మూణ్ణాలుగు చంద్ర సందర్భాలు!

గాలివాలు చూసుకొని బతుకు దాటేయడానికి చిత్రకళలో బోలెడు అవకాశాలు! అట్లా గాలివాటంగా బతికేస్తే చంద్ర approval rate ఇంకాస్త ఎక్కువే వుండేది!

మెరికా వచ్చినప్పుడు మనవాళ్లు  తప్పకుండా సందర్శించాల్సిన ప్రదేశాల్లో ముఖ్యమైంది “కాస్ట్ కొ” అనే పచారీ కొట్టు! మరీ ముఖ్యంగా వీకెండ్ వెళ్తే, వూళ్ళో వున్న తెలుగువాళ్ళల్లో కొందరైనా అక్కడ తారసపడతారు. మేం ఆస్టిన్ నుంచి ఫిలడెల్ఫియా మారుతున్న రోజుల్లో వొక వీకెండ్ హడావుడి షాపింగ్ చేయాల్సి వచ్చింది. వొక గంటలో అన్నీ ముగించుకొని ఇంటికెళ్ళి, సర్దుకోవాలని కాస్ట్ కొ వెళ్ళాం. అప్పుడు వొక పెద్దాయన ఎదురొచ్చి నిలబడ్డారు. నా కళ్ళల్లోకి కొంచెం పరీక్షగా, ఇంకొంచెం చిలిపిగా నవ్వుతున్నట్టు చూస్తున్నారు. నేను గుర్తుపట్టలేదు. కానీ, కల్పన వెంటనే గుర్తుపట్టి, “మీరు ఇక్కడా?!” అని పలకరించింది. ఆయన దగ్గిరకొచ్చి నాతో చేతులు కలిపి “ చూశావా, వీడు నన్ను మరచిపోయాడు!” అన్నారు కోపమూ నవ్వూ కలగలిపి.

రెండు కారణాలు ఆయన్ని గుర్తుపట్టకపోవడానికి: – మొదటిది: అసలు ఆయన్ని అమెరికాలో వూహించలేదు. రెండు: అప్పటికే ఆయన ముఖం చాలా మారిపోయింది. వృద్ధాప్యమో అనారోగ్యమో ఎక్కువగా ఆవరించుకొని వుంది. మొదటిది ఎట్లా వున్నా, రెండోది నాకు తెలిసిన చంద్ర ముఖ బింబం కాదు!

నాకు తెలిసిన చంద్ర ముఖ బింబంలో గొప్ప జీవన తపన కనిపిస్తుంది. వొక బెంగాలీ చిత్రకారుడు హైదరబాద్ వీధుల్లో దారితప్పి తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. బెంగాలీ అనేది ఇక్కడ నా కాలేజీ రోజుల్లో అక్కడి చిత్రకారులూ, రచయితల పట్ల ప్రేమ వల్లనే తప్ప ఇంకో అందుకు కాదు!

May be an image of 2 people, people standing and indoor

1

మొదటిసారి హైదరబాద్ నీ, చంద్రనీ వొకేసారి చూశాను, 1980ల ప్రాంతాల్లో కావచ్చు.

అప్పుడు నరసింగ రావు గారు, దేవీప్రియ, చంద్ర అందరూ “రంగుల కల” సినిమా హడావుడిలో వున్నారు. ఆ ముగ్గురూ మూడు భిన్నమైన కారణాల వల్ల ఇష్టం. బహుశా, మా తరానికి “రంగుల కల” అంటే వొక గ్లామర్ కూడా! మేం కంటూ కంటూ వున్న కలలకి వొక ఆకారమేదో స్ఫురించినట్టు ఆ సినిమా కనపడేది.

నా మొదటి కథ “అడివి” ఆంధ్ర జ్యోతి వారపత్రికలో అచ్చయింది. అచ్చయిన వారంలోనే హైదరబాద్ నుంచి వాసిరెడ్డి నవీన్ నుంచి కబురొచ్చింది. “నీకు బస్ టికెట్స్ పంపిస్తున్నాం. హైదరబాద్ రావాలి. ఇక్కడ నీ కోసం నలుగురు ఎదురు చూస్తున్నారు!” అని-

అంతే, టీనేజీ దాటని కాలేజీ కుర్రాడికి అది పెద్ద పురస్కారమే! హైదరబాద్ అంటే పెద్ద ఆకర్షణ అప్పట్లో! అది ఏ దిక్కున వుందో కూడా సరిగా తెలియని అమాయక లోకం నాది. అయితే, ఆ బెరుకు వాళ్ళకి తెలుసు కాబట్టి, నేను బస్సు దిగగానే నన్ను రిసీవ్ చేసుకోడానికి వొక కారు పెట్టారు. బహుశా, కారు ఎక్కడ కూడా అదే మొదటిసారి కావచ్చు. ఇట్లా అనేక “మొదటి” అనుభవాలు ముప్పిరిగొన్నాయి. అవన్నీ, సికిందరాబాద్ లో వొక చైనీస్ రెస్టారంట్ లో ఇంకో ఎత్తు అందుకున్నాయి. చైనీస్ ఫుడ్ అంటే అస్సలు తెలియదు. ఆ రోజు డిన్నర్ కి కనీసం పాతిక మందిని పిలిచారు బి. నరసింగ రావు గారు. వీళ్ళందరూ “అడివి” కథ చదివి, మంచి విద్యార్థుల్లా వచ్చారు. వీళ్ళందరిలోనూ బుద్ధిమాన్ బాలక్ లా చంద్ర!

అప్పటికి చంద్ర కి ఎన్నెళ్ళో నాకు గుర్తులేదు. కానీ, మనిషి వుండడమే చాలా వొద్దికగా, ఏదో నేర్చుకోవాలన్న తపన కళ్ల నిండా! నేనేమో small town kid!

కథ గురించి ఆయన అడిగిన అనేక ప్రశ్నల్లో ఇప్పటికీ కొన్ని గుర్తున్నాయ్. నేనేమీ సమాధానాలు చెప్పినట్టు మాత్రం నాకు గుర్తు లేదు. నోట్లోంచి మాటలు రాని కాలం కదా! అన్నీటికీ నవ్వులూ, ప్రశ్నార్థకం ముఖమే సమాధానంగా వుందేమో! ఆ రోజు చైనీస్ ఫుడ్ మాత్రం చాలా ఇష్టంగా తిన్నా. బస్ స్టేషన్ కి నన్ను పంపించే కారులో మళ్ళీ చంద్ర, మళ్ళీ నరసింగ రావు గారు. అప్పుడు కొంచెం నోరు విప్పాను చంద్రతో మాట్లాడుతూ.

చంద్రకి ఆ మంచి లక్షణం వుండేది. మన మౌనానికి నిప్పంటిస్తాడు తెలీకుండానే! ఆ పొద్దుట బ్రేక్ ఫాస్ట్, తరవాత కారు డ్రైవ్ లో అడిగిన అనేక ప్రశ్నల్లో ఇప్పటికీ గుర్తుంది వొక్కటే: “కథ నీ అనుభవంలోంచి రాలేదు. కానీ, నీ అనుభవమే అనుకునేంత వుద్వేగంగా నడిపించావ్. అది ఎట్లా సాధ్యం?”

నిజంగా తెలీదు. బహుశా, ఆ వుద్వేగమే మంచి రచన కొలమానం అని మాత్రమే తెలుసు. నాకు అప్పట్లో దాస్తావస్కీ ఇష్టం. చంద్రకి కూడా అని ఆ కబుర్లలో తెలిసింది.

ఈ మొదటి పరిచయం తరవాత చాలా సందర్భాలు చంద్రని కలుస్తూనే వున్నాను. అప్పట్లో నేను హైదరబాద్ వెళ్లడమే చాలా తక్కువ. కానీ, వెళ్ళిన ప్రతిసారీ చంద్ర, దేవీప్రియ, శివారెడ్డి, కేతు తప్పకుండా కలిసేవాళ్ళు. నేను వస్తున్నా అని తెలియగానే శివారెడ్డి గారు ద్వారకా తలుపులు తెరిచేవారు. నరసింగ రావు గారు వాళ్ళ ఇంటికి పిలిచేవాళ్లు. వెళ్ళిన ప్రతిచోటా చంద్ర!

నలుగురిలో కూర్చున్నా, చంద్ర మనసు తనదైన ఇంకో ప్రపంచాన్ని తక్షణమే నిర్మిచుకుంటుంది. అట్లా అని ఆ నలుగురితోనూ కలవకుండానూ వుండలేడు. చంద్ర మనః ప్రపంచ కర్మాగారం నిరంతరం ఆ రెండీటీ మధ్యా వూగే లోలకం. లోపలేదో బొమ్మ గీసుకుంటూ వుంటాడేమో, మనమధ్యలో వుండి కూడా.

May be a cartoon

2

అయితే, చంద్రని కేవలం బొమ్మల లోకంలో మాత్రమే కుదించలేం.

అనేక మందితో అనేక విధాలుగా కలిసీ మెలిసీ సంచరించే తాళంచేతుల గుత్తి చంద్ర దగ్గిర వుంటుంది. బహుశా అది ఆయన చుట్టూ వున్న స్నేహితుల బలం వల్ల వచ్చి వుంటుంది. నరసింగ రావు గారు కానీ, దేవీప్రియ గాని కేవలం వొకే వొక్క రంగానికి పరిమితమైన వాళ్ళు కాదు. ఆ సినిమా శీర్షికకి తగ్గట్టుగానే వాళ్ళు తమ చుట్టూ రంగుల కల ఏదో స్వంతంగా నిర్మించుకున్నారు. కవిత్వం రాస్తారు, కథలు రాస్తారు, బొమ్మలు గీస్తారు, ఫోటోలు తీస్తారు, తెర మీద నటిస్తారు. తెర వెనక ఇంకా మనకే అంతుపట్టని అనేక ప్రక్రియల్లోకి వస్తూ పోతూ వుంటారు.

అదెలా సాధ్యం?!

వ్యక్తి ఎన్నెన్ని రూపాల్లో వ్యక్తమవుతాడో ఆ రూపాలన్నీటి మీద సాధికారికత (authenticity) సాధించడం కష్టమే! మా తరానికి వచ్చేసరికి వొక్కో రూపం వొక కంపార్ట్మెంట్ అయిపోయింది. కవిత్వం రాసేవాళ్ళు ఆ గిరిగీసుకునే వుంటారు. కథలు రాసే వాళ్ళు కవిత్వం అంటే “అమ్మో” అనుకుంటారు. బొమ్మలు గీసేవాళ్ళు లక్ష్మణ రేఖలు దాటలేక అవస్థ పడతారు. ఈ పరిమితులని జయించే లక్షణం బహుశా ఆ 1960 లో తరవాతి దశ వల్ల సాధ్యమైందేమో చరిత్రకారులు చెప్పాలి.

దాదాపు నలభై యేళ్ళ పైబడి చంద్రతో నాకున్న అనుబంధంలోంచి చూస్తే, చంద్ర intellectual mapping కొంతలో కొంత అర్థమైందనే నమ్మకంతో ఈ నాలుగు మాటలూ చెప్తున్నా.

అనేకత్వం- అనేది జీవితంలో ఇమిడిపోయిన వ్యక్తులు వీళ్ళు- 1966 తరవాతి రాజకీయ, సాంస్కృతిక వాతావరణంలోంచి చూస్తే, ఆ రెండీటీ మేలు కలయికలో వాళ్ళ బుద్ధిజీవితం మొదలయింది. హైదరబాద్ వొక  సాంస్కృతిక కేంద్రంగా ఎట్లా మారిందో వాళ్ళ జీవితాలు చెప్తాయి. కచ్చితంగా అదే సమయంలో శివారెడ్డి గారి లాంటి వాళ్ళు హైదరబాద్ చేరుకొని వుంటారు. నగ్నముని ఇతర దిగంబర కవులు గొంతు సరిచేసుకుంటూ వుండి వుంటారు. తిలక్ నుంచి విడిపోయి తనదైన స్వరం కోసం వరవరరావు గారు వెతుక్కుంటూ వుండి వుంటారు. తన “మహాప్రస్థానం” ఆలోచనల్లోంచి తనని తాను “మరోప్రస్థానం” వైపు లాక్కుపోవడానికి శ్రీశ్రీ తపిస్తూ వుండి వుంటాడు. ఆ దశకం చివరికొచ్చేసరికి ఎవరు ఎటు వైపు మళ్ళాలో తేల్చుకునే చారిత్రక అవసరం గొంతు మీద కత్తిలా వేలాడుతూనే వుండి వుంటుంది.

అట్లాంటి సందర్భంలో చంద్ర నీళ్ళు నములుతూ కూర్చోలేదు. బొమ్మలు అంతర్జాతీయ భాష అని పిచ్చి కబుర్లు చెప్పుకుంటూ వుండలేకపోయాడు. కచ్చితంగా విప్లవ రాజకీయాల వైపు నిలబడ్డాడు.

గాలివాలు చూసుకొని బతుకు దాటేయడానికి చిత్రకళలో బోలెడు అవకాశాలు! అట్లా గాలివాటంగా బతికేస్తే చంద్ర approval rate ఇంకాస్త ఎక్కువే వుండేది! చల్లని చంద్ర శాలని కాకుండా భగభగ మండే సూర్య తేజాన్ని మనసులో నింపుకొని తనని తాను తీర్చి దిద్దుకున్నాడు చంద్ర.

చిత్రం: శంకర్

3

చంద్రలో నాకు బలంగా నచ్చే లక్షణం అదే!

హైదరబాద్ లో మాకు అద్దె ఇల్లు దొరకడం కష్టమైన కాలంలో మేం వారాశి గూడలో వొక మురికి కాల్వ పక్కన రెండు గదుల ఇంట్లో వుండేవాళ్లం. అది అచ్చంగా కొంప.  ఆ కొంప  వుండే location ని బట్టి చాలా మంది ఆత్మీయులు కూడా మా ఇంటికి వచ్చే వాళ్ళు కాదు. బయట ఎక్కడో హోటల్లో కలిసేవాళ్లం. అదే సంశయంతో చంద్ర వొకసారి ఇంటి అడ్రసు అడిగితే నేను ఇవ్వలేదు. రెండు రోజుల తరవాత ఆయనే ఇల్లు వెతుక్కుంటూ వచ్చారు.

ఆ ముందు గదిలో కనీసం కూర్చుండ కుర్చీలు లేవు. గోడకి చేరగిలబడి కూర్చున్నాడు చంద్ర. అట్లా దాదాపు ప్రతి రెండు వారాలకి వొకసారి వచ్చి పలకరించేవాడు.

ఆయనతో నాకేమీ పనులు లేవు. నాతో ఆయనకి అసలే ఏ పనులూ లేవు. పైగా, నాకు బెరుకు మాత్రం వుండేది. మా తరం దృష్టిలో ఆయన సెలిబ్రిటీ. నేను కోన్ కిస్కా! పైగా, నాన్నగారి కిడ్నీ సమస్యల వల్ల అప్పుల్లో కూరుకు పోయిన అప్పారావుని. వేలకి వేలు అప్పులపాలయి, చాలా నిరాశలో కూడా వుండేవాణ్ణి.

అది ఆయన గుర్తుపట్టాడు. ఆ నిరాశ నన్ను మింగేస్తోందన్న విషయం కూడా నేను చెప్పకుండానే ఆయనకి అర్థమైంది. నేనేమీ అడగకుండానే నన్ను వొక రోజు ఆయన అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ కి తీసుకువెళ్లి, అక్కడి మిత్రుల్ని పరిచయం చేశాడు. నిజానికి అప్పటికే కేతు విశ్వనాథ రెడ్డి గారూ, కె.యెస్. రమణ నాకు బాగా సన్నిహితంగా తెలుసు. అయినా ఏనాడూ నోరు విప్పి ఏమీ అడిగే అలవాటు లేకపోవడం వల్ల నా ఆర్థిక హీన స్థితి వాళ్ళకి తెలీదు. వాళ్ళకి నా ఆర్థిక స్థితి చెప్పకుండానే, చంద్ర నాకు వాళ్ళతో మాట్లాడి యూనివర్సిటీ పాఠాలు అనువాదం చేయించే పని ఇప్పించాడు. కనీసం రెండేళ్ళు అది నాకు నికరమైన ఆదాయం అయింది. ఇంకో అడుగు ముందుకేసి, రమణ పాఠాలు చెప్పే పని కూడా ఇప్పించాడు.

వ్యక్తిగతంగా చంద్ర నాకు ఏమిటో అట్లాంటి ఇంకా కొన్ని వుదాహరణలు ఇవ్వగలను. కానీ—వాటన్నీటి కంటే ఉన్నతమైన బతుకు పాఠం చంద్ర. నేను విమర్శ వ్యాసాలు విరగబడి రాస్తున్న కాలంలో “నువ్వు విమర్శ కాదు రాయాల్సింది. Creative writing! విమర్శ వాయిదా వేసెయ్యి. కథ బాగా రాస్తావ్, కొన్నాళ్లు కథలు రాయి.” అనే మాట ఎన్ని సార్లు చంద్ర గట్టిగానే అన్నాడో! కానీ, కవిత్వం అనే మాయ నన్ను  బలంగా ఆవరించుకున్న ఆ కాలంలో కథ వెనక్కి వెళ్లిపోయింది.

4

చాలా మంది స్నేహితులకు చాలా రకాల వెన్నెల- చంద్ర!

అట్లా అని ఆయన నిరాశలో కూరుకుపోయిన సందర్భాలు లేకపోలేదు. ఆ చల్లని చంద్ర వదనంలో చీకటి నీడలు తారాడే కాలాలూ కొన్ని వున్నాయ్. వాటి గురించి ఆయన సంకేతప్రాయంగా చెప్పిన సందర్భాలూ వున్నాయి.

“స్నేహితుల నుంచి ఎక్కువ ఆశించకూడదు రా!” అని వొక సారి తనకి తాను చెప్పుకుంటున్నట్టుగా నా దగ్గిర గొణుక్కున్నాడు. అప్పటికే నాకు కొన్ని విషయాలు తెలిసి వుండడం వల్ల “అవును” అన్నట్టు తలూపి వూరుకోవడం తప్ప అంత పెద్ద వ్యక్తిత్వానికి నేను చెప్పేదేముందిలే అని మౌనంగా వుండిపోయాను. బహుశా, ఇట్లాంటప్పుడే వయసు తేడా కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. అప్పటిదాకా మా ఇద్దరి మధ్యా చాలా వయసు తేడా వుందన్న విషయం నాకు గుర్తులేదు. అట్లా గుర్తుండేట్టు ప్రవర్తించకపోవడం చంద్రలో ప్లస్ పాయింట్. తనలో వున్న సుకుమారమైన సెన్సాఫ్ హ్యూమర్ వల్ల, ఎంత దూరాన్ని అయినా హాయిగా ఈదుకుంటూ వచ్చేసే స్నేహం ఆయనది.

నన్నడిగితే చంద్ర బొమ్మలా, కథలా, సినిమాలా అంటే కేవలం చంద్ర అంటాన్నేను! చంద్ర అనే aura లేకపోతే వాటికి ఉనికే లేదు. కాబట్టి—ముందు చంద్ర, తరవాతే అవన్నీ!

*

అఫ్సర్

20 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఎన్ని జ్ఞాపకాలు మీకు చంద్రగారితో. మీరంటుంటే తెలుస్తోంది. ఎంత గొప్పవారన్నా ఆయన.

  • దుఃఖంలో నిండా మునిగిన నాకు అఫ్సర్ వేలాడేసిన చంద్ర శకలం తీపిగా గుచ్చుకుంది.

  • చాలా చక్కటి విషయాలను తెలియజేశారు,చంద్రగారికి నివాళి 🙏

  • ముందు చంద్రే.. తర్వాతే అన్నీ..👍

    అనేకత్వ తరానికి ఓ మేలి ప్రతినిధి..

    వ్యక్తి వ్యక్తమవగలిగినన్ని రూపాల మీదా
    సాధికారికత సాధించటం..⚘⚘

    చంద్రునికి అభివాదములండీ🙏🙏🙏

    సీరామ్

  • మీ జ్ఞాపకాల తడి నన్ను తాకింది. చంద్ర గారికి నివాళి

  • మంచి వ్యాసం మంచి మనిషిపై….ఇటువంటి గొప్ప మనుషులు పోవటాన్ని చూడటం పెద్ద దుఃఖం సర్.

  • ఇంకేం మిగిలింది ముందటివన్నీ అమావాస్యలేనని రూఢికొస్తుండగానే ఈ జ్ఞాపకాలు విరగ్గాసిన వెన్నెల్లా ఊయలూపుతున్నాయి.

  • This write up made me fall in deep and long-lasting emotions Afsar garu….enchanting moments were etched in words by you.

  • అఫ్సర్ గారి జ్ఞాపకాల కోనేరు లో చంద్రబింబాన్ని సందర్శించ గలిగాము. సద్గతులు

  • ఎంత మురిపిస్తూ రాశావో అఫ్సర్, సంతోషమేసింది చదువుతుంటే!
    కానీ కల్పన చక్కగా గుర్తు పడితే ఇన్ని జ్ఞాపకాలున్న నువ్వు మాత్రం గుర్తు పట్టలేదంటే నీమీద కొంచెం డౌట్ గా ఉంది. వృద్ధాప్య ఛాయలు వస్తే మాత్రం మనుషుల్ని మరిపోతారా ఏమిటి? రేపెప్పుడైనా మమ్మల్ని కూడా గుర్తు పట్టవేమోనని భయంగా ఉంది.

    • అక్కా, నిన్ను ఇప్పటికే గుర్తుపట్టలేను!!

  • ఎక్కడో దూరంగా చిన్నపాటి పరిచయం ఉన్న మాలాంటి వారికి మళ్ళీ ఎన్నో జ్ఞాపకాల్ని రేపారు. చంద్ర గారితో ఉన్న ప్రతి క్షణమూ ఆయన గీసిన బొమ్మల్లా మనసులో ముద్రపడిపోయాయి , అఫ్సర్ గారూ

  • “చాలా మంది స్నేహితులకు చాలారకాల వెన్నెల – చంద్ర!”
    ఆయన వ్యక్తిత్వాన్ని ఎంత బాగా ఆవిష్కరించారు అఫ్సర్ భాయ్.

  • ‘నన్నడిగితే చంద్ర బొమ్మలా, కథలా, సినిమాలా అంటే కేవలం చంద్ర అంటాన్నేను! చంద్ర అనే aura లేకపోతే వాటికి ఉనికే లేదు.’ 👌🏽👌👌

  • నీకు సొంతం అయిన జ్ఞాపకాలని నీకు మాత్రమే సాధ్యం అయిన వచనం లో చంద్ర గురించి వ్రాసిన వ్యాసం అంత ప్రగాఢమైనవి కాక పోయినా….కనీసం ముఫై ఏళ్ళ గా చంద్ర తో నా వ్యక్తిగత అనుబంధాన్ని గుర్తు చేశావు, అఫ్సరా….

    ఎంత వ్యక్తిగతం అంటే…

    ఒక సారి హ్యూస్టన్ లో మా ఇంటికి వచ్చి , చుట్టూ పరికించి “మళ్ళీ వస్తాను” అన్నాడు. ఎందుకో అనుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ తన కొడుకు చైతన్య తో వచ్చి “ఇదిగో” అని ఒక బొమ్మ నా చేతిలో పెట్టి నేను ఏమంటానో అని అలా నా మొహం లోకి చూస్తూ నిలబడ్డాడు చంద్ర. తీరా చూస్తే అది నా బొమ్మే…కేరికేచర్. “అరె, భలే బావుంది, చంద్రా” అని నేణు అనగానే “క్రిందటి సారి నేను మీ ఇంటికి వచ్చినప్పుడు మీ కిచెన్ లో బాపు గారు గీసిన మీ కార్టూన్ బొమ్మ చూశాను. మీ మొఖం ఫీచర్స్ అంతకంటే బాగా గీయ వచ్చును అనిపించింది. అదే ఈ బొమ్మ.”..అదీ చంద్ర. అంతకు ముందు ఎప్పుడో మేము ఇండియాలో ప్రచురించిన మొట్ట మొదటి పుస్తకం “అమెరికా తెలుగు కథానిక” ని ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారూ, జానకీ బాల గారూ ప్రధాన సంపాదకులు గా, ఖదీర్ బాబు రూప కల్పన చేయగా, చంద్ర దానికి ముఖ చిత్రం వేశాడు. ఇలాంటి ఎన్నో ఉందతాలు ఒక ఎత్తు అయితే ఒక సారి నాకు “రాజు గారూ, ఇది మీ కోసం” అని అధ్బుతమైన తెలుగు పల్లె ఆడపడుచు పంచ వర్ణాల చిత్రం నాకు బహూకరించిన చంద్ర ఔదార్యం, సహృదయత, వినయం గురించి నేను చెప్పగలిగినది ఏమీ లేదు. ఆ నాడు అతను ఇచ్చిన బొమ్మనే మా మధురవాణి.కామ్ పత్రిక కి ముఖ చిత్రంగా వాడుకుంటున్నాం.

    చంద్ర కి శెలవ్……చంద్ర చేతిని స్పశించే అదృష్టం నాకు కలిగింది. అతని చేత “గురువు గారూ” అనిపించుకునే గౌరవం నాకు దక్కింది.

    చాలా మంచి వ్యాసం వ్రాశావు, అఫ్సరా

  • నలుపుల తెలుపుల జీవితాన్ని ఎంత ఆసక్తిగా చెప్పారు.
    ‘చంద్ర ‘ మాకు బొమ్మల్లో ల్యాండ్ మార్కు.
    అతను మా కథలకు బొమ్మ ఎపుడు గీస్తాడాని ఎదురు చూసే వాళ్ళం.
    ఒక్క కథకు ఆ భాగ్యం దక్కింది.
    నేను ధన్యుణ్ణి.
    మంచి అనుభవాలు రాశారు
    అఫ్సర్ గారు…
    ధన్యవాదాలు…..

  • కొద్ది సేపే కావొచ్చు, కానీ కొన్ని పరిచయాలు మనల్ని జీవితకాలం

    వెన్నాడుతాయి. ఒక్కోసారి ఆ రెండోవ్యక్తికి తెలియకపోవచ్చు కూడా.

    అలాంటి గొప్పవ్యక్తి చంద్రగారు. చాలా మంచి నివాళి అఫ్సర్. అభినందనలు.

  • జబ్బర్ కీ బబ్బర్! నాకూ పలు జ్ఞాపకాలున్నాయ్.. పోస్టర్ పై వక్తలు అన్న టైటిల్ క్రింద నా పేరు (అప్పట్లో జిజ్ఞాసి), గద్దర్ అని రాయించుకునేంత!ఢిల్లీ వెళ్లాక గత స్మృతుల్లో కలిసిపోయిన అద్భుత రేఖాచిత్రాల్లో చంద్ర ఒకరు!

    • గొప్ప వ్యక్తి తో కలిసి బతికిన క్షణాలు లిపి లేని మధురమైన పుస్తకం. జ్ఞాపకం వచ్చినప్పుడల్లా, నిలువెల్లా తడిచి పోయేలా కురిసే పన్నీటి వాన. మీ అక్షరాలతోచంద్ర గారిని మా మనస్సుకు దగ్గరగా చేర్చినారు. అభినందనలు సర్ 💐

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు