మూడ్ ఇండిగో

వంగూరి జీవిత కాలమ్ -50

1971 లో మా ఐఐటి లో ఒక అపురూపమైన కార్యక్రమం జరిగి, ఈ నాడు యావత్ ఆసియా ఖండం లోనే భారత దేశ యువతకి ఒక తలమానికమైన “సిగ్నేచర్ ఈవెంట్” స్థాయికి చేరుకుంది. ఆ కార్యక్రమం పేరు “మూడ్ ఇండిగో”.

అప్పడేం జరిగిందంటే….మా ఐఐటి లో ఐదారుగురు అండర్ గ్రాడ్యుయేట్ కుర్ర కారు కి ఆరు బయట మా జింఖానా గ్రౌండ్స్ లో ఒక మ్యూజిక్ కార్యక్రమం పెడదాం అనే ఆలోచన వచ్చింది. అంటే, ఈ నాటి ట్రెడ్ మిల్, కూచుని తొక్కే సైకిలూ లాంటి పరికరాల పేర్లే తెలియని ఆ రోజుల్లో కేవలం దండీలూ, బస్కీలూ తీసుకోడానికీ,, బాస్కెట్ బాల్, టెబుల్ టెన్నిస్ లాంటి ఆటలు ఆడుకోడానికీ వసతులు ఉండే పెద్ద భవనం లోనో, లేదా మ్యూజిక్ తో పాటు అన్ని రకాల సాంస్కృతిక కార్యక్రమాలు, నాటకాలూ, ఆఖరికి సినిమాలు కూడా వేసి వెయ్యి మంది పట్టే మా కాన్వొకేషన్ హాల్ లోనూ కాకుండా…..ఒకానొక పౌర్ణమి రాత్రి, పండు వెన్నెల కురుస్తుండగా, నక్ష్తత్రాలు కనపడీ, కనపడకుండా చల్ల గాలి వీస్తూ ఉండగా, వాళ్ళూ, అప్పుడప్పుడు నేనూ క్రికెట్, హాకీ, ఫుట్ బాల్ ఆడుకునే ఆరుబయట హాయిగా పాటలు పాడుకుంటే ఎలా ఉంటుందీ అనేది వాళ్ళ ఆలోచన. నిజానికి అప్పటికే 1960 లలో వచ్చిన రాక్ & రోల్ కార్యక్రమాలు అమెరికాలో ఆరు బయట జరగడం గురించి పేపర్లలో చదివినా, హాలీవుడ్ సినిమాలలో చూసినా…….వీళ్ళు మటుకు అలా విపరీతమైన శబ్దాలూ, అరుచుకునే పాటల విన్యాసాలూ కాకుండా కేవలం ఆహ్లాదకరమైన పాటలే ఆరు బయట వెన్నెల కి తగినవి అని నిర్ణయించు కోవడం చాలా గొప్ప ఆలోచనే.

ఈ ఆలోచన కి మా డైరెక్టర్ బ్రిగేడియర్ బోస్ గారూ, జింఖానా కి ఇన్-చార్జ్ అయిన పణిక్కర్ అనే మళయాళీ ప్రొఫెసర్….అయనెప్పుడూ…వత్తులు పలక లేక, నోరు తిరక్క మై జింగానా, అవర్ జింగానా అనే అనేవాడు…వాళ్ళిద్దరూ కలిసి ఐదు వేల రూపాయలు మంజూరు చేశారు. అది చాలదేమో అని ఆ యువకులు విరాళాలు పోగు చేద్దాం అనుకుని, అప్పటికే ‘మంచి సరదా అయిన యువ లెక్చరర్” గా కాస్తో, కూస్తో కాలర్ ఎగరేసుకుంటున్న నా దగ్గరకి వచ్చారు. అప్పటికే మేము మొదలు పెట్టిన తెలుగు సాంస్కృతిక సమితికి విరాళాలు పుచ్చుకొవడమే కానీ ఇచ్చుకోవడం తెలియని నేను, వాళ్ళ ఆలోచన నచ్చి ఏకంగా వంద రూపాయలు ఇచ్చాను. ఓస్ అంతేనా అనుకోకూడదు. ఎందుకంటే అప్పుడు వంద రూపాయలు అంటే అది నా నెలవారీ జీతం లో నాలుగో వంతు మరి! ఆ నాడు అలా నా దగ్గర కూడా విరాళం సేకరించి ఆ మూడ్ ఇండిగో నిర్వహించిన కుర్రాళ్ళ పేర్లు మొన్న గూగుల్ లో వెతికితే కనపడ్డాయి. బహుశా నా శిష్యులే అయి ఉంటారు కానీ ఇప్పుడు నాకు ఎవ్వరూ గుర్తు లేరు…. ఒక్కడు తప్ప. ఇప్పటికీ అతడిని హ్యూస్టన్ లో తరచూ కలుస్తూ ఉంటాను…

ఇక మొదటి ప్రశ్న, ఆ కార్యక్రమానికి పేరు ఏమిటి పెట్టాలీ అని ఆ యువకులు చర్చించుకుని (ఆ రోజుల్లో మా మా కేంపస్ లో అమ్మాయిల కొరత చాలా ఉండేది అని నేను చాలా సార్లు మొర పెట్టుకున్నాను. అంతా మగ మేళమే!) మూడ్ ఇండిగో అనే అసాధారణమైన నామ కరణం చేశారు. దానికి స్పూర్తి ఎప్పుడో 1927 లో డ్యూక్ ఎలింగ్టన్ అనే అమెరికన్ మూడ్ ఇండిగో పేరిట సమకూర్చిన జాజ్ సంగీతం..ట…అంతే కాదు. వారు తలపెట్టిన ఆ నాటి మ్యూజిక్ కార్రక్రమానికి సరి అయిన వాతావరణం..అంటే మూడ్ రావడానికి ఇండిగో రంగే సరి అయిన మూడ్ క్రియేటర్ ట….ఎందుకంటే ఇండిగో అనేది ఎరుపు, నీల రంగుల సమ్మేళనం…ఎరుపు మ్యూజిక్ కి సంకేతం అయితే, నీలం సృజనాత్మకతకి సంకేతం ట. సుమారు 50 ఏళ్ళ క్రిందట కేవలం ఇరవై ఏళ్ళ వయసు యువకులు నలుగురైదుగురికి ఇంత పాశ్చాత్య పరిజ్ఞానం ఉండడం ఎంత ఆశ్చర్యమో…అంత కన్నా వాళ్ళు ఆ నాటి కార్యక్రమం లో ఎక్కడా రాక్ & రోల్ లాంటి వాసనలు లేకుండా…. దాన్ని భారతీయ సంగీతానికి అన్వయించి ఆ మొట్ట మొదటి మూడ్ ఇండిగో ని నిర్వహించిన తీరు….ఎంత గొప్పదో అది అనిభవించిన నాకూ, ఆ నాటి శ్రోతలైన సుమారు వెయ్యి మందికీ తెలుసు.

అంతటి మహత్తరమైన అనుభూతికి కారణం ఆ యువకులు ఆ నాటి కార్యక్రమం లో ప్రధాన గాయకుడి గా ఎన్నుకున్న తలత్ మొహమూద్! వావ్!

ఇప్పటికీ 1971 డిశంబర్ లో ఆ పౌర్ణమి నాటి రాత్రి 9 గంటల నుంచి సుమారు రెండు గంటల దాకా జరిగిన ఆ మూడ్ ఇండిగో తల్చుకుంటే నాకు ఇప్పటికీ ఒళ్ళు గగుర్పొడుస్తుంది. పైన పూర్ణ చంద్రుడు. అన్నిటా పరచుకున్న పండు వెన్నెల. క్రింద పచ్చిక బయలు మీద తెల్ల దుప్పటీ కప్పి, తలగడా మీద తల వంచి, కళ్ళు మూసుకుని తలత్ మహమూద్ వెల్వెట్ గొంతుక తో అతని గజల్స్, సినిమా పాటలు…అలా పాడుతూ ఉంటే….అంత కంటే అనిర్వచనీయమైన ఆనందం మరొకటి లేదు. నా పక్కనే..అంటే మరీ అంత పక్కన కాదు కానీ నా స్టాఫ్ హాస్టల్ మిత్రురాలైన చక్కటి చుక్క నీలిమ, సత్య తల్వార్, ఏ.జి. రావు మొదలైన వారు, ఆ ప్రాంగణం లో అటు వందలాది విద్యార్ధులు, ప్రొఫెసర్లు, వారి కుటుంబాలూ….ఎంత మంది ఉన్నా…ఏ ఒక్కరూ ఈ రోజుల లాగా లేచి పిచ్చి గెంతులు వెయ్య లేదు. అంతా నిశ్సబ్దంగానే ఆ ఆహ్లాదమైన సంగీతాన్ని ఆస్వాదించారు. అంతా మాధుర్య ప్రధానమే. కేవలం మూడు, నాలుగు సహకార వాద్యాలూ, కావలసినప్పుడు గాత్ర సహకారం అందించిన సులక్షణా పండిట్ అనే అమ్మాయి. అంతే!

అప్పటికి తలత్ వయసు సుమారు యాభై అనుకుంటాను. ఇక ఇరవై ఏళ్ళు ఉంటాయేమో, కాస్త బొద్దుగా ఉన్నా కానీ ఆ సులక్షణ అనే ఆ అమ్మాయి లక్షణం గా, పొందిక గానే ఉంది. అప్పుడప్పుడే హిందీ సినిమాలలో పాడడం మొదలుపెట్టింది అనుకుంటాను. ఆ తరువాత హీరోయిన్ గా కూడా చేసింది అని విన్నాను. తలత్ మహమూద్ ని కానీ, ఈ భామ ని కానీ వ్యక్తిగతంగా కలుసుకోవాలి అనే ఆలోచనే అప్పుడు నాకు కలగక పోవడం ఇప్పుడు తల్చుకుంటే భలే నవ్వొస్తుంది. అదే ఈ రోజుల్లో అయితే సెల్ఫీ మీద లాగి పారేశే వాళ్ళం కదా!

సినీ నేపధ్య గాయనీగాయకులలో నా జీవితం లో నేను వ్యక్తిగతంగా చాలా సార్లు వినే అదృష్టం కలిగిన అలనాటి హిందీ చిత్ర సీమ మధుర గాయకులు లతా మంగేష్కర్, మహమ్మద్ రఫీ, ఆశా భోన్స్ లే, కిశోర్ కుమార్, మన్నాడే లాంటి వారి కార్యక్రమాలు అన్నీ ఏదో ఒక ఆడిటోరియం లో, టికెట్లు కొనుక్కుని మనకి కేటాయించిన కుర్చీల లో కూర్చుని ఆనందించిన సందర్భాల కంటే 1971 లో మా ఐఐటి లో, నేను నివశిస్తున్న స్టాప్ హాస్టల్ కి ఎదురుగానే ఉన్న మా ఆట స్థలం ఆరు బయట ప్రాంగణం లో తలత్ మహమూద్ అలవోక గా సృష్టించిన అత్యంత గాన మాధుర్యానికి సరి తూగే అనుభవం మరొకటి లేదు.

కాలక్రమేణా ఈ మూడ్ ఇండిగో వార్షిక సాంప్రదాయంగా మారి, రూపు రేఖలు మార్చుకుని బహుశా 1981 లో ఆశా భోన్స్ లే & రాహుల్ బర్మన్ కార్యక్రమం తో ఆధునిక పోకడలు సంతరించుకుని, నిర్వహణా స్థాయిని అంతర్జాతీయ ప్రమాణాలకి అందుకుంది అని నిస్సందేహంగా చెప్పవచ్చును. ఉదాహరణకి గత ఏడాది 2019 లో డిశంబర్ నెలాఖరున మూడు, నాలుగు రోజుల పాటు అదే ‘జింగానా” ప్రాంగణమే కాక, మొత్తం కేంపస్ లో జరిగిన 48వ మూడ్ ఇండిగో ఫెస్టివల్ కి భారత దేశం లోని 1700 కాలేజీల నుంచి ..నమ్మండి..నమ్మక పొండి…సుమారు లక్షా యాభై వేల మంది విద్యార్ధులు పాల్గొన్నారు ట…

ఆ నాటి ఆరు బయట ఐదు వేల రూపాయల తలత్ మొహమూద్ స్థాయి నుంచి ఈ నాడు బహుశా కోట్ల రూపాయల ఖర్చు, దేశవ్యాప్తంగా స్పాన్సర్లు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం,…వేదిక మీద మతాబాలు, చిచ్చుముడ్లు, టపాకాయలు, బాంబులు, ..వెన్నెలా లేదు, చందమామా లేదు….నా బొందా లేదు. అంతా పాశ్చాత్యమే….ఆ నాడు పచ్చిక బయలు.. ఈ నాడు పచ్చి హొయలు… అప్పుడు అది ఒప్పు. ఇప్పుడు ఇది తప్పు కాదు!

రామాయణం లో పిడకల వేట……..మా ‘జింగానా” ప్రసక్తి వచ్చింది కాబట్టి జ్ఞాపకం వచ్చింది. నేనూ, మూర్తీ, రావూ హాస్టల్ వన్ లో ఉండేటప్పుడు, నా ప్రాణాలకి వాళ్ళిద్దరూ ఏదో కొంప ములిగిపోయినట్టు రోజూ పొద్దున్నే ఆరింటి కల్లా లేచి పోయి దండీలూ, బస్కీలూ తియ్యడానికి వెళ్ళే వారు. నాది పక్క గదే కాబట్టి నన్నూ లేపే వారు. నా కేమో దండీలూ, బస్కీలూ మాట దేవుడెరుగు….అంత పొద్దున్నే నిద్ర లేవడం అంటే అప్పటికీ, ఇప్పటికీ ఒళ్ళు మంటే!. అంచేత వాళ్ళు నా గది తలుపు కొట్టగానే, వారానికి ఒకటి, రెండు సార్లు వాళ్ళ తో వెళ్ళి, అన్నీ చేసి అలిసిపోయినట్టు నటించినా అది నా వంటికి సరి పడని పని. అంచేత చాలా సార్లు నిద్ర మొహం తో తలుపు తీసి “నయ్ యార్…యు కేరీ ఆన్” అని ఠపీ మని తలుపు వేసేసే వాడిని. వాళ్ళిద్దరూ ముసి, ముసి నవ్వులు నవ్వేసి వెళ్ళిపోయే వారు….ఏ రోజు నేను ఏమంటానో నాకే తెలియక ‘యు కేరీ ఆన్” అనే మాటని అన్నింటికీ భలే అన్వయించుకుని నవ్వుకునే వాళ్ళం. ఉదాహరణకి కొన్ని సాయంత్రాలు సౌందర్య వీక్షణ కి వెళ్ళినప్పుడు మాటుంగా లో రోడ్డు మీద ఒక చక్కటి తమిళ కుట్టి కానీ, కొలాబాలో పార్సీ అమ్మాయో కనపడగానే ఒకరి తో ఒకరు “యు కేరీ ఆన్” అనేసి నవ్వుకునే వాళ్ళం. నిజానికి అలాంటి ‘కేరీ ఆన్లు’ ఏమీ లేనే లేవు.

అన్నట్టు, నేను ఇప్పటికీ హ్యూస్టన్ లో కలుసుకునే ఆ నాటి మొట్ట మొదటి మూడ్ ఇండిగో నిర్వాహకులలో ఒకడైన రమేష్ ఆనంద్! బొంబాయి దాదర్ లో ప్రాంతం వాడే అయిన తమిళుడు. హాస్టల్ 7 లో ఉండేవాడు. ఇప్పుడు హ్యూస్టన్ లో ప్రముఖ ఎనర్జీ ఇండస్త్రీ కన్ సల్టెంట్!.

ఆఖరిగా….ఆ నాడు 1971 లో సాంస్కృతిక పరంగా చరిత్ర సృష్టించిన మూడ్ ఇండిగో లో నాది కేవలం ప్రేక్షక పాత్ర అయితే, మా ఇంజనీరింగ్ విభాగమైన ఫ్లూయిడ్ మెకానిక్స్ & ఫ్లూయిడ్ పవర్ లో మా గురువు గారు ప్రొ. సుబీర్ కార్ సృష్టించిన జాతీయ స్థాయి ఇంజనీరింగ్ సమావేశాల పరంపర లో ఒక నిర్వాహకుడి గా పాల్గొన్న అనుభవం విశేషాలు..మరొక సారి!

*

వంగూరి చిట్టెన్ రాజు

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు