“మా పెద్దమ్మారూంలో లేకుంటే యిల్లంతా బోసిపొయ్యింది. యెన్ని దినాలైనా సరే, ఆమెను తొడుక్కోనొచ్చినాకే, మళ్లా యీయింటి గడప తొక్కేది,’’ అంది స్వరాజ్యం తలుపు మూసేముందు లోపలున్న వుత్తరపుగదికి వేలాడుతూ వున్న బీగాన్ని కొరకొరా చూస్తూ.
పక్షి పారిపోయాక మిగిలిన పంజరంలా గుబులుగావున్న గది తలుపుల్ని చూస్తూ,‘‘లోపలెవరూ లేనప్పుడా బీగమెందుకు? ఆమె కమ్మలూ ముక్కుపుల్లా దొంగతనం పోయినప్పుడే అది చెడ్డ శకునమని చెప్పినాను. నువ్వు జాగ్రత్తపడలేదు,’’ అని కసురుతూ లిప్టులో కొచ్చాడు రంగశాయి.
కారు దగ్గర బాక్‌పాక్ తగిలించుకుని సిద్దంగా వున్న బాలశంకర్,‘‘మేడం మా ఫ్రెండును తొడుక్కోని రమ్మన్నారు సార్! వీడు రాజారెడ్డి. పెద్దకాపువీధి. అక్కడ వీనికి పెద్దగాంగుండాది,’’ అన్నాడు.
స్వరాజ్యం మందీ మార్బలాన్ని సిద్ధం చేసిందనుకున్నాడు రంగశాయి. వాళ్ల పెద్దమ్మను తీసుకొచ్చే పనిలో డిటెక్టివ్‌గా సన్నద్దమయిన స్వరాజ్యానికి తానిప్పుడు అసిస్టెంటుగానూ, కారు డ్రైవరుగానూ ద్విపాత్రాభినయం చేయాలి. కారు రోడ్డుపైకొచ్చాక,‘‘ముందు నేరుగా చిత్తూరు,’’ అంది స్వరాజ్యం.
పలమనేరులో వుండే మేనమామతో పోలిస్తే చిత్తూరులోవుండే పినతల్లి కొడుకు కొంత సాధువు. మదనపల్లెలో వుండే వాడితో పోలిస్తే పలమనేరులోవుండే మేనమామ కొంత తక్కువ మోసగాడు. అందువల్ల ముందుగా చిత్తూరు, తర్వాత అవసరమైతే పలమనేరు, ఆతర్వాత మరో విధిలేకపోతే మదనపల్లె-యిదీ స్వరాజ్యం పథకమని రంగశాయికి అర్థమైపోయింది.
కాపురానికొస్తూ వాళ్ల పెద్దమ్మను తోడుగా తీసుకొచ్చిన స్వరాజ్యం,‘‘ మా పెద్దమ్మే నాతోబాటు వచ్చిన భరణం,’’ అంది. ఆమె మాటల్నికూడా జాగ్రత్తగా లెక్కప్రకారమే వాడుతుందని అప్పుడే మొదటిసారిగా అర్థమయింది రంగశాయికి. పెళ్లయ్యాక నెల్లూరులో తమ యింటిలో కొన్నిరోజులు గడిపాక,‘‘మా యిద్దరు వదినలూ పెద్దకుటుంబాల నుంచి వచ్చారు. వాళ్లు తెచ్చిన కట్నాలతోనే మా అన్నలిద్దరూ వ్యాపారాలు పెట్టుకున్నారు,’’ అని చెప్పాడతను.
‘‘మా నాయన మొదటి భార్య సంతానంగా ఆయన ఆస్తిలో సగం నాది. పైగా నేను యెమ్యే. పీహెచ్డీ చేసి వుద్యోగం చేయడం నా గోల్,” అని స్వరాజ్యం ధీమాగా తలెగరేసింది.
“మీ అమ్మ చనిపోయాకే మీ నాయన రెండో పెళ్ళి చేసుకున్నాడు. రెండో భార్యకు యిద్దరు కొడుకులు పుట్టినారు. ఆయన తదనంతరం ఆయన ఆస్తిని నాలుగు భాగాలు చేసి- నీకూ, ఆ రెండో భార్యకూ,ఆమె కొడులిద్దరికీ సమానంగా పంచతారు. అంటే లాప్రకారంగా నీకొచ్చేది నాలుగో భాగమే,” అని కసిరాడు రంగశాయి.
“అదయినా తక్కవేమీగాదు.దేంట్లోగానీ మీ వదినలకంటే ఆకు తక్కువైతే అప్పుడడగండి,’’ అని స్వరాజ్యం రెట్టించింది.
అనడమే గాదు, యూనివర్శిటీలో పీహెచ్డీ సీటు తెచ్చుకుని తిరుపతిలోనే కాపురం పెట్టించింది. జీతం తక్కువైనా యింజనీరింగు కాలేజీ వుద్యోగంలో చేరింది. యిల్లూ, చదువూ, వుద్యోగమూ తప్ప యింకో ధ్యాసలేకుండా వుండిపోయింది. మెడికల్ రెప్రజెంటేటివ్‌గాయెప్పుడూ కాంపులకు తిరిగే రంగశాయి వారానికో పదిరోజులకో యింటికి తిరిగిచ్చినప్పుడు కూడా గదిలోకి దూరి తలుపేసుకుని పరీక్షలనీ, రీసెర్చిఅనీ దబాయించేది. ‘‘పెళ్లయిన సంవత్సరానికే మా అన్నలిద్దరికీ పిల్లలు పుట్టినారు,’’ అని రంగశాయి ముఖం ముడిచాకే పిల్లల్ని కనడానికి వొప్పుకుంది.
తన పెళ్లయిన రెండేళ్లకే స్వరాజ్యం వాళ్లనాయన వీలునామా కూడా రాయకుండా చనిపోవడంతో రంగశాయికి పెద్ద దెబ్బే తగిలింది. మొదటి భార్య సంతానంగా స్వరాజ్యానికి రావల్సిన నాలుగోభాగం ఆస్తికి కూడా రెక్కలొచ్చేసినాయి. ఆ రెండోభార్య కొడుకులు కాకిలెక్కలు చూపెట్టి, వూరి బయటుండే యింటిప్లాటొకటి మాత్రం వస్తుందని తేల్చేశారు. తన వదినలతో స్వరాజ్యం పోటీపడలేక పోయిందని రంగశాయి నిరాశపడిపోయాడు.
అయితే తానో రెండు మెట్లు వెనకబడగానే ముందుకో మూడు మెట్లెక్కడానికి స్వరాజ్యం సన్నద్ధమైపోయింది. పిల్లలు పుట్టాక కూడా రూములోకెళ్లి పుస్తకం పట్టుకుందీ అంటే, యికతిండీ నీళ్లూ కూడా మరచిపోయేది. బయట తుఫానులొచ్చినా భూకంపాలొచ్చినా ఆమె పట్టించుకునేది గాదు. గది తలుపు తెరిచేది గాదు. పిల్లలకోసం పనిమనిషిని పెట్టక తప్పలేదు. తన పెళ్లయ్యాక జరిగిన యీ యిరవై సంవత్సరాల్లో వాళ్ల పెద్దమ్మ సగం దినాలైనా తమ యింట్లోనే వుంది. ఆవిడను జాగ్రత్తగా రూంలో పెట్టి బీగమేసి కాపలా కాయడం పెద్ద పనే! యింట్లో వుండకుండా టూర్లు తిరగడమే రంగశాయికి హాయిగా వుండేది. యింటికొస్తే అది తనకూ జైలయిపోయినట్టుండేది.
కారు బైపాస్ రోడ్డులోకొచ్చాక,‘‘ఆ రోజు మదనపల్లెవాళ్లతో నోరుజారేమైనా చెప్పేసినారేమో సరిగ్గా జ్ఞాపకం చేసుకోండి,’’ అంది స్వరాజ్యం.
వాళ్లొచ్చి వెళ్లిన రెండురోజుల తర్వాత చిత్తూరునుంచీ, మూడురోజుల తర్వాత పలమనేరు నుంచీ ఫోన్లొచ్చాయి. పెద్దమ్మ నెత్తుకెళ్లిపోయిన వాళ్లకూ, ఆ ఫోన్లకూ సంబంధముందని రంగశాయికీ తెలుసు.
ఆ రోజు బెంగుళూరునుంచీ తిరుపతికొచ్చి యిల్లు చేరేసరికి బీగమే ఆహ్వానించిందతడ్ని. తన బీగంతో తలుపు తెరిచి, లోపలికెళ్లి బట్టలు మార్చుకుంటూండగా వచ్చారా యిద్దరూ.
‘‘యేం నాయనా! నువ్వూ యింట్లో వుండావా? మంచి టయానికే వచ్చినామయితే. మేము మదనపల్లెనుంచి వస్తావుండాం. గుర్తుపట్టినావా, లేదా? నేను హరినారాయణ. వీడు నారెండో కొడుకు పట్టాభి. స్వరాజ్యమెక్కడ?’’అని అడుగుతూ పాతగొడుగులా ముడుచుకుపోయి వున్న ముసలాయిన లోపలికొచ్చాడు. ఆయన వెంటే వచ్చిన నడివయస్సు మనిషి సన్నగా, పొడుగ్గా, దిట్టంగా నొక్కులుపడ్డ బాట్రీలైటులాగున్నాడు.
మదనపల్లె పేరు వినబడగానే రంగశాయికి లైటువెలిగింది.చాలా సంవత్సరాలుగా తమ యింట్లో వున్న ముసలావిడకు మదనపల్లెలో వొకప్పుడు యిల్లూ వాకిలీ వుండేవనీ, ఆమె మొగుడు చనిపోయాక ఆవిడ సవతి కొడుకు ఆవిడకు న్యాయంగా రావల్సిన ఆస్తిని చాలావరకూ కాజేసాడనీ అతడికి తెలుసు. ఆమెకు రావల్సిని ఆ ఆస్తి కోసం వొకప్పుడు స్వరాజ్యం తండ్రీ,మేనమామా కేసులేసి పోటీ పడ్డారనీ గుర్తుంది. రెండునెలలకు ముందు స్వరాజ్యం వకీలునోటీసు పంపించినప్పటినుంచీ, యిలా వీళ్లెవరైనా వస్తారనే అనుమానం వుందతడికి.
చేతి సంచిలోనుంచి అరటిపళ్లు తీసి టీపాయ్ పైన పెట్టాక, హరినారాయణ పెద్ద పెద్ద కళ్లేసుకుని యిల్లంతా కలయజూడసాగాడు. పిల్లలు ఆడుకుని వెళ్లిపోయినతర్వాత కంగాళీగా తయారయ్యే పెరడులా యిల్లు చీదరగా వుంది.
‘‘స్వరాజ్యం యిప్పుడు వికాస్‌లో చేరింది. పగల్లో క్లాసులు గాకుండా సాయంత్రాల్లో స్టడీ అవర్సు పనికూడా వుంటుంది. తీరిక లేదు. అందుకే యిల్లు యిట్లా… సర్దే టయం లేదు,’’ అన్నాడు రంగశాయి మొహమాటంగా.
‘‘మా పిన్నమ్మ…పిన్నమ్మ,’’ అని హరినారాయణ కలవరించాడు. అప్పుడక్కడే వుత్తరంవైపుండే గదిలోపలున్న ముసలావిడకు హరినారాయణ, వరుసకు కొడుకవతాడని రంగశాయికి స్ఫురించింది. ఆ గదికి వేలాడుతున్న బీగాన్ని చూడకుండా వుండడానికి ప్రయత్నించసాగాడు.
‘‘మా పిన్నమ్మకు ఆ చెల్లి అంటే, ఆ చెల్లి కూతురీ స్వరాజ్యమంటే ప్రాణం. ఆ చెల్లి చచ్చిపోతానే, పరాయి యిల్లని కూడా యోచన చెయ్యకుండా చిత్తూర్లోనే వుండి, నానా అగసాట్లూ పడి, స్వరాజ్యాన్ని పెంచింది. యిప్పుడీ కూతురిదగ్గిర సుఖంగా వుండాదని యిన్ని దినాలుగా గొమ్మునుండి పొయినాను. అదే చిత్తూరు గానయితే యెప్పుడో తొడుక్కొని పొయ్యేటోడ్ని! అయినాయెంతకాలమిట్లా? నేనూ పెద్దోణ్ణయి పోతా వుండాను. మా పిన్నమ్మ పరాయి పంచనుందంటే నాకు మర్యాదగా వుంటిందా? అందుకని…’’ అని అంటూ హరినారాయణ చొక్కా గుండీలు విప్పుకుని వుఫ్ వుఫ్ మని నోటితో గాలి వూదుకోసాగాడు.
‘‘యీ తిరుపతిలో యింతేనండీ! మీ మదనపల్లె అంత చల్లగా వుండదు,’’ అన్నాడు రంగశాయి దీనంగా.
‘‘అందుకనే గదా వెంకటశివయ్య కూతుర్నిమదనపల్లెలోనే యియ్యాలని పట్టుబట్టింది’’ అని హరినారాయణ మూల్గుడులాంటి నవ్వు నవ్వాడు. “వెంకటశివయ్యంటే మా పిన్నమ్మోళ్ల నాయిన. పలమనేరు పెద్దాయిన.నీకు పిల్లనిచ్చిన మామకు పిల్లనిచ్చిన మామ. ఆ తండ్రి బుద్ది స్వరాజ్యానికి రాలేదని తెలుసు. ఆమనిషి నీకూ, నీ భార్యకూ యెంత అన్యాయం జేసినాడో నాకూ దెలుసు. నువ్వు ధర్మరాజుగాబట్టి గొమ్మునా వుండిపొయినావు. అదే నేనయితేనా?’’
హరినారాయణ బంగారం వ్యాపారంలో యెత్తిన చెయ్యనీ, మనుషుల్నెలా ముగ్గులోకి దింపాలో కడుపులోనే నేర్చుకోని వచ్చాడనీ రంగశాయికీ తెలుసు. వచ్చిన పని సానుకూలమవడంకోసం తనకు సాంబ్రాణేస్తున్నాడని తెలుసుకోవడం అతడికేం కష్టం కాదు.
‘‘నీ భార్య అన్నిసార్లు అదే పనిగా పోయి ఆమె భాగమేదో రాసి పారెయ్యమంటే చెవుల్లో యేసుకున్నాడా మీ మామ? గుండుమాదిరున్నాడు. సడన్‌గా గుండెపోటొచ్చి గుంతకు టికెట్టు దీసుకునేసినాడు. ఆ రెండో పెండ్లాం కొడుకులు కన్ను చూస్తావుండంగానే కంటిపాపను కత్తిరించుకొని పొయ్యేరకం. నువ్వూ నీ భార్యా కోర్టుకు లాగినా వాళ్లనేం కదిలించలేకపోయినారు గదా! అప్పులే చూపించి, ఖాళీ బొచ్చె నీకు చూపించినారు గదా! అదేం న్యాయం!’’
భూములూ, యిండ్లూ వుండేవాళ్లయితే చచ్చినట్టు అందరికీ భాగాలు పంచక తప్పదు. నగదూ, బంగారమూ వుండే వ్యాపారుల యిండ్లల్లో యెవురికి దొరికినంత వాళ్లు జవురుకోని, తప్పు లెక్కలే మిగిలిస్తారు. తన పెళ్లానికి వాళ్ల పిన్నమ్మ కొడుకు చేసిన మోసమే, యీ హరినారాయణ వాళ్ల పిన్నమ్మకూ చేసినాడన్న విషయం రంగశాయికి గుర్తుకొచ్చింది. అందుకే యీ పిల్లి పాలుతాగదనిపించేలా అతను మాట్లాడుతుంటే రంగశాయి ఆశ్చర్యపడసాగాడు.
‘‘మీ అత్తకు జన్నెక్కి జచ్చిపోతే సంవత్సరం కూడా తిరక్కుండా మీమామా మదరాసామెను పెండ్లి చేసుకున్నాడు. ఆ సవితితల్లి దగ్గిర నీ బార్యప్పుడు అష్టకష్టాలూ పడతావుంటే చూసి భరాయించలేక మా పిన్నమ్మ చిత్తూరుకు యెలబారి పొయ్యింది. ఆమెనుకూడా వాళ్లు యీ పొయ్యిలో పెట్టి ఆ పొయ్యిలో తీసినారు. నీకు చెప్తే నమ్మవు. వొకసారి కలవరమొచ్చి మా పిన్నమ్మను చూద్దామని ఆ యింటికి పొయినాను. అప్పుడు నీ భార్య హైస్కూల్లో చదవతా వుండాదనుకుంటా! నేను పోయేటప్పుటికి మా పిన్నమ్మను బాంకుస్ట్రాంగు రూమ్మాదిరుండే రూములోకి తోసి బీగాలేసేసుండారు. ఆ చిత్తూరులో, ఆ వుడుకులో, ఆ చీకట్లో… ఆమెకు వూపిరైనా ఆడద్దా? నేను అరిచి ఆగడం చేస్తే గానీ తలుపు తియ్యలేదు. ఆమెను నాతో మాట్లాడనియ్యకుండా వంటింట్లోకి తరిమేసినారు.’’ వుత్తరం వైపు గదినిచూడకుండా వుండడంకోసం రంగశాయి బలవంతంగా ముఖాన్ని అవతలికి తిప్పుకున్నాడు.
తన వదినకు రావల్సిన ఆస్తిని కాజేయడం కోసమని ఆమె పేరుతో కేసేసి, కూతుర్ని పెంచే మిషపైన ఆమెను తన యింట్లో దాచేసిన వాడొకడైతే, పినతల్లికి రావల్సిన భాగమివ్వకుండా గొడవ చేసినవాడింకొకడని రంగశాయికి తెలుసు. పెళ్లయిన కొత్తలోనే,‘‘సవితికూతుర్నే కండ్లజూడని మనిషి ఆ సవితి అక్కను మాత్రం యింట్లో యెందుకుండనిచ్చింది? అనాధ, విధవా అయిన వదినను యే మొగోడైనా ధర్మానికింట్లో పెట్టుకుంటాడా?’’ అని భార్యను వేళాకోళంగా అడిగాడు రంగశాయి. స్వరాజ్యం వెంటనే కళ్లుమూసుకుని, లెంపలేసుకుని,‘‘అంతమాటనద్దండి. కండ్లుపోతాయి. మా పెద్దమ్మంటే మా నాయినకు సొంత తల్లికంటే జాస్తీ…’’ అనేసింది.
‘‘మా పిన్నమ్మ యింట్లో లేదే! అంత పెద్దామెనీ వయిసులోయెక్కడి కంపించినారు?’’ అని మళ్లీ అడిగాడు హరినారాయణ.
సరిగ్గా అప్పుడే వుత్తరపుగదిలోంచీ గిన్నెలు దొర్లిన శబ్దం వచ్చింది. అంతవరకూ తండ్రిపక్కన మౌనంగా కూర్చున్న పట్టాభి, యెగిరి దూకినట్టుగా ఆ గది దగ్గరికి పరిగెత్తి, కిటికీ తలుపు వెనక్కి తోసి,‘‘నాయినా, అవ్వ… అవ్వ..’’ అని అరిచాడు. హరినారాయణ అక్కడికో గెంతు గెంతి ‘‘అయ్యో పిన్నమ్మా! లోపలే వుండావా నువ్వు? నిన్నెందుకిట్లా రూంలో పెట్టి బీగమేసినారు?’’ అని గొంతు చించుకున్నాడు.
గదిలోపలి ముసలావిడెందుకో గొంతునులిమినప్పుడు పక్షి అరిచే కేకలాంటి వికృతమైన అరుపు అరిచింది.
‘‘కొంపలు మునిగిపోయినట్లు అరస్తారేంది మీరు? పక్క ప్లాటోళ్లు పరిగెత్తుకొచ్చేరు. ఆమె బతికిందో లేదో పట్టించుకోకుండా వున్నారిన్ని దినాలుగా. మేమిచ్చిన కోర్టు నోటీసు చూస్తానే పరిగెత్తుకోనొస్తా వుండారని తెలియందెవరికి? ఆమెకయిదేండ్లుగా ఆమ్నీసియా… అల్జీమర్ కూడా.. బుద్ది స్వాధీనంలో వుండదు,’’ అని పెద్దగా కసిరాడు రంగశాయి. సరిగ్గా అప్పుడే స్వరాజ్యం యింటికొచ్చేసింది.
‘‘ఆ రోజు వాళ్లు పోతాపోతా పోలీసులూ, కోర్టూ అన్నారు. కానీ యింత యిల్లీగల్ పనిచేస్తారను కోలేదు,’’ అన్నాడు రంగశాయి.
‘‘వాళ్లనంతసేపు యింట్లో కూర్చోబెట్టుకోని మాట్లాడిందేమీ తప్పు. మా పెద్దమ్మన్నేను రూంలో పెట్టి బీగమేస్తే వాళ్లకేమి? తిండి సరిగ్గా పెట్టలేదని చెప్పేదానికి వాళ్లెవురు? వాళ్లెప్పుడో ఆమెను యేమారించి రిజిష్టరు జెయ్యించిన సెటిల్‌మెంటు నెవురొప్పుకుంటారు? అప్పుడు మా మామా, ఆపైన మా నాయినా వొప్పుకోలేదు. యిప్పుడు నేనూ వొప్పుకోను. కేసేసినానని భయపడి పరిగెత్తుకొచ్చినారు. మనల్ని యేమారించి ఆమెను తొడుక్కోని పోవాలని యెత్తేసినారు. నేను తిరగబడి పొమ్మంటానే బుద్దిగా వెళ్లిపోయినారు గాబట్టి సరిపోయింది. లేకుంటేనా…’’ స్వరాజ్యం కోపంతో బుసగొట్టింది. కాసేపయ్యాక ‘‘వాళ్లే చిత్తూరుకూ, పలమనేరుకూ ముట్టించినారు. నేనెప్పుడూ యిల్లు బీగమేసుకోకుండా బయటికి పోయిందే లేదు. బాబీగాడ్ని కూడా లోపలే పెట్టి బీగమేసుకోని పోయుండాల్సిందారోజు కూడా! ఆవచ్చినోళ్లకు ఆకులో వడ్డించినట్టుగాఅన్నీ కలిసొచ్చినాయి. రెండుదినాల హోమ్ హాలిడే అని బాబీగాడు యింట్లోవుండాడు. అప్పుడనంగా కాలేజీవాళ్లు అర్జెంటుగా రమ్మన్నారు. వాడ్ని నమ్మి యిల్లు వానికొదిలిపెట్టి పొయ్యిందేనాతప్పయిపోయింది.పిల్లకాయనేమారించి, ధైర్యంగా రూంబీగం తీసుకోని పెద్దమ్మను జబర్దస్తీగా యెత్తుకొనిపోయినారు,” అని రోషంగా మొరిసిందిస్వరాజ్యం.
“బాబీ చిన్నపిల్లాడేమీగాదు. టెన్త్ పబ్లిక్ రాయబోతున్నాడు. కొత్తవాళ్లనెలా నమ్మాడు? నమ్మాడే అనుకో, ఆమెనుతీసుకెళ్లినవాళ్లనెందుకు గుర్తుపట్టలేకపోయాడు? పిల్లల్నిలాగేనా పెంచడం?” రంగశాయికి చిర్రెత్తుకొచ్చింది.
“మీటింగులోవుండి వాడి మిస్డ్ కాల్సు చూడంది నేనూ. మా నాయనపేరూ, మీ నాయన పేరూచెప్తే బందువులనేఅనుకున్నాడు పాపం. నా పక్క బందువులంతా వాడు పుట్టక ముందే నాపైన యుద్దంచేసి దూరమైపొయినారు. నేను మదనపల్లెకు నోటీసిచ్చేదాకా చిత్తూర్లో వుండే మా పిన్నమ్మ కొడుకులకూ, పలమనేరులో వుండే మా మేనమామకూ మెలకువరాలేదు. యిప్పుడు నాకంటే నాకని యెగబడతా వుండారు.వాడు చెప్పిన పోలికల్నిబట్టి చూస్తే, మాతమ్ముడో, మా మామో, కడాకు మా పిన్నమ్మ సవితి తమ్ముడి కొడుకో యెవురైనా గావచ్చు. ఆ వచ్చేదాన్ని కొట్టుకోనిపోవాలని, నా కళ్లు గప్పి, మా పెద్దమ్మ నెత్తుకోని పోయినారు. బుద్ది స్వాధీనంలో వునుంటే ఆమె బయటికే పొయ్యుండదు. యింటికెవురైనా కొత్తోల్లొస్తే గౌరవంగా చూడాలని బాబీని తిట్టీ తిట్టీ నేర్పించింది మీరే గదా!” అని స్వరాజ్యం అతడినే ముద్దాయిని చేయడానికి ప్రయత్నించింది.
“మీ పెద్దమ్మొక బిడ్డను కనుంటే చానామంది సుఖపడివుంటారు,” అన్నాడు రంగశాయి కచ్చిగా.
“పెళ్లప్పుడామెకు పద్మూడూ, ఆయినకు యాభై దాటిన వయస్సూనంట. ఆపైన ఆయన బతికుండిన పదేండ్లల్లో ఆమెకు రెండుసార్లు గర్భం నిలిచి నడిమధ్యలోనే పొయ్యిందంట. అయినా కంటేనేనా బిడ్డలు? నేను సొంతం కూతురుకంటే జాస్తీ,” స్వరాజ్యం కోపం తనపైకి తిరిగినట్టుగా తోచడంతో రంగశాయి మౌనంగా వుండిపోయాడు.
చిత్తూరులో స్వరాజ్యం అమ్మగారిల్లు యెప్పుడూ జనాలతో రద్దీగా వుండే బజారువీధి మధ్యలో వుంది. రెండువైపులా వున్న యిండ్ల వుమ్మడి గోడలపైన్నే, అవతలి వీధివరకూ, పన్నెండడుగులకు మించని వెడల్పుతో, పొడుగ్గా సొరంగాలాగుండే యిల్లది. పెళ్లయిన కొత్తలో ఆ యింట్లో కొన్నిరోజు గడపాల్సి వచ్చినప్పుడు ‘‘మిద్దెపైన యీ రూమొకటి గట్టి మీ నాయన నన్ను కాపాడినాడు. కిటికీలు కూడా లేకుండా, టాపుపైనుండే ఆ సన్నరంద్రాల్లో నించీ వచ్చే వెలుతుర్లో, మీరెట్ల బతుకుతున్నారో నాకు ఆశ్చర్యంగా వుంది,’’ అన్నాడు రంగశాయి.
‘‘వ్యాపారాలు చేసేవాళ్ల యిండ్లు యే వూర్లోనయినా బజారు నడీమధ్యలోనే వుంటాయి. డబ్బూనగలూ భద్రంగా వుండాలంటే యిండ్లు యినప్పెట్టెల మాదిరే వుండాల…’’ అంది స్వరాజ్యం.
కారులోంచి దిగాక యింట్లోకెళ్లే ముందు,‘‘శంకర్ వాళ్లు కారులోనే వుంటారు. మీరు మాత్రం పెద్దమ్మ సంగతి అసలెత్తకండి,’’ అని భర్తను హెచ్చరించింది స్వరాజ్యం.
తమకు రావసిన ఆస్తికోసం కోర్టుకెళ్లినప్పుడు బూతులు తిట్టుకోడం వరకూ వెళ్లాక, యీ యింటికి తామెప్పుడూ రాలేదనీ, యెవరివో పెళ్లిళ్లప్పుడు వాళ్లు యెదురైనా పలకరించలేదనీ రంగశాయికి గుర్తొచ్చింది. అయినా తనలాగా సందేహించకుండా, చొరవగా యింట్లోకి దూరుతున్న భార్యను విస్తుపోయి చూడసాగాడు.
వొకదాని వెనక వొకటిగావున్న రెండుగదుల్ని కలిపి రీమాడలింగ్ చేసి, షోరూంగా మార్చిపారేసి వున్నారు. టీవీలూ, ఫాన్లూ, ఫ్రిజ్‌లూ అమ్మే ఆ షాపు కస్టమర్లతో కళకళలాడుతోంది. స్వరాజ్యంతో బాటు షోరూం తలుపుల్ని తీసుకుని యింటిలోపలికి వెళ్తూ కౌంటరుకేసి చూశాడు రంగశాయి. కస్టమర్ల వెనక అవతలకి తిరిగి నిలబడిన స్వరాజ్యం సవతితమ్ముడు కనిపించాడు.
రకరకాల అట్టపెట్టెలున్న మరో గదిని దాటి ట్యూబులైటు వెలుగుతున్న హాల్లో కొచ్చారిద్దరూ. టీవీ ముందు స్వరాజ్యం పినతల్లీ, ఆమె పెద్దకోడలూ కనిపించారు. రెండుమూడేళ్ల పాపాయొకతి చాపపైన దోగాడుతోంది.
స్వరాజ్యం వాళ్ల పిన్ని దగ్గరికో పరుగుతో వెళ్లి, గట్టిగా పట్టుకుని, బోరున యేడ్చేసి, ‘‘బాగుండావా పిన్నీ! కలవరంగా వుంటే చూడాలని వచ్చేసినాను,’’ అంది. ఆవిడ అయోమయంగా చూస్తూండగా, ‘‘ఆస్తులూ, నగలూ అని యేదో అరుచుకుంటాం. అదంతా మనసులో పెట్టుకోని నాకు పుట్టిల్లు లేకుండా చేస్తారా మీరు! మా నాయనే వుంటే యిది జరిగేనా!’’ అనిగొల్లుమంది.
రంగశాయి హాల్లోని పాతసోఫాలో పెడుతున్న పెద్ద పళ్ల బుట్టనూ, పూలపాకెట్టును వాళ్లు విస్తుపోయి చూస్తుండగా,‘‘అస్సలు యీ యిల్లు పూర్తిగా చూడనే లేదన్నాడు మా ఆయన. నేనుపుట్టిపెరిగిన చోటంతా చూపిస్తాను రమ్మని లాక్కోనొచ్చినాను,’’ అని చెప్పాక,‘‘రండి మొహమాటమెందుకు? యిది నా యిల్లే!’’ అని భర్త చేయిపట్టుకుని లాగింది స్వరాజ్యం.
‘‘వుండొదినా! కాఫీ పెడతాను,’’ అని స్వరాజ్యం తమ్ముడి పెళ్లాం లేచి తానే ముందుగా వంటింట్లోకెళ్లింది.
సొరంగంలాగున్న హాల్లోంచి బొరకలాంటి మూడడుగుల దారిలో కొచ్చాక దాన్ని ఆనుకుని పడమటివైపున రెండుగదులున్నట్టు తోస్తోంది. వాటి వెనకున్న వంటింటిలోకి అవతలి ఖాళీస్థలంలోంచి కాస్త వెలుతురొస్తోంది. పెరట్లో వో బాదంచెట్టూ, వో కొబ్బరిచెట్టూ, చిన్న జాజిపందిరీ, నీళ్లెండిపోయిన పాత చేదబావీ, అవతలి వీధిగోడకానుకుని లెట్రినూ వున్నాయి.
ఆ చివరిదాకావెళ్లాక మళ్లీ వెనక్కుతిరిగి, వంట్లిల్లు దాటి సందులో కొచ్చి,‘‘యిదే నారూము వొకప్పుడు,’’ అని భర్తతో చెప్పాక,‘‘వొకసారి దీని బీగం తియ్యవా రమణీ! మా ఆయన యీ రూము చూడాలనే వచ్చినాడు నాతో,’’ అంది స్వరాజ్యం.
తలుపు తెరిచాక గదిలో చీకటి తప్ప మరేమీ కనిపించలేదు. స్విచ్ నొక్కిన తర్వాత దీపం వెలిగినప్పుడు లోపల వేలాడుతున్న బూజు మనుషుల్ని చూసి చాలా చాలా రోజులైపోయిందని చెప్తోంది. వొకమూలలో పాతకాలపు యినప్పెట్టె దిట్టంగా వుంది. దాని చుట్టూ రకరకాల పాత యిత్తడి పాత్రలు పడి వున్నాయి. యింకో మూలలో పాత ఖాతాపుస్తకాల గుట్ట వుంది. కప్పుపైనున్న అడుగుపొడుగు రంద్రం పైన యినపరేకు మూసుంది. హరినారాయణ వాళ్ల పిన్నమ్మను గదిలోపెట్టి బంధించినట్టు చెప్పిన విషయం గుర్తొచ్చి రంగశాయి కళ్లు మిటకరించి చూడసాగాడు.
‘‘చిన్నప్పటినుంచీ దేంట్లోనూ రెండో రాంకు నేనొప్పుకోలేదు. హైస్కూల్లో వో పిల్ల పోటీపడేది. దాంతో పుస్తకాలు తప్ప యింకో లోకం లేకుండా యీ రూములోనే గడి వేసుకుని వుండిపోయేదాన్ని. అన్నానికి పిలిచినా లేచే దాన్ని గాదు. పగలూ, రాత్రీ ట్యూబులైటు వెలుతుర్లోనే వుండి చదివినందుకే యెస్సెస్సీలోనే కంటెద్దాలు తగిలించినారు నాకు…’’
ఆ గదినుంచి బయటికొచ్చాక రెండోగది దగ్గరికొచ్చి,‘‘దీన్నికూడా తెరువు రమణీ! నాతోబాటూ మా పెద్దమ్మకూడా యీ రూములోనే జాగారం చేసేది,’’ అంది స్వరాజ్యం. ఆ గది కూడా బూజూ దుమ్ముతో రకరకాల సామాన్లతో నిండిపోయి వుంది. దానికప్పుకూ రేకుమూసిన రంధ్రమొకటుంది.
చీకట్లో పాదాలకిందేదో పాకడంతో రంగశాయి వోగెంతు గెంతాడు.
“బొద్దింకలు వదినా! హిట్టెంత గొట్టినా తెల్లారేసరికి మళ్లా పుట్టుకొచ్చేస్తావుండాయి,” అంది రమణి సిగ్గుపడుతూ.
‘‘మా పెద్దమ్మకప్పుడు కూడా వొకోసారి యిప్పట్లానే మతిస్థిమితం తప్పిపోయి యెక్కడికంటే అక్కడి కెళ్లిపోయేది. వొకసారెటో వెళ్లిపోయి నాలుగు నెలలదాకా కనబడనే లేదు. మా నాయన మనుషుల్ని పంపించి గాలించి అలిసిపోయినాడు. కడాకు షోలింగర్లో దొరికింది. నలభైమైళ్లు అంత దూరంవొంటిగా యెట్లా పొయ్యుందో కూడా తెలియదు. ధర్మసత్రంలో వుండిపొయ్యిందట అన్నిదినాలూ… రోజూ కొండెక్కి నర్సింహస్వామి దర్శనం చేసుకునేదీ… సత్రంలో వాళ్లు పెట్టింది తిని పండుకునేదీ…’’ అని చెపుతూ స్వరాజ్యం నవ్వుతూ హాల్లోకి తిరిగొచ్చింది.
‘‘పిలకాయల్ని కూడా తొడుక్కోనొచ్చి వుంటే యేమి రాజ్యం! చూసి చానా దినాలై పొయ్యింది,’’ అని అడిగింది స్వరాజ్యం పినతల్లి.
‘‘వాళ్లింకా చిన్న పిలకాయలనునుకుంటా వుండావా పిన్నీ! సోనీ యిప్పుడు విజయవాడలో మెడికల్ యిన్టెన్సివ్ కోచింగ్‌లో వుంది. చదువూ, తిండీ, నిద్రా అంతే! వాళ్లను ఆకాశాన్ని కూడా చూడనియ్యరు. పేరంట్లును కూడా రానియ్యరు. అంతస్ట్రిక్టు… బాబీగాడు పదో తరగతి.. తిరుపతిలోనే రెసిడెన్సీలో పడేసినాను. వాడు హాస్టల్లోంచీ బయటికెళ్లాడని తెలిస్తే ఆ స్కూలే మార్పిస్తానని చెప్పేసినాను. వాళ్లకు నేనంటే భయం. వాడ్ని హాస్టలు బయట కడుగుపెట్టనియ్యరు,’’ అన్నాక,‘‘యిక వెళ్తాం పిన్నీ! యింకో గంటలో వేలూరు విట్‌లో వుండాలి. మీటింగుంది. మురళిని షోరూంలోనే పలకరిస్తాన్లే…’’ అంటూనే స్వరాజ్యం చరచరా వీధిలో కొచ్చేసింది.
‘‘ఆ అమ్మాయి కాఫీ అని అరుస్తోంది రాజ్యం!’’ అని రంగశాయి అంటున్నా వినిపించుకోకుండా కార్లో కెక్కి కూర్చుని,‘‘త్వరగా స్టార్ట్ చెయ్యండి,’’ అంది. అంతవరకూ కార్లో కూచుని పెద్దగా కబుర్లు చెప్పుకుంటున్న యువకులిద్దరూ వెంటనే నోర్లు మూసేసుకున్నారు.
‘‘నేరుగా పలమనేరు,’’ అంది స్వరాజ్యం.
‘‘పదవతావుంది. టీ యేమైనా తాగతారా శంకర్!’’ అని అడిగాడు రంగశాయి.
‘‘వద్దొద్దు సార్! మేడం అర్జెంటన్నారు గదా! పోదాం పదండి,’’ అన్నాడతను. ఆమె ముందు మాట్లాడ్డానికి ఆమె రీసెర్చి స్టూడెంట్లు భయపడి చస్తారని రంగశాయికి తెలుసు. రీసెర్చి స్కాలర్ల మొగుళ్లు కూడా తోక తిప్పరనీ తెలుసు.
‘‘నీ భార్యనూ కొడుకునూ వదిలిపెట్టి వచ్చినావు. రాత్రి వెళ్లేసరికి లేటయితే పర్వాలేదా?’’ అని మళ్లీ అతడ్నే అడిగాడు రంగశాయి.
‘‘మేడం నా వైఫును తార్డ్ చాప్టర్ యీ శనివారం లోపల యియ్యమన్నారు సార్! నా భార్య తననెవరూ డిస్టర్బు చెయ్యకుండా యింటికి బీగమేసుకోని పొమ్మనింది. తిరుక్కోని పొయినాక నేను తలుపు తీస్తేనే ఆమె పైకి లేచేది. నా కొడుకును వాళ్ల అమ్మమ్మ దగ్గిర వదిలిపెట్టి వచ్చినాను. నేను వెళ్లి తీసుకొచ్చే వరకూ వాడు వాళ్ల అమ్మమ్మకు వూపిరి కూడా తిప్పనీడు…’’ వినయంగా వొదుగుళ్లు పోతూ చెప్పాడు బాలశంకర్.
మేడంగారికి కోపమొస్తుందన్న భయంతో వెనక సీట్లో కూర్చున్న యువకులు గుసగుసలు కూడా మానేశారు. నుదురు చిట్లించుకుని ఆలోచిస్తున్న స్వరాజ్యం మనస్సులాగే కారులోని వాతావరణం కూడా బరువెక్కుతున్నట్టుగా అనిపించసాగింది రంగశాయికి.
పలమనేరు శివార్లలోకి రాగానే,‘‘మీ అమ్మమ్మా వాళ్ల వూరెప్పుడూ రాలేదు నేను. యిదే మొదటిసారి,’’ అన్నాడు రంగశాయి.
‘‘మన పెళ్లప్పటికే మా మామ మా నాయనతో గొడవపడి కోర్టుకెక్కినాడు. మా పెద్దమ్మకు రావల్సిన భాగంకోసరం మదనపల్లె వాళ్లపైన దావా వేసి, యేమీ చెయ్యలేక చేతులెత్తేసినాడు. మా అత్త పోరు పడలేక మా పెద్దమ్మ మా యింటికొచ్చింది. చిత్తూరులో వుండే లాయర్లంతా మా నాయన ఫ్రెండ్లే! ఆయనా కేసు తిరగతోడితే మా మామకు మనసొప్పలేదు. కడునొప్పొచ్చింది. దాంతో మన పెండ్లికి కూడా రాలేదీ పెద్దమనిషి,’’ అంది స్వరాజ్యం.
అలాంటి పెద్దమనిషింటికిప్పుడే ముఖం పెట్టుకుని వెళ్ళాలి? రంగశాయి సందేహిస్తూ భార్యకేసి చూపు తిప్పాడు.
‘‘పాత బజారువీధి. కారందాకా పోదు. ఆ టర్నింగులో ఆపండి. తర్వాత నడద్దాం…’’ అంది స్వరాజ్యం.
రెండువైపులా పాతకాలంనాటి మిద్దెయిండ్లూ, మధ్యలో అక్కడక్కడా మట్టిమిద్దెలూ, ప్రహరీ లేకుండా వుమ్మడి గోడలపైన్నే వరసగా కట్టేసిన యిండ్లు… ప్రస్తుతం నుంచీ నూరేళ్లు వెనక్కు తిప్పేసుకున్నట్టుగా వుందా పాత బజారువీధి. దాదాపుగా యిరవై అడుగుల వెడల్పున్న యింటి ముందాగి,‘‘వొకప్పుడిక్కడ మా తాత చిల్లరంగడునింది. యిప్పుడు బజారు బస్టాండు దగ్గిరికి మారిపోయిందన్నారు. అక్కడ మా మామదిప్పుడు హార్డ్‌వేర్ షాపంట!’’ అంటూ కోట తలుపుల్లాంటి యినప తలుపుల పక్కనున్న కాలింగ్‌బెల్ నొక్కింది స్వరాజ్యం. కంగారూ బిడ్డలా పెద్ద తలుపులోపలున్న చిన్న తలుపొకటి కాసేపయ్యాక తెరుచుకుంది.
‘‘యేమత్తమ్మా! బాగుండావా? నేను… స్వరాజ్యాన్ని,’’ అని చెప్తూనే లోపలికి దూరేసింది స్వరాజ్యం. బాలశంకర్‌ను వీధిలోనే వుండమని సైగ చేశాక రంగశాయి కూడా యింట్లోకెళ్లాడు.
‘‘యెప్పుడో మా నాయనకూ మామకూ మనస్పర్థలొచ్చినాయని నన్ను గూడా దూరంపెట్టేస్తారా అత్తమ్మా మీరు? దాంతో నాకేం సంబంధం? యీ నడుమ నిన్ను చూడాలని భలే కలవరంగా వుంది. వేలూరుకు పోతాపోతా కారునీ పక్కకు తిప్పమన్నాను మా ఆయనతో,’’ అంటూ చీకటిగా వున్న ఆ యింట్లోపలికి దూసుకెళ్లిపోయింది స్వరాజ్యం.
అప్పటికి కాస్త తేరుకున్న పెద్దావిడ గబగబా హాల్లోకొచ్చి లైటుస్విచ్ నొక్కింది. కిటికీలు తెలియని హాల్లోకి కృత్రిమంగా వొక రాత్రి వచ్చేసింది. వెలిసిపోయిన పాతకుర్చీలూ, రంగు వెలిసిన గోడకు పాత ఫోటోలూ, అటువైపు మూలలో కొక్కాలకు వేలాడుతున్న పాంట్లూ, చొక్కాలూ…
‘‘పిలకాయలంతా స్కూళ్లకూ, కాలేజీలకూ పొయ్యే వుంటారు. మామ కూడా షాపుకేనా? యింకా సంపాదించి యెవురికి పెట్టాలంట? ఆ మాత్రం వ్యాపారం మధూ చెయ్యలేడని అనుమానమా?’’ అని నవ్వాక, అప్పుడే హాలుకవతలి చీకట్లోంచీ వచ్చిన వ్యక్తిని,“వంటప్పుడే ఆరంభం చేసేసినావా పద్మా! నన్ను గుర్తుపట్టినావా లేదా నువ్వు!’’ అని అడుగుతూ స్వీటుపాకెట్లూ, పండ్లూ పూలూ తీసి కుర్చీపైన పెట్టింది స్వరాజ్యం. తరువాత,‘‘నేను చిన్నప్పుడు పారాడిన యిల్లు గదా అత్తమ్మా! అట్లనే వుండాది. యేమీ మారనే లేదు,’’ అని పెద్దావిడను మాటల్లోకి రాదీసింది.
‘‘బాంకు కాలనీలో గట్టిన యింటికి పెద్దోడ్ని పంపించేదానికి గగనమయింది రాజ్యం! యీ యిల్లయితే వూరి మధ్యలో పెట్టె మాదిరుంటాదంటాడు వాడు. గేటుబీగమేస్తే యింక బయటేం జరిగినా తెలియదు. యీ యిల్లు చిన్నోడికిచ్చినామని పెద్దోడిప్పుడు మాపైన అలిగుండాడు,’’ అందా ముసలావిడ హాల్లోంచి లోపలున్న చీకటిని దర్పంగా చూస్తూ.
‘‘యీ హంగూ యీ టీవీ ఆ కొత్త యిండ్లకెట్లొస్తింది అత్తమ్మా! దీన్నొకసారి చూపించాలనే మా ఆయన్ను లాక్కోనొచ్చినాను,’’ అన్నాక,‘‘రండి… మోగమాటమెందుకు? యిది మా అమ్మ పుట్టిల్లు…’’ అని రంగశాయికేసి తిరిగింది స్వరాజ్యం.
హాల్లో వుత్తరపు వైపున్న రెండుగదుల మధ్యలో సన్నటి సందు. అవతల వంట్లిల్లు. దాని వెనక చిన్న ఆకాశపు తునకను చూపెట్టే పెరడు. అక్కడే బాత్రూమూ, లావెట్రీ… దీపం స్విచ్ నొక్కాకే వంటింట్లో సామాన్లు కనిపించాయి. ‘‘పనెక్కువ వదినా! సర్దుకునే తీరిక లేదు,’’ అని పద్మ అనే స్వరాజ్యం మేనమామ కోడలు సిగ్గుపడసాగింది.
అదేమీ పట్టించుకోకుండా హాల్లోకి తిరిగొచ్చిన స్వరాజ్యం,‘‘యీ రూము బీగాలు తియ్యవా పద్మా! దీంట్లోనే కదా నేను పుట్టింది?’’ అంది.
బీగాలు వెతికి, గదుల్ని తెరవడానికో అయిదు నిముషాలు పట్టింది.
‘‘యిది చిన్న రూము. అంటే మా అమ్మది. అది పెద్ద రూము. పెద్దమ్మది. చిన్నప్పుడు మా పెద్దమ్మకు స్కూలంటే యిష్టమే వుండేది గాదంట. మా తాత బలవంతంగా తరిమేవాడంట! దాంతో మా పెద్దమ్మ పారిపోయి వచ్చి యీ రూంలోపల గడేసుకొని దాక్కొనేదంట… వొకటి రెండు దినాలు గాదు… మా తాతకు తెలియకుండా సంవత్సరాలకు సంవత్సరాలు స్కూలెగ్గొట్టి దీంట్లో దాక్కునే దంట… చూసేదానికి మా అమ్మ మా పెద్దమ్మ కంటే పొడుగ్గా, యెర్రగా, అందంగా వుండేదంట! పెళ్లిచూపుల్లో మా అమ్మను చూసినోళ్లు ఆమెనైతే చేసుకుంటామనే వాళ్లంట! దాంతో మా పెద్దమ్మకు పెళ్లిచూపులు జరిగినప్పుడంతా మా అమ్మనా రూములో పెట్టి బీగాలేసేసే వాళ్లంట! పెళ్లయినాక మా పెద్దమ్మా మదనపల్లెలో వుండలేక పారిపోయి వచ్చేసేదంట! సంవత్సరాలకు సంవత్సరాలిక్కడ్నే వునిందంట! అట్లా పెద్దకూతురొకతి యింట్లో వుంటే చిన్నదానికి పెండ్లి కుదిరితిందా? దాంతో మా అమ్మకు పెండ్లిచూపులు జరిగినప్పుడంతా, మా పెద్దమ్మ నీ రూంలో పెట్టి బీగాలేస్తావున్నారంట! మా పెద్దనాయిన కాలమైనాక మా పెద్దమ్మకు రావల్సిన భాగంకోసరం మామ కోర్టులో కేసేసినాడు గదా! అప్పుడు ఆ మదనపల్లె మనుషులు ఆమెనెట్లయినా వాళ్లూరికి తొడుక్కోని పోవాలని చూసినారంట! అప్పుడామెను మా మామ ఆ రూంలోనే పెట్టి బీగాలేసి పాదుకాపు చేసినాడంట!…’’
‘‘అయితే మీ తాతకట్టింది రూముల్నా! జైళ్లనా!’’ అని పెద్దగా విసుక్కున్నాడు రంగశాయి.
“అదేమీ గాదు. కోటగట్టినాడు.సేఫ్టీ, సెక్యూరిటీ వుంటేనే కదా యేదయినా,’’ అంటూ స్వరాజ్యమింకా వుత్సాహంగా అందుకుంది. ‘‘మా తాతదప్పట్లో వూర్లోకంతా పెద్దవ్యాపారం. ఆయినకూ యిద్దరుపెండ్లాలు. పెద్దామెకు బిడ్డల్లేకపోతే చిన్నామెను చేసుకున్నాడంట! పెళ్లయినప్పుడామెదీ చిన్నవయిస్సే… యెప్పుడూ పుట్టింటికి పోవాలని గొడవ చేసేదంట! ఆమెను గడపదాటనీకుండా మా తాతీ యింటినింత పకడ్బందీగా కోట మాదిరి గట్టించినాడంట…’’
పద్మ తీసుకొచ్చిన వేడికాఫీని తాగుతూ,‘‘యిప్పుడా రూముల్నిండా పాతసామాన్లే పడుండాయి. యెవుర్నయినా లోపలికి తోయాలన్నా తావులేదు,’’ అంది స్వరాజ్యం.
‘‘అయినా రూముల్లో దాంకోవాల్సిన కర్మేముండాది రాజ్యం. యిల్లంతా యినప్పెట్టె మాదిరుంటే… నేనయినా, నా కోడలైనా యెప్పుడో ఆర్నెళ్లకో సంవత్సరానికో గుడికనో, పేరంటానికనో యెవురైనా పిలిస్తే తప్పనిసరైనప్పుడు మాత్రమే గడప దాటతాము. మేమంత గట్టింగా వుండంగానే మొగోళ్లంత ధైర్యంగా షాపుకు పోయి వ్యాపారాలు జేసుకుంటా వుండారు,’’ అని ఆ పెద్దావిడ సంబరపడసాగింది.
‘‘యిక వెళ్తానత్తమ్మా! వేలూరులో అర్జెంటు మీటింగుంది. వీలయితే దోవలోనే మామను పలకరించేసి పోతాం,’’ అని వీధిలోకి వచ్చేసింది స్వరాజ్యం- వెనకనుంచీ ‘‘కుంకుమైనా తీసుకోని పోవే!’’ అన్న పెద్దావిడ మాటల్ని వినిపించుకోకుండా…
‘‘యిక తప్పదు. ఆ పాడు మదనపల్లెకే పదండి,’’ అని మాత్రం చెప్పేసి తర్వాత ముఖానికి గంటు పెట్టుకుని కూర్చుంది స్వరాజ్యం.
పుట్టింటినుంచీ న్యాయంగా రావల్సిన ఆస్తీ పోయింది. పెళ్లయినప్పటినుంచీ ఆశ పెట్టుకున్న పెద్దమ్మ ఆస్తినయినా కాపాడుకుని తీరాలి. కోపం, రోషం, బాధ, పట్టుదల, నిస్సహాయతా,అన్నీ ముప్పిరి గప్పడంతో తుపానులో తగులుకున్న జింకపిల్లలా విలవిల్లాడిపోతున్న స్వరాజ్యంకేసి జాలిగా చూశాడు రంగశాయి.
చిత్తూరులోగానీ పలమనేరులోగానీ పెద్దమ్మను దాచిపెట్టి వుంటారనే తన అనుమానం తీరినందుకు సంతోషపడడం కంటే, యిష్టంలేని మదనపల్లెకు వెళ్లక తప్పడంతో స్వరాజ్యం బాధపడుతోందని రంగశాయి కర్థమైపోయింది. ఆవిడకు వూరటగా వుండాలని,‘‘కమ్మల గురించేమైనా తెలిసిందా శంకర్?’’ అని అడిగాడు.
‘‘పెద్దమ్మగారి కమ్మలా సార్?… అవి… అవి…’’ అని తడబడ్డాక, “ఆ యెస్సయి రెండుమూడు దినాల్లో చెప్తానన్నాడు…’’ అని ముగించాడు బాలశంకర్.
‘‘విజయవాడలో నా ఫ్రెండొకడు డిఐజీగా వున్నాడని చెప్పినాను కదా! వానికో మాట చెప్తానని అంటే వద్దన్నావు. యిప్పుడు చూడు దొంగతనం పోయిన కమ్మల్ని తెచ్చుకునేదెంత ఆలస్యమవుతూందో!’’ అని యీసారి భార్యనే అడిగాడు రంగశాయి. ఆమె మరింతగా ముఖం ముడుచుకుంది.
మదనపల్లెలో హరినారాయణ వాళ్లిల్లు చిరునామాను వెదికిపట్టుకునే సరికి గంట మధ్యాహ్నం రెండయింది. పుంగునూరుకెళ్లే పెద్దరోడ్డు పైన్నే వుందా యిల్లు. పహిల్వాన్ల మధ్య దాక్కున్న రోగిష్టిలా, పెద్ద మాల్సుగానూ, సూపర్ బజార్లుగానూ రీ మాడలింగు చేసుకున్న యిండ్ల మధ్య దీనంగా, పాతగా, బీదగా వుందా యిల్లు. ముందుభాగంలో అంగడేదో వుండేదని గుర్తుచేస్తూ దాని వరండాకు సన్నగా, పొడుగ్గావున్న చిక్కు తలుపులు ఆరేడు వరసగా వున్నాయి.
కాలింగ్ బెల్ నొక్కిన తరువాత తెరుచుకున్న సన్న తలుపు వెనక బట్టతల ముసలాయనెవడో కనిపించాడు.
‘‘హరినారాయణ… హరన్న…’’ అని అడిగింది స్వరాజ్యం.
‘‘వాళ్లెవురూ లేరమ్మా! అంతా బెంగుళూరు చేరిపోయినారు,’’ అన్నాడా ముసలాయన.
‘‘అవునా? హరన్న నాకు వరసకు అన్నవతాడు… యీ యిల్లు బేరానికి పెట్టినారని తెలిసి…’’ అంటూ స్వరాజ్యం చీకట్లోకి రాయి విసిరింది.ముసలాయిన పక్కకు తప్పుకుని,‘‘అవునా? నాకు చెప్పలేదే!’’ అన్నాడు. కొంత సందు దొరకగానే స్వరాజ్యంలోపలికి దూరేసింది. తానూ లోపలికెళ్తూ బాలశంకర్ వాళ్లను కారులోనే వుండమన్నాడు రంగశాయి.
యింట్లో వస్తువులేవీ లేవు. చాలా రోజుగా ఖాళీగాపడి వున్నట్టు తెలిసిపోతోంది. హాల్లోంచి లోపలికున్న దారేదో, పక్కగదిలోకేతలుపు తెరుచుకుంటుందో తెలియడం లేదు. పొగచూరిన వంటగదీలోంచి అవతలి కెళ్లాకగానీ అక్కడో పెరడుందని తెలియడం లేదు. పెరడులోని పాడుబడ్డ గోడలమధ్య స్నానాలగదీ, పాయిఖానా వుండొచ్చునని అనుమానం కలుగుతోంది. మనుషులు కట్టిన యిల్లులా కాకుండా, ప్రకృతి తయారుచేసిన బిలంలాగున్న యింటిని రంగశాయి బెదిరిపోతూ చూడసాగాడు.
యిల్లంతా తిరిగి చూశాక, హాల్లోకొచ్చి, గదిలా కనిపిస్తున్న చీకటిలోకి తొంగి చూస్తూ,‘‘పెళ్లయినకొత్తలో పుట్టింటికి పారిపోకుండా మా పెద్దమ్మ నిక్కడే రూంలోపెట్టి బీగాలేసేవాడంట మా పెద్దనాయిన. అదియిదే అయివుండాలి… దీంట్లో నేలమాలిగ కూడా వుండేదని చెప్పింది మాపెద్దమ్మ,’’ అంది స్వరాజ్యం. ‘‘మా పెద్దమ్మకంటే మా హరన్న, వాళ్ల చెల్లీ అంతా రెండుమూడేళ్లు మాత్రమే చిన్నగదా! ఆమె సంసారానికొచ్చి నపుడు వాళ్లుఆమెను భలే యేడిపించేటోళ్లంట. అందుకని మా పెద్దనాయిన చిన్నభార్యకోసరమని దూరంగా యింకో యిల్లు గట్టినాడంట! అక్కడికీ వీళ్లు పోయి బెదిరిస్తావుంటే ఆమెనా యింట్లోపల పెట్టి, బీగమేసి, బయట కాపలా కూడా పెట్టినాడంట! యిప్పుడు ఆ యింట్లో వుందేమో పెద్దమ్మ,’’ అంటూ ఆ ముసలాయన ముఖంలోకి సూటిగా చూసింది.
‘‘ఆ ఆస్తులన్నీ యెప్పుడో అమ్ముకునేసినారు గదమ్మా! వునిందంతా జవురుకున్నాక ఆ పెద్దకొడుకు వేర్లుబోయి, బెంగుళూరులో సొంతంగా అంగిడి పెట్టుకున్నాడు. చిన్నకొడుక్కు జరుగుబాటు తగ్గిపొయ్యిందని అయ్యగారి బాధ. యీ యిల్లు అమ్మి ఆయనకూ అంగడి పెట్టియ్యాలని తిరగతా వుండాడు. దీన్నమ్మాలంటే కోర్టు తగరాదేదో అడ్దం పడతా వుండాదని యిదైపోతావుండాడు…”
“హరిన్న యిప్పుడిక్కడికి రావడమే లేదా పెద్దాయినా?’’ అని విచారణ మొదలుపెట్టింది స్వరాజ్యం.
‘‘వచ్చిపోయి చానా రోజులయి పోయిందమ్మా! అప్పుడెప్పుడో వాళ్ల పిన్నమ్మని వొక ముసలామెను తొడుక్కోనొచ్చినాడు. మూడంటే మూడే దినాలున్నాడు. హోటల్నించీ అన్నీ నేనే తెచ్చిపెట్టినాను.ఆ ముసిలామయితే ఆ మూడుదినాలూ ఆ మొబ్బుగావుండే రూంలోనే వుండిపొయ్యింది! బయటికే రాలేదు’’… అన్నాడతను.
‘‘మా పెద్దమ్మే! ఆమే!…’’ అని పెద్దగా అరిచాక,‘‘యిప్పుడెక్కడుండాదామె? బస్టాండు వెనక మండీ దగ్గిరింకో యిల్లుందన్నారు గదా! అక్కడా?’’ అని అడిగింది స్వరాజ్యం.
‘‘పెద్దాయనా! ఆ ముసలామెనేం చేసినారో అది చెప్పు,’’ రంగశాయి విసుక్కున్నాడు.
ముసలాయన గుక్కిళ్లు మింగి ‘‘బెంగుళూరుకు మాత్రం తీసుకోని పోమని అంటావుంటే నా చెవిన బడిందమ్మా! యిక్కడ్నే యెక్కడ్నో ముసిలోళ్లుండే తావులో యిడిసి పెడతావుండారని మాత్రం తెలిసింది,’’ అన్నాడు.
‘‘వోల్డేజీహోం… అదెక్కడ?’’
ముసలాయన బిక్కమొహం పెట్టేశాడు.
స్వరాజ్యం సరసరా వీధిలోకొచ్చి,‘‘యీ వూర్లో వోల్డేజీహోం లెన్నుండాయి? వాటి అడ్రస్సు తెలుసుకో,’’ అని పురమాయించింది.
గూగుల్ నడిగాక ‘‘మొత్తం మూడున్నాయి మేడం.చిదానంద ఆశ్రమం, టీజీఆర్, శ్రావణ్…’’ అన్నాడు బాలశంకర్.
‘‘ఆశ్రమమయితే ఖర్చుండదు. దాంట్లోనే చేర్చుంటారు. నేరుగా అక్కడికే పోదాం,’’ అంది స్వరాజ్యం.
కారు గూగుల్ సూచనల్ని అనుసరించింది.
సీటియం రోడ్డులో వూరికి ఆరుమైళ్లదూరంలో వుందా ఆశ్రమం. పెద్ద చింతచెట్ల మధ్య రెండతస్థుల యిల్లు. దాని చుట్టూ చిన్న గుడిసెలు కొన్ని… యెండ మండిపోతూ వుంది.
గేటు పక్కనున్న ఆఫీసులో కనిపించిన వుద్యోగికూడా ముసలివాడే! పేరూ వివరాలూ చెప్పాక,‘‘ఆమె మీకేవతాది?’’ అని అడిగాడు నిర్లిప్తంగా.
‘‘మా పెద్దమ్మ… ఆమె సవితికొడుకు మాకు తెలియకుండా తీసుకొచ్చి యిక్కడ చేర్చేసినాడు,’’ అని స్వరాజ్యం ఆక్రోశించింది.
ఆయన లేచి, వో గుడిసె దగ్గరికొచ్చి ‘‘దీంట్లోనే వుండేది రెండునెలలకు పైగా’’ అన్నాడు.
పదడుగుల వ్యాసముండే చుట్టిల్లు. వున్న యేకైక కిటికీ మూసే వుంది. తలుపుకు బీగముంది.
ముళ్లపొదల్లోంచీ తప్పించుకొచ్చిన వేడిగాలి వీచికొకటి పిచ్చిగా దుమ్ము రేపుతూ వెళ్తోంది.
‘‘యిప్పుడిక్కడ్లేదా?’’ రంగశాయి కూడా కస్సుమన్నాడు.
‘‘చేరినప్పుటినుంచీ అజీర్ణం, మోషన్సూ… మా డాక్టరే మందులిచ్చినాడు. తిండే లేదు. వారం ముందు తలకిందులైతే మావాళ్లే గవర్మెంటాసుపత్రిలో చేర్చేసొచ్చినారు…’’ అన్నాడాయన తాపీగా.
‘‘హాస్పిటల్‌కే పోదాం పదండి…’’ అని స్వరాజ్యం కారు దగ్గరికి పరిగెత్తింది.
‘‘భలే మనిషామె! యింత వేడిలో కూడా ఆ తలుపు తెరిచేదే గాదు. కిటికీ తెరిస్తే మూసేయమని అరిచేది. బయటెవరైనా తలుపుకు బీగం తగిలిస్తే గానీ నిద్రపొయ్యేదే గాదు…’’ అంటున్నాడా పెద్దాయన వెనకనుంచీ.
తన మెడికల్ రెప్రజెంటేటివ్ వుద్యోగం వల్లకూడా వుపయోగముందని భార్యకు తెలిసే అవకాశం వచ్చినందుకు రంగశాయి సంతోషపడసాగాడు. హాస్పిటల్లో వున్న కాంపౌండరు స్నేహితుడికి ఫోను చేశాడు. కారు హాస్పిటల్ చేరేసరికా కాంపౌండరు గేటు దగ్గరే యెదురు చూస్తున్నాడు. అతను హాస్పిటల్ వెనక్కు రమ్మని సైగ చేశాడు. వాళ్లటు వెళ్లేసరికా పెద్ద వార్డు ముందున్నాడతను.
‘‘యిదేమిటి? యిది మార్చురీ గదా!’’ అని బెంబేలు పడుతూ అడిగాడు రంగశాయి.
‘‘ఆమె చనిపోయింది నిన్ననే! వాళ్ల వాళ్లకు ఫోన్ చేశారన్నారు మావాళ్లు. బాడీకోసం కాదా మీరొచ్చింది?’’ అన్నాడతను తలగోక్కుంటూ.
‘‘మా పెద్దమ్మ…కాదు… కాదు…’’ స్వరాజ్యం యేడవబోయింది.
‘‘అసలామె అవునో కాదో చూస్తే గానీ చెప్పలేం. పదలోపలికి,’’ అన్నాడు రంగశాయి.
పర్మిషన్ తీసుకున్నాక కాంపౌండరు లోపలికి రమ్మన్నాడు.
బోసితనంతో భీకరంగా వున్న వరండాను దాటి లోపలి హాల్లోకెళ్తూండగా భార్య చేయి గట్టిగా పట్టుకున్నాడు రంగశాయి. పెద్ద ఫ్రీజరు పెట్టెలాగున్నహాల్లో తెల్లటి చలిపొగలు బతికిన మనుషుల్నిగూడా గడ్దగట్టించేలా సుళ్లు తిరుగుతున్నాయి. అవతలిగోడకు పెద్ద బ్యాంకులాకర్ల లాంటి యినప బాక్సులున్నాయి. మాసిన గడ్డపు, మురికి దుస్తుల మనిషొకడు తూలుతూ వచ్చి, వో పెట్టె లాగి, యెడమ చేత్తో లోపలి శరీరంపై నున్న గుడ్డను పైకెత్తి,‘‘చూడు,’’ అని గుడ్లురిమాడు.
స్వరాజ్యం వెనక్కో అడుగేసి,‘‘కాదు కాదు,’’ అని అరిచింది. అతను పక్క పెట్టెను లాగాడు. లోపలికోసారి చూసి, గొంతునెవరో పిసుకుతున్నట్టుగా వికారమైన కేకపెట్టింది స్వరాజ్యం.
రాలిపడి యెండిపోయిన కొబ్బరికాయలాంటి ముఖం. మూసుకుపోయిన కళ్లు. ముక్కుకూ చెవులకూ యేమీ లేవు. పెదవులు మాత్రం నవ్వుతున్నట్టుగా అదోలా వంపు తిరిగి వున్నాయి. తాను గడిపిన గదులన్నింటికంటే చిన్నదిగా వున్న ఆ పెట్టెలో ఆమెకంత ఆనందమేం దొరికిందో అర్థంగాక రంగశాయి విస్తుపోయాడు. స్వరాజ్యం వెనక్కు తిరిగి చూడకుండా పారిపోయింది.
‘‘బెంగుళూరు వాళ్లొచ్చేస్తార్లే రాత్రికి…’’అని కాంపౌండరుకు చెప్పాక బయటికొచ్చాడు రంగశాయి.
స్వరాజ్యం కార్లో కూర్చుని వెక్కుతోంది. ఆవిడనలా కాస్సేపు వొంటరిగా వుండనివ్వడమే మంచిదనుకుంటూ బాలశంకర్‌ను పిలిచి,‘‘ఆ కమ్మలైనా దొరికితే మీ మేడం యేడవడం ఆపుతుంది. ఆ తిరుపతి యెస్సయి పేరు చెప్పు. మా డిఐజీ ఫ్రెండుతో యిప్పుడే చెప్తాను,’’ అన్నాడు రంగశాయి.
‘‘వద్దొద్దుసార్… ఫోన్ చెయ్యద్దు,’’ బాలశంకర్ అతడి చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు.
‘‘పర్వాలేదులే వుండు,’’ అంటూ రంగశాయి ఫోన్ నొక్కబోయాడు. బాలశంకరతడ్ని దూరంగా లాగి,‘‘పెద్దోళ్లు కలగజేసుకుంటే నాకే డేంజరు సార్! యీ సంగతి మీకు చెప్పద్దని మేడం గట్టిగా చెప్పినారు. ఆ కమ్మలూ, ముక్కుపుల్లా నేనే గోల్డుషాపులో అమ్మి మేడంకు డబ్బు చేర్చేసినాను. మేడం కూడా అప్పుడా పాతనగలు కొనే షాపుకొచ్చినారు,’’ అన్నాడతను దీనంగా యేడవబోతూ.
కాస్సేపతడ్ని సూటిగా చూశాక,‘‘యెంతొచ్చింది?’’ అని అడిగాడు రంగశాయి.
‘‘పాత అపరంజి సార్! రాళ్లుకూడా అప్పటం. లక్షకుపైగానే వచ్చింది…’’ అన్నాడతను.
కారు బయల్దేరాక చాలాసేపు యెవరూ మాట్లాడలేదు. పక్కన కూర్చున్న స్వరాజ్యం వెక్కిళ్లు పెడుతున్నట్టనిపించడంతో రంగశాయి కారును పక్కకు తీసి ఆపాడు.
‘‘పత్రాల్లో వేలిముద్రలు వేయించుకున్నాక ఆమెను దొంగల్దోలేసి పొయినారు. మా పెద్దమ్మెప్పుడూ షోలింగర్ నర్సింహసామినే కలవరిస్తావునింది. ఆమూతిపైన తిరునామం లేకుండా చూసిందిప్పుడే!’’ అని స్వరాజ్యం మళ్లీ కొత్తగా యేడవబోయింది.
‘‘ఆమె ముఖంపైనంత నవ్వును చూసిందిప్పుడే నేను. సోనీ యింటికొస్తే చదువుకునే దానికి తావు లేదని కంప్లయింటు జేసినావు గదా! యిప్పుడింకామూలరూము బీగం తియ్యచ్చు,’’ అంటూ రంగశాయి కారును మళ్లీ రోడ్డుపైకి తిప్పాడు.
*
Add comment