మొదలైనట్టే

న్ను నేను కొక్కేనికి
తగిలించుకుని
విడుదలై
కాలు చాపుకొని
నక్షత్రమండలం కేసి
చూస్తే
పంఖా గిర్రున తిరిగిందిమూతబడ్డ కప్పులోంచి
లోపలికి రాలేక
కిటికీలోంచి
తొంగిచూసే వెన్నెల

రాత్రి ఎప్పుడయ్యిందో
తెలీనప్పుడు
ఉదయం కోసం చూడ్డం వృధా

పుక్కిలించిన నోట్లోంచి
ఉలిక్కిపడ్డ వక్కముక్క
గీసిన నాలిక మీద
అక్షరాల వెలుగు

చెప్పుల్లో కాళ్ళు పెడితే
రోజు మొదలైనట్టే.
చిల్లులు పడ్డ చెవుల్లో
ఉలి దెబ్బల మాటలు
మొదలైనట్టే

2

వ్యాయామమూ, ఆహ్లాదమూ

నా నడక సమయాల్లో
పిల్లలు ఎదురు పడుతూంటారు
చిన్న సైకిళ్ళు తొక్కుకొంటూ
ఉత్తినే పరిగెడుతూ
రంగు బెలూన్లు పట్టుకుంటూ

అమ్మలో, నాన్నలో, నానీలో
వాళ్ళని గమనిస్తూ ఉంటారు
మెడలో తాడులేని కుక్కపిల్లలు

కొందరు పలకరిస్తారు
కొందరు తప్పుకుంటారు
కొందరు ముఖం చాటేస్తారు

కొందరు నేను పలకరించినా,
పలకరించినట్టు నవ్వినా కూడా
నా వెలిసిన జుట్టునో
గెడ్డాన్నో చూసి జడుసుకుంటారు
వాళ్లకేసి చూడనట్టు బుర్ర వంచుకొని
నడిచేస్తాను
అయినా వాళ్ళు నాకేసి చూస్తూనే ఉంటారు

..
ఓ రోజు ఓ చిన్న పిల్లాడు
నా దగ్గరకి వచ్చి అడిగేడు
Are you grandpa?
అవును, నేనూ ఒక తాతనే అన్నాను
ఆ రోజు మొదలు
రోజూ నన్ను చూడగానే
తాతా అని పలకరిస్తాడు
దగ్గరకొచ్చి చేయి కలిపి వెళ్ళిపోతాడు

కొన్నాళ్ళక్రితం సైకిల్ తొక్కుతోన్న పాప
సైకిల్ ఆపి ఆకాశంలో తెల్లగా మెరుస్తోన్న
పున్నమి చందమామని చూపించింది
పక్కనే ఉన్న నక్షత్రాల్ని కూడా

నిన్న రాత్రి
చందమామ ఎక్కడని
నిలదీసింది
అమావాస్య కదా ఎక్కడ
చూపించను?
రేపు చూపిస్తాను
ఇవాళ నక్షత్రాలు చూడమన్నాను
సప్తర్షి మండలాన్ని చూపించేను
నడక కట్టిపెట్టి కబుర్ల వ్యాయామంలో పడ్డాను

చందమామ, నక్షత్రాలు, రాత్రులు,
గాలి వీచే సాయంకాలాలు
ఆడుకునే పిల్లలు
ఇంతకంటే మనసుకి
ఆహ్లాదమెక్కడ?

*

Indraganti Prasad

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ..చందమామ ఎక్కడని
    నిలదీసింది..
    నాకు దాదాపు రోజు ఎదురవుతున్న ప్రశ్న.
    చాలా బాగున్నాయి బాబాయ్ గారు

  • 2 కవితలూ బాగున్నాయి…
    రెండవ కవిత బాగుంది అనడం కన్నా “హాయి”గా ఉంది…

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు