మృతులు మరణిస్తారు కాని నశించరు!

నెత్తురు ఆరిపోని చరిత్ర పాలస్తీనా

కొన్ని సంఘటనలు కొన్ని వ్యక్తిత్వాలను తెలియజేస్తాయి. కొన్ని కనువిప్పులకూ, చైతన్యానికీ కూడా దారితీస్తాయి. 1984 నవంబర్ లో ఉదయం దినపత్రికలో  హెచ్చార్కె, నేను పక్కపక్కన కూర్చుని వార్తలు రాస్తుంటే నా చేయి తగిలి టేబుల్ పై పెట్టిన ఆయన కళ్లద్దాలు క్రింద పడి పగిలిపోయాయి. ఆయన ఏ మాత్రం నొచ్చుకోకుండా “ఫర్వాలేదులే కృష్ణా, బాధపడకు” అని నన్నే ఓదార్చారు.  ఏమీ జరగనట్లు ఆయన రాతలో మునిగిపోయారు.

ఆ రోజంతా నేను ఎంతో బాధపడ్డాను. నెల జీతం వచ్చేవరకూ కళ్లద్దాలు లేకుండానే ఎంతో కష్టంగా పనిచేస్తూ వచ్చినా ఆయన నన్నుపన్నెత్తు మాట అనడం కానీ, ఎవరికైనా కళ్లద్దాలు పగుల గొట్టింది కృష్ణుడే అని చెప్పడం కానీ చేయలేదు. అయినా కళ్లద్దాలు  పగుల గొట్టేందుకు ఆయన రుణం ఏదో రకంగా తీర్చుకోవాలనుకున్నాను. జీతం రాగానే పుస్తకాల షాపు కు వెళ్లాను. హెచ్చార్కెకు కవిత్వం ఇష్టం కదా.. అని వెతుకుతుంటే అప్పుడే మార్కెట్ లోకి వచ్చిన ‘నేను నేలకొరిగితే’ అన్న పాలస్తీనా కవితలు, రచనల సంకలనం కనపడింది.దాన్ని కొనుక్కుని హెచ్చార్కెకు ఇవ్వగానే  ఆయన ఎంతో సంబరపడిపోయాడు. “కళ్లద్దాలకు ప్రతిఫలమా..”అని అడిగాడు. “కాదు సార్, మీకు కవిత్వం ఇష్టమని తెచ్చాను..”అన్నాను. చాలా మంచి పుస్తకం ఇచ్చావు అన్నాడు.  హెచ్చార్కె, నేను ఆ తర్వాత  పాలస్తీనా కవిత్వం గురించి చర్చించుకున్నాము.

హెచ్చార్కె వ్యక్తిత్వం గురించి మాత్రమే కాదు, ఆ రోజుల్లో పాలస్తీనా తెలుగు సాహిత్యాన్ని ఎంత ప్రభావితం చేసిందో అని చెప్పేందుకు  ఇది ఉదాహరణ. పాలస్తీనా మాత్రమే కాదు, ఆఫ్రికా, లాటిన్ అమెరికా తెలుగు సాహిత్యంలో ప్రత్యక్షమయ్యేవి. ఎక్కడ కన్నీళ్లు,నెత్తురూ,పోరాటం ఉండేవో ఆ ప్రాంతాన్నేతెలుగు సాహిత్యం ప్రేమించేది. చైనా,రష్యా సాహిత్యాలు అంతకు ముందే తెలుగు సాహిత్యాన్ని తమ వెంట తీసుకువెళితే, నెరూడా,  హోచిమిన్, లుముంబా, వోలె సోయెంకా, మహమ్మద్ దర్వేష్ ..ఇలా ఎందరో తమ గాయాల బాధల్ని తెలుగు నేల అనుభవించేలా చేశారు. అప్పటికీ,ఇప్పటికీ తెలుగు నేల అంత చైతన్యవంతమైన నేల ఇంకొకటి లేదు.

కొన్ని పోరాటాలు విజయవంతమవుతాయి. కొన్ని పోరాటాలు విఫలమవుతాయి. కొన్నిపోరాటాలు విజయం తర్వాత విఫలం చెందుతాయి. కొన్నిచరిత్ర పుటల్లో కలిసిపోతాయి.కాని నెత్తురు ఆరిపోని చరిత్ర పాలస్తీనా. అరబిక్ భాషలోచెప్పాలంటే అదో నక్బా (మహోత్పాతం). కొన్ని దశాబ్దాలుగా పాలస్తీనా ఖడ్గంపై రుధిర ధార ఆగలేదు.

మీ గోడలు ప్రజా వార్తాపత్రికగా మారిపోయి

మీ చేతిలోని బాంబు ఓ కవితగా పేలింది

ఈ గడ్డమీద నివసిస్తున్న స్త్రీలందరి నొక్కుల వెండ్రుకలూ

మీ జెండాగా మారడానికి తహతహలాడుతున్నాయి

మీ నేల కింద గనులుగా బద్దలు కావడానికి

అని రాసిన మొయిన్ బెస్సిసో ఎన్నో సార్లు బహిష్కృతుడై, జైళ్లపాలే,చిత్రహింసలు కు గురై కూడా కవితలు రాశారు. అలా ఎందరో కొన్ని దశాబ్దాలుగా కవితలు రాశారు,ఇంకా రాస్తూనే ఉన్నారు.బాంబు ప్రేలుళ్ల మధ్య,కూలిపోయిన ఇళ్ల మధ్య. మృత దేహాల మధ్య,అత్యాచారాల మధ్య అక్కడ ఇంకా కవిత్వం ప్రభవిస్తూనే ఉంది.

1976లో నేను హైదరాబాద్ నుంచి వరంగల్ లో ప్రవేశించిన తర్వాత నాకు అక్కడి వాతావరణం పాలస్తీనా ను తెలుసుకునేందుకు దారితీసింది. ‘సృజన’లో పాలస్తీనా కవితలు క్రమం తప్పకుండా వచ్చేవి.

“నీవు విసిరి గ్రేనేడ్ జియోనిస్టుల గుండెలలో ప్రేలుతున్నది” అని పాలస్తీనా కవి  ఘసన్ కన్ ఫానీ రాసిన కవితను ప్రచురించడమే కాకుండా పాలస్తీనా విమోచనోద్యమ చరిత్రను 1978 జులై సంచికలో ‘సృజన’ నాకు పరిచయం చేసింది. అప్పటికి ఆరేళ్ల క్రితమే ఇజ్రాయిల్ సైనికులు ఘసన్ కన్ ఫానీని హత్య చేశారు. “భూమి లేని ప్రజల కోసం  ప్రజలు లేని భూమి” అని సృజన 1982 ఆగస్టులో పాలస్తీనా నెత్తుటి పోరాటాన్ని పరిచయం చేయడమే కాదు,ఎందరో పాలస్తీనా కవుల కవితల్ని పరిచయం చేసింది. ఈ వ్యాసం రచనలో,ఆ కవితల అనువాదంలో  నా మిత్రుడు ఎన్ వేణుగోపాల్ హస్తం ఉన్నదని నాకు తర్వాత తెలిసింది.

పాలస్తీనాను తెలుగు నేలపై పరిచయం చేయడంలో వేణుగోపాల్ అగ్ర స్థానంలో ఉంటారనడంలో సందేహం లేదు. “ప్రతి అందమైన కవితా ఒక ప్రతిఘటనా స్వరమే” అన్న  దర్వేష్ కవితల్ని  సృజనలో వేణు ఎన్నిసార్లు  అనువదించారో!  నిజం శ్రీరామ మూర్తి సంపాదకత్వంలో ఆంధ్రపత్రికలో  సాహితి శీర్షికతో పేజీని నిర్వహించినప్పుడు కూడా వేణు పాలస్తీనా కవితల్ని ప్రచురించినట్లు గుర్తు.

పాలస్తీనా ఉద్యమాన్ని తెలుగు ప్రపంచానికి తెలిపిన సాహితీ సంస్థ జనసాహితి. ‘నేను నేలకొరిగితే’ అన్న సంపుటాన్నిప్రచురించింది అదే సంస్థ. నిర్మలానంద, దివికుమార్, రవిబాబు తదితరులకు తెలుగు సాహిత్యం ఈ విషయంలో ఎంతో రుణపడి ఉండాలి.

“యుద్దం చేసే వాళ్లకీ,పేద వాళ్లకీ చెప్పులు కుట్టి ఇచ్చే  పాలస్తీనియన్ కవి అహ్మద్ డాబర్ ను అడుగు చెబుతాడు జీవితమంటే ఏమిటో,జీవించటమంటే ఏమిటో.. భార్యా,ఎనిమిది మంది పిల్లలు బాంబుతో పాటు బద్దలైపోతే,వాళ్లతో పాటే రెండో సరిహద్దు ఆకాశానికెగిరిన పాలస్తీనియన్ కవి డాబర్ ను అడుగు పంట చేలమీద వాలే మిడతల దండు గురించి ముందుగా తెలిపేదెవరో.. నగ్న పాదాల రాత్రుల దారుల వెంట జైళ్ల నుంచి బయళ్లకీ,బయళ్ల నుంచి ఊళ్లకీ నిర్భీతిగా ఎవరు నడుస్తారో , పొలాల్లో ఎగిరే సీతాకోక చిలుక శుభ ప్రపంచాల స్వప్నాల గురించి ఎవరు పాడతారో..” అని 1997 లో శివారెడ్డి “నా కలల అంచున” కవితా సంపుటిలో రాశారు. “పాలస్తీనా,ఆయుధం వెనక్కి తీసుకోవద్దు..” అని నందినీ సిధారెడ్డి కూడా రాశారు.

1992లో దేశ రాజధాని ఢిల్లీలో ప్రవేశించిన తర్వాత పాలస్తీనాను తెలుగు వారే కాదు, అనేకమంది ఉర్దూ, హిందీ,ఇతర భాషల కవులు కూడా ప్రేమించినట్లు తెలిసింది. ఫైజ్ అహ్మద్ ఫైజ్ లా   ‘మత్ రో బచ్చో (పిల్లల్లారా ఏడవకండి)’ అని ఓదార్చారు. ఇజ్రాయిల్ ను సాంస్కృతికంగా బహిష్కరించాలని 2010లో ఎందరో రచయితలు, కళాకారులు పిలుపునిచ్చారు.

విచిత్రమేమంటే పాలస్తీనాతో భారత్  అనుబంధం పాలస్తీనావిమోచనోద్యమ నేత అరాఫత్ మరణంతో అంతరించింది. చాలా మంది భారతీయులకు పాలస్తీనా అంటే అరాఫత్, అరాఫత్ అంటే భారత్.  అరాఫత్ అనేక సార్లు భారత్ సందర్శించారు. జామియా మిలియా యూనివర్సిటీలో అరాఫత్ హాల్ పేరిట ఒక ఆడిటోరియం కూడా ఉన్నది. “మృతులు మరణిస్తారు కాని నశించరు” అన్న వాక్యాలు ఇంకా అక్కడ పాలరాతిలో చెక్కి కనపడతాయి. సాహిత్య అకాడమీ సమావేశాలకుకూడా పాలస్తీనా కవులు వచ్చినట్లు నాకు గుర్తు. కాని ఇప్పుడు అలాంటి వాతావరణం కనపడడం లేదు.

పివి నరసింహారావు ఇజ్రాయిల్ తో సంబంధాలను ఏర్పర్చుకున్నప్పుడు అరాఫత్ దాన్ని వ్యతిరేకించలేదు.”రెండు దేశాలమధ్య సంబంధాలు ఉండడం సరైనదే” అని 1997లో ఆయన ఢిల్లీలో విలేకరుల సమావేశంలో చెప్పారు. యూదులు,ముస్లింలు, క్రైస్తవులు కలిసి నివసించే ఒక మతాతీత రాజ్యం గా పాలస్తీనాను రూపొందించాలని అరాఫత్ 1974లో ఐక్యరాజ్యసమితిలో ప్రకటించారు. “ఒక చేతిలో  శాంతికపోతం, మరో చేతిలో స్వాతంత్ర్య యోధుడి తుపాకితో ఉన్నాను. నా చేతిలో శాంతికపోతాన్ని ఎగిరిపోనివ్వకండి.” అని ఆయన ఆనాడే హెచ్చరించారు.

అలాంటి అరాఫత్ నే ఇజ్రాయిల్ ఉగ్రవాదిగా అభివర్ణించింది. ఈ క్రమంలో తానే ఉగ్రవాదిగా మారింది. ప్రభుత్వాధినేతలు, వారి బలగాలు  ఉగ్రవాదులైనప్పుడు ప్రజలు ఉగ్రవాదులుగా మారడంలో ఆశ్చర్యం ఏమున్నది? పాలస్తీనాను ఆయన మతాతీత రాజ్యంగా మార్చాలని కలలు కన్నారు. ఇవాళ  భారత దేశంతో సహా అనేక దేశాలు మత రాజ్యాలుగా మారే ప్రమాదాలు కనపడుతున్నాయి.

ఇవాళ ప్రజల స్వప్నాలు రక్తసిక్తమైనప్పుడు, అక్షరాలు తూటాలైనప్పుడు, హింస జీవన సంగీతమైనప్పుడు కవిత్వం చితిమంటల్లా రగలకతప్పదేమో.

*

Image: Palestine and West Bank wall

చిత్రం: తుల్లిమిల్లి విల్సన్ సుధాకర్

కృష్ణుడు

వారం వారం ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఢిల్లీ నుంచి కాలమ్ రాసే ఎ. కృష్ణారావు, అడపా దడపా కవితలు రాసే కృష్ణుడూ ఒకరే. జర్నలిస్టుగా 34 సంవత్సరాల అనుభవం ఉన్న కృష్ణుడు కవి, సాహితీ విమర్శకుడు కూడా. ఇండియాగేట్, నడుస్తున్న హీన చరిత్ర పేరుతో రాజకీయ వ్యాసాల సంకలనాలు వెలువరించిన కృష్ణుడు ఇంకెవరు, ఉన్నట్లుండి, ఆకాశం కోల్పోయిన పక్షి అనే కవితా సంకలనాలను వెలువరించారు.

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు