మొద్దుబారిపోతున్న మన సభలూ సమూహాలూ!

వ్యక్తి పూజలకు మూకస్వామ్యాలకూ దూరంగా  నియమానుసారంగా ఏర్పడిన పటిష్టమైన ప్రజాస్వామిక వ్యవస్థలుంటే తప్ప పెద్ద పెద్ద సమూహాలు మనుగడ సాగించలేవని గుర్తించగలగాలి.

వేలాదిమంది కూర్చోగలిగిన ఒక సభకు ఈ మధ్యే వెళ్ళాను. అదొక చిన్నపాటి స్టేడియంలాగా ఉంది. వక్తలు మాట్లాడేది వినబడేందుకు పెద్ద పెద్ద మైకులు  ఉన్నాయి. వక్తలు ఒకరి తరువాత ఒకరు అనర్గళంగా ఉపన్యాసాలను దంచి కొడుతున్నారు. ఎక్కడో చివరి వరుసల్లో కూర్చున్న నాకు వక్తలు ఏం మాట్లాడుతున్నారో ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. అర్దం కాలేదు అనేకంటే ఆ హాల్ లో వచ్చే రీసౌండ్ వలన ఒక్క ముక్క కూడా వినబడలేదు అనవచ్చు. సభా నిర్వాహకులకు గానీ వక్తలకు గానీ ఈ రీసౌండింగ్ విషయం పట్టనేలేదా అనిపించింది.

చివరి వరుసల్లోనే కాక ముందుకు చాలా వరకు దృష్టి సారించి చూస్తే వీక్షకులకు కూడా ఎవరికీ వక్తల ఉపన్యాసాల మీద ఆసక్తి ఉన్నట్టు కనబడలేదు. ఎవరికి వారు వారి వారి సెల్ఫోన్ లలో బిజీగా ఉన్నారు. కొందరు పక్కనున్న వారితో సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. తరచి చూస్తే అటు వక్తలు గానీ ఇటు వీక్షకులుగానీ, సభా నిర్వాహకులుగానీ ఎవరి పని వారు చేసుకుంటున్నారు…కానీ సభ మాత్రం కొనసాగుతూనే ఉంది. అదొక తప్పని తంతు లాగా కొనసాగుతూనే ఉంది. ఒక వక్త ప్రసంగం ఐపోగానే అలవాటుగా కొందరు చప్పట్లు కొట్టి మళ్ళీ తమ పనిలో మునిగిపోతున్నారు. మరో వక్త వచ్చినా ఇదే తీరు. ఈ తతంగం అంతా మూడు గంటల దాకా కొనసాగింది. వేలాది ప్రజలమధ్యన  ఎలాంటి భావ ప్రసరణ లేకుండా ఎలాంటి ఆలోచనల సంచయం లేకుండా ఒక నిర్హేతుక నిర్జీవ తంతు ఒక సాంప్రదాయం లాగా అలా కొనసాగిపోయింది.

సామూహిక భావం లేని సమూహాలుగా మనం మారిపోయామా లేక వీక్షకులు తాముగా ఒక పెద్ద సమూహంగా మారిపోయినప్పుడు వారికి భావ ప్రసరణతో ఏమాత్రం ఆసక్తి ఉండదా? లేక మనిషి సామూహిక భావనలోనే ఏవైనా అభిజ్ఞా (కాగ్నిటివ్ )పరిమితులు ఉన్నాయా అనే ఆలోచన నాలో మొదలైంది. ఈ ఆలోచనను ఊహాత్మక పరీక్షకు గురిచేసే సాహసం చేయాలనిపించింది.

సభలో జనాలు పెరిగే కొద్దీ వక్త ప్రవర్తనలో మార్పులు రావడం వక్త ఉపన్యాసంలో పిచ్చి కూతలు, రెచ్చగొట్టే మాటలు, ఉద్రేకం పెరగడం, గట్టి గట్టిగా అరవడం, స్లోగన్ లు ఈయడం ఇతరులను కించపరిచే మాటలు ఎందుకు పెరుగుతున్నట్టు? ఉదాహరణకు సినిమా యాక్టర్లు తమ వయసునీ వయసుతోపాటు వచ్చే పరిణతిని కూడా మరిచి   ఆడవారి మీద అవాకులు చవాకులు పేలడం, పనికిమాలిన జోకులు వేసి వీక్షకులనుండి నవ్వులను ఆశించడం చూస్తుంటాం. వీక్షకులు తమ వ్యక్తిత్వాన్ని కోల్పోయి  సామూహిక భావోద్వేగంలో పడి ఓలలాడటం ఎందుకు జరుగుతున్నట్టు?ఇవన్నీ ఊరికే అలా జరుగుతున్నాయా వీటి వెనుకాల మానవ పరిణామం  తాలూకు కారణాలు ఏమైనా ఉన్నాయా?

ఎక్కువ మంది ముందు ఉపన్యాసం ఇవ్వడం లోనూ,  ఎక్కువ మంది ఒక చోట కూర్చుని ఒక ఉపన్యాసకుడి మాటలను వినడం లోనూ ఉండే “mass communication” వ్యవహారంలో మనిషికి కొన్ని కాగ్నిటివ్ పరిమితులు ఉన్నాయి అంటాడు బ్రిటీష్ పరిణామ వాద, మానవవాద శాస్త్రవేత రాబిన్ డన్బార్.  అంటే ఒక మనిషి తన చుట్టూ ఉన్న ఎంత మందితో ఒక అర్థవంతమైన కమ్యూనికేషన్ ని నెరపగలుగుతాడో ఆ నెంబర్ ను Dunbar Number అన్నాడు.  Robin Dunbar  ప్రైమేట్ జంతువులు గుంపులు గుంపులుగా జీవితాలను గడపే అంశంపై పరిశోధన చేశాడు.  కొన్ని ప్రైమేట్ జంతువులు 10-15 సభ్యులతో గుంపుగా ఉంటే బబూన్ వంటి జంతువుల గుంపు 50-100 సభ్యులతో ఉండటం, అంతకుమించి ఎక్కువగా ఉండకపోవడం గమనించాడు. ఒక గుంపు ఎప్పుడు సాధ్యమౌతుందంటే ఆ జంతువులకు కొన్ని శక్తులు ఉండాలి. తోటి జంతువుల ముఖాలను గుర్తు పెట్టుకోవడం, వాటి భావోద్వేగాలపై సహానుభూతి ఉండటం, వాటితో ఎక్కువ కాలంపాటు స్థిరమైన సంబంధాన్ని నెరపగలగడం అనే శక్తులు ఉండాలి‌.

 ఆయా జంతువుల మెదడు పరిమాణం బట్టి ఈ శక్తులు వాటిలో అభివృద్ధి చెందుతాయి. మెదడు అంతగా అభివృద్ధి చెందని ప్రైమేట్లలో గుంపు సభ్యుల సంఖ్య తక్కువగా ఉంటే మెదడు అభివృద్ధి చెందిన ప్రైమేట్లలో గుంపు సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉండేది. ఐతే ఈ అంశాన్ని మనుషుల మీదికి బహిర్వేశం చేస్తే మనిషికి నియో కార్టెక్స్ అభివృద్ధి చెందింది కాబట్టి ఒక్క మనిషి నూటా యాభై సభ్యులతో ఒక గుంపుగా ఉండగల సామర్థ్యం కలిగి ఉన్నాడని తేలింది. దీనినే ఆయన Dunbar Number అన్నాడు. ఈ నెంబర్ మనిషి సాధించగల అభిజ్ఞా పరిమితినే కాక సింబాలిక్ గా మనిషి చేరుకోగల సహానుభూతి, ఇతరుల పట్ల చూపగల శ్రద్ధ ఇతరులు తో అర్థవంతంగా మాట్లాడగల శక్తుల పరిమాణాన్ని కూడా తెలుపుతుంది. నూటా యాభై మందిని మించిన జనాభాతో  సంభాషణ చేయగల శక్తి మనిషికి నిజంగా ఉందా? అంతకుమించి సభ్యులు గల గుంపు తమ సహజ జీవశాస్త్ర పరిమితిని కోల్పోతుందా?.

 అదిమకాలం నుండీ మనిషి చిన్న చిన్న తెగలుగా జీవనం సాగించాడు‌. గుంపులుగా జీవనం కొనసాగించడం ట్రైబల్ లక్షణం.  చిన్న తెగ తక్కువ మంది సభ్యులు కాబట్టి వారి మధ్య చర్చించుకోవడానికీ నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలమైన dialogue space ఒకటి ఉండేది.  మానవుల గణతంత్ర వ్యవస్థలన్నీ ఒకరకంగా ప్రజాస్వామిక వ్యవస్థలుగా ఉండటానికి గల కారణం  కూడా చిన్న చిన్న గుంపులుగా మనుషులు జీవనం సాగించడమే.  గ్రీసులో, రోమ్ లో భారతదేశంలో ఉన్న గణరాజ్యాలు గానీ  జనపదాలు గానీ ప్రజాస్వామిక లక్షణాన్ని కలిగి ఉండటంలో Dunbar Number ఒక కీలకమైన విషయంగా ఉండిందనడానికి ఆస్కారం ఉంది.   మన పూర్వికులలో  ఎంతో కొంత హేతుబద్ధతా, ప్రజాస్వామికతా లేకపోయి ఉండి ఉంటే మానవ సామాజిక పరిణామంలో మనం ఇంతవరకు వచ్చి ఉండేవారిమే కాదు‌.

ఐతే ఆధునిక ప్రపంచంలో మనుషుల మధ్య సంబంధాలు కమ్యూనికేషన్ వ్యవస్థల స్వరూప స్వభావాలు విపరీతమైన మార్పులకు గురయ్యాయి. Mass gatherings, ఎలక్షన్ కాంపెయిన్ లు, మతగురువుల సభలు, సినిమా హీరోల ప్రమోషన్ సభలు- సమావేశాలు ఎంత ఎక్కువ మంది పాల్గొంటే అంత గొప్ప విజయమనే ధోరణి సర్వత్రా వ్యాపించి ఉంది. మనిషి మేథ తన Dunbar Number పరిమితిని దాటిన వాతావరణంలో మనిషి ప్రవర్తన కూడా  అసహజత్వాన్ని సంతరించుకుంటుంది.  పెద్ద సభల్లో వేలాది మందిని చూసినప్పుడు వక్తలకు సభికుల ముఖాలతో ప్రత్యక్ష  సంబంధం ఉండదు. సభికులందరూ భావోద్వేగ నైరూప్య కుప్పలాగా మారిపోతారు.

Stress harmones, dopamine వంటివి పెరిగిపోవడంతో వక్తలో సహజంగా ఉండవలసిన నిరోధాలు పోయి నోటికొచ్చినట్లు మాట్లాడటం, ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించడం జరుగుతూ ఉంటుంది. Dunbar పరిమితి దాటిన సభికులు కూడా వక్త యొక్క ఉర్రూతలూగించే ప్రసంగానికి తలలూపే గుడ్డి గొర్రెల్లాగా మారిపోతారు. వ్యక్తితో నెరపగల Dialogue space మాయమవడంతో వారి వ్యక్తిత్వం అవ్యక్తీకరించబడుతుంది‌ ( Gustave Le Bon’s crowd psychology). అది euphoric dopamine surge వలన  సునామీ లా చుట్టేసిన గుంపు భావోద్వేగంలో లయమైపోతుంది‌. Collective hypnosis మొదలై అస్తిత్వం కరిగిపోతుంది. వక్తల ఉద్రేకాలూ,వ్యక్తుల ఉద్వేగాలు ఒకదానికొకటి mirror effect లా పనిచేస్తుంటాయి. ఐతే ఇక్కడ మరో ప్రశ్న ఉత్పన్నం ఔతుంది.

మొత్తానికి వేలాది మంది పాల్గొనే సభల్లో రెండు రకాలైన ధోరణులు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. ఒకటి , నేను పాల్గొన్న సభలో వలె సమూహ స్వభావాన్ని కోల్పోయి సభా శబ్దం మాత్రమే మిగిలిన తతంగ ప్రాయ మౌన సభ ఐతే, రెండవది, సమూహమంతా ఒకే అమూర్త మందవలె గొర్రె ప్రాయంగా  మారే సభ. మొదటిది మొద్దుబారిన అభిజ్ఞ (cognitive numbness)  అనుకుంటే రెండవది అభిజ్ఞా వైరుధ్యం (cognitive dissonance). ఒకవైపు అధికారాన్ని ఏమాత్రం ప్రశ్నించని అశేష ప్రజానీకమే మరోవైపు వ్యక్తి పూజతో కూడిన mob గా మారడం ప్రపంచ వ్యాప్తంగా కనిపిస్తుంది. అంటే ఇది రెండు రకాలుగా కనిపించినా రాజకీయ నాయకులు కోరుకునే “ఆదర్శ వోటరు” ఉదయించడమనే దృగ్విషయంగా దీనిని అర్దం చేసుకోవాలి.

మొద్దుబారిన అభిజ్ఞ  ఖాళీ శబ్దాల సమాజాన్ని (emotional withdrawal) సృష్టిస్తుంది. మనస్సు సామాజిక అన్యాయాలను చూస్తూ ఉండిపోతుందే తప్ప పాల్గొనదు.  ఇది అజ్ఞానం కాదు. కానీ బాధ్యత లేకపోవడం,ప్రతిస్పందన లేకపోవడం. అభిజ్ఞా వైరుధ్యం ఉర్రూతలూగించే నినాదాల సమాజాన్ని (emotional overflow) సృష్టిస్తుంది. రాజకీయ నాయకుల , సినిమా నటుల సభలు, ర్యాలీలు, నిజమైన చర్చ జయగకుండా కేవలం థియేట్రికల్ పెర్ఫార్మెన్స్ లాగా మారుతుంది. అంటే, Dunbar boundary ని దాటినప్పుడు మనం అంతా ఒక సమూహంగా numbness or madness లోకి పడిపోతాం. సంభాషణను ప్రసంగం మింగేస్తుంది. పౌరుడు ఒక శ్రోతగా తలలూపే గొర్రెగా మలచబడ్డాడు. ఇది ప్రజాస్వామ్య భావనకు వ్యతిరేకం.

ఐతే ప్రజాస్వామ్యమనేది కేవలం ఒక రాజకీయ సిద్ధాంతం కాదు. ఇది మానవ అభిజ్ఞ చేరుకోవాల్సిన సహజమైన స్థితి. ఇది చర్చ మీద, సహానుభూతి మీద, అకౌంటబిలిటీ మీద, కొద్దిపాటి వ్యక్తుల మధ్య సాగే సామాజిక హేతుబద్ధత మీద ఆధారపడి ఉంటుంది.  పురాతన ఏథెన్స్ నగర పార్లమెంటు లో, గ్రీసు తెగల పాలనా వ్యవస్థలో, గ్రామ పంచాయతీలలో, పట్టణ అసెంబ్లీలలో కొందరు మాత్రమే సభ్యులు ఉండగలిగిన చోట అది సఫలమైనంతగా Large numbers దగ్గర సఫలం కాదు. ప్రజాస్వామ్యం అనివార్యంగా మూకస్వామ్యానికి దిగజారిపోతుందని సోక్రటీస్ ప్లేటో ఇద్దరూ భయపడ్డారు. అది అంతవరకే కాదు బ్యూరోక్రసీని టెక్నోక్రసీని మౌనంగా ఒప్పుకునే మొద్దుస్వామ్యం (numbocracy) గా కూడా మారుతుందని కూడా మనం గమనిస్తున్నాం.  ప్రింటింగ్ ప్రెస్ టెలివిజన్ ఇంటర్నెట్ ఆధునిక ప్రపంచంలో టెక్నాలజీ తో వచ్చిన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియాలు మానవ సమూహాన్ని Digital crowd గా మార్చి వేస్తాయి. మీడియా, సోషల్ మీడియా పెరిగి ప్రజాస్వామ్యాన్ని సులభతరం చేస్తాయనుకుంటే అవి వ్యక్తుల అభిజ్ఞా పర్యావరణాన్నే మార్చేసి నినాదప్రాయ చైతన్యాన్నీ, పోలరైజేషన్ నీ పెంచుతున్నాయి. ఇలాంటి తరుణంలో వ్యక్తి ప్రాధాన్యతనుండి మెల్లిమెల్లిగా హెర్డ్ మోరాలిటీకి సహజాతంగా దిగజారిపోవడమే (instinctual degradation)నేటి ప్రజాస్వామ్యమా? అనే ప్రశ్న వేసుకోవాల్సి ఉంటుంది.

  ప్రపంచ వ్యాప్తంగా నెలకొని ఉన్న ఈ పరిస్తితులకు Dunbar Number ఒక శాస్త్రీయ వివరణ మాత్రమే కాదు. ఒక హెచ్చరిక కూడా.  మనిషి తన సహజ అభిజ్ఞా పరిమితులను దాటి సమూహాలుగా, మేధావులుగా, పౌరులుగా, అభిమానులుగా, లేదా ఫాలోవర్స్‌గా విస్తరించేటప్పుడు ప్రజాస్వామ్యం తన చర్చాత్మక స్వరూపాన్ని కోల్పోతుంది. కాబట్టి, పెద్ద వేదికల గొంతుకలను చిన్న వర్గాల సంభాషణలుగా మార్చే సమయం ఇది. ఐతే 150 అనేది fixed number కాదు. దీనిని చిన్న సమూహాలకు సింబాలిక్ గానే  తీసుకోవాలి. ఈ నా speculative thought experiment లో చాలా చాలా ముఖ్యమైన విషయం ఇది. 150 మందే ఉండాలనే నియమం ఏమీ లేదు.

కానీ అర్థవంతమైన కమ్యూనికేషన్ కోసం కాగ్నిటివ్ పరిమితి ఒకటి ఉందని తెలుసుకోకపోతే, చర్చించే చిన్న సమూహా అనుభవమూ, మానవ అభిజ్ఞా ఈ రెండూ ప్రజాస్వామ్య ఆలోచనతో ఎలా ముడిపడి ఉన్నాయో తెలిసే అవకాశాన్ని కోల్పోతాం. అంతేకాక ప్రజాస్వామ్యాన్ని రాజకీయ భావజాలాల ప్రాధాన్యతలను జీవశాస్త్ర పటంలో పెట్టే డిటర్మినిజంకి  Biologizaion of the politicsకీ ఈ వాదన దారి తీయనవసరమూ లేదు. “డెమోక్రసీ విధానంలో ఏ తప్పూ లేదు మనిషి మెదడులోనే తప్పంతా ఉంది” అనేంత డిటర్మినిజానికి ఈ ఊహలు దారి తీయకూడదు. కానీ ప్రజాస్వామ్య పరిరక్షణలో చిన్న సమూహాల పాత్రను అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా చిన్న సమూహాలను రొమాంటిసైజ్ చేయనవసరమూ లేదు.

ఐతే చిన్న చిన్న ప్రజాస్వామిక సమూహాలు ఒక నెట్వర్క్ గా పని చేయగలిగే అవకాశం గురించి తప్పక ఆలోచించాలి. వ్యక్తి పూజలకు మూకస్వామ్యాలకూ దూరంగా  నియమానుసారంగా ఏర్పడిన పటిష్టమైన ప్రజాస్వామిక వ్యవస్థలుంటే తప్ప పెద్ద పెద్ద సమూహాలు మనుగడ సాగించలేవని గుర్తించగలగాలి. ఒక పెద్ద ప్రజాస్వామిక దేశం సమర్థవంతంగా పనిచేయాలంటే ప్రభుత్వానికి సంబంధంలేని స్వతంత్రమైన  న్యాయ శాసన వ్యవస్థల్లో బలం పెరగాలి.  పెరుగుతున్న టెక్నాలజీ వ్యక్తులను చర్చించుకోగల సమూహాలుగా మార్చగలిగేందుకు దోహదపడాలే తప్ప ఇకో చాంబర్లుగా మారేందుకు తోడ్పడకూడదనే స్పృహ పెరగాలి. మన ప్రజాస్వామికతను మళ్లీ ప్రాణవంతం చేయాలంటే అది మనిషి అభిజ్ఞా పరిధిలోనే పునర్నిర్మించబడాలి — వ్యక్తిగానే కాక, సహజంగా; విద్వేషాలతో కాక సానుభూతితో.

మనిషి పరిణామం ఇంకా పూర్తికాలేదంటే, ప్రజాస్వామ్యం కూడా ఇంకా పూర్తికాలేదని అర్థం. అలాగే ప్రజాస్వామ్యం ఇంకా నిలబడలేక పోతోందంటే మనిషి మేధో పరిణామం కూడా పూర్తవలేదని అర్థం. ప్రజాస్వామ్యం దాని సహానుభూతి పరిమితులనుండి అర్థవంతమైన చర్చలనుండి దూరం జరిగినప్పుడు అది ఒట్టి నినాద ప్రాయ శబ్దంలా మిగిలిపోతుంది.

*
చిత్రం: సృజన్ రాజ్

విరించి విరివింటి

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు