మూలవాసుల గుండె ఘోష విందామా?

వేల ఏళ్లుగా తన వాళ్ళు నడయాడిన భూమిని, నిల్చున్న భూమిని ఎవరైనా లాక్కుంటే.. వారిని కనీసం మనుషులుగా కూడా చూడకుంటే.. బతుకు ఎలా ఉంటుంది? మనదైన దాన్ని ఎవరు లాక్కున్నా మనకు ఎంత కష్టంగా ఉంటుంది?  వాళ్ళ విషయంలో అలా జరుగుతూ నిర్వాసితులను చేస్తూనే ఉన్నది.

అవును, ఇక్కడ అక్కడ అని కాదు. ప్రపంచమంతా జరుగుతున్నదదే.
అనాదిగా మానవుడు చేసుకున్న చట్టాలు, ఏర్పరచుకున్న కట్టుబాట్లు ఆ పద్ధతికి, భాషకి ఆ విధానానికి చాలా దూరం.
చీకటి సామ్రాజ్యాలు అందుకు ఒప్పుకుంటాయేమో.. అలా ప్రవర్తిస్తాయేమో కానీ, ప్రాంతం ఏదైనా, దేశం ఏదైనా, పలికే భాష ఏదైనా మూలవాసీ సంస్కారం మాత్రం ఒప్పుకోదు.  ఈ క్రమంలో తమ కుటుంబాలు, తమ మాతృభూమిని, తమ వనరులను, తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం పెద్ద ఎత్తున వ్యతిరేకత తెలుపుతూనే ఉన్నారు మూలవాసులు, ఆదిమ జాతులు. వారికి గతం ప్రాముఖ్యత తెలుసు.  భవిష్యత్ తరాలు  కాపాడుకోవడం కోసం ఎలా ఉండాలో తెలుసు. ప్రకృతితో సహజీవనం తెలుసు. ప్రకృతి ప్రకోపిస్తే ఏమవుతుందో తెలుసు.
ఏది ఎంత అవసరమో అంతే తీసుకుంటూ సమతుల్యతను కాపాడడం తెలుసు.  ఈ జీవావరణం లో ఉన్న జీవులన్నిటి కంటే మనిషి గొప్పవాడేం కాదని , జీవ జాతులన్నీ దగ్గరి బంధువులేనని వారి నమ్మకం.  మానవుడు ఒంటరిగా ఏమీ చేయలేడని మూలవాసులు ఆనాడే వారు గ్రహించారు.
ఆఫ్రికన్ ఆదిమ మానవులైనా, ఆస్ట్రేలియాన్ అబోరిజినల్స్ అయినా, ఆసియన్ ఆదివాసీలైనా, అమెరికన్ మూలవాసులైనా అందరి జీవన విధానం దాదాపు ఒకటే.  పర్యావరణ హితమైన జీవితం. పూర్వీకుల జ్ఞానాన్ని, అనుభవాల్ని మరో తరానికి ప్రవహింప చేయడం అని ఆస్ట్రేలియన్ నేషనల్ మ్యూజియం చూసిన తర్వాత నాకు అర్థమైంది. 
జనవరి 27, 2022 లో న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రంలోని సిడ్నీ లో ఉన్న ఆస్ట్రేలియన్ మ్యూజియం చూసిన అనుభవాన్ని అందరితో పంచుకోవాలని చాలాకాలంగా ఉంది. ఇదిగో ఇప్పుడు ప్రపంచ ఆదివాసీ హక్కుల పరిరక్షణ దినోత్సవం సందర్భంగా ఆస్ట్రేలియా అబోరిజినల్ జాతుల జీవన రీతిని తెలిపే వ్యాసం అందిస్తున్నాను.
ఆస్ట్రేలియాలోని సిడ్నీ లో ఉన్న ఆస్ట్రేలియన్ మ్యూజియం ప్రపంచంలో పేరెన్నికగలది.  ప్రపంచంలో వివిధ ప్రాంతాల మూలవాసుల జీవన సంస్కృతి తెలిపే  కళాకృతులు, పనిముట్లు, సాంస్కృతిక జీవనం వంటివన్నీ ఈ మ్యూజియం లో మనం చూడొచ్చు.
ప్రధానంగా అబోరిజినల్ మరియు టోర్రెస్ స్ట్రైట్ ఐలాండర్స్ కు సంబంధించిన ఎంతో సమాచారం ఇక్కడ లభిస్తుంది.  వారి జీవన విధానం తెలుస్తుంది. వారి సామాజిక జీవనం అర్థమవుతుంది. ప్రభుత్వ సహకారంతో మట్టి పొరల్లో కప్పడిపోయిన ఫస్ట్ నేషన్స్ జీవితాల ప్రాముఖ్యత గుర్తించి, వారి సంస్కృతి గురించి వారి చరిత్ర బయట ప్రపంచానికి చాటే పనిలో మూలవాసీ రచయితలు, కళాకారులు, పరిశోధకులు ఉన్నారు.  యూరోపియన్ వలస అభివృద్ధి సౌధాల కింద నలిగిపోయిన, మరుగు పడిపోయిన మూల వాసుల జీవన సంస్కృతి వారి అనుభవాలను మనకు పరిచయం చేస్తుంది ఈ మ్యూజియం.
అస్థిరమైన వారి జీవితాలను “డిస్కవర్ ద అన్న్సెటిల్డ్”  పేరుతొ జరిపిన  ఎక్సిబిషన్ చూశాను. ఫోటోలు, కొన్ని డ్రాయింగ్స్, పెయింటింగ్స్ తో పాటు  అధునాతన దృశ్య శ్రవణ పరికారికరాలు, మాధ్యమాలను ఉపయోగించారు. హెడ్ సెట్ పెట్టుకొని  వర్చ్యువల్ టూర్ చేయడానికి హై స్పీడ్ ఇంటర్నెట్ ఉండడం విశేషం  మూలవాసుల గొంతులు వినవచ్చు. వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవడం గొప్ప అనుభూతి. అలా విన్న తర్వాత, చరిత్రలో కప్పడిపోయిన అనేక కథలు  విషయాలు బయటకు వచ్చి  నాతో ముచ్చటిస్తున్నట్టుగా అనిపించింది.
65 వేల ఏళ్ల క్రితం ఆస్ట్రేలియాలో ఆదిమ మానవ జీవితం ఉంది. దాదాపు 50 వేల ఏళ్ల క్రితం ఆఫ్రికా నుంచి ఆదివాసులు ఆగ్నేయాసియా  ద్వారా ఆస్ట్రేలియా లో ప్రవేశించారు. ఆదిమ ఆస్ట్రేలియన్లు భూమిపై అత్యంత పురాతన నాగరికత అని కొత్త జన్యు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.   ఆదిమ జాతుల్లో విభిన్న భాషా సమూహాలు, సాంస్కృతిక సమూహాలు  ఉన్నాయి. ప్రతి వంశానికి దాని స్వంత దేశం ఉంది.  ఎవరికి వారికి వారి వారి స్వంత ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు, నమ్మకాలు విలక్షణంగా ఉన్నాయి. ప్రతి సమూహం ఇతర సమూహం నుండి భిన్నంగా కనిపిస్తుంది.
వారు భూమిని, వనరుల్ని, పర్యావరణాన్ని చాలా జాగ్రత్తగా చూసుకున్నారు.   భూమి తో సంబంధం ఉన్న వారు కొందరైతే అది లేకుండా సంచారం చేసే జాతులు కొన్ని.  రుతువులు మారుతున్న కొద్దీ వివిధ ప్రాంతాల్లో మారుతున్న ఆహార లభ్యత ప్రకారం కదులుతూ మనుగడ సాగించేవారు . సంచారం చేస్తూ కాలానుగుణంగా మారిన వారు కొందరైతే, మారని వాళ్ళు కొందరు. వారి జీవనశైలి లోంచే వారి సామాజిక నిర్మాణం వచ్చాయి. వారి విశ్వాసాలు, నమ్మకాలూ పుట్టుకొచ్చాయి. వారు చేసుకునే వేడుకలు, కళలు, ఆటపాటలు, సాంకేతికత, భాష ద్వారా వారి సంస్కృతి వ్యక్తమైంది.
వీరు మాట్లాడే భాష ద్వారా సమూహాన్ని, వారి చరిత్రని, ప్రపంచంతో వారికి ఉన్న సంబంధాన్ని తెలుసుకోవడం వీలైంది. తమ పూర్వీకుల తో  కనెక్ట్ కావడానికి భూమిని గౌరవించడానికి ముఖ్యమైన సంఘటనలు స్మరించుకుంటూ జరుపుకోవడానికి ఒక మార్గాన్ని అందించింది.  వీరి ఆట పాటలు, కథలు, వేడుకలతో సంస్కృతిని నేటికీ నిలుపుకోవడానికి, సామాజిక బంధాలు బలపరుచుకోవడానికి సహాయపడింది.  అతి పురాతనమైన మానవ సంప్రదాయాలు, వారి వ్యక్తీకరణలు అందులో వైవిధ్యం మనం  ఇక్కడ తెలుసుకోవచ్చు.
వలసలు ప్రారంభమయ్యాక వలస రాజ్యంలో స్థానిక జాతుల జీవితంలో అనేక మార్పులు ప్రపంచమంతా జరిగినట్లే ఆస్ట్రేలియాలో కూడా వచ్చాయి.  అంతకు ముందు తెగల మధ్య ఘర్షణలు లేవని కాదు, అవి ఉన్నప్పటికీ బ్రిటిష్ వలస రాజ్యంలో వారి ఉనికికే పెద్ద దెబ్బ తగిలింది.  కొన్ని వేల వేల ఏళ్లుగా ఉన్న తమదైన నేల తమ కాళ్ళ కింద నుండి జారిపోయింది.  తమ చోటులోనే  పరాయి వాళ్ళయిపోయారు.  తమ సొంత నేల నుంచే కాదు సొంత వాళ్ళకి దూరమైపోయారు.  తమదైన చోట తనదైన సొంత జీవితం పోయింది. స్వేచ్ఛగా జీవించే వారి జీవనం  దుర్భరమైపోయింది. వారిదైన సాంస్కృతిక, ఆధ్యాత్మిక, సామాజిక  జీవనానికి, సహజ వనరులకు భాషకు భూమికి దూరమయ్యారు.
గతంలో లేని వ్యాధులు, హింస, కుటుంబాలు విచ్ఛిన్నం కావడం, వివక్షాపూరిత మైన ప్రభుత్వ విధానాలు అబోరిజినల్ తెగల పటిష్టమైన జీవనాన్ని దెబ్బతీశాయి. ఆస్ట్రేలియా ఆదివాసులు తమ చుట్టూ ఉన్న భూమి, నీరు, అడవి నుంచి తమకు అవసరమైన ప్రతి దాన్ని తీసుకున్నారు.  అదంతా మనుగడ కోసం చేసే పోరాటంలో భాగంగానే.  కానీ అంతా తమకే కావాలన్న స్వార్ధం వారిలో కనిపించదు.  అందుకే వారి సాంకేతిక పరిజ్ఙానంలో భూమిని పర్యావరణాన్ని నాశనం చేసే సాధనాలు ఏవీ కనిపించవు.  తాము నివసించే ప్రకృతిలో తాము కూడా భాగం అనే లోతైన ఆలోచన వారిది.
అసలైన ఆస్ట్రేలియా చరిత్ర పుస్తకాలలో కనిపించదు. అది పాఠంగా ఉండదు. కానీ మా అబోరిజినల్ జాతుల మెదళ్లలో అదంతా సజీవంగానే ఉంటుంది అంటారు వాళ్ళు. గతకాలపు గాయాలకు లేపనం పూసుకుంటూ గడిచిన కాలపు  అనుభవాలను అర్థం చేసుకుంటూ, నేర్చుకుంటూ భవిష్యత్ బాట వేసుకోవాల్సిన  అవసరం ఉందన్నారు వారి వీడియోలో.
వలసరాజ్యం మూలవాసులకు చేసిన తీవ్రమైన ద్రోహానికి, అన్యాయానికి  చింతిస్తూ 2008లో ఆనాటి ప్రధాని క్షమాపణ చెప్పడం వల్లనేమో.. ఈ మ్యూజియం మూలవాసుల దృక్పథం లో ఉన్నట్లు అనిపించింది.  బహుశా జరిగిన తప్పుని సరిదిద్దుకునే మార్గమేమో..! (అబోరోజినల్ జాతుల జీవితాన్ని పరిచయం చేసే పాఠాలు పొందుపరిచారు.  స్థానిక జాతులను స్మరించుకుంటూ ప్రార్ధన చేయడం ప్రీ స్కూల్ లో చూశాను. అది ఈ మధ్య కాలంలో వచ్చిన మార్పు)
నేను చూసిన వాటిలో కించెల వీడియో నన్ను బాగా కుదిపేసింది. తమ ఇళ్ల నుంచి బలవంతంగా ఎత్తుకు పోయి ఉంచిన పిల్లల  ఒక హోమ్ పేరు ‘కించెల’.  ఆ పిల్లల జీవితాన్ని తెలుపుతూ లభ్యమైన ఆనాటి ఫోటోలు, యానిమేషన్  సాయంతో చేసిన  కించెల బాయ్స్ హోమ్ చూస్తుంటే నాకే కాదు ఎవరికైనా దుఃఖం ఆగదు. స్టోలెన్ జనరేషన్స్ వేదనంతా లోన ఇంకి  హృదయం భారమై పోతుంది.  లోపలి నుంచి పొరలి పొరలి వచ్చే కన్నీటిని కట్టడి చేయలేం,  వలసదారులైన యూరోపియన్లు తమ మాట వినని వారిని  చంపడం,చెట్లకు వేలాడేసి  ఉరి వేయడం  చేసేవారు. జైల్లో పెట్టేవారు. ఉన్న వాళ్ళని భయభ్రాంతులను చేసి గొంతెత్తకుండా, ఎదురు తిరగకుండా చేయాలని వారి ప్రయత్నం.   మూలవాసుల్ని ఓ పద్ధతి ప్రకారం పెద్ద ఎత్తున హతమార్చారు. అయినా తమకు జరుగుతున్న అన్యాయాన్ని వారు ప్రతిఘటించడం మానలేదు.   ఆనాడు మూలవాసులు ఎదుర్కోక పోతే పూర్తిగా తుడిచిపెట్టుకు పోయేవారని వారి చరిత్ర చెబుతున్నది.
ప్రజలను రక్షించాల్సిన పోలీసులే అబోరిజినల్ కి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ పిల్లలని ఎత్తుకు పోవడం, దాడులు గొడవలు సృష్టించడం,పంటలను ధ్వంసం చేయడం,  మూలవాసుల ఉద్యమాన్ని / పోరాటాన్ని అణచివేయడం చేసేవారని తెలిపే చారిత్రక రికార్డులు కొన్ని మనకు కనిపిస్తాయి.  యూరోపియన్ కాలనీల నాటి రికార్డ్స్, వారు చేసిన తప్పుల చరిత్ర కూడా భద్రపరచి ఉన్నాయి.  మూలవాసులకు యూరోపియన్లకు మధ్య ఘర్షణలు, యుద్దాలు జరిగేవని, దశాబ్దాల కాలం కొనసాగినట్లు బ్రిటిష్ వారి రికార్డులతో పాటు ఆనాటి పత్రిక సిడ్నీ గెజెట్ లో వచ్చిన వార్తలు  చెబుతున్నాయి.
మరుగున పడిపోయిన చారిత్రక డాక్యూమెంట్స్, పెద్ద ఎత్తున ఉన్న  కళాకృతులు, ఆనాటి సాంకేతికత, అనంతమైన అనుభవాలు గతంలో తెలియని చూడనివి  ఆస్ట్రేలియన్ మ్యూజియం లో కనిపిస్తాయి.
మ్యూజియం లోకి వెళ్తున్నప్పుడు గేటు దగ్గరే  జంబో పాదముద్ర కనిపిస్తుంది. అది మూలవాసుల పాదముద్ర అట.
ఆస్ట్రేలియాని  కెప్టెన్ కుక్ కనుక్కున్నాడా?
కెప్టెన్ కుక్  రాకకు పూర్వమే కొన్ని వందల తరాల ప్రజలు (65వేల ఏళ్ల క్రితం నుంచి  ) ఆ నేలమీద నివసించారు. అక్కడ ఉన్న తెగల మధ్య వర్తక వ్యాపారాలు చేశారు.   ఉత్తర ఆస్ట్రేలియా లోని కొన్ని వంశాల వారు, టోర్రెస్ స్ట్రైట్  తెగలవారు అంతర్జాతీయ వర్తకం చేసినట్లు, పెళ్లిళ్లు చేసుకున్నట్లు తెలుస్తున్నది.  టోర్రెస్ స్ట్రైట్ ఐలాండర్స్ జాతిపరంగా,  సాంస్కృతికంగా విభిన్నంగా ఉంటారు.  కెప్టెన్ కుక్ కి పూర్వమే కొందరు డచ్ నావికులు ఆస్ట్రేలియా ఉత్తర, పశ్చిమ, దక్షిణ  కోస్తా ప్రాంతాలకు వచ్చి వెళ్లారు.
స్థానిక జాతుల అనుమతి లేకుండానే కెప్టెన్ కుక్ తూర్పు కోస్తా లోని  బోటనీ బే ఏరియాలో ఆస్ట్రేలియా భూభాగంలో కాలు పెట్టాడు. తనో కొత్త దేశాన్ని కనుక్కున్నానని  ప్రకటించుకున్నాడు.  బ్రిటన్ తిరిగి వెళ్ళి ఆస్ట్రేలియా భూభాగం కాలనీలు ఏర్పరచుకోవడానికి అనువుగా ఉందని చెప్పాడు. దాంతో 1788 లో ఒక షిప్ నిండా ఖైదీలతో ఆస్ట్రేలియా ప్రధాన భూభాగంలో అడుగుపెట్టి కాలనీలు ఏర్పరచడం మొదలైంది.  ఆదిమ జాతుల సహకారంతో వారి దయతో జీవించాలని సూచన మేరకు వచ్చిన వాళ్ళు  ఎన్నో ఘర్షణలకు దోహద మయ్యారు.  వలసదారులు వాళ్లతో పాటు అప్పటి వరకు అక్కడి ప్రజలకు తెలియని కొత్త జబ్బులను కూడా మోసుకొచ్చి మూలవాసులను కుప్పకూల్చారు. బ్రిటిష్ వలస రాజ్యంలో ఆనాటి పత్రికలు టెలిగ్రాఫ్,  గ్రెగొరీ వంటి పత్రికలు, గెజిట్ లు, ఓల్డ్ టైమ్స్  ద్వారా మనకు ఎంతో సమాచారం లభిస్తుంది.  చరిత్రకు సంబంధించిన డాక్యుమెంట్లు మనకెంతో చరిత్రని పట్టిస్తాయి.
యూరోపియన్ వలసదారులు ఫస్ట్ నేషన్స్ జీవనాన్ని విచ్చిన్నం చేశారు. వివక్షాపూరితమైన ప్రభుత్వ విధానాలు అనుసరించారు. ఒకప్పుడు ఉన్నంత వివక్ష ఇప్పుడు లేకపోవచ్చు, చట్టాలు ఆదిమ జాతులవారి పరిరక్షణకు చుట్టాలు ఉండొచ్చు కానీ  సామాజికంగా, ఆర్ధికంగా వెనుకబడిపోయిన అబోరిజినల్, టోర్రెస్ స్ట్రెయిట్ ఐలాండర్స్  ఇప్పటికీ తక్కువ విద్య, తక్కువ ఆరోగ్యం, తక్కువ ఉపాధి అవకాశాలే ఉన్నాయి. సిడ్నీ, మెల్బోర్న్, బ్రిస్బేన్, అడిలైడ్, పెర్త్ వంటి నగర ప్రాంతాలు దాటి రీజినల్ ఏరియాలకు వెళితే ఆ విషయం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. నగరాల్లో  పైకి బాహాటంగా కనిపించని వివక్ష ఉన్న మాట వాస్తవం అని గతంలో బ్లాక్ మర్కెట్స్ కి వెళ్ళినప్పుడు అక్కడికి వచ్చిన మూలవాసుల వారసులు చెప్పారు.
జీవితం 
ఆట, పాట , వేట అదే అబోరిజినల్, టోర్రెస్ స్ట్రైట్ ఐలాండర్స్ జీవితం. అందులోనే వారి ఆనందం. సంప్రదాయక బంధాలు, సంప్రదాయ జ్ఞానం ఒకరి నుంచి ఒకరికి , ఒక తరం నుంచి మరో తరంలోకి ప్రవహించే వాహికలు.  అందువల్లే అవి ఈ నాటికి కూడా నిలిచి ఉన్నాయి.  సాంప్రదాయకంగా ఆహారం, నివాసం, దుస్తులు అందించే బాధ్యత పురుషుడు తీసుకుంటే ఇంటి బాధ్యత స్త్రీలు వహించేవారని తెలుస్తున్నది,  అంతేకాక ఇంటిల్లిపాదికి జీవితాన్ని ఇచ్చేవారిగా స్త్రీలను గౌరవించడం కనిపిస్తుంది.
ఆహారం 
వృక్ష సంబంధమైన అనేక రకాల ఆహారం తీసుకునేవారు.  అవి పండ్లు, దుంపలు, కాయగూరలు, గడ్డి, విత్తనాలు, నట్స్  తీసుకునేవారు. వాటితో పాటు కంగారూల మాంసం, ఈము పక్షులు, తాబేళ్లు, రకరకాల చేపలు ,  నత్తలు, ముళ్ల పందికొక్కులు , ఉడుములు వంటి జంతు జాతి మాంసం తినేవారు.  ఎక్కడ ఏవి దొరికితే వాటిని నీటిలో ఉడకబెట్టుకుని తినేవారు. ఉడకపెట్టుకోవడానికి డబ్బాలు మట్టి, ఇనుప పాత్రలు వాడేవారు , బ్రిటిష్ కాలొనీ లు వచ్చాక వారి వేట చేసి ఆహారం సంపాదించుకోవడానికి అంతరాయాలు మొదలయ్యాయి . ఆహారం సంపాదించుకోవడం, పూటగడవడం  చాలా కష్టమైపోయింది.  ఆహారపు
రాళ్లమధ్య మంట వేసి పెద్ద పెద్ద పెంకులు పెట్టి నీళ్లు పోసి కాసేవారు .
ఇల్లు 
కొండ గుహలు , ఆకులు, కొమ్మలతో తయారైన చిన్న చిన్న గుడారాలలో ఉండేవారు.  ఎక్కడున్నా గాలి, వెలుతురూ బాగా వచ్చే విధంగా ఉండేవి.  దగ్గరలోనే  మంట వేసుకునేవారు. ఆహారం కోసం అడవి జంతువులు, చేపల, అడవిలో దొరికే పండ్లు ఫలాలు వేట చేసేవారు.  మొదట వేట కోసం పొడవైన ఈటెలు, డాలు, బూమరాంగ్ వాడారు.
పనిముట్లు, ఆయుధాలు 
ఈటెలు, గొడ్డలి, బాణం, బూమరాంగ్, వుమెరా వంటి రాతి పనిముట్లు, చెక్కతో చేసిన పనిముట్లు ఆయుధాలు వాడారు.  చెట్టు బెరడుతో తయారు చేసుకున్న పాత్రలు, చిన్న చిన్న పడవలు,  తర్వాత లోహం వారి పనిముట్లలో చేరింది.  ఏ జాతుల్లోనైనా, ఏ సంస్కృతిలలోనైనా మనిషి శరీరాన్ని కప్పి ఉంచుకోవడానికి బట్టలు చాలా ముఖ్యమైనవి. అబోరిజినల్స్  మాత్రం తమ శరీరాన్ని నామమాత్రంగానే కప్పుకునేవారు.  జంతువుల చర్మం,  చెట్టు బెరడు, జంతువుల బొచ్చు వాడేవారు.  ఈకలు, గవ్వలు, గింజలు, గడ్డితో అలంకరించుకున్నారు.  కంగారూ, ముళ్ళపంది చర్మంతో చేసిన క్లోక్ (రెండువైపులా ఉపయోగించే దుస్తులు )  దుస్తులు గొప్ప సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. సముద్రపు రకరకాల గవ్వలు, శంఖులు, ఈకలు, కొన్నిరకాల పండ్ల గింజలు దండ గుచ్చి మెడను , తలను అలంకరించుకునే వారు. నారతో తోలుతో బెల్టు, బ్యాగ్ లు,  వారి సమూహాన్ని తెలపడానికి పక్షి లేదా జంతువుల వంటి సహజ రూపాలు గల కుటుంబ చిహ్నం లేదా తమ జాతి చిహ్నం గా భావిస్తారు. దాన్ని వాళ్ళు ‘టోటెమ్’ అంటారు.
ఖాళీ సమయాలు 
ఇండిజినస్ ఆస్ట్రేలియన్ నృత్యం చేస్తారు. ఆటపాటలతో ఆనందంగా గడుపుతారు. భూమి, జంతువులూ, ప్రకృతి తో కూడిన కథలు, పాటల రూపంలో ఒక తరం నుంచి మరో తరం అందించడం కనిపిస్తుంది.
వీరి సంగీత సాంప్రదాయాలు భూమితో అనుసంధానించబడి కనిపిస్తాయి.  వీరి సంగీతం వ్యక్తిగత, సామూహిక చరిత్రలు, కలిసి ఉంటాయి. డ్రీం టైమ్ (పౌరాణిక ) కథలలో పుట్టుక, మరణం, అనేక సంఘటనలు ఉంటాయి. కొండలు గుహలలో వేసిన రాతి పెయింటింగ్స్, చెక్కడాలు ఆదిమ కళ అద్భుతంగా కనిపిస్తుంది.
పండుగలు, వేడుకలు 
కరోబోరి ఒక అబోరిజినల్ తెగ ఉత్సవం. లేదా ఓ సామాజిక సమావేశం. వినోదం, విశ్రాంతి కోసం ఆట పాటలతో గడుపుతారు. వారి తెగవారు తప్ప ఇతరులు ఈ ఉత్సవంలో పాల్గొనడానికి అనుమతించరు.
వీరి కళలు, సంగీతం, నృత్యం, ఆధ్యాత్మిక జీవితం ప్రకృతితో దగ్గరి సంబంధం కలిగి ఉంటుంది.
నమ్మకాలు 
తమ పూర్వీకులు ప్రపంచాన్ని సృష్టించారని, వారే ప్రతిదీ తయారు చేశారని నమ్ముతారు. ఏ ఏ ప్రదేశాలు పవిత్రంగా ఉండాలో చెప్పారని అనుకుంటారు. స్వర్గం, నరకం వంటి నమ్మకాలు కనిపించవు.  మరణాంతర జీవితంపై వారికి నమ్మకం లేదు.
మహిళలు, పురుషులు , పిల్లలు అందరూ తమ శరీరాన్ని రంగుల డిజైన్లతో అలంకరించుకుంటారు.  అలా తమ పూర్వీకులను అనుకరిస్తున్నామని అనుకుంటారు. తమ మొఖలపై చిత్రించిన డిజైన్ లు వారు ఎక్కడి నుంచి వచ్చారో , పూర్వికులతో వారి ఆధ్యాత్మిక సంబంధాన్ని, ఏ వంశానికి చెందినవాడో తెలుపుతాయి.
ఆదివాసుల చిహ్నాలను తమ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవడానికి వారి కళలో ఉపయోగించటం కనిపిస్తుంది,  పురాతన చిహ్నాలు వారి రాక్ పెయింటింగ్స్, గుహల్లో పెయింటింగ్స్, బాడీ పెయింటింగ్, బెరడు పెయింటింగ్  సెరిమోనియల్ దుస్తులు, ఇసుక పెయింటింగ్ లలో కనిపిస్తాయి.
వీరి కళలో, డిజైన్లలో చుక్కలు ఎక్కువ కనిపిస్తాయి. సూర్యచంద్రులు, నక్షత్రాల స్థానాలను బట్టి రుతువులు అంచనా వేస్తారు. మొక్కలు , జంతువుల ప్రవర్తనను బట్టి వాతావరణ మార్పుల్ని అంచనా వేస్తారు.
కించెల బాయ్స్ హోమ్ 
1800 నుండి 1970 వరకు మూలవాసుల పిల్లల్ని వారి తల్లిదండ్రుల నుంచి క్రూరంగా , బలవంతంగా తీసుకుపోయి లేదా వారిని మోసగించి తీసుకుపోయి హోమ్ లో పెట్టేవారు. ఇట్లా దేశవ్యాప్తంగా ఉన్న 480పైగా సంస్థలలో ఉంచారు.  వాళ్ళకి తల్లిదండ్రులు పెట్టిన పేర్లు ఉండేవి కాదు. ఒక నంబర్ తో పిలిచేవారు. కొరడాలతో కొట్టేవారు.  తగినంత ఆహారం, దుస్తులు ఉండేవి కావు. ఉండడానికి చోటు సరిగ్గా ఉండేది కాదు. మగపిల్లలని బ్రిటిష్ వారి వ్యవసాయం,గొర్రెలు గుర్రాలు మేపడం వంటి పనులకు,  ఆడపిల్లలను బ్రిటిష్ వారి ఇళ్లలో చాకిరీ చేయించేవారు.కొందరు దత్తతకు వెళ్లారు. 18 సంవత్సరాల వయసు నుంచి వారు ప్రభుత్వ నియంత్రణ నుండి విముక్తి లభించేది.  వేతనాల్లో చాలా వివక్ష ఉండేది. అయితే ఇదంతా ఒక పద్ధతి ప్రకారం  చర్చి, ప్రభుత్వ ఆధ్వరంలోనే జరిగింది. ప్రతి ముగ్గురు పిల్లలో ఒకరు అపహరణకు గురయ్యారు. అలా దాదాపు లక్షమంది పిల్లలపైనే వారి కుటుంబాల నుంచి దూరమయ్యారు. తమ అస్తిత్వం ఏంటో తెలియక ఇప్పటికీ తమ మూలలను బ్లాక్ మార్కెట్స్ వెతుక్కోవడం 2016 లో చూశాను. కొన్ని తరాల పిల్లలు తమ బాల్యాన్ని కోల్పోయి బానిస బతుకు బతకాల్సి వచ్చింది. తర్వాత కాలంలో ఈ పిల్లలకు కొద్దో గొప్పో చదువు నేర్పడం మొదలైంది.
1924 -1970 వరకు బలవంతంగా దొంగిలించి తీసుకొచ్చిన ఫస్ట్ నేషన్స్  మగపిల్లలు ఉన్న ఒక హోమ్ పేరు కించెల హోమ్. న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రంలో ఉంది. ఈ హోమ్ లలో ఉన్న పిల్లలు తమ పుట్టిన స్థలం, తేదీ, సమూహం వంటి స్వంత అస్తిత్వం, తమ సాంస్కృతిక వారసత్వం కోల్పోయారు.  వారికి ఆంగ్లో ఆస్ట్రేలియన్ సంస్కృతికి అలవాటు చేశారు. వారి స్థానిక భాష మాట్లాడితే కఠిన శిక్షలు ఎదుర్కోవాల్సి వచ్చేదని కించెల బాయ్స్ హోమ్ డాక్యుమెంటరీ లో తమ ప్రత్యక్ష అనుభవాలు పంచుకున్న వారు విపరీతంగా కదిలించారు. చాలా రోజులు వాళ్ళ జీవితం నన్ను వెంటాడింది. వారి వేదన నన్నూ వేధించింది.
చరిత్రకారుడు ప్రొఫెసర్ పీటర్ రీడ్ తన పరిశోధన ఆధారంగా పత్రికలో ఒక వ్యాసం రాశాడు, తర్వాత  ది స్టోలెన్ జెనరేషన్స్ (1981) పుస్తకం తీసుకొచ్చాడు.  అది మీడియా దృష్టిని, ప్రజల దృష్టిని ఆకర్షించింది.  ప్రపంచవ్యాప్తంగా ఖండించారు. చివరికి 2008, ఫిబ్రవరి 13 న ఆనాటి ప్రధానమంత్రి కెవిన్ రూడ్  ఫస్ట్ నేషన్స్ కి క్షమాపణ చెప్పారు.
ఫస్ట్ పీపుల్ కి సంబంధించిన జీవితాన్ని బ్రిటిష్ వలసలకు ముందు, వలసల కాలంలో జరిగిన ఘర్షణలు, ఎదుర్కొన్న సవాళ్లు ఆడియో , వీడియో ల రూపంలో చూడొచ్చు. అనేక చిత్రాలు, ఛాయా చిత్రాలు, పేపర్ కట్టింగ్స్,  ఒకనాటి వస్తువులు, పనిముట్లు, వేషధారణ, అలంకరణ పక్షులు , జంతువులు ఇలా ఎన్నెన్నో వేలాదిగా ఉన్నాయి.   ఆస్ట్రేలియన్ ఆదిమ జాతుల గతం,వర్తమానం తెలుసుకోవడంతో పాటు భవిష్యత్తు ఆలోచనలు కూడా తెలుసుకోవచ్చు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించడం అబ్బురంగా ఉంది.
పిల్లలను తమదైన ప్రత్యేక జీవనం నుంచి కుటుంబం నుంచి దూరం చేసి గాయం చేసిన ప్రభుత్వమే వైద్యం చేస్తున్నట్లు ఇప్పుడు తిరిగి కలపడానికి చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే  అనిపించింది. తద్వారా మూలవాసుల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడివుందని తెలియజేస్తున్నట్లుగా తోచింది.
హృదయం నిండా ఆస్ట్రేలియన్ మూలవాసుల జీవితాన్ని నింపుకుని వెనుదిరిగా.
*

శాంతిప్రబోధ

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు