మూడడుగులు

వేసవి ఉదయాలు శీతాకాలపు సాయంత్రాలు ఇష్టం నాకు. వేసవి ఉదయం లోని చల్లగాలి , రాత్రి వేళల్లో అప్పుడే విచ్చుతున్న మల్లెల వాసన, చుట్టు పక్కల పిల్లల పరీక్షల హడావిడి,, మెల్లమెల్లగా మార్కెట్లో బయటకొచ్చే రక రకాల మామిడి పండ్లు-  ఇవన్నీ కలిస్తే కదా వేసవి అయ్యేది..అదొక నోస్టాల్జియా….అన్నిటి కంటే ఎండల్లో వచ్చే మావూరి అమ్మోరి జాతర..

చదువు, ఉద్యోగాలు, రకరకాల కారణాలతో ఒక్కోవూరూ మారడం, ట్రావెల్-  వీటన్నిట్లో పడి కొట్టుకు పోతూ, ఎదో మిస్ అయింది అనిపించినప్పుడల్లా,  మట్టి వాసనకోసం శిల్పారామం వెళ్ళటం,   వూరవతల పొలాల్లో అక్కడక్కడా చుట్టిళ్ళు వేసి,  పేడతో అలికి, ఆరు బయట నులక మంచాలు వేసిఉన్న దాభాలల్లో కూర్చుని వందలు పోసి తినడం – ఇదంతా కోల్పోయిన రూట్స్ కోసం వెతుకులాట కాదూ.

నెలరోజుల ముందు నుండే గూగుల్ లో రిమైండర్లు పెట్టి, ట్రావెల్ ప్లానులు చేసిన తరువాత రాజీకి వచ్చాడు తను. ఈ సారి లాంగ్ వీకెండ్ కి  ఊరిలో తిరునాళ్ళు టైము కనుక వెళ్దామంటే సరేనన్నాడు రామ్. అప్పటికి ఇంకో వారం టైముంది. నా పెండింగ్ వర్క్ పూర్తి చేసి, తనకంటే నాల్రోజుల ముందే వచ్చాను నేను. తను సరిగ్గా శుక్రవారం పొద్దున వస్తానన్నాడు.

చుట్టూ కొండల మధ్యలో ఉండి బయట నాగరికత వల్ల అంతగా కరప్ట్ అవ్వని పల్లె మాది. టౌన్ కి కాస్త దూరమే అయినా గంట గంటకి ఒక బస్సు ఉంటుంది. ఇంకాస్త లోపలగా  చిన్న చిన్న పల్లెలు అక్కడక్కడా విసిరేసినట్లు ఉంటాయి. సాయంత్రం బయటకెళ్తే నడిచేదారికి రెండు వైపులా పొలాలు, గుట్టల మీది నుంచి తిరిగొచ్చే గొర్రెల మందలు, కొన్నిసార్లు రోడ్డు మధ్యలో ఆగిపోయి అటు ఇటూ చూస్తూ నిల్చున్న తప్పిపోయిన గొర్రెపిల్ల….- ఎందుకో ఈరొజు దాన్ని చూడగానే నాకు నేనే గుర్తొచ్చాను.

సిటీ లో అపార్ట్ మెంట్ కాంప్లెక్ష్ లో ఉన్న వాకింగ్ ట్రాక్ లో నడక అలవాటైన నాకు, పల్లెలో ఈ రఫ్ రోడ్ల మీద నడవడానికి కొంచెం టైం పట్టింది, కానీ అలవాటైన పల్లె ప్రాణం కదా రెండ్రోజుల్లో సెట్ అయ్యాను.

ఒక సాయంత్రం అమ్మవారి గుడి, ఇంకో రోజు మామిడి తోటలు,  మరో రోజు పక్కింటి  పిల్లలతో  ఏటి గట్టున ఉన్నహైస్కూలు  దాకా- ఇలా రోజుకో దార్లో నడిచేదాన్ని. శుక్రవారం ఉదయం తలస్నానం చేశాక గుడికి వెళ్దామనిపించి బయల్దేరాను. అంత ప్రశాంతంగా ఒక ఉదయం మొదలై చాలా రోజులైంది. పొద్దున్నే గుడికి వెళ్తే అంతగా జనాలు లేని శివాలయంలో పూజారి, నేను, శివుడూ పార్వతి. ధ్వజ స్తంభం మీద ఉన్న గంటల చప్పుడు వింటూన్నకొబ్బ రి చెట్టేమో, నిశ్చలంగా ధ్యానంలో. నాలోని నిశ్శబ్దాన్ని ఇక్కడే వదిలి వెళ్ళానా అనిపించింది.  మనసు పొరలు కదులుతుంటే, అస్పష్టంగా ఎదో అశాంతి మొదలవుతుంది, సముద్రపు అలలా చిన్న హోరు.

మధ్యాహ్నం అయింది రామ్ వచ్చేటప్పటికి. ఏదో కొత్త సినిమా తెచ్చాడు తను. లాప్ టాప్ లో అది చూస్తూ అందరూ దాన్లో మునిగి పోయారు. ఎలెక్షన్లు, ప్రెడిక్షన్లు, స్టాక్ మార్కెట్ అన్ని టాపిక్ లు కవర్ చేశారు ఇంట్లో జనమంతా. ఈ హడావిడీ లో రామ్ పెద్దగా పట్టించుకోలేదు నేనెక్కడ ఉన్నానో సాయంత్రం వరకూ. ఇక్కడికి వచ్చే ముందే చెప్పాను తనకి, ఉన్న మూడు రోజుల్లో ప్రతి సాయంత్రం పొలాల దాకానో, వూరి బయటదాకానో మేమిద్దరమే నడవాలని. కమిట్ అయినవి ఖచ్చితంగా ఫాలో అవుతాడు తను. అదే రిమైండ్ చేసాడు నాకు ఫైవ్ అయింది, వాక్ కి వెళ్దామా అని.

“ఒక్క నిమిషం! చూసావా రూం అంతా ఎలా డస్ట్ నిండిందో. పది  నిమిషాల్లో తుడిచేసి వస్తాను”

……..

“ నాకేమీ ఫర్లేదు రాత్రికి నువ్వే హచ్ హచ్ అంటావు, డస్ట్ ఎలర్జీ కదా ఆఫ్ కోర్స్ నాక్కూడా అనుకో”

“….. సరే, కర్టెన్లు వేయచ్చు కదా, అలా తెరిచి పెట్టుకొకపోతే”

“ మరీ బాగుంది ఇల్లంతా చీకటిలో ఉండదూ? బయట తోట, చెరువు కనపడకుండా తోచదు నాకు, కనీసం ఈ మూడు రోజులైనా….మరి కాస్త వెచ్చగా వెలుతురుగా ఉండాలంటే కిటికీలో కరైన్లో తీయాలి కదా”.

“అబ్బా! అన్నీ కావాలి నీకు, పిల్లలంతా ఆడితే బయట గ్రవుండ్ లోని దుమ్మంతా  ఇంట్లో పడుతుందినువ్వే తుమ్ముతూ ఉంటావ్, కొసరులాగా నీ డస్ట్ ఎలర్జీ ఒకటి. ఇన్ని కష్టాలు అవసరం అంటావా?”

నవ్వాను. “ఏం చేయమంటావు రామ్, ఏదీ వదల బుధ్ధి కాదు, పిల్లల గొంతులు వినబడకపోతే ఇంట్లో దుమ్ము లేకపోతే ఏదో వెలితిగా ఉంటుంది”

.”.వుఫ్! మరైతే కంప్లైన్ చేయకు”.

“ కాదు బాబు  చెప్పుకోడానికి కంప్లైన్ కి తేడా ఉంది,   కానీ లోతుగా వినే ఓపికనే లేదు నీకు”

“సరే వెళ్దామా”

“మ్మ్…నేను రెడీ!…”

“ మొత్తానికి  నన్ను నడిపిస్తున్నావు” ఒక చిన్న నవ్వు నవ్వుతూ అన్నాడు

………

నడవడం కాదు

నీతో నడవడం ఇష్టం.

రాత్రిలో చుక్కల్ని

పొద్దులో చామంతుల్ని

కలిసే చూసాంగా,

ఇప్పుడేమి అనిపించదు ఏంటబ్బా!

అవే చుక్కలు,

అదే నడక,

ఇవే పచ్చటి పువ్వులు.

 

“ఏమిటి మళ్లీ జారిపోయావా ఆలోచనల్లోకి? కొంచెం త్వరగా నడవచ్చు కదా!”

……

చలి సాయంత్రాలు

నీ పక్కన నడిచే వెచ్చదనం

నిండా కప్పుకున్న పమిట కంటే

గొప్ప సెక్యూరిటీ.

…..

“నువ్వు వస్తావా

నేను ముందెళ్ళి పోనా?”

“హ హ… ఇదేమీ రిట్యువల్ కాదుగా రామ్, ఇంత ప్లెజంట్ గా ఉన్న టైమ్ లో ప్రశాంతంగా నడవచ్చు కదా? అయినా మూడడుగుల దూరమే కదా, ముందు నడవడం అవసరమా?”

“…ఏదయినా జాగు నాకిష్టం లేదు

ఏ పని చేసేప్పుడు అందులో ధ్యాస ఉండాలి

నేను నీలా కలలు కనలేను”

ఎక్కడివొయ్ కలలు

నిజమే కాదా? ఒకప్పటి నిజం.

ప్రతి అడుగులో ఒక మువ్వలమోత ఇంకో పవర్ షూ చప్పుడు ఉండేవి కాదూ?

ఇదిగో ఈ రాళ్ళు దాటి మనం వెళ్తూ

అదిగో “ ఆ రెండు రాళ్లే మో ముద్దాడుకుం టు న్నాయి”

అనుకున్నాం కదా?

నాలోని ఎమోషన్ మా మధ్య మాటల్లోంచి, కాగితాల పైన అక్షరాలుగా ఒలకడం, అక్కడా లెకుండా నా గొంతులోనే మిగిలిపోవడం మెల్లమెల్లగా జరుగుతూవచ్చాయి- చాలా సంసారాల్లో లాగే. వి ర్ నో ఎక్షెప్షన్. ఐ థాట్ వి వర్, ప్చ్… బట్ నో!

“ఎందుకు అగావు?”

“ఏదోలే!”

“సరే నడువు మరి!”

……..

“ఒకటి చెప్పనా?”

“ఏదో ధ్యాసలో ఉండను, ధ్యానంలో ……ఉంటాను” ఉండబట్టలేక అన్నాను.

“అబ్బా! మళ్లీ ఫిలాసఫీ చెప్పకు”

“హ హ …లేదు”

“అలా ఇంటర్వల్ మెధడ్ ఆఫ్ రన్నింగ్ , వాకింగ్ కాకుండా నాపక్కనే ఉండచ్చు కదా, ఇలా నేను ధ్యానంలో పడి పోయే పని వుండదు.”

“వాట్? ఎవరి ధ్యానంలో?”

…….

నా మౌనంగా చూసిన చూపు తో నీకు అర్థం అయిందని తెలుసు.

“చలిగా ఉంది. పమిట కప్పుకో! పగలంతా ఎండ, రాత్రి చలి. విచిత్రమైన వెదర్ మీ వూర్లో!” నా చెవుల దగ్గర పమిటని సరిగా కవర్ చేస్తూ అన్నాడు రామ్.

చెరువు గట్టున ఉన్న హైస్కూలు దగ్గరకి వచ్చాం. నేను చదువుకున్న స్కూలు. వాలీబాల్ కోర్టు, డయాస్, ఒక్కో బిల్డింగ్ చూస్తూ నెమ్మదిగా నడిచాం. పల్లెలో కుర్రాళ్ళు స్కూలు గ్రౌండ్ లో క్రికెట్ ఆడుతున్నారు. రామ్ కూడా రెండు ఓవర్ల్లు ఆడాడు వాళ్ళలో చేరి-  చూస్తుంటే హాయిగా అనిపించింది.  గ్రౌండ్ లో ఉన్న గుల్మోహూర్ గంభీరంగా చూస్తోంది వచ్చే పోయే వాళ్ళని. చెట్లు వూగితే గాలి వస్తుంది అనుకునేదాన్ని చిన్నప్పుడు

గాలి వీస్తేనే చెట్లు వుగుతాయి అని చాలారొజులకి తెలిసింది. అప్పుడప్పుడు చింతాకు రాలిన చప్పుడు,  బోగన్విల్లా సవ్వడి తప్పఅంతా నిశ్శబ్దం.

I looked up!

It was a Crescent Moon!

..

 

 

శ్రీరంగవల్లి

చదవటం ఇష్టం. ఇలాంటివి అని చెప్పడం కష్టం - వాతావరణాన్ని బట్టి( బయటా లోపలా) ఏదైనా కావచ్చు: టాగూర్, రూమి, చలం ఇంకా చాలా. మనుషుల్ని చదవటం ఇంకా ఇష్టం - రోజువారీ జీవితంలో తారసపడే ప్రతి ఒక్కరి ప్రభావం మనమీద అంతో ఇంతో లేకుండా ఉండదు అని నమ్ముతాను. ఇలాంటి చాలా అద్దాల్లో కనిపించే మనల్ని పరీక్షగా చూసుకోవడానికి జె.కె ఫిలాసఫీ ఇంకా ఇష్టం. వృత్తి రీత్యా మాధమ్యాటిక్స్ ఫాకల్టీ, అప్పుడప్పుడు రాసుకున్న లైన్లు ఎప్పుడైనా ఇలా..బయట పడుతూ ఉంటాయి-

ఆమె( ఇమ్మే) చ్యూరు గా…..

5 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు