ఎంత గడ్డుకాలం దాపురించినా మట్టినే నమ్ముకుని బతుకీడుస్తున్న రైతుల ప్రస్తావనతో మొదలైన ‘ఫణిమాధవి కన్నోజు’ రాసిన “అన్నం ముద్దలు అగ్గికొండలవుతున్నాయ్” కవిత వారి ఆగ్రహాన్ని, ప్రభుత్వ చట్టాల్లోని లొసుగులపై గొంతెత్తిన విధానాన్ని, ప్రతిఘటనా దృక్పథాన్ని ప్రతిబింబిస్తుంది.
*
అన్నంముద్దలు అగ్గికొండలవుతున్నాయ్
~
కాటేసే కరువుల్ని క్షమించాడు
ముంచెత్తే వరదల్నీ మన్నించాడు
ఊపిరిని ‘ఉరి’కి ఆరేసుకున్నాడు కానీ
మట్టిని వదిలాడా!?
నువు మట్టి మీదెక్కి స్వారీ జేస్తానంటే
ఊరుకుంటాడా!?
జనాల ఆకలి మీద అష్టైశ్వర్యాలను కలగంటున్న వాడా!
కాస్త ఆలోచించు
మౌనంగా గొంతు దిగే మెతుకుకు మాటొచ్చింది
అన్నంముద్దలు అగ్గికొండలవుతున్నాయ్
ఒక్కమాటలో చెప్పు
నువ్వు తెచ్చిన చట్టాల్లో మేలెంతో??
ఉత్పత్తి కి ముందే కొనుగోలుదారుడి ఒప్పందం
పంట పంపిణీ పై మరొకడి కర్రపెత్తనం
రైతు స్వేచ్ఛను హరించి నియంత్రణను కానుక చేసి సంబరపడమంటున్నవ్
కనీస మద్దతు ధర ముచ్చటేది చూపియ్!!??
దళారీలొద్దన్నట్టే వద్దని సూడో యజమానిని సృష్టించే చట్టం ఎందుకు!?
రైతును డమ్మీని చేసే జిమ్మిక్కులని జనం తెలుసుకోలేరనా!?
..
కాదేదీ కార్పోరేటర్పణకు అనర్హం అంటూ
వాణిజ్య సామ్రాజ్య విస్తరణకు మట్టినర్పిస్తున్నవ్
కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్టు
నీ కుర్చీ కింద నేల గుంజుకుంటున్నవ్
బిడ్డా జాగ్రత్త!!
కలుపు తీసిన చేతులు కొడవళ్ళైతున్నయ్!!
పంటచేలన్నీ పిడికిళ్ళవుతున్నయ్!!
*
“మౌనంగా గొంతు దిగే మెతుకుకు మాటొచ్చింది
అన్నంముద్దలు అగ్గికొండలవుతున్నాయ్” అని చెప్పడంలోని ‘మెతుకు, అన్నం ముద్దలు’ అనేవి రైతును, అతని బలాన్ని చూపెట్టే అంశాలు. మెతుకులు ఎట్లా సంఘటితమై అన్నంముద్దలుగా మారి అగ్గికొండలవుతున్నాయో – రైతుల ఆందోళన/ ఉద్యమ తీవ్రతను పట్టి చూపిస్తుంది. ఇటీవల కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులపైనే వీరి ఆగ్రహం. నిజానికి వ్యవసాయం రాష్ట్రజాబితాలోని అంశం. కాని వాటి వ్యాపార, వాణిజ్య వ్యవహారాలు (Trade & commerce of food procesing and food items) అనేవి కేంద్రపరిధిలోనివి. వీటి నెపంతో రాష్ట్రాల అధికారాన్ని పరిమితం చేస్తూ ప్రవేశపెట్టబడినవే ఈ బిల్లులు. ఇవే వ్యవసాయ స్వేచ్ఛాయుత మార్కెట్ బిల్లు, ఒప్పంద వ్యవసాయ బిల్లు, నిత్యవసర సరుకుల సవరణ బిల్లు.
“రైతు స్వేచ్ఛను హరించి నియంత్రణను కానుక చేసి సంబరపడమంటున్నవ్
కనీస మద్దతు ధర ముచ్చటేది చూపియ్!!??” అని కవి సూటిగా ప్రశ్నిస్తున్న విషయం వ్యవసాయ స్వేచ్ఛాయుత మార్కెట్ బిల్లుకు సంబంధించింది. దీని ప్రకారం రైతు ఎక్కడైనా (online plotform తోసహా) తన పంటను ఎలాంటి cessలు, రుసుములు చెల్లించనవసరం లేకుండానే అమ్ముకునే వెసులుబాటు కల్పించబడుతుంది. అయితే ‘కనీస మద్ధతు ధర’ ( MSP – Minimum Support Price) గురించిన ప్రస్తావన లేకపోవడం రైతుల్ని ఆందోళనకు గురిచేసింది.
“ఉత్పత్తి కి ముందే కొనుగోలుదారుడి ఒప్పందం
పంట పంపిణీ పై మరొకడి కర్రపెత్తనం” అనేది ఒప్పంద వ్యవసాయ బిల్లుకు సంబంధించింది. దీని ప్రకారం ఒకటి నుంచి 5సం.ల కాలపరిమితితో ప్రైవేట్ వ్యక్తులు, కార్పోరేట్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకోవచ్చు. అయితే ఏ పంటవేయాలి? ఎంతమేరకు కొంటారు? ఎంత ధర చెల్లిస్తారు? అనేవి ఒప్పందం కుదుర్చుకున్న వారే నిర్ణయిస్తారు. వివాదాల పరిష్కారం కోసం న్యాయస్థానాల జోక్యాన్ని మినహాయించి, అధికారాల్ని అప్పిలేట్ అథారిటీకి కట్టబెట్టడం జరిగింది. ఈక్రమంలో బడావ్యాపారశక్తులతో బక్కరైతు తలపడడం సాధ్యమేనా? అన్నది రైతుల ఆందోళనకు ఆజ్యంపోసింది.
“దళారీలొద్దన్నట్టే వద్దని సూడో యజమానిని సృష్టించే చట్టం ఎందుకు!?” – ఇది బ్లాక్ మార్కెట్ ను ప్రోత్సహించేందుకు అవకాశమున్న ‘నిత్యావసర సరుకుల సవరణ బిల్లు’కు సంబంధించింది. ఏవి నిత్యవసర సరుకులు, ఏవి కావు అనే వాటిపై స్పష్టత అవసరం. ఎంతమొత్తంలోనైనా నిల్వచేసుకునే సామర్థ్యం చిన్న కమతాల సాగుపై ఆధారపడ్డ రైతుల పరిధిలోని అంశం ఎంతమాత్రం కాదు. కృత్రిమ కొరతను సృష్టించి అటు రైతునుండి లాభపడి, ఇటు వినియోగదారుడిపై అధికధరల భారం మోపే వర్గాన్ని ఉద్ధేశించి స్పష్టమైన వివరణ లేకపోవడం ఆందోళన కలిగించే మరో అంశం.
*
కవి స్పష్టమైన అవగాహనతో, పరిజ్ఞానంతో రాసిన కవిత యిది. “కలుపు తీసిన చేతులు కొడవళ్ళైతున్నయ్!!
పంటచేలన్నీ పిడికిళ్ళవుతున్నయ్!!” ముగింపులో రైతుల ప్రతిఘటనా దృక్పథాన్ని సూటిగా, స్పష్టంగా చెప్పగలిగారు. ప్రతి చట్టంలోనూ రెండు పార్శ్వాలుండడం సహజమే. వీటి అమలు విషయంలోనూ చిన్న చిన్న సవరణలతో అంతిమంగా రైతుకు మేలుచేసే అంశాలపై ప్రభుత్వం మరింత దృష్టిసారిస్తే వ్యవసాయరంగం బలోపేతం అవ్వగలదు. కవి ఆశించిన ఫలితం నెరవేరగలదు.
*
చాలా చక్కని కవిత. అంతే గొప్ప విశ్లేషణ.
కవితలోని ఆవేదననూ ఆవేశాన్నీ.. మరీ ముఖ్యంగా అవగాహన నూ సరిగ్గా పట్టుకొని పరామర్శించారు. కవిత ఆత్మను అద్దంలో పట్టి చూపినట్టు ఉంది వ్యాసం. ఇది చదివాక చాలా తృప్తిగా ఉంది కవిత పట్ల. మీకూ సారంగ సారధులకు చాలా కృతజ్ఞతలు తమ్ముడూ.
అద్భుతమైన కవితను అంతే అద్బుతంగా పరిచయం చేసారు అన్న..కవితను పరామర్శించిన వైనం చాలా నచ్చింది.. అక్కకు మీకూ శుభాకాంక్షలు
మంచి విశ్లేషన అన్న, ఫణిమాదవి మేడమ్ గారికి అభినందనలు అలాగే బండారికి .