మునుగుతున్న మనవూరి ముచ్చట్లు ముసిరి…!!

మ్ముడు పాషాకు,
అక్కా.. మన ఊరు మాయమైపోతుంది, వీడ్కోలు చెప్పటానికి సిద్ధంగా వుండాలి – అంటూ నువ్వు వెలిబుచ్చిన ఆవేదన, ఆందోళన ఒక్కసారిగా నన్ను నిలువెల్లా కుదిపేసింది.
నీకో విషయం తెలుసా… నేను పనిచేసే బడిలో గోడకు పెయింట్ చేసిన సివిల్ లిస్టులో నా పేరు ఎదురుగా స్వగ్రామం – ‘వేలేరుపాడు’ అనే అయిదు అక్షరాలను, తరచూ ప్రేమగా తడిమి చూస్తాను. పల్లకీ ఎక్కినంత సంబరంగా వుంటుంది!
మొన్నోరోజు మన ఊరెళ్ళాను. ముందుగా నా అడుగులు మన బడివైపే మళ్ళాయి. ఎదురుగా నిలబడి కన్నార్పకుండా బడివైపే చూస్తుంటే.. చుట్టుపక్కల వూళ్ళ నుంచి మన స్నేహితులంతా ఉత్సాహంగా నడిచి వస్తున్నట్టే వుంది. తెల్లని డ్రస్సులో బాబూలా మామ బడిగంట కొట్టే దృశ్యం కళ్ళముందే వుంది. ప్రార్థనలో మన మాస్టార్లంతా చెప్పే సూక్తులు వినిపిస్తూనే వున్నాయి. బడి ముందు రావిచెట్టు, బడి వెనుక గంగిరేగు చెట్టు మనకు ఇంకేదో పంచాలని ఠీవిగా నిలబడి, మనకోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నట్టే వుంది.
ఈ రావిచెట్టు కిందనే కూచుని, మిగిలిపోయిన చూచిరాతలు హడావుడిగా ముగించి, ధర్మారావు మాష్టారు ముందురోజు వేసిన ‘C’ గ్రేడును ‘A’ గ్రేడుగా దిద్దుకునే పిచ్చి ఆనందం.. ఎంత బావుండేదో!
బడి మూలన మంచినీళ్ల బావి.. ఆ పక్కనే పొగాకు వేలం కేంద్రం.. జెండా వందనం రోజున మనవూరి దాత పువ్వాడ సుబ్బారావు గారి చేతులమీదుగా బహుమతులు అందుకుంటూ మురిసిపోయే క్షణాలు ఇంకా, నేడు నా కన్నీటి జడిలో మెరుస్తూనే వున్నాయి.
ఆగస్టు వచ్చిందంటే మనవూరిలోకి ఉరుకులు, పరుగులతో వచ్చే గోదారి జలాల్లో కర్రపుల్లలు గుచ్చి, అది దాటిరాగానే గంతులేస్తూ స్వాగతించేవాళ్లం గుర్తుందా..!
ఆఫీసు రూమ్ పక్కనే బుద్ధిగా పాఠాలు వినే మా అక్కా, సఫియా అక్క, టీవీ అన్నవాళ్ల తరగతి గది, మరోపక్కన పత్తిపాటి శీను, మల్లిఖార్జున్, కొండా, మౌలానా, జిక్రియా అక్కా వాళ్ల తరగతులు వుంటే, వెనుక పాకలో మన క్లాసులు జరిగేవి కదా!
కరెక్ట్ స్పెల్లింగ్ చెప్పికూడా నారాయణ మాష్టారి చేతిలో దెబ్బలుతిన్న తుమ్మల శీనుకు సారు ఎందుకు కొట్టారో ఇప్పటికైనా జవాబు దొరికిందో, లేదో! శంకర్ తో చేతులు నొక్కించుకుంటూ సైదులు చెప్పే డిటెక్టివ్ కథలు మా తరగతిలో ఇంకా వినిపిస్తూనే వున్నాయి. పట్టులంగా కట్టి రాణిలా దర్జాగా నడిచొచ్చే మువ్వా సుబ్బులు, దీక్షగా పొల్లుపోకుండా బొమ్మలేసుకుంటూ వలపర్ల కృష్ణ, అట్టలేసుకోమని సోవియట్ రష్యా మ్యాగజైన్లు పంచే అనూరాధ, సదా నవ్వులు చిందించే విజయలక్ష్మి, ప్రశ్నలపై ఏవేవో ప్రశ్నలు సంధిస్తూ ప్రసాదు, అమాయకంగా అందర్నీ చిర్నవ్వుతోనే పలకరించే బుజ్జిబాబు … అందరం కలసికట్టుగా తరగతి గదిలో ఒక్కచోట కూర్చున్నట్టే వుంది.
మీ తరగతికి, మా తరగతి గదికీ ఒక్క తడికే కదా అడ్డు.
స్కైలాబ్ పడితే అందరం చనిపోతాం కదాని అప్పుచేసి మరీ జాంపండ్లు కొనుక్కుని, తరువాత తీర్చలేక అవస్థలుపడ్డ మీ దోస్తు గుర్తుకొస్తే నవ్వు ఆగదు. జ్వరమొచ్చిందని లీవ్ లెటర్ రాసి, దానిమీద కొంగబొమ్మ వేసిన పాపానికి నాగేశ్వరరావు మాష్టారు ‘కొంగలోడా’ అని మీ ఫ్రెండ్ కోడూరి వెంకటేశ్వరరావుకు నిక్ నేమ్ పెట్టిన విషయం ఇంకా గుర్తొస్తూనే వుంది. దూరంగా నిలబడి బడివైపు ప్రశ్నార్థకంగా చూసే పంతంగి రాంబాబు, చదువే లోకంగా తనదైన ధ్యానముద్రలో మునిగిపోయే కుసుమి సత్యనారాయణ… మొత్తంగా మీ గది నుండి ఎప్పుడూ నవ్వుల పువ్వులే వెల్లివిరుస్తుండేవి!
పట్టాభి గారు ఖమ్మంలో చదువుతూ మన స్కూల్ కు వచ్చి పెట్టిన స్టూడెంట్స్ ఎలక్షన్స్ కోలాహలం, పేరంటపల్లి పిక్నిక్ సందడి .. ఒకటొకటిగా గుర్తుకొస్తున్నాయి. నీకు గుర్తుందా..? ఒకరోజు మనబడి పైనుంచి చిన్న హెలికాప్టర్ లాంటిదొకటి వెళుతుంటే, గదుల్లోంచి బయటికొచ్చి, ఆకాశంలోకి వింతగా, ఆశ్చర్యంగా చుస్తూ మనమంతా రేపాగొమ్ము దాకా పరుగెత్తటం! అది పొలాల మధ్య కూలిపోవటం, మనం చెప్పకుండా వెళ్లినందుకు తెల్లారి ప్రార్థనలో ఒక్కరు తప్ప అందరం బెత్తం దెబ్బలు తినటం మర్చిపోగలమా! ఆ ఒక్కరు మా అక్క. తను తెలివిగా మాస్టార్లతో కలిసి బయటికి వచ్చింది!
హిందీ సారు సైదులు మాష్టారు అంటే బడి మొత్తం వణికిపోయేది కదా! ఆయన లాగి ఒక్కటిస్తే.. ” ఒకటి ” పడిపోయేది మరి. నీకు తెలుసో, లేదో.. అక్క వాళ్లు పదో తరగతి పరీక్షల కోసం పాస్ పోర్ట్ ఫొటోను., భద్రాచలం వెళ్లి దిగి వచ్చారు. రెండ్రోజుల ప్రయాణం.. పేద్ద ప్రహసనం. పాపం! మాస్టార్లే దగ్గరుండి తీసుకెళ్లి, తీసుకొచ్చారు.
ముసలి మాష్టారి నుంచి వశిస్టుడి లాంటి అప్పయ్య మాష్టారి దాకా ఒక టీమ్ వర్క్ అంతా! నాగేశ్వరరావు గారు, హుస్సేన్ గారు, రంగారెడ్డి మాష్టారితో యంగ్ టీమ్ మరొకటి. అందరూ మన భవిష్యత్ కు దారులు వేసిన మార్గదర్శకులే. మన బాల్యాన్ని బంగారు పొట్లం కట్టి చేతికిచ్చిన మహానుభావులే కదా…
బడి వైపు నుంచి నడుస్తూ వస్తుంటే.. పెద్ద బజారు రాగానే టక్కున నిలిచిపోయాయి కాళ్లు. మన వూరి ప్రత్యేకాభరణం “శుక్రవారం సంత” ఇక్కడే కదా సాగేది. అప్పట్లోనే దాదాపు అయిదు వేల మంది వచ్చేవారు మన సంతకి. రంగురంగుల గాజులు, బాబీ రిబ్బన్లు, గోళ్ల రంగులు కొనకుండా సంతను పోనిచ్చేవాళ్ళమే కాదు ఆడపిల్లలం. మా రవీ, బొద్దులూరి బేబీ, రత్నాంబ, ధనలక్ష్మీ.. వీళ్లంతా ఎంత సందడి చేసేవారని! సంతలో పావలాకు శేరు తునిక్కాయలు.. రూపాయికి డజను గాజులు! ఆరోజులు మనతరువాతయినా మళ్లీ వస్తాయంటావా!!
మరోపక్క సీతారాం బాబాయి కిళ్ళీకొట్టు. నాన్న, గోవిందు మామ, డాక్టర్ కృష్ణ గారూ.. అందరూ రోజూ సాయంత్రం ఇక్కడే బాతాఖానీ వేసేవాళ్ళు. నేనైతే ‘గోల్డ్ స్పాట్’ గుటకలేస్తూ, వాళ్ల కబుర్లు వింటూ భలే ఎంజాయ్ చేసేదాన్ని.
మన ఊరంటే ముఖ్యంగా నాకు మరొకరు గుర్తుకొస్తారు. ఆయనే ‘హోటల్ నాయర్’. రెండు చేతులూ కిందికీ, పైకీ తనెత్తు లేపుతూ- దించుతూ కాఫీని గాజు గ్లాసుల్లో గమ్మత్తుగా కలపటం నేను కదలకుండా చూసేదాన్ని. బడి పిల్లలందరికీ బూందీ, లడ్డూ ఇచ్చి తెగ మురిసిపోయేవాడు కదా. పిచ్చిగోపాలాన్ని ఆదరిస్తూ బాగోగులు చూసిన దయామయుడు కూడా నాయర్. 1982లో గోదావరి వరదల సమయంలో చనిపోయాడు. ఆతరువాత పిచ్చిగోపాలం మనూరిలో కనపడలేదు. పాపం.. ఎటెళ్ళిపోయాడో..!
పక్కనే తెల్లని దుస్తుల్లో మెరిసిపోయే డాక్టర్ షుకూరు గారి క్లినిక్. ఇక్కడ విప్లవ గీతాలు మనకు పరిచయం చేసిన మునీరు గారు, మౌనిలా వుండే షాజహాన్ అన్నయ్య, జాన్ బాబు గారు, మౌలానా అన్న, వీరన్న గారు .. అందరూ సందడిగా కనిపించేవారు.
మన చిన్నపుడు మనూరిలో వోపెన్ టాకీస్ ఒకటి వుండేది కదా. అందులో డ్రామాలు వేసేవాళ్ళు. సురభి వారి ‘తులసీ జలంధర’ నాటకంలో.. గాలిలోకి బాణాలు దూసుకెళ్లటం, గధాయుద్ధం జరగటాన్ని మనం సంభ్రమాశ్చర్యాలతో కన్నార్పకుండా చూడటం నాకింకా గుర్తే.
మూలమలుపులో ఎప్పుడూ జనసందోహంతో నిండుగా వుండే మీసాల రంగనాయకులు బాబాయ్ ఇల్లు. నాడు అనూహ్యంగా నక్సల్స్ బాబాయిని, మరికొందరు సిపిఐ కామ్రేడ్స్ ను హత్య చేయటం వూరి చరిత్రలో మాయని ఓ మరక లాంటి తీరని విషాదం. ఆ రక్తపుటేరుల దురదృష్టకర ఘటన తప్ప మన వూరు ఎంత ప్రశాంతమైనది కదా పాషా!
ప్రతి సినిమాకు రుద్రమ్మకోటలో టూరింగ్ టాకీస్ కు ఎడ్లబండ్లపై అమ్మా వాళ్ళమంతా వెళ్లేవాళ్ళం. మనకు సంక్రాంతి పెద్ద పండగలా వుండేది కదా. పలివెల రాఘవరావు గారింట్లో భోగిపండ్ల సందడికి ఊరిలో మహిళలంతా తప్పనిసరిగా వెళ్లేవాళ్లు. మన బడి పిల్లలమంతా దసరా వేషాల్లో మాస్టార్లతో కలిసి వూళ్ళో వీధి వీధీ తిరగటం మర్చిపోలేని అనుభూతి కదా .. గోదారి వరదలానే మన పండగలు వూరూవాడల్ని ఏకం చేయటం మనకెంత ఎనర్జీ ఇచ్చేదని..!
మన వూరు మనకు చాలా గొప్ప సంస్కృతి నేర్పింది. కులం, మతం, ప్రాంతం అనే తేడాలే తెలియవు మనకు. అందరం బంధువులం కాకున్నా, ఒకేమాటగా మెలిగిన ఆత్మబంధువుల సంస్థానం మన వూరు.
మన ఊరి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అనిపిస్తుంది. కరెంటు లేకపోయినా చీకటి గాఢత తెలియదు మనకు. పెట్రోమాక్స్ లైట్లు, కిరోసిన్ లాంతర్ల కాంతిలో ఊరంతా వెలిగిపోయేది. నాగరికతలో ఎంతో ముందుచూపు 60ఏళ్ళ క్రితమే కనిపించేది మన ఊరి జనంలో. రాజమండ్రి నుంచి అందరూ ఇళ్లకు పండ్ల బుట్టలు, పూల బుట్టలు, పూల మొక్కలు తెప్పించుకోవటం గుర్తే..
మీ నాన్న గారు, పూల రామారావు గారూ ఓపెన్ టాప్ జీపులో షికారుకు తుపాకులు పట్టుకుని అడవి వైపు వెళ్లటం ఆశ్చర్యంగా చూసేవాళ్ళం. చాలా మంది రైతుల ఇళ్లలో 3, 4 వాహనాలు ఉండేవి. మన ఊరి నేలలు బంగారాన్ని పండించేవి. రైతులు డబ్బుని బస్తాలకెత్తుకోవటం చూశాను. కొందరు రైతుల ఇళ్లకు CRPF దళాలు కాపలాకాయటమూ చూశాను. రైతులంతా చందాలు వేసుకుని ప్రభుత్వ ఆసుపత్రి భవనం కట్టించటమూ గుర్తే.
‘ఇవ్వటం’ అనే గొప్ప లక్షణం మన ఊరి సంస్కృతిలో అంతర్వాహినిలా ఉండేది. ఇది ఎంత గొప్ప ఆచారం కదా.
సాయంత్రం అయితే మాస్కో నుంచి ప్రసారమయ్యే తెలుగు వార్తలు ప్రతి ఇంటా రేడియోలో వినిపించేవి. మధ్యాహ్నానికి ఈనాడు, విశాలాంధ్ర పేపర్లు వచ్చేవి. వారపత్రికలు, నవలలూ ఇళ్లలో కనిపించేవి. రైతుల మధ్య, సాధారణ ప్రజానీకం మధ్య గానీ ఒక్కరోజు కూడా వాగ్వివాదం, ఘర్షణ వైఖరి చూశామా? గొప్ప ఐక్యత కనిపించేది. కారణం ఏమిటో తెలుసా? కులాలు, మతాలు, వర్గాలుగా విడగొట్టే సోకాల్డ్ ఆధ్యాత్మిక మందిరాలు మన ఊరిలో లేకపోవటమే!
మన చిన్నప్పుడు కోయదొరలు మన వూరంతా వేపాకు తోరణాలు కట్టి, జాతర చేసేవాళ్ళు. వూరంతా బాగుండాలని దేవర్లకు పూజలు చేసేవాళ్లు. ఎంత గొప్ప మనసు కదా వాళ్లది.
జనం మరోవైపు ప్రకృతిలో మమేకమవటం కూడా గుర్తే. గోదారిలో నీళ్లు నాలుగైదు కుండలకు ఎత్తుకుని చేతితో పట్టుకోకుండా తేలికగా గృహిణులు అంతెత్తు గోదారొడ్డును అలవోకగా ఎక్కేయటం చూస్తే ఆశ్చర్యమేసేది. రాత్రి అయితే దూరంగా పొలాలు దున్నుతూ ట్రాక్టర్ల నుంచి వినిపించే టేప్ రికార్డర్ పాటలు, మరోమూల గిరిజన గ్రామాల నుంచి వారి ఆటపాటలు, డప్పుల మోతలు, వూరిపై కప్పినట్టుండే మిణుకు మిణుకు చుక్కల దుప్పటి! వేసవిలో కొండలపై కాలుతున్న అడవులు ఎవరో దివిటీలు పట్టుకు తిరుగుతున్నట్టు కన్పించేవి. ప్రతి ఇంటి ముందూ వాలీ సుగ్రీవుల గుట్టల మధ్య నుంచి ప్రసరించే సూర్యుని వెలుగులు .. ఇన్ని ప్రకృతి అందాలను ప్రతిరోజూ చూడటం మనకు అలవాటుగా మారటం వల్లనేమో ‘కళాత్మక చిత్రాలు’ కూడా మనకు పేలవంగా అనిపిస్తాయి!
ఎన్నిసార్లు మా ఇంటి వెనక చిన్నచెరువు గట్టున మర్రిచెట్టు ఊడలు పట్టుకుని ఊగలేదు మనం చెప్పు! శ్రీరామ నవమికి మగవాళ్లంతా పసుపు నీళ్లతో వసంతోత్సవం ఆడుతూ తడిచి ముద్దయేవాళ్లు. యువకులంతా విప్లవ గీతాలు.. పెద్దాళ్ళంతా కాంగ్రెస్ కబుర్లు.. మొత్తంగా మన ఊరు కాంగ్రెస్ కండువా కప్పుకుని, ఎర్రజెండా చేత్తో ఎత్తి పట్టుకున్న యువకిశోరంలా కనిపించేది నాకు. అందుకేనేమో మనందరిలో ఆ ఆవేశమూ, సౌమ్యతా ఉండేది. కళలను ప్రేమించే లక్షణమూ ఉంది. ఇదో గొప్ప విశిష్టత మన జనాలది!
ఆదివారం వస్తేచాలు సైకిల్ తొక్కే పోటీలు. పొలాల వైపు పరుగులు తీసేవాళ్ళం గుర్తుందా! బడి పక్కనే మా మిరపతోట వుండేది. అందులో ఏతం బావిలో నీళ్ళు తోడటం, మంచె మీదికెక్కి కూర్చొని, అమ్మ కట్టిన క్యారేజీలో అన్నం తినటం.. ఆ తీయానుభూతి మరెక్కడ దొరుకుతుందని! నాళ్ళవరం పొలం వైపు వెళితే వాగుల్లో చెలమలు కొట్టి తేటనీళ్ళు తాగటం.. తాట్కూరుగొమ్ము వైపు పొలాల రైతులంతా గోదావరిలో ఇంజన్లు పెట్టి రెండు తాటిచెట్ల ఎత్తుకు నీళ్ళు తోడిపోయటం.. ముడులు వేసిన తాళ్లు పట్టుకుని, కింది నుంచి గోదావరి వొడ్డు పైకి ఎక్కిరావటం మనకెంత సాహస క్రీడనో కదా. అలా ఎన్నిసార్లు ఎక్కి దిగేవాళ్లమో గుర్తుందా!
మన స్నేహితులు ఎవరైనా కాలేజీ చదువుకునే రోజుల్లో మన వూరికొస్తే శ్రీరామగిరి చూపకుండా పంపేవారమా? ఇసుకలో ఎల్లలెరుగని ఆటపాటలు. ఆ రామయ్య.. ఈ గోదారి.. ఆ శబరి నది కూడా మన సొత్తేనన్నంత గర్వంగా చూపించేవాళ్లం. సెలవులకు వస్తే ఒక్కోరింట్లో ఒక్కోరోజు విందు భోజనం. మా అమ్మ చేసే కమ్మని గారెలు, పంతంగత్త వండే చేపలకూర, మీ ఇంట్లో సేమ్యా పాయసం, షీర్ ఖూర్మా, మీఠా పాన్ .. అన్నీ లొట్టలేసుకుంటూ సుష్టుగా లాగించి, తెల్లారేవరకు ఎన్నేసి కబుర్లు చెప్పుకునేవాళ్లం. ఎందరో కవులు, రచయితలు మన చర్చల్లోకి వచ్చి వెళ్లేవాళ్లు. ఆడపిల్లలు, మగపిల్లలనే తేడా మన పెద్దలు ఏరోజూ రానివ్వలేదు కదా.
పుస్తకాలంటే గుర్తొచ్చింది.. చాలామంది మన వూరి కొత్త కోడళ్లు లాంచీలో రాజమండ్రి వెళ్లి నావెల్స్ కొని తెచ్చుకునేవాళ్లు నీకు తెలుసా! మా నాన్నేమో రాజమండ్రి నుంచి పూలమొక్కలు కొని తెచ్చేవాడు.
***
కొంచెం ముందుకు నడవగానే మన వూరి మొత్తానికి వున్న ఏకైక టైలర్ అమీర్ మామయ్య వాళ్ల ఇల్లు. అంత పర్ఫెక్ట్ టైలర్ మరొకరు ఇంతవరకూ కనిపించలేదు. నాటి ఊరిని తలచుకుంటూ నడుస్తుంటే ఎన్నో జ్ఞాపకాలు, ఆలోచనల మధ్యే పంతంగి రాంబాబు వాళ్ల ఇల్లు వచ్చింది. నా కాళ్లు టక్కున ఆగిపోయాయి. మేము కాలేజీ చదువుకునే రోజుల్లో సెలవులకు ఇంటికి వస్తుంటే, ఎటునుంచి చూసేదో పంతంగత్త ‘లోపలికి రాకుండా ఎక్కడికే ఇల్లు దాటిపోతున్నారు’ అంటూ కేకేసేది. ఆ పిలుపులో ఎంత ప్రేమ పొంగిపోయేదో. నవ్వుతూ లోపలికి వెళ్లి తన చేత్తో ఇచ్చిన మంచినీళ్ళు తాగి, ఇంటికి వెళ్లేవాళ్లం. పాషా.. ఎన్ని జన్మలెత్తినా మనకు అలాంటి మరో పిలుపు దొరుకుతుందా! నుదుటి మీద భానుమతిలా పెద్ద బొట్టు పెట్టుకుని పెద్దల్లో పెద్దగా, పిల్లల్లో పిల్లగా వుండే వో గొప్ప ఫిలాసఫర్ తను. ‘మా నారాయణ అన్నయ్య గొప్పోడే.. ఈ వూరిలో ఏ రైతూ చేయని పని.. ముగ్గురు ఆడపిల్లలనూ చదివిస్తున్నాడు’ అనేది ఉప్పొంగే ఆనందంతో.
అంతలోకే మా ఇల్లు వచ్చేసింది. ఒక్కసారిగా నా గుండె జారిపోయింది. ఒకప్పుడు పొగాకు బ్యారన్లు, పచ్చాకు పందిళ్లు, ఆ ముఠావాళ్లు వేసుకునే వరుస ఇళ్ళు, మండెల పాకలూ. రోజూ 60, 70 మంది కూలీల గ్రేడింగ్ పని కాగానే సాయంత్రం పూట సీతక్క వాళ్లు వేసే రేలపాటల డాన్సులు వోపక్క, ఏడు పాడిగేదెల అరుపులు మరోపక్క, పూలమొక్కలు.. పండ్ల చెట్లతో నాలుగెకరాల స్థలంలో మా ఇల్లు ఎంత కళకళలాడేది. ఏదీ ఆ వైభవం. నాన్న కనుమూయటంతో సగం కళ తప్పింది. పోలవరం ప్రాజెక్ట్ కింద పరిహారం కోసం ఎదురుతెన్నులు చూస్తూ, వో అర్థరాత్రి మాకెవరికీ చెప్పకుండా అమ్మ కూడా నాన్న దగ్గరికి చేరిపోవడంతో పూర్తిగా బోసిపోయింది.
అయినాసరే మా ఇంటి వాకిట ఏ పూల పరిమళం దరిచేరినా నాన్నతో మాట్లాడుతున్నట్లు, ఏ మొక్కను తాకినా అమ్మను సుతారంగా చుట్టుకున్నట్లే వుంటుంది. ఈ పరిసరాల్లో ఉన్నంత సేపూ అమ్మానాన్నలు మాతో వున్నట్లు, ఏ మూలనో నిలబడి మమ్మల్ని చూస్తున్నట్లే ఉన్నారనే వూహే గుండెల్లో నిండిపోతోంది. కొత్త వూపిరులు పోస్తోంది. వారి సజీవ సంభాషణలు ఈ గాలిలో కలిసి మమ్మల్ని తడిమి, తల నిమురుతున్నట్టే వుంది.
పోలవరం ముంపుతో మన వూరంతా మునిగిపోతే మరెప్పటికీ మా ఇంటిని చూడలేము. ఈ జన్మలో వాళ్ల పాదముద్రలు మోసిన ఈ నేలను కూడా తాకలేముగా. ఈ ఆలోచన మనసునే కాదు, ప్రాణాన్నే పిండేస్తున్నట్లుంది. వెనక్కి తిరిగి వస్తుంటే ‘ఇక ఎప్పటికీ ఇటువైపు రారా తల్లీ’.. అని అమ్మానాన్నా అడుగుతున్నట్లే వుంది. పిల్లలు వెళ్ళిపోతున్నారు – అని వారు దీనంగా నిలబడి చూస్తున్నట్టే వుంది. వాళ్లను ఈ గోదావరి నీళ్ల అడుగున సజీవ సమాధి చేసి, మనం వొంటరిగా వెళ్ళిపోతున్న బరువైన భావన. ఉబికి వచ్చే కన్నీళ్ళని ఆపుకుని, పరుగున గేటు దాటి బయటికి వస్తుంటే.. చిత్రంగా ఎదురింటి మాణిక్యమ్మ పిన్ని – వీర్రాజు బాబాయ్ ఎదురొచ్చి ‘వెళ్ళిపోతున్నావా శివాయ్’ అని బేలగా అడుగుతున్నట్లే వుంది. తల పైకెత్తి చూస్తే మీ నాన్న, అటుపక్కనే పంతంగత్త జాలిగా చూస్తున్నారు.
ఏమిటో.. అందరూ నిలబడి కన్నీటి వీడ్కోలు పలుకుతున్నారు. ఆ కన్నీళ్లు వాళ్లవో, నావో అర్థం కావట్లేదు. బహుశా మన ఊరిలో అందరివీ ఇవే బాధామయ అనుభవాలు కదా..!
మన బాల్యానందాల్ని, మన తీపి జ్ఞాపకాల్ని, మన మధుర స్మృతుల్నీ.. అన్నిటినీ ఏటిపాల్జేసి వెళ్ళిపోతున్న మన వూరి జనం శిలువెక్కిన జీసస్ లా, ఉరికంబానికి వేలాడిన భగత్ సింగుల్లా కనిపిస్తున్నారు. మన వూరు సముద్ర గర్భాన దాగిన మరో ద్వారక కాబోతోంది!
మన కన్నీళ్లే గోదారి కెరటాలై గుండెల్ని తాకుతున్న ఆత్మఘోషలు మనకు మాత్రమే విన్పిస్తాయి. చీమ కుట్టినట్టయినా పాలకులు చలించరు. పోలవరం పొలికేకకు మన వూరి రేలపాటల గొంతుక మూగవోయింది. ఊరును దానమిచ్చి, సర్వస్వం త్యాగం చేసిన మనవాళ్లంతా శిబిచక్రవర్తులా?.. దానకర్ణులా పాషా..?!
                               –  శివక్క

శివకుమారి, బి.

11 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • నేను వేలేరుపాడు వాస్తవ్యుడను కాకపోయినా వేలేరుపాడులో కారంచేడు నుండి వ్యవసాయానికి వచ్చిన మా మేనమామ మరియు బంధువుల నుండి ఎన్నో సంవత్సరాలు చాలా కబుర్లు విన్నా. అదృష్టవశాత్తూ 5 సంవత్సరాలు భద్రాచలంలో పని చేయడం ఆప్రాంతంతో చర్ల నుండి వేలేరుపాడు వరకు ఒక అనుబంధాన్ని పెనవేసింది. నాకే ఆ ప్రాంతం ఎదుర్కొంటున్న ముప్పు వెలితిగా వుంటే మీకు ఎంత దుఖం కల్గిస్తుందో అర్థం చేసుకోగలమ్

  • శివకుమారి రాసిన ఈ కథ నన్ను 10 వ తరగతి గదిలోకి తీసుకుని వెళ్ళింది. చిన్ననాటి జ్ఞాపకాలను కళ్ళ ముందుకు తెచ్చింది. నారాయణ మామ మంచి స్నేహశీలి. మా నాన్న దగ్గరకు వారానికి ఒక సారైనా వచ్చేవాడు. ఆయన వస్తే మా ఇంట్లో కోడి తెగాల్సిందే. మా నాన్న, రాములు బాబాయ్, khadeer బాబాయ్, ఇంకా కొందరు పార్టీ చేసుకుని పేకాట ఆడేవారు. నారాయణ మామ నన్ను పిలిచి మంచిగా చదువుకోమని చెప్పేవాడు. అవన్నీ గుర్తుకు వచ్చి మనసు భారంగా మారింది.

    • ఆనాటి ముచ్చట్లను కళ్ళకు కట్టినట్టుగా రాశారు. ఈ ప్రాంతంలో మా ముందుతరం ఎంత సందడిగా గడిచిందో, గడిపిందో తెలిసింది. రాజకీయాలు, వ్యాపారం, అలవాట్లు విషయాల్లో ఎన్ని మార్పులు చోటు చేసుకున్న పల్లె పరిమళాలను ఇంకా కోల్పోలేదు ఇక్కడి ఊర్లు. పోలవరం వస్తే పరిహారం వస్తుందేమో కానీ ప్రశాంతత రాదు!!
      జ్ఞాపకాలు ఏ రుజువు అవసరం లేని ఆస్తులు, వాటిని పంచిపెట్టారు.

  • My friend శివ సంక్రాంతికి అదిరిపోయే ఆనందాన్ని పంచింది.
    అరిసెలు, కజ్జికాయలు, లడ్డూలు, జంతికలు, మిక్చర్…
    భోగిమంటలు, గొబ్బెమ్మలు, బంతిపూల తోరణాలు, ఎద్దుల అలంకరణ,..
    కోడిపందాలు, గాలిపటాలు, గంగిరెద్దులు,…
    ఆఖరికి
    ముగ్గులు, పెగ్గులు & రగ్గులు… ఇవేవి సరిరావు!

  • బాల్యస్నేహితుల ప్రేమ-అనుబంధానురాగలకు, వున్నవూరు, కన్నతల్లి మీద ప్రేమలా, కళ్ళకు కట్టి, ఏ అనుబంధం లేని మాకళ్ళు చెమర్చెలా మీవూరి కథ – ద్వారా శివకుమారి గారు మీ గొప్ప మనసుకు 🙏
    సారంగకు 🙏

  • మేడం మీరు మునుగుతున్న మీ వూరి ముచ్చట్ల నే కాదు..చదువుతున్న మా అందరి బాల్య జ్ఞాపకాలను తట్టి లేపిన తీరు అద్భుతం…చదువుతూనే మా కళ్ళు మసక బారుతున్నాయి..ఆ నేలలో పెరిగిన మీబాల్యం మళ్లీ మీకెన్నటికి కనపడని జ్ఞాపకమే అంటే నిజంగా గుండె భారమే..

  • శివా.. ఎంత బ్రహ్మాండంగా రాశావు వేలేరుపాడు జ్ఞాపకాల్ని. కులమతాలకు అతీతంగా మనమంతా ఒకే కుటుంబంగా మెలిగిన రోజుల్ని చక్కగా చరిత్ర పుటల్లో నిక్షిప్తం చేశావు. ఈనాటికీ నీకు అందరి పేర్లు గుర్తుండటం చదివి ఆశ్చర్యమేసింది. ఉన్నవూరు కన్నతల్లి లాంటిది. అమ్మలానే బాల్యం నుంచీ మనల్ని లాలించి పాలిస్తుంది. జన్మభూమి రుణాన్ని ఎవరమూ తీర్చలేం కదా. పోలవరం ప్రాజెక్ట్ ముంపు నేపథ్యంలో మనందరి మనోవేదనకు నీ వ్యాసం అద్దం పట్టింది.
    మరో విషయం ఏమంటే.. ఇక్కడి స్కూళ్ళలో జరిగే వుత్సవ సభలకు నేను హాజరవుతుంటాను. అప్పటి మీరు, ఇప్పటి విద్యార్థుల ఆలోచనా సరళికి సంబంధమే లేకుండాపోయింది. అప్పటి ఆప్యాయతానురాగాలు కొరవడ్డాయి. ఈ లోటు మాకు ప్రత్యక్షంగా కనిపిస్తుంటుంది. పాత రోజులు తిరిగి రావాలనే ఆశ కలుగుతుంటుంది. మొత్తంగా నీ అక్షరాలతో అందరి పాత జ్ఞాపకాల్ని తట్టి లేపావు. అభినందనలు ..

  • ఇప్పుడే ఏడ్చాను.
    ఎం త ని.. ఏ డ్చ గ లం.. ఒక జీవితంలో?
    రెండు వారాలు ఆలస్యంగా యేడ్చినందుకు క్షంతవ్యుడిని..
    ****
    రాంబాబూ.. శివక్క రాసిన వ్యాసం ‘సారంగ’లో వచ్చిందిరా.. అని పాషా గాడు ఫోన్.
    ఆత్రంగా చదవటం మొదలు పెట్టానా..
    నీళ్లు.. కన్నీళ్లు.. వరద..
    గోదావరికి ఆనకట్ట కట్టడానికి నిధులు వెల్లువ అవుతాయి..
    వేలేరుపాడు కన్నబిడ్డల కన్నీళ్లకు ఆత్మీయానురాగాలతో అడ్డుకట్టలు వెయ్యటానికి తాహతు వున్నా నా వాళ్ళు ఇంకా ఎవరు మిగిలి వున్నారు గనక?
    ****
    ఎదలోతుల్లో ఎప్పుడో దిగిన పిడి బాకు కలుక్కుమని మళ్ళీ రక్తం, కన్నీళ్ళూ కలగలిసి కారుతూ ఉంటే ఆపూడుకునేదెట్లాగా? ఇది తెలీకనే ఈ రెండు వారాలూ శివ ఉద్వేగపు సునామీలోకి చూసి ధైర్యం చెయ్యలేదు..
    ఆదివారం కదా మళ్ళీ పాషా గాడు ఫోన్.. ఎరా చదివావా.. అని!
    ఇక తప్పించుకోవటం కుదర్లేదు… బిజీ అని ఎన్ని సార్లని అబద్ధం చెప్పగలం?
    ****
    సొంత వూరి మీద మమకారం ఎవరికైనా ఉంటుంది, సహజం.
    కానీ.. ఒక్కటి మాత్రం నిజం.
    అది వేలేరుపాడు అయ్యుంటే అంతకన్నా ఎక్కువే ఉంటుంది.. ఉండాలి..
    శివ ఒక చారిత్రక నవలకు సరిపడా నోట్స్ రాసుకున్నట్టుగా అంతులేని ఆర్ద్రతతో సర్వ సమగ్రంగా రాశారు.
    అప్రయత్నంగా.. అలవోకగా.. పారె గోదావరిలా.. సహజ రీతిన జాలువారిన అపురూప జ్ఞాపకాల స్రవంతి అది. ఆమెకు వేలేరుపాడు ఇచ్చిన కల్మషం లేని నిండు మనసు చెలమలో ఊరిన అమృత జలం అది.
    ****
    కులం మతం లింగ రాజకీయ భేద భావాలు ఎరగని నేలలో.. స్వచ్ఛమైన సుసంపన్నమైన ఆత్మీయథ్ వీచే గాలిలో పుట్టి పెరగటం ఎంతో అదృష్టమే.
    ఆ అదృష్టమే ఇంత తీరని వేదనకు కారణమవుతున్నది..
    ****
    ఏమి చెయ్యటం..????

    • అర్థరాత్రి ఏడ్పించానా? కునుకైనా పట్టిందో, లేదో నీకు. మన కుటుంబాల్లో ఇలా దుఃఖనదులు ఎన్ని పారుతున్నాయో.. కన్నతల్లిని, జన్మభూమినీ ఎవరమైనా ఎలా మరవగలం? మొన్నోరోజు మాటల్లో నువ్వన్నట్టు పాలకులు మనల్ని తరలించే ఊరు కూడా – మన వేలేరుపాడు – నే అయితే, మనస్సులకు కొంతయినా ఉపశమనం లభిస్తుందేమో!

      శివక్క చేసినది చిన్నపని కాదు. నాలుగైదు దశాబ్దాల నాటి మన ఆత్మీయ కుటుంబీక, సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక జీవన చిత్రాలను చరిత్ర పుటల్లోకి ఎక్కించింది. శివక్క ఒకేఒక్క కన్నీటి లేఖ మన బాల్య మిత్రబృందానికి గర్వకారణమై నిలిచింది ..

      మనసు లోతుల్లోంచి వచ్చిన నీ స్పందనకూ గొప్ప అక్షర రూపమిచ్చావు. Proud of youuuరా .. my dear దోస్త్!

  • అక్కా!
    ఎంత ఆర్తి కనపడిందో మీ మాటల్లో!
    పుట్టి పెరిగిన మీ జన్మభూమిని,
    మిమ్మల్ని పెంచి చేసిన ఆ ప్రకృతిని ..
    ఎంతగా ఆరాధిస్తున్నారో మీ మాటలే చెప్పకనే
    చెబుతున్నాయి..కన్నీటి చెమ్మతో హృదిని బరువెక్కిస్తున్నాయి..
    మీ చిన్ననాటి బాల్యం ఎంత అపురూపమైనదో
    గోదారి ఒడ్డును అడిగితే చెబుతుంది..ఎందుకంటే మీ ఆటలకు,పాటలకు అదే సజీవ సాక్ష్యం కనుక..
    ఎప్పటికీ చూడలేని.,ఇక ముందెపుడు కనపడని ఆ అందమైన,అపురూపమైన జ్ఞాపకాలు తలుచుకుంటే బాధ మర్లదా మరి..
    ఖచ్చితంగా మీ లాగే మీ భావుకత కూడా మరువనని అంటున్నది.
    ఇలా కథలా మిగలటమేనా అని ప్రశ్నిస్తోంది.
    ఎంత హృద్యంగా రాశారు మేడమ్..
    బాల్యాన్ని పుక్కిటపట్టినట్లు!!

  • మీరు వ్రాసిన రెండు కథలు చదివాక
    పోలవరం ప్రాజెక్టు అవసరమా అనిపిస్తుంది
    మీరు చేసిన త్యాగానికి ఏమిచ్చినా మి రుణం తీర్చుకోలేము
    మి రెండు కథలు చదువుతుంటే నేను చాల భావోద్వేగానికి గురయ్యాను
    మి ప్రాంతం గురించి మరిన్ని కథలు వ్రాస్తారు అని ఆశిస్తున్నాను amirisetti dileep
    కొయ్యలగూడెం 9705092061,9182285408

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు