మైసయ్య మమ్మల్ని మన్నించు!

అమ్మమ్మ లేని తాతయ్యని ఒక పళ్లెం గ్లాసుని విడిచేసి పంచుకున్నట్టు ఒకనెల పెద్దోడు మరోనెల చిన్నోడు పంచుకున్నాక తాత కుంగిపోయాడు.

మైసయ్య కధ యేసయ్య సిలువమీద కార్చిన రక్తపుబొట్టులా మిలమిల మెరిసే చిక్కనైన చమట గాధ.మైసయ్య కధ సామాజికంగా అమలులో ఉన్న తల్లితండ్రుల్ని కొడుకులు పంచుకోవడం అనే మూఢత్వానికి బలైన అనాగరిక ఆలోచనల గాధ.ఆస్తిని ఇళ్ళని వాకిళ్లని పంచుకున్నట్టే అమ్మాఅయ్యని పంచుకునే కొడుకులను కొడళ్లను చెంపమీద చరిసే గుణపాఠపు గాధ.కళ్ళు విశాలంగా లోతుగా ఉండాలి మరి.హృదయం నిర్మలంగా స్వచ్చoగా పెట్టి వినాలి.ఇదే స్థితి ఏతండ్రికి ఏతల్లికి రాకుండా కలగజేయకుండా ఉండేందుకు మనం ఏమి చేయాలో తెలుసుకునేందుకు జ్ఞానం తెచ్చుకోవాలి మరి.బతుకు పోరులో,పేదరికపు నిత్యశాపంతో,ఎదురు దెబ్బలతో,ఆటుపోట్లతో,పెద్ద సంతానంతో, దినదిన గండంతో,బతుకు సిలువపై  ఏన్నోసార్లు సిలువ వేయబడ్డ కన్నీటి గాధ.మైసయ్య నాతల్లి యొక్క తండ్రిగారు.ఏ సందర్భానికి అతడ్ని కలిసినా కందిచేలోనో..వరిపోలంలో కల్పుతీస్తూనో,శనగ పీకుతూనో,గొడ్లుకాస్తూనో,పలుపు తాళ్లు, మోకులు,చిక్కాలు అల్లుతూనో కనిపించేవాడు.ఖాళీ చేతులతో తాను ఒట్టిగా ఏపనీ లేకుండా కూర్చోవడం పాతికేళ్లలో ఒక్కసారికూడా నాకంట పడలేదు.శ్రామిక జీవితాన్ని తన చివరి రోజువరకు జీవించాడు.

బక్కపల్చని దేహం,లోపలికి డిగ్గొట్టినట్టుండే కళ్ళు,సన్నని మేక కాళ్ళలాంటి కాళ్ళు,పొడవాటి చేతులు,వరి కంకులులాంటి వేళ్ళు, పోలంలాంటి హృదయం,దుగంలాంటి రాజసం..బురద మట్టిలాంటి మనసు.పంట పండినా పండకపోయినా ఒంట్లో బాగున్నా బాగోలేకపోయినా ఇంటినిండా పేదరికం తాండవిస్తున్నా ముఖంమీద చిరునవ్వు తప్ప జంకూ భయంలేని ధీరోధత్తుడు తాత.ముగ్గురు ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేసి మనవళ్ళకి అల్లుళ్ళకి ఇవ్వవల్చినవన్నీ ఇచ్చి ఏరోజు ఏఒక్కమాటా పడకుండా హుందాగా జీవించాడు.ఇద్దరు కొడుకుల్ని వ్యవసాయ పనిముట్లుగా తయారుచేశాడు.ఎవడు ఎప్పుడు దారితప్పినా రైతు కంకిలా,పచ్చని గడ్డిలా, మెత్తని మట్టిలా,ఉంటాడని తాత అనేవాడు.చేయగలిగినన్ని రోజులు శారీరక శ్రమ చేస్తూ..కుటుంబాన్ని తీర్చిదిద్దిన తాతకు ముసలమ్మ పోయినాక జీవితం ఇంకో స్థితిని తన ముందు పెట్టింది. ఇద్దరు కొడుకులకి పెళ్లిళ్లు చేసినప్పుడే తాను ఉహించుకోవాల్చింది తను పంపకానికి పదార్ధమౌతాడాని.పాపం తను తండ్రికదా..

బిడ్డల్ని లాలించటమే తెలుసు,కళ్ళలో పెట్టుకు చూసుకోవటమే తెలుసు. అమ్మమ్మ లేని తాతయ్యని ఒక పళ్లెం గ్లాసుని విడిచేసి పంచుకున్నట్టు ఒకనెల పెద్దోడు మరోనెల చిన్నోడు పంచుకున్నాక తాత కుంగిపోయాడు. ఎప్పుడూ ఖాళీగా కనపడని వాడు ఎప్పుడూ ఆకాశం వంక చూస్తూ ఉండేవాడు.బహుశా తాను అమ్మమ్మతో మాట్లాడుతుంటాడేమో..
చెప్పలేనివన్ని ముచ్చటించలేనివన్ని తనకు చెప్పుకునేవాడేమో..అంతరంగాన్ని అన్వేషించి బాధను ఒంటరితనాన్ని పోగొట్టగల బంధం బహుశా ఏవేవో కారణాల చేత అంతరించిపోతాయేమో ఎవరికి మాత్రం తెలుసు..? ఐదుగురు పిల్లలున్న తాత ఏనాడు వాళ్ళని
విడిగా చూసిందిలేదు.ఇద్దరు కొడుకులుమాత్రం ఒక్క తండ్రిని రెండు చేయటం తాత గుండెపగలడానికి కారణమైoది.ఒంటరితనం లో ఎవరు ఏ మాట మాట్లాడక..ఇంకా ఇంకా కుంగిపోయి దిగులు ఆవరించింది తాతని.

ఏవేవో గొడవలు.కొడుకు కోడళ్ళ మధ్య వాగ్వాదo.నిట్టూర్పులు..సాదించటాలు.దెప్పిపొడుపులు మధ్య నలిగిపోయిన తాతని చూసొద్దామని వెళ్తే…ఒక పట్టా కాగితంలో,ఇంటి బయట ఎండలో చుట్టబడ్డాడు.దాహం దాహం అంటే నీళ్లు పోస్తే కళ్లలోంచి నీరుకారాయి.నన్నూ అమ్మని చూసి చిరునవ్వులాంటి కదలిక ఎదో చేసాడు.మాట్లాడటానికి నోరుతెరుస్తూ మాట్లాడలేక మధ్యలోనే ఆగిపోయాడు.కళ్ళవెంట  నీళ్లు మాత్రం ధారాపాతంగా కారుతూనే ఉన్నాయి.ఇక నేను బతకను అనే దీన చూపు.పెరిగిన గెడ్డాన్ని తీసివేసి,స్నానం చేయించి,సూట్కేస్లోంచి తీసిన కొత్త పంచె కట్టి,ఇంటిలోపలికి తీసుకొచ్చి మంచంవాల్చి దుప్పటి పరిచి కాస్త మజ్జిగ అన్నం కలిపి పెడితే తిని నిద్రపోయాడు..నిద్రలోకి జారిపోయాడు..మరెప్పటికి లేవలేని గాఢ నిద్రలోకి…మా ముఖాల్ని మా అంధకార హృదయాల్ని గొడ్డలితో నరికి కొడవలితో కోసి దీనంగా.
రాజసంగా వెళ్ళిపోయాడు.తాత చనిపోలేదు.చంపారు.

మైసయ్య మమ్మల్ని మన్నించు..అజ్ఞానమో అందకారమో మూర్ఖత్వమో మౌఢ్యమో.. విలువతెలియకనో నిన్నలా వొదిలేసిన నీ బిడ్డల్ని మన్నించు..ఎన్ని జన్మలెత్తినా మాసిపోని దారుణాన్ని క్షమించు..కొన్ని తప్పులకు శిక్ష ఏశిక్ష లేకపోయినా ఎదో పెద్ద శిక్ష పడ్డట్టేమో..తాత …శిక్షించకుండా శిక్షించటం బహుశా నీకే తెలిసిందేమో..దెబ్బ కొట్టకుండా తిట్టు తిట్టకుండా వెళ్లిపోయిన నీ ఔన్నత్యం ముందు తలొంచుకుంటూ..

మనిషి తనెవరైనా తన అజ్ఞానం మూర్ఖత్వం మూఢత్వం తను మనిషిననే స్పృహని చైతన్యాన్ని నాశనం చేస్తుంది..వివేకాన్ని ఇతరులపట్ల ఔదార్యాన్ని క్షిణింపజేస్తుంది అజ్ఞానo కంటే జ్ఞానం,ద్వేషంకంటే ప్రేమ,మౌఢ్యం కంటే మానవీయతని సాదించుకునేందుకు కంటే మరో ముఖ్య ఉద్దేశ్యం మానవ జీవితానికి ఉండదేమో…?

*

పెద్దన్న

13 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • బడుగు వర్గాలలో ముఖ్యంగా వ్యవసాయాధిరిత కుటుంబాలలో ఇలా తల్లి దండ్రుల్ని నెలకు ఒకరు చొప్పున తిండి పెట్టే పద్దతి ఇంకా వుండడం బాధాకరమైనదే. రచయిత పెద్దన్న మరోసారి కళ్ళకు కట్టినట్లుగా ‘మైసయ్య మమ్మల్ని మన్నించు’ కథలో చూపించాడు.

    • బడుగు బలహీన వర్గాలు కాదేమో….బలహీన మనస్సు కలిగిన మనుషులు చేస్తున్న అతి దారుణ ఆకృత్యాలు… tq…

  • Mana urilo manaki telisina mysaiahlu endharoo teruguthuntaru….akali kosamoo kakunda, asthi pasthula kosamoo kakunda…apyayatha kosam, adharana kosam ashaga eduru chustu untaru….vrudhapyamlo unna amma,nannalanu chinna pillala chusukovalani peddavallu ina valla pillalaki mi vysam chadivyna kanuvippu kaligithe bavuntundhi …..kondharikyna….👏👏👏🙏🙏🙏🙏

    • కనువిప్పు కాదు గుండెవిప్పు కలగాలి…థాంక్యూ.. madam…

  • బడుగు బలహీన వర్గాలు కాదేమో….బలహీన మనస్సు కలిగిన మనుషులు చేస్తున్న అతి దారుణ ఆకృత్యాలు… tq…

  • మైసయ్య తాత కథద్వారా సమాజంలో అటువంటి మనుషులకు చెంప చెల్లునా కొట్టినట్లు ఉంది అన్న👌👌👌👌

  • Sir edi చదివిన అందరకీ కనువిప్పు కలుగుతుంది.Sir దీనిలో రెండు విస్యలు ఉన్నాయి.వకటి పేదరికము రెండు ప్రేమా లేకపోవడం. మా ఊరిలో ఎన్నో ఇలాంటి సంఘటన. అవి చూసినపుడు నా హృదయం ద్రవీభవించింది.రేపు నా జీవితం ఎలాంటి ముగింపు వస్తుందో??? హృదయం నీ కదిలించింది. కళ్లు చెమ్చాయి.tq sir

  • నువ్వు ఇప్పుడు ఇతరులకు చేస్తున్నవి.ఎప్పుడొకప్పుడు ఇతరులు నీకూ చేస్తారు.నువ్వు బాధపెడితే ఇతరులు నిన్ను బాధిస్తారు. నువ్వేది ఇతరులకి ఇస్తే అదే నీకు తిరిగి వొస్తుంది..ఇదే సత్యం..ఇదే జీవత రహస్యం.మీ కామెంట్ బాగుంది…tq

  • ఇది కథ కాదు.
    మన అందరి కథ.
    పల్లెటూర్లో పుట్టిన ప్రతిఒక్కరికీ ఇలాంటి తాతలు ఉంటారు.
    మా తాత కూడా చనిపోయే ఒక్కరోజు ముందు వరకు పనిచేశాడు.
    ఇది చదువుతుంటే మా తాత కథ చదివినట్టే ఉంది.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు