మూసిన తలుపుల వెనుకగా

చివరిసారి ఇంటికి ఎప్పుడు వెళ్ళావో జ్ఞాపకం లేదు నీకు. ఇంటికేసి నడుస్తూ, నువ్వు గుర్తు తెచ్చుకోడానికి ప్రయత్నిస్తావు కానీ, ఎంత కాలం అయ్యిందో నీకు తట్టదు. నువ్వు కూడా మరి వృద్ధాప్యంలోకి పాదం మోపుతున్నప్పుడు, కాలం ఒక క్లిష్టమైన పజిల్ లాగా మారుతుంది. తేటగా, నిర్మలంగా సరళంగా ఇంకేమాత్రం ఉండదు అది. క్షణాలూ, రోజులూ, సంవత్సరాలకీ మధ్య పెద్దగా తేడా అగుపించదు. నడుస్తున్నది, బ్రతుకుతున్నది నువ్వని కూడా అసలే తోచదు, ఆ లోక కాలాలలో –

నీ ఎదురుగా మధ్యాహ్నపు ఎండ. మే నెల ఎండ. తళతళలాడే ఒక ప్రతిబింబంలాగా. అది ఉంది, ఒక  పక్వమైన మామిడి పండు రంగులాగా అని నీ ఊహ. వెనువెంటనే నీలో, చికాకు. ఆ ప్రతీకల భాష ఇంకా నిన్ను వదలనందుకు. ఇక నువ్వు నడిచే దారికి ఇరువైపులా దుకాణాలు, వాటిలో మనుషుల రణగొన  ధ్వనులు. కొన్ని ఆకుపచ్చగా, మరికొన్ని ఎండిన ఆకుల్లాగా, అతి తక్కువగా కొన్ని మాత్రం నీటి చినుకులలాగా. నిజానికి, వీటన్నిటి మధ్యా పెద్ద తేడా ఏమీ లేదు – ఊరికే తూచడం. పాత ఇనుప సామాన్లు అమ్మే దగ్గర తుక్కుని తూచినట్లు. అది కూడా తక్కువ ఏమీ కాదు. బ్రతకడం అంతే –

ఇంటికి చేరితే, వేసి ఉన్న గేటు (నల్లనిది). తలుపుని కప్పుతూ కర్టెన్ (తెల్లని పూల బొమ్మలది). లోపల తను ఉన్నదా? ఏమో, ఎవరికి తెలుసు? కానీ, ఆవరణలో చల్లని నీడలు. నీళ్లలో ముంచి ముగ్గు వేసినట్లుగా ఉన్న నీడలు. నరికి వేసినా తిరిగి బ్రతికి, నింగికి చేతులు చాచి ఎదుగుతోన్న వేపచెట్టు. మొక్కలు పెట్టుకునేందుకు వారగా ఏర్పరచిన దడిలో, ఎత్తి పోసిన వేపాకులు, వాటిలో ఏవో కాగితాలూ; కొంచెం పక్కగా ఒక బుట్ట. ఇంకో వైపు, నీళ్ల కుళాయి వద్ద, డ్రమ్. పైగా కట్టిన ప్లాస్టిక్ తీగపై ఆరేసిన దుస్తులు ( రెండు చీరలూ, ఒక బ్లూ టవల్ ఇంకా వెలసిన రంగులో తను వేసుకునే జాకెట్లూ). ఇవన్నీ కాక, ఏవో సవ్వడులు. ఎంత జాగ్రత్తగా విన్నా, అవేమిటో నువ్వు సరిగ్గా చెప్పలేవు. గాజులు నేల జారి పగిలినట్లు, పేరు తెలియని పిట్టలు లీలగా అరిచినట్లు, లేదా ఎవరో చాలా జాగ్రత్తగా ఏమాత్రం శబ్దం రానంతగా నీలోంచి వెలుపలికి నడిచి వెళ్లిపోయినట్లు (ఎవరది?) –

ఇక, నువ్వు కర్టెన్ పక్కకి జరిపి తలుపుని నెమ్మదిగా తడితే, అంతే నెమ్మదిగా కదులుతుంది అది. దగ్గరగా వేసి ఉన్న తలుపులు – తోస్తే నిన్ను ఆ మిట్ట మధ్యాహ్నంలో కూడా పలుకరించే చీకటి. ఎందుకింత చీకటి? ఇక్కడ? ఒకప్పుడు దర్గాలా ఉన్న ఈ చోట? లోపలేమీ వెంటనే కనిపించవు నీకు, ఆ హాల్ లో. అంతం కాని రాత్రుళ్లను స్ప్రే చేసినట్లు ఉండే ఆ గదుల్లో. తడుముకుని, కిటికీ కర్టైన్స్ తెరిస్తే, లోపలికి వ్యాపించిన వెలుతురులో ఉలిక్కిపడి లేచే ఒక పాత సోఫా. అరల్లో వాంపైర్స్ వంటి పుస్తకాలు, వరసగా. మరో పక్కగా టీవీ, దాని పైన సెట్ టాప్ బాక్స్. నేలపై, గత రెండు రోజుల దిన పత్రికలూ, వాటిలో వచ్చిన అడ్వర్టైజ్ మెంట్ల పామ్ప్లెట్స్, వాటి పైనా కిందా దుమ్ము. (ఆ దుమ్ము ఇప్పటిది కాదు, ఇక్కడిది కాదు). వాటిని ఎత్తి, దులిపి సోఫాలో ఉంచి, లోపలి బెడ్ రూమ్ వైపు నడుస్తో “అమ్మా” అని పిలుస్తావు, ఎక్కడుందో తను అని –

లోపలా చీకటి. ఆ బెడ్ రూమ్ లో ఒక తడి వాసన. నీళ్లు ఎంతో కాలంగా నిలవ ఉన్న వాసన. బహుశా, నాచు వాసన కూడా. ఎలా అంటే, అక్వారియం పగిలి, చేప పిల్ల నేలపై గిల గిలా కొట్టుకుని చచ్చిపోయి, అక్కడే శిధిలమైపోయినట్లు – అన్నీ అక్కడే! నిన్ను ఎవరూ తాకక, నీతో ఒక మాట మాట్లాడక ఇక చివరికి నీతో నువ్వే, నీలో నువ్వే అయ్యి మిగిలే – ఎన్నో ఏళ్లుగా మూసిన తలుపుల వెనుకగా మిగిలే గాలి లేని, మాగిన వాసన. మృత్యు వాసన. చిన్నపిల్ల ఎవరో ఏడ్చి ఏడ్చి ఆకలితో అలాగే అక్కడ, మూల్గుతో నిదురోయిన వాసన. నీలోకి – ఛాతిలోకి దిగి, నీ వెన్నులోంచి బయల్పడే, నీ తల్లి నెత్తురు అంటిన దయ లేని చీకటి వాసన. ఇక భీతితో మరోసారి “అమ్మా” అని పిలుస్తావా

ఆ గదిలోంచి ఒక ఆకారం అతి నెమ్మదిగా మంచంపై నుంచి లేస్తుంది: గుప్పెడు శరీరంతో, చీలికలతో మిగిలిన ఒక గూడులాగా, ఎన్నో దెబ్బలకి నుజ్జు నుజ్జయ్యి నెత్తురెండి మిగిలిన ఒక మాంసం ముద్దలాగా, ఆ మసక చీకట్లో మసక చీకటై ఒక ఆకారం నీవైపు కదులుతుంది. నీకు దగ్గరగా వచ్చి, “నువ్వా. రెండు రోజుల నుంచి బాలేదు. పడుకునే ఉన్నాను. అస్సలు నడవలేక పోతున్నాను” అని అంటోంది. ఆ గొంతులోనో, శరీరంలోనో ఎముకలు విరిగే శబ్దం, కొమ్మలు విరిగినట్లు. ఆ కొమ్మలు నీవో, తనవో నీకు తెలియదు కానీ ఇక జీవితం పట్ల ఆసక్తి లేక, వేలాడే ఉరితాడు వైపు సాగే పాదాల అనాసక్తి, ఆ నడకలో. ‘ఇదేనా, చివరికి మిగిలేది?’ అనుకుంటావు నువ్వు తనని చూస్తో: ‘there is no place for love in a world where being used has become the order of the day’ అని కూడా అనుకుంటావు నరాలు తేలి వచ్చిన ఆ ముంజేతులను చూస్తూ. ఇక నువ్వు తెప్పరిల్లే లోగా తనే అడుగుతుంది రెండు కిలోమీటర్లు దూరం కూడా లేని నువ్వుండే ఇంటిలోని పిల్లల్ని తలుచుకుంటో:  “పిల్లలు ఎలా ఉన్నారు. ఓసారి తీసుకు రా. చాన్నాళ్లు అయ్యింది చూసి” –

***

మళ్ళా ఆ ఇంటికి ఎప్పుడు వెడతావో నీకు నిజంగా తెలియదు. ఒకప్పుడు అది నీకొక పొదుగు. తల్లి తాపించిన పాలు. ఆ ఒడి. నీలో పూచిన మాటల పూలతోట. నీలో సీతాకోకలూ, తూనీగలూ ఎగిరిన మైదానం – అది. ఎండలో మెరిసే నిమ్మ చెట్టు – అది. బొప్పాయి పూలు వెన్నెల్లో కథలు చెప్పిన కాలం, ఇంద్రజాలం కూడా అదే. అదే, ఇప్పుడు ఇక

ఒక శ్మశాన వాటికలాగా లేదా సమాధిలాగా. చెదలు పట్టి, చిలుం పట్టిన వాటిలాగా. ఉదయపు ఒంటరి వెలుతురులో, మొక్కలు తలలూపే సాయంత్రపు గాలిలో, రాత్రిలో నక్షత్రాల కాంతిలో ఖాళీ అయిన ఊరిలో మిగిలిన ఒక ఒంటరి చేనులాగా, ఎవరో వ్రాద్దామని మొదలుపెట్టి సగంలో వదిలి వెళ్లిన ప్రేమలేఖ లాగా, నిన్ను హత్తుకుని ‘మళ్ళీ వస్తా’ అని చెప్పి తిరిగి రాకుండా మరి వెళ్ళిపోయిన ఒక మనిషిలాగా మిగిలిన ఆ ఇంటికి తిరిగి నువ్వు ఎప్పుడు వెడతావో నీకు తెలియదు. అప్పటికి

అక్కడ అసలేమైనా మిగిలి ఉంటుందో లేదో, నువ్వు కానీ తను కానీ బ్రతికి ఉంటారో లేదో కూడా అస్సలు తెలియదు!

***

(from upcoming Madre: Revised Edition)

చిత్రం: రాజశేఖర్ చంద్రం

శ్రీకాంత్

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • శ్రీకాంత్ కవిత్వం ఒక ఊబి.పెనుగులాడే కొద్దీ దిగబడిపోతుంటాం..నీకిది న్యాయమా శ్రీ….?

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు