మనం తెలిసో తెలియకుండానో నిత్యజీవితంలో మన అనుభవాల పరిమితి కారణంగా ప్రతి విషయానికీ ఒక rigid imageని సృష్టించుకుంటాము.
ఉర్దూ గజల్ ని కొంచెం లోతుగా చదవడం ప్రారంభించే సమయంలో నాకు కూడా ఉర్దూ కవి అంటే అలాంటి ఒక ఇమేజ్ ఉండేది. ఒక స్టీరియోటిపికల్ వేషధారణలో (ఉత్తర భారతదేశంలో ధరించే జుబ్బా, కోటు), ఒక ముస్లిం వ్యక్తిని ఊహించుకునే వాడిని. యూట్యూబ్ లో ఒక ముషాయిరా చూస్తుండగా నా అవివేకంతో పాటు ఆ ఇమేజ్ కూడా తుడిచిపెట్టుకుపోయింది. ఎందుకంటే ఆ ముషాయిరాని నిర్వహిస్తున్న కుమార్ విశ్వాస్ ఎంతగానో పొగిడి పరిచయం చేసిన కవి పేరు: రాజేష్ రెడ్డి! మన తెలుగువాడు, ఎలా ఉంటాడో అనుకున్నాను. మళ్ళీ ఇంకొక స్టీరియోటైప్ పటాపంచలు చేస్తూ సూటూ బూటూ వేసుకుని గింగిరాల జుట్టుతో మోడ్రన్ కృష్ణశాస్త్రిలా కనిపించాడు.
ఆఁ, తెలుగువాడు ఉర్దూలో అంతగా ఏం కవిత్వం చెప్తాడులే అనుకుంటే తాను చదివిన మొదటి షేర్ (మత్లా) :
యూఁ దేఖియే తో ఆంధీ మే బస్ ఎక్ షజర్ గయా
లేఖిన్ న జానే కిత్నే పరిందోఁ కా ఘర్ గయా
చూడటానికి తుఫానులో ఒక చెట్టే కూలింది
కానీ ఎన్ని పక్షుల ఇండ్లు కూలిపోయాయో
అంతే! అక్కడితో దేని పట్లా నాకు స్టీరియోటైప్ లేకుండా పోయింది. ఒక ఉర్దూ కవి అంటే ముస్లిం మతస్థుడై ఉండాలి, ఒక తెలుగు కవి అంటే హిందువై ఉండాలి అనే ఒక preconceived notion ఉండటం సరికాదని తెలిసొచ్చింది. భాషకు మతానికి సంబంధం ఎక్కడిది? రామాయణ మహాభారతాలూ, బైబిలు, ఖురాను అన్ని భారతీయభాషలలో లభ్యమయ్యే ఉంటాయి. భాష ఒక ప్రాంతానికి, ఒక సంస్కృతికీ సంబంధించినది, మతానికి కాదు. తరువాత్తరువాత నాకు తెలిసొచ్చింది ఏంటంటే, రాజేష్ రెడ్డిగారికి ముందూ తరువాత కూడా ఎంతో మంది ఇతర మతస్థులు ఉర్దూ కవిత్వంలో రాణించారు అని.
*
దైనందిన జీవనపరిశీలన రాజేష్ రెడ్డి గారి ప్రత్యేకత. అత్యంత గాఢమైన తత్వాన్ని కూడా సులువైన సంభాషణాత్మకమైన పదగుచ్ఛాలలో మనకు అందించగలరు. సగటు మనిషి జీవితసంఘర్షనకీ, ఉనికి సందిగ్ధానికీ, మనస్తత్వ శాస్త్రానికి తన రచనల్లో పెద్ద పీట వేశారు. నాకు ఇంతటి పెద్ద కవుల రచనలు విశ్లేషించి విమర్శించేంత శక్తి లేదు. బాధ పంచుకుంటే తగ్గిపోతుంది, సంతోషం పంచుకుంటే పెరిగిపోతుంది అన్నట్ టు , నేను ఆస్వాదించి ఆనందించిన కవిత్వాన్ని నలుగురితో పంచుకోవాలని చేసే కవి పరిచయం మాత్రమే ఇది.
తన అంతరంగాన్ని, హృదయాన్ని చిన్న పిల్లలతో పోల్చి చెప్పిన ఈ షేర్లు చదివితే రాజేష్ రెడ్డి గారి అభివ్యక్తిలోని విశిష్టత మనకు స్పష్టమవుతుంది:
మేరే దిల్ కే కిసీ కొనే మే ఏక్ మాసూమ్ సా బచ్చా
బడోఁ కీ దేఖ్ కర్ దునియా బడా హోనే సే డర్తా హై
నా గుండెలో ఒకానొక మూలలో ఒక అమాయకమైన బాలుడు
పెద్దవాళ్ళ ప్రపంచం చూసి పెద్దవడానికి భయపడుతున్నాడు
ఇది ఎంత డెలికేట్ ఎక్సప్రెషన్! ఒక చిన్న పిల్లాడి భయాన్ని అద్దంగా మార్చి ప్రపంచాన్ని ఎంత భయానకంగా తయారు చేశారో పెద్దవాళ్లకు చూపించడం. అందులోనూ ఒక మూలలో ఉన్న బాలుడు అనడం వల్ల ప్రతీక మరింత హృద్యంగా ఉంది. ఎంత భయపడితే చిన్నపిల్లలు ఒక మూలలో ఉండిపోతారు!
దిల్ భీ ఏక్ జిద్ పే అడా హై కిసీ బచ్చే కీ తరహ్
యా తో సబ్ కుఛ్ హీ ఇసే చాహియే యా కుఛ్ భీ నహీఁ
హృదయం కూడా ఒక చిన్నపిల్లవాడిలా మొండికేస్తుంది
అయితే అన్నీ దానికి కావాలి లేదా అస్సలేమీ వద్దు
నిత్యం సుఖదుఃఖాలతో దాగుడుమూతలు ఆడే మానవనైజం ఈ తీవ్రతల మధ్య ఊగిసలాడటం మనందరికీ అనుభవం అయ్యే ఉంటుంది.
*
విశ్వనరుడు అందునా మధ్యతరగతి వాడు యుగాలుగా అనుభూతి చెందుతూ వస్తున్న existential crisis వీరి రచనల్లో ప్రాధాన్యత సంతరించుకున్నా, అక్కడక్కడా ప్రేమకు సంబంధించిన విరహపార్శ్వం ఒక ఉల్కలా మెరుస్తుంది.
ఎక్ ఆఁసూ కోరే కాగజ్ పర్ గిరా
ఔర్ అధూరా ఖత్ ముకమ్మల్ హోగయా
ఒక అశ్రుబిందువు తెల్లకాగితంపై పడింది
ఒక అసంపూర్ణలేఖ పరిపూర్ణమైపోయింది
ఇక్కడ మళ్ళీ ఒక ప్రిజుడిస్, ఇది విరహం అనుభవిస్తున్న ఒక ప్రేమజంట గురించే అని. దాన్ని తొలగించి చూస్తే ఈ ఎడబాటులో ఉన్నది స్నేహితులు కావొచ్చు, తల్లీబిడ్డలు కావొచ్చు, సోదరీసోదరులు కావొచ్చు.
బిఛడ్తే వక్త్ వో తక్సీమ్ కర్ గయా మౌసమ్
బహార్ ఉస్ కీ తరఫ్ హై ఖిజా హమారీ తరఫ్
విడిపోతూ తాను ఋతువులను పంపకం చేసింది
వసంతం తానుంచుకుని నా వైపు శిశిరాన్ని ఉంచింది
నేను చదివినంతలో రాజేష్ రెడ్డి గారు ఎక్కడా సౌందర్యవర్ణన చేస్తూ షేర్ చెప్పలేదు. నా దృష్టిలో ఇది అరుదైన సంగతే.
*
పారంపారికంగా ప్రణయాన్ని మోస్తూ వచ్చిన ఉర్దూ గజల్ అనే పల్లకిలో రాజేష్ రెడ్డి గారు సగటు మనిషి అంతర్మథనాన్ని కూర్చోబెట్టారు.
ముంబైవాసి అయిన కారణంగా అనుకుంటాను, శృతిమించిన నగరీకరణని సున్నితం గా చిత్రించిన విధానం చూడండి:
జిత్-నీ బట్-నీ థీ బట్ చుకీ యె జమీఁ
అబ్ తో బస్ ఆస్మాఁ బాకీ హై
పంచుకోదగిన నేలంతా పంచుకోబడింది
ఇక కేవలం ఆకాశమే మిగిలింది
అలాగే నిజం మనకు ఎంత అసౌకర్యాన్ని కలిగిస్తుందో, ఆ నచ్చని నిజాన్ని వైయక్తికరీతుల్లో మనం ఎలా అణచిపెడతామో అనే విషయాన్ని కవి ఒక అద్దంలా మారి చెబుతాడు:
న బోలూఁ సచ్ తో కైసా ఆయినా మై
జో బోలూఁ సచ్ తో చక్నాచూర్ హోజావూఁ
నిజమే చెప్పకపోతే నేను అద్దమెలా అవుతాను
నిజమే చెబితే నేను ముక్కలుముక్కలైపోతాను
ఉర్దూ కవిత్వంలో దుఃఖాన్ని ప్రేమించడం ఒక ప్రాచుర్యమైన నేపథ్యం. ఈ జిగర్ మురాదాబాదీ షేర్ ఈ థీమ్ కి most eligible representative:
తబియత్ ఇన్ దినోఁ బెగానా-ఏ-గమ్ హోతీ జాతీ హై
మేరే హిస్సే కిగోయా హర్ ఖుషీ కమ్ హోతీ జాతీ హై
అంతరంగం ఈ మధ్య బాధకు దూరమవుతోంది
నా వాటాలోని ప్రతి సంతోషం తరిగిపోతోంది
అంటే బాధలనే మోదకారకాలుగా స్వీకరించడం. ఇది గాఢమైన తత్త్వం. దీన్నే మనకు సీనియర్ సముద్రాల గారు “బాధే సౌఖ్యమనే భావన రానీవోయ్/ఆ ఎరుకే నిశ్చలానందమోయ్ బ్రహ్మానందమోయ్” అని సులభగ్రాహ్యంగా సూచించారు.
ఇంతగా బాధలతో సహజీవనం చేస్తున్న కవికి ఏదైనా చిన్న సంతోషం ఎదురైతే ఎలా ఉంటుందో రాజేష్ రెడ్డి గారు ఒక షేర్ లో:
జేసే గలత్ పతే పే చలే ఆయే కోయీ షక్స్
సుఖ్ ఐసే మేరే దర్ పర్ రుకా ఔర్ గుజర్ గయా
చిరునామా తప్పి వచ్చిన ఒక వ్యక్తిలాగా
సుఖం నా వాకిట్లో నిలబడి వెళ్ళిపోయింది
ఇంకో షేర్ లో ప్రకృతిప్రేమని, simple pleasures ని ఒకవైపు ఉంచి, ఇంకో వైపు భోగలాలసత్వాన్ని, materialism ని ఉంచి, త్రాసు ఏ వైపుకి తూగుతున్నదీ, నిజానికి ఏ వైపుకి తూగాల్సినది మనల్నే తేల్ చుకోమంటాడు:
మయస్సర్ ముప్త్ మేఁ థే ఆస్మాఁ కే చాంద్ తారేఁ తక్
జమీఁ కే హర్ ఖిలోనే కీ మగర్ కీమత్ జ్యాదా థీ
నింగీ, నెలవంకా, తారకలన్నీ ఉచితంగా లభిస్తున్నా
నేలపై ప్రతి ఆటబొమ్మ వెల అమితంగా ఉంది
చివరిగా ఒక చమత్కారమైన షేర్. మనం ఒక విపరీతమైన కాలంలో జీవిస్తున్నాం. హిపోక్రసీ లేని నిర్మలమైన మానవసంబంధాలు దాదాపు అంతరించిపోతున్నాయేమో. ఇలాంటి కాలాల్లో మన మిత్రులెవరో శత్రువులెవరో ఖచ్చితంగా చెప్పడం కష్టం. అయినా మన నెట్వర్కింగ్ ఫ్రెండ్స్ లిస్ట్ మాత్రం బారెడంత ఉంటుంది. బహుశా దీన్ని గురించే రాజేష్ రెడ్డి గారు ఈ షేర్ చెప్పారు:
దుష్మనోఁ కీ ఖుద్-బ-ఖుద్ హో జాయేగి తాదాద్ కమ్
యారోఁ కీ ఫెహ్రిస్త్ మేఁ కుఛ్ యార్ కమ్ కర్ దీజియే
శత్రువుల సంఖ్య దానంతట అదే తగ్గుముఖం పడుతుంది
మిత్రులపట్టిక నుండీ కొందరు మిత్రులను తొలగించండి
ఇంకా ఇలాంటి జనరంజకమైన కవితాపంక్తులు ఎన్నెన్నో అందించారు రాజేష్ రెడ్డి గారు. పంకజ్ ఉధాస్, జగ్జీత్ సింగ్ వంటి పేరొందిన గాయకులు కొన్ని గజళ్లను స్వరపరచి అందించారు కూడా. ముషాయిరాలలో రాజేష్ రెడ్డి గారు స్వరయుక్తంగా చదివే విధానం చూస్తే ఆయనకు సంగీతంలో కూడా కొంత ప్రవేశం ఉన్నట్టు అనిపిస్తుంది. ఏదేమైనా ఆయన ఒక సగటు ఉర్దూ కవి మాత్రం కాదు. పుంఖానుపుంఖాలు ఉండే తత్త్వవేత్తల రచనలు చదవలేని వాళ్ళు తప్పకుండా చదవాల్సిన తత్త్వకవి. వినాల్సిన మనస్తత్వకవి!
*
తెలుగువారైన రాజేష్ రెడ్డి గారు తెలుగువారికి ఎందరికి తెలుసునో కానీ మీ వ్యాసం ద్వారానే నేను తెలుసుకున్నారు. ఈ ఉర్దూ గజళ్ల కవిగారు అశ్చర్యం ఆనందం కలిగించారు. ఈ వ్యాసంతో మీవలెనే నాకూ ఇప్పటివరకూ ఉన్న కొన్ని రిజిడ్ ఇమేజస్ తొలగిపోయాయి. వారి హృద్యమైన కవితా పంక్తులను ఉటంకిస్తూ మీరూ అంతే హృద్యంగమంగా విశ్లేషణ చేశారు. రాజేష్ రెడ్డి గారికి జయహోలు. రమాకాంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు.
ధన్యవాదాలు విజయ్ గారు!
Ramaknath garu, I’am following these articles regularly. Thank you for introducing different Shayar’s and Shayari
Thank you Surabhi garu.
Hello Ramakanth,
I have been reading your poetry for a very long time.But this is the first time I ever read an article written by you. I must say that the writing is as good as poetry. I too was under impression that Ghazals are all about love/romance/heart broken but you have enlightened me that there is lot more than that. Rajesh Reddy ‘s Ghazals came straight from heart.
Thank you akka! Glad you enjoyed the article.