ఆ వంతెనమీంచి వెళ్ళినపుడల్లా మనసు మారాం చేస్తూ ఉంటుంది. ‘నలభై ఏళ్ళ నుంచి చెబుతున్నావు… ఇక్కడ దిగి ఒక పూట గడుపుతానని… ఈ నలభై ఏళ్ళలో ఎక్కడెక్కడో తిరిగావు… ఇక్కడ మాత్రం ఆగింది లేదు,’ నిష్టూరం, నిలతీత.
ఉదయం ఆరున్నర- సెప్టెంబర్ మూడోవారం, 2018.
అప్పటికి గంట నుంచీ అటూ ఇటూ కనిపిస్తోన్న అడవులూ, కొండలూ, లోయలూ, వాగులూ నింపిన మత్తులో అప్పటిదాకా మనసు తూగింది. ఈ వంతెన కనిపించేసరికి మత్తు వదిలించుకుని మారానికి దిగింది. 1975 ఆగస్టులో మొదటిసారి ఈ వంతెనను గమనించినపుడు గుండె లయ తప్పింది. ఇప్పటికీ చూసినప్పుడల్లా లయ తప్పుతూనే ఉంటుంది. ఎడమవైపున నది గట్టున ఆకట్టుకునే స్నానఘట్టాలు. ఒడ్డు నుంచి నీళ్ళదాకా దిగడానికి బారుగా ఏభై అరవైమెట్లు. నదికి ఇవతలి గట్టున అడవిని తలపించే చెట్లు. అదిగో అప్పుడు పారేసుకున్నాను మనసును ఆ నర్మదాతీరం దగ్గర. అప్పటి నుంచి ఆ వంతెన మీద కనీసం వందసార్లు వెళ్ళి ఉంటానుగానీ… వెళ్ళిన ప్రతీసారీ దిగిపోదాం అనుకొంటానుగానీ… దిగింది లేదు. నర్మద పుట్టిన ‘అమర్ కంటక్’ దాకా వెళ్ళి పలకరించి వచ్చానే గానీ ఈ హోషంగాబాద్‌లో కనిపించే విశాల నర్మదతో గడిపింది లేదు. అన్యాయమే మరి.
ఇహ జాప్యాలు చాలనిపించింది. కార్యాచరణకు దిగాను. మరో గంటలో నేనెక్కిన జీటీ ఎక్స్‌ప్రెస్ ఇటార్సీ స్టేషనుకు చేరేలోగా నాలుగు రిజర్వేషన్లు చేసేశాను.
అక్టోబరు మొదటి వారంలో ముందు ఢిల్లీనుంచి బేతుల్ (బేతుల్? అదెందుకు?)… అక్కడ ఉదయమంతా గడిపి సాయంత్రంలోగా హోషంగాబాద్… అక్కడ బాగా పొద్దుపోయేదాకా ఉండి రాత్రి ఝాన్సీ బండి ఎక్కడం. ఝాన్సీకి దగ్గరలో ఉన్న ఓర్ఛాలో మర్నాడంతా గడిపి రాత్రికి ఢిల్లీకి తిరుగుబండి పట్టుకోవడం… మూడో రోజు ఉదయానికల్లా గూటికి చేరడం… అరవై గంటలు… రెండువేల కిలోమీటర్లు… అదీ ప్లాను.
………….
“తాపీ నదీతీరం వెళ్ళాలి. ఎలా వెళ్ళాలో చెప్పగలరా?” వాకబు చేశాను.
వాడుకభాషలో తపతిని ‘తాపీ’ అంటారు.
ఉదయం తొమ్మిదింటికి బేతుల్ స్టేషన్లో దిగి గబగబా వెయిటింగ్ రూములో కాలకృత్యాలూ, స్నానాలూ జపాలూ ముగించుకుని, స్టేషను బయటకొచ్చి ఎవరిని అడుగుదామా అని అలోచిస్తుంటే అక్కడ ఒక పోలీస్ బూత్ కనిపించింది. వెంటనే మరో ఆలోచన చేయకుండా నేరుగా ఆ పోలీస్ దగ్గరకే వెళ్ళి అడిగాను. నేను అడుగుతూనే ఉన్నాను… కానీ అతని దగ్గరనుంచీ సమాధానం మాత్రం రావడం లేదు. అప్పుడు బోధపడింది నాకు, ఆ పోలీసాయనకి నా హిందీ అర్ధం కాలేదని. నేను మాట్లాడే హిందీ నాకు మాత్రమే అర్ధమయ్యే సొంత హిందీ. అంచేత ఆ పోలీసు పెద్దాయనకు నా ప్రశ్న అర్ధం కాకపోవడంలో ఆశ్చర్యం లేదు. రెండోసారి అదే మాట మరికాస్త జాగ్రత్తగా అడిగాను ఒక్కోమాటా విడదీస్తూ…
”తాపీనది అంటే ఎక్కడికెళ్ళాలీ… అది కాస్త స్పష్టంగా చెప్పు,” పోలీసాయన విసుక్కోబోయాడు. కానీ ఓసారి నా మొహంలోకి వీపున ఉన్న బ్యాగుకేసీ చూసి, విసుగాపుకుని అడిగాడు. గబగబా గూగుల్లో వెతికాను. బేతుల్‌కు నైరుతిదిశలో ఇరవై కిలోమీటర్ల దూరాన తపతి ఒడ్డున ‘సిమోరి’ అన్న గ్రామం కనిపించింది. అక్కడ సూర్యదేవాలయం ఉన్నట్టు తెలిసింది. అది ఆ పోలీసాయనకు చూపించాను.
“ఓ! సిమోరీనా… సరే, స్టేషను బయట బస్సులు దొరుకుతాయి. అవి సిమోరీ ఊళ్ళోకి వెళ్ళవు. తాపీనది ఒడ్డున తాపీమాత ఆలయం దగ్గర దింపుతాయి,” అని చెప్పి, ఊరుకోకుండా పక్కనున్న పళ్ళబండి కుర్రాడిని పిలిచి ‘వీరిని బస్టాపుదాకా తీసుకెళ్ళి దింపిరా’ అని కూడా పురమాయించాడు.
…………..
వెంటనే బస్సు దొరికింది.
అరగంట ప్రయాణం.
లోకల్ బస్సు… స్థానిక ప్రపంచం! ఆ అనుభవాన్ని ఆకళించుకునే ప్రయత్నంలో పడ్డాను.
“ఎవరు నువ్వూ? ఎక్కడనుంచి వస్తున్నావూ? ఎక్కడికీ ప్రయాణం?” ముందు సీటు పెద్దమనిషి కొంచెం ధాటిగా ప్రశ్నలు. నేను, నా వీపుసంచి, నా షార్ట్సు… ఆయనలో కాస్త కుతూహలం, కొన్ని అనుమానాలు రేకెత్తించినట్టు అర్థమయింది. అసహనాన్ని ఆపుకుని ఆమితశాంతంగా సమాధానాలు చెప్పాను. తపతీనదిని పలకరించడానికి వెళుతున్నాని చెప్పాను.
సూక్ష్మగ్రాహి అనుకుంటాను. వెంటనే అర్ధం చేసుకున్నాడు. నా యాత్రాస్ఫూర్తిని గుర్తించగలిగాడు. మరిన్ని ధాటిలేని ప్రశ్నలు… నా యాత్రల వివరాలు… దాంతో క్షణాల్లో మనిషి కరిగిపోయి తనకు తానే నాకు ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్ అయిపోయాడు. ఇతను ఆ ప్రాంతపు ఓ గ్రామంలో ఉపాధ్యాయుడట. తనకూ ప్రయాణాలంటే ఇష్టమట. స్కూలు పిల్లలని తరచూ ప్రకృతిలోకి తీసుకువెళుతూ ఉంటాడట… తనూ ఛాన్సు దొరికితే ఒంటరిగా అడవులు పట్టుకొని తిరుగుతూ ఉంటాడట… కబుర్లే కబుర్లు…
పదింటికల్లా తపతీమాత ఆలయం దగ్గర దిగాను. నాకు తపతీనదితో అప్పటికే చిన్నపాటి పరిచయం ఉంది. అయిదారేళ్ళ క్రితం ఒక వర్షాకాలపు ఉదయాన ముల్తాయ్ – మూలతపతి – స్టేషన్లో రైలుదిగి రాత్రిదాకా ఆ తాపీనది జన్మస్థలంలో తనివితీరా తిరిగి ఉన్నాను. కనిపించీ కనిపించని నీటిధారలు ఊరు విడిచి రెండు కిలోమీటర్లు వెళ్ళేసరికి వడివడిగా ప్రవహించే నదీరూపం పొందడం చూశాను. అంతకు పాతికేళ్ళ ముందు మహారాష్ట్రలోని భుసావల్ పట్నంలో మైదానదశలోని తపతిని కూడా చూశాను. రెండేళ్ళ క్రితం సూరత్ పట్నంమీదుగా ఓ రోడ్ ట్రిప్‌లో వెళుతూ పట్నపు శివార్లలో ‘హజ్రా’ మడ అడవుల దగ్గర ఆ నది సాగరసంగమ బిందువును చూశాను. ఆ ముల్తాయ్ లో పుట్టిన తపతి నలభై ఏభై కిలోమీటర్ల దిగువునున్న బేతుల్ చేరుకునేలోగా ఎన్నినడకలు నేర్చిందో… ఎన్ని తుళ్ళింతలు పోతోందో చూడాలని ఇప్పటి నా ప్రయత్నం.
తాపీమాత ఆలయం నదికి అవతలి ఒడ్డున ఉంటే ఇవతలి ఒడ్డున చిన్నపాటి గుట్టమీద మరింకో ఆలయశిఖరం కనిపించింది. మరింకేం – రెండు ఆలయాల నడుమన, తుళ్ళింతల తపతి! నేను ఎలా ఉంటుందని ఊహించానో అలానే కనిపించి పలకరించింది తపతి. రెండు ఒడ్డుల్నీ కలుపుతూ వంతెన ఉన్న మాట నిజమే అయినా దిగువన అంతగా లోతులేని, శిలలమీంచి ఉరుకుతోన్న జలప్రవాహం రారమ్మని కవ్వించింది. తాపీమాత ఆలయాన్ని ఆనుకుని ఉన్న మెట్ల మీదుగా క్రిందకు దిగిపోయి నీళ్ళలోకి అడుగుపెట్టాను. చల్లటి నీటి స్పర్శకు సేదతీరిన కాళ్ళు నన్ను ఆశీర్వదించాయి. ఆ నీటితో కబుర్లాడుతూ… ఒడ్డున పచ్చగడ్డిలో తిరుగాడే మేకలమందను పలకరిస్తూ… నది దాటడానికి అనువైన ప్రదేశం కోసం వెదుకులాడుతూ… సమయం తెలియలేదు.
మేకలకాపర్లు కనపడితే గుట్టమీద గుడి గురించి వాకబు చేశాను. ఎవరో స్వామిగారు పాతికేళ్ళ క్రితం ఈ గుట్ట మీద నివాసం ఏర్పాటు చేసుకుని గుడి నిర్మించారట. క్రమక్రమంగా గుడి పలుకుబడీ, భౌతిక పరిమాణమూ వృద్ధి చెందుతూ వచ్చాయట… ఇప్పుడాయనకు తొంభైఏళ్ళట… ఎక్కడెక్కడివారూ గుడినీ, స్వామినీ చూడటానికి వస్తూ ఉంటారట.
మెల్లగా ఆవలిగట్టు చేరి, చెట్లూ పుట్టల మధ్య లేని దారులు కనిపెట్టి గుట్ట పైకి చేరుకున్నాను. గుడి ఆవరణ విశాలమయినదే. ఆపై నుంచి కనిపించే తపతీ దృశ్యం మనోజ్ఞమనిపించింది. అలా విహంగవీక్షణం చేస్తూ కొన్ని క్షణాలు… ఎవరో వచ్చి పలకరించి, ‘స్వాములవారిని కలుసుకుంటారా?’ అని అడిగారు. ఎంతో మృదువుగా ‘ఆ ఆలోచన లేదు’ అని చెప్పాను.
ఒంటిగంట కావొస్తోంది… మరో గంటలో బేతుల్‌నుంచి నా హోషంగాబాద్ రైలుబండి. అలవాటు ప్రకారం కాస్తంత కంగారుపడి, పది నిమిషాలపాటు రాకుండా కలవరపరిచిన బస్సు ఎక్కి, బస్సు దిగీదిగగానే పరుగుపరుగున బేతుల్ రైల్వేస్టేషన్ చేరేసరికి రైలుబండి ఫ్లాట్ఫామ్ మీదకు వస్తూ కనిపించింది. బతుకు జీవుడా అనుకొన్నాను!
(ఇంకా వుంది)
Dear Amarendra read your మూడు నదులు. బాగుంది. తపతి సూర్యుడి కూతురు, నర్మదగా మారిందంటారు. అవునూ తూర్పు కు ప్రవహించి బంగాళాఖాతంలో కలిస్తే నదులనీ, పశ్చిమ దిశగా పయనించి అరేబియాలో కలిస్తే “నదాలు” అనాలని ఎప్పుడో పదవ తరగతి తెలుగులో చదివిన గుర్తు. తపతి నీ నర్మదనీ నదులు అనడం కంటే నదాలు అనడం ఉచితమేమో. Benefit of doubt ని భలే అనువదించావే. Hope you will have పునర్దర్శన ప్రాప్తి.