చావు కన్నా చావు భయమే పెద్దది, భయంకరమైనది కూడా. అసలే మనిషి ఒక పిరికి జంతువు. ఇంక మరణం ఒక సాముహిక వాస్తవమై గుమ్మం బైట అరుగు మీద పెద్దపులిలా గాండ్రిస్తున్నట్లుగా కనబడుతుంటే ఇంకెంత తల్లడిల్లుతాడు? ప్రస్తుత ‘నావల్ కరోనా’గా పిలవబడుతున్న కోవిద్-19 సృష్టిస్తున్న చావు ప్రకంపనలు అలాంటివే. బహుశా అండమాన్లో వున్న ఏ సెంటెనిల్ తెగ లాంటి వారు మినహా ఈ భూమ్మీద కరోన నేపధ్యంలో తన మృత్యువు గురించి ఆలోచించని మనిషి లేడేమో! ఒక్క అంటార్కిటిక ఖండం మినహా గ్లోబ్ మీదున్న దేశాలన్ని కరోన బూచితో గడగడలాడి పోతున్నాయి. అభివృద్ధి చెందిన ఎన్నో దేశాలకు వ్యాధి పాకిపోయి తీవ్ర ఆరోగ్య, ఆర్ధిక సంక్షోభానికి గురయ్యాయి. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఎన్నో దయనీయ సన్నివేశాలకు, మానవ మహా విషాదాలకు భూమి మరోసారి వేదికైంది. దీనికి ఎవరు బాధ్యులు? ప్రకృతి విపత్తుల వల్ల సంభవించే నివారించగల జనజీవన విధ్వంసానికి నెపాన్ని ప్రకృతి మీదకే తోసేసినట్లు ఇప్పుడు కూడా నెపాన్ని వైరస్ మీదకి తోసేద్దామా?
****
గ్లోబలైజేషన్ పుణ్యమా అని మనుషుల ప్రయాణాలు పెరిగి ఇది విమానాల యుగం అయింది. విమానాశ్రయాలు ఎర్ర బస్టాండుల్లా కిటకిటలాడిపోతున్నాయి. మనిషితో మనిషికి వ్యాపార సంబంధాలు పెరిగిపోయాయి. దేశాలూ దేశాలూ భుజాలు భుజాలు రాసుకుంటున్నాయి. వాణిజ్య ఒప్పందాలు ఎక్కువైపోతున్నాయి. ఈంటర్నేషనల్ అడ్మిషన్లు పెరుగుతున్నాయి. డిప్లొమాట్స్, డిగ్నిటరీలే కాదు, బిజినెస్ ఎగ్జిక్యూటీవ్స్, విద్యార్ధులు, ఉద్యోగులు, తమ పిల్లల్ని చూడటానికి వెళ్లొచ్చే వృద్ధ తల్లిదండ్రులు, టూరిస్టులతో అంతర్జాతీయ విమానాలు ఝాంఝామ్మని ఎగురుతున్నాయి. మనిషితో పాటు రహదార్ల మీద, సముద్ర మార్గంలో, ఆకాశా వీధుల్లో సరుకు ప్రయాణిస్తున్నది. టీ పొడి నుండి సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్ వరకు గ్లోబలైజేషన్ ప్రభావానికి గురి కాని రంగమంటూ లేదు. ప్రపంచీకరణ వల్ల ప్రపంచమంతా ఒక కుగ్రామమైందో లేదో కానీ ఒక పెద్ద షాపింగ్ మాల్ అయింది. విద్య, ఉద్యోగావకాశాల వల్ల అతి తేలికగా నగరంపాలెం నుండి న్యూయార్క్ దాకా మనుషులు చకచకా కదిలెళ్లి పోతున్నారు.
సరిగ్గా ఇటువంటి సందర్భంలోనే చైనాలోని వుహాన్ నగరంలో నావల్ కరోన వైరస్ బద్దలైంది. ముందుగా ఈ వైరస్ని ఊహించిన ఒక నేత్ర వైద్యుడు (డాక్టర్ లియాన్) ప్రభుత్వానికి కాకుండా సామాజిక మాధ్యమాల్లో కరోన గ్రూప్ లో కొత్త వైరస్ ఆవిర్భవించిందన్న తన అంచనాని పంచుకోవటంతో గందరగోళం చెలరేగినప్పుడు పోలీసులు అతను సామాజిక కల్లోలం సృష్టిస్తున్నాడని అతన్ని అరెస్ట్ చేసారు. కానీ అతను చెప్పినట్లే ఆ వైరస్ వ్యాప్తి చెందటంతో ప్రభుత్వం పరీక్షలు చేసి, నిర్ధారించి, వైరస్ గురించి పరిశోధనలు చేసి ప్రపంచానికి తెలియచేసి యుద్ధాన్ని ప్రకటించింది. (ఆ యుద్ధంలో ఆ వైద్యుడు కూడా మరణించినప్పుడు ఆ దేశమంతా నివాళి అర్పించింద్ది. అతను జాతీయ హీరోగా గుర్తించబడ్డాడు.) ఈ వైరస్ మిగతా వైరస్ల కంటే ప్రమాదకరమని, గాలి ద్వారా కాకుండా కేవలం “కాంటాక్ట్” (స్పర్శ) ద్వారా వ్యాపిస్తుందని చెప్పింది. స్పర్శ అంటే చైనీయులు తమని స్పర్శించినప్పుడే కదా తమకా వైరస్ సోకేదని ప్రపంచ దేశాలన్నీ అనుకున్నాయేమో చైనా మీద జోకులేస్తూ కాలక్షేపం చేసాయి. కానీ గోబలైజేషన్ ముఖ్య లక్షణమైన అంతర్జాతీయ విమాన ప్రయాణాల ద్వారా వుహాన్ నుండి వెనిజులా వరకు వైరస్ తన తీర్థ యాత్రలు తాను చేసింది. ప్రపంచమంతా సంచరిస్తూ, సంచలిస్తూ వ్యాప్తి చెందింది. ఇందుకుగాను వైరస్ని చైనా అంటించింది, చైనా ముట్టిచ్చింది అంటూ ఆడిపోసుకోసాగారు (అ)విజ్ఞులైన ప్రపంచ వాసులు. ఒక దేశమంటే పాలకులే కాదు అతి సామాన్య ప్రజలు అన్ని దేశాల్లోనూ ఉంటారనే కనీస స్పృహ లేకుండా మరో దేశ నాశనాన్ని ఎలా కాంక్షించగలరో ఊహకందదు. వారి తిండి అలవాట్ల మీద దాడి చేసారు. చైనీయులు గబ్బిలాలు తినటం వల్లనే వైరస్ వచ్చిందని తీర్మానాలు చేసారు. అదేమిటో అంతకు ముందు ఎన్నడూ వెలుగు చూడని చైనీయుల ఆహారపు వీడియోలు సోషల్ మీడియాలో వెల్లువెత్తాయి. కొంచెం పరిశీలనగా చూస్తే ఆ వీడియోలన్నీ ఒక పద్ధతి ప్రకారం, ఒక లక్ష్యంతో తీసినట్లు కనబడతాయి. ఆ కప్పల్ని, ఎలుకల్ని తినేవాళ్లందరూ ఏదో “పెర్ఫార్మెన్స్” ఇస్తున్నట్లే ఆ వీడియోలు చేసారు. అంతే కాదు, ప్రపంచం మొత్తానికి వ్యతిరేకంగా చైనా కుట్ర చేసిందనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. మరి అదేమిటో యూరోప్, అమెరికాకి వ్యతిరేకంగా కుట్ర చేసిన చైనా పాకిస్తాన్, భారత్, బంగ్లాదేశ్ వంటి దేశాల్ని ఎందుకు వదిలేసిందో!
సరే ప్రపంచం తన గురించి ఎలా అనుకుంటున్నా పట్టించుకోని చైనా అసాధారణ రీతిలో కరోనపై యుద్ధం ప్రకటించి, ఎదురుదాడి చేసి సంక్షోభం నుండి బైటపడుతుండగా మిగతా దేశాలు విలవిల్లాడుతున్నాయి. ఇదో విషాదకర పరిన్ణామం. ప్రపంచవ్యాప్తంగా రోజూ వేలాదిమంది మరణిస్తున్నారు. ఇరాన్, దక్షిణ కొరియా వంటి ఆసియా దేశాలతో పాటు ముఖ్యంగా అభివృద్ధి చెందిన అమెరికా, ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, బ్రిటన్, స్విట్జర్లాండ్ వంటి యూరోప్ దేశాల్లో ఈ సంఖ్య భయానకంగా మారింది. చివరికి బ్రిటన్, జర్మనీ దేశాధినేతలు, కెనడా ప్రధాని భార్య కూడా కరోన బారిన పడ్డారు. రాజ కుటుంబీకుల పట్ల కూడా కరోన దయ చూపించదు కదా! ప్రిన్స్ చార్లెస్ కుటుంబాన్ని కరోన ఆవహించటమే కాదు స్పెయిన్ రాకుమారి మరియా థెరిసా మరణించారు. అమెరికాలో గ్రామీ అవార్డ్ విజేత జో డిఫ్ఫే కూడా కనుమూసారు. ఈ అభివృద్ధి చెందిన దేశాల్లో మరణిస్తున్న వారిలో అధికభాగం వృద్ధులే. వృద్ధుల శరణాలయాలు మృత్యు మందిరాలవుతున్నాయి. సగటు ఆయుర్దాయం అధికంగా వున్న అభివృద్ధి చెందిన దేశాల్లో జనాభాలో యువత శాతం కంటే వయోవృద్ధుల శాతమే ఎక్కువ. మరణిస్తున్న వారి సగటు ఆదాయం 74 ఏళ్లు. అక్కడ మరణాల సంఖ్య ఎక్కువగా వుండటానికి అదొక కారణం కావొచ్చు. అదనంగా ఆర్ధిక వ్యవస్థలు కుప్పకూలుతున్నాయి. ప్రపంచమంతా నిశ్చేష్టమై పోయి, మార్కెట్లు స్తబ్దంగా మారటంతో ఈ ఆర్ధిక ఉపద్రవం వచ్చిపడింది. ఎంతటి సంక్షోభం వచ్చిందంటే ముందున్న ముందున్న ఆర్ధిక మొసళ్ల పండగకి భయపడి జర్మనీలోని హెస్సీ రాష్ట్ర ఆర్ధిక మంత్రి ఆత్మహత్య చేసుకున్నారు. ఇంతకు మునుపు ఏ వైరస్ దాడి చేసినా మార్కెట్లకి వచ్చిన ఢోకా పెద్దగా లేదు. ఇప్పుడు గాలిలో కంటే కాంటాక్ట్ వల్ల వ్యాధి వేగంగా విస్తరించే లక్షణం కారణంగా ప్రపంచమంతా మనుషులు హడావిడిగా రాసుకు పూసుకు తిరుగుతున్నందున రోజు రోజుకీ భూగోళం మృత్యుఘోషతో గజగజలాడుతున్నది. అంచేత కరోన వ్యాప్తి ఖచ్చితంగా ప్రపంచీకరణ దుష్ఫలితాల్లో ఒకటిగా చెప్పొచ్చు.
****
భారత్ విషయానికొస్తే కమ్యూనిస్టు వ్యతిరేక భారతీయ రాజకీయ పార్టీలు, వారి అభిమానులు, కేడర్ సంగతి ఎలా వున్నా భారత ప్రభుత్వం మాత్రం చైనాకి అండగా నిలిచింది. కావలసిన మెడికల్ సామాగ్రిని భారీగా అందించింది. సార్క్ దేశాలతో కలిసి ఒక కార్యాచరణకి పిలుపునిచ్చింది. ఇది సానుకూలాంశంగా భావించొచ్చు. అయితే దేశీయంగా మాత్రం అలసత్వం ప్రదర్శించిందనే చెప్పాలి. మార్చ్ 22 ఉదయం ఆరు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు “జనత కర్ఫ్యూ” వుంటుందని మార్చ్ 20వ తేదీ రాత్రి 8 గంటలకు ప్రధాని ప్రకటించే వరకు ఎటువంటి కార్యాచరణ చేపట్టలేదు ఏవో నాలుగు హితవులు, సలహాలు చెప్పడం మినహా. అసలు కరోన మన దేశం వచ్చే సమయానికి ఎండాకాలం వచ్చేస్తుందని, ఆ వేడి వాతావరణంలో ఆ వైరస్ బతకదని ధీమాగా వున్నట్లున్నారు. కానీ కరోన దిగబడింది. ఉధృతంగా కాకపోయినా జనవరి 29నే మొదటి కరోన కేస్ నమోదైంది. ఫిబ్రవరి నెలలో మెల్లగా కేసులు పెరిగి మార్చ్ మొదటివారానికి మొదటి మరణం సంభవించింది.
మార్చ్ 22న పాటించిన కర్ఫ్యూ ఏప్రిల్ 14 వరకు “లాక్ డౌన్”గా రూపాంతరం చెందింది ఎటువంటి విరామం లేకుండా. హఠత్తుగా జరిగిన ఈ పరిణామానికి భారతదేశం సిద్ధంగా లేదు. జనవరి చివరిలోనే కరోన కేసులు కేరళలో వెలుగు చూసినప్పుడే మొదటి దశలొనే అంచెలవారీగా కఠినతరం చేస్తూ పోవాల్సింది. పైగా అమెరికా అధ్యక్షుడు భారత్ వచ్చినప్పుడు లక్షల మందితో ప్రదర్శనలు ఏర్పాటు చేయటం జరిగింది. మార్చ్ 21 రాత్రి వరకు మొత్తం యథావిధిగా కొనసాగింది. కొన్ని రాష్ట్రాల్లో పాఠశాలలు, సినిమాహాళ్లు బందు పెట్టడం మినహా ఏదీ ఆగలేదు. అసలు భారతదేశం అంటే మధ్య తరగతి, ఆ పై తరగతుల వారన్నట్లుగా చర్యలు తీసుకున్నారు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఇంట్లో వుంటే చాలనుకున్నారు. భారత్ లో మూడు వారాల లాక్ డౌన్ తో ఆగదని, అది జూన్ వరకు కొనసాగే అవకాశం వుందని అందరూ సిద్ధమై పోతున్న దశలో ఒక పెద్ద మానవ సంక్షోభం వచ్చి పడింది. అదే “రివర్స్ మైగ్రేషన్”. అంటే పల్లెల నుండి పనుల కోసం, బతుకు తెరువు కోసం పట్నాలకు వలస వచ్చిన గ్రామీణ నిరుపేదలు ఇక్కడ కర్ఫ్యూ వాతావరణం కారణంగా పనులు లేక, సరైన నివాసాలు లేక, దిక్కు లేక తిరిగి తమ తమ గ్రామాలకు తిరిగి వెళ్లిపోవటం. వీరి గురించి కనీసం ఆలోచించని కేంద్ర ప్రభుత్వం హడావిడిగా, హఠత్తుగా లాక్ డౌన్ విధించటంతో వలస కూలీలు దేశ వ్యాప్తంగా కోట్ల సంఖ్యలో వేలాది గుంపులుగా గ్రామాల బాట పట్టారు. ఇది అత్యంత ప్రమాదకరం. గర్భిణీ స్త్రీలతో సహా వందల కిలోమీటర్ల దూరానికి కాలి నడకన సాగుతున్న ఈ రివర్స్ మైగ్రేషన్ సమయంలో ఎన్నో విషాదకర సంఘటనలు జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాలు, ఆకలి చావులు, ఎండ దెబ్బలు…ఒకటేమిటి? ఈ దేశంలో కరోన విషాదానికి తాము ఏమాత్రం బాధ్యులు కాకపోయినా అందరి కంటే అతి ఎక్కువగా ఇబ్బంది, బాధ పడుతున్నది మాత్రం దేశ నిర్మాణానికి తమ రక్తమాంసాలు ధారపోసే ఈ శ్రామికులే. వారి దయనీయ స్థితికి ప్రభుత్వాల, నాయకుల నిర్లక్ష్యమే కారణం. పేదలు కేవలం వోటర్లుగా మాత్రమే గుర్తింపబడుతున్నంత కాలం నిర్లక్ష్యానికి గురవుతూనే వుంటారని మరోసారి నిరూపితమైంది. దేశ విభజన సమయంలో జరిగిన వలసల తరువాత ఇవే అతి పెద్ద వలసలు కావొచ్చు. అయితే అది ఒక దేశం నుండి మరో దేశానికి కాగా ఇది అంతర్గతంగా ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి. ఇప్పుడు ఈ గ్రామీణ వలస జీవులు స్వదేశీ కాందిశీకులు!
శాస్త్రీయ జ్ఞానం పెంపొందింపచేయటం ద్వారా ఇలాంటి ఆరోగ్య సంక్షోభాల్ని ఎదుర్కోవాల్సిన సందర్భంలో మూఢ నమ్మకాల వ్యాప్తికి, స్వంత డబ్బాకి, వ్యక్తి ఆరాధానలకి వాట్సాప్ యూనివర్శిటీ తెగబడింది. భారతదేశానికి కరోన రావటం ఆలస్యమయ్యే సరికి ఇక్కడి నేల మహత్యం, వేదకాలపు ఋషుల తపోఫలమని ఏమిటేమిటో చెప్పారు. అసలు ఒకవేళ వచ్చినప్పటికీ మన గోమూత్రం, తాటికల్లు, వెల్లుల్లి, ఓంకారం, నమస్కారంతో ఎదుర్కోవచ్చని ఊదరగొట్టారు. మళ్లీ ఈ ప్రాచీనత్వాన్ని హిందూత్వకి అంటగట్టి రాజకీయ లబ్దిని పొందటమే లక్ష్యం. నిజంగా సంక్షోభం వస్తేనేమో ఉపయోగించుకునేదేమో ఇంగ్లీష్ వైద్య విధానం, పొగిడేది, క్రెడిట్ ఇచ్చేదేమో ఆయుర్వేదం, సిద్ధ వంటి ప్రత్యామ్నాయ వైద్య విధానాలకీనా? ఏ టెస్టింగ్ కిట్ వుంది ప్రత్యామ్నాయ వైద్య విధానాల్లో? ఏ వైరస్ని, ఏ బాక్టీరియాని చూడగలం ఇంగ్లీష్ వైద్య విధానంలో కాక? వొట్టి పసలేని హిపోక్రాటిక్ స్వంత డబ్బా! ప్రత్యామ్నాయ వైద్య విధానంలో ఎంతో కొంత మంచి ఉండొచ్చేమో కానీ పూర్తిగా వాటినే నమ్ముకోలేం. వెల్లుల్లితో కరోనకి ట్రీట్మెంట్ ఇవ్వలేమని ప్రభుత్వ సంస్థలే ఘోషిస్తున్నా వాట్సాప్ యూనివర్శిటీ ఆ ప్రచారం ఆపటం లేదు.
మార్చ్ 30, 2020న ఈ వ్యాసం రాసే సమయానికి భారతదేశంలో ఒక వేయి మందికి కరోన సోకగా 29 మంది మరణించారు. మన దేశానికి వచ్చేసరికి కోవిడ్ 19 వైరస్ జెనోం మ్యుటేషన్లో సానుకూల మార్పులొచ్చి భయపడిన స్థాయిలో ఆరోగ్య ఉపద్రవం జరగలేదని నిపుణులు అంటున్నారు. మందు లేని వ్యాధికి నివారణ కంటే వైరస్ నిరోధానికి ఎకువ ప్రాముఖ్యతనివ్వాల్సిన సందర్భమిది. శాస్త్రజ్ఞులు వాక్సిన్ కనుక్కునేంత వరకు వైద్య, సహాయ వైద్య (పారా మెడికల్), మునిసిపల్ శానిటరీ సిబ్బందే సమాజాల్ని రక్షించగలరు. కానీ వారి దాకా పోకుండా వుండాలంటే స్వీయ చైతన్యం తప్పనిసరి. మూడువారాల క్వారెంటైన్ అంటే చిన్న విషయం కాదు కదా మరి! కానీ అంతకు మించిన విషయం ఏమిటంటే ఆర్ధిక వ్యవస్థ కూసాలు కదులుతున్నాయి. ఆరోగ్య సంక్షోభాన్ని మించిన ఆర్ధిక సంక్షోభం మనముందున్నది. ఇది సంవత్సరాల పాటు మనల్ని పీడించబోతున్నది. కరోన సంక్షోభం పేరుతో నిష్క్రియాపరత్వాన్ని, వైఫల్యాల్ని దాచేసుకోవచ్చు పాలకులు. ప్రభుత్వాలు ప్రజల పట్ల దయ చూపి పెట్టుబడిదారులు, కార్పొరేట్ల ఋణాలు వసూళ్లు, పన్నుల పెంపు చేయటం ద్వారా సామాన్యులకు ఉపశమనం కలగచేయాలని డిమాండ్ చేద్దాం. సామాన్యులు, అల్పాదాయ వర్గాల వారు, పేదలు ఇప్పటికే కుదేలై పోయి వున్నారు కదా!
రాబోయే కాలం ఎన్నో మానవ మహావిషాదాలకు, మనిషి మీద విరక్తి, అమానుష సందర్భాలకే కాదు ప్రేమని పెంచే మానవీయ సంఘటనలకు వేదిక కానున్నది. చూద్దాం ఎన్ని కనువిప్పులు జరుగుతాయో, ఎన్ని నమ్మకాలు పటాపంచలవుతాయో, ఎన్ని మరీచికలు కనుమరుగవుతాయో, ఎవరం ఎక్కడ తెలుతామో! చూద్దాం చూద్దాం!!
చైనా బాగా కంట్రోల్ చేసిందని పొగిడారు సరే కానీ , చైనా కి మొదటి కేసు ఎప్పుడు వచ్చింది , ఎందుకు తొక్కిపెట్టింది ఇత్యాది అంశాలు లేవు . WHO చైనాకి తానా తందానా అనడం కూడా లేశమాత్రం మీరు ప్రస్తావించలేదు ( ముందేమో మనిషికి మనిషికి సోకదు అని చెప్పడం, దేశాల మధ్య ప్రయాణాలకు ఆంక్షలు పెట్టొద్దని చెప్పడం, వీటివల్లే సగం ఆలస్యం అయింది ) ఇకపోతే , యూరోప్ దేశాలు చైనా మీద జోకులు వేసుకున్నాయి అని తీర్మానించేసారు .
ఆ అంటే కంట్రోల్ , ఉ అంటే కంట్రోల్ పెట్టడానికి , ఆ దేశాలు చైనా కాదు , ఫ్రీ కంట్రీస్ , హ్యూమన్ రైట్స్ కి కొంచెం ప్రాధాన్యత ఉంటుంది , అంతే కాదు యూరోపియన్ యూనియన్ లో దేశాల మధ్య ఆంక్షలు పెట్టడం అంత సులువు గా జరిగే ప్రక్రియ కాదు .
అదంతా డెమోక్రాటిక్ ప్రాసెస్ ( ప్రజాస్వామ్య పద్ధతి ). ప్రస్తుత జనరేషన్ ఇంత క్రైసిస్ చూడలేదు , ఊహించలేదు కూడా .
ఇటలీ లో ఓల్డ్ జనరేషన్ ఎక్కువగా ఉండటం, వాళ్ళ కస్టమ్ లో గుంపులు గుంపులు గా పార్టీ లు చేసుకోవడం, ముద్దులు తో కరచాలనం చేసుకోవడం , ఎప్పుడు ఎదో ఒక football మ్యాచ్ లు జరుగుతూ ఉండటం , ఫిబ్రవరి లో కార్నివల్స్ జరగడం . ఇలాంటి చాలా విషయాలు అంతర్లీనంగా ఈ వైరస్ పెరగడానికి తోడ్పడ్డాయి . జనవరి , ఫిబ్రవరి లో ఉండే అత్యంత చలి వాతావరణం కూడా .
చైనీయులు అలవాట్లు మరియు వాటి వీడియో లు ఎప్పటి నుండో అంతర్జాలం లో ఉన్నాయి . అవన్నీ పాతవే . మన దేశం నుండి , ( తెలుగు రాష్ట్రాల జనం కూడా ) చైనా లో చదువు కోసమో , వ్యాపారం కోసమో చాలా మంది ఉన్నారు . మీరు వాళ్లలో ఎవరిని అడిగిన వాళ్ళ తిండి గురించి పుంఖాను పుంఖాలు గా వర్ణిస్తారు . తెలుగు బ్లాగ్ లో కూడా రాశారు ఎవరో . మీరు అవి కూడా చదవండి .
చైనాని ఇంత అభిమానించే మీరు అమెరికా లో సెటిల్ అవ్వడం ఆశ్చర్యం .
నేను అమెరికాలో సెటిల్ అయ్యానని ఎవరు చెప్పేరు మిత్రమా మీకు? మా హైదరాబాదులోనే ఏదో గుమస్తా ఉద్యోగం చేసుకుంటూ పొట్ట పోసుకుంటున్నాను. ఇంక మీ మిగతా వ్యాఖ్యానమంటారా? మీలాంటి వారికు చైనా వంటి సోషలిస్టు లేదా అటువంటి వాసనలున్న దేశాల పట్ల ఉన్న అక్కసుని దృష్టిలో పెట్టుకునే రాసిందిది. మీబోటి వారి ప్రశ్నలకి నా వ్యాసమే ఒక పెద్ద సమాధానం. ఇంక మళ్లీ ఏం చెప్పాలి?
one can live anywhere in this world, it does not matter. ఆదర్శాలు అన్నం పెట్టవు . చైనా చేసింది కరెక్ట్, వెస్ట్రన్ కంట్రీస్ చేసింది రాంగ్ అని మీరు దబాయిస్తుంటే …. ఇకపోతే చైనా సమాచారాన్ని ఎలా తొక్కిపెట్టింది అనేది ఇప్పుడు అందరికి కనిపిస్తున్న విషయం. ఈ రోజుల్లో సమాచారం దాయడం కష్టమే . ఈ రోజా, రేపో బయటకు వస్తుంది . Thank you for your reply.
అబ్బ ఈ వ్యాసానికి ఇచ్చిన పెయింటింగ్ ఎంత ఎద్భుతంగా వుంది సందర్భానికి తగినట్లుగా!! ధన్యవాదాలు మిత్రమా!!
అబ్బ ఈ వ్యాసానికి ఇచ్చిన పెయింటింగ్ ఎంత అద్భుతంగా వుంది సందర్భానికి తగినట్లుగా!! ధన్యవాదాలు మిత్రమా!!
In-depth article. Extensive aspects touched.
కరోనా పై అరణ్య కృష్ణ వ్యాసం అర్థవంతంగా వున్నది.
విశాదాలు,అశ్రువులు ఎన్నో దృగ్గొచ్చరమౌతాయి..అంతకుమించి ఆర్థిక మాంద్యంతో ప్రపంచమే ఉక్కిరబిక్కిరై పోతుంది.
పాలకులు కరోనా మాటున ప్రజల పై అడ్డగోలుగా బారాలూ మోపుతారు..ప్రజావ్యతిరేక నిర్ణయాలన్నీ ఈ మాటున చాటుగా సాగిపోతాయి..
Thanks to అరణ్యకృష్ణ