాన్ని ప్రతిబింబించే కథలే భవిష్యత్తు సమాజానికి ప్రమాణాలుగా నిలుస్తాయి రచయితకు, మీకు శుభాకాంక్షలు

  • యర్రావు దూడ కథపై మీ విశ్లేషణ అధ్బుతంగా ఉంది. ఆ కథను చదవాలన్న ఉత్సుకతను కలిగిస్తోంది. కలంకూరి గుట్ట కథల పుస్తకంపై మీ సమీక్ష, పరిచయం బాగున్నాయి. మేఘనాథ్ గారి కథ ఇదివరకు ఒకటి చదివాను. అద్భుతంగా రాశారు. ఈ పుస్తకంలోని కథలు కూడా అంతే అద్భుతంగా ఉంటాయని అనుకుంటున్నాను.
    రచయితకు, మీకు అభినందనలు💐💐

  • కథను చదివి తీరాలన్న రీతిలో విశ్లేషించిన ఆర్.ఎం.ఉమామహేశ్వరరావు గారికి ధన్యవాదాలు. రచయిత మేఘనాథ్ రెడ్డి గారికి అభినందనలు.
    – ఎమ్వీ రామిరెడ్డి

  • రచయిత హృదయాన్ని పట్టుకున్నారు.
    మీ సమీక్ష బాగుంది సార్.

    ఇలాంటి మరిన్ని కథలు ఆయన కలం నుండి జాలువారాలని మనస్పూర్తిగా కోరుకుంటూ మేఘనాథరెడ్డి గారికి శుభాకాంక్షలు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు