మేం… కంటుగాదు

మేం… కంటుగాదు

క్కపూట నాఖా పెట్టి పట్నంలోని ఆకొన గచ్చిబౌలి నుంచి ఈ కొస ఎల్బీనగర్‌ కొచ్చేసరికి గీయాల్ల అయ్యింది. టైమ్‌ పావుతక్కువ నాలుగైంది. మూడున్నరకు వచ్చే లక్ష్మాపుర-హైదరాబాద్‌ వయా సిరిపురం బస్సు ఇంకా రాలేనట్టుంది. మా ఊరోల్లు కొందరు బస్టాండ్లో ఎదురు సూస్తుండ్రు. అటు ఇటు అంటున్నంగనే బస్సు వచ్చింది. ఎక్కి కూకున్న. బస్సు ముందుకు కదిలింది. మోటర్లన్నీ బుర్ర.. బుర్ర అంటూ అటు ఇటు పోతున్నయి. నా ఆలోచనలు కూడా ఒకసారి అయిటెంట ఎనుకకు పోయినయ్‌.

రెండు నెలల కిందటి ముచ్చట… ఊర్ల ఒక మీటింగ్‌ తర్వాత నల్గొండల శ్రవణ్‌ కల్సి, అన్న ఊర్ల ధూం-ధాం చెయ్యాలనుకుంటున్న. మీ గైడెన్స్‌ ఇంకా సపోర్టు, సహాయం కావాలి అండు. అది ధూం- ధామ్ల హవా కాలం, తెలంగాణ ఉద్యమం జోరుగా సాగుతుంది. తెలంగాణ సాధన కోసం ఒక్కొక్కరు ఒక్కో ఆశతో,తలవొక రూపంలో,  దృక్పథంతో కొట్లాడుతుండ్రు. నేను ఒక సామాజిక తెలంగాణ కోసం సామాజిక-సాహిత్య-అస్థిత్వ ఉద్యమంలో నిరంతరం పని చేస్తున్నని చాలా మందికి తెల్సు. మా ఊర్ల శ్రవణ్‌కి కూడా ఇప్పుడు తెలంగాణ ఉద్యమ పిచ్చి పట్టడానికి నేను కూడా ఒకందుకు బాధ్యుడ్నేమొ . నా మాటలు, రచనలు, ప్రభావం అతనిపై చాలానే ఉండే. తెలంగాణ ఉద్యమంలో ఊరుని ఏకం సెయ్యడంలో దూకుడుగా ఉండు.

తెలంగాణ ఉద్యమ కార్యాచరణలో భాగంగా ప్రజా ప్రతినిధులందరు రాజీనామా చేయాలని  స్టేట్ జేఏసీ పిలుపునిచ్చింది. సుట్టుపక్కల ఊర్లళ్ళ సర్పంచ్లు, ఎంపీటీసీలు అందరూ రాజీనామా సేసిండ్రు. కానీ మా ఊర్ల సర్పంచ్‌ జేయలే. ఎందుకంటే మా ఊర్ల అధికారంలో ఉన్న పార్టీ తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించే ఓ మార్క్సిస్టు పార్టీ. అందుకే రెండు రోజులు వరుసగా కొంతమంది వయసు పోరలు గ్రామ పంచాయతీ దగ్గర సర్పంచ్‌ రాజీనామా చేయాలని లొల్లి సేసిండ్రు. అయినా మా సర్పంచ్‌కి పెయ్యి మీద సీమ కుట్టినట్టు గాలె. సర్పంచ్‌ గ్రామ పంచాయతీ ఆఫీసు అటెంక కూడా రాలె.

ఇగ మూడో రోజు పిల్లలు సర్పంచ్‌ రావాలని పట్టు పట్టిండ్రు. ఆళ్లు, ఈళ్లు నచ్చజెప్పిన ఇనలె. కాదు కక్కసం ఆయనొచ్చి రాజీనామా సెయ్యాల్సిందేని పట్టుబట్టిండ్రు. గ్రామ పంచాయతీల ఆఫీసు దగ్గర నాలుగింటి దాకా చూసిండ్రు. సర్పంచ్‌ ఇగరాలే…అగరాలే. ఓపిక నశించిన పోరలు ఆఫీసుల ఉన్న కుర్చీలు బెంచీలు ఇరగగొట్టిండ్రు. పడుసు- పడుసు.. పెడుసాయే మరి. ఇదే సందని సర్పంచ్‌, ఇంకొంత మంది కల్సి, అందులో 16 మంది మీద కేసు పెట్టిండ్రు. సర్పంచ్‌కి కంటవుడు దేనికని సానామంది పెద్దమనుషులు నోరు మెదపలె ఊర్ల.

16 మందిల అన్ని కులాలోల్లు ఉండ్రు. పోలీసులు వచ్చి ఇస్టేషన్‌కు తీసుకుపోయిండ్రు. ఊర్ల కొందరు ధైర్యం చేసి జేఏసీ ఏర్పాటు చేసుకొని ఆళ్లని, ఈళ్లని పట్టుకొని, జిల్లా నాయకులతో కల్సి ఎట్లనో వొగట్ల బెయిల్‌ తెచ్చుకుండ్రు. గప్పుడే 16 మందికి బెయిల్‌ వొచ్చిన సందర్భంలో ఒక సిన్నపాటి ధూ.. ధాం.. చేసిండ్రు. కానీ సర్పంచిని నిలదీసుడు పని ధైర్నంగా ఆ మీటింగ్‌లో ఎవ్వరు సేయలే. ఆ మీటింగ్‌లో చాలామంది రాజకీయ నాయకులే ఉండ్రు మరి. ఆ మీటింగుకు నన్నుసుతా పిల్సిండ్రు. చెరుకు సుధాకర్‌, సాంబశివుడు  చేతుల మీదుగా “సింగిడి” (తెలంగాణ రచయితల సంగం ) ఆద్వర్యం లో 2009లో తెచ్చిన “జాగొ-జగావో”కవిత సంపుటి ఆవిష్కరణ అప్పుడే చేసినం. అరెస్టయిన పిల్లలను అభినందించి, నైతిక మద్దతిచ్చినం. ఆ మీటింగ్‌ తెలంగాణకు కంటున్న వాళ్లను నిలదీసిన తీరు చాలా మందికి నచ్చింది. అందులో శ్రవణ్‌ ఒకడు. అప్పటి నుంచి ఆ లైన్లో మొత్తం ఒక సభ చేయాలని సోచాయించిండు.

నల్లగొండల జరిగిన ధూం.. ధాంల కల్సినప్పటి నుంచి ఇంకా పట్టు పట్టిండు. సరే అనయితే అన్నా కాని… నా యాంత్రిక జీవనంలో ఇక్కడి సంస్థ ఉద్యోగ బాధ్యతల్లో పడి పెద్దగా పట్టించుకోలే. మధ్యమధ్యల ఫోన్‌ చేస్తే కొన్ని కరపత్రాలు పంపిన. ఈ మీటింగ్‌ అందరికంటే భిన్నంగా ఎందుకుండాలా, మన దృక్పథం ఏంటి? తెలంగాణ వస్తే మనలాంటి బుడ్డ గోషోళ్లకు ఒరిగేదేందో ఆలోచించాలి అని చెప్పిన. ఎస్సీ, ఎస్టీ, బీసీ అస్థిత్వ కోణంలోంచి తెలంగాణ ఉద్యమంను చూడాలని చెప్పిన.

సూస్తున్నండంగనే రెండు నెలలు అయిపాయ. వారం కింద బరాలోల్ల క్రిష్ణ కాక ఫోన్‌ చేసిండు. చిచ్ఛా నేను శ్రవణ్‌ ఇద్దరం అచ్చినం… మిమ్మల్ని కలవాలె. కరపత్రం వచ్చింది మొదటిది మీకే ఇయ్యాలే. ఇంట్లో ఉన్నరా? మేము కోటిలో ఉన్నం అండు. ఫోన్లనే పత్తా సెప్పిన. పత్తా అలుకగనే దొరికింది. మా దయామణి ఆదివారం అయిన కొలువుకు పనుందని పోయింది ఎటూగాని యాల. మధ్యాహ్నం 2.30 అయ్యింది. బియ్యం పొయ్యి మీద పెట్టిన. పొద్దుగాళ్ల జేసిన కూర అడుగుబొడుగు గింతత..ః ఉంది. ఇన్ని ఒట్టి తునకలు ఏంచిన.

అందరం తింటున్నామ్ . తింటుంటనే ముచ్చట ఎల్లవెట్టిన. మీటింగ్‌ ఎట్లా చేయాలె. ఊర్ల ఎట్లా మాట్లాడాలె. ఏమేమ్‌ చేయాలె అని మాట్లాడుకున్నమ్‌. వాళ్లు కూడా చాలా సుదరాయింపుగానే విన్నరు… గట్లనే ఉండ్రు. కొన్ని కరపత్రాలు తీసుకున్న.అప్పుడే పైలం సంతోషన్న, ఏపూరి సోమన్న ట్రూప్లకు ఫోన్‌ చేసి చెప్పినమ్. నాకు తోసిన సాయం చేసిన. పైసల కోసం ఎవరి దగ్గర సెయ్యి సాపకుండ్రి అన్న… ఆధిపత్య కులాల దగ్గర అస్సలడగకుండ్రి, మీటింగ్‌కి ఒక దినం ముందే వస్తలే పైలంగా పోండ్రి అని లకిడికపూల్ల బస్సెక్కించిన. కానీ, ముందొస్తానికి వసర్తికాలె నాకుగిట్ట. గీ మీటింగ్‌ దినమైనా యాళ్లపొద్దుగాళ్ళ పోదామనుకుంటే కొలువుకాడా తీరువాటుగాలె.

బస్సుల ఆళ్ల ఈళ్ల పలకరింపు, ఆలోచనల మధ్యల ఉండగానే ఊరొచ్చింది. దబ దబ దిగిన. జేఏసీ పిల్లలు కొంతమంది బస్సు దగ్గర ఉండ్రు, ఆళ్లు నాకోసమే ఎదురు చూస్తుండ్రు. అందరం కమ్యూనిటీ హాల్‌ దగ్గరికి వచ్చినం. బోనాలతో, జూలూసు తయారవుతుండ్రు. డప్పులు కాపుతుండ్రు. మీటింగ్‌ గ్రామ పంచాయతీ దగ్గర. శ్రవణ్‌ కల్సిండు. అన్న గుబులయ్యిందే, మీరు రారేమోనని, జెరంత భయంతో. జెర్రంత ముందల వసర్తి కాలద? అన్నడు శ్రవణ్‌. అంతా మంచిగ అయితది ఫికర్‌ జేయకని ఒక్కసారి  బిగ్గరగా అల్లుకున్న. ఊర్ల ధూం… ధాం… వాతావరణం వచ్చింది అదే పెద్ద సక్సెస్‌ అని ధైర్యం చెప్పి ఇంటికి బయలుదేరిన. ఇంటికాడ బ్యాగ్‌ పడేసి, కాలజేతులు ,మొఖం కడుక్కొని మళ్లొచ్చిన. డప్పులతోని బోనాల ఊరేగింపుగా మీటింగ్‌ దగ్గరికి కదిలిండ్రు. అప్పటికే మయాఉర్ల, మా ఆడకట్టుకు   సమాజస్పృహ ఉన్నది. సాజిక ఉద్యాల అనుభవమ్ ఉన్నది.

శ్రవణ్‌, జానీ, రమేష్  ఇంకా వాళ్ళ గ్యాంగ్ను పక్కకు పిల్సి సభా నిర్వహణ గురించి మాట్లాడినా. అతిథులను ఆహ్వానించడం, నా స్వాగతోపాన్యాసం, తర్వాత కేసులు పెట్టబడిన 16 మందికి సన్మానం.సభా నిర్వహణ శ్రవణ్‌ జేస్తడు, మధ్య మధ్యల కళారూపాల ప్రదర్శన ఇట్లా అజెండా అనుకున్నాం . జూలూస్‌ బాగా జరిగింది. ఆళ్ల ఫీల్డ్‌ వర్క్‌(filed work) కష్టం కనిపిస్తుంది. ‘జై తెలంగాణ… జైజై తెలంగాణ…’ నినాదాలతో గ్రామ పంచాయతీ సభా ప్రాంగణంకు ఊరు- ఊరంతా జేరుకుంది. పిల్లా, జెల్లా, ముసలి, ముతక, ఆడ, మగ, పక్క ఊర్లల్లన్నిటితోని సభ నిండిపోయింది.

మా ఊరగుంట అలుగెల్లినట్టుంది గా సభ. హైద్రాబాద్‌లో కొన్ని వందల మీటింగ్లు జేసిన, ఊర్లనే అనే సరికి కొంత భయం జొబ్బింది. మనుసులు ఒక మాదిగలు లీడ్‌ చేసే మీటింగ్‌ కదా. అంబేద్కర్‌ మీటింగ్లు పెట్టినప్పుడు బీసీలు కూడా రాకపోతుండే. గీ మీటింగ్లా అందర్ని సూడటం బాగుంది. జేఏసీ కూడా జెర చెయ్యేసింది. జనాలంతా మంచి జోష్‌ మీద ఉండ్రు. మైకు నా చేతిలో పెట్టిండ్రు. వేదిక మీదికి ఒక్కొక్కల్ని పిల్సిన. సాంబశివున్ని పిలుస్తున్నప్పుడయితే సభా ప్రాంగణమంతా ‘జై తెలంగాణ’ నినాదాలతో మార్మోగింది. నేను సుత అన్నను సూడడం గిదే పైయీలు. ఆయన అన్నలల్ల ఉన్నప్పుడు ఆయన గురించి సానా సానా ఇన్నమ్‌. సభ నిండుకుండలా ఉంది. పైకెళ్ళి పండు వెన్నెల కాస్తుంది. కల్లాంల  వడ్లు ఎండబోసినట్టు జనాలు. స్వాగతోపాన్యాసం షురువు జేస్తూనే.. “చారిత్రాత్మక తెలంగాణ మలి దశ ఉద్యమంలో పాల్గొన్న మన ఊరి పోరల మీద కేసు పెట్టిన ఒక సర్పంచ్‌… ఆ సర్పంచ్‌ పార్టీ భేషరతుగా క్షమాపణ చెప్పాలి” అని ఒక బాంబు పేల్చిన. ఒక్కసారిగా సభ అంతా నిశబ్ధం నిండుకుంది.అందరిలో శూన్యం ఆవరించింది. ఆ నిశబ్ధాన్ని ఛేదిస్తూ… మళ్ళీ నేనే… “ఊరు ఊరంతా ఒక దశాబ్దాల  స్వప్నం సాకారం కావడానికి ఈడ గుమిగూడితే ఒక ఊరి ప్రథమ పౌరుడుగా ఆయన ఏం మామ్ల చేస్తుండు? ఊరి ప్రజల ఆకాంక్షను గౌరవించాల్సిన బాధ్యత ఆయనకు లేదా? పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి తెలంగాణ వద్దంటుంటే ఆ విషయాన్ని ప్రజలకు చెప్పి అర్థం చేయించాల్సిన అవసరం లేదా? గీ 16 మంది ఈరోజు కెళ్లి సిరిపురం చరిత్రలో నిలిపోతారు. వాళ్లకు క్షమాపణ చెప్పి, పశ్చాతాపం పొందుతడో లేక తను,తన పార్టీ చరిత్ర హీనులుగా మిగిలిపోతడో/రోఇప్పుడే తేల్చుకోవాలే” అని గదిమినా.

నా మాట పూర్తి చేయకముందే సభలోంచి ఒకాయన  లేచి ‘‘మీకు సర్పంచ్ క్షమాపణ చెప్పమనే అర్హత లేదు. ఆయన చట్ట ప్రకారం జేసిండు. తప్పనిసరి పరిస్థితిలో కేసు పెట్టిండు” అని బెదిరిస్తూ,.మీరు తరీఖాతో మాట్లాడండి అంటుంటే  ఇంకొ  నల్గురైదుగురు లేసి ఆయనకు వంత పాడినారు .

కాంగ్రెస్‌ తర్వాత కమ్యూనిస్టులే మా ఊర్ల ఎక్కువ ఉన్నరు. చాలా నిబద్దతగా ఉంటరు. స్వామి భక్తులుగా కూడా ఉంటరు. మధ్యలో కొందరు వాళ్లను ఊకుంచే ప్రయత్నం చేస్తుంటే నేనే “ఆళ్లను మాట్లాడనీయండీ ఆ ప్రశ్నలకు సమాధానం ఇయ్యడమే ఈ సభ ముఖ్య ఉద్దేశ్యం” అన్నాను.

మికేమ్ తెల్సు “అణగారిన ప్రజల కోసం దినం కొట్లాడే కమ్యూనిస్టులను అందున ఊరిని పట్టుకొని ఆపతికి, సాపతికి అందుబాటులో ఉండే వ్యక్తి మీద, పార్టీ మీద గుడ్డ కాల్చి మీదేయడం మంచిది కాదు” అన్నడొకాయన. “అయినా ఊర్లో ఉంటే తెలుస్తది, సుట్టపు సూపుకు వొచ్చెటోళ్లకు ఏం తెలుస్తది ఊరు బాధలు!” అంటుండొకాయన. ఏదో రాయి ఎయ్యాలని సూస్తే రెచ్చగొట్టాలని సూస్తే ఊరుకునేది లేదని అదమాయించి,అదమాయించి మీదిమీదికొస్తుండు ఇంకొకాయన.!.. ఊరి ప్రథమపౌరుడిని అవమానించినందుకు మీరే క్షమాపణ చెప్పాలని ఒకరు. అయినా మేము తెలంగాణకు వ్యక్తిగతంగా వ్యతిరేకం కాదు. మా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం. అయిన మేం ఇచ్చటోళ్లం కాదు.. తెచ్చేటోళ్లం కాదు కదా! అని ఇంకొక ఆయన బొంకుతుండు.

అయిన మేం, అణగారిన బాధితుల పక్షాన, ప్రజల సమస్యల కోసమే ప్రజాస్వామిక ఉద్యమాలు చేస్తున్నాం కదా! అది ఒక సామాజిక ఉద్యమకారుడిగా మీకు తెల్వదా మా సిద్ధాంతం? సభ ఇంకొకసారి పిన్‌ డ్రాప్‌ సైలెంట్గా( నిశబ్దంగా) మారిపోయింది.

నన్నే క్షమాపణ చెప్పాలన్న వాదనలో కూడా ‘పస’ ఉందన్నటుందని! జనాలు గుసగుసలాడుకుంటుండ్రు. నేను సుత సైలెంట్‌ అయిన. సభా వేదిక మీద పెద్దలు ఏం జరుగుతుందోనని ఆత్రుతగా, ఇబ్బందిగా  టెన్షన్‌గా సూస్తుండ్రు. “గట్లనే నేను క్షమాపణ చెబుతా. కానీ మూడు ప్రశ్నలకు మీరు ఏ సభముఖంగా  సరైన  సమాధానం చెప్పాలే” అన్నాను. కొమురంభీం యూత్,జేఏసీ వాళ్ళ ముఖంలో కొంత,కలవరం ,బాధ కనబడ్డది.  ఆదిలోనే ఈ ఆపశకునం ఏం దిరా ! అనుకుంటుండ్రు.

పులి రెండుడుగులు వెనకకు వేస్తుందంటే వెటాడటానికే అన్నట్టు కండ్లతోనే వాళ్లకు ధైర్యం చెబుతూ.. వాళ్లకు మైకు ఇవ్వమని చెప్పిన. నా మూడు ప్రశ్నలు అడ్గుడు షురూ జేసిన.

తెలంగాణ కోసం ఉద్యమం చేస్తున్న మన పిల్లలు పదహారు మంది మీద కేసులు పేట్టిన్రు. ఉద్యమ సమయంలో ఎంతో శానా పెద్ద పెద్ద మనుషుల మీదనే కేసులైనయ్. అంతెందుకు నా మీద కూడా ఇప్పటికీ నాలుగు కేసులు ఉన్నాయి. మనమోక లెక్కనా అనుకుందాం. కానీ మన పిల్లలు కోపంతోనో ద్వేషంతోనో పంచాయతీ ఆఫీసు మీదకి కొట్లాటకి పోలే. ఆళ్ళు చేసిందీ ఉద్యమమే. ప్రతీకారం కోసమేం పోలేదు వాళ్ళు. ఉద్యమంలో భాగంగా అట్లా చేయాల్సి వచ్చింది. ఇది తెలిసి పెద్దమనసుతో, పెద్దరికంతో మనమేమైన బెయిల్ ఇప్పించినమా? లేదే.. ఈడ మనకు పంతం అడ్డం వచ్చిందా? ఆళ్ళూ మన ఊరి పౌరులేగా . ఆళ్లను బయటకు తీసుకొచ్చుడు మన ధర్మం కాదా? ఏమే పెద్దమనుషులు.. జర ఆలోచన జేయున్డ్రి.

తెలంగాణ ఉద్యమమే హక్కుల ఉద్యమం. మన ప్రాంతం మీద మన అధికారం కోసం సాగే పోరాటం. ఈ పొద్దు ఈడ సబ్బన్డ వర్ణాలన్నీ గుమిగూడితే సర్పంచ్ ఇంట్ల దాసుకుంటాడా ? ఈన్దాక రాలేడా?! వచ్చే కనీస బాధ్యత లేదా? మీరు ప్రజల పక్షాన పోట్లాడుతుండ్రు కాదంటలేను. కాని ప్రజల నుంచి వచ్చిన ప్రజాస్వామిక ఉద్యమమైన ‘జై తెలంగాణ’ ఉద్యమాన్ని మీరెందుకు వ్యతిరేకిస్తుండ్రు?. అవి మీ పార్టీ సిద్ధాంతమైతే కాలం చెల్లిన మీ విశాలాంధ్రను ప్రజల కోసమే ఎందుకు మార్చుకొని గతి తార్కిక భౌతిక వాదనను అంగీకరించరా? స్వాగతించరా?

నా మాటలకు మద్యలో కల్పించుకొని  “కార్మికుల కోసం కొట్లాడిన ఏ నాయకున్ని, మా పార్టీ సొంతం చేసుకోలేదు. ఏ ప్రజా ఉద్యమాన్నీ మేం సమర్ధించలేదు చెప్పు? తెలంగాణకు మేం కంటు కాదు. అది మా పార్టీ నిర్ణయం. ఒక నిబద్ధత గల కార్యకర్తలుగా ఆ నిర్ణయాన్ని శిరసావహిస్తున్నాం. మీరు ఏ ప్రాతికదికన తెలంగాణను కావాలనుకుంటుండ్రు?  మిర్యాల భాస్కర్‌ కొంత ఆవేశంగానే నన్ను ఎదురు ప్రశ్నించునడు.

నేను కూడా అంతే గట్టిగా “ఒక్క రక్తపు బొట్టు చిందించకుండా 12 గంటల నుండి 8 గంటల పని దినాన్ని, సమాన పని వేతనం లాంటి ఎన్నో కార్మిక, స్త్రీ హక్కులను రాజ్యాంగం ద్వారా సాధించి పెట్టిన డా. బి.ఆర్‌.అంబేద్కర్ని మీరు ఎప్పుడైనా కార్మిక నాయకుడిగా ఈ దేశ ప్రజలకు పరిచయం చేశారా? ఇక పోరాటాల విషయానికి వస్తే అంబేద్కర్‌, పూలే ఐడియాలజీతో వచ్చే దళిత, బహుజన ఉద్యమాలకు మన రాష్ట్రంలో మీరెప్పుడు కూడా నైతిక మద్దతు ఇవ్వలేదు. ఈ ప్రజాస్వామిక తెలంగాణకు కూడా మీరు కంటే కదా? కార్యకర్తలు నాయకత్వాన్ని, నాయకత్వం కార్యకర్తల్ని రెగ్యులేట్‌ చేసుకుంటేనే కదా పార్టీ ప్రజల మనోభావాలని గౌరవించేది” అన్నాను.

“ఇగ మేం సామాజిక తెలంగాణ కోసం, చిన్న రాష్ట్రాలైతే అభివృద్ధి సాధ్యమవుతుందన్న అంబేద్కర్‌ దృక్పదమ  కోణంలోంచి తెలంగాణ ఉద్యమం చేస్తున్నాం” అని నా వాదనను అంతే  ధాటిగా  తిరుగు సమాధానం ఇచ్చా.

“మీరు గ్రామ ప్రథమ పౌరుని అవమానిస్తుండ్రు. తెలంగాణకు మేం.. ఏమీ వ్యక్తిగతంగా కంటుకాదు” అని మళ్లా  వెంకటేష్‌ మామా అలాయించి మైకు దగ్గరకి పెట్టుకొని అన్నాడు. నేను అంతే అలాయించి “వెంకటేష్ మామా అది అవమానం కాదే ప్రశ్నించడం అంటరు. ఐనా నిండు అసెంబ్లీ లోనే  రాష్ట్ర ప్రథమ పౌరున్నే ప్రశ్నించినం!, గ్రామ ప్రథమ పౌరుడు అందుకు అతీతం ఏం కాదు!. తెలంగాణ కోసం మీ జేజమ్మలనైనా ఎదిరిస్తాం.

మీరు వ్యక్తిగతంగా తెలంగాణకు కంటూ కాదు. కానీ మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం తెలంగాణకు కంటూ ” అని ఏటకారంగనే  అన్నాను.  నా టైమింగ్  చాతుర్యనికి  అవతలి వాళ్ళు నీళ్ళు నములుతున్నారు. బాగా అయ్యింది మేసలకుండా   సమాదానం ఇచ్చిండు  అన్నట్టుగా అందరూ సప్పట్లు అ వాళ్ళకు అటు సుతలయిస్తాలేదు ఇగ.

ఒక్కసారి ప్రజలందరూ లేసి “జై తెలంగాణ… జైజై తెలంగాణ” నినాదాన్ని అందుకుండ్రు. సభా ప్రాంగణం అంతా పద..పదిహేను నిమిషాలు ‘జై తెలంగాణ’ నినాదాలతో దద్దరిల్లింది.సాంబశివుడు, చెరుకు సుధాకరన్న లేచి మైకందుకొని ‘జై తెలంగాణ’ అని ప్రజలకు వంతపాడుతూ కూర్చోమ్మని సమ్లాయించడంతో అందరూ కూసుండ్రు. చీకట్లో కొంతమంది వెళ్తున్నట్టు మసక మసకగా కనుపడుతుంది. యూత్  కండ్లల్లో  మీటింగ్ లక్ష్యం  నెరివేరిందన్న సంతోషానికి , ఆకాశం పండు వెన్నెల  వర్షం  మద్దతు కురిపించింది.

*

గాదె వెంకటేష్

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు