లేబర్ రూం
– కొండేపూడి నిర్మల
ప్రపంచంలోని నరకమో
నరకంలోని ప్రపంచమో
త్రీడీలో చూస్తున్నట్టే వుంటుంది
లేబర్ రూంలో అడుగుపెడితే చాలు
మీరంతా చెబుతున్న తెల్లచీర మల్లెపూలు పాలగ్లాసు వరసల్లో
పరాధీనతా బానిస కన్నీరూ ద్వీపాంతర వాసం
ఫ్రేం కట్టినట్టు కనిపిస్తాయి
బల్లకొక బాధల నది
కాయితప్పడవలా చివికి చీలిపోతున్న రోదనలగది
అమ్మో అయ్యో – లు దేవుడా రక్షించు – లు
చాలా మామూలు మామూలు
నడవటం – నవ్వడం – మాట్లాడటం లాంటి
జీవ భౌతిక లక్షణాలకి రూపం మారుతుందిక్కడ
శరీరం ఏడుస్తోందా పోనీ మూలుగుతోందా అనేది ముఖ్యం
కాళ్ళనలా ఎడం చేసి, దీనంగా హీనంగా, నీచాతినీచంగా
ఒక హింసాతల పరాకాష్ఠ కోసం ఎదురుచూడ్డమంటే
రైలు పట్టా మీద నాణెం విస్తరించిన బాధ
కలపను చెక్కుతున్న రంపం కింద పొట్టులా ఉండచుట్టుకున్న బాధ
అప్పుడే ఏమయింది ఉధృతి కొద్దీ విముక్తి
ముల్లుకు గుచ్చి నిప్పులో కాలుస్తున్న చేప యిలాగే ఏడుస్తుందా
మూతి బిగించిన గోతాంలో మూగ జంతువిలాగే రోదిస్తుందా
ఆగాలి ఆగాలి చిన్న ముల్లింకా రెండంకెలు దాటాలి
అటు చూడు అది నిన్నటి కేసు నాడి జారిపోతోంది
ఇటు చూడు పిండం అడ్డం తిరిగింది బి.పీ. రెచ్చిపోతోంది
ఆలోచించే చోటు లేదు
చావుకీ బతుక్కీ మధ్య పిసరంత గీటు లేదు
టాక్సీ చప్పుడు, స్కూటరు చప్పుడు, రిక్షా చప్పుడు, నడిచిన చప్పుడు
తలక్రిందులుగా వ్రేలాడదీసిన సెలేన్ బాటిల్లా
నిండు నెల్ల గర్భిణీ
ఒక్కో బొట్టు చొప్పున మొత్తం ప్రాణం ఇచ్చుకోవడానికి వస్తోంది
అడ్డు తప్పుకోండి అడ్డు తప్పుకోండి.
ఫిబ్రవరి 1989
( కొండేపూడి నిర్మలగారి ” నడిచే గాయాలు” కవితా సంపుటి నుంచి )
ఈ కవిత ప్రధానంగా ప్రసవ సమయంలో స్త్రీల అనుభవాలు, మనోభావాలు ఎట్లా ఉంటాయో తెలుపుతోంది.
లేబర్ రూం అంటే బిడ్డకు జన్మనిచ్చే సమయంలో స్త్రీకి అవసరమైన గోప్యతను, రక్షణను సౌకర్యాలను సమకూర్చే గది అని ఒక సాధారణ అర్థాన్ని వివరణగా చెప్పవచ్చు.
“ప్రపంచంలోని నరకమో
నరకంలోని ప్రపంచమో
త్రీడీలో చూస్తున్నట్టే వుంటుంది “
ఈ కవిత ఎత్తుగడే శక్తివంతంగా, విలక్షణంగా వుంది. మొదటి పాదంలోని పదాలనే క్రమం మార్చి రెండవ పాదంలో చెప్పడంలో ఒక విలక్షణత వుంది. “ప్రపంచంలోని నరకం” స్త్రీకి అనుభవంలోకి వచ్చే సమయమిది. అయితే “నరకంలోని ప్రపంచం” కూడా బహుశా ఇట్లాగే ఉండవచ్చునన్నది కవయిత్రి ఊహ. “నరకంలోని ప్రపంచం ” పట్ల ఎక్కువ మందికి ఒక ఊహ ఉండే అవకాశం ఉంది. (నరకమనేది ఉన్నా! లేకున్నా ) ఆ ఊహ ఊతంగా కూడా ఈ “ప్రపంచంలోని నరకాన్ని ” ఊహిస్తాడు పాఠకుడు. త్రీడీలో చూడడం అంటే వీలైనంత వాస్తవంగానూ సమీపంగానూ ఒక దృశ్యాన్ని చూడడమని కదా అర్థం!
” బల్లకొక బాధల నది
కాయితప్పడవలా చివికి చీలిపోతున్న రోదనల గది “
ఇక్కడ
కాయితప్పడవలా చివికి చీలిపోతున్న రోదనల గది –
అనేది ప్రసవసమయపు శారీరక బాధలతో కూడిన లేబర్ రూం స్థితిని దృశ్యమానం చేస్తున్న వ్యక్తీకరణ.
ఇక ఆ తర్వాత తర్వాత కవయిత్రి చెప్పిన సాదృశ్యాలు ప్రసవ వేదనను మరింత శక్తివంతంగా కళ్ళకుకట్టేవి.
” కాళ్ళనలా ఎడం చేసి, దీనంగా హీనంగా…
ఒక హింసాతల పరాకాష్ఠ కోసం ఎదురుచూడ్డమంటే
రైలు పట్టా మీద నాణెం విస్తరించిన బాధ
కలపను చెక్కుతున్న రంపం కింద పొట్టులా ఉండచుట్టుకున్న బాధ “…..
” ముల్లుకు గుచ్చి నిప్పులో కాలుస్తున్న చేప యిలాగే ఏడుస్తుందా
మూతి బిగించిన గోతాంలో మూగ జంతువిలాగే రోదిస్తుందా “
ప్రసవం సజావుగా సాగే స్థితి ఒకటి అయితే, అత్యంత ఇబ్బందికరంగా మారే పరిస్థితి మరొకటి. ఈ రెండవ స్థితిలో చావుకీ, బతుక్కీ మధ్య పిసరంత గీటు లేదన్నది కవయిత్రి నిర్ధారణ.
ఒక బిడ్డకు జన్మనివ్వడమంటే ఆ తల్లి మృత్యుముఖాన్ని దాటి మళ్ళీ జన్మించడమేనంటారు పెద్దలు. ప్రాణాన్ని తృణంగా పెట్టి మరొకరికి జన్మనివ్వడమనే భావాన్ని ఈ కవయిత్రి _
“తలక్రిందులుగా వ్రేలాడదీసిన సెలేన్ బాటిల్లా
నిండునెల్ల గర్భిణీ
ఒక్కో బొట్టు చొప్పున మొత్తం ప్రాణం ఇచ్చుకోవడానికి” వస్తోంది అంటున్నారు.
ఇప్పుడు సీజేరియన్లు ఎక్కువగా జరుగుతున్న కాలంలో ఉన్నాం. వాటి పర్యవసానాలూ చూస్తున్నాం. సాధారణ ప్రసవాలు అధికంగా జరిగిన కాలం నాటి కవితగా దీనిని గుర్తించాలి.
స్త్రీ ప్రత్యేకమైన అనుభవాలను స్త్రీలు వ్యక్తీకరిస్తే అవి ఎంత శక్తివంతంగా ఉండే వీలుందో ఇటువంటి కవితలను పరిశీలించినపుడు అవగతమవుతుంది. ఈ ప్రత్యేకానుభవాలు స్త్రీల బాధల పట్ల పురుషులకు ఒక అవగాహనను, జ్ఞానాన్ని కూడా కలిగిస్తాయి. ఆ మేరకు స్త్రీల పట్ల పురుషుల దృష్టిలోనూ దృక్పథంలోనూ మరింత మానవీయమైన ఆలోచనలకు, మార్పుకు అవకాశం ఏర్పడుతుంది.
*
Labour room
Nirmala gari master piece this one
Great poem
Mantri garu — super review sir